11, సెప్టెంబర్ 2011, ఆదివారం

తిరగబెడుతున్న (మరొక) మాంద్యం

తిరగబెడుతున్న (మరొక) మాంద్యం

2011 వీక్షణం లో ప్రచురితం

మహాసంక్షోభం 1930 దశకంలో వచ్చింది. ఇప్పటిది మహామాంద్యం. మధ్యలో 11 మాంద్యాలు వచ్చినా అవి ఈస్తాయివి కావు. ఇది 2007 డిసెంబర్‌లో మొదలై 2009 జూన్‌లో ముగిసింది. అప్పటినుంచీ ఈజూన్ కి రికవరీ మొదలై రెండేళ్ళు నిండాయి. అలాగని ఎన్.బీ.ఈ.ఆర్ అధికారికంగా ప్రకటించింది. తర్వాత వస్తే అది మరొక మాంద్యమే గాని దీనికి కొనసాగింపు కాదు అని చెప్పింది.

ఎకానమీ ఎత్తుకున్న దాఖలాలు పెద్దగా లేవు. దాంతో క్రుగ్మన్, రుబినీ లాంటి కొందరు రికవరీ అయినట్లే అయి మళ్ళీ మాంద్యంలో పడే ప్రమాదం ఉందని అభిప్రాయ పడ్డారు. సరిగా రికవరీ కాకుండా మాంద్యం తిరగబెడితే డబల్ డిప్ అంటారని తెలిసిందే. ఇప్పటికీ మాంద్యంలోనే ఉన్నాం.డబల్ డిప్ ఏమిటని లారెన్స్ మిషెల్ ప్రశ్ని స్తున్నాడు. కొందరు ఆర్ధిక వేత్తలు మరొక మాంద్యం పొంచివుంది అని చెబుతున్నారు. తిరగబెడుతున్న మాంద్యం అన్నా, మాంద్యంలోనే ఉన్నామన్నా, మరోమాంద్యం అన్నా ఉన్న పరిస్తితి ఒకటే. సామాన్యులు ఆందోళన పడుతున్నారు. కొందరైతే ఈ సారిది మరింత ఎక్కువ స్తాయిలో ఉంటుందంటున్నారు.

"భిన్న మైన , కొత్త తుఫాను వచ్చే క్షణాల్లో ఉన్నాం. అది 2008 లో వచ్చినటువంటిది కాదు" అని ప్రపంచ బాంక్ అధ్యక్షుడు రాబర్ట్ జోలిక్ అన్నాడు. ప్రపంచ ఎకానమీ మరింత ప్రమాదకరమైన దశలో ప్రవేశించింది అని అభిప్రాయ పడ్డాడు.

ఒబామా వీటిలో దేన్నీ ఒప్పుకోవటం లేదు. రికవరీ నడుస్తున్నదనీ, అయితే నెమ్మదిగ కదులుతున్నదనీ అంటున్నాడు. ఒహియోలో ఎకనమీ సరైన దారిలోనే నడుస్తున్నది అని అన్నాడు. ఒబామా రికవరీ మొగ్గలు చూడమంటున్నాడు. ఎంతచూచినా జనానికి మొలకలన్నా కనబడటం లేదు. మాంద్యం లోతులే దర్శన మిస్తున్నాయి. వాళ్ళని భయపెడుతున్నాయి. కార్పొరేట్లకి మాత్రం రికవరీ ఫలాలు లభిస్తున్నాయి. లాభాల పంటలు పండుతున్నాయి. అందువల్లే పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు మాంద్యంలో లేము.మరో మాంద్యం రాదు అంటున్నారు. కార్పొరేట్లకి రికవరీ,శ్రామికులకి వర్రీ - కళ్ళకి కట్టినట్లుంది.

అది మహోజ్వల మహాయుగం, అది వల్లకాటి అధ్వాన్న శకం - అంటూ చార్లెస్ డికెన్స్ తన నవల ' ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ ' ని మొదలుపెట్టాడు. ప్రస్తుత పరిస్తితి అలాగే ఉంది. పై వర్గాలకి మహయుగం, కిందివాళ్ళకి అధ్వాన్న శకం.

2007 డిసెంబర్ నుంచీ 2009 జూన్ వరకూ సాగిన మాంద్యం రెండు భిన్న ఫలితాల్ని ఇచ్చింది. సామాన్య కుటుంబాలూ, శ్రామిక కుటుంబాలూ అతి నిరుద్యోగంతో, ఫోర్‌క్లోజర్స్‌(అప్పులకి ఇళ్ళు వదులుకోవటం) తో సతమతవుతున్నాయి. మరోపక్క పెట్టుబడిదారులూ, సంపన్నులూ మరింత ఆదాయాలు పొందారు. అడుగు 80 శాతం మంది మొత్తం కుటుంబ ఆస్తి 2.2 పర్సెంటేజ్ పాయంట్లు తగ్గి 12.5 శాతం అయింది. అదే సమయంలో 1 శాతం మహా ధనికుల సంపద సామాన్యుని కుటుంబ ఆస్తికి 225 రెట్లు పెరిగింది.ఇదిప్పటికి రికార్డ్. 25 శాతం కుటుంబాలకి సంపదే లేదు. కొన్ని కుటుంబాలకి ఆస్తి లేకపోగా అప్పులున్నాయి.

2008లో పదివేల కుటుంబాల్లో ఒకటి సగటున 2 కోట్ల 70 లక్షల డాలర్లు ఆదాయం పొందింది.అడుగు 90 శాతం కుటుంబాలకు సగటున 31,244 డాలర్లు. సామాన్య శ్రామికుడి ఆదాయానికి సి.ఈ.ఓ ఆదాయం 185 రెట్లు.

అతిసంపన్నుల ఆదాయాల్ని కారీడ్ ఇంటరెస్ట్ గా పేర్కొంటూ పన్నులు 15 శాతం దాకా తగ్గి స్తారు. వారెన్ బఫెట్ అన్ని పన్నులూ కలిపి 6,938,744 డాలర్లు చెల్లించాడు. అతని నికర ఆదాయంలో అది 17.4 శాతమే. అదే ఆఫీస్‌లో పనిచేస్తున్న ఇతరులు సగటున 36 శాతం చెల్లిస్తున్నారు. డబ్బుతో డబ్బు సంపాయిస్తే పన్ను తక్కువ. ఉద్యోగం చేసి సంపాదిస్తే ఎక్కువ. పన్నులు ఎక్కువగా ఉంటే పెట్టుబడులు పెట్టరు అంటూ వాళ్ళకి రాయితీ లిస్తారు.

కార్పొరేట్లు పన్నులకు, నియంత్రణలకు సంబంధించి సందిగ్ధత తొలగనంత కాలం ఉద్యోగుల్ని పెట్టుకోలేము అంటారు.అయితే వాళ్ళు రికార్డ్ స్తాయిలో లాభాలు పొందారు. ప్రభుత్వ బెయిల్ అవుట్ల ద్వారా, వేతన కోతల ద్వారా రెండు లక్షల కోట్ల డాలర్ల నిల్వ నిధి వాళ్ళ వద్ద ఉంది. అయినా ఉద్యోగాలు సరిగా ఇవ్వటం లేదు. ఇచ్చినవాటికీ జీతాలు తక్కువే. పైగా పన్నులు తగ్గించమని కోరుతున్నారు. వాళ్ళకి పందుం తిన్నా పరగడుపే, ఏదుం తిన్నా ఏకాశే.

సంక్షేమ కార్యక్రమాల్ని తగ్గించమంటున్నారు.ఇవి జరిగితేనే ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు. ఇదొకరకంగా ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చెయ్యటమే. కార్పొరేట్లకి భారీ నిరుద్యోగం ఉండాలి. అప్పుడే జీతాల కోతకి తలొగ్గుతారు. ఎక్కువ పని చెయ్యటానికి ఒప్పుకుంటారు. అందుకే మిలియన్లమంది శ్రమజీవులకు కొద్ది అధరువుగా ఉన్న సంక్షేమ కర్యక్రమాలకు కోత పెట్టడమూ, కార్పొరేట్లకూ సంపన్నులకూ పన్నులు పెన్నీ అయిన పెంచకుండా చూడటమూ. అప్పులిచ్చేవాళ్ళకు బెయిల్ అవుట్ వచ్చింది. కాని అప్పు తీసుకున్నోళ్ళకి రాలేదు. వచ్చినా అరకొరే. అది కుదుటపరిచే స్తాయిది కాదు - అని ఫ్లాయిడ్ నారిస్ చెప్పాడు.

అమెరికా రుణ రేటింగ్ తగ్గింది. దీని ప్రభావంతో అమెరికా అప్పులమీద చెల్లించాల్సిన వడ్డీ పెరుగుతుంది. ఉద్యోగులూ, యజమానులూ కట్టాల్సిన వడ్డీ కూడా ఎక్కువవుతుంది. వడ్డీ రేటు పెరిగితే ఉద్యోగాలు రద్దు కావచ్చు.థర్డ్ వే అనే ఒక నిష్పాక్షిక సంస్త అంచనా ప్రకారం 0.5 శాతం వడ్డీ రేటు పెరిగితే 640,000 ఉద్యోగాలు రద్దు కావచ్చు.

అమెరికా శ్రామికుల్లో నూటికి 20 మంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నరు. మాంద్యం ముగిసి రెండేళ్ళయినా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు పోతూనే ఉన్నాయి. ఈ ఎనిమిది నెలల్లో ప్రభుత్వాలు 238,000 ఉద్యోగాలు తీసేశాయి. ఫెడరల్ మద్దతు తగ్గేటప్పటికి ప్రభుత్వ రంగంలో చాలా ఉద్యోగాలు (టీచర్లు,పోలిస్ ఆఫీసర్లు, అగ్నిమాపక సిబ్బంది) పోయాయి అని ఒబామా ఒక పత్రికా గోష్టిలో చెప్పాడు మూడో త్రైమాస్యంలో రాష్ట్ర , స్తానిక ప్రభుత్వాలు 110,000 ఉద్యోగాలు రద్దు చేస్తాయి. 2008 ఆగస్ట్ తో పోలిస్తే ఇప్పుడు 510,000 తక్కువ. ఫెడరల్ ఉద్యోగాల్లో 10 శాతం కోత పెట్టాలని రిపబ్లికన్ల ప్రతిపాదన.

అమెరికా, యూరప్ లు రాగల 6నుంచీ 12 నెలలపాటు మాంద్యానికి ప్రమాదకరమైనంత దగ్గరగా ఉంటాయి అని మోర్గన్ స్టాన్లీ అభిప్రాయ పడింది. ప్రపంచవృద్ధి ముందు చెప్పినట్లు 4.5 శాతం ఉండదనీ,3.9 అనీ సవరించింది. 2012 వృద్ధి 4.5 కాదనీ, 3.8 మాత్రమే ఉండవచ్చనీ అన్నది. జర్మనీ వృద్ధి 2011 తొలి క్వార్టర్లో 1.3 శాతం. రెండొ దాంట్లో 0.1 శాతానికి దిగజారింది. జూన్లో కాపిటల్ గూడ్స్ ఆర్డర్లు 15.1 శాతం తగ్గాయి. వినియోగ సరుకులకి సంబంధించి విదేశీ, స్వదేశీ ఆర్డర్లు కూడా తగ్గిపోయాయి.

ఐరోపా పీకల్లోతు సంక్షోభంలో ఉంది జర్మనీ వృద్ధి పతనం ప్రపంచ పోకడకి అనుగుణంగానే ఉంది. 17 దేశాల యూరోజోన్ వృద్ధి రెండో త్రైమాస్యంలో 0.2 మాత్రమే. మొదటి మూణ్ణెలల్లో 0.8. ఫ్రాన్స్ వృద్ధి రెండో క్వార్టర్లో సున్న.నెదర్‌లండ్స్ 0.1, స్పెయిన్ 0.2. పోర్చుగల్ సున్న.ఇటలీ 0.3. రష్యా వరసగా రెండు త్రైమాస్యాలూ బలహీనపడ్డది. ఇక జపాన్ రెండో దాంట్లో 0.3 శాతం క్షీణించింది. హాంకాంగ్ కూడా క్షీణత నమోదు చేసింది.

జపాన్ ,చైనా ఇండియాలు ప్రపంచ వృద్ధికి ఊతమిచ్చే స్తితిలో లేవు. చైనా 6.5 శాతం ద్రవ్యోల్బణంతో ఉంది. దీన్నీ తగ్గించే చర్యలకు పూనుకుంది. ఇండియా అదేపనిలో పడింది. కనక వృద్ధి పెరగదు. వృద్ధిచెందిన దేశాలు మాంద్యంలో పడ్డప్పుడు వర్ధమాన దేశాలు వాటిని బయటకు లాగలేవు. వీటికి అంత శక్తి ఉండదు. ఇంజన్లుగా పనిచెయ్యాలి అని సమావేశాల్లో చెబుతుంటారు. వీటి కొనుగోలు శక్తి తక్కువ. కనక ఇవి ఇంజన్ లాగా లాగలేవు. ఇప్పటికి బోగీలుగా మాత్రమే ఉంటాయి

ఉద్యోగాలు రావాలంటే వృద్ధి పెరుగుతూ ఉండాలి. మందగించేకొద్దీ కొత్తవి రాకపోగా ఉన్నవి కొన్ని పోతాయి. ప్రస్తుత పరిస్తితి సరిగ్గా అదే.2007 నాలుగో క్వార్టర్ నించీ 2011 తొలి క్వార్టర్ వరకూ నిజ జీ.డీ.పీ. సగటున సంవత్సరానికి 0.2 శాతం క్షీణించింది. 2011 మొదటి ఆరు నెలల వృద్ధి 0.9 శాతమే. అందువల్ల నిరుద్యోగం రేటు తగ్గక పోగా ఇటీవల పెరుగుతోంది. రేటు నిలకడగా ఉండాలంటే నెలకి 125,000 ఉద్యోగాలు రావాలి.నిరుద్యోగం ఒక ఏడాదిలో ఒక్క పర్సెంటేజ్ పాయంట్ తగ్గాలంటే నెలకి 2 లక్షల ఉద్యోగాలవంతున రావాలి. 18 నెలల మాంద్యంలో పోయినవి 87.5 లక్షలు. జూన్ చివరిదాకా వచ్చినవి 17.7 లక్షలు. రావలసినవి 70 లక్షల దాకా ఉంటయి.కొత్తగ పని ఈడు వచ్చేవాళ్ళు 125,000 అని అంచన. పోనీ లక్ష అనుకున్నా, ఆలెక్కన 43 లక్షలు కావాలి. కలిపితే 1కోటీ 13 లక్షలు.ఇన్నివస్తే మాంద్యం ముందున్న నిరుద్యోగం రేటుకి చేరుతుంది. ఇది మూడేళ్ళలో ముగియాలంటే నెలకి 4 లక్షల చొప్పున రావాలి. ఇది అయ్యేది కాదు. జులైలో వచ్చినవి 117,000.

జులైలో మొత్తం శ్రామికులు 15 కోట్లా 30 లక్షలు. నిరుద్యోగులు 1 కోటీ 39 లక్షలు. అంటే 9.1 శాతం. టీనేజర్ల నిరుద్యోగం 25శాతం. దీర్ఘకాల నిరుద్యోగులు (27 వారలు అంతకు మించీ ఉద్యోగం లేనివాళ్ళు) దాదాపు 62 లక్షలమంది.

రాజధాని వాషింగ్టన్ నగరంలో యువత (16-19 ఏళ్ళవాళ్ళు) నిరుద్యోగం 49 శతం.కనీస వేతనం తీసుకునే వాళ్ళలో నూటికి 40 మంది టీనేజర్లేనని సెన్సస్ బ్యూరో చెప్పింది.

ఉద్యోగం పోతే మళ్ళీ వచ్చేటప్పటికి సగటున 279 రోజులు పడుతున్నది. 2009 నుంచీ ఏటా 40 రోజుల చొప్పున పెరిగుతూ వస్తున్నది

పని ఈడొచ్చిన జనంలో ఎంత శాతానికి పని ఉంది అనేది సరైన విషయాన్ని చెబుతుంది. జనాభా-ఉద్యోగిత నిష్పత్తి. 2007 జూన్‌లో 63శాతం. 2009 జూన్‌లో ( మాంద్యం ముగిసిన మసం ) 59.4. రికవరీ రెండేళ్ళు కొనసాగాక 2011 జూన్‌లో 58.2. మాంద్య కాలంలో దాదాపు 5 పర్సెంటేజ్ పాయంట్లు పడిపోయింది.

నిరుద్యోగ భృతికోసం కొత్త దరఖాస్తులు ఆగస్ట్ 13 తో ముగిసిన వారంలో 408,000. 4 కోట్లా 60 లక్షల మంది అన్నం చీటీల డబ్బుతో బతుకుతున్నారు.

ఉద్యోగం పోతే 26 వారాలపాటు భృతి లభిస్తుంది. దాన్ని 5 సార్లు పొడిగించి 99 వారాలకి పెంచారు. అవీ అయిపోయి నిరాధారంగా ఉన్న వాళ్ళు 2010 జులైలో 14 లక్షల మంది ఉన్నారు.

ఉద్యోగాలు ఉన్నవాళ్ళకి కొనుగోలుశక్తి తగ్గింది

అప్పటికప్పుడు 1000 డాలర్లు ఖర్చు తప్పనిసరి అయితే నూటికి 64 మంది దగ్గర ఉండదు.అప్పో సొప్పో చెయ్యాల్సొస్తుంది.

పనిగంటలు తగ్గిస్తున్నందువల్ల ఆదాయాలు పడిపోతున్నాయి. జూన్‌లో వారానికి సగటు పనిగంటలు 34.3కి తగ్గాయి.సగటు వేతనం గంటకి ఒక సెంట్ తగ్గి 22.99డాలర్లయింది.సగటున వార వేతనం 788.56 డాలర్లుగా లెక్కకొస్తుంది. 2010 జనవరిలో కంటే ఇది తక్కువ.

ఇళ్ళ ధరలు 2011 రెండొ క్వార్టర్లో 2010 అదే కాలంతో పోలిస్తే ఇళ్ళధరలు 2.8 శాతం తగ్గాయి. 2006 తొ పోలిస్తే 32 శాతం తగ్గాయి. తనఖా పెట్టిన వాళ్ళు కొందరు ఇళ్ళు వదులు కుంటున్నారు సొంత ఇళ్ళున్న వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇళ్ళున్నవాళ్ళు అమెరికాలో ఇప్పుడు 59.2 శాతం అని మోర్గన్ స్టాన్లీ తేల్చింది. 2004 లో ఎక్కువగా 69.2 శాతం ఉండేది.అమెరికా అద్దెకుండే వాళ్ళ దేశంగా మారుతోందని బూరో వ్యాఖ్యానించింది.

మధ్య తరగతి దెబ్బతింటున్నది. 2010 సెప్టెంబర్ 20 న ఒక టౌన్ హాల్ మీటింగ్‌లో వెల్మా హర్ట్ అనే మధ్య తరగతి మహిళ లేచి ఒబామాతో మాట్లాడింది. ఆమె ఒబమాకి గట్టి మద్దతు దారు. అతనేదో మధ్యతరగతిని ఉ ఉద్ధరిస్తాడనుకున్నది .“నిన్నూ నీ పాలననీ సమర్ధించి సమర్ధించి విసిగి పోయాను అన్నది. ఇక మేము చౌక తిండితో (హాట్ డాగ్స్ అండ్ బీన్స్) బతకాలసిందేనా. ఇది మాకొత్త వాస్తవం కాబోతున్నదా? అని ప్రశ్నించింది. సూటిగా చెప్పమని అడిగింది.అయితే ఒబామా ఆమె అడిగిందానికి సూటిగా జవాబు చెప్పలేదు. 'ఇది అందరికీ గడ్డు కాలమే' అనిచెప్పాడు. మరో సందర్భంలో కార్పొరేషన్లూ ప్రజలే, అన్నాడు. అంటే సంపన్నులూ, నిరుపేదలూ అందరూ ఇబ్బందుల్లో ఉన్నారని చెబుతున్నాడు. అవసరాలకోసం సామన్యులు ఇబ్బందులు పడతారు కాని సంపన్నులు పడరు. అందరికీ గడ్డు కాలం అంటే ఎలా ?

ఈ ఆర్ధిక కష్టాలు/అరిష్టాలు ఒకరోజులో వచ్చినవి కావు.అలాగే ఒకరోజులో పరిష్కారం కావని చెపుతూ బాధ్యతనుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తుంటాడు

అప్పుపరిమితి పెంచాక పెట్టుబడులు పెడతారనీ, ఉద్యోగాలు వస్తాయనీ ఒబామా అంటున్నాడు. సరుకులకు డిమాండ్ పెరిగితేనే ఉత్పత్తి పెరగాలి. అమ్ముడయ్యేకొద్దీ తిరిగి అవసరం మేరకు తయారు చేస్తారు . ఆదాయాలు తగ్గిన జనం, అప్పుల్లో నుంచి బయటపడని జనం కొనేందుకు పెద్దగా ఇష్టపడరు. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి సత్తా కొంత అవసరం ఉండదు. మరి పెట్టుబడులెందుకు పెరుగుతాయి? ఉద్యోగాలు ఎలా వస్తాయి?

అప్పు పరిమితి సమస్య ఇప్పటికిప్పుడు తలెత్తింది కాదు. ఎప్పటినుంచో అందరికీ తెలిసిందే. మునిముక్కుకు వచ్చేదాక ఆగాడు.పోయిన డిసెంబరులో బుష్ పన్నుల కోతని పొడిగించినప్పుడు అప్పుపరిమితి పెంచాలని షరతు పెట్టి ఉండవచ్చు. చివరలోనయినా 14 వ రాజ్యాంగ సవరణని ప్రయోగించి అప్పుచేయవచ్చుఅలా చేయలేదు. రిపబ్లికన్లతో సంప్రతింపులు జరిపి బడ్జెట్ కోతకి ఒప్పుకున్నాడు.అప్పుపరిమితి పెంచకపోతే సంక్షోభం ఏర్పడుతుందని గగ్గోలు పెట్టారు.అయితే వీళ్ళకి నాలుగేళ్ళుగా సంక్షోభంలో ఉన్న శ్రామికుల పట్ల శ్రద్ధ లేదు.

అమెరికాకి నిజమైన సంక్షోభం అప్పుకి సంధించింది కాదు, నిరుద్యోగానికి సంబంధించింది. అప్పు పెంపు ఒప్పందం నిరుద్యోగాన్ని తగ్గించకపోగా పెంచుతుంది.2.1 లక్షలకోట్ల డాలర్ల కోత ఎన్ని ఉద్యోగాలను కాజేస్తుందో! ఎంతమంది పేదల్ని నిరుపేదల్ని చేస్తుందో! ఎందరు మధ్యతరగతి వాళ్ళని దిగలాగుతుందో! ఇదీ సమస్య. వాళ్ళకి మాంద్యం ముగిసేదేలా?

ఇది అప్పుసంక్షోభం కాదు, నిరుద్యోగ సంక్షోభం. పోస్టల్ సర్విస్ 220,000 ఉద్యోగాలు రద్దుచేస్తొంది. శనివారం బట్వాడా ఆపి 40,000 మందికి ఉద్వాసన చెప్పబోతోంది.

ఏపార్టీ ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరించటం లేదు. సంపన్నుల సంపదని పెంచే యోచనలు చేస్తున్నారు, ఖర్చుల తగ్గింపు పేరుతో మెడికేర్, మెడికైడ్, సామాజిక భద్రత, అన్నంచీటీలకు కోత పెడుతున్నారు.

మొదట్లో త్యాగాలు అందరూ చేయాలి అన్న ఒబామా చివరకి శ్రామికులకే పరిమితం చేశాడు. సంపన్నుల పన్నులు పెంచలేదు.అప్పుపరిమితి మీద దృష్టి కేంద్రీకరించాడు. ఇది వాల్ స్ట్రీట్ కి అనుకూలం. రిపబ్లికన్లు సంపన్నుల సంపాదనలో పెన్నీ కూడా కోత పడకుండా చూస్తున్నారు. ఇద్దరు చేస్తున్నదీ సంపన్నులకి మేలూ, ప్రజలకి కీడూ. మొత్తం మీద ఇరు పార్టీలూ ఒకరికొకరు వ్యతిరేకంగా కనబడుతూ పెట్టుబడి దారుల దారులకు ఏమాత్రం నొప్పి కలగకుండా చూస్తున్నారు. వాళ్ళ ఆర్ధిక డిమాండ్లు నెరవేరుస్తున్నారు. వాళ్ళ పనులు చక్కబరిచే పనిలో నిమగ్నమై ఉన్నారు. మొత్తం సంక్షోభ భారాన్ని శ్రామికుల మీదకి నెట్టేసి పెట్టుబడిదారులకి నొప్పి కలగకుందా కాపాడుతున్నారు.

డిఫాల్ట్ బూచిని చూపిస్తూ, అప్పుపరిమితి పెంచాలి. రిపబ్లికన్ల మద్దతు లేకుండా చట్ట సభలో అది నెగ్గదు. అంటూ సంప్రతింపులకి దిగి ఇద్దరూ కలిసి ఖర్చుల కోత విధిస్తున్నారు. రిపబ్లికన్లు పన్నులు పెంచటానికి ఒప్పుకోవటం లేదంటూ బాధ్యతనుంచి తప్పించుకో చూస్తున్నాడు ఒబామా.

నాలుగేళ్ళక్రితం మంద్యం రాబోతున్నదని మొదట చెప్పిన వ్యక్తి రూబినీ. ఆయన ఇటివల వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూలో మార్క్స్ ప్రస్తావన తెచ్చాడు. పెట్టుబడి దారీ విధానంలో ఉన్న వైరుధ్యాన్ని గురించిన మార్క్స్ విశ్లేషణ కరెక్ట్ అన్నాడు.ఒకనొక స్తాయి వద్ద పెట్టుబడి దారీ విధానం తన్ను తను ధ్వంసం చేసుకోగలదు. శ్రమ నుంచి పెట్టుబడికి ఆదాయన్ని చేరుస్తూ పోలేము. మార్కెట్లు చక్కబెడటాయి అనుకున్నాం. కాని అవి సరిగా పనిచెయ్యటం లేదు - అన్నాడు. ఆయన మార్క్సిస్టు కాదు. పరిస్తితుల్ని చూచి చెప్పాడు. మరి బాధలు పడుతున్న ప్రజలు కూడా నెమ్మదిగానయినా తెలుసుకుంటారు. పాలక వర్గాలు పెట్టుబడికి మద్దతివ్వటం గమనించకుండా ఉండరు. పాలక పార్టీల నాటకాల్ని ప్రజలు గ్రహించటం లేదు అనుకుంటే అంతకంటే పొరపాటు ఉండదు. అనుభవవం వాళ్ళని చైతన్యవంతుల్ని చేస్తుంది. వాళ్ళ కష్టాలు తీరే పంధాని ఎంచుకునేట్లు ముందుకు నడిపిస్తుంది.

ఇ.యెస్.బ్రహ్మాచారి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి