12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

ప్రభుత్వ సహాయం పొందుతున్న అమెరికా శ్రామికులు

ప్రభుత్వ సహాయం పొందుతున్న అమెరికా శ్రామికులు
అమెరికాలో నూటికి 30 మంది శ్రామికులు అంటే 4 కోట్లా 12 లక్షలమంది ప్రభుత్వ సహాయం పొందుతున్నారు. వీళ్ళలో 1 కోటి 93 లక్షలమంది ఫుల్ టైం పనివాళ్ళు. అయితే వీళ్ళలో ఎక్కువమంది కీతా వేతనాలొచ్చే పనుల్లో ఉంటారు. తక్కువ వేతనం అంటే గంటకి 12.16 డాలర్లకి లోపు. 12.16 డాలర్ల లోపు వాళ్ళలో 53.1 శాతం మందికి చాలాతక్కువ ఆదాయం వస్తుంది. దాంతో ఇల్లు గడవడం కష్టమవుతుంది. అంతకు మించి పని దొరకదు. కనక ప్రభుత్వ సహాయం మీద ఆధారపడతారు. మరో దారి ఉండదు. అయితే, ప్రభుత్వ సహాయం మీద తేరగా తిని బతకడానికి అలవాటుపడి పనులకు పోరు - అనే ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంది. ఇది సరయినదేనా?
వాస్తవాలు పరిశీలించి నిజానిజాలు నిగ్గుతేల్చాలి.
******
శ్రామికులకి వేతనాలు పెరగడం లేదు. కొత్తగా వస్తున్న ఉద్యోగాలకి జీతాలు తక్కువ. మాంద్యంలో పోయినవాటి జీతాల కన్నా, తర్వాత వచ్చిన వాటికి జీతాలు తక్కువ. పెన్షన్లు కోసే ప్రయత్నం తీవ్రంగా జరుగుతున్నది. ఆదాయం తగ్గుతున్నా, ఖర్చులు పెరుగుతున్నాయి.  ఆరోగ్యం, విద్య, ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. 2016 జనవరి లో వచ్చిన 151,000 ఉద్యోగాల్లో  102,000 కనీస వేతనాలవి. రెటైల్ (చిల్లర వర్తకం) రంగంలో 58,000,విశ్రాంతి,ఆతిధ్య రంగంలో 44,000. జనవరిలో 21 లక్షలమంది  దీర్ఘకాల నిరుద్యోగులు (27 వారాలుగా ఉద్యోగం లేనివారు) ఉన్నారు.మొత్తం నిరుద్యోగుల్లో వీళ్ళు 26.9 శాతం. పార్ట్ -టం వాళ్ళు 60 లక్షలమంది. శ్రామికుల పరిస్థితి ఇలావుంది.
సరే,అవతలవైపు చూద్దాం.2009 లో కార్పొరేట్ల లాభాలు మొత్తం- 5,587 (5,58,700 కోట్ల) డాలర్లు. 2014 లో లాభాలు 8290 బిలియన్ (829,000 కోట్ల) డాలర్లు.
సీ.ఈ.ఓ వేతనాలు అంతకంతకూ అధికమవుతున్నాయి.శ్రామికుల వేతనాలు మహా అయితే ఉన్నచోటే ఉంటున్నాయి.అనేకమందికి తగ్గుతున్నాయి.మాంద్యం వచ్చినప్పుడు ఆటో కంపెనిలు కొత్తగా చేరే వాళ్ళకి సగం జీతమే ఇచ్చే ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. సీ.ఈ.ఓ ల వేతనాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.వాల్ మార్ట్ సీ.ఈ.ఓ కి 2014 లో రెండున్నర కోట్ల డాలర్లొచ్చాయి.అక్కడే పనిచేసే ఒక మధ్యస్థ శ్రామికుడికి 22,590 డాలర్లు.లెక్కిస్తే ఇతని జీతానికి, సీ.ఈ.ఓ వేతనం 1133 రెట్లు. ఎక్కడైనా 500 రెట్లకి పైమాటే.  ఈ తేడా కూడా పెరుగుతున్నది
మహామాంద్యం సాగిన 2008,2009, 2010 కాలంలో కూడా కార్పొరేట్ లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. మాంద్యం వాళ్ళకి లేనట్లే. శ్రామికులకి ఇప్పటికీ మాంద్యం కొనసాగుతున్నట్లే. 1970 దశకంలో జాతీయోత్పత్తిలో ఇంచుమించు 60 శాతం కార్మికుల వేతనాలుగా ఉండేది. 2010 లో అది 54.9  చేరింది. అదే లాభాల పాలు 1970 లో 7.5 శాతం అయితే, 2010 లో 12.6 శాతానికి పెరిగింది. 1950 నించీ ఇదే ఎక్కువ.
పై 5 శాతం సంపన్నులకి 1970 లో 17 శాతం సంపద ఉండేది. అదిప్పుడు 22 శాతానికి పెరిగింది. మధ్యతరగతి మాటకొస్తే, 1995 లో ఆకుటుంబం ఎంత తీసుకుందో, ఇప్పుడూ అంతే(ధరల పెరుదలతో సరిచేసి చూస్తే). జనవరిలో చేసిన ఒక సర్వేలో తమ పిల్లలు తమకంటే ఆర్ధికంగా తగ్గిపోతారని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అమెరికా ప్రజల అదాయాలు తగ్గుతూ ఉన్న రోజుల్లో కార్పొరేట్ల లాభాలు పైకి, పైపైకీ దూసుకు పోయాయి-అనే నిజాన్ని ఈగణాంకాలు బయటపెడుతున్నాయి.
అందువల్ల, సంపన్నుల ఆస్తులు  ఎగబాకడమూ, శ్రామికుల పరిస్థితి దిగజారడడమూ- కళ్ళకు కడుతున్న దృశ్యం.ఆదాయ అంతరాలు అంతూపొంతూ లేకుండా పెరుగుతున్నాయి.ఎంతగా పెరుగుతున్నాయో చెబుతూ ఎన్నో నివేదికలొచ్చాయి. అన్ని దేశాల పరిస్థితీ ఇలాగే వుందని ఆయాదేశాల గణాంకాలు పైపైన చూచినా ఎవరికైనా తేలిగ్గా తెలుస్తుంది.
ఒకవైపు అనేకమందికి ఆదాయం తగ్గుతున్నది. ఖర్చు పెరుగుతున్నది. మరి ప్రభుత్వ సహాయం తీసుకోకుండా ఎలా బతుకుతారు? అనే ఆలోచన చెయ్యకుండా సహాయంతోనే బతకడానికి అలవాటుపడి పనులు చెయ్యడం లేదు అని తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని ఏమనాలి?
ఈగాణాంకాలన్ని వాళ్ళకి కరతలామలకమే. జీతం సరిపోదు కనక తీసుకుంటున్నారు అనే నిజం వాళ్ళకి తెలియక కాదు. కార్పొరేట్ల ప్రయోజనాల్ని పెంచడం వాళ్ళ పని.

వాళ్ళలక్ష్యం ఈ పరిస్థితికి కారణాలు చెప్పటం కాదు.ప్రజా సంక్షేమం కాదు. కార్పొరేట్లకు మేలుచేసే భావాలు ప్రచారంలొ పెట్టడం. జీతాలు తక్కువ ఇస్తున్నారు అనరు. ప్రభుత్వ సహాయం మీద ఆధారపడడానికి కారకులు కార్పొరేట్లు అని చెప్పరు. కార్మికులు పనిచెయ్యకుండా కూచోని తిడానికి అలవాటు పడ్డారని నింద బాధితుల పైకి తోస్తారు. ఇది వారు ఊరకే చెయ్యరు. అందుకు దండిగా పారితోషికం పొందుతారు- ప్రత్యక్షంగానో, పరోక్షంగానో.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి