27, సెప్టెంబర్ 2011, మంగళవారం

బి.ఎస్.ఎన్.ఎల్ లో లక్ష మందికి స్వచ్చంద పదవీ విరమణ

సెప్టెంబర్ 27 న ధర్నా, అక్టోబర్ 10 న సమ్మె ఉద్యోగులు

2009 లో 3,97,000 మంది ఉద్యోగులుండేవాళ్ళు. ప్రస్తుతం 276,000 మంది పనిచేస్తున్నారు. అంటే లక్షా ఇరవై వేలమందికి పైగా తగ్గారు. కారణం రిటైరైన వాళ్ళ స్తానంలో నియామకాలు నిలపటమే. అయినా ఇది ప్రభుత్వానికి చాలలేదు. మరో లక్షమందిని ఇంటికి పంపాలని మంకుపట్టుతో ఉంది. 2000 నుంచీ 2009 దాకా లాభాలలోనే నడిచింది. తొలిసారి 2009-2010 సంవత్సరంలో ప్రభుత్వ విధానాల మూలంగా 1823 కోట్లు నష్టం నమోదు చేసింది. 2010-2011 లో నష్టం 6384 కోట్లు. ఉద్యోగుల జీతాల వల్లే నష్టాలంటూ ప్రభుత్వమూ, యాజమాన్యమూ ప్రచారం చేస్తున్నాయి. 2009-2010 లో ఆదాయంలో 42 శాతం జీతాలకి ఖర్చయిందనీ, 2010-11 లో 46.5 శాతం అనీ ,ప్రైవేట్ కంపెనీలకి 5శాతం మాత్రమే అవుతుందనీ వాదన. ప్రస్తుతం 49 శాతం అని ఆర్.కే. ఉపాధ్యాయ బి.ఎస్.ఎన్.ఎల్ చైర్మన్ 2011 ఆగస్ట్ చివరలో ప్ర ప్రకటించాడు . ఇదే పెద్ద సమస్య అన్నాడు. ఎయిర్‌టెల్ లో 25,000 మంది మాత్రమే పనిచేస్తున్నారనీ, పైగా ఆసంస్తకి బీ.ఎస్.ఎన్.ఎల్ కన్నా ఎక్కువమంది వినియోగదారులు ఉన్నారనీ కనక ఇందులో ఉద్యోగుల్ని తగ్గించాలనీ పట్టుబడుతున్నారు.

45 ఏళ్ళు నిండిన వాళ్ళు అర్హులు. ఒక లక్షమందికి ఈప్రతిపాదన వర్తిస్తుంది. మొత్తం ఖర్చు 20,802 కోట్లు.ఇందులో బి.ఎస్.ఎన్.ఎల్ వాటా 2705 కోట్లు. పోగా 18,097 కోట్లు డాట్ వాటా. ఒక ఉద్యోగికి సగటున వచ్చేది 20.8 లక్షలు. పనిచేసిన సంవత్సరానికి రెణ్ణెల్ల జీతం చొప్పున వచ్చే మొత్తం గానీ, మిగిలిన సర్వీసుకు రావలసిన జీతం మొత్తం గానీ - రెంటిలో ఏది తక్కువయితే అది వస్తుంది. మీకిది లాభదాయకం అంటూ ఉద్యోగుల్ని ఊరిస్తున్నది. శాం పిట్రోడా సిఫారస్ ప్రకారం లక్షమందిని తగ్గించాలని ప్రభుత్వ పట్టుదల.

సరే లక్షతొ ఆగుతుందా? ఎయిర్ టెల్ 25000 మందితో నడుస్తున్నప్పుడు బి.ఎస్.ఎన్.ఎల్ ఎందుకు నడవదు, అనేది తర్వాత ప్రస్న కాదా? 25 వేలకి కుదించే కార్యక్రమం అంచెలంచెలుగా కొనసాగదని గారెంటీ ఏమిటి? అలా చేసినా చాలదు. పోటీ సంస్తకి లాగే జీతాల ఖర్చు 5 శాతాని తేవాలనే కోరిక పుట్టదా? చౌకగా దొరికే వాళ్ళతో పనిచేయించుకుని లాభాలు దండుకునే ప్రైవేట్ యజమానుల దుష్ట వాంఛ ప్రబుత్వాల తలకెక్కింది.

ఇష్టమైన వాళ్ళు పదవీవిరమణ పధకాన్ని వినియోగించుకోవచ్చు. బలవంతం లేదు అని యాజమాన్యం అంటున్నది కాని దాని లోగుట్టు, ఆంతర్యం ఉద్యోగులకు తెలుసు. ఇతర దేశాల్లో ఎమిజరిగిందో గమనించారు.యూనియన్లు సరే అంటే చాలు. సుదూర ప్రాంతాలకి బదిలీ చేసి లొంగేట్టు చేసిన సందర్భాలు విదేశీ టెలికాం రంగంలో లెక్కకు మించి ఉన్నాయి.

నయానో, భయానో ఇళ్ళకుపంపి సంస్తని ప్రైవేటు కంపెనీలకి అమ్మాలనేది ఆంతర్యం. ఆ కంపెనీలనుంచి భారీస్తాయిలో ముడుపులు దండుకోవటం తెలిసిందే. పైగా సంస్తకి భారీస్తాయిలో భూములున్నాయి. వాటిని ప్రైవేటుకి చౌకగా కట్టబెట్టి అంతులేని అవినీతికి పాల్పడలన్నదే పాలకుల కోరిక. ఆఆశతోనే ఇందుకొడిగడతున్నారు.

ఈదుష్ట పధకాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందరూ కలిసి సెప్టెంబర్ 27 న ధర్నా చేశారు. అక్టోబర్ 10 న సమ్మే చేయబోతున్నారు. ఉద్యోగులు విజయం సాధించాలని అందరం కోరుకుందాం. సహకరిద్దాం.

బి.ఎస్.ఎన్.ఎల్ ప్రైవేటీకరణ

పిట్రోడా సిఫారసులూ - ఉద్యోగుల ఆందోళనలూ

అరుణతార 2010 ఏప్రిల్- జూన్ సంచికలో వచ్చింది ఇ.ఎస్.బ్రహ్మాచారి

ఇటీవలి కాలంలో టెలికాం కంపెనీల విస్తరణ ఊహకందకుండా ఉంది. దేశంలో 2009 డిసెంబర్ చివరికి మొత్తం 52 కోట్లా 56 లక్షలమంది మొబైల్ వాడకందారులున్నారు. ప్రతి 100 మందిలో 45 మందన్నమాట. అతిపెద్ద సంస్త భారతి ఎయిర్‌ టెల్ వాటా 12 కోట్ల 18 లక్షలు. రెండవది రిలయన్స్ కమ్యూనికేషన్స్ 9 కోట్ల 29 లక్షలు. వొడాఫోన్ ఎస్సార్ 9 కోట్ల 14 లక్షలు. టాటా టెలి సర్వీసెస్ 5 కోట్ల 84 లక్షలు ఐడియా సెల్యులార్ 5 కోట్ల 76 లక్షలు. బి.ఎస్.ఎన్.ఎల్ 5 కోట్ల 72 లక్షలతో 6 వ స్తానం. లాండ్ లైన్ వివరాల్లోకి పోతే: 2 కోట్లా 80 లక్షలతో మొదటిస్తానం బి.ఎస్.ఎన్.ఎల్ ది. 35 లక్షల్తోరెండోస్తానం ఎం.టి.ఎన్.ఎల్ ది. భారతీ ఎయిర్టెల్ 30 లక్షలతో మూడోది. రిలయన్స్ 11 లక్షలా 65 వేలతో నాలుగోది. తర్వాత 11 లక్షలతో టాటా టెలీ. లాండ్‌లైన్లు నవంబర్‌లో 3 కోట్లా 71 లక్షల నుంచి డిసెంబర్ చివరికి 3 కోట్లా 70 లక్షలకి తగ్గాయి

బి.ఎస్.ఎన్.ఎల్ ప్రపంచంలో పెద్ద టెలికంసంస్తల్లో 7 వ స్తానంలో ఉంది.[i]ఈక్విటీ పెట్టుబడి12 వేల కోట్లు. నికర అస్తులు 1 లక్షా 35 వేల కోట్లు. టర్నోవర్ 35 వేల కోట్లు. 7 లక్షలా 50 వేల కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ ఉంది.40 వేల టవర్లున్నాయి. ప్రభుత్వ ఖజానాకి 2007-08 లో డివిడెండ్, లైసెన్స్ రుసుం, కార్పొరేట్ పన్ను, సర్విస్ టాక్స్ వగైరా అన్నీకలిపి 14 వేల కోట్లు జమచేసింది. భారీగా చెల్లించే సంస్తల్లో ఇదొకటి. నవరత్న హోదా కల్పించలేదు కాని అంతటి స్తాయి ఉన్న సంస్తే.

2010 జనవరి చివరకి దేశంలోమొత్తం ఫోన్‌లు 58 కోట్ల 18 లక్షలు. అందులో సెల్‌లు 54 కోట్లా 50 లక్షలు. 2009 డిసెంబర్‌లో కంటే ఇంచుమించు 2 కోట్లు పెరిగాయి. వైర్‌లైన్లు 3 కోట్లా 67 లక్షలు. 2009 డిసెంబర్‌లో కంటే 3 లక్షలు తగ్గాయి. టెలి డెనిసిటీ 49.50.

ఈరంగంలో ఇంకా అభివృద్ధికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకే ప్రైవేట్ కంపెనీల కన్ను బి.ఎస్..ఎన్.ఎల్ మీద పడింది. దానిలో వాటాలు కావాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాయి. మంత్రులు బాగానే సహకరిస్తున్నారు. సంస్తని ఎదగనివ్వటం లేదు. ఇక నష్టాలు రాబోతున్నాయని భయం నటిస్తున్నారు. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళవి.

ఈఏడు మొదట్లో మన్మోహన్ సింగ్ బి.ఎస్.ఎన్.ఎల్ లాభదాయకత మరీ పడిపోయిందని వాపోయాడు. 2004-05 లో పదివేల కోట్ల లాభం వస్తే, 2008-09 లో 574 కోట్లు మాత్రమే వచ్చింది. 2009-10 లో నష్టాల్లో పడినా పడవచ్చు. దాని పునరుద్ధరణకి చర్యలు సూచించేందుకు ప్రధాని సలహాదారు శ్యాంపిట్రోడా సారధ్యంలో బాంకర్ (హెచ్.డి.ఎఫ్.సి చైర్మన్) దీపక్ పరేఖ్, టెలికాం సెక్రెటరీ పి.జే. థామస్ లతో ఒక కమిటీ వేశాడు. లాభాల పెంపుకి సలహాలూ సూచనలూ అడిగాడు. పిట్రోడా 9-2-2010 న నివేదిక ఇచ్చాడు. ఆయన సిఫారసుల్ని మార్చ్ మొదట్లో మీడియా బయట పెట్టింది.

పిట్రోడా పానల్ సంస్తని పునరుద్ధరించటానికీ, పోటీలో ముందుంచటానికీ 15-పాయంట్ల పధకాన్ని రూపొందించినట్లు చెప్పుకుంటున్నది. బి.ఎస్.ఎన్.ఎల్ బోర్డు పిట్రోడా నివేదికని సూత్రప్రాయంగా ఆమోదించింది. వీటి అమలు గురించిన నిర్ణయం ప్రభుత్వానికి వదిలేసింది బోర్డ్. రిపోర్ట్ చాలచిన్నది 4 పేజీలే.ఉన్న విషయం ఎంతోపెద్దది. కొద్ది కాలంలో సంస్తని ప్రైవేట్ పెట్టుబడి దారులకి కట్టబెట్టేపధకం అందులో ఉంది. ఆయన సిఫారసులు చూస్తే ఆంతర్యం ఇట్టే తెలుస్తుంది

· సంస్త కార్యకలాపాలు నిర్వహించేందుకు మేనేజ్డ్ సర్విస్ మోడల్ని అవలంబించాలి. అంటే ఎక్విప్‌మెంట్‌ని ఎవరి దగ్గర కొంటారో వాళ్ళే దాన్ని నిర్మించి, నిర్వహిస్తారు. ఆవిధానం అనుసరిస్తున్న కంపెనీలకి ఇందుకు సొంత ఉద్యోగులు పనిలేదు.

· 30 శాతం వాటా అమ్మాలి. అంతేకాదు. సిగ్నల్ టవర్ల వంటి మౌలికసదుపాయాల అమ్మకం ద్వారానూ, రియల్ ఎస్టేట్ ద్వారానూ నిధులు సమకూర్చుకోవాలి.

· 9 కోట్లా 30 లక్షల లైన్లతో జి.ఎస్.ఎం. మొబైల్ నెట్ వర్క్‌ ని 35 వేల కోట్ల ఖర్చుతో విస్తరించాలనే ప్రతిపాదనకు స్వస్తి చెప్పాలి. పరికరాల ఆర్డర్లని ఆపివేయాలి. నెట్ వర్క్‌ ని ఔట్ సోర్సింగ్‌ చేసుకోవాలి. .

· లోకల్ కాపర్ కేబుల్ లూప్ అన్‌బండ్లింగ్ చేయాలి. లోకల్ లూప్‌ని ప్రైవేట్ కంపెనీలకి బ్రాడ్ బాండ్ సర్వీసులు అందించేందుకు వీలుగా అద్దెకు ఇవ్వాలి. బి.ఎస్.ఎన్.ఎల్ కి నగరాల్లో , పల్లెల్లో లోకల్ కాపర్ కేబుల్ నెట్‌వర్క్ ఉంది. దీని ద్వారా మెరుగైన బ్రాడ్‌బాండ్ సేవలని అందిస్తున్నది. ఈ రంగంలో ప్రైవేట్ కంపెనీలకన్నా చాల ముందున్నది. ఈ సంస్తదే అగ్రస్తానం. ఇది కూడా లేకుండా చెయ్యాలనే కుట్ర జరుతున్నది. పోటీ కంపెనీలు ఈ కేబుల్‌ని వాడుకోవాలనుకుంటున్నాయి. మంత్రులూ ప్రభుత్వమూ రెడీ. ఇక పిట్రోడా ఈ లోకల్ కాపర్ కేబుల్ లూప్ అన్‌బండ్లింగ్ కి సిఫారస్ చేసేశాడు.

· సంస్తకున్న కాళీ భూముల్ని వాణిజ్య పరంగా వాడుకోవాలి. ఆపని చెయ్యటానికి ఒక రియల్ ఎస్టేట్ సంస్తని ఏర్పరచాలి- అదీ ప్రైవేట్ భాగస్వామ్యంతో. రక్షణ, రైల్వేల తర్వాత ఈసంస్తకే భూమి ఎక్కువ. 3500 పట్టణాలలో లక్షల హెక్టేర్ల భూమి ఉంది. కోటానకోట్ల విలువ చేస్తాయి. వాడని స్తలాల్నీ, ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తుల్నీ అధీనంలో ఉంచుకునేందుకు ఒక ప్రత్యేక సబ్సిడియరీని ఏర్పరచాలని పిట్రోడా సిఫారస్ చేశాడు. " మేము అగ్రిమెంట్ లో ఉన్నాం. ఇప్పటికే ఒక ప్రత్యేక డివిజన్‌ని ఏర్పాటు చేశాం. దాన్ని ప్రత్యేక సబ్సిడియరీగా చేయవచ్చు." అని బొర్డ్ ఒక లేఖలో రాసింది.

· 3 లక్షల మంది ఉద్యోగుల్లో 1 లక్షమందిని స్వచ్చంద పదవీ విరమణ(వి.ఆర్.ఎస్)లాంటి పధకాలుపెట్టి రిటైర్ చేయించాలి. 10 శాతం అమ్మితే వచ్చే డబ్బు ప్రభుత్వానికి జమకావాలి. తతిమ్మా 20 శాతం అమ్మగా వచ్చే డబ్బుని లక్షమంది ఉద్యోగుల వి.ఆర్.ఎస్ కీ , సంస్త అభివృద్ధికి ఖర్చుపెట్టాలి. వి.ఆర్.ఎస్ కి పెద్దగా ఖర్చు ఉండదు ఎందుకంటే ఎక్కువమంది 1970 లలో చేరినవాళ్ళు. ఏటా 10 వేలమంది రిటైర్ అవుతున్నారు. 2012 , 2013 కల్లా చాలామంది రిటైర్ అవుతారు. కనక ఈడబ్బు కూడా ప్రభుత్వానికి చేరేదే.

పిట్రోడా నివేదిక ఇచ్చాడో లేదో బోర్డ్ తలూపింది. మొదటిదీ, ముఖ్యమైనదీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ (సి.ఎం.డి) పదవిని విభజించి చైర్మన్ గా ఒకర్నీ, మేనేజింగ్ డైరెక్టర్ గా మరొకర్నీ నియమించాలి. చైర్మన్ నాన్ ఎక్జిక్యూటివ్. రోజువారీ వ్యవహారాల్ని ఎం.డి/సి.ఈ.ఓ. నిర్వహిస్తాడు. ఇతను సంస్త లోపలివాడూ కావచ్చు. పరిశ్రమనుంచీ రావచ్చు. కమిటీ సూచన మేరకు ప్రైవేట్ రంగంలో సమర్ధుణ్ణి ఈసంస్తకి చైర్మన్ చేసినా అభ్యంతరం లేదని గోయల్ చెప్పాడు.

సిఫారసులు ఎప్పటినుంచి అమలయ్యేదీ చెప్పకపోయినా ఈ విభజన తోనే మొదలుకావచ్చు. ఎందుకంటే ఇది వ్యవస్తాగత మార్పు. జులైలో సి.ఎం.డి ని మారుస్తుంటారు. అప్పుడు DoT సంస్తలోని వ్యక్తిని నియమిస్తుంది. అతను తన అధికారాల్ని వదులు కోటానికి ఇష్టపడడు. కనక విభజనకి అడ్డుపడతాడు. కనక సి.ఎం.డి ని నియమించకుండానే బయట వ్యక్తిని చైర్మన్ గా తెస్తారు. ఆతర్వాత వరసగా అన్ని సిఫారసులూ అమలవుతాయి.

సరళీకరణకి ముందు దేశానికంతా ప్రభుత్వం టెలికాం డిపార్ట్‌ మెంట్ ద్వారా సేవలందించింది. ముంబాయ్, ఢిల్లీ నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో 1986 లో ఎం.టి.ఎన్.ఎల్ (మహానగర్ టెలిఫోన్ నిగం లిమిటెడ్) ని విడగొట్టారు. ప్రభుత్వం నడిపే ఈ రెండు సంస్తల్నీ కలపాలనే ప్రతిపాదన ఒకటొచ్చింది. అయితే బి.ఎస్.ఎన్.ఎల్ నీ ఎం.టి.ఎన్.ఎల్ నీ కలిపే ప్రసక్తేలేదని పిట్రోడా జనవరి 8 న తేల్చిచెప్పాడు. ఎం.టి.ఎన్.ఎల్, బి.ఎస్.ఎన్.ఎల్ రెండూ కలిస్తే మంచిదంటూనే గోయల్ అది తన సొంత అభిప్రాయం మాత్రమే అన్నాడు.

ప్రైవేట్ ఆపరేటర్లు 1998 లోనే జీ.ఎస్. ఎం. రంగంలో అడుగుపెట్టారు. తర్వాత 4 ఏళ్ళకి 2002 లో బి.ఎస్.ఎన్.ఎల్. ఇందులోకి దిగింది. ఇంత ఆలస్యానికి కారణం రాజకీయనాయకులకీ సర్వీస్ ప్రొవైడర్లకీ ఉన్న లాలూచీయే అని అందరకీ తెలిసిందే. అప్పటికి ముందంజలో ఉన్నా ఎయిర్‌టెల్‌ని తప్ప మిగిలిన అన్నింటినీ దాటి ముందుకు పోయింది. 2006 దాకా ఊపుగాఉంది. 2007 నుంచి వెనక్కి నడుస్తొంది. ఇది కమ్యూనికేషన్ల మంత్రి పుణ్యం.ఆయన ప్రైవేట్ ఆపరేటర్ల ప్రయోజనాలు కాపాడేందుకు జి.ఎస్.ఎం పరికరాల టెండర్‌ని రెండేళ్ళు కదలనివ్వలేదు. అప్పుడు సగం అంటే 4.55 కోట్ల పరికరాలు కొనటానికి ఒప్పుకున్నాడు. అనేక సర్కిళ్ళలో ఒక్క కొత్త లైన్ కూడా వెయ్యలేదు. పరికరాల కొరతవల్ల మార్కెట్ వాటా తగ్గిపోయింది. 2006 లో 24.38 శాతం ఉన్న వాటా 2010 కి 15.08 కి దిగజారింది. అప్పుడు 2 స్తానంలో ఉన్నది ఇప్పుడు 6 వ స్తానానికి పడిపోయింది. ఇప్పడున్న మార్కెట్ వాటా అయినా నిలకడగా ఉండాలంటే 10 కోట్ల జి.ఎస్.ఎం. లైన్లు కావాలి. దీన్ని అడ్డుకుంటున్నాడు పిట్రోడా.

నెట్ వర్క్స్ ని ఔట్ సోర్స్ చెయ్యమనేది మరొక సిఫారసు. ఇప్పటికే 50 వేల టవర్లనీ, 5 లక్షల కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్‌నీ ఔట్ సోర్స్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. 5 ఏళ్ళలొ ఇది మొత్తం 10 వేల కోట్ల రూపాయలు. ఇది జరిగితే 30 వేలమంది ఇళ్ళకి పోక తప్పదు.

డిజిన్వెస్ట్‌ మెంట్ ఈప్రభుత్వ రంగ సంస్తలో 30 శాతం వాటాని విక్రయించాలని కమిటీ సిఫారసు చేసింది. ఎంతవాటా అమ్మాలో తుది నిర్ణయం తీసుకోల్సింది ప్రభుత్వమేనని చెప్పింది. బోర్డ్ అధ్యక్షుడు కులదీప్ గోయల్ : ఎంత భాగం అమ్మాలో నిర్ణయించమని మేము ప్రభుత్వాన్ని కోరాం అన్నాడు.

ఎయిర్‌టెల్ వినియోగదారులు 12 కోట్ల 20 లక్షలమంది. ఉద్యోగులు 25000 మంది. అదే బి.ఎస్.ఎన్.ఎల్ ఉద్యోగులు 3 లక్షలమందికి పైన్నే.

2007-08 లో నికర లాభం 3009 కోట్లు. అది 2008-09 లో 574 కోట్లకి పడిపోయింది. ఎయిర్‌టెల్ కి ప్రస్తుతం 12 కోట్లా 20 లక్షలమంది వినియోగదారులున్నారు. ఉద్యోగులు 25000 మంది. మొబైల్ విభాగంలో ప్రతి ఉద్యోగికీ 10500 కస్టమర్లు ఉన్నారు. బి.ఎసెన్.ఎల్ కి 6 కోట్లా 50 లక్షలమంది వైర్లెస్ కస్టమర్లూ,2 కోట్ల 79 లక్షలమంది వైర్‌లైన్ వాడకందారులూ ఉన్నారు. ఉద్యోగులు 3 లక్షల మంది. ప్రతి ఉద్యోగికీ 350 మంది కస్టమర్లు మాత్రమే ఉన్నారు. 12 కోట్లకి పైగా వినియోగదారులున్న ఎయిర్‌టెల్ 25 వేలమంది ఉద్యోగులతొ కార్యకలపాలు నిర్వర్తిస్తుంటే, 9 కోట్ల వినియోగదరులున్న బి.ఎస్.ఎన్.ఎల్ కి 3 లక్షలమంది ఎందుకు? ముందొక లక్ష మందిని తగ్గించాలి అని పిట్రోడా సిఫారసు చేశాడు. ఈరెండు సంస్తల మధ్య ఉన్న తేడాలని కావాలనే పట్టించుకోలేదు.

· లాండ్ లైన్లు నామ మాత్రమే. బి.ఎస్.ఎన్.ఎల్ విషయానికొస్తే, దేశం నలుమూలలకూ లాండ్ లైన్ నెట్ వర్క్ విస్తరించి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కోటిన్నర లాండ్ లైన్లిచ్చింది.5 లక్షలా 22 వేల పబ్లిక్ ఫోన్లిచ్చి సేవలందిస్తున్నది. కనక ఉద్యోగులు ఎక్కువమంది కావాలి

· ప్రైవేట్ కంపెనీలు సొంత టెలిఫోన్ ఎక్స్చేంజిల్ని నడపవు. బి ఎస్ ఎన్ ఎల్ పద్ధతి వేరు తన నెట్ వర్క్ ని తన ఉద్యోగులతోనే నడుపుతుంది. కనక ఈ పనులు చేసే ఉద్యోగులు కూడా ఉంటారు.

· ఎక్విప్‌మెంట్‌ని ఎవరి దగ్గర కొంటారో వాళ్ళే దాన్ని నిర్మించి, నిర్వహిస్తారు. ఈ పద్ధతిని మేనేజ్డ్ సర్విస్ సిస్టం అంటారు. ఆవిధానం అనుసరిస్తున్న కంపెనీలకి ఇందుకు సొంత ఉద్యోగులు పనిలేదు.

· ఎయిర్టెల్ సెల్‌ఫోన్ సర్వీసుల ఎక్విప్మెంటు, నెట్‌వర్కుల స్తాపననీ, నిర్వహణనీ తన ఉద్యోగులతో చేయించదు. ఈ పనుల్ని విదేశీ టెలికం ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీలకి అప్పగిస్తుంది. కనక ఆమేరకు ఉద్యోగులు అవసరం ఉండదు. బ్రాండింగుకీ, మార్కెటింగుకీ పరిమితమైనందువల్ల తక్కువ సిబ్బందితో నెట్టకొస్తుంది.

· అంతే కాదు ఉద్యోగుల మీద మోపే పని భారం చాలా ఎక్కువ. పనిగంటలూ ఎక్కువే.

· లాండ్ లైన్లు నామ మాత్రమే. బి.ఎస్.ఎన్.ఎల్ విషయానికొస్తే, దేశం నలుమూలలకూ లాండ్ లైన్ నెట్ వర్క్ విస్తరించి ఉంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా సేవలందిస్తున్నది. లాండ్ లైన్ల లో మొదటిస్తానం. దాని వినియోగదారుల సంఖ్యలో ఎయిర్‌టెల్ 9 వంతు మాత్రమే. ఎం.టి.ఎన్.ఎల్ కంటే కూడా తక్కువే.

కనక ఉద్యోగులు ఎక్కువమంది కావాలి

రెండేళ్ళుగా కంపెనీ రెవిన్యూ 35 వేలకోట్ల దగ్గరే ఆగిపోయింది. వృద్ధి లేదు. 2007-08 నికర లాభం 3009 కోట్లు 2008-09 లో నికర లాభం 81 శాతం పడిపోయి 574 కోట్లయింది. ఖర్చులేమో పెరిగి పోతున్నాయి. రెవిన్యూలో 40 శాతం జీతాలకే పోతున్నది ఇదే ఎయిర్‌టెల్ ఉద్యోగుల జీతాలకు రెవిన్యూలో 5 శాతమే సరిపోతున్నది. ఇందువల్ల 2009 -10 లో నష్టం వచ్చినా ఆశ్చర్యపొనక్కరలేదు.

మొత్తం ఉద్యోగుల్లో C గ్రూపు D గ్రూపు వాళ్ళు - లైన్‌మెన్లూ, ఆపరేటర్లూ, క్లర్కులూ లాంటివాళ్ళే ఎక్కువమంది. కంపెనీని నడిపే ITS ఆఫీసర్లకి ప్రైవేట్ రంగంలో తోటి వాళ్ళకిచ్చే జీతాలకంటే బి.ఎస్.ఎన్.ఎల్. లో తక్కువ. మిగిలిన ఉద్యోగులకి ప్రైవేట్ కంపెనీల్లోకంటే బి.ఎస్.ఎన్.ఎల్. లో ఎక్కువ. క్లర్కుల జీతం 50 వేలు. ప్యూన్లకి 30 వేలు అంటున్నారు.

రెటైర్మెంట్ కి చేరినవారి జీతాలైనా ఇంత లేవు. 15 వేల లోపు జీతాల వాళ్ళు సుమారు 50 వేలమంది ఉంటారు. 15వేలూ 20 వేల మధ్య 1 లక్షమందీ, 20000నుంచీ 30000 దాక వచేవాళ్ళు 60 వేల్మందీ ఉంటారు. ప్యూన్లకి 30 వేలనేది అతిశయోక్తే కాదు. పచ్చి అబద్ధం. ఏక్లర్కుకీ 50వేల జీతం ఉండదు. వివరాలు దొరకటం కష్టం కాని ప్రైవేట్ కంపెనీలు ఎగ్జిక్యూటివ్‌లందరికీ బి.ఎస్.ఎన్.ఎల్ కంటే ఎక్కువ జీతాలు ఇస్తారా? ఒకవేళ ఇచ్చినా బహు కొద్దిమందికి ఇస్తే ఇవ్వచ్చు. చాలామందికి తక్కువే ఇచ్చి వీలైనంత ఎక్కువ పని పిండుతారనేదీ, నిద్రకూడా సరిగా పోనివ్వరనేదీ అందరికీ తెలిసిందే. సెలవలూ, రెటైమెంట్ పధకాలూ సరైనవి ఉన్నాయా? బి.ఎస్.ఎన్.ఎల్ లో రిటైర్ అయిన వాళ్ళని తీసుకుని తక్కువిచ్చి పనిచేయించుకుంటున్నారు. ప్రభుత్వోద్యోగం రాక ప్రైవేట్ సంస్తల్లొ చేరేవాళ్ళే ఎక్కువమంది. అదిసరే. కోర్ ఉద్యోగులకి ఎక్కువ ఇస్తున్నవాళ్ళు క్లర్కులకీ ప్యూన్లకీ కూడా బి.ఎస్.ఎన్.ఎల్ కంటే ఎక్కువ ఇవ్వచ్చుకదా! ఎందుకివ్వరు? కొద్దిమంది కాబట్టి ఇంజనీర్లకి ఎక్కువిచ్చినా, ఎక్కువమంది ఉన్న మిగిలిన వాళ్ళకి మరీ తక్కువిచ్చి మిగుల్చుకుంటారు. పనినంతా 25000 మందితోనే ఎయిర్‌టెల్ చేయిస్తున్నదంటే ఆఉద్యోగుల మీద పడే పని ఒత్తిడి ఎంతో ఎవరైనా అర్ధం చేసుకోగలరు. ఇలాంటి ఒత్తిడి తట్టుకోలేకే ఫ్రాన్స్ టెలికాం ఉద్యోగులు 2008 జనవరి నుంచీ 37 మంది ఆత్మహత్యలు చెసుకున్నారు ఇప్పటికీ అక్కడ సమస్య సమసి పోలేదు.

ఇతర సంస్తలటొ పోటీ పెట్టి మాట్లాడుతున్నారు ఇది తప్పు. ప్రభుత్వ సంస్తనీ , ప్రైవేటు సంస్తనీ స్తాపించటంలో ఉద్దేశం ఒకటికాదు. ప్రభుత్వ సంస్త కూడా లాభాలను స్వీకరిస్తుంది. కాని దానికి లాభాలే పరమావధి కాదు. కాకూడదు. సేవా తత్పరతా, ఉద్యోగుల సంక్షేమమూ, ఉద్యోగ భద్రతా ముఖ్యమైనవి. ప్రైవేటు పెట్టుబడిదారులకి లాభం లాగడమే ఏకైక లక్ష్యం. మరో అంశం పట్టదు. ఈరెంటికీ లాభాల్లో పోటీ ఎలా కుదురుతుంది? సంస్కరణల తర్వాత ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీల్లాగా ప్రవర్తిస్తున్నాయి. దీన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.

ఏదైనా పరిస్తితుల్లో నష్టం వచ్చినా మూసెయ్యకూడదు. ప్రైవేట్ కంపెనీలకి నష్టం వస్తే మూస్తున్నారా? లాభలొచ్చేట్టు చూసుకుంటారు. బి.ఎస్.ఎన్.ఎల్. కి గతమంతా లాభాలే గదా! 2009 లోనూ లాభమే. 574 కోట్లు. మరి ప్రధానమంత్రికి ఆందోళనెందుకు? జరుగుతున్న సంవత్సరంలో నష్టాలొస్తాయట. సరే రాకుండా తీసుకునే చర్యల గురించి ఆలోచించింది లేదు. ఉద్యోగ సంఘాలు చెప్పే మార్గాలు సరైనవో కావో పరిశీలించింది లేదు. అంటే సంస్తని నష్టాల్లోకి నెట్టి నిర్వీర్యం చెయ్యాలనేది లక్ష్యంగా కనిపిస్తున్నది.

ఇదంతా ఒక పధకం ప్రకారం జరుగు తున్నదని పిస్తున్నది. 2009 డిసెంబర్ 10 న రాజీవ్ చంద్రశేఖర్ (స్టాండింగ్ కమిటీ సభ్యుడు) బి.ఎస్.ఎన్.ఎల్. నానాటికీ దిగబడుతున్న ఆర్ధిక పరిస్తితి గురించి ఒక లేఖ రాశాడు. ప్రధానిని తక్షణం జోక్యం చేసుకొని సంస్తని పతనం కాకుండా కాపాడమనీ, లేకపోతే దాని విలువ దిగజారి ఖజానాకి తీవ్ర నష్టం వాటిల్లుతుందనీ అందులో స్పష్టంగా రాశాడు., ప్రధాని వెంటనే నడుం బిగించాడు. ప్రధాని ఆఫీసు జనవరి 6 న సమావేశం ఏర్పాటు చేసింది. వినియోగదారులు ఈరంగంలో పెరుగుతున్నారు. 36000 కోట్ల రెవిన్యూకి 574 కోట్ల లాభం ఏమిటి? అంటే సంస్త విఫలమైందన్నట్లే అని నిర్ధారిస్తున్నారు.

టెలెకాంలొ డిజిన్వెస్ట్‌ మెంట్ ఉండబోదని గతంలో ప్రభుత్వం ఎన్నోసార్లు ఇచ్చిన హామీని వెనక్కి తీసుకోవటమే ఔతుందని ఉద్యోగులు తప్పుబడుతున్నారు.

"బి.ఎస్.ఎన్.ఎల్ లో ఏదేనీ విభాగాన్నిగానీ లేక ఎంతోకొంత భాగాన్ని గానీ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు. ఇది నూటికి నూరు శాతం ప్రభుత్వరంగ సంస్త గానే కొనసాగుతుంది" అని 2004 మే లో సంస్త చైర్మన్ వి.పి. సిన్హా హామీ ఇచ్చాడు. 2008 ఆగస్ట్ లో సింథియా ప్రైవేటీకరణ ప్రతిపాదనేదీ లేదన్నాడు. ఉద్యోగుల్లో కొందరికి స్వచ్చంద పదవీవిరమణ ( వి.ఆర్.ఎస్) ఇచ్చి ఉద్యోగుల్ని తగ్గించుకోబోతున్నారా అనే ప్ర శ్నకి అలాంటి దేమీ లేదు అని 2009 జులైలో చెప్పాడు గోయల్. ఇలా పదే పదే హామీలిస్తూ చివరికి మాటతప్పింది ప్రభుత్వం. ఇలా చెయ్యటం పాలకులకి పరిపాటే..

2006 వరకూ బి.ఎస్.ఎన్.ఎల్ వినియోగ దారుల సంఖ్య లోనూ, రెవిన్యూలోనూ ముందే ఉంది . అక్కడనుంచీ పనిగట్టుకుని ప్రభుత్వం సంస్తని బలహినపరిచే విధానాలు అవలంబించింది. తాము చేయగలిగినదంతా చేసి, లాభాలు తగ్గాయనీ, నష్టాలు వస్తాయేమోననీ రాగాలు తీస్తూ కొరవా దరవా( ప్రైవేటికరించే) పనిని పిట్రోడా కి అప్పజెప్పారు.

నూటికి 80 లాండ్‌లైన్లు ఈసంస్తవే. ఇవి ఎన్నడూ లాభాలు తేలేవు. గతంలో లాండ్ లైన్లని టెలికాం డిపార్ట్‌మెంట్ నిర్వహించినంతకాలం ఎస్టిడి కాల్ రేట్లు ఎక్కువ ఉండేవి. దాంతో లాండ్ లైన్ నెట్ వర్క్‌ కి వచ్చే నష్టాన్ని పూడ్చేవాళ్ళు. బి.ఎస్.ఎన్.ఎల్ ఏర్పడ్డాక ప్రైవేట్ కంపెనీలనుంచి వసూలు చేసిన ఏక్సెస్ డెఫిసిట్ ఛార్జ్ నుంచి సబ్సిడి వచ్చేది. అయితే ప్రైవేట్ కంపెనీల ఒత్తిడి మేరకి ఆ ఛార్జీని రద్దు చేసింది ప్రభుత్వం. ఫలితంగా నష్టాలతోనే లాండ్ లైన్లు కొనసాగించాల్సి వస్తోంది.

ఇక మొబైల్ రంగం విషయానికొస్తే ఈ సంస్తని 2002 దాకా అనుమతించలేదు. ప్రైవేట్ కంపెనీలకి 1994 లోనే అనుమతించారు. అయినా 2006 కల్లా ఎయిర్‌టెల్ తర్వాత రెండో స్తానాన్ని దక్కించుకుంది.దాంతో దీని పురోగతిని నిరోధించే కుట్ర మొదలైంది. 4 కోట్ల మందికి సేవలందించేందుకు 4 కోట్ల లైన్లకోసం జి.ఎస్.ఎం సామాగ్రి కొనేందుకు టెండర్ పెడితే దాన్ని కోర్టు కేసులనీ, మంత్రి అభ్యంతరాలనీ సాకులు చెప్పి ముందుకు పోనివ్వలేదు.

నోకియా సీమన్స్ కంపెనీ తన టెండర్ని నిరాకరించిందని బి.ఎస్.ఎన్.ఎల్ మీద కోర్టుకెక్కింది. ఆ పిటీషన్ని కోర్ట్ కొట్టేసింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కి మరొక కంప్లైంట్ వెళ్ళింది. దాని అనుమతితో నియమితమయిన కమిటీ కూలంకషంగా పరిశీలించి పొరపాట్లేమీ జరగలేదంది. ఆతర్వాత ధరలు తగ్గించాలనికి సంస్త ఎరిక్సన్ కంపెనీతో సంప్రతింపులు జరిపింది. అయితే టెండర్ పూర్తయ్యాక సంప్రతింపులు కుదరవు అని విజిలెన్స్ కమిషన్‌క అభ్యంతరం తెలిపింది. అయితే అంతకు ముందు అలాంటి వాటిని అనుమతించారు. 11-7-2007 న ఒకరోజు సమ్మెచేశారు. 2 కోట్ల లైన్లకి సరిపడా సామాగ్రి కొనటానికి ఒప్పుకున్నారు. అయితే మళ్ళీ 9.3 కోట్ల లైన్లకి టెండర్ పిలిచారు. చైనా కంపెనీ హువాయ్ నుంచి కొనే ప్రతిపాదనకి అభ్యంతరం చెప్పారు. అది దేశభద్రతకి ముప్పు అన్నారు. అయితే రిలయన్స్‌ కి సరఫరా చేసి, నిర్వహిస్తున్నది అదే కంపెనీ. ఈటెండర్‌ని బి.ఎస్.ఎన్.ఎల్ రద్దు చేసుకోవలసి వచ్చింది. ఆవిధంగా ప్రభుత్వం నుంచీ, దాని ఏజెన్సీలనుంచి చాలాసార్లు అడ్డంకులు వచ్చాయి. ఉద్దేశ పూర్వకంగా 2007 నుంచీ మోకాలు అడ్డుతున్నది. లేనిపోని ఆటంకాలు కలిగిస్తున్నది. కాపర్ కేబుల్ కనీస నిర్వహణ నిలిపివేశారు. ప్రైవేట్ వాళ్ళని వాడుకోనిస్తే రిపేర్లు వాళ్ళే చేసుకుంటారు అంటున్నారు. ఇదే జరిగితే బి.ఎస్.ఎన్.ఎల్ కి ఉన్న బ్రాడ్ బండ్ అనుకూలత పోతుంది. ఆతర్వాత సంస్త మూతబడటానికి ఆట్టే కాలం పట్టదు. వీటి మరమ్మత్తులు చేపట్టి, జి.ఎస్.ఎం లైన్ల టెండర్ ఖరారు చెస్తే ఈ సంస్త వైభవోపేతంగా నడుస్తుంది. ఏ ప్రైవేట్ సంస్తా దీనిముందు నిలబడలేదు.

భారతీ ఎయిర్ టెల్ తన నెట్ వర్క్‌ ని ఆధునీకరణకి 130 కోట్ల డాలర్ల సామాగ్రిని ఎరిక్సన్ నుంచి కొంటొంది. ఇది ఇవాల్వ్‌డ్ ఎడ్జ్ టెక్నాలజీ ద్వారా డాటా రేట్ ని పెంచుతుంది. మాటా పలుకూ స్వచ్చంగా ఉంటుంది. ఒక బేస్ స్టేషన్ ని ఎక్కువమంది వాడుకునే వీలు కలిగిస్తుంది. దీంతో వినియోగదారులకి అవతలివాళ్ళ గొంతూ, మాటలూ స్పష్టంగా వినిపిస్తాయి. ఒకపక్క పోటీ కంపెనీలు కొత్త యంత్రాలు అమరుస్తుంటే, బి ఎస్ ఎన్ ఎల్ మాత్రం ఎప్పుడో ఇచ్చిన కొనుగోలు ఆర్డర్లని వెనక్కి తీసుకుంటున్నది. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణం. సంస్తని అన్నివిధాలా దిగజార్చి అప్రతిష్ట పాల్జేసి అమ్ముకోజూస్తున్నది. అసలు ప్రభుత్వ రంగ సంస్తలే ఉండకూడదనేది నయా ఉదారవాద సూత్రం. దాన్ని తు చా తప్పకుండా అమలు పరచటమే మన్మోహన్ సింగ్ కర్తవ్యంగా భావిస్తున్నాడు .

అలా దాని వృద్ధికి అడ్డంపడీ పడీ దాన్ని మెరుగుపరచటానికంటూ పిట్రోడా కమిటీని నియమించింది. సంస్త మెరుగుదలకి ఆకమిటీ చేసిన సూచనలేమీలేవు. విస్తరణకు కావలసిన చర్య లేవో చెప్పనే లేదు. పైగా అందుకవసరమైన జి.యస్.యం. పరికరాల కొనుగోలు ఆపాలని చెప్పింది. అలాచేస్తే సంస్త నష్టాల్లో పడక తప్పదు. ఆసాకుతో ప్రైవేటు సంస్తలకు కట్టబెట్టవచ్చు. ఉద్యోగుల్ని ఇళ్ళకు పంపవచ్చు. వాటాలు అమ్ముకోవచ్చు. ఇదీ అసలు కోరిక.

పైగా నిధులకోసం 30 శాతం డిజిన్వెస్ట్‌ మెంట్ చెయ్యాలని సూచించాడు. నిజానికి సంస్తకి నిధుల కొరత లేదు. 2008-09 లెక్కల ప్రకారం 70,000 కోట్ల రిజర్వూ, అదనమూ ఉంది. నిధులకోసం పెట్టుబడిని ఉపసంహరించాల్సిన అవసరమేమీ లేదు.

బి.ఎస్.ఎన్.ఎల్ మేనేజర్లు 1500 మంది ఉన్నారు. వీళ్ళు ఐ.టి.ఎస్ అధికారులు. వీరి నేతృత్వంలో సంస్త నడుస్తుంది. అయితే వీళ్ళని డెప్యుటేషన్‌లో ఉంచారేగాని. సంస్తలో విలీనం చెయ్యలేదు. విలీనం చేస్తే సంస్తని సొంతం అనుకొని వృద్ధి మీద పుర్తి ధ్యాస పెడతారు. అప్పుడు అభివృద్ధి సరిగా సాగుతుంది.

2008 ఆగస్ట్ లో సింధియా ప్రైవేటుపరం చేసే ఉద్దేశమేమీ లేదనీ. కాకపోతే ఐ.పి.ఓ గా రావాలనీ, అదీ 10 శాతం పరిమితితో నేననీ నమ్మకంగా చెప్పాడు. మరివ్వాళ 30 శాతం వాటాలు అమ్మటానికి సిద్ధమయింది ప్రభుత్వం.

ప్రభుత్వం అసలు ఆంతర్యం బి.ఎస్.ఎన్.ఎల్ ని ప్రైవేటు పరం చేయటం.

30 శాతం అమ్మితే 30 వేలకోట్లొస్తాయి. 2010 బడ్జెట్ ప్రసంగంలో పి.ఎస్.యు. ల వాటాల అమ్మకం ద్వారా 40 వేల కోట్లు అదాయం రాబడతానని ప్రణబ్ ముఖర్జీ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భారీభాగం దీనినుంచి లాగాలనే ప్రయత్నమే ఇది. 10 వేల కోట్ల విలువ ఉన్న వి.ఎస్.ఎన్.ఎల్ ని టాటా కంపెనీకి కేవలం 1320 కోట్లకి కారుచౌకగా అమ్మేశారు. లోపాయి కారీగా ఎవరి వాటాలు వారికి గుట్టుచప్పుడు కాకుండా చేరాయనేది తెలియనివారుండరు. ఇప్పుడు జరిగే తంతూ అదే.

ఉద్యోగులకిది తెలియంది కాదు. అన్ని సంఘాలూ అప్రమత్తంగానే ఉన్నాయి.

అన్ని యూనియన్లూ కలిసి సమ్మెకు సమాయత్తమవుతున్నాయి.

ఉద్యోగులు మార్చ్ 26 న ఆఫీసులముందు ధర్నా చేశారు. ఏప్రిల్ 20 న ఎగ్జిక్యూటివ్‌లతో సహా 3 లక్షలమంది నిరవధిక సమ్మె మొదలుబెట్టారు. మొదలుబెట్టారు. గంటల్లోనే ప్రభుత్వం చర్చల కొచ్చింది. పిట్రోడా సిఫారస్‌లు అమలు చేసేముందు యూనియన్లని విస్వాసంలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి రాజా మాట ఇచ్చాడు.జీతభత్యాలకి సంబంఢించిన డిమాండ్లు ఒప్పుకున్నాడు. దాంతో సమ్మె గంటల్లోనే ముగిసింది. అయితే ప్రైవేటీకరణ ఆగినట్లేనా? పిట్రోడా సిఫారసులు లేనట్లేనా? అంటే కాదనే చెప్పాలి. కాకపోతే కాలం గడుస్తుంది.ఎంతోచెప్పలేం.

ప్రధాని మన్‌మోహన్‌సింగ్ కి ప్రైవేటికరణే ప్రాణం. మొట్టమొదటి సంస్కరణల బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది ఆయనే. అప్పట్లో ఆర్ధిక మంత్రి. ఇప్పుడు ప్రధాన మంత్రి హోదాలో ఉన్నాడు. అదీ రెండో సారి.

గతంలో ఉద్యోగులు ప్రతిఘటించి సఫలీకృతులైనారు. ప్రభుత్వం 2007 నుంచీ రెండు సార్లు 10 శాతం అమ్మాలని ప్రయత్నించినా ఉద్యోగుల తీవ్ర వ్యతిరేతని తట్టుకోలేక అప్పటికి సర్దుకున్నది. మళ్ళీ మొదలుబెట్టింది. ఈసారి ప్రధాని గట్టి పట్టుదలతో ఉన్నాడు. పైగా ప్రైవేట్ పెట్టుబడి పట్టు దిట్టపడుతొంది. తట్టుకోవాలంటే ఉద్యోగులు గట్టిప్రయత్నం చెయ్యక తప్పదు.

ఎన్నిసార్లు దెబ్బతిన్నా మళ్ళీమళ్ళీ ప్రయత్నిస్తారు పాలకులు. మొత్తం ఒక్కసారే చెయ్యలేకపొయినా దఫదఫాలుగా చేస్తారు. ఉద్యోగుల్నీ , సంఘాల్నీ విడగొడతారు. కొన్ని విభాగాల్లొ తొలిగిస్తారు. కొన్ని కాడర్ల వాళ్ళని మాత్రమే సాగనంపుతారు. వీటన్నిటినీ తట్టుకొని ఉద్యోగులు నిలబడి ఐకమత్యంగా పోరాడితేనే సంస్త ఉంటుంది. ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూచుకుంటే సంస్త అంతరించటానికి ఎంతోకాలం పట్టదు. మిగిలిన ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్‌ వ్యక్తులకు కట్టబెట్టకుండా ఉండాలంటే వీళ్ళతో పాటు ఆయా సంస్తల ఉద్యోగులు కూడా కలిసి పోరాడక తప్పదు.

2010 జనవరి 31 న కంపెనీల మార్కెట్ వాటా

వైర్ లెస్ వినియోగదారులు

ఆపరేటర్

డిసెంబర్ 2009

జనవరి 2010

బి.ఎస్.ఎన్.ఎల్

62,861,214

65,109,439

ఎం.టి.ఎన్.ఎల్

4,875,913

4,920,929

భారతీ ఎయిర్‌టెల్

118,864,031

121,714,243

రిలయన్స్

93,795,613

96,599,256

వోడా ఫొన్ ఎస్సార్

91,401,959

94,143,364

ఐడియా సెల్యులార్

57,611,872

59,887,404

టాటా టెలీ

57,329,449

60,311,302

ఇతరులు

38,407,871

42,362,199

మొత్తం

525,147,922

545,048,136

వైర్ లైన్ వినియోగదారులు

ఆపరేటర్

డిసెంబర్ 2009

జనవరి 2010

బి.ఎస్.ఎన్.ఎల్

28,095,939

27,978,356

ఎం.టి.ఎన్.ఎల్

3,491,244

3,251,926

భారతీ ఎయిర్‌టెల్

2,988,546

3,015,618

రిలయన్స్

1,164,793

1,168,871

టాటా టెలీ

1,103,172

1,120,698

ఇతరులు

220,448

222,390

మొత్తం

37,064,142

36,757,859

బి.ఎస్.ఎన్.ఎల్ ఉద్యోగుల జీతాలు ఎంత? 4 ఉదాహరణలు

ఉదా 1

ఉదా 2

ఉదా 3

ఉదా 4

ఇస్తున్నవి

కొత్తవి

ఇస్తున్నవి

కొత్తవి

ఇస్తున్నవి

కొత్తవి

ఇస్తున్నవి

కొత్తవి

బేసిక్

5560

12486

10500

23632

5320

10254

8500

19146

డీ.ఏ

5921

3121

11183

5908

3775

2564

9053

4786

డీ.పి

2780

5250

260

4250

అద్దె

834

1872

1575

3544

798

1538

1275

2872

డైట్

225

225

225

225

225

225

225

225

టి.పి.ఏ

200

200

200

200

200

200

200

200

వాష్

30

30

మెడికల్

501

520

903

985

427

797

రూరల్

100

మొత్తం

16051

18454

29836

34494

10578

15208

23,603

28026

ఉదా 1 - ఈఉద్యోగికి 13 సంవత్సరాల సర్వీస్ ఉంది. NE1 కాటగరీ. పాత పే స్కేల్ 4000-120-5800. 30వేలు పట్టుకెళుతున్నారు అనే ఉద్యోగి నిజానికి కొత్తస్కేల్లో తీసుకునేది 19 వేల లోపే.

ఉదా2 - ఈఉద్యోగికి 35 సంవత్సరాల సర్వీసు ఉంది. NE10 కాటగరీ. పాత పే స్కేల్ 7800-225-11175. నెలకి 50 వేలు అని ఆరోపిస్తున్న తరగతి ఉద్యోగి. 35 ఏళ్ళ సర్వీసున్న ఈయనకి కొత్త జీతాల్లో వచేది 35 వేలు

ఉదా 3 -ఈఉద్యోగికి 5 సంవత్సరాల సర్వీసు ఉంది. NE6 కాటగరీ. పాత పే స్కేల్ 4720-150-6970. కొత్తస్కేల్లో తీసుకునేది 16 వేల లోపే

ఉదా 4 ఈఉద్యోగికి 13 సంవత్సరాల సర్వీస్ ఉంది. డీ.ఎన్.1. పాత పే స్కేల్ 7100-200-1010. కొత్తస్కేల్లో తీసుకునేది 28 వేలు. ఉద్యోగుల జీతాలే సంస్త నష్టాలకి కారణం అని నమ్మించటానికే 50 వేలూ 30 వేలూ అనే తప్పుడు ప్రచారం..



[i] 2010 జనవరి చివరకి దేశంలోమొత్తం ఫోన్‌లు 58 కోట్ల 18 లక్షలు. అందులో సెల్‌లు 54 కోట్లా 50 లక్షలు. 2009 డిసెంబర్‌లో కంటే ఇంచుమించు 2 కోట్లు పెరిగాయి. వైర్‌లైన్లు 3 కోట్లా 67 లక్షలు. 2009 డిసెంబర్‌లో కంటే 3 లక్షలు తగ్గాయి. టెలి డెనిసిటీ 49.50.

2011 జనవరి చివరకి దేశంలోమొత్తం ఫోన్‌లు 80 కోట్ల 61 లక్షలు. అందులో వైర్ లెస్ ఫోన్లు 77 కోట్లా 12 లక్షలు. 2010 జనవరి లో కంటే 22 కోట్లు మించి పెరిగాయి. వైర్‌లైన్లు 3 కోట్లా 49 లక్షలు. 2010 జనవరిలో కంటే 18 లక్షలు తగ్గాయి. టెలి డెనిసిటీ 67.67

2011 జనవరి చివరకి దేశంలోమొత్తం ఫోన్‌లు 80 కోట్ల 61 లక్షలు. అందులో వైర్ లెస్ ఫోన్లు 77 కోట్లా 12 లక్షలు. 2010 జనవరి లో కంటే 22 కోట్లు మించి పెరిగాయి. వైర్‌లైన్లు 3 కోట్లా 49 లక్షలు. 2010 జనవరిలో కంటే 18 లక్షలు తగ్గాయి. టెలి డెనిసిటీ 67.67.

2011 జులై చివరకి మొత్తం ఫోన్లు 89 కోట్ల 26 లక్షలు. 2011 జనవరిలో కంటే 8 కోట్ల 65 లక్షలు పెరిగాయి. వైర్ లెస్ ఫోన్లు 85 కోట్ల 84 లక్షలు. జనవరిలో కంటే 8 కోట్ల 72 లక్షలు ఎక్కువ. వైర్ లైన్లు 3కోట్ల 42 లక్షలు. 2011 జనవరిలో కంటే 7 లక్షలు తగ్గాయి. టెలీ డెన్సిటీ 74.44.

ప్రభుత్వరంగ సంస్తల వైర్ లెస్ వాటా 2011 జులై చివరకి 11.73 సాతం కాగా ప్రైవేట్ వాటా 88.27 శాతం. భారతి 19.89 తో మొదటిది.బి.ఎస్.ఎన్.ఎల్ 11.08 తో అయిదవది.

వైర్ లైన్ల వాటా ప్రభుత్వ సంస్తలది 82 శాతం కాగా ప్రైవేట్ వాటా 18 శాతం. అగ్ర స్తానం బి.ఎస్.ఎన్.ఎల్. ది 71.93 శాతం. 9.73 తో భారతి మూడోస్తానంలో ఉంది.

లింక్

1 కామెంట్‌:

  1. చాల బావుంది నాయన. ప్రైవేటు సంస్తలు లాభాల కోసం మాత్రమే పని చేస్తాయి. BSNL మరి ఏమి సర్వీసు పోడిచేస్తుందో. ఇన్ని లక్షల మంది ఉంది కూడా పది శాతం వినియోగదారుల్ని వాళ్ళు ఆనందపరచలేరు.

    అందరు విసిగి వేసారి ఉంకో సర్వీసు ప్రోవిదర్ దగ్గరికి వెళ్ళిపోతారు. నాలా లక్షకు ఒక్కడ కంప్లైంట్ మీద కంప్లైంట్ పెట్టి పని చేయిన్చుకొంటాడు.

    కస్టమర్ భగవంతుడు అని BSNL ఉద్యోగులు తెలుసుకొంటె వాళ్ళందరికీ 50% హైకులు ఇవ్వవచ్చు.

    రిప్లయితొలగించండి