5, ఏప్రిల్ 2016, మంగళవారం

రంగనాయకమ్మ పరిచయం చేసింది మార్క్సునేనా?

రంగనాయకమ్మ పరిచయం చేసింది మార్క్సునేనా?
వీక్షణం 2016 ఏప్రిల్ సంచికలో వచ్చింది                                            ఇ.యస్.బ్రహ్మాచారి
మార్క్స్ కాపిటల్ పరిచయం పేరుతో రంగనాయకమ్మగారి రచన వెలువడిన తర్వాత ‘మార్క్స్ చెప్పిందేమిటీ? రంగనాయకమ్మగారు రాసిందేమిటి? అని దిలీప్, నేను కలిసి 1994 ఫిబ్రవరిలో ఒక 28 పేజీల చిన్న పుస్తకం అచ్చువేశాం. “అదనపు విలువ సిద్ధాంతం గురించి మార్క్స్ చెప్పిందొకటైతే, రంగనాయకమ్మగారు చెప్పిందింకొకటి. అలాగే ఉత్పాదక అనుత్పాదక శ్రమల విషయంలో మార్క్సే తప్పుగా ఉన్నట్లు చెప్పారు. వీటి గురించి తరవాత వివరంగా రాయవలసి వుంది” అని ఆ పుస్తకాన్ని ముగించాము. ఆ తర్వాత ఆమె తన పాత పరిచయానికి సవరణలు చేసి కొత్త పరిచయం (2004) కూడ ప్రచురించారు. ఇప్పుడు వీక్షణం 2013 జూన్, జులై సంచికల్లో ‘శ్రమశక్తి ఉపయోగపువిలువ గురించి’అనే వ్యాసంలో ఆమె మరికొన్ని ప్రతిపాదనలు చేశారు.
అదనపు విలువ విషయంలో రంగనాయకమ్మ గారి తప్పుడు వాదనల గురించి వీక్షణం 2015 సెప్టెంబర్ సంచికలో ‘అదనపు విలువ గురించి మార్క్స్ చెప్పిందేమిటి?’, వీక్షణం 2016 జనవరి సంచికలో వాగ్నర్ నుంచి రంగనాయకమ్మ వరకు కాపిటల్ వక్రీకరణలు’  వ్యాసాల్లో చర్చించాను. ఆ వ్యాసాలను క్రోడీకరిస్తే,
మార్క్స్ చెప్పింది
రంగనాయకమ్మగారు చెప్పింది
పెట్టుబడికీ శ్రమశక్తికీ  సమాన మారకం
అసమాన మారకం
మారకం ఉంది
అసలు మారకమే లేదు
శ్రమశక్తి సరుకు
శ్రమశక్తి సరుకు కాదు

మార్క్స్ చెప్పినదీ రంగనాయకమ్మగారు రాసినదీ వేరు వేరు మాత్రమే కాదు, వ్యతిరేకమయినవి. అసమాన మారకం (ఇచ్చేది తక్కువ పుచ్చుకునేది ఎక్కువ) వల్లనే పెట్టుబడిదారు అదనపు విలువ పొందుతాడు అని మార్క్స్ కి ముందు కొందరు భావించారు. ఆ వాదం శాస్త్రీయమైనది కాదనీ, సమాన మారకం జరుగుతూనే అదనపు విలువ ఏర్పడుతుందనీ మార్క్స్ చెప్పాడు. వాళ్లు అనుకున్నట్టుగా మారకం జరిగేది శ్రమకీ, పెట్టుబడికీ కాదనీ, శ్రమశక్తికీ పెట్టుబడికీ అనీ శ్రమశక్తి అనే కొత్త భావనను ప్రవేశపెట్టాడు. ఆ ఆధారం మీదనే అదనపు విలువని రుజువు చేశాడు. మరి అందుకు భిన్నంగా ‘అసమాన మారకం’, ‘మారకమే లేదు’, ‘శ్రమశక్తి సరుకే కాదు’ అని వాదించడం అంటే మార్క్సుని తోసివేసినట్టే.
ఇక్కడే మరొక విషయం ఉంది. గతంలో అసమాన మారకం అన్నవాళ్లు కూడ ‘మారకం లేదు’ అనలేదు. అసమాన మారకం అన్నా మారకం ఉన్నట్టే. కాని ‘అసమాన మారకం’ అంటూనే ‘మారకం లేదు’ అనడం రంగనాయకమ్మగారి సొంతం. రంగనాయకమ్మగారి పరిచయంలో పెట్టుబడిదారుడికీ, కార్మికులకూ మధ్య అసలు మారకమే లేదు అని ఒక ఉప అధ్యాయమే ఉంది. మారకమే లేకపోతేశ్రామికుడు పనిస్థలంలోకి వచ్చి ఎందుకు పనిచేస్తాడు? మారకం జరిగితేనే, ఉత్పత్తి ప్రక్రియ మొదలు అవుతుంది. కనుక మారకం అనివార్యం.
రంగనాయకమ్మ గారు పరిచయంలో శ్రమశక్తి సరుకు అనే రాశారు. అది సరుకు కాదని అనలేదు. వీక్షణం వ్యాసంలో (2013 జూన్, జులై - 'శ్రమశక్తి ఉపయోగపువిలువ గురించి') ‘శ్రమశక్తి సరుకు కాదు’ అని కొత్తగా ప్రతిపాదించారు. అలా ఆమె మార్క్స్ మౌలిక ప్రాతిపదికనే మారుస్తున్నారు. అంటే ఆమె తన పరిచయాన్ని 'శ్రమశక్తి సరుకు కాదు' అనే దానికి అనుగుణంగా తిరగరాయాల్సి వుంటుంది. అదనపు విలువ సిద్ధాంతం గురించి మార్క్స్ చెప్పిందొకటైతే, రంగనాయకమ్మగారు చెప్పిందింకొకటి అవుతుంది.
**
ఇక ఉత్పాదక అనుత్పాదక శ్రమలగురించి చూద్దాం.
పెట్టుబడిదారు శ్రామికుని శ్రమశక్తిని కొంటాడు. అంటే, శ్రమశక్తికీ పెట్టుబడికీ మారకం జరుగుతుంది. శ్రమశక్తి యజమానికి అమ్ముకునేందుకు సరుకుల్ని ఉత్పత్తి చేస్తుంది. అదనపు విలువని ఉత్పత్తిచేస్తుంది. పెట్టుబడిదారు పెట్టిన డబ్బుని పెంచుతుంది. అటువంటి శ్రమ ఉత్పాదక శ్రమ. వీటిలో ఏదైనా ఒకే సారాన్ని తెలుపుతుంది. పెట్టుబడితో మారకం జరిగే శ్రమ, యజమాని కొరకు సరుకుల్ని ఉత్పత్తిచేసే శ్రమ, అదనపు విలువని ఉత్పత్తిచేసే శ్రమ,యజమాని డబ్బుని పెంచే శ్రమ అంటూ ఉత్పాదకశ్రమని మార్క్స్ నిర్వచించాడు. మార్క్స్ మాటల్లో “డబ్బుని పెట్టుబడిగా మార్చే శ్రమ ఉత్పాదక శ్రమ”(అదనపు విలువ సిద్ధాంతాలు 1.399), “అదనపు విలువని నేరుగా ఉత్పత్తిచేసే శ్రమ ఉత్పాదక శ్రమ” (కాపిటల్, పెంగ్విన్ 1.1038), “ఉత్పాదక శ్రామికుడు శ్రమశక్తిని కొన్నవాడికి సరుకులు ఉత్పత్తిచేస్తాడు.” (అ.వి.సి. 1.160).
పెట్టుబడితో కాక వ్యక్తుల ఆదాయంతో మారకం జరిగినప్పుడు అనుత్పాదక శ్రమ. ఉపయోగపు విలువలను ఉత్పత్తి చేసే శ్రమ, విలువని ఉత్పత్తి చెయ్యని శ్రమ అనుత్పాదక శ్రమ. మార్క్స్ మాటల్లో “అదనపు విలువని ఉత్పత్తి చెయ్యని శ్రమ అనుత్పాదక శ్రమ”, “అనుత్పాదక శ్రామికుడు ఉపయోగపు విలువలు ఉత్పత్తిచేస్తాడు.” (అ.వి.సి. 1.160)
రంగనాయకమ్మగారు ఈ నిర్వచనాలను ఆమోదించారు: వారిమాటల్లో: “అదనపు విలువని ఉత్పత్తి చెయ్యని శ్రమ అనుత్పాదక శ్రమ” (కొత్త పరిచయం, 2004, 1.421), “విలువగా మారకుండా ఉపయోగపు విలువగానే ఖర్చయ్యే శ్రమ అదనపు విలువని ఇవ్వదు, అందులో అదనపు శ్రమ ఉన్నప్పటికీ. అది అనుత్పాదక శ్రమ అవుతుంది” (కొత్త పరిచయం 1.422)
రెంటికీ తేడా అదనపు విలువని ఉత్పత్తి చెయ్యడం, చెయ్యకపోవడం. అంతే, మరే అంశంతోనూ సంబంధంలేదు.
ఆడం స్మిత్ ఉత్పాదక శ్రమకూ, అనుత్పాదక శ్రమకూ చెప్పిన తేడాను రికార్డో, సిస్మాండిలు ఆమోదించారు. రెంటికీ తేడా ఏమంటే, ఒకటి ఎప్పుడూ తన శ్రమని పెట్టుబడితో మారకం చేసుకుంటుంది, మరొకటి తన శ్రమని ఎప్పుడూ దేశ ఆదాయం లోని ఒక భాగంతో మారకం చేసుకుంటుంది” (అ.వి.సి. 1.177) స్మిత్ ఇక్కడ గుండెకాయను చేరుకున్నాడనీ, నేరుగా పెట్టుబడితో మారకం అయ్యే శ్రమగా ఉత్పాదక శ్రమని నిర్వచించాడనీ, అలా నిర్వచించగలగడం అతని శాస్త్రీయ ఘనతల్లో ఒకటనీ మార్క్స్ అన్నాడు.
శ్రమ మారింది డబ్బుతోనా లేక పెట్టుబడిగా వున్న డబ్బుతోనా అనేదే ఆ తేడా. “శ్రమకి ఉత్పాదక, అనుత్పాదక తేడాలు ఏర్పడేది, అది అదనపు విలువని ఇస్తోందా లేదా అనేదాన్ని బట్టి” (కొత్త పరిచయం 1.422), "ఉత్పాదక శ్రమలు 'పెట్టుబడి'తో సంబంధంలో ఉంటే, అనుత్పాదక శ్రమలు ఆదాయంతో సంబంధంలో ఉంటాయి” (కొత్త పరిచయం 1.428).
ఇంతవరకూ మార్క్స్ చెప్పినదీ, రంగనాయకమ్మగారు రాసినదీ ఒకటే. తేడా ఏమీ లేదు. ఇక ఈ నిర్వచనాన్ని బట్టి ఏది ఉత్పాదక శ్రమో, ఏది అనుత్పాదక శ్రమో తేల్చాలి. ఏది ఉత్పాదక శ్రమో తేల్చేచోట రంగనాయకమ్మగారికి మార్క్సుతో  పూర్తి  ఏకీభావం ఉంది. అనుత్పాదక శ్రమ విషయంలో మాత్రం మార్క్స్ కొన్ని పొరపాట్లు చేశాడని, తప్పు మీద తప్పు చేశాడని ఆమె అంటున్నారు (కొత్తపరిచయం 1.500-507).
ఆ తప్పులేవో చూద్దాం.
మార్క్స్ అనుత్పాదక శ్రామికుడికి ఉదాహరణగా పియానో శ్రామికుణ్ని చూపాడు. ఎవరైనా పియానోని మార్కెట్లో కొనుక్కోవచ్చు లేదా ఇంటిదగ్గరే తయారు చేయంచుకోవచ్చు. “షాపులో కొనే బదులు నా ఇంట్లోనే చేయించుకున్నాను అనుకుందాం. అప్పుడు పియానో చేసిన శ్రామికుడు అనుత్పాదక శ్రామికుడు. ఎందుకంటే అతని శ్రమకూ నా ఆదాయానికీ మారకం జరిగింది గనక.” (అ.వి.సి. 1.160) అని మార్క్స్ అన్నాడు.
రంగనాయకమ్మగారు దీనికి ఒప్పుకోవడం లేదు. “ఒకరి ఇంటికి వచ్చి వాళ్ల స్వంత వాడకం కోసం పియానో చేసి ఇచ్చిన పనివాడిని మార్క్సు అనుత్పాదక శ్రామికుడు అంటున్నాడు. కానీ ఇది పొరపాటు” అంటున్నారు.
నిజానికి మొదట్లో  రంగనాయకమ్మగారు ఇచ్చిన నిర్వచనం ప్రకారం అతడు అనుత్పాదక శ్రామికుడే అవుతాడు. “ఒక శ్రమని గాని, ఆ శ్రమతో తయారైన వస్తువుల్ని గాని అమ్మకపోతే, ఆ శ్రమకు బదులుగా డబ్బురాదు. అందులోవున్న అదనపు శ్రమ కూడా డబ్బుగా మారదు. విలువగా మారని శ్రమ అదనపు విలువని ఇవ్వదు (కొత్త పరిచయం 1.422).
అతని శ్రమ పియానోని అమ్ముకునే సరుకుగా ఉత్పత్తి చెయ్యలేదు. వాడుకునే వాయిద్య వస్తువుగా తయారుచేసింది. దాన్ని అమ్మి డబ్బు చేసుకోవడం లేదు కనుక పియానో చేసిన శ్రామికుని శ్రమ అదనపు విలువని ఉత్పత్తి చెయ్యదు. “అదనపు విలువని ఉత్పత్తిచెయ్యని శ్రమ అనుత్పాదకశ్రమ” (కొత్త పరిచయం 1.421) అని రంగనాయకమ్మగారి నిర్వచనం. పియానో కార్మికుని శ్రమ అదనపు విలువగా మారలేదు గదా. అలాంటప్పుడు అనుత్పాదక శ్రమే కదా! అతడు అనుత్పాదక శ్రామికుడే అవుతాడు కదా!
కాని కాదంటున్నారు రంగనాయకమ్మగారు. అనుత్పాదక శ్రామికుడు అనడం మార్క్స్ పొరపాటు అని తేలుస్తున్నారు. మరి అనుత్పాదక శ్రామికుడు కాకపోతే అతను ఎవరు? పియానో శ్రామికుడు ‘స్వతంత్ర ఉత్పత్తిదారుడిగా (స్వతంత్ర శ్రామికుడిగా) లెక్కకు రావాలి’ అంటున్నారు. వారిచ్చిన నిర్వచనం ప్రకారం అతడు అనుత్పాదక కార్మికుడే అవుతాడు గనుక నిర్వచనాన్నే మార్చేశారు. అందుకు అవసరమైన సొంత అంశాల్ని చొప్పించారు. దాని ప్రకారం అనుత్పాదక శ్రామికుణ్ణి స్వతంత్ర ఉత్పత్తిదారుడిగా తీర్చిదిద్దారు.
తమ సొంతశ్రమతో సరుకులు చేసి అమ్ముకునేవాళ్లు స్వతంత్ర ఉత్పత్తిదారులు. వాళ్లు కూలి ఇచ్చి ఇతర పనివాళ్లని పెట్టుకోరు. అలాగే వాళ్లు ఇతరుల దగ్గరకి కూలిపనికి పోరు. సరుకులకు యజమానులే, కాని కార్మికులకు కాదు. శ్రామికులే, కాని మరొకరి దగ్గర పనిచేసే వేతనశ్రామికులు కారు. ఉదాహరణకు ఒక నేతగాడు తన ఇంట్లో మగ్గం, ఇతర పరికరాలూ పెట్టి, కావలసిన దారమూ ఇతర ముడిపదార్ధాలూ కొని దుప్పట్లూ, తుండుగుడ్డలూ నేసి ఇంటిదగ్గరో, బజార్లు తిరిగో అమ్ముకుంటూంటాడు. అతను స్వతంత్ర ఉత్పత్తిదారుడు. అలాంటివాళ్లు మనకి చాలామంది తారస పడుతుంటారు. కూరలు అమ్మే కర్రీపాయింట్ వాళ్లు, ఇనప వస్తువులు ఇళ్లదగ్గర తయారుచేసి అమ్మేవాళ్లూ ఈకోవకి చెందుతారు. వీళ్లు మరొకరిని పనికి పెట్టుకోరు, వేరొకరి వద్ద పనికిపోరు. దీన్నిబట్టి వేతన కార్మికులైనవారు స్వతంత్ర ఉత్పత్తిదారులు కారు. స్వతంత్ర ఉత్పత్తిదారులైనవారు వేతనకార్మికులు కారు. స్వతంత్ర ఉత్పత్తిదారులు ఉత్పత్తిచేసిన శ్రమ విలువ మొత్తం పొందుతారు. కాని వేతనశ్రామికులు పొందరు. ఉత్పాదకశ్రామికుల అదనపు శ్రమ విలువగా మారి యజమానికి పోతుంది. అనుత్పాదక శ్రామికుల అదనపు శ్రమ యజమానిది అవుతుంది. కాని, ఈ యజమాని చేయించుకున్న వస్తువుని అమ్మడం లేదు కనక విలువ రూపంలో చేతికి అందదు.
“స్వతంత్ర ఉత్పత్తిదారులు అంటే, తమకు యజమాని లేని, తాము యజమానులుగా లేని, ఉత్పత్తిదారులు” (కొత్త పరిచయం 1.157) అనే నిర్వచనం పియానో శ్రామికుడికి వర్తిస్తుందా అనేది తేల్చాల్సిన విషయం.
ఉత్పత్తి సాధనాలు - శ్రమ పరికరాలూ, శ్రమ (ముడి) పదార్ధాలూ - పెట్టుబడిదారులకు ఉన్నట్లే స్వతంత్ర ఉత్పత్తిదారులకూ ఉంటాయి. పెట్టుబడిదారు వేతన శ్రామికుల చేత ఉత్పత్తి చేయిస్తాడు. స్వతంత్ర ఉత్పత్తిదారు తన శ్రమతో ఉత్పత్తిచేస్తాడు -  ఇదీ తేడా. వేతన శ్రామికుడికి ఉత్పత్తిసాధనాలు ఉండవు. కనక శ్రమశక్తిని అమ్ముకొని వేతన శ్రామికుడిగా ఉంటాడు. పియానో చేసిచ్చిన శ్రామికుడు వేతన శ్రామికుడు. చేయించుకున్నవాడు  వినియోగదారుడు.
“పియానోకి కావలసిన మెటీరియల్స్ అన్నీ నేనే కొనుక్కున్నాననీ, పియానోని షాపులో కొనడానికి బదులు దాన్ని నేను ఇంటిదగ్గరే తయారు చేయించుకున్నాననీ ఊహించండి. పియానోని చేసిన పనివాడు ఇప్పుడు అనుత్పాదక శ్రామికుడు. ఎందుకంటే, అతని శ్రమ, నా ఆదాయంతో మారకం అవుతోంది గనక” అన్నాడు మార్క్స్. (అ.వి.సి. 1.160) దీన్ని ఉటంకించి రంగనాయకమ్మగారు మార్క్స్ పొరపాటు పడ్డాడన్నారు (కొత్త పరిచయం 1.501).
మెటీరియల్ అతనిది కాదు. శ్రమ వరకే అతనిది. చేసినపనికి కూలి తీసుకుంటాడు. అతను అమ్మేది పియానోని కాదు, పియానోను చేసిన శ్రమని. కనక అతను వేతన శ్రామికుడు. అనుత్పాదక శ్రామికుడు. రంగనాయకమ్మగారన్నట్లు స్వతంత్ర ఉత్పత్తిదారుడయితే, మెటీరియల్స్ అతనే కొనుక్కొని, పియానో చేసి దాన్ని అమ్ముకుంటాడు.  ఇక్కడ మెటీరియల్స్ అతనివి కావు, పియానో అతనిది కాదు, దాన్ని అతను సరుకుగా అమ్మలేడు. అతన్ని స్వతంత్ర ఉత్పత్తిదారుడు అనడం తప్పు.
మరి రంగనాయకమ్మగారు ఏ నిర్వచనం ప్రకారం అతను అనుత్పాదక శ్రామికుడు కాడని అంటున్నారు? మార్క్స్ నిర్వచనానికి ఆమె కొత్త అంశాలు జోడించడం ద్వారా ఆ మాట అంటున్నారు.
“ఒక పనివాడు అనుత్పాదక శ్రామికుడిగా లెక్కకు రావాలంటే, అతను ఒక ఇంటిలోగానీ, ఒక ఉత్పత్తిస్థలంలో గానీ ఒక యజమాని కింద జీతానికి పనిచేసే వేతన శ్రామికుడిగా ఉండాలి. అలాకాని వ్యక్తి అనుత్పాదక శ్రామికుడు కాడు” అని రంగనాయకమ్మగారు కొత్త నిర్వచనం ఇచ్చారు. (కొత్త పరిచయం 1.501). ఇది మార్క్స్ కి తెలియని విషయం.
మన పియానో శ్రామికుడు ఒక యజమానికింద జీతానికి పనిచేసేవాడు కాడు. విడిగా పని చేస్తాడు. కనక రంగనాయకమ్మగారికి అతను అనుత్పాదక శ్రామికుడు కాడు. మరొకచోట మెటీరియల్ ఇచ్చి కుట్టించుకున్న విడిదర్జీని అనుత్పాదక శ్రామికుడు అన్నాడు మార్క్స్. రంగనాయకమ్మగారి ప్రకారం ఇది తప్పు. ఒక యజమానికింద లేడు కనక అతనూ అనుత్పాదక శ్రామికుడు కాడు. పరుపులు కుట్టేవాళ్లుంటారు. వాళ్లలో ఒక యజమానికింద ఉండనివాళ్లూ ఉంటారు. బజార్లో తిరుగుతూ పిలిస్తే వచ్చి కొత్తవి కుట్టిపెడతారు, లేదా పాతవి బాగుచేస్తారు. మెట్టుదగ్గర కార్మికులు చేరతారు. వాళ్లూ ఒక యజమానికింద ఉండరు. ఎవరు పిలిచినా వెళ్లి పనిచేసి కూలీ తీసుకుంటారు. వీళ్లను మార్క్స్ అనుత్పాదక శ్రామికులు అని అంటేకాదు అలా అనడం తప్పు అంటారు రంగనాయకమ్మగారు. ఇలాంటివాళ్లు స్వతంత్ర ఉత్పత్తిదారుల కిందికి వస్తారు అంటారు.
స్వతంత్ర ఉత్పత్తిదారుడు తయారుచేసిన సరుకు అతనిదే. అతనే అమ్ముకుంటాడు. వేతన కార్మికుడు ఉత్పాదక శ్రామికుడైనా, అనుత్పాదక శ్రామికుడైనా ఉత్పాదితం అతనిది కాదు. పియానోలకు కావలసిన మెటీరియల్ కొనుక్కొని తానే పియానోలు చేసి వాటిని అమ్మేవాడు స్వతంత్ర ఉత్పత్తిదారుడు. మన పియానో శ్రామికుడు అలాంటివాడు కాడు. కేవలం పియానో చేసి పెట్టే  వేతన శ్రామికుడు. అనుత్పాదక శ్రామికుడు.
రంగనాయకమ్మగారి ప్రకారం శ్రమ (ఉత్పత్తిచేసిన) విలువ అంతా  శ్రామికునికి దక్కితే, ఆ శ్రామికుడు స్వతంత్ర ఉత్పత్తిదారుడు. పియానో శ్రామికునికి అతని శ్రమ (ఉత్పత్తిచేసిన) విలువ అంతా దక్కుతుంది. కనక స్వతంత్ర ఉత్పత్తిదారుడు. ఇదీ వారి వాదం.
“పియానో విలువ 60C+20V+20S = 100 గా ఉందనుకుందాం. పియానోలు తయారుచేసే వ్యక్తి, ఒక పెట్టుబడిదారు దగ్గర పనిచేస్తే, అతను ఒక పియానో చేసినప్పుడల్లా, 20V+20S = 40 శ్రమ చేస్తాడు. ఆ శ్రామికుడినించి పెట్టుబడిదారుడికి 20S పోతూ ఉంటుంది. కానీ, ఆ శ్రామికుడు, ఒకరి ఇంటికివెళ్లి, పియానోని చేసి పెడతాడనుకుందాం. పియానోకి అవసరమయ్యే 60Cని ఆ ఇంటివాళ్లే తెచ్చుకుంటారు. ఆ 60 C మీద శ్రామికుడు తన 40 శ్రమ కలుపుతాడు. పియానో తయారవుతుంది. దాన్ని చేయించుకున్నవాళ్లు, దాన్ని చేసిన వ్యక్తికి 40 ఇస్తారు. పియానో విలువ 100 అవుతుంది. చేసిన వ్యక్తికి 40 రావడం అంటే, అతని శ్రమ విలువ అంతా అతనికే అందింది. కాబట్టి, ఈ వ్యక్తి అనుత్పాదక శ్రామికుడు కాడు. స్వతంత్ర ఉత్పత్తిదారుడు అవుతాడు. ఈ వ్యక్తి, పియానోల ఉత్పత్తి సంస్థలో ఉత్పాదక శ్రామికుడిగా ఉంటూనే, ఎవరి ఇళ్లకైనా వెళ్లి పియానోలు చేసిపెడితే, ఆ సంబంధంలో 'స్వతంత్ర ఉత్పత్తిదారుడే (కొత్తపరిచయం 1.501) అంటున్నారు రంగనాయకమ్మగారు.
40 ఎందుకిస్తారు? ఇవ్వరు. వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఏపని చేసేవాడికైనా కూలి ఇంత అని అందరికీ తెలిసే ఉంటుంది. దాని ప్రకారం ఇమ్మంటారు, ఇస్తారు. ఇది అందరికీ తెలిసినదే, రోజూ జరిగేదే. ఉత్పాదక శ్రామికులకి ఇచ్చినట్లే వారి వేతనం ఉంటుంది. రోజుకూలికి చేసే పనివాళ్లు చాలామంది కనబడతారు. పిలిస్తే వచ్చి పనిచేసి, రోజు కూలి తీసుకుంటారు. ఎంత అని అడిగితే మేస్త్రి 400 రూపాయలిస్తాడు, అంతే ఇవ్వమంటారు. అందుకే, ఇటువంటి ఒక ఉదాహరణలో మార్క్స్ ఇంటికొచ్చి పనిచేసిన అనుత్పాదక దర్జీ శ్రమధర “ఉత్పాదక దర్జీ పొందేదాన్ని బట్టి నిర్ణయమవుతుంది” అంటాడు (అ.వి.సి. 1.402) కాబట్టే వీరిని అనుత్పాదక శ్రామికులు అన్నాడు మార్క్స్. రంగనాయకమ్మగారి దృష్టిలో, ఏరోజుకారోజు పని వెదుక్కునే వీళ్లు స్వతంత్ర ఉత్పత్తిదారులు!
వాస్తవానికి, వీరి వేతనం శ్రమశక్తి విలువే కాని ఉత్పత్తయిన మొత్తం విలువ కాదు. పియానో చేసిచ్చినవాడు కూలికి పనిచేసే శ్రామికుడు. కనక అతడు అదనపు శ్రమ చేస్తాడు. అది చేయించుకున్న వానికి దక్కుతుంది. శ్రామికుడి శ్రమ (ఉత్పత్తిచేసిన) విలువ అంతా అతనికి దక్కదు. దక్కుతుంది అనడం తప్పు.
అనుత్పాదక శ్రమలు అదనపుశ్రమని ఇస్తాయని ఒకచోటా, ఇవ్వవని ఒకచోటా చెప్పినట్లు అయింది. ఈ పరిస్థితి మనల్ని మొదట చాలా అయోమయంలో పడేస్తుందిఅన్నారు రంగనాయకమ్మగారు. అయితే మార్క్స్ అనుత్పాదక శ్రామికుడు అదనపు శ్రమ చేస్తాడనే చెప్పాడు. చెయ్యడని ఎక్కడా చెప్పలేదు. అనుత్పాదక శ్రామికుడైనా, ఉత్పాదకశ్రామికుడి లాగే అదనపు శ్రమ చేస్తాడు. పియానో శ్రామికుడు వేతన శ్రామికుడే. ఏపనిలోనైనా, రోజుకూలికి చేసే పనివాళ్లు చాలామంది కనబడతారు. ఒక్కో పనిచేసేవాళ్లు ఒక్కోచోట చేరి పనిచేయించుకునే వాళ్లకోసం చూస్తుంటారు. పిలిస్తే వచ్చి పనిచేసి రోజుకూలి తీసుకుంటారు. పియానో చేసిన కార్మికుడయినా అంతే. అలాగే తీసుకుంటాడు. ఉత్పాదక శ్రామికుడి లాగే అదనపు శ్రమ చేస్తాడు.
ఈ కొటేషన్ లో, మొదటి వాక్యాల్లో కూడా ఒక పొరపాటు ఉంది. ఒక ఇంటివాళ్లు ఒక కుట్టుమనిషిని ఇంటికి పిలిపించుకుని కోటు కుట్టించుకుంటే, అతని శ్రమవిలువ అంతా (20v+20s=40) చెల్లిస్తారు. అది యజమానీ శ్రామిక సంబంధం కాదు. ఇది సరిగానే ఉంది" అంటున్నారు రంగనాయకమ్మగారు.
అయితే మార్క్స్ ఆ శ్రామికుణ్ణి గృహసేవకుడితో పోల్చి అనుత్పాదక శ్రామికుడు అన్నాడు. అంతేగాని అతని శ్రమవిలువ అంతా (20v+20s=40) చెల్లిస్తారు అనలేదు. శ్రామికునికి వచ్చేది శ్రమశక్తి విలువ మాత్రమే. శ్రమ సృజించిన విలువకాదు అని మార్క్స్ పదేపదే చెబుతాడు.
అంతేకాదు, అది యజమానీ శ్రామిక సంబంధం కాదు అని మార్క్స్ అనలేదు. అనకపోయినా ఆయన అలా అన్నట్లూ, అది సరైనదే అయినట్లూ రంగనాయకమ్మగారు చెబుతున్నారు. ఇది ఆయన చెప్పనిదాన్ని, ఆయనకు ఆపాదించడమే.
ఇంతకూ ఈ స్వతంత్ర ఉత్పత్తిదారుకు యజమాని లేడు అని రంగనాయకమ్మగారు ఎలా తేల్చారు? ఆంటర్ ప్రెనర్ అనే మాటను యజమాని అని అనువాదం చెయ్యడం ద్వారా!
ఆంటర్ ప్రెనర్ అనేవాడు యజమానే. లాభం రాబట్టే యజమాని. ఒక టైలర్ నలుగురిని పెట్టుకొని బట్టలు కుట్టించి అమ్ముతాడు. లాభం పొందుతాడు. అతను ఆంటర్ ప్రెనర్. లాభం పొందడం కోసం కార్మికుల్ని పెట్టే యజమాని ఆంటర్ ప్రెనర్. అలాగని యజమానులు అందరూ లాభం రాబడతారని కాదు. లాభం రాబట్టని యజమానులూ ఉంటారు. ఖర్చుపెట్టుకొని పనిచేయించుకునే యజమానులు కూడా ఉంటారు. ప్రతి ఆంటర్ ప్రెనర్ యజమానే, కాని ప్రతి యజమానీ ఆంటర్ ప్రెనర్ కాడు.
ఒకరు పనిలో పెట్టుకున్నటైలర్లు కుట్టిన కోటు తనే వాడుకుంటే, కుట్టినవాళ్లకి యజమానే, కాని ఆంటర్ ప్రెనర్ కాడు. ఎందుకంటే, అతను దాన్ని అమ్మి లాభం చేసుకోలేడు. అతని ఆదాయం ఖర్చు అవుతుంది - ఇదీ మార్క్స్ చెప్పింది. “నేను తొడుక్కోడానికి ఇంటివద్ద కోటు కుట్టించుకున్నప్పుడు (ఆర్థిక కాటగరీ అర్థంలో) అది నన్ను నా సొంత వ్యాపారిని (entrepreneur) చెయ్యదు” (అ.వి.సి. 1.296) అని మార్క్స్ అంటే, “నేను తొడుక్కోవడానికి ఒక టైలర్ తో ఇంటిదగ్గరే ఒక కోటుని తయారుచేయించుకున్నప్పుడు ఆవిషయం నన్ను ఆర్థిక అర్థంలో యజమానిగా చెయ్యదు" అని రంగనాయకమ్మగారు అనువదించారు. ఇంటికి వెళ్లి కోటు కుట్టి ఇచ్చిన కుట్టుమనిషికి కుట్టించుకున్న మనిషి యజమానిగా ఉండడు అని నిర్ధారించారు. కుట్టించుకున్నవానికీ కుట్టినవానికీ యజమాని-శ్రామిక సంబంధం ఉండదు. యజమాని లేడు గనక అదనపు శ్రమ ఉండదు. దోపిడీకి అవకాశం ఉండదు. అదనపు శ్రమ లేదు కనక శ్రమ విలువ అంతా అతనికే దక్కుతుంది. అతను స్వతంత్ర ఉత్పత్తి దారుడు - ఇదీ వారి వాదన.
యజమాని లేడు అనడం తప్పు. ‘ఆంటర్ ప్రెనర్’ గా చెయ్యదు అంటే ‘యజమాని’ గా చెయ్యదు అని కాదు.
ఉదాహరణకి, కొంతకాలం ఖాళీగా ఉన్న స్థలంలో చిల్లచెట్లు కొట్టేయించి, చెత్త ఎత్తేయించి,మొక్కలు పీకేయించి శుభ్రం చేయిస్తాడు స్థలం యజమాని. పనివాళ్లంతా కూలి తీసుకుని అతను చెప్పినట్లు పనిచేస్తారు. అంతవరకు వాళ్లకు అతడు యజమానే. డబ్బు తీసుకొని పనిచేసే కూలీలకు డబ్బిచ్చి పనిచేయించుకునేవాడు యజమానే. కాదనడం కుదరదు.
యజమాని లేడు అనీ, యజమాని లేడు కాబట్టి కుట్టుమనిషి స్వతంత్ర ఉత్పత్తిదారుడు అనీ తేల్చారు. ఉన్న యజమానిని లేడని తప్పు నిర్ధారణకు రావడానికి కారణం ఆంటర్ ప్రెనర్ అనే మాటకి యజమాని అని తప్పు అనువాదం చెయ్యడం. “ఇప్పుడిచ్చే కొటేషన్ మహా గందరగోళంగా ఉంటుంది. ‘స్వేచ్ఛ’గా అనువాదం చేసినప్పటికీ ఈ గందరగోళం తప్పదు” అని హెచ్చరించి ‘స్వేచ్ఛగానే’ అనువాదం చేశారు. ఆ అనువాదంతోనే గందరగోళం!
“మార్క్స్ ఈ కొటేషన్ లో, ఇంటికి వచ్చి కోటు కుట్టి ఇచ్చే శ్రామికుణ్ణి అనుత్పాదక శ్రామికుడిగా కాక, స్వతంత్ర శ్రామికుడిగానే చెబుతున్నాడు (కొత్త పరిచయం 1.502) అని మార్క్స్ అనని మాట కూడ ఆయన నోట్లో పెట్టారు. కాని మార్క్స్ అలా అనలేదు. దర్జీ గృహసేవకుడి లాంటివాడే అని స్పష్టంగా చెప్పాడు. అంటే అతను అనుత్పాదక శ్రామికుడు అని చెప్పాడు.
జాబింగ్ దర్జీ శ్రమ నా డబ్బుతో మారకం అయింది అంటాడు. తయారైన సరుకుతో డబ్బు మారకం కాదిది. ఆ సరుకుని తయారుచేసే శ్రమతో డబ్బు మారకం. అంటే అతను అనుత్పాదక శ్రామికుడు. జాబింగ్ దర్జీ పొందిన ధరలో ఉన్న శ్రమ కన్నా అతను చేసిన శ్రమ ఎక్కువ కావచ్చు. ఇందుకు అవకాశం ఉంది, ఎందుకంటే అతని శ్రమధర ఉత్పాదక దర్జీ పొందేదాన్ని బట్టి నిర్ణయమవుతుంది (అ.వి.సి. 1.402) అని మార్క్స్ స్పష్టంగానే చెప్పాడు. అయోమయంలో పడేసింది మార్క్స్ కాదు, రంగనాయకమ్మగారు.
అనుత్పాదక శ్రామికులు “తమ సేవల రూపంలో ఒక 'ఈక్వివలెంట్' ని ఇస్తారు” అంటాడు మార్క్స్ (అ.వి.సి. 1.218) రంగనాయకమ్మగారు ఇలా వివరించారు: “’ఈక్వివలెంట్’ ఇవ్వడం అంటే, ఇచ్చేవిలువా, తీసుకునే విలువా సమానంగా ఉంటాయి అని అర్ధం.” “ఈ శ్రామికులు యజమానులకు ఇచ్చే శ్రమవిలువా, వాళ్లనించి తీసుకునే జీతాలవిలువా సమానంగా వుంటాయనీ, అంటే అనుత్పాదక శ్రమల విషయంలో 'అదనపుశ్రమ’ వుండదనీ చెప్తోన్నట్టు అర్ధం. అందుకే ఇదికూడా తప్పే” అన్నారు రంగనాయకమ్మగారు (పాత పరిచయం 3.372)
డబ్బుకీ శ్రమశక్తికీ మారకం ఉంటుంది గాని డబ్బుకీ శ్రమ ఉత్పత్తిచేసిన ఉత్పాదితానికీ కాదు.
“శ్రామికునికీ పెట్టుబడిదారునికీ మధ్య మారకం మామూలు (సింపుల్) మారకమే; అతడూ ఇతడూ (ఈచ్)సమానకాన్ని (Equivalentని)పొందుతారు; ఒకరు డబ్బుపొందితే, మరొకరు చెల్లించిన డబ్బుకి సరిగ్గా సరిపడే ధర గల సరుకు పొందుతారు” అని మార్క్స్ గ్రుండ్రిస్ లో అన్నాడు.
ఆ సరుకే శ్రమశక్తి. మారకంలో ఉన్నది ఒకవైపు డబ్బు, మరోవైపు శ్రమశక్తి. ఇచ్చే డబ్బుకి వచ్చే శ్రమశక్తి సరిపోతుంది. మారేది సమానకాలే. శ్రమశక్తి సమానకం అంటే శ్రమశక్తి పునరుత్పత్తికి కావలసిన సరుకులు. శ్రమశక్తి ఉపయోగపు విలువ వల్ల ఏర్పడ్డ ఉత్పాదితం కాదు. కనక సమానకం ఇస్తారు అనడం కరెక్టే. అలాగే అనాలి కూడా.
మార్క్స్ చెప్పిన అనుత్పాదక శ్రమ ఫార్ములా డ-స-డ కాదు. స-డ-స (చివర స శ్రమ లేక సేవ). “డబ్బు చెల్లింపు సాధనంగా వ్యవహరిస్తుంది, పెట్టుబడిగా కాదుఅంటాడు మార్క్స్. డ-స-డ (డబ్బు-సరుకు-డబ్బు) పెట్టుబడి ఫార్ములా. స-డ-స (సరుకు-డబ్బు-సరుకు) అనుత్పాదక శ్రమ ఫార్ములా.
రంగనాయకమ్మగారి ప్రకారం స-డ-స సూత్రం, “సమాన విలువలుగల సరుకుల మారకాలనే  సూచిస్తుంది. అనుత్పాదక శ్రామికుడికీ, అతని యజమానికీ జరిగే మారకాన్ని ఈ సూత్రం ద్వారా చెప్తే, ఆ మారకం, సమాన విలువల మారకంగానే ఉందనే అర్ధాన్ని ఇస్తుంది. ఇది తప్పు (కొత్త పరిచయం 1.503).
మార్క్స్ ప్రకారం ఏ మారకమైనా సమాన విలువల మారకమే. పెట్టుబడిదారుడికీ, కార్మికుడికీ అయినా, వినియోగదారుడికీ అనుత్పాదక శ్రామికుడికీ అయినా, సరుక్కి సరుక్కీ అయినా మారకం సమాన మారకమే.
“అనుత్పాదక శ్రమ, యజమానికి ఉపయోగపు విలువనే ఇచ్చినప్పటికీ, అది యజమాని ఇచ్చిన డబ్బుకన్న ఎక్కువ ఉపయోగపు విలువనే ఇస్తుంది. కాబట్టి, ఈసంబంధాన్ని C-M-C గా చెప్పడం పనికిరాదు. అలా చెప్తే, అనుత్పాదక శ్రామికులు అదనపు శ్రమ ఇవ్వరు అనే అర్థం వస్తుంది” అంటున్నారు రంగనాయకమ్మగారు (కొత్త పరిచయం 1.503).
“ఇచ్చేది డబ్బూ, పుచ్చుకునేది  శ్రమా. విలువా, ఉపయోగపు విలువా రెండు భిన్న రాసులు. వాటిని సరిపోల్చడం కుదరదు” అనీ, “మారకపు విలువ, ఉపయోగపు విలువ అనేవి వాటి స్వభావం రీత్యా కొలవబడజాలని పరిమాణాలు” అనీ మార్క్స్ అన్నాడు (కాపిటల్ 1.506).
అదనపు విలువ ఉత్పత్తి అయ్యే వలయం డ-స-డ. స-డ-స లో అదనపు విలువ ఉత్పత్తి కాదు, అసలు విలువే ఉత్పత్తి కాదు. తయారయ్యేది ఉపయోగపు విలువ. దీనికి విలువ ప్రసక్తి ఉండదు. కనుక ఇచ్చే శ్రమా పుచ్చుకునే శ్రమా అనేది ఉండదు. ఇచ్చేది డబ్బు, పుచ్చుకునేది శ్రమ. శ్రమ అనేది సరుకు కాదు. దానికి విలువ ఉండదు. శ్రమవిలువ అనేది అర్థంలేనిమాట అని మార్క్స్ చెప్పాడు.
చివర శ్రమవల్ల తయారైన సరుకు కాదు. శ్రమ ఇమిడి ఉన్న సరుకు కాదు. శ్రమ ఉత్పాదితం కాదు. ఇది శ్రమే. సజీవ శ్రమకీ డబ్బుకీ మారకం. “దాని (అనుత్పాదక శ్రమకి సంబంధించిన) వినియోగాన్ని సూత్రీకరించవలసింది M-C-M గా కాదు, C-M-C గా...ఇక్కడ డబ్బు కేవలం చలామణీ సాధనంగా పనిచేస్తుంది గాని పెట్టుబడిగా కాదు" అంటాడు మార్క్స్ (కొత్త పరిచయం 1.503, కాపిటల్ పెంగ్విన్ 1.1041). ఇక్కడ చివర స అనేదానికి ‘శ్రమ లేక సేవ’ అని బ్రాకెట్లో పెట్టాడు.
“సేవ అంటే సరుకు రూపంలో అయినా సరే, శ్రమరూపంలో అయినా సరే ఉన్న ఒక ఉపయోగపు విలువ యొక్క ఉపయోగకర ఫలితం తప్ప వేరు కాదు” (పెట్టుబడి, విశాలాంధ్ర, 175-176).
అంటే ఒక శ్రమ ఉపయోగపు విలువగా, సేవగా వినియోగమయితే, ఆ శ్రమ అనుత్పాదక శ్రమ. ఆ శ్రామికుడు అనుత్పాదక శ్రామికుడు. అతని శ్రమ ఉపయోగపు విలువ కొరకు వాడబడింది, మారకం విలువని ఏర్పరచడానికి కాదు. దానికి చెల్లించే డబ్బు పెట్టుబడినించి కాదు, ఆదాయం నించి.
కాని అనుత్పాదక శ్రామికుడితో మారకం స-డ-స' గాచెప్పాలి. అప్పుడే అనుత్పాదక శ్రామికుడికీ యజమానికి జరిగే మారకాన్ని సరిగ్గా సూత్రీకరించగలుగుతాం" అని రంగనాయకమ్మగారు అంటున్నారు (పాత పరిచయం 373)
స-డ-స' సూత్రీకరణ రంగనాయకమ్మగారి సొంతం. అది మార్క్సుకి సాధ్యం కాలేదు. అందుకు మార్క్స్ చాలడు.
“విషయాల్ని ఇలా చెప్పవలసి ఉండగా, మార్క్సు అనుత్పాదక శ్రమని వివరించడంలో, కొన్నిచోట్ల సరిగానూ, కొన్నిచోట్ల పొరపాటుగానూ ఉన్నాడు. కాపిటల్-2 లో ‘చలామణీ ఖర్చుల’ గురించి చెప్పినచోట అనుత్పాదక శ్రమ గురించి చాలా కచ్చితమైన, ‘పూర్తిగా సరియైన’ అభిప్రాయాలు ఇచ్చాడు. వాటికి వ్యతిరేకమైన అర్ధాలు వచ్చే పొరపాట్లు ఎలా జరిగాయో గానీ, వాటిని పొరపాట్లుగానే అర్ధం చేసుకొని వదలివెయ్యాలి” (కొత్త పరిచయం 1.503) అంటున్నారు రంగనాయకమ్మగారు.
“ఉత్పాదక, అనుత్పాదక శ్రమల గురించి సరిగా తెలుసుకోకపోతే, 'కార్మికవర్గం ఎవరు?' అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో చాలా పొరపాటు జరుగుతుంది” (పాత పరిచయం 3.366) అనీ, “ఉత్పాదక-అనుత్పాదక శ్రామికులందరూ ... ఆ రెండురకాల శ్రామికులూ కలిసిన మొత్తమే కార్మికవర్గం” (పాత పరిచయం 3.376) అనీ రంగనాయకమ్మగారు అంటున్నారు.
కచ్చితంగా చెప్పాలంటే, అనుత్పాదక శ్రామికులెవరో, స్వతంత్ర ఉత్పత్తిదారులెవరో సరిగా తెలుసుకోవాలి. ఈ ప్రయత్నమే రంగనాయకమ్మగారు చేశారు. మార్క్స్ స్వతంత్ర ఉత్పత్తిదారుల్ని అనుత్పాదక శ్రామికులుగా చెప్పి తప్పు చేశాడన్నారు.
ఎవరిది రైటు,ఎవరిది తప్పు?
“మార్క్స్ ఇచ్చిన ఉదాహరణలను బట్టి పోతే, కార్మికవర్గం అంటే ఉత్పాదక శ్రామికులు మాత్రమే అనే పొరపాటు అర్థానికి రావలసి వస్తుంది” అని రంగనాయకమ్మగారు అన్నారు.
ఎలా వస్తుంది? కార్మికవర్గం అంటే వేతన శ్రామికులు అని ‘ప్రణాళిక’లోనే స్పష్టం చేశారు: “కార్మికవర్గం అంటే, సొంత ఉత్పత్తి సాధనాలు లేనందువల్ల, బతకడానికి తమ శ్రమశక్తిని అమ్ముకోవలసిన ఆధునిక వేతన శ్రామికుల వర్గం” అని స్పష్టంగా వివరించారు.
వారు చెప్పినట్లు ఉదాహరణలను బట్టిపోదాం: మార్క్స్ ఉదాహరణలలో వారిని అనుత్పాదక శ్రామికులు అన్నాడు. అంటే వేతన శ్రామికులన్నమాట. వాళ్లు కార్మికవర్గం పరిధిలోనే ఉంటారు. మార్క్స్ అనుత్పాదక కార్మికులు అన్నవాళ్లు రంగనాయకమ్మగారికి కార్మికవర్గంలో ఎందుకు కనిపించరో తెలియదు. కారణం ఒక్కటే తోస్తున్నది. వాళ్లు రంగనాయకమ్మగారికి స్వతంత్ర ఉత్పత్తిదారులు కనక కార్మికవర్గంలో ఉండరు. మార్క్స్ ప్రకారం వాళ్లు అనుత్పాదక శ్రామికులు, వేతన కార్మికులు. కచ్చితంగా కార్మికవర్గంలో ఉంటారు. వాళ్లు కార్మికవర్గంలో ఉండనిది మార్క్స్ ఉదాహరణల బట్టి కాదు, వాటికి రంగనాయకమ్మగారిచ్చిన వక్రభాష్యాన్ని బట్టి.
“మధ్యతరగతిలో కిందిశ్రేణికి చెందినవారు చిన్న ఉత్పత్తిదారులు, దుకాణదారులు, చేతిపరిశ్రమలవారు, రైతులు …… వీరంతా యథాతథవాదులు, విప్లవకారులు కారు. పైగా వీరు అభివృద్ధి నిరోధకులు" అని ప్రణాళిక అంది.
మార్క్స్ అనుత్పాదక శ్రామికులు అన్నవాళ్లని అనేకమందిని రంగనాయకమ్మగారు స్వతంత్ర ఉత్పత్తిదారుల కింద జమ కట్టి, మార్క్స్ విప్లవకారులుగా గుర్తించినవాళ్లని యథాతథవాదులుగా, అభివృద్ధినిరోధకులుగా చెబుతున్నారు. చరిత్ర రథచక్రాన్ని ముందుకు నడిపే కార్మికుల్ని, వెనక్కి తిప్పడానికి ప్రయత్నించేవాళ్లుగా చూపిస్తున్నారు.
‘వీక్షణం’ వ్యాసంలో పెట్టుబడిదారుడికీ, మార్క్స్ శిష్యుణ్ణి అని చెప్పుకునేవానికీ ఒక చర్చను రంగనాయకమ్మగారు ఊహించారు. అందులో ‘శ్రమశక్తి సరుకు కాదు’ అని అని తేలుస్తాడు ‘శిష్యుడు’! సరుకు అని చెప్పి మార్క్స్ పొరపాటు చేశాడనీ దాన్ని దిద్దుకుంటాడనీ చెప్తాడు. “శ్రమదోపిడీయే లేదని దోపిడీదారుడు విర్రవీగుతోంటే, నోరెత్తలేని స్తితిలో శ్రామికుడు పడిపోయాడంటే కారణం నా గురువు పొరపాటే” అనీ అంటాడు. అంటే మార్క్స్ అదనపు విలువని రుజువు చెయ్యలేక పోయాడని!
మళ్లీ, “ఈ సంగతి మార్క్సుకి తెలియదనీ, తెలియకనే అలా చెప్పాడనీ అనుకోగలమా? రాయడంలో కొన్నిసార్లు అలాంటి పొరపాట్లు జరుగుతూనే వుంటాయి. ఆయనకు తెలుసు, కాని రాయడంలో పొరపాటు జరిగింది”, “మొదట్లో రాసిన భాగాన్ని మార్క్సు మళ్లీ ఒకసారి చూసుకునివుంటే, ఆ విషయాలన్నీ కూడా తప్పకుండా సవరించేవాడే" అనీ రాశారు రంగనాయకమ్మ (పాత పరిచయం 3.370).

ఇలా కొత్త నిర్వచనాలతో, ఫార్ములాలతో, పరిభాషతో, మార్క్సులో లేనివి, మార్క్సు తప్పన్నవీ ఇరికించి, వాటినిబట్టి మార్క్స్ తప్పులు చేశాడని రంగనాయకమ్మగారు తేల్చారు. సరిచూసుకోక పొరపాటుపడ్డాడనీ, మళ్లీ ఒకసారి చూసుకుని వుంటే, ఆవిషయాలన్నీ కూడా తప్పకుండా సవరించేవాడే అనీ చెప్పారు. అంటే  రంగనాయకమ్మగారు చెప్పినట్లుగా దిద్దుకునే వాడని కాబోలు. ఏం చేసేవాడో తెలుసుకునే అవకాశం మనకి లేదు. మార్క్స్ లేడు. అందువల్లే రంగనాయకమ్మగారు “తప్పకుండా సవరించుకునేవాడే” అని ధైర్యంగా చెప్పారేమో. ఉండి ఉంటే, రంగనాయకమ్మగారి ‘పరిచయాన్ని’ పఠించి,వాగ్నర్ మీద వ్యాఖ్యానించినట్టుగా “కాపిటల్ లో ఒక్క ముక్క కూడా అర్థంకాని వ్యక్తి” అనేవాడో, ఫ్రెంచ్ మార్క్సిస్టుల గురించి అన్నట్లు వారిది మార్క్సిజం అయితే, నేను మార్క్సిస్టుని కాను” అనేవాడో, అసలు “ఈ పుస్తకంలో పరిచయం చేసిన మార్క్సు నేను కాదు” అనేవాడో, ఎవరికి తెలుసు?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి