16, ఏప్రిల్ 2016, శనివారం

మార్క్స్ చెప్పిందేమిటీ? రంగనాయకమ్మగారు రాసిందేమిటి?

మార్క్స్ చెప్పిందేమిటీ?
రంగనాయకమ్మగారు రాసిందేమిటి?
మామూలు విషయాల నుంచీ, మౌలికమైన విషయాలదాకా
తప్పులతో సాగిన కాపిటల్ 'పరిచయం'పై
ప్రామాణిక గ్రంధాల ఆధారంగా
చేసిన విమర్శ
బ్రహ్మాచారి
దిలీప్ కుమార్
1994 ఫిబ్రవరి
   "ఒక సైన్సుని నేర్చుకునే చోట చిన్న పొరపాటు అయినా పొరపాటే”*— రంగనాయకమ్మ
రంగనాయకమ్మ గారి 'కాపిటల్ పరిచయం' 5 భాగాలుగా ఉంది. చివరిభాగం కూడా మార్కెట్లోకి వచ్చి కొంతకాలం గడిచినా ఏపత్రికలోనూ సమీక్ష రాలేదు. ప్రకటనలు మాత్రం కొన్ని వచ్చాయి.
మార్క్సు కాపిటల్ సారాంశాన్ని శాస్త్రీయంగా, సులభంగా చెప్పాలని చేసినప్రయత్నమే ఈ 'కాపిటల్ పరిచయం'. కానీ సారాంశాన్ని శాస్త్రీయంగా చెప్పడం సంగతి అలా ఉంచి, ఎంతో సామాన్యమైన, సుపరిచితమైన విషయాలలో కూడా 'పరిచయం' లో పొరపాట్లు ఉన్నాయి.
1.కాపిటల్ పరిచయం 1వ భాగంలోని 1వ పేజీలోనే "1867 ఆగస్ట్ 16 రాత్రి 2 గంటలకు కాపిటల్ మొదటి సంపుటి రచన పూర్తి అయింది." అని వుంది.
కానీ, 1867 ఏప్రిల్ 29న [1] అంటే రంగనాయకమ్మగారు చెప్పే రచనా కాలానికి 3 నెలల కంటే ముందే, కాపిటల్ అచ్చుపని కూడా మొదలయింది.
ఆగస్ట్ 16 రాత్రి 2 గంటలకు, అంటే రంగనాయకమ్మగారు రచన పూర్తి అయిందని చెప్పే సమయానికి కాపిటల్ గురించి రాసిన ఉత్తరంలో [2] " ఈపుస్తకపు ఆఖరి షీట్ ను (49 వదాన్ని) సరిచూడడం ఇప్పుడే పూర్తయింది" అని రాశాడు. అంటే అప్పుడు పూర్తయింది రచన కాదు, ఆఖరి ప్రూఫ్ ను సరిచూడటం. కాపిటల్ మొదటి సంపుటి రచన పూర్తయింది మాత్రం 1867 ఏప్రిల్ 2 న [3].
2. ఆమొదటి భాగం లోనే 3వ పేజీలో -"కాపిటల్ రాయడానికి 20 సం IIల ముందే మార్క్సు 'రాజకీయార్ధికశాస్త్రంపై ఒకవిమర్శ 'పేరుతో పాత ఆర్ధిక శాస్త్రం గురించి ఒక పుస్తకం తాశాడు." -అని చూస్తాం.
కానీ, ఆపుస్తకాన్ని మార్క్స్ రాసింది కాపిటల్ రాయడానికి 20 సంవత్సరాల ముందుగా కాదు,దాదాపు 8 సంవత్సరాల ముందుగా. 1859 లో[4]
3."1844 సెప్టెంబర్ లో ఎంగెల్స్ పారిస్ వచ్చి మొట్టమొదటి సారిగా మార్క్సుని కలిశాడు."- పరిచయం-1-15 వ పేజీ. కాని నిజానికి ఎంగెల్స్ మార్క్సుని మొదటిసారి కలిసింది నవంబర్ 1842 లో [5]
4. కొన్ని నిర్దిష్ట కాలాల్లో వున్న పెన్నుల ధరల గురించి మార్క్సు ఇచ్చిన వివరాలు 'పరిచయం'లో కొచ్చెసరికి మారిపోయాయి.
పరిచయం ప్రకారం -"1820లో -చేతి వృత్తులద్వారా తయారైన స్టీలు పెన్ను ధర - 7 పౌండ్ల 4 షిల్లింగులు.
1830 లో మాన్యుఫాక్చర్ ద్వారా తయారైన అదేరకం పెన్నుధర- 8 షిల్లింగులు.
1861 లో - భారి పరిశ్రమద్వారా తయారైన అదేరకంపెన్ను ధర "2 పెన్నీలకూ, 6 పెన్నీలకూ మధ్య" -(పరిచయం-3-88, 89 పేజిలలో)
మార్క్సు దీన్ని గురించి రాసింది యిలావుంది:" మొదట్లో చేతివృత్తుల వ్యవస్థ ద్వారా సప్లై అయిన స్టీలు పెన్నులధర 1820వ సంవత్సరంలో గ్రోసు 7 పౌండ్ల 4 షిల్లింగులు; 1830 లో అవి మాన్యుఫక్చర్ ద్వారా 8 షిల్లింగులకు సప్లై అయినాయి. మరి ఈరోజున ఫాక్టరీ వ్యవస్థ వాటిని గ్రోసు 2 షిల్లింగులకూ 6 పెన్నీలకూ మధ్య....సప్లై చేస్తున్నది"[6]
మూడు సందర్భాలలోనూ మార్క్సు చెప్తున్నది గ్రోసు పెన్నుల గురించి.(గ్రోసు అంటే 12 డజన్లు. అంటే 144).. 1820 లో 144 పెన్నులధర 7 పొండ్ల 4 షిల్లింగులు అని మార్క్సు అంటే, ఒక పెన్నుధర 7 పొండ్ల 4 షిల్లింగులు అని -రంగనాయకమ్మగారు.
1830 లో 144 పెన్నులధర 8 షిల్లింగులు అని మార్క్సు చెప్తుంటే, 1830 లో ఒక పెన్నుధర 8 షిల్లింగులు అని అని -రంగనాయకమ్మగారు.
అలాగే ఫాక్టరీ సప్లై చేసిన పెన్నుల విషయంలో కూడా మార్క్సు గ్రోసు పెన్నుల ధర గురించి చెప్తుంటే రంగనాయకమ్మగారు ఒక పెన్నుగురించి చెప్పడమే కాకుండా, వాటిధర '2 షిల్లింగులకూ 6 పెన్నీలకూ మధ్య 'అని మార్క్సు చెప్తుంటే ' 2 పెన్నీలకూ 6 పెన్నీలకూ మధ్య 'అని రంగనాయకమ్మగారు చెప్తారు.
5."'విలువ అంటే శ్రమ " అనే సూత్రీకరణ రాజకీయార్ధికశాస్త్రానికే మూలస్తంభం లాంటిది. అయినా దాన్ని మొదట ఎవరు సూత్రీకరించారు, ఎప్పుడు సూత్రీకరించారు - అనే వాటిలో కూడా 'పరిచయం'లో తప్పే ఉంది.
"'విలువ అంటే శ్రమ ' అనేవిషయాన్ని, అరిస్టాటిల్ తర్వాత కూడా ఇంకా 2 వేల సంవత్సరాల వరకూ ఎవ్వరూ కనిపెట్టలేదు. చివరకి ఆవిషయాన్ని 1739 లో, ఒక పేరులేని (పేరు మనకి దొరకని) ఆర్ధికవేత్త కనుగొన్నాడని మార్క్స్ ఒక ఫుట్ నోట్ లో చెప్పాడు." (పరిచయం-1- 207 వ పేజీ). పరిచయం లో ఉన్నట్లుగా, విలువ అంటే శ్రమ అని మొదటిసారిగా 1739 లో ఈపేరు తెలియని ఆర్త్ధికవేత్త కనుగొన్నాడని మార్క్స్ చెప్పినట్లు ఎక్కడా కనబడలేదు. విలువ అంటే శ్రమ అని తెలియడం వరకయితే విలియం పెట్టీ కి చాలా ముందే తెలుసు. 1662లో వెలువడిన A Treatise of Taxes and Contributions అనే పెట్టీ రచన గురించి రాస్తూ " ఈపుస్తకంలో ఆయన సరుకుల విలువను వాటిలో యిమిడివున్న శ్రమ పరిమాణాన్ని పోల్చి నిర్ణయిస్తాడు [7]- అని మార్క్స్ రాశాడు.
"విలువ అంటే శ్రమ" అని మొదట సూత్రీకరించిన వాడు మాత్రం బెంజ్ మన్ ఫ్రాంక్లిన్."మొట్టమొదటసారి వుద్దేశ పుర్వకంగా, స్పష్టంగా ....మారకం విలువని శ్రమకాలంగా తేల్చిన" వ్యక్తిగా బెంజ్ మన్ ఫ్రాంక్లిన్ గురించి చెప్తూ"1729 లో రాసి, 1731 లో ప్రచురించిన రచనలో ఆధునికి రాజకీయార్ధికశాస్త్రపు ప్రాధమిక (basic)నియమాన్ని సూత్రీకరించిన వ్యక్తి... బెంజమిన్ ఫ్రాంక్లిన్[8]" అన్నాడు మార్క్సు.అదే రచన గురించి చెప్తూ, ఇంకో సందర్భంలో మార్క్స్ " ఈసమస్యను పరిశీలించిన ప్రధములలో ఒకడైన ఫ్రాక్లిన్, ఆరచనలో విలువయొక్క వాస్తవ స్వభావాన్ని కనుగొన్నాడు.[9]" -అని రాశాడు.
6."క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితం అరిస్టాటిల్ ద్వారా ప్రారంభమైన "విలువ పరిశోధన, క్రీస్తు తర్వాత 1864 నాటికి మార్క్స్ ద్వారా సమగ్రమయింది."- పరిచయం 1 పేజీ 210.
నిజానికి అరిస్టాటిల్ కాలం క్రీ.పూ 384. నుంచీ క్రీ.పూ.322 వరకు[10] అంటే రంగనాయకమ్మగారు అరిస్టాటిల్ పరిశోధన ప్రారంభించాడని చెప్పేనాటికి ఆయన చనిపోయి 22 సంవత్సరాలయింది.
7.క్రీస్తు తర్వాత 1864 అనడం కూడా తప్పే. 'క్రీస్తుశకం 1864' అనాలి.'క్రీస్తు తర్వాత’ అంటే క్రీస్తు మరణించిన తర్వాత అని అర్ధం. కాని క్రీస్తు శకాన్ని లెక్క కట్టేది క్రీస్తు  పుట్టినప్పటి నుంచీ. కాబట్టి క్రీస్తు శకం అనడానికీ క్రీస్తు తర్వాత అనడానికీ తేడా వుంటుంది.
*********
ఇక ఇప్పుడు లెక్కల సంగతి చూద్దాం.'కాపిటల్ 'లో వున్న లెక్కలన్నీ చిన్నవే. సాధారణంగా ఎవరికైనా తెలిసివుండేవే. అయినా ఈ లెక్కలలో కూడా పరిచయంలో తప్పులు ఉన్నాయి.
8. "100 కిలోల ధర -132 రూపాయలు అయితే
1 కిలోధర 1.32 పైసలు" అట. (పరిచయం-5, 70వ పేజీ)
1.32 'పైసలు 'కాదు 1.32 రూపాయలు అని రాయాలి.రూపాయల్ని భాగించినప్పుడు వచ్చేది కూడా రూపాయలే గానీ,  పైసలు కాదు.'1.32' పైసలు అంటే ఒకటిన్నర పైసల కంటే తక్కువ.'1.32 రూపాయలు' అంటే ఒక రూపాయి 32 పైసలు అని అర్ధం.
9. "200 కిలోల ధర- 154 రూ.లు అయితే 1కిలో ధర - 154/200=0.77 పైసలు"- (పరిచయం-5, 71వ పేజీ). ఇది కూడా 0.77 పైసలు అనికాకుండా, 0.77 రూపాయలు అని వుండాలి.'0.77 పైసలు ' అంటే ఒక పైసాకంటే తక్కువ. 0.77 రూపాయలు అంటే 77 పైసలతో సమానం. కానీ '0.77 పైసలు ' అని రాసిన తర్వాత, దాన్నే '77 పైసలు ' అనిరాశారు. 0.77 పైసలు 77 పైసలుగా ఎలావుతుందో తెలియదు. అదే, 0.77 రూపాయలు అని రాస్తే, 0.77 రూపాయలు =0.77100 పైసలు=77 పైసలు - అని రాయచ్చు. అప్పుడు సరిగా వుండేది.
10. 'పరిచయం-3'లోని, 390 పేజీ చివర్లో ఇచ్చిన లెక్క కూడా తప్పుగా వుంది. ఈలెక్కని చేసిన పద్ధతి సరిగానే వుంది. కానీ మొదటి స్టెప్ లో110 గా వున్న పెట్టుబడిని, 2వ స్టెప్ లో 120 గా వేసుకొని ఆతప్పు అంకెతోటే మిగతా లెక్క అంతా చేశారు. ఆవిధంగా చివరివరకూ ఆతప్పు కొనసాగింది.
11. ఒక విషయాన్ని 'తేలిగ్గా అర్ధం'అయ్యేట్లు చెప్పడానికి పోలిక కోసం స్కూలు విద్యార్ధుల మార్కుల సగటు కట్టే లెక్కని యిచ్చారు.'పరిచయం-4' ,163 వ పేజీలో-'
" లెక్కల పరీక్షలో, 5 తరగతుల్లోనూ సగటులు, 40%, 50%, 45%, 55%,35% -గా వున్నాయనుకుందాం. ఇప్పుడు స్కూలు సగటు=40%+50%+45%+55%+35%== 45%".  పరిచయం ప్రకారం 'ఇది స్కూలు సగటు. 'ఇలా చెయ్యడంలో వున్న తప్పేమిటో చూద్దాం.రంగనాయకమ్మగారు 162వ పేజీలో చెప్పినట్లుగా, 'ప్రతీ తరగతిలోనూ కొంతమంది విద్యార్ధులు వుంటారు 'కాబట్టి ఈ 5 తరగతులలో వరసగా 10 మందీ, 11 మందీ, 60 మందీ, 9 మందీ విద్యార్ధులు వున్నారనుకుందాం.అప్పుడు స్కూలు విద్యార్ధుల మార్కులు మొత్తం=
(4010)+(5011)+(4510)+(5560)+(359)=400+550+450+3300+315=5015.
మొత్తం స్కూలు విద్యార్ధుల సంఖ్య=10+11+10+60+9=100
స్కూలు సగటు  = = =50.15
అంటే సుమారుగా 50. శాతంగా చెప్పాలంటే 50%.(ప్రతి తరగతిలో, పరీక్ష 100 మార్కులకి అనుకుంటే)
కానీ రంగనాయకమ్మగారి ప్రకారం 45% రావాలి. తేడా ఎందుకువచ్చిందంటే రంగనాయకమ్మగారు ఒక్కో క్లాసులో ఎంతమంది ఉన్నారనే దానితో సంబంధం లేకుండా మొత్తం క్లాసు సగటుల్ని కలిపివేశారు కాబట్టి. కానీ, స్కూలు సగటు, క్లాసులలో వున్న విద్యార్ధుల సంఖ్య మీద కూడా ఆధారపడి వుంటుంది కాబట్టి, దాన్ని లెక్కలోకి తీసుకోకుండా చెయ్యడం తప్పు. ' ప్రతీ తరగతిలోనూ కొంతమంది విద్యార్ధులు వుంటారు ' అని తెలిసీ, ఏఏ క్లాసులో ఎంతమంది విద్యార్ధులు వున్నారనేదానితో సంబంధంలేకుండా స్కూలు సగటు కట్టడం తప్పు.
ఇంకో విషయం గమనించండి.
"40%+50%+45%+55%+35%="-అట. ఏమిటి దీనర్ధం?40%, 50%, 45%, 55%,35%-వీటన్నిటినీ కలిపితే”వస్తుందనేకదా! నిజానికి వీటన్నిటినీ కలిపినప్పుడు వచ్చేది 225 మాత్రమే. ఎంతో సులభమైన స్టెప్ లను కూడా సరిగా వేయకపోవడం వల్ల ఇలా అయ్యింది.
=  అని వేస్తే, కనీసం చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా చెప్పినట్లయ్యేది, ఆచెప్పాలనుకునేది కూడా తప్పుగా ఉందనేది వేరే సంగతనుకోండి.
12.పరిచయం-2 లోని 396వ పేజీలో ఇచ్చినలెక్క మొత్తం తప్పుగా ఉంది. అయితే ఇది రూపాయలూ,  పైసల లెక్కలాంటిదో, స్కూలు విద్యార్ధుల లెక్కలాంటిదో కాదు.
ఒక పనిస్థలంలో ఖర్చయ్యే ఫిక్స్డ్ సాధనాల విలువలనీ, వాటి జీవితకాలాల్నీ ఇచ్చినప్పుడు, ఒక సంవత్సరానికి ఖర్చయ్యే ఫిక్స్డ్ సాధనాల విలువని కనుక్కోవడానికి సంబంధించినది.
రంగనాయకమ్మగారు చేసిన లెక్క ఇలా ఉంది.
ఒక పనిస్థలంలో ఉండే ఫిక్స్డ్ సాధనాలు
వాటి జీవిత కాలాలు
వాటి విలువలు
1. బిల్డింగు
60 సం II
1200
2. శ్రమపరికరాలు
10 సం II
300
3.పాత్రలు
5 సం II
50
4. కుర్చీలూ,బల్లలూ వంటి ఇతర సాధనాలు
8 సం II
150
అంశాల మొత్తాలు
83 సం II
1,700
83 సంవత్సరాలకీ -1700 విలువ ఖర్చయితే, 1 సంవత్సరానికి -1700  83=21
ఈపనిస్థలంలో ప్రతీ సంవత్సరం 21 విలువగల ఫిక్స్డ్ సాధనాలు ఖర్చవుతాయి."
       --   ఇదీ రంగనాయకమ్మగారు లెక్కచేసినపద్ధతి               
ఇటువంటి లెక్కని ఈవిధంగా చెయ్యడం తప్పు. సరిగ్గా చేస్తే ఈలెక్క ఇలా ఉంటుంది.
                                                        
ఒక పనిస్థలంలో ఉండే ఫిక్స్డ్ సాధనాలు
వాటి జీవిత కాలాలు
వాటి విలువలు
1 సంవత్సరానికి ఖర్చయ్యే ఫిక్స్డ్ సాధనపు విలువ
1. బిల్డింగు
60 సం II
1200
1200/60=20
2. శ్రమపరికరాలు
10 సం II
300
300/10 =  30
3.పాత్రలు
5 సం II
50
50/ 5 =  10
4. కుర్చీలూ,బల్లలూ వంటి ఇతర సాధనాలు
8 సం II
150
150/8  =19 (సుమారుగా)
1సంవత్సరానికి ఖర్చయ్యే మొత్తం విలువ
79 (సుమారుగా)
మొత్తం సంవత్సరానికి ఖర్చయ్యే విలువ 79 రావాల్సింది, రంగనాయకమ్మగారికి, తప్పుగా చెయ్యడం వల్ల 21 వచ్చింది. దేనికి దానిని విడివిడిగా కూడి, సంవత్సరానికి ఖర్చయ్యే విలువ = +++ = 20+30+10+19=79 --     అనే పద్ధతిలో చెయ్యాల్సినదాన్ని, రంగనాయకమ్మగారు, అన్నింటినీ అమాంతంగా కలిపి, సంవత్సరానికి ఖర్చయ్యే విలువ =
== 21- అనే పద్ధతిలో చేశారు.
పైవన్నీ (లవాలన్నీ) కలిపి, కిందవన్నీ (హారాలన్నీ) కలిపి, భిన్నాల కూడికని చేస్తే లెక్కతప్పు వస్తుందనేది చాలా సాధారణ విషయం. కానీ, రంగనాయకమ్మగారు సరిగ్గా అదే చేశారు. అన్నిటినీ ఒక్కసారిగా కూడివేశారు.
ఎందుకంటే,రంగనాయకమ్మగారి ప్రకారం ఫిక్స్డ్ సాధనాల విలువలనీ, జీవితకాలాలనీ ఇచ్చినప్పుడు, " వాటి జీవితకలాలన్నిటినీ కలిపి, వాటి విలువలన్నిటినీ కూడా కలిపి, ఒక సంవత్సరానికి ఎంతవిలువ వుంటుందో చూస్తే, అంత విలువగల ఫిక్స్డ్ సాధనాలు ఆపనిస్థలంలో ప్రతీ సంవత్సరం ఖర్చవుతాయి - అని తెలుసుకొవచ్చు" (అదే పేజీ)
అంటే, ఈలెక్కని తప్పుగా చెయ్యడం, ఏదో లెక్కచేసే తొందర్లోనో, ఇంకేదో పొరపాటు వల్లనో జరిగింది కాదు. ఇటువంటి లెక్కని చేసే విధానం గురించి సరైన అవగాహన లేక పోవడం వల్లా, తప్పు అవగాహన వుండటం వల్లా జరిగింది.
విడివిడిగా చేస్తె 79 వచ్చే వాటిని ఏకంగా కలిపివేసి, 21 వచ్చేట్లు తప్పుగా చెయ్యడమే కాకుండా, "ఒక్కొక్క ఫిక్స్డ్ సాధనం ఖర్చునీ విడివిడిగా లెక్క కట్టి, ఆలెక్కలన్నిటినీ కలిపినా ఇదే లెక్క వస్తుంది"  అని గ్యారంటీ ఇస్తున్నారు (అదేపేజీ).
అలా చేసినా ఇలాచేసినా ఒకటే వస్తుందనటం తప్పు.
అంటే, ఇటువంటి లెక్క గురించి బొత్తిగా అవగాహన లేదని మళ్ళీ రుజువు చేసుకుంటున్నారు.
మొత్తం కలిపి చేసినా లెక్క సరిగ్గానే వస్తుందనుకోవడం వల్ల, చాప్టర్ చివర్లో రంగనాయకమ్మగారు ఒక లెక్క ఇచ్చారు, పాఠకులు చెయ్యడానికి. " ఒక పనిస్థలంలో ఫిక్స్డ్ సాధనాల జీవితకాలాల మొత్తం 350 సం IIలు. వాటి విలువలమొత్తం 1,05,000 రూ.లు. ఆపనిస్థలంలో తయారయ్యే సరుకు కోసం ప్రతీ నెలా ఎంతవిలువగల ఫిక్స్డ్ సాధనాలు ఖర్చవుతాయి?"- అనేది లెక్క.  ప్రతి ఒక్క సాధనానికీ, దేనికి దానికి విడివిడిగా వివరాలు ఇస్తే తప్ప ఈలెక్కని చెయ్యడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇప్పటికి చూచినదాన్ని బట్టే ఆవిషయం తెలుసుకోవచ్చు.
                                                                                                       
                                                                                     
In translating one must venture to the edge of what is untranslatable   -Goethe
                  ఇక అనువాదాల గురించి. పరిచయం కాపిటల్ కి అనువాదం కాదు. అందులో కొన్ని కొటేషన్లున్నాయి. కాపిటల్ నుంచే కాదు మార్క్స్ ఇతర రచనల నుండి కూడా కోట్ చేశారు. వాటిలో తప్పులున్నాయి - సామాన్యమైనవీ, సారాంశాన్ని మార్చివేసినవీ.
మార్క్సు 'గొర్రెలు '(lambs) [11]అని రాసినవి అనువాదంలో 'మేకలు ' [12]అయినాయి. 'సొరచేపలు '(sharks)[13] 'తిమింగిలాలు '[14]అయినాయి. 'మనసు '(mind)[15] 'మెదడు ' [16]గా మారిపోయింది. ఇలాంటివేకాదు మార్క్స్ 'కొన్నింటిలో ఒకదాన్నీ ప్రస్తావిస్తున్నప్పుడు రంగనాయకమ్మగారు అసలున్నదే ఒకటైనట్లు రాశారు. అలాగే ఒకదాన్ని గురించి చెప్పిన విషయాన్ని ఇతరవాటికి అన్వయించారు. 'జరిగే అవకాశం వుంది ' అనే అర్ధంలో 'ఉండచ్చు ' అని రాస్తే జరిగేదంతా అదే అయినట్లు 'ఉంటాయి' అని రాసిన సందర్భాలున్నాయి. 'ఊహిద్దాం' (assume) అన్నవాటిని వాస్తవాలుగా కొన్నిచోట్ల రాశారు. కీలక పదాలు తొలగించిన సందర్భాలూ వున్నాయి. కొత్తపదాలు ప్రవేశపెట్టినవీ ఉన్నాయి. కొన్ని మాటల అర్ధాలు తప్పుగా రాయడమూ ఉంది. మూలంలో ఒక అర్ధంలో వాడిన పదానికున్న మరొక అర్ధంలో రాయడమూ ఉంది.
1.                 “ -----not only as one of the methods of adding to the efficiency of production” – Capital 1 page 454
పరిచయం 3వ భాగం 120వ పేజిలో దీని అనువాదం ఇలా ఉంది: " ...వుత్పత్తి కార్యంలో సామర్ధ్యానికి దోహదం చేసే పద్ధతిగానే కాక". మూలంలో 'పద్ధతుల్లో ఒకటిగానే కాక' అని ఉంది. అంటే కొన్ని పద్ధతులు వున్నాయి. వాటిలో ఇదొకటి అని మార్క్సు అంటున్నాడు. ఉన్నపద్ధతే ఒకటనట్లు రంగనాయకమ్మగారు చెబుతున్నారు.
2. “As one of the most vital principles of communism” – German Ideology, page 566.                         దీన్నిలా అనువదించారు: "కమ్యూనిస్ట్ సూత్రాలలో అత్యంత ప్రధానమైన సూత్రం" -పరిచయం 5 పేజీ 616. తప్పేమిటో స్పష్టంగానే తెలుస్తోంది.
మార్క్సు ప్రకారం: అత్యంత ప్రధానమైన సూత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలొ ఇదొకటి.. రంగనాయకమ్మగారి ప్రకారం అత్యంత ప్రధానమైన సూత్రం ఇదొక్కటే. అంత ప్రధానమైన సూత్రాలు లేనే లేవు. కొన్నిట్లో ఒకటి అనే మార్క్స్ భావం అనువాదంలో లేదు .
3. మార్క్సు ఒక పరిస్తితిని ప్రస్తావిస్తే, రంగనాయకమ్మగారు అలాంటివాటన్నింటినీ ఒకేగాటన కట్టేశారు. ఇది పరిచయం 5 వ భాగం 453వ పేజీలో ఉన్న వాక్యం: "గతంలో సాగిన సంక్షోభాల తర్వాత ఒక మార్పు జరిగింది". ఇది ఈక్రింది వాక్యానికి తెలుగుసేత:
“ A change has taken place here since the major general crisis” – Capital vol III page 489.
రెండింటినీ పోల్చి చూస్తే తేడా తేలిగ్గానే తెలుస్తుంది. మార్క్సు 'పెద్ద జనరల్ సంక్షోభాన్ని 'దృష్టిలో పెట్టుకున్నాడు. మార్పు జరిగింది ఆసంక్షోభం తర్వాత అని చెబుతున్నాడు. రంగనాయకమ్మగారి ప్రకారం మార్పు జరిగింది అప్పటివరకూ సాగిన అన్ని సంక్షోభాల తర్వాత.
4. ఇలాంటి ధోరణే పరిచయం 3 లో 367 పేజీలో కనబడుతుంది:
" అనుత్పాదక శ్రామికుల సర్వీసుల విలువ వుత్పాదక శ్రామికుల శ్రమల విలువ లాగా గానీ, దాన్ని పోలివుండే విధంగాగానీ ఏర్పడడాన్ని ఏదీ నివారించదు"
మార్క్స్ 'ఏదీ'అని రాయలేదు, ‘ఇది’ అని రాశాడు.
“ This does not prevent, as Adam  Smith remarks, the value of the services of these unproductive labourers being determined, and determinable in the same way as that of the productive labourers” – Theories of Surplus Value1, page 159.
This అంటే 'ఇది '. 'ఏదీ 'కాదు. మార్క్స్ చెప్తున్న 'ఇది ' ఏదో తెలుసుకొవాలంటే ఈకొటేషన్ కి ముందు వాక్యం చదవాలి.
“ They participate in it only through the exchange of their services against revenue”
“వాళ్ళ (అనుత్పాదకశ్రమికుల -మాది) సర్వీసులు రెవిన్యూతో మారటం ద్వారా మాత్రమే వాళ్ళు దానిలో (పాదార్ధిక ఉత్పత్తిలో-మాది) పాల్గొంటారు.”
పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందిందంటే, అనుత్పాదక శ్రామికుల్లో బహుకొద్దిమంది మాత్రమే పాదార్ధిక ఉత్పత్తిలో (material production)  ప్రత్యక్షంగా పాల్గొనగలుగుతారు. వాళ్ళ సర్వీసులు రెవిన్యూతో మారటం ద్వా రా మాత్రమే పాదార్ధిక వుత్పత్తిలో పాల్గొంటారు. ఈవిషయం చెప్పాక అనుత్పాదక శ్రామికుల సర్వీసుల విలువ, ఉత్పాదక శ్రామికుల సర్వీసుల విలువలాగానో, దాన్నిపోలివుండే సరళిలోనో నిర్ణయింపబడాడాన్నీ, నిర్ణయింప తగి వుండడాన్నీ ఇది నివారించదు అని రాశాడు. ’ఇది’ అంటే, ముందు చెప్పిన పరిస్తితి. సర్వీసులవిలువ రెవిన్యూతో మారటం. ఒక్క అంశాన్ని గురించి మార్క్స్ చెప్పినదాన్ని అన్ని అంశాలకూ వర్తింపచేయటం తప్పు.
5. పరిచయం 3వ భాగం 377 వ పేజీలోకి పోదాం.
"పారిశ్రామిక కార్మికులలో అతి తక్కువ జీతాలు గల (వరస్ట్ పెయిడ్) వారూ వ్యవసాయ కార్మికులూ కలిసి కార్మికవర్గంలో మెజారిటీగా ఉంటారు. వీరిగురించే పట్టించుకునేలా ఈ పుస్తకం పరిమితులు మనల్ని ఒత్తిడి చేస్తాయి.”
మూలంలో "...to concern chiefly with..." అని వుంటుంది.chiefly అనే పదం అనువాదంలోకి రాలేదు. ఫలితం ఈరెండు రకాల వాళ్ళను గురించి మాత్రమే పట్టించుకున్నట్లయింది. కాని మార్క్స్ చెప్పింది ప్రధానంగా వాళ్ళ గురించి అని. అంటే ఇతరులగురించి కూడా కొంత పట్టించుకోవడం ఉన్నట్లే.
6. సాపేక్ష అదనపు జనాభాలో అట్టడుగు పొర బికారితనంలో ఉంటారంటు మార్క్స్ వాళ్ళెవరెవరో చెబుతాడు:
"Exclusive of vagabonds,criminals, prostitutes, in a word, tha dangerous classes, this layer of society consists of three categories" - Capital 1, page 602.
దేశదిమ్మరుల్నీ, నేరస్తుల్నీ, వేశ్యల్నీ -ఒక్కముక్కలో ప్రమాదకరవర్గాల్ని మినహాయిస్తే ఈపొరలో మూడు కేటగిరీల వాళ్ళున్నారు- అని దీనర్ధం.
పరిచయంలో అనువాదం ఇందుకు భిన్నంగా వుంది:
"ప్రత్యేకంగా, దేశదిమ్మరులూ, నేరస్తులూ, వేశ్యలూ, - ఒక్కమాటలో చెప్పాలంటే 'ప్రమాదకర వర్గాలు,' సమాజంలోని ఈపొరలో 3 రకాల వాళ్ళున్నారు"- పరిచయం-5, పేజి 522.
దేశదిమ్మరులూ, నేరస్తులూ, వేశ్యలూ కాకుండా మరొక మూడు రకాల వాళ్ళు ఈ పొరలో వున్నారు అనే భావం అనువాదంలో రాలేదు.
Exclusive అంటే 'ప్రత్యేకంగా' కాదు. 'మినహాయించిన 'అని. ఇక్కడ 'వాళ్ళే కాకుండా ' అనో 'వాళ్ళని మినహాయిస్తే' అనో అనువదించాలి.* [17]
7. పరిచయం-5, 452 వ పేజీలో ఇలా ఉంది:
".... ఆ కార్మికులు ఇప్పుడు 'అదనపు జనాభా 'లో భాగంగావుంటారు."
మూలంలో 'తాత్కాలిక అదనపు జనాభా 'అని ఉంది.
"They now form a part of temporary surplus population." - Theories of Surplus Value, vol II, page:497
Temporary అనే మాట అనువాదంలో ఎగిరిపోయింది.
8. "...we assume that the merchant does not enrich himself by depressing wages" Capital III -page:293.
వర్తకుడు ధనం పొందుతున్నది వేతనాలు తగ్గించడం ద్వారా కాదని భావిద్దాం (assume) అంటున్నాడు మార్క్స్.
రంగనాయకమ్మగారి ప్రకారం ఇది వ్ assumption కాదు. వాస్తవం.
" వర్తకుడు ధనం పొందేది, తన కార్మికులకు శ్రమశక్తి విలువగా వుండే జీతాలు ఇవ్వడం ద్వారా కాదు." -పరిచయం-5, పేజీ 62.
ఇదేకదు. ఇంతకన్నా పెద్ద తప్పుందిక్కడ, గమనించి వుంటారిప్పటికే.
"by depressing wages" అంటే 'జీతాలు ఇవ్వడం ద్వారా' అని అర్ధమా? కాదు, 'జీతాలు తగ్గించడం ద్వారా ' అని.
9.'ఇలాఉండవచ్చు 'అన్నట్లుగా మార్క్సు చెప్పిందాన్ని 'ఉన్నదంతా అలానే 'అయినట్లుగా చేసిన తీరు చూద్దాం.
"కానీ సరుకుల విలువ  నుంచీ వాటి వుత్పత్తి ధరలు తేడాగా వుంటాయి కాబట్టి........" - పరిచయం 4, పేజీ:277.
'తేడాగా వుంటాయి' అని బల్లగుద్ది చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే, అదనపువిలువా, లాభమూ ఒకే పరిమాణంలో వున్న సందర్భాల్లో సరుకుల విలువ నుంచి వుత్పత్తిధరలు తేడాగా వుండవు.*[18] అలాంటి అవకాశం లేదనడం కుదరదు. అందుకే మార్క్సు 'తేడాగా వుండవచ్చు ' అన్నాడే కానీ రంగనాయకమ్మ గారిలాగా 'తేడాగా వుంటాయి' అంటూ నిర్ధారించలేదు. ఇప్పుడు మూలంలో చదువుదాం:
"Since the price of production may differ from the value of a commodity" Capital III, page: 164
10. మార్క్సు ఒక అంశాన్ని మరుగుపరచడం గురించి చెబితే, రంగనాయకమ్మగారు రెండు అంశాల్ని మరుగుపరచడంగా రాశారు:
"ధర రూపం అనేది 'విలువ ' కీ 'ధర 'కీ మధ్య [అంటే విలువకీ దాని డబ్బు వ్యక్తీకరణకీ మధ్య] ' పరిమాణాత్మకమైన పొంతనలేని తనాన్ని మరుగుపరచడమే కాకుండా విలువకు సంబంధించి గుణాత్మకమైన పొంతనలేని తనాన్ని కూడా మరుగుపరుస్తుంది." -పరిచయం 4, పేజీ:280.
"The price form, however, is not only compatible with the possibility of a quantitative incongruity between magnitude of value and price i.e. between the former and its expression in money, but it may also conceal a qualitative inconsistency,..." Capital-1 page:104-105
"ధర రూపం అనేది విలువ పరిమాణానికీ, ధరకీ... మధ్య పరిమాణాత్మక పొంతనలేనితనం వుండే అవకాశానికి తగివుండడమే కాకుండా,గుణాత్మక  పొంతనలేనితనాన్ని మరుగు పరచవచ్చు..." అంటాడు. మార్క్సు గుణాత్మకమైన పొంతనలేనితనాన్ని మరుగుపరచవచ్చన్నాడు కానీ, "పరిమాత్మకమైన పొంతనలేనితనాన్ని మరుగు” పరుస్తుందనలేదు. అనువాదం మరొక అడుగు ముందుకువేసి 'పరిమాత్మకమైన పొంతనలేనితనాన్ని’ కూడా 'మరుగు 'పరుస్తుందని చెబుతుంది.
అంతేకాదు. మార్క్సు గుణాత్మకమైన పొంతనలేని తనాన్ని గురిచయినా మరుగుపరచవచ్చు 'అన్నాడే కాని ' మరుగుపరుస్తుంది ' అనలేదు. కానీ పరిచయంలోని అనువాదం 'మరుగు పరుస్తుంది 'అని తేల్చివేసింది.
11. మార్క్సు, తన గతితార్కిక పద్ధతికీ, హెగెల్ గతితార్కిక పద్ధతికీ ఉన్న తేడా గురించి చెబుతూ –
“ To Hegel, the life-process of the human brain, i.e., the process of thinking, which under the name of ‘the idea’, he even transforms into an independent subject, is the demiurgos of the real world, and the real world is only the external, phenomena form of ‘the idea’.”- అన్నాడు.Capital 1, page: 29
పరిచయంలో దీని అనువాదం ఇదీ -"హెగెల్ ప్రకారం: మనిషి మెదడుకి చెందిన జీవక్రమం, అంటే ఆలోచనాక్రమం, ఏదైతే భావం పేరుతో వుంటుందో అది(దేనినైతే అతను ఆఖరుకి ఒక స్వతంత్రవిషయంగా మార్చివేశాడో అది), నిజప్రపంచపు మానవాతీతశక్తి. ఈనిజప్రపంచమేమో 'భావానికి 'సంబంధించిన అసాధారణ బాహ్యరూపం మాత్రమే."- పరిచయం-5, పేజీ: 634.
మూలంలో ఉన్న 'demiurgos' అనువాదంలో 'మానవాతీత శక్తి' అయింది. కానీ demiurgos అంటే 'మానవాతీత శక్తి 'కాదు. సృష్టికర్త. సృష్టికర్త మానవాతీత శక్తేకదా అనవచ్చు! అయితే దెయ్యమూ, సైతానూ కూడా మానవాతీత శక్తులే. కనుక ఆపదం సరైన అనువాదంకాదు. అలాగే మూలంలో "external, phenomenal form" అని వున్నదాన్ని పరిచయంలో "అసాధారణ బాహ్యరూపం" అని అనువదించారు.'phenomenal' అంటే ఇక్కడ అర్ధం, 'ఇంద్రియాగోచర ', 'దృగ్గోచర '-అని. దానికి 'అసాధారణ' అనే అర్ధం కూడా ఉంది. కానీ ఇక్కడ అర్ధం మాత్రం 'ఇంద్రియాగోచర 'అనే.. మార్క్సు రచనల్లో, దాదాపు ప్రతిచోటా  ఈ అర్ధంతోనే ఉంటుంది. వాటిని చదివేవారికి సాధారణంగా ఈవిషయం తెలిసే ఉంటుంది. కానీ, పరిచయంలో మాత్రమిది 'అసాధారణ'o గా అనువాదమయింది.
పరిచయంలో అనువదించిన ఈకొటేషన్  తెలియందేమీ కాదు. 'మార్క్సిస్టు సిద్ధాంతం' అనే వ్యాసంలో 'తాత్విక భౌతికవాదం' గురించి రాస్తూ, ఇదే విషయాన్ని లెనిన్ కోట్ చేశాడు. అందులో డెమియుర్గోస్ (demiurgos) పక్కనే బ్రాకెట్లలో 'సృష్టికర్త, నిర్మాత '( the creator, the maker)-అని ఉంది. ఈవ్యాసాన్ని కొండేపూడి లక్ష్నీనారాయణగారు తెలుగులోకి అనువదించారు.*[19] 'మార్క్సిజం మౌలిక సమస్యలు 'అనే పుస్తకంలో ప్లెహనోవ్ కూడా ఈకొటేషన్ ని ఇచ్చాడు. దానిని నిడమర్తి ఉమారాజేస్వరరావుగారు అనువదించారు. ఇందులోకూడా demiurgos ని సృష్టికర్త 'అనే అనువదించారు.  phenomenal ని ఇంద్రియాగోచర అని తెలుగు చేశారు*.[20] పరిచయంలో ఉన్నట్లు ఎవ్వరూ చెయ్యలేదు, చెయ్యబోరు.
12. The German Ideology, 67వ పేజీలో -
"The rulingideas are nothing more than the ideal expression of the dominant material relations....." అని ఉంది.
భావాలనేవి, భౌతికసంబంధాలకు భావరూప వ్యక్తీకరణలేనని తెలియని మార్క్సిస్టులెవరూ ఉండరు. మార్క్స్, ఎంగెల్స్ లు ఇక్కడ చెబుతున్నది ఆవిషయాన్నే.
"పాలకభావాలు అనేవి, ప్రబలమైన భౌతిక సంబంధాలకు భావరూప వ్యక్తీకరణే తప్ప వేరొకటి కాదు..." అంటున్నారు.
పరిచయం- 5 లోని 652 వ పేజీలో దీన్నిలా అనువదించారు.-
"పాలక వర్గ భావాలు అనేవి, ప్రబలంగా వున్న భౌతిక సంబంధాలకు ఖచ్చితమైన వ్యక్తీకరణ తప్ప ఇంకేమీ కాదు."
'భావాత్మక' అనో 'భావరూప 'అనో  అనువదించాల్సిన idealని 'ఖచ్చితమైన 'అని అనువదించారు. 'భావాత్మక 'అనడానికీ 'ఖచ్చితమైన 'అనడానికీ ఎంతో తేడా ఉంది. Ideal అనేదాన్ని 'ఖచ్చితమైన 'అని అనువదించడంలో ఏమాత్రం ఖచ్చితత్వం లేదు.
13."సమాజంలో సహజంగా ఏర్పడ్డ భిన్న వృత్తుల్న్ని వర్క్ షాపులో ఒక క్రమ పద్ధతిలో వున్నత స్థాయికి చేర్చడం ద్వారానూ, వాటిని పునరుత్పత్తి చెయ్యడంద్వారానూ, మాన్యుఫాక్చర్, స్పెషలైజ్డ్ శ్రామికుడికి నైపుణ్యాన్ని ఇస్తుంది"- పరిచయం-3, పేజీ:35-36
ఈపునరుత్పత్తి చేసేదీ, ' క్రమపద్ధతిలో వున్నత స్థాయికి ' చేర్చేదీ- వేటిని? భిన్న వృత్తుల్ని.అంటే రకరకాలుగా వున్న వృత్తుల్ని.కానీ మూలంలో "వృత్తుల విభజనని పునరుత్పత్తి చెయ్యదం ద్వారానూ, వర్క్ షాప్ లోపల క్రమపద్ధతిలో చివరికంటా తీసుకెళ్ళడం ద్వారానూ..." అని వుంది. (" by reproducing, and systematically driving to an extreme within the workshop..." - Capital-1, page"321)
వృత్తుల 'విభజన 'ని గురించి చెబుతున్నది భిన్న వృత్తుల గురించి చెబుతున్నట్లు అనువాదమయింది.
14."The prerequisites for the capitalist mode of production...are the following" capital-3-page:618
"పెట్టుబడిదారీ ఉత్పత్తివిధానానికి పూర్వషరతులు ఇవీ" అని మార్క్సు చెబుతున్నాడు. పరిచయం-5 లోని 271 వ పేజీలో " పెట్టుబడిదారీ వుత్పత్తి విధానానికి లక్షణాలు ఇవీ"- అని అనువాదం చేశారు. 'పూర్వ షరతులు 'కి బదులుగా 'లక్షణాలు 'అని చేశారు.'పూర్వషరతులు ' అంటే ఆవిధానం రావడానికి ముందుగా వుండవలసినవి. 'లక్షణాలు ' అనేవి ఆవిధానంతో వచ్చేవి.
అనువాదం చెయ్యడానికి 'మూలం ' ఉండటమన్నది ‘పూర్వ షరతు’. కానీ అనువాదానికి మూలం ‘లక్షణం’ కాదు. ‘పూర్వషరతు’ కీ ‘లక్షణాని’కీ అంత తేడా ఉంది.
15."వర్తకుడికేమో, చలామణీ ఖర్చులు, వాటి పరిమాణానికి తగ్గట్టుగా వచ్చే జనరల్ లాభం రేటుకి మూలంగా వుంటాయి"- పరిచయం-5, పేజీ-57
దీనికి మూలం ఇదీ: "To the merchant they appear as a source of his profit, proportional, given the general rate of profit, to their size" Capital3-page:301
" జనరల్ లాభం రేటుకి మూలంగావుంటాయి" - అని అనువాదంలో ఉంది. కాని మార్క్సు " లాభానికి మూలంగా కనిపిస్తాయి" అనిచెప్పాడు.'లాభం' అనడానికీ 'లాభం రేటు 'అనడానికీ ఎంతో తేడా ఉంది.
మార్క్సు చెప్పేప్రకారం: ఒక నిర్దిష్టమైనలాభం రేటు ఉన్నప్పుడు, చలామణీ ఖర్చుల పరిమాణం లాభానికి మూలంగా వర్తకునికి కనిపిస్తుంది. ఉదాహరణకి  లాభం రేటు 20% ఉందనుకోండి.అప్పుడు చలమణీ ఖర్చులు 100 అయితే, 20 లాభం వస్తుంది. 200 అయితే 40 లాభం వస్తుంది. అంటే చలామణీ ఖర్చుల్ని లాభం వస్తున్నట్లుగా, లాభానికి చలామణీ ఖర్చులు మూలంగా ఉన్నట్లుగా వర్తకునికి కనిపిస్తుంది.
కానీ 'పరిచయం' లోని అనువాదం ప్రకారం చలామణీ ఖర్చులకి తగ్గట్లుగా వచ్చేది 'లాభం ' కాదు, 'జనరల్ లాభం రేటు’
అంటే చలామణీ ఖర్చులు 100 అయితే 20 లాభం రేటు ఉందనుకోండి. అప్పుడు 200 కి 40% లాభం రేటు ఉంటుంది. అంటే 100 కి 20 లాభం వుంటే, 200 కి80 లాభం అవుతుంది.(200 కి లాభం రేటు 40% కాబట్టి)
మార్క్స్ లాభం అన్నదాన్ని 'లాభం రేటు' గా అనువదించడం వల్లనే విషయం ఇంత అవకతవకగా తయారయింది.
16. "దోపిడీ స్థాయి ఇంత అని వున్నప్పుడు, ఒకశాఖలో వుత్పత్తి అయిన అదనపువిలువ రాశి 'సామాజిక పెట్టుబడి 'కి సంబంధించిన సగటు (జనరల్) లాభం రేటు ఏర్పాటుకి చాలా ముఖ్యం."   పరిచయం-4, పేజీ 278
మూలంలో _ "At a given degree of exploitation, the mass of surplus-value produced in a particular sphere of production is then more important for the aggregate average profit of social capital" - అని వుంది. Capital III -page167
ఇక్కడకూడా మార్క్సు లాభం మొత్తం (aggregate) గురించి చెబుతుంటే పరిచయంలో లాభం రేటు అని అనువా దంచేశారు.
17."......boards of numerous managers or directors are placed above the actual director, for whom supervision and management serve as a pretext to plunder the stock holders and amass wealth."- Capital- III, page:389.
"....వాస్తవ డైరెక్టర్ కంటే పైన, అనేక మంది మేనేజర్లా, డైరెక్టర్లా బోర్డులుంటాయి.స్టాక్ హోల్డర్లను దోచుకోవడానికీ, సంపద కూడబెట్టడానికీ, సూపర్విజనూ, మేనేజిమెంటూ అతనికి సాకుగా మాత్రమే వుపయోగపడతాయి."- అని మార్క్సు చెబుతున్నాడు.
పరిచయం-5 , 244వ పేజీలో ఇలా అనువాదం అయింది:
"...అనేకమంది మేనేజర్ల, లేదా డైరెక్టర్ల బోర్డులు వుంటాయి. సూపర్ విజనూ, మేనేజిమెంటూ అనేవి, వాళ్ళకి, వాటాదారుల్ని కొల్లగొట్టి సంపదని కూడగట్టుకోవడానికీ సాకులుగా వుపయోగపడతాయి."
మార్క్సు ప్రకారం కొల్లగొట్టడానికి సాకులుగా ఉపయోగపడేది "వాస్తవ డైరెక్టర్" కి. కాని అనువాదంలో డైరెక్టర్ల (లేక మేనేజర్ల) బోర్డులకు సాకులుగా వుపయోగపడుతున్నట్లుగా తయారయింది. కొల్లగొట్టడానికి సాకులుగా ఉపయోగించుకునే 'వాస్తవ డైరెక్టర్  మాత్రం హాయిగా తప్పుకున్నాడు.'
18. "దేన్నయితే ...రికార్డో వుత్పత్తి ఖర్చు (కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా కాస్ట్ ప్రైస్) అనీ అంటాడో" -పరిచయం-4. పేజీ:279
మూలంలో - "Recardo calls price of production or cost of production" Capital III,page:198 "  
కాపిటల్ లో వున్న ప్రైస్ ఆఫ్ ప్రొడక్షన్, పరిచయంలో కాస్ట్ ప్రైస్ గా మారింది. కానీ,'కాస్ట్ ప్రైస్ ' కీ 'ప్రైస్ ఆఫ్ ప్రొడక్షన్ ' కీ చాలా తేడా వుంది.
కాస్ట్ ప్రైస్ = ప్రైస్ ఆఫ్ ప్రొడక్షన్ - సగటు లాభం.వీటి మధ్య ఇంత తేడా వున్నా, 'ప్రైస్ ఆఫ్ ప్రొడక్షన్ ' అనే ఇంగ్లీష్ మాటస్థానంలో, 'కాస్ట్ ప్రైస్’ అనే ఇంకోమాటని పరిచయంలోకి తెచ్చిపెట్టారు. మూలంలో ఒకటి ఉంటే అనువాదంలో ఇంకొకటి ఎందుకు పెట్టారో అంతుబట్టదు.
19. "The more advanced country sells its goods above their value even though cheaper than the competing countries-" Capital-III, p.238"
"ఎక్కువ పురొగమించిన దేశం తనసరుకుల్ని పోటీపడే దేశాలకన్నా చౌకగా అమ్ముతున్నప్పటికీ, వాటివిలువలకన్నా ఎక్కువకే అమ్ముతుంది."- అంటున్నాడు.
రంగనాయకమ్మగారేమో:" ఎక్కువ పురోగమించిన దేశం (మోర్ అడ్వాన్స్ డ్ కంట్రీ ) తను పోటీ పడుతున్న దేశాల సరుకులకంటే తనసరుకులు తక్కువ విలువతో వున్నప్పటికీ, వాటిని వాటి విలువలకన్నా ఎక్కువకి అమ్ముతుంది.." పరిచయం-5, పేజీ 344
'తన సరుకులు తక్కువతో ఉన్నప్పటికీ 'అని పరిచయంలో ఉంది కానీ కాపిటల్ లో లేదు. 'చౌకగా అమ్ముతున్నప్పటికీ 'అని కాపిటల్ లో వున్నది, అనువాదంలోకి రాలేదు. మార్క్సు చెప్పిందొకటి రంగనాయకమ్మగారు రాయలేదు. రంగనాయకమ్మగారు రాసిందొకటి మార్క్సు చెప్పలేదు.
20. "..as long as the capitalist mode of production continues to exist, interest bearing capital, as one of its forms, also continues to exist.." -Capital3, page 607
"పెట్టుబడిదారీ వుత్పత్తి విధానం ఉనికిలో కొనసాగినంతకాలమూ దాని రూపాల్లో ఒకటిగా వడ్డీ పెట్టుబడి కూడా ఉనికిలో ఉంటుంది... " అంటాడు.
పెట్టుబడి రూపాలలో వడ్డీపెట్టుబడి కూడా ఒకటి. అది పెట్టుబడిదారీ విధానం కొనసాగినంతవరకూ ఉనికిలో వుంటుంది, అని వడ్డీ పెట్టుబడి గురించి చెప్తున్నాడు. కాని వడ్డీ పెట్టుబడి అనేది పరిచయంలో అనువాదానికి నోచుకోలేదు.
"పెట్టుబడి దారీ విధానం వునికిలో కొనసాగినంత కాలమూ, దాని రూపాలలో ఒకటిగా 'క్రెడిట్ విధానం' కూడా వునికిలో వుంటుంది - పరిచయం 5 పేజీ 608.మూలంలో 'క్రెడిట్ విధానం ' అనేది ఉందేమో చూడండి.వడ్డీపెట్టుబడి స్థానంలో 'క్రెడిట్ విధానం ' పెట్టారు . ఎక్కడిదీ పదబంధం? అనువదించిన భాగంలో లేదు మిగిలిన వాక్యంలో ఉంది. "and constitutes in fact the basis of its credit system."
అంటే వడ్డీ పెట్టుబడి వాస్తవానికి క్రెడిట్ విధానానికి పునాదిగా ఉంటుంది- అని. ఇందులో ఉన్న క్రెడిట్ విధానాన్ని తీసుకుపోయి ముందుభాగానికి జోడించారు. దాంతో అక్కడుండాల్సిన 'వడ్డీ పెట్టుబడి 'తప్పుకుంది.
21.వెకిలి ఆర్ధికవేత్త (vulgar economist)అభిప్రాయాన్ని గురించి చెప్పే సందర్భం ఇది.
సరుకు పెట్టుబడీ, వర్తక పెట్టుబడీ, మనీడీలింగ్ పెట్టుబడీ అనేవి పెట్టుబడిదారీ వుత్పత్తి విధానం నుంచి ఆవిర్భవించాయి. అంతకుముందున్న వుత్పత్తి విధానాలలో ఇవి లేవు. కాని వెకిలి అర్ధికవేత్త అభిప్రాయంప్రకారం ఇవన్నీ 'దానికదిగా ఉత్పత్తిక్రమం ' నుంచే (' పెట్టుబడిదారీ వుత్పత్తివిధానం, అనే ప్రత్యేకరూపంతో సంబంధం లేకుండా) పుట్టుకొస్తాయి. ఈవిషయాన్ని మార్క్సు  ఇలా చెప్పాడు:
"సరుకు పెట్టుబడినీ, డబ్బు పెట్టుబడినీ, ఆతర్వాత వర్తకపెట్టుబడినీ, మనీడీలింగ్ పెట్టుబడినీ దానికదిగా వుత్పత్తిక్రమం (process of production as such) నుండే అవసరంగా తలెత్తే రూపాలుగా రాబట్టడానికి అతను (వెకిలి ఆర్ధికవేత్త- మాది) పడే తంటాలు"
మూలంలో -"...his apologetic endeavours to deduce commodity  - capital and money - capital, and latter commercial capital and money-dealing capital as forms arising necessarily from the process of production as such..." Capital-III page:324
పరిచయం-5, 62-63 పేజీల్లో దీన్నిలా అను వధించారు:
"'సరుకు పెట్టుబడి' నీ, డబ్బు 'పెట్టుబడి' నీ; తర్వాత 'వర్తకపెట్టుబడి‘ నీ, 'మనీడీలింగ్ పెట్టుబడి' నీ - వుత్పత్తివిధానం అనే దాని నించే తప్పనిసరిగా పుట్టుకొచ్చే అంశాలుగా గ్రహించకుండా తప్పించుకోవడానికి అతను చేసే దొంగయత్నాలు"
ఆనాలుగు రకాల పెట్టుబడులూ 'ఉత్పత్తి విధానం’ నుంచి (దానిరూపంతో సంబంధం లేకుండా)పుట్టుకొచ్చినవేనని గ్రహించకుండా తప్పించుకోవడానికి దొంగయత్నాలు చేస్తాడట- వెకిలి ఆర్ధికవేత్త.
వీటన్నిటినీ " దానికదిగా వుత్పత్తివిధానం" నుంచే పుట్టుకొచ్చేవిగా చూపించడానికి తంటాలు పడుతుంటాడని మార్క్సు అంటే, అలా పుట్టుకొస్తాయని గ్రహించకుండా 'తప్పించుకోవడానికి దొంగయత్నాలు 'చేస్తున్నాడని అనువదించడం! అప్పటికి ఇవన్నీ అలా పుట్టుకొస్తాయని మార్క్సే అంటున్నట్లూ,  వెకిలి ఆర్ధవేత్త దాన్ని గ్రహించకుండా 'తప్పించుకోవడానికి దొంగయత్నాలు ' చేస్తున్నట్లూ తయారయింది.మార్క్సు వెకిలి ఆర్ధికవేత్త గురించి చెప్పింది మార్క్సుకే తగులుకుంది. వెకిలి ఆర్ధికవేత్తేమో అది (తను చెప్పిందే తనకు అంటకుండా 'దొంగయత్నాలు 'చేసున్నాడు. మార్క్సు చెప్పే దాని సారాంశం తల్లక్రిందులయింది.
కాపిటల్ ని తప్పుగా అనువదించిన బ్రాడ్ హౌస్  ని విమర్శిస్తూ How not to translate Marx, అనే వ్యాసంలో ఎంగెల్స్ అన్న మాటలే [21]*పరిచయంలో వున్న ఇలాంటి అనువాదాలకి కూడా సరిపోతాయి:
"చిన్న చిన్న తప్పుల్ని పక్కనబెడితే, మార్క్సు చెప్పిందానికి, సరిగ్గా వ్యతిరేకదాన్ని, మార్క్సే చెప్పేట్లుగా చేస్తాడు మిస్టర్ బ్రాడ్ హౌస్."
"మార్క్సు 'తెలుపు 'అన్నదాన్ని 'నలుపు 'అని ఎందుకు అనువదించకూడదో మిస్టర్ బ్రాడ్ హౌస్ కు అంతుబట్టదు."
                                                                                 “They appear as a sign of confused thinking.
                                                                           That is why they are called logical contradictions”
                                                                                                                                    -A.Spirkin, O.Yakhot
పరిచయం -1కి రాసిన ముందుమాటలో రంగనాయకమ్మగారు "ఇందులో వున్నదంతా....తర్కం.లెక్కలంత ఖచ్చితమైన తర్కం" అన్నారు.[22]* లెక్కలసంగతి ఇంతకు ముందే చుశాము. ఇక ఇప్పుడు 'తర్కం 'సంగతి కొద్దిగా చూద్దాం.
ఏవిషయమైనా తార్కికంగా సరిగా వుండాలంటే అందులో కన్సిస్టెన్సీ (consistency) వుండాలి[23]** అంటే, అందులో చెబుతున్న విషయాలమధ్య పొంతన వుండాలి. ఒకసారి ఒకరకంగా చెప్పిన తరువాత మళ్ళీ దానికి భిన్నంగాగానీ వ్యతిరేకంగావుండే రీతిలోగానీచెప్పగూడదు. ఖచ్చితంగా, నిర్దుష్టంగా చెప్పాలి. చివరివరకు ఒకలాగే చెప్పాలి. తేడాలుండకూడదు.ఒకసారి ఒకరకంగా ఇంకోసారి ఇంకోరకంగా చెబితే అది తర్కం అనిపించుకోదు. కానీ, అలాచెప్పిన సందర్భాలు కూడా పరిచయంలో వున్నాయి.
1. - "యంత్రాల్ని కనిపెట్టి, వాటితో వుత్పత్తిచెయ్యడం ప్రారంభమైనప్పటినించీ అది భారీపరిశ్రమగా మారింది." (పరిచయం-3, పేజీ:2). మళ్ళీ అదేపుస్తకంలోని 6వ పేజీలో "ఆటోమేటిక్ యంత్రాలద్వారా వుత్పత్తిజరగడం ప్రారంభమైనప్పటి నించీ అది 'భారీ పరిశ్రమ '."
ఈరెండు వాక్యాలూ కరెక్ట్ కావాలంటే యంత్రాలూ ఆటోమేటిక్ యంత్రాలూ ఒకటైనా అయ్యుండాలి, లేకపోతే రెండూ ఒకేసారి వుత్పత్తిలో ప్రవేశించయినా ఉండాలి. కాని అవి రెండూ ఒకటికావు.[24] ఒకేసారి ప్రవేశించనూ లేదు.
2. వస్తువు, సరుకూ గురించి పరిచయంలో వున్న గందరగోళం అంతాయింతా కాదు."...మారక సంబంధంలో వున్న వస్తువు, ఒక ఉపయోగపు విలువగల వస్తువుగా వుంటూనే, కొంత మారకం విలువగల సరుకుగాకూడా వుంటుంది. అంటే ఆసమయంలో దానికి వస్తువు లక్షణాలూ, సరుకులక్షణాలూ కూడా వుంటాయి. అయితే, ఆ 2 లక్షణాలూ దానికి ఏక కాలంలోనే వుండవు. అది వస్తువుగా వున్న క్షణాలలో సరుకుగా వుండదు; సరుకుగావున్న క్షణాలలో వస్తువుగా వుండదు."- (పరిచయం1, పేజీ:88)
'ఆసమయంలో' దానికి వస్తువు లక్షణాలూ సరుకు లక్షణాలూ 'కూడా' వుంటాయంటూ, మళ్ళీ ‘ఏకకాలంలోనే’ వుండవనడం! "వస్తువుగా వున్న క్షణాలలో వస్తువుగా వుండద"ట." సరుకుగా వున్న క్షణాలలో వస్తువుగా వుండ" దట. మరి "వస్తువు లక్షణాలూ, సరుకు లక్షణాలూ కూడా " ఆసమయంలోనే వుండటమంటే ఏమిటో?
3. పోనీ, "వస్తువుగా వున్న క్షణాలలో సరుకుగా వుండదు. సరుకుగా వున్న క్షణాలలో వస్తువుగా వుండదు." అనే దానిమీద నిలబడ్డారా అంటే అదీలేదు.
దాని పక్క పేజీలోనే "వస్తువుని సరుకు అని ఎప్పుడూ అనకూడదు. కానీ 'సరుకు'ని వస్తువు అనికూడా అనవచ్చు."..అంటారు.
' సరుకుగా వున్న క్షణాలలొ వస్తువుగా వుండ'నప్పుడు, సరుకుని వస్తువు అని కూడా ఎలా అంటారు? "ఆ 2 లక్షణాలూ దానికి ఏకకాలంలో వుండవు" కదా.
4. " మనుషులు తయారు చేసేవి 'వస్తువులు '. మనుషులతో సంబంధం లేకుండా ప్రకృతి సహజంగా తయారయ్యేవి వస్తువులు కావు, అవి ప్రకృతి సహజ పదార్ధాలు." (పరిచయం-1, పేజీ 69)
"ప్రతీ ఒక్క వస్తువూ, ప్రతీ ఒక్క పదార్ధం శ్రమవల్లనే తయారవుత్యాయి." (పరిచయం-1, పేజీ 69)
మొదటి కొటేషన్లో శ్రమలేకుండా వుండేదే 'పదార్ధం ' అని చెప్పారు.రెండో దాంట్లో 'ప్రతీ ఒక్క పదార్ధం శ్రమవల్లనే తయారవు 'తుందని పూర్తివ్యతిరేకంగా చెబుతున్నారు.
5. వస్తువులకి మారకం తప్పనిసరి కాదు. మారకం జరిగిన సందర్భాలలో మాత్రమే, ఆవస్తువులో వున్న శ్రమ విలువ అవుతుంది., జరగని సందర్భాలలో కాదు - అనే వుద్దేశ్యంతో " విలువగా అయ్యేది శ్రమే అయినా, శ్రమ అనేది తప్పనిసరిగా విలువగా  అవ్వాలనే నియమం లేదు" అంటూ " దీన్నే క్లుప్తంగా చెబితే, 'విలువ అంటే శ్రమే, కానీ శ్రమ అంటే విలువ కాదు.' " - అని సూత్రీకరించారు. (పరిచయం-1. పేజీ:85).
'విలువ అంటే శ్రమే ' అనడం వరకూ బాగానే వుంది కానీ, శ్రమ అంటే విలువ కాదు 'అని సూత్రీకరించడం తప్పు. ఎందుకంటే మారకం జరిగే సందర్భాల్లో, శ్రమ అంటే విలువే కాబట్టి.
మారకం జరిగినప్పుడే శ్రమ విలువ అవుతుంది, జరగనప్పుడు కాదు, అనేదాన్ని క్లుప్తంగా చెబితే 'శ్రమంటే విలువ కాదు ' అవుతుందా?ఎలా? కొన్నిసందర్భాలలో అనే అర్ధాన్నిచ్చే పదం అందులో ఏముంది?
దీనిని సరిగ్గా చెప్పాలనుకుంటే "శ్రమ ప్రతిసందర్భంలోనూ విలువ కాదు" అని చెప్పవచ్చు. అంతేగాని, ఒకపక్క మారకం జరిగినప్పుడు శ్రమ విలువ అవుతుందని చెబుతూ, ఇంకోపక్క 'శ్రమ అంటే విలువ కాదు' అని జనరలైజ్ చెయ్యడం తర్కం అనిపించుకోదు. ఇది "క్లుప్తంగా" చెప్పడం కాదు, తప్పుగా చెప్పడం.
6."పెట్టుబడిదారుడు ఖర్చుచేసే మొత్తం పెట్టుబడిలో ఒకభాగం 'ముడిపదార్ధాలు 'గానూ, ఇంకొభాగం 'శ్రమసాధనాలు 'గానూ వుంటుంది." (పరిచయం-2, పేజీ: 40)
"ముడిపదార్ధాల్నీ, శ్రమపరికరాల్నీ, ఆగ్జైలరీ పదార్ధాల్నీ, మొత్తం సరుకు తయారీలో కావలసిన అన్ని నిర్జీవ వస్తువుల్నీ కలిపే 'శ్రమ సాధనాలు 'అంటున్నామనే సంగతి మరచిపోవద్దు."  (పరిచయం 2, పేజీ: 44)
మొదటి కొటేషన్లో శ్రమసాధనాలూ, ముడి పదార్ధాలూ వేరువేరు అయినట్లు చెప్పారు. రెండో కొటేషన్లో ముడిపదార్ధాలు శ్రమసాధనాల్లో భాగమయినట్లు చెబుతున్నారు. వీటిలో ఏదో ఒకటే కరెక్టు కావాలి. రెండోది తప్పయి తీరాలి. మార్క్సు ప్రకారం అయితే ముడిపదార్ధాలు వేరూ, శ్రమసాధనాలు వేరూ.*[25]
రంగనాయకమ్మగారు 'పరిచయం ' చేసిన ఈపుస్తకానికి "మార్క్స్ కాపిటల్" అని పేరు పెట్టారు కాబట్టి, ఇందులో వున్న తప్పులన్నీ మార్క్సు రాసినవేనేమోననిపించవచ్చు. కానీ పరిచయంలో వున్న గందరగోళానికి 'కాపిటల్ 'తో ఏమాత్రం సంబంధంలేదు. పూర్తిగా వారి సొంతం.
మార్క్సు శ్రమకలిసిందే వస్తువు (థింగ్)అని ఎక్కడా చెప్పలేదు. ప్రకృతిసహజపదార్ధాల్ని కూడా వస్తువులన్నాడు*[26] కానీ రంగనాయకమ్మగారి ప్రకారం "ప్రకృతిసహజంగా తయారయ్యేవి వస్తువులు కావు." మార్క్సు శ్రమసాధనాలలో ముడిపదార్ధాల్ని చేర్చలేదు. రంగనాయకమ్మగారు అలా చేర్చిన సందర్భాలు చాలా వున్నాయి.
అంతేకాదు, " 'శ్రమసాధనాలు ' అన్నా, 'వుత్పత్తిసాధనాలు ' అన్నా ఒకటే "నని పరిచయం-2 లోని 37 వపేజీలోనూ, 321 వ పేజీలోనూ కూడా రంగనాయకమ్మగారు చెప్పారు. కానీ మార్క్సు ప్రకారం శ్రమసాధనాలు, వుత్పత్తి సాధనాలలో భాగం మాత్రమే.**[27]
ఆఖరికి, సరుకులో వైరుధ్యం గురించి కూడా పరిచయంలో తప్పే చెప్పారు.
"సరుకులొ వుండే వుపయోగపువిలువా, విలువా విరుద్ధాంశాలు. ఇవి ఒకటి వున్నచోట ఒకటి వుండవు. ఇది 'సరుకు 'లోవున్న వైరుధ్యం." (పరిచయం-1, పేజీ: 196)
విరుద్ధాంశాలు కలిసివుండడమే వైరుధ్యం. ఒకటివున్నచోట ఒకటి వుండకపోతే అది వైరుధ్యమే కాదు.
"వాస్తవమేమిటంటే, ఏవిరుద్ధాంశమైనా విడిగా వుండలేదు. దాని వ్యతిరేకాంశం అనేది లేనప్పుడు దాని వునికికి కావలసిన పరిస్థితినే అది కోల్పోతుంది."[28] అంటాడు మావో.
కానీ, రంగనాయకమ్మగారు మాత్రం ఒకటి వున్నచోట ఒకటి వుండక పోవడమే వైరుధ్యం అంటారు. సరిగ్గా వ్యతిరేకంగా!
- 'గిల్డు ' గురించి రంగనాయకమ్మగారి అభిప్రాయం మరీ విడ్డూరం.
"గిల్డు అంటే నేతగానీ, కుట్టుగానీ, కమ్మరంగానీ, వడ్రంగం గానీ, ఏదోఒక వృత్తి (పని) జరిగే స్థలం" అట.(పరిచయం 3, పేజీ:2)
గిల్డు అంటే ‘పనిస్థలం' కాదు, ‘వృత్తిసంఘం '. ఏడిక్షనరీలోనైనా దీని అర్ధం వుంటుంది. 'కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక 'లోకూడా స్పష్టంగా వుంది. తెలుగులో గిల్డు అనే దానిని ఎవరైనా 'వృత్తిసంఘం' అనే రాశారు కానీ 'పనిస్థలం ' అని ఎవరూ రాయలేక పోయారు - ఒక్క రంగనాయకమ్మగారు తప్ప.
మార్క్స్ రాసిన కాపిటల్ కీ రంగనాయకమ్మగారు పరిచయంచేసిన మార్క్స్ కాపిటల్ కీ ఎన్నో తేడాలున్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ చూపించాము. వీటితో అయిపోలేదు. ప్రధానమైన విషయాలలో సైతం పరిచయంలో తప్పులు జరిగాయి. విలువగురించీ, విలువరూపం గురించీ పరిచయంలో చెప్పినదాంట్లో లొసుగులున్నాయి.
అదనపువిలువ సిద్ధాంతం గురించి మార్క్స్ చెప్పేదొకటైతే, రంగనాయకమ్మగారు చెప్పిందింకొకటి. మార్క్స్ గతితర్కం 'పరిచయం' లో గందరగోళంగా మిగిలింది.
ఒకవిషయంలో ఎంగెల్స్ రాసింది సందేహాలకు దారితీస్తుందని అన్నారు.
ఉత్పాదక అనుత్పాదక శ్రమలవిషయంలో మార్క్సే తప్పుగా వున్నట్లు చెప్పారు.
అయితే వీటి గురించి వివరంగా రాయవలసి వుంది.
రంగనాయకమ్మగారు అరిస్టాటిల్ పరిశోధన ప్రారంభించాడని చెప్పేనాటికి ఆయన చనిపోయి 22 సంవత్సరాలయింది.
"విలువ అంటే శ్రమ" అనే సూత్రీకరణ రాజకీయార్ధికశాస్త్రానికే మూలస్తంభం లాంటిది. అయినా దాన్ని మొదట ఎవరు సూత్రీకరించారు, ఎప్పుడు సూత్రీకరించారు - అనే వాటిలో కూడా 'పరిచయం'లో తప్పే ఉంది.
'కాపిటల్ 'లో వున్న లెక్కలన్నీ చిన్నవే. సాధారణంగా ఎవరికైనా తెలిసివుండేవే. అయినా ఈ లెక్కలలో కూడా పరిచయంలో తప్పులు ఉన్నాయి.
రూపాయల్ని భాగించినప్పుడు వచ్చేది కూడా రూపాయలే గానీ, పైసలు కాదు.
పైవన్నీ (లవాలన్నీ)కలిపి, కిందవన్నీ (హారాలన్నీ)కలిపి, భిన్నాల కూడికని చేస్తే లెక్కతప్పు వస్తుందనేది చాలా సాధారణ విషయం. కానీ, రంగనాయకమ్మగారు సరిగ్గా అదే చేశారు
Ideal అనేదాన్ని 'ఖచ్చితమైన 'అని అనువదించడంలో ఏమాత్రం ఖచ్చితత్వం లేదు.
మార్క్సు వెకిలి ఆర్ధికవేత్త గురించి చెప్పింది మార్క్సుకే తగులుకుంది.
ఆఖరికి, సరుకులో వైరుధ్యం గురించి కూడా పరిచయంలో తప్పే చెప్పారు.
'గిల్డు ' గురించి రంగనాయకమ్మగారి అభిప్రాయం మరీ విడ్డూరం.




*పరిచయం-1-2వ ముద్రణ,14 వ పేజీ (పరిచయం-1 నుంచి ఇచ్చిన కొటేషన్లన్నీ, ప్రత్యేకించి చెప్పనప్పుడల్లా 3 వ ముద్రణ నుంచి ఇచ్చినట్లు)
[1] Karl Marx, A biography, progress Publishers, Moscow, 1984, page-372
[2] Marx Engels  Selected correspondence, progress Publishers, Moscow, 1982, page-180
[3] 'కాపిటల్ ప్రచురణ కధా(ఎ.ఉరొయేవా పుస్తకానికి తెలుగు అనువాదం)విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1979, 26 వ పేజీ.
[4] ఈరచనని 1859 లోనే, మార్క్స్ రాశాడన్న విషయం 'పరిచయం-1' లోని 10,16 పేజీలలో కూడా ఉంది.
[5] Terrell Carver రాసిన ‘Marx & Engels the intellectual relationship’ (1983) –page-1
[6] Karl Marx, Capital, Vol:1, Progress publishers Moscow, 1986 page:433
[7] . Karl Marx, ‘Theories of Surplus Value’-1-p 355
[8] . Karl Marx, A Contribution to the Critique of political Economy, progress publishers, Moscow, 1989,p-61
[9] మార్క్స్ ఎంగెల్స్ సంకలితరచనలు-భాగం2,1981,39 వ పేజీ
[10] .Everyman’s Encyclopaedia vol 1 p406
[11]  CapiTal III -page 440
[12] పరిచయం-5 పేజీ 193
[13] CapiTal III -page 440
[14] పరిచయం-5 పేజీ 193
[15]  Capital-1-page29
[16] పరిచయం-5 పేజీ 635
[17] .* జర్మన్ నుంచి EdenCedar Paul లు చేసిన అనువాదంలో " Excluding Vagabonds, criminals and prostitutes.... అని వుంది.(Capital, page:711)
[18] * “1) 80c + 20v + 20s. rate of profit = 20%
           Price of product = 120 value=120…… in branches of production in which the composition happens to coincide with the social average, would value and price of production be equal,”- Capital: vol: III, page: 164.
[19] * లెనిన్ సంకలిత రచనలు (9 సంపుటాల్లో) 1వ సంపుటం, పేజీ: 18
[20] * ప్లెహనోవ్, మార్క్సిజం మౌలిక సమస్యలు, పేజీ:40
[21] * See : Homage to Karl Marx, 1969, pages 72,74
(ఇంగ్లిష్ కొటేషన్లు అన్ని పరిచయంలో చెప్పిన ఎడిషన్లలోవే. పరిచయంలోని అనువాదాలలో తప్పుగావున్న భాగం వరకే కోట్ చేశాము)
[22]  *పరిచయం -1, పేజీ:21
[23]  ** “ The laws of logic are the laws of consistency.” –The Open philosophy and the Open Society, by Maurice Cornforth,1970, page:76
[24] * See Capital 1-page: 360
[25] * See: Capital, vol : 1, pages 174&176
[26] * See: Capital, vol : 1, pages: 48&174
[27] ** See: Capital, vol : 1, page : 176
[28] *Selected works of Mao Tse-tung, 1975, vol: 1, page 338

2 కామెంట్‌లు:

  1. కాపిటల్ పరిచయంలొ అక్కడక్కడా పొరపాట్లు జరిగి ఉండవచ్చు అంతమాత్రాన మొత్తం పరిచయమే పనికిరాదనటం అది సరైనదికాదు. కాపిటల్ లాంటి పుస్తకాలు పెద్ద పెద్ద డిగ్రీలు వున్నవాళ్ళు లేదా గొప్ప మేదావులకు సంభంధించిన విషయమని భావిస్తూ వుండే అభిప్రాయం నుంచి దాన్ని తలకిందు చేశారు. ఈ రొజు కొంతమందికైనా సరే కాపిటల్ సాదారణ ప్రజల్లొకి వెళ్ళిందంటే అది రంగనాయకమ్మ గారి క్రుషి వల్లే . అంతే కాని ఈ బుర్జువా కమ్యునిస్టు పార్టీలవల్ల కాదు.

    రంగనాయకమ్మ గారి పుస్తకం "పల్లవిలేని పాట" లొ శ్రమ శక్తి గురించి మార్క్స్ పొరపడ్డారు అని రాశారు. దాన్ని నేను విమర్సిస్తూ వరిజినల్ అనువాదం నుంచి వుంటంకిస్తూ రంగనాయకమ్మ గారికి ఉత్తరం రాశాను.

    రిప్లయితొలగించండి
  2. విశాలాంద్ర వారి అనువాదంలొ పేజి నెం 41 లొ పుట్ నొట్ లొ ఇలా వుంది. శ్రమ మాత్రమే సరైన వాస్తమైన కొలమానమని అన్ని కాలాలలొనూ అన్ని సరుకుల విలువను యీ కొలమానం ద్వారా మాత్రమే అంచనా వేయటం పొల్చడం సాద్యమౌతుందనీ రుజువు చేయడానికి ఆడం స్మిత్ ఎం చెప్పేడొ చెప్పిన తర్వాత ఆడం స్మిత్ కి ముందున్న ఒక పేరు తెలియని ఆర్దిక వెత్త యింతకంటే సరీగా పెర్కొన్నాడు " ఒక జీవితావసర వస్తువుకొసం ఒక మనిషి ఒక వారం రొజులు పనిచేశాడు దానికి బదులుగా మరొక వస్తువు మార్పిడి చేసుకొనే య్వేక్తి తన వస్తువు యెంత పరిమాణంలొ యివ్వవలసి తేల్సుకొవడానికి తాను వారం రొజులలొ యెంత పరిమాణాన్ని ఉత్పత్తి చేసింది అంచనా వేయడం కంటే మేలైన మార్గం లేదు." రంగనాయకమ్మ గారు ప్రస్తావించింది యీవిషయమే అయివుంటుంది.

    మీరిచ్చినవి కొన్ని సవరించారు 12వ పాయింట్ .మరికొన్ని కుడా. బ్రహ్మచారి గారూ మీరు యీ విషయాలను రంగనాయకమ్మ గారి ద్రుస్టికి తీసుకెళ్ళారా? తీసికెళ్ళి వుంటే ఎం జవాబిచ్చారు.? మీరు యీ విషయాలను ఆమె దౄస్టికి తీసుకెళ్ళలేదా ? అలా అయితే దానికి గల కారణమేమిటి? ఒక విమర్శ మనం యవరిపైన చేసున్నామొ వారికి తెలియకపొతే అది నిరుపయొగం {ఆమనిషి లేకపొతే అది వేరే విషయం}

    రిప్లయితొలగించండి