19, సెప్టెంబర్ 2011, సోమవారం

అంతర్యుద్ధం నుంచి యుద్ధం స్థాయికి


అంతర్యుద్ధం నుంచి యుద్ధం స్థాయికి - అరబ్ ప్రజల తిరుగుబాట్లు

2011 ఏప్రిల్ అరుణతార లోవచ్చింది ఇ.ఎస్.బ్రహ్మాచారి

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ - అన్నిదేశాల పాలకులూ ఈ మంత్రాల్నే జపిస్తున్నారు. ఈవిధానాలనే అమలు పరుస్తున్నారు. వేగిరపరుస్తున్నారు. వీటి దుష్ఫలితాలు ప్రజల జీవితాల్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. సంపన్నులు మహాసంపన్నులవుతున్నారు. పేదలు నిరుపేదలుగా దిగబడి పోతున్నారు. నిరుద్యోగం నింగి వైపు చూస్తోంది. ఉన్నవాడికీ లేనివాడికీ ఉన్న అంతరాల స్తాయీ అంత ఇంతాకాదు. విద్యా , వైద్యమూ సామాన్యుడికి అందేవిగా లేవు. రోజు రోజుకీ మరీ దూరంగా పరుగుతీస్తున్నాయి. ఫెరుగుతున్న ఆహరధరలు మరింతమందిని ఆకలితో అలమటింప చేస్తున్నాయి.

అన్ని దేశాలూ ఇవే విధానాల్ని అమలుచేస్తున్నాయి. కనక ఇంచుమించు అవే ఫలితాలు పొందుతున్నాయి. ప్రపంచంలో ఏఒక్క దేశమూ ఇందుకు మినహాయింపు కాదు. కొన్నిదేశాలు మెల్లగా, కొన్ని త్వరత్వరగా అంతే తేడా.

ప్రజలు తమగోడు వినమని మొరపెట్టుకుంటున్నా వినే దిక్కు లేదు. నిరసనల్ని సైతం ఉక్కుపాదంతో తొక్కెయ్యటమే పాలకులు ఏకైక మార్గంగా ఎంచుకుని నిర్దాక్షిణ్యంగా అమలుపరుస్తున్నారు. అంతటి కౄర అణచివేతని సైతం తట్టుకొని నిలబడుతున్న ప్రజల పోరాటాలు అరబ్ దేశాల్లో విజయం కోసం వేచి ఉన్నాయి.

తిరుగుబాటు మొదట తునీషియాలో మొదలైనా, ఈజిప్ట్ లో ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఈజిప్ట్ తరహా పోరాటం అనే మాట అన్నిచోట్లా వినపడుతున్నది. అమెరికాలో విస్కాన్సన్ ఉద్యోగులూ, బ్రిటన్‌లో విద్యార్దులూ బడ్జట్ కోతకు వ్యతిరేకంగా పోరాడుతూ ఈజిప్ట్ తరహాలో చేస్తామన్నారు. ఉద్యమకారులకు ఇది స్పూర్తిదాయక మయింది. దేశదేశాల పాలకులూ తమదేశంలోనూ అలాంటిది జరుగుతుందేమోనని బెదురుతో ఉన్నారు.

దీన్ని బట్టి అరబ్ పోరాటాలు ఎంత ప్రభావం చూపనున్నాయో తెలుస్తుంది. ఈపోరాటాలన్నింటిలో ఉమ్మడి కారణాలూన్నాయి. అలాగే ప్రత్యేకతలూ ఉన్నాయి. కనక వాటిని విడివిడిగానూ ఉమ్మడిగానూ పరిశిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రస్తుతమున్న ప్రభుత్వాలు పోతే గాని బాధలు పోవు అనే నిశ్చితాభిప్రాయం ప్రజలకు ఏర్పడింది.

అలోచించాల్సిన విషయమేమంటే: ఒక్కొక చోట ఒక్కొక ప్రభుత్వం ఉంది. ఒక్కొక్క పాలకుడున్నాడు. ఎక్కడి కక్కడ ప్రజలు తమ పాలకుడు పోతే తమ కష్టాలు గడిచి గట్టున పడతాం అనుకుంటున్నారు. మరి అందరి పాలన ఫలితలూ బాధలే అయినప్పుడు కారణం పాలకులు కాదు అనేది స్పష్టం. పాలకులు వేర్వేరు అయినా అమలు పరుస్తున్న ఆర్ధిక విధానాలు ఒక్కటే. వాటిని మారిస్తే తప్ప పాలకుల్ని మార్చి ఏప్రయోజనమూ ఉండదు.ఈసంగతి జనానికి ఇప్పటికే కొంత తెలుసు. అరబ్ పరిణామాల తర్వాత మరికొంత అవగతమవుతుంది. చైతన్యం పెరుగుతుంది. పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించి పోరాడతారేమో అనే భయం అన్నిదేశాల పాలకవర్గాలనీ బెంబేలెత్తిస్తున్నది. అందుకే లిబియాలో సైనిక జోక్యం. వర్గ ప్రయోజనాలనీ, పాలననీ కాపాడుకోటానికే దురాక్రమణ యుద్ధం

గడాఫీ విమానదాడులతో అమెరికా నేటో సేనలు బాంబులతో భారీ అంతర్యుద్ధం కొనసాగుతున్న లిబియాని ముందు చూద్దాం.

జనాభా 65 లక్షలు. చమురు నిల్వలు 2010 లో 4150 కోట్ల బారెళ్ళు. రోజుకి 18 లక్షల బారెళ్ళ చొప్పున వెలికి తీస్తారు. ఈలెక్కన 66 ఏళ్ళు లభిస్తుంది.ఆఫ్రికాలో ఇంతనిల్వలున్న దేశం మరొకటిలేదు. ప్రపంచంలో దానిది 9 స్థానం. మొత్తం దేశ ఉత్పత్తి (జీ.డి.పీ) లోసగం వాటా చమురే. ఆఫ్రికా దేశాల్లో తలసరి అదాయం లిబియాదే ఎక్కువ. ఎగుమతుల్లో 95 శాతం చమురే. సామ్రాజ్య వాదుల దృష్టి ఆ దేశం మీద ఉండటానికి ఇది చాలు.

1911 నుంచీ 1943 వరకూ ఇటలీకి వలసగా కునారిల్లింది. అందువల్ల, లిబియన్లలో సామ్రాజ్యవాద వ్యతిరేకత గూడు కట్టుకొని ఉంది.నాణ్యమైన, అపారమైన చమురు నిల్వల్ని కొల్లగొటింది ఇటలీ. 1969 లో అమెరికా మద్దుతున్న, అవినీతి పుట్ట అయిన రాజు ఇద్రిస్ ని కూలదోసి 27 ఏళ్ళ వయసులో గడాఫీ లిబియా పగ్గాలు పట్టాడు. గడాఫీ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాడు. నాజర్ సూయజ్ జాతీయీకరణ నించి స్పూర్తి పొందాడు. అమెరికా సైన్యాన్ని బహిష్కరించినప్పుడూ, అమెరికా చమురు కంపెనీలని జాతీయం చేసినప్పుడూ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గడాఫీకి బ్రహ్మరధం పట్టారు. పాలస్తీనీయుల పోరాటాన్ని సమర్ధిస్తూ, ఇజ్రాయిల్‌కి వ్యతిరేకిగా నిలబడ్డాడు.

1972 లో పాశ్చాత్య దేశాలతో ఉన్న ఒప్పందాల్ని రద్దుచేశాడు. దాంతో అమెరికా తన రాయబారిని వెనక్కు పిలిపించుకుంది. 1979 లో లిబియన్లు గుంపుగా కూడి అమెరికా రాయబార కార్యాలయాన్ని తగలబెట్టారు. అప్పుడు అన్నిసంబంధాల్ని తెంచుకుంది అమెరికా. రష్యాకు అనుకూలంగా ఉంటూ పదే పదే అమెరికా విధానాల్ని దుయ్యబట్టేవాడు. అమెరికా ఆయన్ని బద్ధ వ్యతిరేకిగా చూచేది. గడాఫీ అమెరికాతో విరోధిగా వ్యవహరించేవాడు.

1986 మార్చిలో అమెరికా లిబియా పెట్రోల్ బోట్లని ముంచింది. తర్వాత జర్మనీలో లాబెలే డిస్కో క్లబ్ లో బాంబు పేలింది. లిబియాని రీగన్ ప్రభుత్వం నిందించింది. బెర్లిన్‌లో ఉండే అమెరికా సైనికులు అక్కడకు పోతుండే వారు. ముగ్గురు చనిపోగా 200 మంది గాయపడ్డారు. రీగన్ గడాఫీని పిచ్చికుక్క అన్నాడు. లిబియా టెర్రరిస్ట్ దేశమంటూ ఆంక్షలు విధించాడు.

అంతే కాదు.అమెరికా లిబియా విమానాల్ని కూల్చింది.ఒక ఓడని ముంచింది. అందులో 35 మంది నావికులు చనిపోయారు. తర్వాత ట్రిపోలీ, బెంఘాజీ ల మీద బాంబు లేసింది. ఇంకో 60 మంది హతులయ్యారు. వాళ్ళలో గడాఫీ పెంపుడు కూతురు కూడా ఉంది.

పరాకాష్ట ఏమంటే, అమెరికా విమానం 1988 లో బాంబువల్ల ధ్వంసం అయింది. 243 మంది ప్రయణీకులూ,16 మంది సిబ్బందీ మరణించారు. విమాన శకలాలు స్కాట్లండ్ లోని లాకర్బీ పట్టణం మీద పడటంతో అక్కడ మరో 11 మంది చనిపోయారు. ఎన్నోఇళ్ళు గుల్లగుల్ల అయ్యాయి. మొత్తం 21 దేశాలకు చెందిన 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనని లాకర్బీ బాంబింగ్ అంటారు. అది లిబియా ఘాతుకమేనని అమెరికా వాదించింది. అమెరికాతో సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. అయితే ఆతర్వాత గడాఫీ తన పంధా మార్చుకున్నాడు.

రష్యా వెనకబడ్డాక , 1990 దశకం చివరలో అమెరికా తలుపు తట్టటం మొదలెట్టాడు. అప్పటికి లిబియాకీ అమెరికాకీ ముస్లిం సాంప్రదాయ వాదులనుంచీ ముప్పు ఉన్నదని గడాఫి గ్రహించాడనీ, అయన ప్రతినిధులు అమెరికాతో ఏవిషయంలో నైనా సంప్రతింపులకు సిద్ధంగా ఉన్నారనీ అమెరికా అసిస్టంట్ సెక్రటరీ మార్టిన్ ఇండిక్ తర్వాతి కాలంలో రాశాడు. సెప్టెంబర్ 11 దాడులకి ముందే అల్ ఖైదాతో పోరాటానికి సిద్ధమన్నాడు. అణ్వాయుధ కార్యక్రమాన్ని అంతర్జాతీయ పరిశీలకులు వచ్చి తనిఖీ చేయటానికి ఒప్పుకున్నాడు. అమెరికా టవర్ల మీద దాడి జరగగానే గట్టిగా ఖండించిన మొదటి ముస్లిం నాయకుడు గడాఫీయే.

ఆవిధంగా సెప్టెంబర్ దాడి అమెరికాతో లిబియా స్నేహబంధాన్ని దృఢతరం చేసింది. తర్వాత అమెరికా అల్ కయిదా మీద చేసిన దాడిలో గడాఫీ రహస్య పోలీసులు అమెరికా గూఢచారి సంస్త(CIA) కి సంపూర్ణ సహకారం అందించారు. 2003 లో రెండో ఇరాక్ యుద్ధం జరిగాక గడాఫీ పాశ్చాత్య దేశాలతో పూర్తి రాజీ చేసుకున్నాడు.

లిబియా 2003 లో లాకర్బీ బాంబింగ్ బాధ్యత ఒప్పుకున్నది. 2008 లో 200 కోట్ళ డాలర్లు బాధిత కుటుంబాలకి నష్ట పరిహారం చెల్లించింది. 2011 ఫిబ్రవరి 24 న ముస్తఫా అబ్దుల్ జలీల్ అనే మాజీ లిబియా న్యాయ మంత్రి స్వయంగా గడాఫీయే ఆనాటి బాంబింగ్‌కి ఆదేశాలు ఇచ్చాడన్నాడు.

ప్రభుత్వ అధీనంలో ఉన్న చమురు కంపెనీల్ని ప్రైవేటు పరం చేశాడు. పదవిచేపట్టినప్పుడు విదేశి కంపెనీలని జాతీయం చేసి జాతిచేత జై కొట్టించుకున్న నేత, వాటిని తిరిగి విదేశీ కంపెనీలకు అప్పగించి ఛీ కొట్టించుకున్నాడు. సంస్థాగత సర్దుబాట్లు చేశాడు. ఆహార, చమురు సబ్సిడీలు తగ్గించాడు. తృప్తి పడిన అమెరికా ఆంక్షలు ఎత్తేసింది. గడాఫీ అమెరికాకీ , యూరప్‌కీ దగ్గరపడ్డాడు. ఆయనకి ఆ దేశాల్లొ ఘనస్వాగతం లభించింది. ఆయా దేశాధీశులు ఒకరితర్వాత మరొకరు లబియా వచ్చి కరచాలనాలు చేశారు. కొత్తహితుణ్ణి హత్తుకున్నారు. తమదేశాలకు ఆహ్వానించి కరతాళధ్వనులు మిన్నుముట్టించారు. 2009 లో లాకర్‌బి బాంబు నిందితుణ్ణి ఇంగ్లండ్ విడుదలచేసి లిబియాకి పంపింది. తన ప్రజలమీద గడాఫీ ప్రయోగిస్తున్న అయుధాలు పాశ్చాత్య దేశాలు సరఫరా చేసినవే.

అల్ ఖైదాకు చెందిన వాళ్ళని అరెస్ట్ చేశాడు. అమెరికా ఎవరిని ఉగ్రవాది అంటే వారిమీద కఠిన చర్యలు చేపట్టాడు.పాలస్తీనా వాళ్ళని తనదేశం నుంచి గెంటివేశాడు. కనకనే మానవహక్కుల్ని రక్షిస్తున్న దేశమంటు ఐరస మానవహక్కుల కమిషన్ 2010 లో మెచ్చుకుంది. అయితే తన ప్రజల మెప్పు పొందలేక పోయాడు. జనాలకి దూరమయ్యాడు. కారణం పాశ్చత్య దేశాల ప్రాపు కోసం ప్రవేటీకరణనీ, ప్రపంచీకరణనీ ప్రోత్సహించటమే. ప్రజల మీద కత్తిగట్టటమే.

లిబయా అరబ్ రిపబ్లిక్ నెలకొల్పాడు. తర్వాత 1977 లో జమహిరియాగా మార్చాడు..అంటే ప్రజా రాజ్యం. తనది ఇస్లామిక్ సోషలిజం అన్నాడు. పేరుకే గాని అది సొషలిజం కాదు. అప్పటికి రష్యాలో పెట్టుబడిదారీ విధానం తిరిగి పట్టు పెంచుకుంటున్నది. ప్రజల కమిటీల చేతుల్లో అధికారం అన్నాడు. ఆచరణలో అన్ని అధికరాలూ గుప్పెట్లోనే. ప్రతిదీ ఆయన కనుసన్నల్లొ జరగాల్సిందే. అంతా ఆయన అదుపాజ్ఙల్లో ఉండాల్సిందే.

అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో లాగే అక్కడా ప్రజాస్వామ్యం పేరుకే. ప్రజలకు హక్కులు అమల్లో ఉండవు.గడాఫీ ప్రత్యక్ష ప్రజస్వామ్యం అంటాడు. అసమ్మతికి పరోక్ష నరకం చూపిస్తాడు. అంతదాకా ఎందుకు, అసమ్మతి చట్టవ్యతిరేక చర్య, నేరం.రాజకీయ పార్టీ స్థాపిస్తే మరణ శిక్షే. వ్యతిరేకుల్ని బహిరంగంగా ఉరితీసి, టీవీల్లో ప్రసారం చేసిన సందర్భాలూ ఉన్నాయి. . అదే ఆయన జమాహిరియా, అదే ఆయన ప్రత్యక్ష ప్రజాస్వామ్యం.

గడాఫీ కొడుకులు పశ్చిమ దేశాల సంపన్నులతో కాలక్షేపం చేస్తుంటారు. విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. వాళ్ళ ఆశీస్సులతో అనేక బ్రిటిష్ కంపెనీలు లిబియా మార్కెట్‌లో ప్రవేశించాయి. ఇటలీ చమురు కంపెనీల్లో ఆయనకు వాటాలున్నాయి. చాలా బాంకుల్లో వాటాలు కొన్నాడు.లిబియా లోపలా బయటా ఆయనికి ఎంతో సంపద ఉంది.జింబాబ్వే,చైనా, సూడాన్, లియోన్, లిబిరియా దేశాల్లో పెట్టుబడు లున్నాయి.

నిరుడు అక్టోబర్ 28న ఐ.ఎం.ఎఫ్ లిబియా ప్రైవేట్ రంగాన్ని పెంచే ప్రయత్నాల్ని మెచ్చుకుంది. ద్రవ్య మార్కెట్లని విస్తరంపచేస్తున్నదని కొనియాడింది.ప్రభుత్వ సొంత బాంకులక్కడ లేవనీ, అక్కడున్న 16 ఆపరేటింగ్ బాంకుల్లో ఆరింటిలో విదేశీ భాగస్వాములున్నరనీ చెప్పింది. ఉద్యోగాలు కుదించడంలో పురోగతి సాధించిందనీ శ్లాఘించింది. 340.000 మంది ప్రభుత్వోద్యోగుల్ని తొలగించటానికి సెంట్రల్ లేబర్ ఆఫీస్ కి బదిలీ చేశాడు. వాళ్ళలో 4 వ వంతు మందికి వేరే ఆదాయ వనరులు లభించాయనీ, ఈ ప్రక్రియ వేగం పుంజుకోవాల్సి ఉందనీ సూచించింది.

తిరుగుబాటుకి వారం ముందు (ఫిబ్రవరి 9 న) బాంకుల్ని పూర్తిగా ప్రైవేటీకరించాలనీ, పసిదశలో ఉన్న ద్రవ్య రంగాన్ని అభివృద్ధి పరచాలనీ కార్యక్రమం రూపొందించాడు.2010లో సంస్థాగత సర్దుబాట్లకు సంబంధించి చట్టాలు చేశాడనీ, ఫలితంగా ప్రైవేట్ రంగం ఊపందుకుంటుందనీ, విదేశి పెట్టుబడులకి ఆకర్షణ పెరుగుతుందనీ చెప్పింది. ఈ ఆర్ధిక విధనలకి అనుగుణంగా శ్రామికుల్ని తయారుచేసే విధానాలు చేపట్టాడని శ్లాఘించింది.

అమెరికాకు నేస్తమయ్యాడు. ఐ.ఎం.ఎఫ్. ప్రశంసలు పొందాడు. ఐ.రా.స. పొగడ్తలు అందుకున్నాడు. ఇంకనాకేం అనుకున్నాడు. అయితే అనతికాలంలోనే, ప్రజల తిరుగుబాటూ వెల్లువెత్తింది.

పైనేపథ్యంలో చూస్తే మధ్య ప్రాచ్యం లోని తిరుగు బాట్లు ఆయా దేశాల్లో స్వేచ్ఛా మార్కెట్ విస్తరణకీ, సంస్తాగత సర్దుబాట్ల అమలుకూ వ్యతిరేకంగా చెలరేగిన ప్రజా ఉద్యమాలుగా కనపడతాయి. 20 ఏళ్ళుగా అవి కార్మికుల స్తితిగతులమీద దెబ్బమీద దెబ్బకొట్టాయి. అందుకే నియంతృత్వం మీద తిరుగుబాటుగా మాత్రమే దీన్ని చూస్తే సరిపోదు. ప్రపంచీకరణ ప్రక్రియమీదా, దాని వెనక ఉన్న పెట్టుబడి దారీ విధానం మీదా ప్రజల్లో పెరిగిన అసంతృప్తి ఇక్కడ స్పష్టమయింది. వాళ్ళిచ్చిన నినాదాల్లో కార్మికుల వేతనాలకీ, కార్మిక చట్టాలకీ సంబంధించినవి ఉన్నాయి. పాలకులు కూడా ఆర్ధిక వరాలు కురిపించారు. ఒకడు దిగుతాడు. మరెవడో ఎక్కుతాడు. అమెరికా పెట్టిన వాడు కావచ్చు. ప్రజలు ఎన్నుకున్న వాడైనా రావచ్చు. ఎన్నికల్లో గెలిచి గద్దెమీద కూర్చున్నాడనుకుందాం. ఆయన ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బాంకుల ఆదేశాల్ని కాదన గలడా? స్వేచ్చా మార్కెట్నీ, ప్రపంచీకరణనీ, సంస్తాగత సర్దుబాట్లని ఆపగలడా? అది అయ్యేపనికాదు. అవన్నీ పెట్టుబడిదారులకు లాభదాయకం. కార్మికులకి ప్రాణ సంకటం. కనక దీని తర్వాత మరో తిరుగుబాటు - కార్మిక వర్గ పోరాటం -చెయ్యాలి. చేస్తారు.

ఇక్కడ ఒక విషయం పరిశీలించాలి.

ఒక దశాబ్దంగా అమెరికా గడాఫీని తనవాడిగా తనకి లాభాలు పండించే నమ్మకస్తుడిగా చూస్తున్నది. సంబంధాలు అంత సజావుగా సాగుతున్నప్పుడు ఆయన్ని దిగిపొమ్మనటమెందుకు? పారిపోయినా వదిలేదిలేదనీ, అంతర్జాతీయ నేర న్యాయస్తానంలో నిలదీస్తాం అనటంలోని అంతరార్ధమేమిటి?

పశ్చిమ దేశాలకి సమస్య తిరగబడుతున్న ప్రజలతో. పాలకులతోకాదు. విహితుడైన పాలకుడు తన దేశప్రజల తిరుగు బాటుని అణచి వెయ్య గలిగితే అమోదిస్తాయి. అక్కడిక మానవ హక్కుల ప్రస్తావనకు చొటుండదు. అదే తమకు లొంగని వాడయితే ఆదేశ ప్రజలమీద మానవహక్కుల ఉల్లంఘన జరిగినట్లే. అప్పుడు ప్రజలతో చేరి పాలకుణ్ణి దింపి తమ కీలుబొమ్మకి కిరీటం బెడతారు. లొంగినా, అనుకున్నంత లొంగకపోతే, అతన్ని కూలదోసి చెప్పిన పనిని చెప్పినట్లు చేసే వాడికి పట్టంకడతారు. ఎంత అనుకూలుడైతే వాళ్ళకి అంత మంచిది. ఆర్ధిక ప్రయోజనాలు ప్రధానం. పాలకులు కాదు. తిరుగుబాటుని పాలకుడు అణచి వేస్తుంటే, తాము ప్రజల పక్షాన నిలబడి నెగ్గించామని ప్రజల అదరణ పొందాలి. తమ కీలుబొమ్మని ప్రతిష్ఠించి పనులు గతంలోకంటే మెరుగ్గా చక్కబెట్టుకోవాలి. వాళ్ళ జోక్యంతోనే రాజ్యాధినేతలు రావాలి. వాళ్ళ ప్రయోజనాలు సంపూర్ణంగా, నిరాటంకంగా నెరవేరాలి. సామ్రాజ్య వాదులకు శాశ్వత మిత్రులుండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి.

లిబియాలో పోరాటం అంతర్యుద్ధం స్తాయికి చేరింది. దాన్ని ఆపటం కుదరదని అమెరికాకి తెలుసు. గడాఫీ విహితుడే అయినా, మహాహితుడు -పూర్తి విశ్వాసం లోకి తీసుకోదగిన వాడు - కాదని తిరుగుబాటు మొదలయ్యే వరకూ అమెరికా అబిప్రాయం. ఈజిప్ట్ అధినేత ముబారక్ లాగే పారిపో తాడనీ అప్పుడు అతని కన్న విశ్వాస పాత్రుణ్ణి అందలం ఎక్కిస్తే మెరుగు అనుకుంది. అయితే గడాఫీ గద్దెదిగలేదు. ఉద్యమాన్ని ఆణచటానికి పూనుకున్నాడు. ఉద్యమం ఆగిపోతుందనీ అమెరికా అనుకున్నది. అలా జరిగితే గడాఫీయే కొనసాగుతాడు.అది అమెరికాఅకి ఇప్పుడు ఇష్టం లేదు. ఒకవేళ వాళ్ళకు వాళ్ళుగా, ప్రజలు నెగ్గినా తిరుగుబాటుదారుల్లో సామ్రాజ్యవాద వ్యతిరేకి పదవిచేపట్టి, అప్పట్లో గడాఫీలాగ తమను ఢీకొట్టచ్చు. ఆలా జరగకుండా ఉండాలంటే సైనిక జోక్యం చేసుకోవాలి. అంతర్యుద్ధాన్ని యుద్ధం స్తాయికి తీసుకెళ్ళాలి. గడాఫీ ముబారక్ లాగే పారిపోలేదు. పైగా తిరుగుబాటు మొదలయ్యాక, అమెరికా, నేటో అల్ ఖైదాలే రెబెల్స్‌ ని రెచ్చగొట్టాయి అని ఆరోపిస్తున్నాడు. అందువల్ల అతన్నిక ఉపేక్షించటం వాళ్ళకి ఎంత మాత్రమూ శ్రేయస్కరం కాదు. కనక అతన్నిదింపి తమ కీలుబొమ్మని పెట్టటం తప్ప ప్రత్యామ్నాయం లేదు. అంతే, తమప్రయోజనాలు నెరవేర్చుకునేందుకే గాని, లిబియా పౌరుల్ని ఉద్ధరించటానికి కాదు. వాళ్ళ కీలుబొమ్మ గడాఫీ కన్నా దారుణమైన పాలననిస్తాడు. ప్రజలకి ఎంతో హాని చేస్తాడు. ఇది ఆఫ్ఘనీస్తాన్, ఇరాక్ లలో ఇటీవలే రుజువయింది.

ఆర్ధిక సంస్కరణలు చేపట్టాడు.బహుళజాతి సంస్తలు - చమురు కంపెనీలూ, అంతర్జాతీయ బాంకులూ,ఆయుధ సంస్తలూ ప్రవేశించాయి. ఫలితంగా,అసమానతలు అధికమయ్యాయి. అవినీతి అందలమెక్కింది.35 శాతం మంది పేదరికంలో మగ్గుతున్న దేశమది. నూటికి 30 మంది ఉద్యోగాల వేటలో వేసారివున్న ప్రాంతమది. ఈకారణాలవల్ల ఫిబ్రవరి మధ్య తిరుగుబాటు రేగింది. కార్మికులు పేదలూ మద్దతుతో నడుస్తున్న పోరాటమిది. సొంతతెగ గడాఫా జోక్యం ఎక్కువయింది. ఇది మిగిలిన తెగలకు ఇష్టం లేదు.

గడాఫీ అణచివేతకు పూనుకున్నాడు.రెండు రోజుల్లో 20 మంది చనిపోయారు. తునీషియా, ఈజిప్ట్ నేతలకు అంతకుముందు మద్దతు పలికాడు. క్రమంగా నిరసన ప్రదర్శనలు పెరిగాయి. గడాఫీ, గద్దె దిగు అనీ, నియంతా ఇప్పుడు నీవంతు, పారిపో అనీ నినదిస్తుంటే దిక్కులు పిక్కటిల్లాయి

వెంటనే గడాఫీ 10 లక్షల ప్రజలున్న ట్రిపోలీ నగరంలో రెబెల్స్ మీద విరుచుకపడ్డాడు. రెబెల్స్ చేతుల్లో ఉన్న మధ్యధరా తీరంలోని జ్వార ,జవియాలతో సహా పశ్చిమ పట్టణాల్ని తిరిగి కైవశం చేసుకున్నాడు. రెబెల్స్ ని ఎలుకలు అని అవహేళన చేశాడు. ఇల్లిల్లూ సోదాచేసి మట్టుబెడతానన్నాడు. తిరుగుబాటుకి కారకులు విదేశీయులూ, కిరాయి మూకలూ అన్నాడు. తిరుగు బాటు పుంజుకునేకొద్దీ మచ్చిక చేసుకునేందుకు తాయిలాలు ప్రకటించాడు. ప్రభుత్వోద్యోగుల జీతాలు రెట్టింపు చేశాడు.ఈజిప్ట్ టునీషియాల లోలాగానే కిరాయిమూకల్ని ప్రయోగించాడు.నిర్దాక్షిణ్యంగా ప్రజా ఉద్యమం మీద సాయుధ దాడికి దిగాడు.

తాము జొరబడటానికి ఇదే సరైన సమయం అనుకున్నాయి అమెరిక నేటోలు. లిబియా గగనతలంలో విమానాలు ఎగురరాదని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానించింది. 1973 తీర్మానం ద్వారా కూటమికి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అవసరమయ్యే చర్యలు తీసుకునేందుకు అనుమతి నిచ్చింది. మానవహక్కు ల రక్షణ సాకుతో అమెరిక, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల కూటమి లిబియాలో జోక్యం చేసుకుంది. పౌరుల్ని కాపాడటానికి విదేశీ ఆక్రమణ తప్ప ఏదైనా చెయ్యండి అని ఐరాస భద్రతామండలి మార్చ్ 17న తీర్మానం చేసింది. సంకీర్ణ దళాలు ''ఆపరేషన్‌ ఒడిస్సీ డాన్‌'' కార్యక్రమం మొదలె మొదలెట్టాయి.

మార్చ్ 19 న ఫ్రాన్స్ విమాన దాడులకు దిగింది. ఫ్రాన్స్ మొదటినుంచీ ముందుంది. తిరుగుబాటుదారులట్రాన్స్ నేషనల్ కౌన్సిల్ ని ముందు గుర్తించింది ఫ్రాన్స్. ఆతర్వాత ఇటలీ.

భద్రతామండలి ఇలాంటి తీర్మానాల్ని యుగోస్లావియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ దేశాలల్లో జోక్యం చేసుకుని దురాక్రమణ యుద్ధాలు చేసేందుకు వీలు కలిగిస్తూ ఇటువంటి తీర్మానాలే చేసి సామ్రాజ్య వాదులకి సహకరించింది. తీర్మానం కేవలం లైసెన్సు మాత్రమే. దాన్నడ్డం బెట్టుకుని సైన్యాల్ని పంపి ఏ అరాచకమైనా చేయటం నాటోకి అలవాటే. కీలుబొమ్మని పెట్టి శాంతి భద్రతల పేరిట, ప్రజాస్వామ్యం సాకుతో సంవత్సరాల తరబడి తిష్ట వేయటం పరిపాటే

నెలకి పైగా నేటో చేసిన వేలాది దాడుల మూలంగా గడాఫీ పోరాట పటిమ నలిగింది. సైనిక సామాగ్రిలో మూడో వంతు నాశనమయింది. సరఫరా మర్గాలు సన్నగిల్లాయి. నేటో వేలాది దాడులు చేసింది.టాంకుల్ని, యుద్ధ వాహనల్నీ, రాకెట్ లాంచర్లనీ, ఆయుధాగారాల్ని ధ్వంసం చేసింది. బంకర్లనీ కొట్టింది. ఏప్రిల్ చివరలో గెలవబోతున్నాం అని ప్రకటించింది. ఇప్పటికి గడాఫీ భవన సముదాయం మీద 4 సార్లు దాడి చేసింది.

పెట్రోల్ కోసం జనం బారులు తీరుతున్నారు. ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్య సరఫరా సరిపోయినంతగ లేదు. ఎకానమీ చెల్లాచెదరైంది. ఎక్కువమంది లిబియన్లు తమ పరిస్తితికి నేటోని తప్పుబట్టవచ్చు. అయినా గడాఫీ ఉన్నంత కాలం సాధారణ స్తితి ఏర్పడదు అనే సందేశం ప్రచారంలో ఉంది. గడాఫీ కి ప్రజాదరణ తగ్గుతున్నది. మరికొంత పట్టు కోల్పొతే ముగింపు మొదలైనట్లే.

దాడులు కొనసాగిస్తూనే సంప్రతింపులు అంటున్నారు. ఆఫ్రికా యూనియన్ బృందం తిరుగుబాటుదారులతొ బెంఘాజీలో కలిసి మాట్లాడింది. గడాఫీ గద్దె దిగితేనే, సంప్రతింపులకు వస్తామని రెబెల్స్ అంటున్నారు. నేటో సంప్రతింపుల్ని తిరస్కరించింది. గతంలోనూ దాడులకి తలపడే ముందు కాల్పుల విరమణ అనేవాడనీ, కావలసింది మాటలు కాదు, చేతలనీ చెప్పింది.

దేశం వీడటం ఆయనకు మంచిదనీ, వెళ్ళినా, ఆయన తన ప్రజలపై జరిపిన మానవ హక్కుల ఉల్లంఘనకు చర్యలు తప్పవనీ అమెరికా విదే శాంగ ప్రతినిధి పి.జే. క్రౌలే మార్చి లోనే తేల్చి చెప్పాడు.

ఒబామా, సర్కోజీ, కామరాన్ - త్రయం గడాఫీ గద్దె దిగాల్సిందే నన్నారు. అదితప్ప ఏదైనా సరే అంటున్నాడు గడాఫీ. అంతే, వెంటనేబ్రిటన్ ఫ్రాన్స్‌ లు బెంఘాజీ లో ఉన్న తిరుగుబాటుదారులకు సలహాదారుల్ని పంపటం మొదలెట్టాయి. ఒబామా 2కోట్లా 50 లక్షల డాలర్లు పంపాడు. గడాఫీ సేనని కొట్టటానికి డ్రోన్ యుద్ధ విమానాలు పంపాడు. వాటిలోనడిపే మనుషు లుండరు.తక్కువ ఎత్తులో ఎగురుతాయి.లక్ష్యాలని స్పష్టంగా గుర్తించి ఛేదిస్తాయి. పదాతి దళాలమీద శక్తివంతంగా దాడి చేస్తాయి. హెల్ ఫైర్ మిసైల్‌లు ఉండే 2 డ్రోన్ లు లిబియా గగన తలలంలో రేబావళ్ళూ పహరా గాస్తాయని 22న వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది.

ఏప్రిల్ 30 న నేటో గడాఫి ఉన్న భవనం మీద హై స్తాయి దాడి చేసింది. ఆయన కేమీ కాలేదు కాని ఆరుగురు కొడుకుల్లో కడగొట్టు వాడు, 29 ఏళ్ళ సైఫ్ అల్ అరబ్ హతుడయ్యాడు. గడాఫీ మనవళ్ళు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇది నాయని మీద చేసిన హత్యా ప్రయత్నమేనని ప్రభుత్వ ప్రతినిధి ఇబ్రహిం దాడిని ఖండించాడు.కనీసం మూడు క్షిపణులు భవనాన్ని ఢీకొన్నాయి. పెద్ద రంధ్రాలు పడ్డ భవనం కప్పుని విలేకరులకు ప్రభుత్వం చూపెట్టింది. శనివారం రాత్రి పొద్దుపొయాక నగరమంతా పేలుళ్ళతో దద్దరిల్లింది.

ఆవేశంతో లిబియన్లు ట్రిపోలీ లోని ఇటలీ ,బ్రిటన్ దేశాల రాయబార కార్యాలయాలమీద పడి భయోత్పతం సృష్టించారు. ఆగ్రహించిన బ్రిటన్ లిబియా రాయబారిని తమ దేశం నుంచి బహిష్కరించింది. ఐరాస తన అధికారుల్ని కాళీ చేయించింది.

అదలా ఉండగా మిసురాటా నౌకాశ్రయం మీద వందల రాకెట్లతో సైన్యం దాడులు చేసిందని రెబెల్ ప్రతినిధి ఆరోపించాడు

ప్రభుత్వ ప్రతినిధి మౌస్సా ఇబ్రహిం క్షమభిక్ష కావాలంటే 4 రోజుల్లో రెబెల్స్ ఆయుధాలు వీడాలనీ, లేకపోతే, తమ ఆగ్రహాన్ని చవిచూడక తప్పదనీ హెచ్చరించాడు.

గడాఫీ సంప్రతింపులకి సంసిద్ధత వ్యక్తం చేశాడు. లిబియా మీద విమాన దాడుల్ని ఆపమన్నాడు. శనివారం ( ఏప్రిల్ 30 ) పొద్దున్నే టీవీలో కనపడి " మేము వాళ్ళమీద దాడి చెయ్యలేదు... సముద్రాన్ని దాటిందీ లేదు.వాళ్ళు మామీద ఎందుకు దాడి చెస్తున్నట్లు?" అని అడిగాడు. మమ్మల్ని మీతో మాట్లాడనీయండి.సంప్రతింపులు జరుపుదం." అంటూ నేటో కూటమిని కోరాడు.ఆదేశాలకి కావలసింది చమురే అయితే కాంట్రాక్టులు కుదుర్చుకునేందుకు ఏ ఇబ్బందీ ఉండదు అని భరోసా ఇచ్చాడు.

టీవీలో 80 నిముషాలు మాట్లాడాడు. పదవిని వీడే ఉద్దేశ్యం కానీ, దేశాన్ని వదలే ప్రసక్తి గానీ లేదన్నాడు. నేటో దాడులు ఆపితే లిబియన్లు తమ సమస్యల్ని తామే పరిష్కరించుగలరని తేల్చాడు.

లిబియన్లంతా ఒకే కుటుంబం. ఒకరితో ఒకరు కొట్లాడుకో కూడదు- అని హితవు పలికాడు. ఇంతకుముందు స్వాతంత్ర్యమో,మరణమో. లొంగేది లేదు.భయపడం. ఈమార్గాన్ని వీడం. "మీరు దురాక్రమణదరులు. మేము మీతో మాట్లాడతాం… మీరు మీ నౌకల్నీ, విమానల్నీ వెనక్కి తీసుకెళ్ళండి."

తూర్పు లిబియాలోనూ, ఉత్తరాన మిస్రాటాలోనూ తిరుగుబాటుదారులు లిబియన్లు కాదు,"అల్జీరియ, ఈజ్ప్ట్, టునీషియా, అఫ్ఘన్‌స్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు" అన్నాడు.

ప్రసంగం జరుగుతున్నప్పుడు జమాహిరియా భవనం పక్కన భవనం మీద బాంబులు పడ్డాయి.అంటే ఆయన్ని లక్ష్యంగా చేసుకున్న దాడే అది అని టీవీ చెప్పింది.

మిసురాటా నౌకాశ్రయంలో ఓడల్ని నాశనం చేసే మందుపాతరలు పెడుతున్నారనీ, అందుకొచ్చిన లిబియా ఓడల్ని అడ్డగించామనీ నేటో చెప్పింది. వెంటనే లిబియా మిసురాటాలోకి సహాయక పదార్ధాల్ని తెచ్చే ఓడల్ని ఎదుర్కుంటానని బెదిరించింది. ఆనౌకాశ్రయాన్ని రెబెల్స్ ఆయుధాలు తెచ్చుకోటానికీ, ఉగ్రవాదుల్ని రప్పించటానికీ వాడుతున్నారని ఇబ్రహిం ఆరోపించాడు. ఇది మా అధికార పరిధిలో ఉంది. అలాజరగటానికి మేం ఒప్పుకోం అన్నాడు. మేము సోదా చెయ్యనిదే అందులో మనుషులు రావటానికి అంగీకరించం. కాదని వస్తే ఏ ఓడనైనా దాడిచెయ్యకుండా వదలం.

నేటో సైనిక జోక్యాన్ని ఊచకోత అంటూ విమర్శించాడు. తమ సేనలు పౌరుల్ని చంపలేదన్నాడు. మాపిల్లల్ని మీరెందుకు చంపుతున్నారని ప్రశ్నించాడు.మౌలిక సదుపాయాల్ని ఎందుకు ధ్వంసం చేస్తున్నారో చెప్పమన్నాడు.

మిసురాటా రెబెల్స్ పట్టులోనే ఉంది. రెండు నెలల నుంచీ భీకర పోరు జరుగుతోంది. ప్రభుత్వ సేనలు ప్రజలమీద క్లస్టర్ బాంబులు వేస్తున్నారేమో అని హిలరీ క్లింటన్ తప్పుబట్టింది. దాదాపు రెణ్ణెల్లుగా మిసురాటా నగరాన్ని సైన్యం ముట్టడించింది.విడువకుండా దాడి చేసింది. అయితే ఏప్రిల్ 23 సాయంత్రం సేనలు వెనక్కి వెళ్ళాయి. రెండు భవనాల్లో మాత్రం ఉన్నారు. కారణం రెబెల్స్ చుట్టుముట్టి లొంగిపొమ్మని పట్టు పడుతున్నారు.

మిసురాటా నుంచి గడాఫీ సేన వెనుదిరగటం ఒక మలుపు. మిసురాటా 3లక్షల జనాభాగల పస్చిమ లిబియా నగరం. అది రెబెల్స్ కి గట్టి పట్టున్న చోటు. అయినారెండు నెలలుగా అక్కడ ప్రభుత్వ సేనలు కొన్ని ప్రాంతాల్ని గుప్పెట్లో పెట్టుకున్ని ఉన్నాయి. వెనక్కొచ్చాక , నగరం వెలుపలి ప్రాంతాలనుంచీ రోజూ దాడులు చేస్తూనే ఉన్నాయి.

మే 4న మిసురాటా ఓడరేవులో ఒక అంతర్జాతీయ సహాయక నౌక మీద ప్రబుత్వ సైన్యం రాకెట్ దాది చేసింది. అయిదుగురు చనిపోయారు. అందులో 180 టన్నుల పదార్ధాలున్నాయి.తిరిగుప్రయాణంలో శరణార్ధుల్ని తీసుకు వెళుతుంది. అయితే ఈగందరగోళంలో 200 మంది ఒడ్డునే ఉండి పోయారు.

అదేరోజు ఉదయం అంతర్జాతీయ నేర న్యాయస్తానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ భద్రతా మండలి కి నివేదిక ఇచ్చాడు. అందులో నేరాలు పెరుగుతున్నాయన్నాడు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 700 మంది పొరుల్ని చంపారని చెప్పాడు.మూడు అరెస్ట్ వారంట్లున్నా యన్నాడు.

ఒకవేళ ఈ నగరన్ని కంట్రోల్ చేయలేకపోతే లిబియా ఇప్పటికే రెండుగా చీలినట్లే: గడాఫీ పట్టులో పశ్చిమ లిబియా, రెబెల్స్ గుప్పెట్లో తూర్పు లిబియా. ఏకంగా ఉండాలంటే గడాఫీ నెగ్గాలి. అయితే అది సాధ్యం అనేవారు పెద్దగా లేరు.

మిసురాటాని తిరిగి లాక్కోలేకపొటే, గట్టి విశ్వాసపాత్రులకు సైతం నమ్మకం సడలుతుంది.గడాఫీ, అతని కుటుంబమూ, తప్పుకొక తప్పదు, అని నిపుణుల అంచనా. సామాన్యులకి సైతం అవే అనుమానాలు కాలక్రమంలో కలుగుతున్నాయి..

"అమెరికా నేటోల చిక్కు లిబియా కాదు. అరబ్ ప్రపంచంలో పెల్లుబుకుతున్న విప్లవ కెరటాలు.ఎలాగైనా నిరోధించాలనేది వాళ్ళ కాంక్ష" అన్నాడు ఫిడెల్ కాస్ట్రో. అన్ని ప్రయోజనాలూ కొందరు పొందుతున్నారు. ఏహక్కూ లేనివాళ్ళు చేస్తున్న పోరాటం. ఇది 1789 లోయూరప్‌లో బాస్టిలీ ముట్టడి కన్నా గట్టిది అన్నాడు క్యూబా నేత.

మార్చి చివరలో ఒబామా రాజ్యం మార్పు కోసమే తమ యుద్దం అన్నాడు.ఏప్రిల్ మధ్యలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు సమ్యుక్త బహిరంగ లేఖ విడుదల చేశాయి. గడాఫీ అధికారంలో ఉండగా, లిబియా భవిష్యత్తుని ఊహించటం అసాధ్యం అని తేల్చి చెప్పారు.

మే 5న రోం నగరంలో కాంటాక్ట్ గ్రూప్ సమావేశం జరిగింది. 22 దేశాల విదేశాంగ మంత్రులూ, .రా., గల్ఫ్ యూరప్ అధికారులూ హజరయ్యారు.అమెరికా స్తంభింప చేసిన లిబియా ఆస్తుల్లో కొంత భాగం సైనిక జోక్యనికి ఖర్చుపెడతాం అని హిలరీ క్లింటన్ చెప్పింది. నేషనల్ కౌన్సిల్ చట్టబడ్ఢమైనదేనని సమావేశం తీర్మానించింది. రాబోయే లిబియా పాలకులని ఇప్పటినుంచే తొత్తులుగా మలుచుకునే ప్రయత్నం మొదలు పెట్టారు.ఉత్తర ఆఫ్రికాలో ఎగిసిపడుతున్న విప్లవోద్యమాల్ని అణచటానికి లిబియాని స్తావరంగా తీర్చి దిద్దే చర్యలు చేపట్టారు.ఫ్రెంచ్ విదేశాంగమంత్రి దాడులు నెలల తరబడి కొనసాగుతాయి అన్నాడు. కౌన్సిల్‌తో కలిసి పనిచేసేందుకు దూతల్ని పంపించి గడాఫీ ప్రభుత్వాన్ని ఏకాకిని చెయ్యాలని హిలరీ అంది.

మే 6న ఫ్రాన్స్ 14 మంది లిబియా డిప్లమాట్లని 48 గంటల్లో వెళ్ళిపొమ్మంది. ఇటలీ త్వరలో రెబెల్స్ కి ఆయుధాలు సరఫరా చేస్తానంది.

మిసురాటాలో ప్రభుత్వ సేనలు రాకెట్ల ద్వారా చిన్న పారాచూట్లతో మందు పాతరల్ని అక్కడక్కడా వదిలారు.ఇవి 20 కన్నా ఎక్కువే అంటున్నారు. మే 7 న మిసురాటా లో 4 పెద్ద ఇంధన నిల్వ సాధనాల్ని గడాఫీ సేన ధ్వంసం చేసింది. చెలరేగిన మంటల్ని ఆర్పే సామాగ్రి తమవద్ద లేదని రెబెల్స్ వాపోతున్నారు. నగరానికి ఇంధన వనరులు అవే.

గడాఫీ గద్దెగిగేదాకా దాడులు ఆగవు అంటున్నది సంకీర్ణ కూటమి. స్వాతంత్ర్యమో,మరణమో. లొంగేది లేదు.భయపడం. ఈమార్గాన్ని వీడం అంటున్నాడు గడాఫీ. లొంగటం లేదు. నేటో లిబియాని అన్ని రకాలుగా దిగ్బంధనం చేస్తున్నది. బిన్ లాడెన్ ని చంపి విజయోత్సాహంలో ఉన్న అమెరికా గడాఫీ లొంగి చెప్పినట్లు వినకపోతే ఎమైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది.

ప్రస్తుతం యుద్ధం జరుగుతూ ఉంది. పెరుగుతున్నది కూడా .

లిబియాలో అంతర్యుద్ధం స్తాయినుంచి యుద్ధం స్తాయికి చేరిన ప్రజా తిరుగుబాటు మొదట వచ్చింది లిబియాలో కాదు. టునీషియలో. అక్కడ నుంచీ అరబ్ దేశాలన్నిటికీ ఎంతోకొంత పాకింది. ప్రజ్వరిల్లుతూ ఉంది.అలాగే ఇది లిబియాతో ముగిసేదీ కాదు.

అరబ్ ప్రజల పరిస్తితుల వంటివే అన్ని దేశాల్లోనూ నెలకొని ఉన్నాయి- కాకపోతే తరతమ భేదాలున్నాయి.అవే ఇలాంటి ఉద్యమాలకు ఊపిరులూదుతాయి. ప్రజలకీ స్పూర్తి నిస్తాయి. కనక ఉద్యమాలు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువవుతాయి. ఇప్పుడో మరొకప్పుడో పెట్టుబడికి అనుకూలమైన ఆర్ధికవిధానాలవల్ల బాధలు పడే ప్రజలు పాలకుల మీద తిరుగుబాటు చెయ్యటం తధ్యం. విజయం సాధించటం అంతకన్నా తధ్యం.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి