1, ఏప్రిల్ 2018, ఆదివారం

శ్రమ విభజనా, కార్ఖానా ఉత్పత్తీ


శ్రమ విభజనా, కార్ఖానా ఉత్పత్తీ
శ్రమకాలం రెండు భాగాలుగా ఉంటుంది- అవసర శ్రమ కాలం, అదనపుశ్రమ కాలం. మొదటి భాగంలో ఉత్పత్తయ్యే విలువ శ్రామికునిది. రెండో భాగం లో ఉత్పత్తయ్యేది పెట్టుబడిదారుడిది – అదనపువిలువ. కనుక పెట్టుబడి దారుడి తపనంతా రెండోభాగం పెంపు మీదనే. ఇందుకు రెండు మార్గాలున్నాయి:
1.అవసర శ్రమకాలం స్థిరంగా ఉండగా, పనిదినాన్ని పొడిగించడం. అప్పుడు అదనపు శ్రమకాలం పెరుగుతుంది. ఫలితంగా అదనపు విలువ పెరుగుతుంది.
2.పనిదినం స్థిరంగా ఉండగా, అవసర శ్రమ కాలాన్ని తగ్గించడం. అప్పుడు అదనపు శ్రమకాలం పెరుగుతుంది. ఫలితంగా అదనపు విలువ పెరుగుతుంది.
మొదటి మార్గంలో వచ్చే అదనపు విలువని మార్క్స్ పరమ అదనపు విలువ అనీ, రెండో మార్గంలో వచ్చే దాన్ని సాపేక్ష అదనపు విలువ అనీ అన్నాడు.
అవసర శ్రమ కాలం తగ్గాలంటే శ్రామికుల శ్రమశక్తి విలువ తగ్గాలి. అందుకు శ్రామికులు వాడే సరుకుల విలువ తగ్గాలి.
ఆసరుకుల ఉత్పత్తికి పట్టే శ్రమ తగ్గాలి. అంటే శ్రమ ఉత్పాదకత పెరగాలి. దీన్నిబట్టి సాపేక్ష అదనపు విలువకి ఉత్పాదకతే కారణం.
శ్రమ ఉత్పాదకత పెరిగితే సాపేక్ష అదనపు విలువ పెరుతుంది.
శ్రమ ఉత్పాదకత ఎలా పెరుతుంది? 
శ్రమ విభజన ద్వారా.
శ్రామికుని నైపుణ్యం పెరగటం ద్వారా
యంత్రాలద్వారా.
శ్రమ విభజనవల్లా, శ్రామికుల నైపుణ్యం వల్లా  ఉత్పాదకత పెరుగుతుంది. 14 వ అధ్యాయంలో దీన్ని గురించి ఉంటుంది. యంత్రాల ఉత్పత్తి గురించి 15వ అధ్యాయంలో వస్తుంది
శ్రమ విభజానా, కార్ఖానా ఉత్పత్తీ
శ్రమ విభజన మీద ఆధారపడ్డ సహకారం కార్ఖానా ఉత్పత్తి కాలం మొత్తంలోనూ ఒక విశిష్ట  రూపం పొందుతుంది. ఆరూపం కార్ఖానా దశ అంతటా ప్రబలంగా ఉండే  పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ యొక్క లాక్షణిక రూపం. ఆదశ 16 వ శతాబ్దం మధ్యలో మొదలై, 18 వ శతాబ్దం చివరి మూడవ భాగంవరకూ(దాదాపు 1550 నుంచీ 1770 వరకూ –ఎంగెల్స్ – Synopsis of Capital ) విస్తరించింది.
శ్రమని విభజించాలి అనే ఆలోచన వల్ల శ్రమ విభజన ఏర్పడ్డది అనే ప్రౌధన్ అభిప్రాయాన్ని మార్క్స్ ఖండిస్తాడు. పెట్టుబడిదారుడు శ్రామికులని ఒకచోట చేర్చడం శ్రమ విభజన చెయ్యడం  కోసం కాదు, అదనపు విలువకోసం. ఎంత ఎక్కువమందిని పెడితే, అంత ఎక్కువ అదనపువిలువ వస్తుంది. అందు కోసమే గాని శ్రమ విభజన కోసం కాదు.వర్క్ షాప్ లోపల శ్రమ విభజన అభివృద్ధి కావడానికి కారణం:  ఉత్పత్తి సాధనాలూ, కార్మికులూ ఒకచోట చేర్చబడడమే.... శ్రమ విభజన అభివృద్ధికి వర్క్ షాప్ లో పనివాళ్ళు కూడడం ముందుగా అవసరం
కార్ఖానా ఉత్పత్తి తలెత్తే మార్గాలు
కార్ఖానా ఉత్పత్తి రెండు మార్గాల్లో తలెత్తుతుంది.
1.అంతకుముందు స్వతంత్రగా వున్న శ్రమ ప్రక్రియలు కొన్ని కలవడంద్వారా.
2.ఒక శ్రమ ప్రక్రియ కొన్ని భాగాలుగా విడివడడం ద్వారా

మొదటి దానికి గుర్రబ్బండి తయారీ ఉదాహరణ.
ఒక బండి తయారవాలంటే, అనేక చేతివృత్తుల వాళ్ళు ఒకరితర్వాత ఒకరు పనిచెయ్యాలి.
 కార్ఖానా దశకి ముందు చాలామంది స్వతంత్ర చేతివృత్తుల ఉత్పత్తి. ఒక వృత్తి దారుడు చెయ్యాల్సిన పని అయ్యాక, మరొక వృత్తి దారుడు పనిచెయ్యాలి.ఎన్ని పనులు అవసరమైతే, అన్ని వృత్తులుచేసే పనివాళ్ళు ఒకరితర్వాత ఒకరు పనిచేస్తేనే ఆవస్తువు పూర్తవుతుంది. ఇలా మొత్తం బండి పూర్తయ్యే వరకూ అయినంత వరకూ బండిని పనివాళ్ళ దగ్గరకి  తిప్పాలి. లేదా వాళ్ళనైనా తయారవుతున్న వస్తువుదగ్గరకి తీసుకురావాలి. అంటే, ఏపని చేసేవాని చేత ఆపని చేయించుకోవాలి.అందుకు అప్పటికి అయినదాన్ని మరొక వృత్తి దారుడి దగ్గరకు తీసుకెళ్ళి, అతని పని కాగానే, తర్వాతి పని చేసేవాని వద్దకు పోవాలి. ఇలా అది పూర్తయ్యేవరకూ ఎంతమంది వృత్తి దారుల పనికావాలో అంతమంది దగ్గరకూ దాన్ని చేరుస్తూ ఉండాలి.
అలాకాకుండా ఆపనివాళ్ళని ఒకకప్పుకింద  చేరిస్తే ఆ వస్తువు ఒక్క చోటే తయారవుతుంది. అన్ని చోట్లకు తిప్పే పని తప్పుతుంది. లేదా పనివాళ్ళు ఒకరితర్వాత ఒకరు వచ్చేపని తప్పుతుంది. ఒక వస్తువు తయారీకి అవసరమైన వివిధ వృత్తిదారుల్నీ ఒకే చోట చేరిస్తే కార్ఖానా ఉత్పత్తి తలెత్తుతుంది.
ఆవస్తువు తయారు కావడానికి కొందరు శ్రామికుల చేతులగుండా పయనిస్తుంది.
మార్క్స్ గుర్రబ్బండి తయారీని ఉదాహరిస్తాడు. బండిలో చాలా భాగాలుంటాయి. వాటిని వేర్వేరు వృత్తి దారులు చేసేవారు:
చక్రాలు చేసేవారు, జీను తయారీ దారులు, కుట్టుపనివారు, తాళాలు చేసేవారు, పరదాలూ, పరుపులూ కుట్టే వారు, టర్నర్లు, జాలర్లు (అంచులు)తయారు చేసే వారు, కిటికీలకి గాజు తలుపులు పెట్టేపనివారు, రంగులేసేవారు, నునుపు చేసేవారు, రేకు వేసే ఇంకా కొన్నిపనులు చేసేవారు వరసగా పనిచేస్తేనే బండి తయారయ్యేది.
అయితే బళ్ళు తయారు చేసే పెట్టుబడిదారుడు తన కార్ఖానాలో ఈ పనులు చేసే వేర్వేరు వృత్తిపనివాళ్ళని అందరినీ ఒకే కప్పుకింద చేరుస్తాడు. ఒకరి చేతిలో పనయ్యాక, మరొకరి చేతుల్లోకి వెళుతుంది. అలా పూర్తయ్యేదాకా పనివాళ్ళ చేతులగుండా నడుస్తుంది.
బండి తయారు కానిదే, బంగారుపూత వేయడం వీలుకాదు. ఇది నిజమే. అయితే ఒకేసారి మరిన్ని బళ్ళు చేస్తున్నప్పుడు, కొన్ని పూతవేసే వాళ్ళ చేతుల్లో ఉండవచ్చు – కొన్ని బళ్ళు ఇంకా వెనక దశల్లోనే ఉన్నప్పటికీ.

ఇప్పటివరకూ  మనం సామాన్య సహకారం పరిధిలోనే ఉన్నాం.  ఈ సామాన్య సహకారానికి అవసరమయ్యే అంశాలు మనుషుల రూపంలో, వస్తువుల రూపంలో అందుబాటులో ఉంటాయి.
అయితే ఇంతలోనే ఒక ముఖ్యమార్పు వస్తుంది. వివిధ వృత్తులు చేసే వారు ఇప్పుడు బండితయారీలో నిమగ్నమయ్యారు. ఉదాహరణకి ఎన్నో కుట్టుపనులు చేసే ఒక దర్జీ ఇప్పుడు కేవలం బండికి కావలసినవి మాత్రమే కుడతాడు.
ఈ శ్రామికులు ఇంతదాకా తమతమ వృత్తులకి చెందిన అనేక వస్తువులు తయారు చేసేవారు. ఇప్పుడు బండి  తయారీకి పరిమితమయ్యారు. కాబట్టి, మిగిలిన వస్తువులు  తయారు చెయ్యరు. కనక అలవాటు తప్పిపోతుంది. అభ్యాసం లేక, మునుపు చేసిన వస్తువుల్ని చేసే శక్తినీ, నైపుణ్యాన్నీ కాలక్రమంలో కోల్పోతారు. మరొకవైపు, ఒకేపని చేస్తున్నందువల్ల ఆ చేసేపనిలో నైపుణ్యం సాధిస్తారు. వేగంగా కూడా చేస్తారు.
మొదట, బండి తయారీ అనేది వివిధ, స్వతంత్ర చేతివృత్తుల కలయిక. క్రమంగా బండి తయారీ దాని వివిధ పాక్షిక ప్రక్రియలుగా విడివడి పోతుంది. వాటిలో ప్రతి విడి ప్రక్రియా ఒక ప్రత్యేక పనివాని చర్య అవుతుంది. అతను అదే పాక్షిక ప్రక్రియలో ఉంటాడు. పాక్షిక పనివాడుగా స్థిరపడి కరుడుకట్టుకపోతాడు. మొత్తం మీద కార్ఖానా ఉత్పత్తి మనుషులు కలిసి చేసేదిగా ఉంటుంది. అదేవిధంగా, బట్టల ఉత్పత్తి కూడా అన్ని ఇతర కార్ఖానా ఉత్పత్తుల లాగానే, ఒకే పెట్టుబడిదారుడి అజమాయిషీలో  భిన్న చేతివృత్తుల కలయిక ద్వారా  తలెత్తింది.

రెండవ మార్గం – గుండుసూదుల ఉదాహరణ  
ఈ పద్ధతికి వ్యతిరేకంగా కూడా కార్ఖానా ఉత్పత్తి ఏర్పడుతుంది. ఒకే పెట్టుబడిదారుడు, ఒకే వర్క్ షాప్ లో ఒకేరకం పనిచేసే వాళ్ళని ఎక్కువమందిని పెట్టుకోవడం వల్ల కూడా కార్ఖానా ఉత్పత్తి తలెత్తుతుంది. ఉదాహరణకు, కాగితమో, అచ్చు అక్షరాలో, సూదులో మరొకటో చేసే  పనివాళ్ళని ఎక్కువమందిని పెట్టుకోవడం వల్ల. ఇది సహకారం యొక్క అత్యంత ప్రాధమిక రూపం. 
ఈ పనివాళ్ళలో ప్రతివాడూ ఒకరిద్దరు అప్రెంటిస్ ల సాయంతో మొత్తం సరుకుని చేస్తాడు. ఫలితంగా దాని ఉత్పత్తికి అవసరమైన చర్యలన్నీ వరసగా చేసుకుపోతాడు. అతను మునుపటి చేతివృత్తి  పద్ధతిలోనే పనిచేస్తాడు.
అయితే పనివాళ్ళు ఒకేచోట ఉండడం, పని ఒకేరకమైనది అవడం అనే దాన్ని బాహ్యపరిస్థితులు వేరే విధంగా ఉపయోగపడేట్లు చేస్తాయి. తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులు చేసి ఇవ్వాల్సి రావచ్చు. అందువల్ల పని పునః పంపిణీ అవుతుంది.
ఒకే కార్మికుడు విడివిడి చర్యలన్నిటినీ ఒక్కడే వరసగా చేసే బదులు, ఒక్కొక్క చర్యని ఒక్కొక్క కార్మికుడు చెయ్యవచ్చు. కనక ఆవిధంగా ఆచర్యలలో ప్రతి ఒక్కటీ ఒక్కొకరికి కేటాయించబడుతుంది. ఆచర్యలు అన్నీ సహకరించుకునే శ్రామికుల చేత ఏక కాలంలో  పూర్తిచేయబడతాయి. ఈ యాదృచ్చిక పుర్విభజన పునరావృతం అవుతూ ఉంటుంది. ఈ పునర్విభజన వల్ల అనుకూలతలు/ప్రయోజనాలు ఏర్పడతాయి. క్రమక్రమంగా అది (ఈ పునర్విభజన) ఒక క్రమబద్ధమైన శ్రమవిభజనగా ఘనీభవిస్తుంది.
ఒక సరుకు ఒక స్వతంత్ర వృత్తిదారుడి ఉత్పాదితంగా ఉండదు, ఒక్కొక్కచర్య చేసిన అందరు వృత్తిదారుల సామాజిక ఉత్పాదితం (social product) అవుతుంది. సూదుల తయారీక్రియని అనేక చర్యలుగా విడగొట్టి ఒక్కో చర్యని ఒక్కో పనివాడికి ఇవ్వవచ్చు. అప్పుడు ఎవ్వరూ పూర్తిగా గుండుసూదిని చెయ్యరు. కనుక అది కొంతమంది పనివాళ్ళు కలిసి చేసినదవుతుంది. చేయివేసిన అందరు వృత్తిదారుల సామాజిక ఉత్పాదితం అవుతుంది.

నూరెంబెర్గ్ గిల్డ్ పునాది మీదనే ఇంగ్లాండ్ లో సూదుల కార్ఖానా లేచింది. అయితే అక్కడ సూదులు చేసేవాడు ఒకదాని తర్వాత ఒకటిగా 20చర్యలు చేసేవాడు. కాగా ఇంగ్లండ్ లో అనతి కాలంలోనే 20మంది పనివాళ్ళు వరసగా కూర్చొని ఒక్కొక్కరూ ఒక్కక్క చర్య మాత్రమే చేసేవారు. మరింత అనుభవం చేకూరిన ఫలితంగా ఈ 20 చర్యల్లో ప్రతిదీ కొన్ని చర్యలుగా విడిపోయింది. ఆచర్యలు చెయ్యడం  వేరేవాళ్ళ వంతయింది. 20 మంది వరస పెరిగింది. చర్యలు విడిపోయి పెరిగేకొద్దీ అందుకనుగుణంగా పనివాళ్ళ వరస పొడుగు సాగుతుంది. ఈ యాదృచ్చిక పునర్విభజన పునరావృతం అవుతూనే ఉంటుంది.   
ఈ రెండు అభివృద్ధి మార్గాల అంతస్సంబంధం

కార్ఖానా ఉత్పత్తి చేతివృత్తుల నుంచి తలెత్తి, అభివృద్ధి చెందింది. ఈ తీరు ద్విముఖమైనది. ఒకపక్క వివిధ స్వతంత్ర చేతివృత్తుల కలయిక ద్వారా ఏర్పడింది. ఆవృత్తులు వాటి స్వతంత్రతని కోల్పోతాయి, ఎంతగానంటే, ఒకే రకం సరుకు ఉత్పత్తిలో పాక్షిక ప్రక్రియల స్థాయికి వస్తాయి. ఉదాహరణకి, అన్ని రకాల కొయ్య వస్తువులు చేసే వడ్రంగి , గుర్రబ్బళ్ల కార్ఖానాలో ఒకే బండికి సంబంధించినవి మాత్రమే చేస్తాడు. అంతదాకా చేస్తూవచ్చిన ఏ ఇతర వస్తువునీ చెయ్యడు. అన్ని వస్తువుల్నీ చేసే స్వాతంత్ర్యాన్ని కోల్పోతాడు. ఒకే గాడికి పరిమితమవుతాడు. అలాగే అన్నిరకాల దుస్తులు కుట్టే దర్జీ బండికి సంబంధించినవి మాత్రమే కుడతాడు. మిగిలిన పనివాళ్ళు కూడా అంతే.
మరొకపక్క, ఒకే చేతివృత్తి చేసే శ్రామికుల సహకారం నించి కార్ఖానా ఉత్పత్తి తలెత్తుతుంది. ఒక ప్రత్యేక చేతివృత్తిని విడివిడి చర్యలుగా విడగొడుతుంది. ఈ చర్యల్ని దేనికదిగా. ఒకదానితో ఒకటి సంబంధం లేనివిగా వేరుచేస్తుంది. వేర్వేరు శ్రామికులు ఎవరికీ వారు చేసేచర్యలుగా ప్రత్యేకపరుస్తుంది. అందువల్ల కార్ఖానా ఉత్పత్తి  ఒకపక్క శ్రమ విభజనని ప్రవేశపెట్టనైనా పెడుతుంది, లేదా ఆ విభజనని ఇంకా ఎక్కువచేయ్యనైనా చేస్తుంది. మరొకపక్క, అంతదాకా వేరువేరుగా వున్న చేతివృత్తుల్నికలుపుతుంది. ఒకేచోటికి చేరుస్తుంది. ఎలా మొదలైనా, దాని అంతిమ రూపం (final form) ఒక్కటే : మనుషులు భాగాలుగా వుండే ఉత్పాదక యంత్రాంగం ( productive mechanism).

కార్ఖానా ఉత్పత్తిలో శ్రమ విభజన సరిగా అర్ధం కావాలంటే, రెండు విషయాలు కచ్చితంగా తెలియాలి:
1.      చేతివృత్తిలో వరసగా చేసే చర్యలే, విడివిడి చర్యలుగా విడగొట్టబడతాయి. చర్య సరళమైనదైనా, సంక్లిష్టమైనదైనా చేతితో చేయాల్సిందే. అంటే చేతి వృత్తి స్వభావమే వుంటుంది. అందువల్ల ఆచర్య  పరికరాలు వాడడంలో పనివాడి బలం మీదా, నైపుణ్యం మీదా, వేగం మీదా, చెయ్యగలననే నమ్మకం మీదా ఆధారపడి వుంటుంది. చేతి పనే ప్రాతిపదికగా కొనసాగుతుంది.


2.      రెండోది, ఈ శ్రమ విభజన అనేది ఒక ప్రత్యేక తరహా సహకారం. దాని ప్రయోజనాలు సహకారం యొక్క సాధారణ స్వభావం నుండి తలెత్తుతాయి. కాని సహకారం యొక్క ప్రత్యేక రూపం నుండి కాదు. 

విభాగ శ్రామికుడూ – అతని పరికరాలూ
విభాగ శ్రామికుడూ - ఉమ్మడి శ్రామికుడూ
కార్ఖానాలో వస్తువు తయారీకి  ఒక్కొక్క చర్యని ఒక్కొక్కరు చేస్తారు. ఒకేరకం వస్తువు తయారీలో కొన్ని చర్యలు వుంటాయి. వాటిలో ఒకటో రెండో చేసేవాడు విభాగ కార్మికుడు(Detail Labourer).  ఉదాహరణకి మంచాలు తయారు చేసే చోట అయిదుగురు పనివాళ్ళున్నారు అనుకుందాం.ఎవరికీ వారు మంచాన్నిఆసాంతం చెయ్యవచ్చు.అలాకాకుండా కొయ్యని పట్టెలకూ, కోళ్ళకూ సరిపోయేట్లు ఒకరు కోయ్యవచ్చు. మరొకరు తోపుడు పట్టవచ్చు.  పట్టె లోకరూ , కోళ్ళొకరూ  చెయ్యవచ్చు. మరొకరు బిగించవచ్చు. ఎవ్వరూ మొత్తం మంచాన్ని చెయ్యలేదు. అలాగని పనిలో పాలు పంచుకోకుండా ఉండనూ లేదు. మొత్తం పనిలో తలా ఒక చర్య చేసారు. వీళ్ళని విభాగ వర్కర్లు అంటారు. మన ఉదాహరణలో ఉన్న అయిదుగురూ విభాగ వర్కర్లే. వీళ్ళని పాక్షిక శ్రామికులు అంటుంటారు. ఏపేరు పెట్టినా మొత్తంపనిలో ఉన్న చర్యల్లో ఒకటో రెండో చేసేవాడుగా ఉంటాడు.
వీళ్ళందర్నీ కలిపితే ఉమ్మడి శ్రామికుడు (collective labourer) అవుతాడు. ఇక్కడ మంచాన్ని తయారు చేసింది ఒక శ్రామికుడు కాదు. సమష్టి కార్మికుడు. ఉమ్మడి కార్మికుడు (collective labourer) కార్ఖానా ఉత్పత్తికి సజీవ యంత్రాంగం. వృత్తి మేస్త్రీ వర్క్ షాప్ లో విభాగ శ్రామికుడు ఉండడు. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎవరికి వారు మంచం చేస్తారు. కార్ఖానాలో ఎవరికీ వారు మంచం చెయ్యరు. ఒక్కొక్క చర్య ఒక్కొక్కరు చేస్తారు. అందరూ విభాగ శ్రామికులే.

విభాగ శ్రామికుడూ –ఉత్పాదకతా
 ఇప్పటిదాకా మాన్యుఫాక్చర్ పుట్టుక గురించి చెప్పాడు. ఇప్పుడు అందులోని అంశాల గురించి చెప్తాడు.
మొదటి అంశం: శ్రామికుడు జీవితాంతం ఒకే చర్య (operation) చెయ్యడం వల్ల, తన శరీరాన్ని ఆ చర్యని చేసే ఆటోమాటిక్, ప్రత్యేక పరికరంగా మారుస్తాడు. ఫలితంగా ఆచర్యచెయ్యడానికి అన్ని చర్యలూ వరసగా చేసేవానికంటే తక్కువ టైం తీసుకుంటాడు. అంటే శ్రమ ఉత్పాదకత పెరుగుతుంది.
శ్రమ విభజనవల్ల పెరిగిన ఉత్పాదకత గమనించి స్మిత్ ముగ్ధుడయ్యాడు:
 ఒక పనివాడు రోజంతా కష్టపడితే బహుశా ఒక పిన్ను చేస్తాడేమో! 20 పిన్నులు ఎలాగూ చెయ్య లేడు. ఇప్పుడు  ఈ పనిసాగే విధానం ....ఒక మనిషి తీగ తీస్తాడు. మరొకడు ఆతీగని సాపు చేస్తాడు. మూడోవాడు తెగ్గోడతాడు. ఇంకొకడు మొన తేలుస్తాడు. అయిదో వాడు  తలపైన నునుపు చేస్తాడు. తల తయారీలో రెండు,మూడు చర్యలు వుంటాయి. పిన్నుల్ని తెల్లగా చెయ్యడం వేరొక చర్య. వాటిని పేపర్లో పెట్టడం మరోకరిపని. ఈ విధంగా పిన్నుల తయారీ 18 చర్యలుగా విడి పోయింది. ....
నేనొక చిన్న పిన్నుల ఫాక్టరీ చూచాను. అక్కడ 10 మంది పనివాళ్ళున్నారు. కొందరు  రెండు,మూడు చర్యలు చేసేవారు...వాళ్ళు రోజుకి 48000 పిన్నుల చేస్తారు.అంటే, ఒక్కొక్కరూ 4800 పిన్నులు చేసినట్లు లెక్క.” –Wealth of Nations.p7
విభిన్న చర్యల విభజన, కలయికల  వల్ల 20 పిన్నులు చెయ్యలేని వాళ్ళు 4800 పిన్నులు చేస్తున్నారంటే, ఉత్పాదకత 240 రెట్లయింది.
అదే పని చేస్తుండడం వల్ల చెయ్యడంలో పరిపూర్ణత చేకూరుతుంది.
దృష్టంతా దానిమీదే పెట్టడం వల్ల, కనీస శ్రమతో అనుకున్న ఫలితం ఎలా రాబట్టవచ్చో అనుభవం నేర్పుతుంది.
ఒకే కాలంలో కొన్ని(భిన్న)తరాలకు చెందిన వాళ్ళు ఒకే రకం సరుకుని ఉత్పత్తిలో కలిసి పనిచేస్తుంటారు. కాబట్టి ఆవిధంగా గడించిన సాంకేతిక నైపుణ్యమూ, వృత్తిలోని మెళకువలూ స్థిరపడతాయి, పోగవుతాయి. అవన్నీ తర్వాతి తరాలకు అందించ బడతాయి.
“ పల్చని ఢాకా వస్త్రాలనూ, రంగు వెలవని కోరమాండల్ కాలికోలనూ, ఇతర అద్దకం వస్త్రాలనూ మించినవి లేవు. అయితే ఇవన్నీయూరప్ కార్ఖానాల్లో వున్న పెట్టుబడీ, యంత్రాలూ, శ్రమ విభజనా వంటి సౌకర్యాలేవీ లేకుండానే ఉత్పత్తయ్యాయి.ఆనేతగాడు విడి వ్యక్తి. ఎవరైనా అడిగినప్పుడు నేస్తాడు. మొరటు మగ్గాన్ని వాడతాడు. ఒక్కొక్కప్పుడు కొమ్మలనో, కొయ్యకమ్ములనో కట్టగట్టి మగ్గంగా వాడతాడు. పడుగుని సులభంగా చుట్టే పరికరం అయినా లేదు.అందువల్ల మగ్గాన్ని పూర్తి నిడివికి లాగిపట్టి ఉంచాల్సి వుంటుంది.  అతని గుడిసెలో పట్టనంత పెద్దదవుతుంది.అందువల్ల ఆరుబయట పనిచెయ్యాల్సి వస్తుంది; వాతావరణంలో వచ్చే ప్రతి మార్పూ అతని పనికి అంతరాయం కలిగిస్తూ ఉంటుంది.- ―Historical and descriptive account of Brit. India, &c.,‖ by Hugh Murray and James Wilson, &c.,Edinburgh 1832, v. II., p. 449.
ఒకతరం నుంచి మరొకతరానికి, తండ్రి నుండి తనయుడికి ఈ ప్రత్యేక నైపుణ్యం సంక్రమిస్తుంది – సాలీడికి సంక్రమించినట్లే. అయినప్పటికీ, అటువంటి హిందూ దేశనేతగాని పని కార్ఖానా కార్మికుని పనితో పోలిస్తే, ఎంతో సంక్లిష్టంగా, చిక్కుగా (complicated) ఉంటుంది
ఒకచర్యతర్వాత మరొకచర్యచేస్తూ మొత్తం గా తయారుచేసే పనివాడు, ఒక్కోసారి చోటు మారాల్సి వస్తుంది. ఒక్కోసారి పరికరాలు మార్చుకోవాల్సి వస్తుంది. పని ప్రవాహంలా, సజావుగా సాగదు. అంతరాయాలు కలుగుతాయి. వాటివల్ల రోజులో కొంత సమయం వృధా అవుతుంది. రోజంతా ఒకే చర్యకు పరిమితం కాగానే, అంతరాయాలు అంతరిస్తాయి. ఉత్పాదకత పెరుగుతుంది.
ఒకే చర్య చెయ్యడంలో  ఉత్సాహం కలగదు
మరొకపక్క, ఒకేరకమైన పని మనిషి ఉత్సాహాన్నీ, దెబ్బతీస్తుంది. చర్యల మార్పు పనివాణ్ణి ఉత్సాహ పరుస్తుంది. విభాగ పనివాడికి ఆ అవకాశం ఉండదు
విభాగ శ్రామికుడి పరికరాలు
 శ్రమ ఉత్పాదకత శ్రామికుని నైపుణ్యాన్ని బట్టి వుంటుంది. అంతేకాదు అతను వాడే పనిముట్ల మెరుగుదలను బట్టీ వుంటుంది.
చాకులు, పిడిసానలు, బరమాలు, సుత్తులు మొదలైన పరికరాలు ఒకేరకమైనవి వేర్వేరు శ్రమ ప్రక్రియల్లో వాడవచ్చు; ఒకే పరికరం ఒకే శ్రమ ప్రక్రియలో వివిధ ప్రయోజనాలకు ఉపయోగపడవచ్చు. ఎప్పుడైతే ఒక శ్రమ ప్రక్రియ  చర్యలుగా  విడిపోయి, ఒక్కో చేర్య ఒక్కో విభాగ శ్రామికుని వంతవుతుందో, ఒక్కొక్కరు వాడే పనిముట్లలో మార్పులు అవసరమవుతాయి. ఒకే పరికరాన్ని చాలా పనుల్లో వాడే టప్పుడు ఇబ్బందులోస్తాయి. ఆ ఇబ్బందులే ఈమార్పుల్నినిర్ణయిస్తాయి. ఏచర్య చెయ్యడానికి ఏ మార్పులు అవసరమో ఆ మార్పులు జరుగుతాయి. బిర్మింగ్ హామ్ లో 500 రకాల సుత్తులు తయారయ్యాయి. వేర్వేరు చర్యలకు అనువుగా ఉంటాయి. నగలు చేసేవాడు నాలుగైదు రకాల సుత్తులు వాడతాడు.
కార్ఖానా ఉత్పత్తికి పరికరాల వైవిధ్యం లక్షణం
విభాగ కార్మికుని చేతిలో అతని చర్యకు అనువైనదిగా తయారైన  పరికరం ఉంటుంది. పనిముట్లని ఒక్కొక విభాగ శ్రామికుని ప్రత్యెక చర్యకి అనువుగా చెయ్యడం ద్వారా, కార్ఖానా కాలం పనిముట్లని సరళం చేస్తుంది, మెరుగుపరుస్తుంది, పెంచుతుంది.

రకరకాల స్క్రూ డ్రైవర్లూ, పట్టకార్లూ, చాకులూ – పనినిబట్టి మార్పుగా ఉంటాయి. ఇళ్ళలో కూడా రకరకాల గంటెలూ, స్పూన్లూ ఉంటాయి. ఏపనికి అనుకూలమైనది ఆపనికి.
అదే సమయంలో, ఇది సరళమైన పరికరాల సమ్మేళనం అయిన యంత్రాల ఉనికికి అవసరమైన భౌతికపరిస్థితుల్లో ఒకదాన్ని ఏర్పరుస్తుంది. పాక్షిక శ్రామికుడూ, అతని పరికరాలూ కార్ఖానా ఉత్పత్తిలో అత్యంత సరళమైన అంశాలు. ఇక కార్ఖానా ఉత్పత్తి అంశాన్ని మొత్తంగా చూద్దాం.

కార్ఖానా ఉత్పత్తి యొక్క  రెండు రెండు మౌలిక రూపాలు
కార్ఖానా ఉత్పత్తికి రెండు రెండు మౌలిక రూపాలుంటాయి.
1.వైవిధ్యభరిత(heterogeneous) కార్ఖానా ఉత్పత్తీ,
2. ధారావాహిక (serial) కార్ఖానా ఉత్పత్తీ

 అవిరెండూ అడపాదడపా కలిసినప్పటికీ, సారంలో భిన్నమైనవి. పైగా, మాన్యుఫాక్చర్ యంత్రాలతో నడిచే ఆధునిక పరిశ్రమలోకి పరివర్తన చెందే క్రమంలో అవి భిన్నపాత్రల్ని పోషిస్తాయి. తయారయ్యే వస్తువు స్వభావమే ఈ ద్వంద్వ స్వభావానికి కారణం.
1. ఒక వస్తువు స్వతంత్రగా చేసిన భాగాల్ని (partial products) కూర్చడం ద్వారా తయారవచ్చు.
2. ఒక వరసలో జరిగే సంబంధిత చర్యల ద్వారా ఏర్పడవచ్చు.
మార్క్స్ మొదటిదాన్ని వైవిధ్య భరిత కార్ఖానా ఉత్పత్తి  (heterogeneous manufacture) అనీ, రెండోదాన్ని ధారావాహిక  కార్ఖానా ఉత్పత్తి (serial manufacture) అనీ అన్నాడు.

వైవిధ్య భరిత కార్ఖానా ఉత్పత్తి

వైవిధ్య భరిత కార్ఖానా ఉత్పత్తికి గడియారాల ఉత్పత్తి ప్రామాణిక ఉదాహరణ  - Capital 1.329 ఫుట్ నోట్ 2
విలియం పెట్టీ మాన్యుఫాక్చర్లో శ్రమవిభజనకి ఉదాహరణగా దీన్ని చూపాడు. గతంలో నూరెం బెర్గ్ వృత్తిదారుడి కృషితో తయారైన చేతి గడియారం  ఇప్పుడు అనేకమంది విభాగ శ్రామికుల సామాజిక ఉత్పత్తి అయింది. మెయిన్ స్ప్రింగులు, డయల్ లు, ముళ్ళు, స్క్రూలు,కేస్ లు,చక్రాలు, బాలెన్స్ చక్రాలు,వగయిరా అనేక విడిభాగాలుంటాయి. వాటిని వేర్వేరు పనివాళ్ళు చేస్తారు. వీటిలో కొన్నిటిని అనేకమంది కలిసి చేస్తారు. చివరకి ఈ భాగాలన్నీ అమర్చే పనివానికి చేరతాయి. అతను  ఆభాగాల నన్నిటినీ అమర్చి పనిచేసే స్థితిలో గడియారాన్ని అందచేస్తాడు.
వీళ్ళందర్నీ ఒకే బిల్డింగులోకి చేర్చడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఇప్పటికీ చాలా భాగాలు బయటే తయారవుతాయి. విభాగ శ్రామికులని ఒకే వర్క్ షాప్ లో చేరుస్తారా లేదా అనేది యాదృచ్చికం. అంటే చేర్చానూ వచ్చు, చేర్చకపోనూ వచ్చు. రెండుసందర్భాలూ ఉన్నాయి. గడియారాల తయారీలో పనివాళ్లని ఒకేచోట కేంద్రీకరించడం సాధారణగాపరిస్థితుల్లో లాభదాయకం కాదు. ఎందుకంటే, ఇళ్లదగ్గర పనిచేసే వాళ్ళ మధ్య పోటీ ఎక్కువగా ఉంది; పనిని అనేక ప్రక్రియలుగా విడగొట్టడం వల్ల శ్రమ పరికరాల్ని ఉమ్మడిగా వాడడం పెద్దగా ఉండదు; పనిని అక్కడక్కడ చెల్లాచెదరుగా చేయిస్తే, పెట్టుబడి దారుడికి వర్క్ షాప్ మీద పెట్టుబడి తగ్గుతుంది, పొదుపవుతుంది. ఈ కారణాలవల్ల ఒకేచోట చేర్చడం యాదృచ్చికం.
ఇంట్లోనే పనిచేసినా అతను చేస్తున్నది పెట్టుబడిదారుడి కోసం. అలాచేసే విభాగ శ్రామికుని స్థానం, కాతా దారులకోసం చేసే స్వతంత్ర వృత్తిదారుని స్థానానికంటే ఎంతో భిన్నమైంది.
ధారావాహిక కార్ఖానా ఉత్పత్తి.

రెండో రకం మాన్యుఫాక్చర్ లో సంబంధం వున్న దశలు మారుతూ, అంచలంచలుగా వస్తువులు తయారవుతాయి. సూదుల తయారీ లో ఒక తీగ 72 మంది చేతుల్లోకి వరసగా నడుస్తుంది. ఎవరిపని వారు చేస్తారు. ఫలితంగా సూదులు తయారవుతాయి. కొన్ని సార్లు 92 మంది చేతులగుండా పోతుంది.
మాన్యుఫాక్చర్ లో వైరుధ్యం
కార్ఖానా ఉత్పత్తి మొదలైనప్పుడు చెల్లాచెదరుగా వున్నచేతివృత్తుల్ని కలిపింది. ఆమేరకు అది ఉత్పత్తిలో వివిధ దశలకూ మధ్య ఉండే దూరాన్ని తగ్గించింది. ఒక దశ నుంచి మరొక దశకు పోయేందుకు పట్టే సమయాన్ని తగ్గించింది. పోయేందుకు పట్టే శ్రమనీ తగ్గించింది. చేతివృత్తితో పోలిస్తే, ఉత్పాదకశక్తి పెరుగుతుంది. ఈ పెరుగుదలకి కారణం కార్ఖానా ఉత్పత్తి యొక్క సాధారణ సహకార స్వభావమే.
మరొకవైపు, చేస్తున్న వస్తువు ఒకరు కొంత చేశాక మరొకరు ఇంకొంత చెయ్యడానికి చేతులు మారాలి. రవాణా అవాలి. ఒక ప్రక్రియనుంచి మరొక ప్రక్రియకు మారాలి. మాన్యు ఫాక్చర్లో ఇది అనివార్యం. ఖర్చుతో కూడిన అసౌకర్యం.
ఉమ్మడి కార్మికుడు

సూదుల కార్ఖానా ఉత్పత్తిలో ముడిపదార్ధం అయిన తీగ వైపే చూస్తుంటే, ఆ తీగ ఒక విభాగ  శ్రామికుని నుండి మరొక శ్రామికుని చేతుల్లోకి  వరసగా పోతూవుండడం కనబడుతుంది. అలాకాకుండా, మొత్తంగా వర్క్ షాప్ ని చూస్తే, ముడిపదార్ధం అయిన తీగ   దాని అన్ని ఉత్పత్తిదశలలోనూ కనబడుతుంది. పనిలో ఒక్కొక్క భాగాన్నివేర్వేరు వ్యక్తులు చేస్తుంటారు. అందరి పనివల్లా వస్తువు పూర్తవుతుంది. అది అందరూ కలిసిన  ఉమ్మడి కార్మికుడి ఉత్పత్తి.
 
 ఉమ్మడి కార్మికుడికి చాలా చేతులుంటాయి. వాటిలో ఒకజత చేతులతో ఒకరకం పనిముట్లు ఉపయోగించి తీగ సాగదీస్తాడు. మరొక జత చేతులతో వేరే రకం పనిముట్లతో దాన్నివంకలు లేకుండా, చక్కగా చేస్తాడు. ఇంకొక  జత చేతులతో ఇంకొక రకం పనిముట్లతో దాన్ని ముక్కలుగా తెగ్గొడతాడు. వేరొక జత చేతులతో వేరొక రకం పనిముట్లతో మొనలు తేలుస్తాడు.  ఈవిధంగా ఏకకాలంలో చాలా చర్యలు చేస్తూ పోతాడు. ఒకదాని తర్వాత ఒకటి జరిగే వివిధ విడి చర్యలూ ఏకకాలంలో, ఒకేచోట పక్కపక్కనే జరుగుతాయి. ఒక నిర్ణీత కాలంలో మరింత పరిమాణంలో సరుకులు ఉత్పత్తవడానికి కారణం అదే. ఈ ఏకకాలికతకు కారణం మొత్తం ఉత్పత్తి ప్రక్రియ యొక్క సాధారణ సహకార రూపం అనేది నిజమే. అయితేకార్ఖానా ఉత్పత్తి వచ్చేప్పటికే   ఈ సహకారానికి అనుకూల పరిస్థితులు సిద్ధంగా ఉన్నాయి. దానికితోడు కార్ఖానా ఉత్పత్తి  కొంతవరకూ చేతి వృత్తి శ్రమని ఉపభాగాలుగా విడగొట్టడం ద్వారా ఆపరిస్తితుల్ని కొంతవరకూ ఏర్పరుస్తుంది. మరొకవైపు, ప్రతి శ్రామికుణ్ణీ పనిలో చిన్న భాగానికి కట్టేయడం ద్వారా, ఈ శ్రమ ప్రక్రియయొక్క సామాజిక నిర్మాణాన్ని సాధిస్తుంది. 
విభాగ శ్రామికుడు పని సకాలంలో చెయ్యాలసి వస్తుంది 
“కార్ఖానా ఉత్పత్తిలో ప్రతి కార్మిక జట్టూ మరో జట్టుకి తన ముడిపదార్ధాన్ని సప్లై చేస్తుంది. కాబట్టి ప్రధానమైన షరతు ఏమంటే – ప్రతి జట్టూ ఒక నిర్ణీత మొత్తాన్ని ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేయాలి; తత్ఫలితంగా అసలు సహకారంలో కంటే పూర్తిగా వేరురకమైన అనున్యూతీ (continuity), సక్రమత్వమూ, ఎకరూపతా శ్రమ తీవ్రతా సృష్టించబడతాయి. ఆవిధంగా మనకిక్కడ శ్రమ సామాజికంగా అవసరమైన శ్రమ అయివుండాలి అనే ఉత్పత్తి క్రమం యొక్క సాంకేతిక నియమం అవుతుంది.”- ఎంగెల్స్. పెట్టుబడి గురించి.100
ప్రతి ఉత్పత్తిదారుడూ తన సరుకుని మార్కెట్ ధరకే అమ్ముకోవాల్సి ఉంటుంది. కాబట్టి సరుకు ఉత్పత్తికి పట్టే సమయం సామాజికంగా అవసరమయ్యే సమయాన్నిసాధారణంగా మించకూడదు అనేనియమం పోటీ ప్రభావం వల్ల  స్థిరపడ్డట్టు కనబడుతుంది; కాని ఇందుకు భిన్నంగా ఫలానింత కాలంలో, ఫలానింత సరుకు ఉత్పత్తి అవడం అనేది ఉత్పత్తి ప్రక్రియ యొక్క సాంకేతిక నియమం.

ఒక విభాగ శ్రామికుని శ్రమ ఫలితం ఇంకొక విభాగ శ్రామికుని శ్రమకి ఆరంభ బిందువు. ఒకడు కమ్మిచ్చుతో  తీగ లాగుతాడు. అంతటితో అతని పని అయింది. దాన్నివంపు తీసి  చక్కగా చెయ్యడం వేరేవాని పని. మొదటివాని శ్రమ ఫలితం తీగ. అది రెండోవాని పనికి ఆరంభబిందువు. చక్కగా ఉన్న తీగ ఇతని శ్రమ ఫలితం. అది మూడోవాని పనికి ఆరంభ బిందువు. ఇలా అందిస్తుంటే తీసుకొని ఎవరి వంతు వారు చేస్తారు. చివరకి వస్తువు వస్తుంది. ఒకరి పని అయితేనే మరొకరి పనిమొదలవుతుంది. అవతలవానికి సకాలంలో అందించాలి. ఎవరైనా ఎక్కువ సమయం తీసుకుంటే, ప్రక్రియకి అంతరాయం కలుగుతుంది. అందువల్ల,  ఏ ఒక్కరూ ఎక్కువ సమయం తీసుకోకుండా ఒత్తిడి పడుతుంది. ఆవిధంగా తెంపు లేని కొనసాగింపు, ఏకరూపత (uniformity), క్రమబద్ధత, పధ్ధతి ఏర్పడతాయి; ఇవి స్వతంత్ర చేతివృత్తులలో కానీ, సామాన్య సహకారంలోగానీ కనిపించే వాటికంటే భిన్నంగా ఉంటాయి.
పరస్పరం ఆధారపడడం వల్ల సమన్వయం అవసరం

వేర్వేరు చర్యలకు వేర్వేరు సమయాలు పడతాయి. కనుక ఒకే కాలంలో తయారయ్యే ముక్క ఉత్పాదితాలు  (fractional products) భిన్న పరిమాణాల్లో ఉంటాయి. అందువల్ల ఒక పనివాడు ప్రతిరోజూ ఒకే చర్య చేసే పక్షంలో, ప్రతి చర్యకూ శ్రామికులు వేర్వేరు సంఖ్యల్లో ఉండాలి. అందుకు తగిన నిష్పత్తి ఏర్పడుతుంది. ఉత్పత్తిని విస్తరించాలంటే, మొత్తం జట్టునో కొన్ని జట్లనో నియమించాల్సి ఉంటుంది. “ అంతేగాక, ఉత్పత్తి ఒక నిర్దిష్టమైన స్థాయిని చేరుకున్న తరువాత మాత్రమే కొన్ని క్రియలను, తనిఖీ, ఒకచోటునుండి మరోకచోటుకి సరుకుల రవాణా వగైరాలను వేరుచేయడం వల్ల లాభం వుంటుంది.”- పెట్టుబడి గురించి.101
వివిధ కార్ఖానా ఉత్పత్తులను ఒకే ఉమ్మడి కార్ఖానా ఉత్పత్తిగా మిళితం చేయడమనేది కూడా జరుగుతుంది, కాని దానికి కావల్సిన నిజమైన సాంకేతిక ఐక్యత ఇంకా సర్వదా లోపిస్తూనే వుంటుంది. యంత్రాలలో మాత్రమే అది వస్తుంది.- పెట్టుబడి గురించి.101

ఉదాహరణకి టైపుల తయారీలో ఒక నునుపు వాడికి (rubber), నలుగురు పోత పోసేవాళ్ళూ(founders), ఇద్దరు విడగొట్టే వాళ్ళూ (breakers)ఉండాలి. పోతపోసేవాడు గంటకి 2,000  అక్షరాలు పోతపోస్తాడు. విడగొట్టేవాడు 4,000 విడగొడతాడు.నునుపు చేసే వాడు 8,000 నునుపు చేస్తాడు. ఇక్కడ ప్రతి చర్యకూ సాపేక్షంగా ఎంతమంది అవసరమో నిర్ణయమవుతుంది. ఉమ్మడి కార్మికునిలో విభాగాలయిన విభాగ కార్మికుల సంఖ్యను చర్యలవారీగా నిర్ణయిస్తుంది.” అది, సామాజిక శ్రమ ప్రక్రియ పరిమాణాత్మక నిష్పత్తినీ ఏర్పరుస్తుంది.
ఇక్కడ కనిపిస్తున్నది సామాన్య సహకార సూత్రమే: ఒకే పని చేస్తున్న ఎక్కువమందిని ఒకేసమయంలో నియమించడమే. కార్ఖానా శ్రమ విభజన సామాజిక ఉమ్మడి శ్రామికునిలో గుణాత్మకంగా భిన్నమైన భాగాల్ని సరళీకరిస్తుంది, పెంచుతుంది. అంతేగాక, ఆ విభాగాల పరిమాణాత్మక మోతాదుని నిర్ణయించే నిష్పత్తిని – అంటే ప్రతి విడి చర్యకీ సాపేక్షంగా కావలసిన కార్మికుల సంఖ్యని, లేదా శ్రామికుల బృందం సైజుని –ఏర్పరుస్తుంది.సామాజిక శ్రమ ప్రక్రియ యొక్క గుణాత్మక అంతర్విభాజనతో పాటుగా ఆ ప్రక్రియకి ఒక పరిమాణాత్మక నియమాన్నీ, పరిమాణాత్మక నిష్పత్తినీ అభివృద్ధిపరుస్తుంది.
ఒక నిర్ణీత స్థాయిలో ఉత్పత్తి అవుతున్నప్పుడు, ప్రయోగం ద్వారా  వేర్వేరు విభాగ కార్మికుల మధ్య  నిష్పత్తి సరిగా నిర్ధారణ అవుతుంది. ఇక అక్కడనించీ ఉత్పత్తి స్థాయిని పెంచాలంటే, అప్పటికున్న  బృందాలకి, ఇంకొక బృందాన్ని కలపాలి. ఒక్కొక్క బృందంలో 6 గురు చొప్పున 4 బృందాలున్నయనుకుందాం. అక్కడ ఉత్పత్తి స్థాయిని పెంచాలంటే, ఒకటో రెండో  బృందాల్ని కలపాలి. అందుకు మొక 6 గురినో, 12 మందినో కలపాలి. అంతేగాని విడిగా శ్రామికులని ఇద్దర్నో ముగ్గుర్నో పెట్టడం కుదరదు.

కొన్నిరకాల పనులు కొద్ది స్థాయిలో చేసే వ్యక్తి పెద్ద స్థాయిలో సైతం చెయ్యగలడు; ఉదాహరణకి పర్యవేక్షించే పని,కొంత పని జరిగిన వస్తువుల్ని తరవాత పని జరగాల్సిన చోటుకి రవాణాచేసే పని లాంటివి. అటువంటి పనుల్ని వేరుచేసి, వేరే వ్యక్తికివ్వడం అనేది శ్రామికుల సంఖ్య పెరిగితేనే గాని ప్రయోజనకరం కాదు. అయితే ఈ పెంపు అన్ని బృందాలకీ నిష్పత్తి ప్రకారం ఉండాలి.

కార్ఖానా ఉత్పత్తి వివిధ కార్ఖానా ఉత్పత్తుల సమ్మేళనం గా అభివృద్ధి చెందవచ్చు.

గాజు సీసాల తయారీ.
ఇందులో మూడు ముఖ్య దశలు ఉంటాయి. మొదటిదశ, గాజు లోవుండే పదార్ధాల్ని తయారుచెయ్యడం, ఇసుక సున్నం వగైరాలని మిశ్రమం చెయ్యడం, వాటిని కరిగించి గాజు ద్రవాన్ని తయారుచెయ్యడం ఇవన్నీ తొలి దశలో పనులు. వీటిని చెయ్యడానికి చాలామంది విభాగ శ్రామికులు నియమితులవుతారు. తుది దశలో  ఆరబెట్టే బట్టీ నుండి సీసాలను వెలికి తీయడం, రకాలవారీగా వేరుచేయ్యడం, పాక్ చెయ్యడం తుది దశ పనులు. ఈ దశలో కూడా చాలామంది విభాగ శ్రామికులు నియమితులవుతారు. ఈరెండు దశల మధ్యలో గాజుని కరిగించడం, గాజు ద్రవాన్ని నేర్పుతో నిర్వహించడం ఉంటాయి. కొలిమి ముఖద్వారాలలో ప్రతిదాని దగ్గరా హోల్ అనే ఒక బృందం పనిచేస్తుంది. హోల్ లో సీసా చేసేవాడు ఒకడు, గాలి ఊదేవాడు ఒకడూ, పోగుచేసే వాడు ఒకడూ, అందించేవాడు ఒకడూ, తీసుకునేవాడు ఒకడూ ఉంటారు. ఒకే మొత్తంగా పని చేసే ఒక క్రియాశీల వ్యవస్థలో, ఈ అయిదుగురు విభాగ శ్రామికులూ ప్రత్యేక అవయవాలుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ అయిదుగురి సహకారంతో మాత్రమే పనిజరుగుతుంది.. వాళ్ళలో ఏ ఒక్కరు లేకున్నా, పని ఆగిపోతుంది.
అయితే ఒక గాజు కొలిమికి కొన్ని ముఖద్వారాలు(openings) ఉంటాయి - ఇంగ్లండ్ లో ఇవి 4 నించి 6 దాకా. ప్రతిదాంట్లో గాజుద్రవం ఉండే కరిగించే మట్టి కుండ ఉంటుంది. పైన చెప్పిన అయిదుగురు పనివాళ్ళ జట్టు ఉంటుంది. ప్రతి జట్టు నిర్మాణమూ  శ్రమ విభజన ప్రాతిపదికమీద ఆధారపడి ఉంటుంది. అయితే భిన్న జట్ల మధ్య సంబంధం సామాన్య సహకారమే. ఉత్పత్తి సాధనాలలో ఒకటైన కొలిమిని ఉమ్మడిగా వాడడం వల్ల ఆ కొలిమిని మరింత పొదుపుగా వినియోగమయ్యేందుకు వీలు కలుగుతుంది. ఇది సామాన్య సహకారం వల్ల కలిగేదే. 4-6 జట్ల శ్రామికులు పనిచేసే టటువంటి కొలిమి ఒక గాజు గృహం. ఒక గాజు కార్ఖానాలో అటువంటి గాజు గృహాలు చాలా ఉంటాయి. పనికి కావలసిన సామాగ్రి ఉంటుంది. అవసరమైనంత మంది శ్రామికులుంటారు. ఇవన్నీ ఉన్నదే కార్ఖానా.
   
అంతిమ విషయం.
కార్ఖానా ఉత్పత్తి వివిధ చేతి వృత్తుల కలయిక నుండి ఏర్పడింది. అలాగే  అది వేర్వేరు కార్ఖానా ఉత్పత్తుల సమ్మేళనంగా అభివృద్ధి అవుతుంది. ఇంగ్లండ్ లో పెద్ద గాజు కార్ఖానా దారులు వారి కరిగించే మట్టి కుండల్ని వారే చేసుకుం టున్నారు. కారణం ప్రక్రియ ఫలితం వీటి నాణ్యతని బట్టి ఉండడమే. ఇక్కడ ఉత్పత్తి సాధనాల్లో ఒకదాని ఉత్పత్తి, ఉత్పాదితం ఉత్పత్తితో కలిసిపోయింది. మరొకపక్క, సరుకు కార్ఖానా ఉత్పత్తి, ఇతర కార్ఖానా ఉత్పత్తులతో కలవవచ్చు. వాటిలో  అది  ముడిసరుకు కావచ్చు.
ఆవిధంగా ఫ్లింట్ గాజు ఉత్పత్తి గాజు కోతతోనూ, ఇత్తడి పోతతోనూ  కలిసింది; ఇత్తడి పోత రకరకాల గాజు వస్తువులకు లోహ చట్రాలు తయారుచెయ్యడానికి ఉపయోగ పడుతుంది.
ఇలా కలిసిన వివిధ కార్ఖానా ఉత్పత్తులు ఒక భారీ కార్ఖానా ఉత్పత్తిలో అంతో ఇంతో వేరుపడ్డ శాఖలుగా ఏర్పడతాయి. అదే సమయంలో అవి స్వతంత్ర ప్రక్రియలు, దేనికిదానికి సొంత శ్రమవిభజన ఉంటుంది. ఈ కలయిక వల్ల చాలా అనుకూలతలు ఉంటాయి. ఉన్నప్పటికీ అది దాని సొంత పునాది మీద సంపూర్ణ సాంకేతిక వ్యవస్థగా ఎన్నటికీ ఎదగజాలదు. ఎప్పుడు ఎదుగుతుంది? అది యంత్రాలతో నడిచే పరిశ్రమలోకి పరివర్తన చెందినప్పుడు ఎదుగుతుంది.
పనిముట్ల పైన కార్ఖానా వ్యవస్థ ప్రభావం
కార్ఖానా ఉత్పత్తి తొలికాలంలో సరుకుల ఉత్పత్తికి అవసరమైన శ్రమ కాలాన్ని తగ్గించాలి అన్న సూత్రం ఆమోదం పొందింది, రూపం దిద్దుకుంది. అక్కడక్కడా యంత్రాల వాడకం మొదలయింది; ప్రత్యేకించి, భారీస్థాయిలో, ఎక్కువ శక్తిని వెచ్చించి నిర్వహించాల్సిన కొన్ని మామూలు ప్రారంభ ప్రక్రియలలో  యంత్రాలు వచ్చాయి. కాగితం తయారీ తొలిదశలో గుడ్డ ముక్కల్నిచించే పని కాగితం మిల్లులు చేసేవి. లోహ కార్ఖానాల్లో ముడిఖనిజాల్ని పొడుం చేసే పని దంచే మిల్లులు చేసేవి.యంత్రాల అభివృద్ధి చరిత్రని ధాన్య మిల్లుల నుంచి తెలుసుకోవచ్చు. రోమన్ సామ్రాజ్యం సకల యంత్రాల తొలి రూపమయిన జల చక్రాన్ని(water-wheel) తర్వాతి తరాలకు అందించింది.

చేతివృత్తుల కాలం గొప్ప ఆవిష్కరణల్ని భావితరాలకిచ్చింది జరిగాయి- దిక్సూచి, తుపాకి మందు, అచ్చు అక్షరాల ముద్రణ, దానంతటది నడిచే (automatic) గడియారం ఆకాలం అందించినవే. అయితే మొత్తంమీద శ్రమ విభజన పాత్రతో  పోలిస్తే యంత్రాల పాత్ర తక్కువ.అందుకే స్మిత్ శ్రమ విభజనపాత్రకుప్రదం ప్రాధాన్యతా, యంత్రాల పాత్రకు ద్వితీయ ప్రాధాన్యతా  ఇచ్చాడు. 17వ శతాబ్దంలో యంత్రాల వాడకం అడపాదడపా జరిగింది.అయినా అది అత్యంత ముఖ్యమయినది. ఎందుకంటే, అది యాంత్రిక శాస్త్ర సృష్టికి ఆకాలపు  గొప్ప గణిత శాస్త్రజ్ఞులకు అవసరమైన ఆచరణాత్మక ఆధారాన్నీ, ప్రేరణనీ ఇచ్చింది.

కార్మికుల పైన కార్ఖానా వ్యవస్థ ప్రభావం

కొంతమంది విభాగ శ్రామికుల కలయికతో ఉమ్మడి శ్రామికుడు రూపొండుటతాడు. అలా రూపొందిన ఉమ్మడి శ్రామికుడే కార్ఖానా ఉత్పత్తి దశకి విలక్షణమైన యంత్ర సముదాయం (machinery). ఏదైనా సరుకు తయారు చేసే శ్రామికుడు, కొన్ని చర్యలు ఒకటితర్వాత  ఒకటి చెయ్యాలి.  ఒకదాన్ని మరొకదానితో సమన్వయ పరచాలి. అందుకు తన శక్తి సామర్ధ్యాల్ని వివిధ విధాల్లో వెచ్చించాల్సి వస్తుంది. ఒకచర్యలో ఎక్కువ బలం ప్రయోగించాలి. మరొక చర్యలో ఎక్కువ నైపుణ్యం చూపాలి. ఇంకోచర్యలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఏ వ్యక్తికీ ఈ లక్షణాలన్నీ సమాన స్థాయిలో ఉండవు. ఈ చర్యలన్నీ దేనికది వేరయ్యాక, ఎవరికి  ఏ చర్య చేసే సామర్ధ్యం ఎక్కువగా ఉంటుందో ఆచర్య వారివంతు అవుతుంది. ఆవిధంగా జట్లు కట్టబడతాయి. ఒకవైపు శ్రమ విభజన నిర్మాణానికి  వారి సహజ శక్తులే పునాది. మరొకపక్క, ఒకసారి కార్ఖానా ఉత్పత్తి వచ్చాక, కొన్ని ప్రత్యేక చర్యలు చెయ్యడానికి మాత్రమే సరిపోయే కొత్త శక్తులు ఆ సహజ శక్తులలో పెంపొందుతాయి.
ఇప్పుడు ఉమ్మడికార్మికుడికి అన్ని లక్షణాలూ  వస్తువు ఉత్పత్తికి ఉండాల్సిన  స్థాయిలో శ్రేష్ఠత ఉంటాయి. అత్యంత పొదుపుగా వాటిని వాడతాడు. విభాగ శ్రామికునిలో ఉండే ఒకే చర్యకు కట్టుబడిన పాక్షికత్వమూ, లోపాలూ అతను ఉమ్మడి కార్మికుడిలో ఒకడయ్యాక పోతాయి. లోపాలు రహితమవుతాయి. పరిపూర్ణత చేకూరుతుంది. విభాగ శ్రామికుదు  చేసే ఒకే చర్య అతనిని  పనిలో విఫలం కాని పరికరంగా మారుస్తుంది. మొత్తం యంత్రాంగంతో అతని సంబంధం ఆయంత్రభాగాలు ఎంత క్రమబద్ధంగా పనిచేస్తాయో అంత క్రమబద్ధంగా పనిచేసేట్లు ఒత్తిడి పెడతాయి.
ఉమ్మడి శ్రామికుడి చర్యల్లో సరళమైనవీ ఉంటాయి, సంక్లిష్టమైనవీ వుంటాయి. ఎక్కువ స్తాయివీ, తక్కువ స్తాయివీ ఉంటాయి. కనుక ఆయా శ్రమశక్తుల శిక్షణ  భిన్న స్థాయిల్లో ఉంటుంది. ఫలితంగా  వాటికి వేర్వేరు విలువలు ఏర్పడతాయి. అందువల్ల కార్ఖానా ఉత్పత్తి శ్రమశక్తుల అంతస్తులు ఏర్పరుస్తుంది. దేనికి తగిన వేతనం  దానికి ఉంటుంది. ఒకదానికీ ఎక్కువా, మరోకదానికీ తక్కువా ఉంటాయి.


నిపుణ శ్రామికుడూ – అనిపుణ శ్రామికుడూ
ఏమైనప్పటికీ ప్రతి ఉత్పత్తి ప్రక్రియలో సరళమైన చర్యలుంటాయి, వాటిని ఎవరైనా చెయ్యగలరు. ఆచర్యలు ఇప్పుడు సంక్లిష్టమైన చర్యల నుంచి విడిపోతాయి. కొందరు ప్రత్యేకంగా నియమించబడ్డ కార్మికులు చేసే చర్యలుగా స్థిరపడతాయి.
అందువల్ల నుంచీ కార్ఖానా ఉత్పత్తి పట్టుకున్న  ప్రతి చేతివృత్తిలో అనిపుణశ్రామికులు అనే ఒక తరగతిని ఏర్పరచింది. చేతివృత్తిలోఇలాంటి వాళ్లకి  ఎలాంటిచోటూ ఉండేదికాదు. ఇది ఒక ఒకే చర్య చేసే ప్రత్యేకతని లోపరహితంగా వృద్ధి చేస్తుంది, మిగిలిన మొత్తం పనిచేసే శక్తినీ దెబ్బతీస్తుంది. శ్రామికుల అంతస్తుల వర్గీకరణతో పాటు, నిపుణ శ్రామికులు అనిపుణ శ్రామికులు అనే సరళ విభజన వుంటుంది.  అనిపుణ శ్రామికులకి పని  నేర్చుకునే(apprenticeship) ఖర్చు ఉండదు. నిపుణ శ్రామికుడికి ఆర్టిఫైసర్స్ తో పోలిస్తే ఆఖర్చు తగ్గుతుంది, -చేసే క్రియలను సులభతరం చెయ్యడం వల్ల. రెండు సందర్భాల్లోనూ శ్రమశక్తి విలువ తగ్గుతుంది. పని నేర్చుకునేందుకు అయ్యే ఖర్చులు పూర్తిగానో పాక్షికంగానో తగ్గడం వల్ల శ్రమ శక్తి విలువ తగ్గుతుంది. ఫలితంగా పెట్టుబడికి దక్కే అదనపువిలువపెరుగుతుంది; శ్రమశక్తి పునరుత్పత్తికి అవసరమయ్యే శ్రమకాలం తగ్గించేది ఏదైనా అదనపు శ్రమకాలం పరిధిని పెంచుతుంది. అనిపుణ శ్రమ సృష్టి, శ్రమశక్తి విలువ తగ్గింపు రెండూ పెట్టుబడి దారుడికి  సాపేక్ష అదనపు విలువనిచ్చేవే.


వచ్చే పోస్ట్  : కార్ఖానాలో శ్రమ విభజనా సమాజంలో శ్రమ విభజనా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి