11, ఏప్రిల్ 2018, బుధవారం

కార్ఖానా ఉత్పత్తీ-దాని పెట్టుబడిదారీ స్వభావమూ


కార్ఖానా ఉత్పత్తీ-దాని పెట్టుబడిదారీ స్వభావమూ
ఒక పెట్టుబడిదారుడి అజమాయిషీలో శ్రామికుల సంఖ్య పెరగడమే సహకారానికి, ప్రత్యేకించి కార్ఖానా ఉత్పత్తికి సహజమైన ఆరంభ బిందువు. మొదట్లో మరింతమంది కార్మికుల్ని కలపడంలో పెట్టుబడిదారుడికి ప్రేరణ/ఉద్దేశ్యం ఆర్ధిక పరమైనది, సాంకేతికపరమైనది కాదు: ఎంత ఎక్కువ మందిని పెట్టుకుంటే అంత ఎక్కువ అదనపు విలువ వస్తుంది.

ఒక పెట్టుబడి దారుడు అప్పటికున్న శ్రమవిభజన విధించిన కనీస సంఖ్యలో పనివాళ్ళని పెట్టుకోవాలి. కనీసమొక జట్టు ఉండాలి. స్మిత్ చూసిన పిన్నుల కార్ఖానాలో శ్రామికుల జట్టులో 10 మంది ఉన్నారు. అంటే అక్కడ కనీస శ్రామికుల సంఖ్య 10. మరొక పక్క, మరింత శ్రమ విభజన వల్ల ప్రయోజనాలు పనివాళ్ళని పెంచితేనే కలుగుతాయి. కార్ఖానాలో పనివాళ్ళని పెంచడమంటే జట్లను  పెంచడమే. పిన్నుల కార్ఖానాలో అయితే పదేసి మంది చొప్పున పెట్టుకోవాలి. చొక్కాలు కుట్టే కార్ఖానాలో కత్తిరించేవాడూ, బాడీ కుట్టేవాడూ, కాలర్ కుట్టేవాడూ, చేతులు కుట్టేవాడూ, కాజాలుతీసేవాడూ, గుండీలు కుట్టేవాడూ  మొత్తం 6 గురు ఒక జట్టు అనుకుందాం. ఉత్పత్తి పెంచాలంటే పనివాళ్ళని పెంచాలి. అయితే ఇక్కడ ఇంకోకరినో ఇద్దరినో పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. వాళ్ళు వృధా. పెడితే మరో ఆరుగురి జట్టు పెట్టాలి. జట్లు జట్లు పెంచాలేగాని, విడివిడిగా పనివాళ్ళని నియమించడం కుదరదు.
శ్రామికులు పెరిగితే, అస్థిర పెట్టుబడి పెరుగుతుంది
శ్రామికుల జట్ల సంఖ్య పెరిగే కొద్దీ, అస్థిర పెట్టుబడి పెరుగుతుంది. ఇది స్పష్టమే. ఏడుగురున్న జట్టుకు వేతనం 1000 రూపాయలు అనుకుంటే, 4 జట్లకు 4000 కావాలి. అంటే జట్ల సంఖ్యను బట్టి అస్థిర పెట్టుబడి ఉంటుంది.
స్థిర పెట్టుబడి కూడా పెరుగుతుంది
 అంతేకాదు జట్లు పెరిగితే వాడే ముడిపదార్ధాలూ, పరికరాలూ మరిన్ని అవసరమవుతాయి. ఒక జట్టుకు కావలసిన పరికరాలూ,ముడిపదార్ధాలూ ఏడు రెట్లు కావాలి. కాబట్టి స్థిరపెట్టుబడి కూడా పెరుగుతుంది. కనుక పెట్టుబడిదారుడి చేతిలో ఉండాల్సిన కనీస పెట్టుబడి పెరుగుతూ పోవాలి అనేది  పెట్టుబడి  కార్ఖానా ఉత్పత్తి స్వభావం మీద ఆధారపడ్డ ఒక నియమం.  సామాజిక ఉత్పత్తిసాధనాలూ, జీవనాధారసాధనాలూ పెట్టుబడిలోకి పరివర్తన చెందుతూ ఉండాలి అనేది నియమం.
శ్రమ ఉత్పాదక శక్తి పెట్టుబడి ఉత్పాదక శక్తి గా అగపడుతుంది
కార్ఖానా ఉత్పత్తిలో సామాన్య సహకారంలో లాగానే, ఉమ్మడిగా పనిచేసేయంత్రాంగం పెట్టుబడి మనుగడ రూపం.విడివిడి విభాగ శ్రామికులతో ఏర్పడ్డ యంత్రాంగం పెట్టుబడిదారుడిది. అందువల్ల శ్రమల కలయిక ఫలితం అయిన ఉత్పాదకశక్తి, పెట్టుబడి యొక్క ఉత్పాదక శక్తిగా అగపడుతుంది.
“అమ్ముకునే దాకా, శ్రమశక్తికి శ్రామికుడే ఓనర్. తనదైన శ్రమశక్తిని మించి అతను అమ్మలేడు. పెట్టుబడి దారుడు ఒక శ్రమశక్తిని కాక 100 శ్రమశక్తుల్ని కొని, ఒకనితో కాక ఒకరితో ఒకరికి సంబంధంలేని 100 మందితో ఒప్పందాలు చేసుకున్నా పరిస్థితిలో తేడా ఉండదు. వాళ్ళని సహకారంలో పెట్టకుండానే పనిచేయించుకోగలడు. 100 స్వతంత్ర శ్రమశక్తుల విలువ  అతను చెల్లించాడు.కానీ ఆ 100మంది సమ్మిళిత శ్రమశక్తికి ఏమీ చెల్లించలేదు.ఒకరికొకరు స్వతంత్రులు కావడం వల్ల, వాళ్ళు ఏకాకులు, ఎవరికివారుగావున్న విడివిడి వ్యక్తులు. పెట్టుబదిదారుడితో సంబంధంలోకి వచ్చే విడివిడి వ్యక్తులు.అంతేగాని వాళ్ళలో వాళ్ళకి సంబంధం లేదు.ఈ సహకారం అనేది శ్రమప్రక్రియతో మొదలవుతుంది. అయితే శ్రమ ప్రక్రియ మొదలయ్యేటప్పటికే శ్రామికులు తమకు తాము చెందకుండా పోతారు. ఆ ప్రక్రియలో ప్రవేశించగానే, పెట్టుబడిలో కలిసిపోతారు. పెట్టుబడిలో అంతర్భాగమవుతారు.”
అతని శ్రమ ఇంకెంత మాత్రమూ అతనిది కాదు. పెట్టుబడిది.
శ్రమ పెట్టుబడికి చెందుతుంది కనుక ఆ శ్రమదైన ఉత్పాదకశక్తి, పెట్టుబడిదైనట్లుగా  అగపడుతుంది.  
కార్మికులలో  ఎక్కువ తక్కువల  తేడాలు
కార్ఖానా ఉత్పత్తి అంతకుముందు స్వతంత్రుడుగా వున్న శ్రామికుణ్ణి పెట్టుబడి క్రమశిక్షణకీ, అజమాయిషీకి లోబరుస్తుంది. అంతేకాదు పనివాళ్ళలోనే ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ, ఇంకొకరు మరీ తక్కువ అనే ఎక్కువ తక్కువల దొంతర (hierarchic gradation) ఏర్పరుస్తుంది.

వ్యష్టి శ్రామికుని మీద శ్రమ విభజన విధించే/ కలిగించే మార్పులు
సామాన్య సహకారం ఒకశ్రామికుని పనివిధానాన్ని చాలా వరకూ మార్పు చేయకుండా అలానే వుంచేస్తుంది. కార్ఖానా ఉత్పత్తి అలా కాదు,అతని పని విధానాన్ని పూర్తిగా, తీవ్రంగా(revolutionises) మార్చివేస్తుంది. శ్రమ శక్తిని కూకటి వేళ్ళతో సహా స్వాయత్తం/స్వాధీనం చేసుకుంటుంది. లాప్లాటా రాష్ట్రాల్లో  తోళ్ళ కోసమో, కొవ్వుకోసమో జంతువునే చంపేవారు. అలాగే  ఒక ముక్క పనిలో ప్రావీణ్యత(detail dexterity) కోసం బలవంత పెడుతుంది. అతనికున్న అనేక ఉత్పత్తి సామర్ధ్యాలనూ, సహజ ప్రేరణలనూ (instincts)  అణగదొక్కుతుంది.  ఒక ముక్కపనిలో నిపుణత కోసం ఎన్నో చేయగల శ్రామికుని శక్తిని బలి పెడుతుంది. బలవంతంగా అతన్ని ఒక అవిటి అనాకారిని చేస్తుంది. ముక్కపని చేయడంలో శ్రామికుణ్ణి దానికది నడిచే (automatic) మోటార్ ని చేస్తుంది. Dugald Stewart calls manufacturing labourers ―living automatons ... employed in the details of the work.‖ (I. c., p. 318.)
శ్రామికుడు వర్క్ షాప్ కి తోక అవుతాడు
మొదట, సరుకు తయారీకి అవసరమైన ఉత్పత్తి సాధనాలు లేక పోవడం వల్ల, తన శ్రమ శక్తిని పెట్టుబడికి అమ్ముతాడు. ఇప్పుడు అదే శ్రమశక్తి పెట్టుబడికి అమ్ముడవకపోతే, అది అతనికి ఉపయోగపడదు. అమ్ముడయిన తర్వాత కార్ఖానాలో మాత్రమే పనులు చెయ్యగలుగుతాడు.  స్వతంత్రంగా ఏదీ చెయ్యలేడు. కనుక కార్ఖానా కార్మికుడు పెట్టుబడిదారుడి వర్క్ షాప్ కి ఉపాంగం (appendage)గా మాత్రమే తన ఉత్పాదక శక్తిని పెంచుకోగలడు. స్టార్చ్(1766-1835) మాటలు కోట్ చేస్తాడు: మొత్తం వృత్తి చెయ్యగల శ్రామికుడు ఎక్కడయినా పనిచేయ్యగలడు, జీవనాధార సాధనాల్ని సంపాదించుకోగలడు. కార్ఖానాలోని విభాగ శ్రామికుడు తోటి వాళ్ళనుంచి వేరయితే, అతనికి ఆసామర్ధ్యమూ ఉండదు, ఆ స్వతంత్రతా ఉండదు. అతను ఒక ఉపాంగం (appendage)మాత్రమే. తన మీద రుద్దబడే ఏ చట్టానైనా ఒప్పుకోక తప్పని స్థితిలో పడతాడు.
తన శ్రమ శక్తిని స్వతంత్రంగా, సొంతంగా ఉపయోగించుకోలేడు. కార్ఖానా దారుని మీద ఆధారపడక తప్పదు.
అందువల్ల శ్రమ విభజన కార్ఖానా కార్మికుణ్ణి పెట్టుబడిదారుడి ఆస్తి గా ముద్ర వేస్తుంది.
విభాగ శ్రామికుడు మేధో పరంగా వికలాంగుడు అవుతాడు
సామాజిక ఉత్పాదక శక్తిలో ఉమ్మడి కార్మికుణ్ణి, అతనిద్వారా పెట్టుబడినీ సంపన్నం చెయ్యడానికి, విడి శ్రామికుణ్ణి అతని వ్యక్తిగత ఉత్పాదక శక్తుల ఎదుగుదలని దెబ్బ తీస్తుంది. విభాగ కార్మికులకు ఆ ముక్క మాత్రమే చేసే నైపుణ్యం ఉంటుంది. మిగిలిన ముక్క పనులు చేసే నైపుణ్యాన్నీ, మేదోసామర్ధ్యాన్నీ  కోల్పోతారు. వాళ్ళు కోల్పోయిన నైపుణ్యాలు వారిని నియోగించే పెట్టుబడిలో చేరతాయి.
కార్ఖానా ఉత్పత్తి వల్ల కలిగే మేధో వికలాంగత్వాన్ని  స్మిత్ స్పష్టంగా వివరించాడు- జీవితాంతమూ చిన్న చర్యలు చేస్తూ ఉండే వాడికి అవగాహనని ఉపయోగించే అవసరం రాదు. సాధారణంగా ఒక మనిషి ఎంతటి అజ్ఞానీ, మూర్ఖుడూ కాగలడో, అంతటి అజ్ఞానీ, మూర్ఖుడూ అవుతాడు... సహజంగానే అతని మనోధైర్యం దెబ్బతింటుంది.
అలాంటి శ్రామికుని మేధ వికసించదు. అవగాహన కుంటుబడుతుంది.
విభాగ శ్రామికుడు శారీరకంగా వికలాంగుడు అవుతాడు
మళ్ళీ స్మిత్ -అతను ఏ పనికైతే నియోగించబడ్డాడో, అది తప్ప మరే పనిలోనూ తన సామర్ధ్యాన్ని పట్టుదలతో ప్రదర్శించలేడు. ఏ నాగరిక సమాజంలోనైనా  శ్రమించే పేదలు తప్పకుండా దిగబడేది ఈ స్థితిలోకే.
విభాగ శ్రామికుని దేహం కూడా వికలాంగం అవుతుంది. ఒకే పని చేసిచేసి మరొక పని చేయలేనిదిగా తయారవుతుంది.
మొత్తం సామాజిక శ్రమ విభజననుండి కూడా ఏదో కొంత మేధో వికలత్వమూ, శరీర వైకల్యమూ విడదీయ విడదీయరానివే. అయినప్పటికీ ఈ శ్రమ శాఖల వేర్పాటుని కార్ఖానా ఉత్పత్తి మరింత ముందుకు తీసుకు పోతుంది. అందువల్ల దాని ప్రత్యేక శ్రమ విభజనతో కార్ఖానా ఉత్పత్తి శ్రామికుణ్ణి అతని జీవిత మూలాల్నే దెబ్బతీస్తుంది. కాబట్టి పారిశ్రామిక వ్యాధినిర్ణయ శాస్త్రానికి (industrial pathology) కావలసిన సమాచారాన్ని అందించి ఆశాస్త్రానికి మొదట ఊపు నిచ్చింది కార్ఖానా ఉత్పత్తే.
ఊర్క్ హార్ట్ (1805-1877) అన్నట్లు : ఒక మనిషిని ఉప విభజన చెయ్యడమంటే- అతను శిక్షించదగిన వాడయితే- అతణ్ణి ఉరితీయడమే; శిక్షార్హుడు కానట్లయితే, అతణ్ణి హత్యచేయ్యడమే.
దోపిడీ సాధనంగా శ్రమ విభజన
కార్ఖానా ఉత్పత్తిలో శ్రమవిభజన  సామాజిక ఉత్పాదక శక్తిని  పెంచుతుంది. అయితే ఇది పెట్టుబడిదారుడి కోసమే, శ్రామికుని కోసం కాదు. శ్రామికుల్ని అవిటివాళ్ళుగా చెయ్యడంద్వారా ఉత్పాదక శక్తిని పెంచుతుంది. అంతేకాదు, శ్రమ మీద పెట్టుబడి పెత్తనం చలాయించడానికి  కొత్త పరిస్థితులు కల్పిస్తుంది. అందువల్ల, ఒకపక్క ఆర్దికాభివృద్ధిలో చారత్రకంగా అవసరమైన, ప్రగతిశీలమైన దశ  అయినట్లు తననుతాను ప్రదర్శించుకున్నా, మరొక పక్క అది నాజూకైనా, నాగరికమైన  దోపిడీ విధానం.

రాజకీయ అర్ధశాస్త్రం కార్ఖానా ఉత్పత్తి దశలో ఒక స్వతంత్ర శాస్త్రంగా అంకురించింది. అది సామాజిక శ్రమ విభజనని  కార్ఖానా ఉత్పత్తి దృక్కోణం నుంచే చూసింది. అంతే సమయంలో మరిన్ని సరుకులు ఉత్పత్తిచేసి, ఫలితంగా సరుకుల్ని చౌక పరిచే సాధనం గా, పెట్టుబడి పోగుబడిని త్వరపరిచే సాధనంగా  చూసింది. అంతకు ముందు రచయితలూ సరుకు నాణ్యతనీ, ఉపయోగపు విలువనీ మాత్రమే పట్టించుకునే వాళ్ళు. పరిమాణాన్నీ, మారకపు విలువనీ కాదు. సరుకులు చౌకవడం గురించీ ఒక్క మాట చెప్పేవారు కాదు.
సామాజిక ఉత్పత్తి శాఖలు వేర్పడడం వల్ల సరుకుల మెరుగవుతాయి. మనుషులు తమ  అభిరుచులకూ, ప్రతిభలకూ తగిన రంగాన్ని ఎంచుకోగలుగుతారు. అంటే, శ్రమ విభజన వల్ల  సరుకులు మెరుగయ్యేవి, వాటి తయారీ దారులూ ప్రయోజనం పొందేవారు.
కార్ఖానా ఉత్పత్తిలో సరుకుల పరిమాణం ముఖ్యం, సరుకులు చౌకబడడమే ప్రధానం. పెట్టుబడిదారుల ప్రయోజాల పెంపుకే ఉత్పత్తి, శ్రామికుల కోసం ఏమాత్రం కాదు.
పెట్టుబడి దృష్టిలో శ్రమ విభజన కున్న పరిమితులు
శ్రమ విభజనకు పరిమితులున్నాయి.అవి పెట్టుబడిదారీ ఉత్పత్తికి పూర్తిగా సరిపడే రూపాన్ని ఇవ్వవు. ఎందుకంటే అది మునుపటి ఉత్పత్తి విధానం మీద నిర్మితమయింది. కార్ఖానా ఉత్పత్తి కార్మికుని నైపుణ్యం మీద ఆధారపడింది. అందువల్లనే నిపుణ శ్రామికుల ప్రతిఘటనా, అవిదేయతా.
పెట్టుబడిదారీ విధానం కార్ఖానా ఉత్పత్తిగా వున్న కాలంలో, దాని ప్రత్యేక పోకడలు పూర్తిగా అభివృద్ధి  కాకుండా ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి.
1.కార్ఖానా ఉత్పత్తి శ్రామికులని నిపుణులుగానూ,  అనిపుణులుగానూ వేరుచేస్తుంది. మెట్ల వారీ అమరిక ఏర్పరుస్తుంది. కొందర్ని పైస్థాయిలో పెడితే, కొందర్ని కింది స్థాయిలోనూ, ఇంకొందర్నిమధ్య నెక్కడో పెడుతుంది. అయినప్పటికీ అనిపుణుల సంఖ్య చాలా పరిమితంగానే ఉంటుంది. ముక్కపనిని స్త్రీలూ, పిల్లలూ చేయగలిగేటట్లు మలుస్తుంది. వాళ్ళనీ దోచుకోడానికి అనుకూలం చేస్తుంది. అయితే ఈ ధోరణిమొత్తం పురుష శ్రామికుల ప్రాతిఘటన మూలంగా భంగం అవుతుంది.
2.చేతివృత్తుల్ని విడగొట్టడం వల్ల, శ్రామికుడు పని నేర్చుకోడానికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా అతని శ్రమశక్తి విలువ తగ్గిపోతుంది. అయినప్పటికీ కష్టతరమైన ముక్కపని నేర్చుకోడానికి ఎక్కువ కాలం పడుతుంది. అంతగా అవసరంలేని చోట కూడా పనివాళ్ళు అంత ఉండాలంటూ పట్టుబడుతుంటారు. ఉదాహరణకు ఇంగ్లండ్ లో పనినేర్వాల్సిన (probation) కాలం ఏడేళ్ళు. అది  కార్ఖానా ఉత్పత్తి ముగిసేదాకా అమల్లోనే ఉంది. ఆధునిక పరిశ్రమ వచ్చేదాకా అది పోలేదు.
3. కార్ఖానా ఉత్పత్తికి చేతివృత్తి నైపున్యమే ప్రాతిపదిక కనుకా, కార్ఖానా ఉత్పత్తి యొక్క యంత్రాంగానికి (mechanism) శ్రామికులు మినహా మరే చట్రమూ లేనందువల్లా, పెట్టుబడి శ్రామికుల అవిదేయతతో ఎప్పుడూ శిగపట్లు పట్టక తప్పేది కాదు.
కార్ఖానా ఉత్పత్తికి చేతివృత్తి నైపుణ్యమే ప్రాతిపదిక కనుకా, కార్ఖానా ఉత్పత్తి యొక్క యంత్రాంగానికి (mechanism) శ్రామికులు మినహా మరే చట్రమూ లేదుకనకా, పెట్టుబడి శ్రామికుల అవిదేయతతో ఎప్పుడూ కుస్తీ పట్టక తప్పేది కాదు. మిత్రుడు ఉరే (1778-1857) ఇలా అంటాడు: కార్మికుడు ఎంత నిపుణుడు అయితే, అంతగా మాటవినని మొండిఘటంగా తయారవుతాడు.అందువల్ల ఒక యాంత్రిక వ్యవస్థలో భాగంగా ఇమడడానికి అంత తక్కువగా తగి ఉంటాడు. ఆ మొత్తం వ్యవస్థకి అతను పెద్ద నష్టం కలిగించవచ్చు.

అందువల్ల కార్ఖానా ఉత్పత్తి దశ అంతటిలోనూ పనివాళ్ళకి క్రమశిక్షణ లేదనే ఫిర్యాదులు వినవస్తాయి. సమకాలీన రచయితల సాక్ష్యాధారాలు లేకపోయినా, ఈ క్రింది వాస్తవాలు వాటిని  చాటి చెప్తున్నాయి: 16 వ శతాబ్దానికీ, ఆధునిక పరిశ్రమకీ మధ్య కాలం కార్ఖానా కార్మికులు వినియోగించా గలిగిన పూర్తిపనికాలానికి యజమానిగా తన అధీనంలో పెట్టుకోలేక పోయింది. ఈ విషయంలో పెట్టుబడి విఫలమైంది.
కార్ఖానాలు కొద్దికాలమే మనుగడలో ఉండేవి. వలస పోయే పనివారితోనూ, వలస వచ్చే పనివారితోనూ పరిశ్రమలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలి పోవాల్సి వచ్చేది.
అదే సమయంలో కార్ఖానా ఉత్పత్తి సమాజ ఉత్పత్తిని పూర్తిస్థాయిలో అధీనంలో పెట్టుకోలేకపోయింది; ఆ ఉత్పత్తిని ఆసాంతంగా విప్లవీకరించలేకపోయింది. అది పట్టణ చేతివృత్తుల, గ్రామీణ గృహ పరిశ్రమల విస్తృత పునాది మీద ఆర్ధిక నిర్మాణంగా పైకి లేచింది. దాని అభివృద్ధిలో ఒక దశ వద్ద,  కార్ఖానా ఉత్పత్తి ఆధారపడ్డ సంకుచిత సాంకేతిక పునాది, అదే కార్ఖానా ఉత్పత్తి సృష్టించిన ఉత్పత్తి అవసరాలతోనే ఘర్షణలో పడ్డది.
అయితే ఈ ప్రతిష్టంభన నుండి బయటబడే మార్గాన్ని కార్ఖానా ఉత్పత్తే ఏర్పాటుచేసింది – యంత్రాలను ఉత్పత్తి చెయ్యడం ద్వారా.

యంత్రాల ఉత్పత్తి
 కార్ఖానా ఉత్పత్తి యొక్క పరిపూర్ణ సృజనలలో శ్రమసాధనాల ఉత్పత్తి ఒకటి. ఆసాధనాల్లో ప్రత్యేకించి అప్పటికే వాడుకలోవున్న సంక్లిష్ట యంత్ర పరికరాలు కూడా ఉన్నాయి. కార్ఖానా శ్రమవిభజన మీద ఆధారపడ్డ వర్క్ షాప్ యంత్రాలను తయారు చేసింది. సామాజిక ఉత్పత్తిని నియంత్రించే నియమంగా చేతివృత్తి దారుల పనిని అవే యంత్రాలు తుడిచి వేశాయి.  ఆవిధంగా ఒకపక్క, ముక్క పనికి జీవితాంతమూ కార్మికుణ్ణి కట్టిపడేసిన సాంకేతిక అవసరం తొలిగిపోయింది. మరొకపక్క, ఇదేనియమం  పెట్టుబడి ఆధిపత్యాన్ని బంధించిన సంకెళ్ళు తెగిపోయాయి.
యంత్రాలు వచ్చేదాకా పెట్టుబడి  శ్రామికుల శక్తి సామర్ధ్యాలమీద ఆదారపడి ఉండేది. కనుక దాని ఆధిపత్యం ఎంతో కొంత కట్టడిలో వుండేది. యంత్రాల రాకతో ఆకట్లు వీడిపోయాయి. ఇక పెట్టుబడి ఆధిపత్యం ఊపందుకుంది.
వచ్చే పోస్ట్ : యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి