3, డిసెంబర్ 2020, గురువారం

విభాగం 3 డబ్బు సంచయనం

 

అధ్యాయం 2  ఉత్పాదక పెట్టుబడి వలయం

                        విభాగం 3  డబ్బు సంచయనం

పెట్టుబడిదారుడు ఉత్పత్తి స్థాయిని పెంచాలంటే, కొంత అదనపు పెట్టుబడి అవసరం. అది కొంత పరిమాణంలో ఉండాలి. లేకపోతే పెంచడం కుదరదు. అంత మొత్తం  అయ్యేదాకా కూడబెట్టాలి. నిల్వ చెయ్యాలి. 

నిల్వ

 చలామణీలో లేని డబ్బు రూపమే నిల్వరూపం. చలామణీకి అంతరాయం కలిగినందువల్ల నిల్వ ఏర్పడుతుంది.

అయితే ఇక్కడ నిల్వ అలాంటిది కాదు. అంటే, పెట్టుబడి చలనం ఆగినందువల్ల ఏర్పడింది కాదు. పెట్టుబడిగా చర్య జరపడానికి శక్తి చాలనందువల్ల ఏర్పడింది. అతను చేస్తున్న ఉత్పత్తిని పెంచాలంటే అందుకు మరికొన్ని ఉత్పత్తి సాధనాలు కొనాలి. అలాగే మరికొందరు శ్రామికుల్ని పెట్టుకోవాలి. అందుకు కొంత అదనపు పెట్టుబడి కావాలి.

చేస్తున్నది కాక మరొకటి చెయ్యాలన్నాదానికి కావలసిన ఉత్పత్తిసాధనాలకీ కార్మికులకీ, వేరే పెట్టుబడి కావాలి. రెండు సందర్భాలలోనూ పెట్టాల్సిన పెట్టుబడికి కనీస పరిమితి ఉంటుంది. అంత అయ్యేదాకా అదనపు విలువని కూడబెడితే గాని ఉత్పత్తిని పెంచలేడు.

ఉదాహరణకి, ఒక నూలు ఉత్పత్తిచేసే పెట్టుబడిదారుడు కుదుళ్ళసంఖ్య పెంచాలంటే, దానికి తగినన్ని పత్తి ఏకే పరికరాల్నీ, పురిపెట్టే చట్రాల్నీపెంచాలి. అంతేకాదు. అవసరమైన పత్తి కొనడానికీ, కార్మికుల వేతనాలకీ మరింత ఖర్చు చెయ్యాలి. లేకుంటే ఉత్పత్తిని పెంచడం సాధ్యం అవదు. అంత మొత్తం ఒక వలయంలో వస్తే సరే.  రాకపోతే, అంత మొత్తం చేకూరే  వరకూ, అదనపు విలువని పోగుచెయ్యాలి. అంతవరకూ పెట్టుబడి వలయాలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉండాల్సిందే.

నిల్వగా పోగుబడడం

ఈ పోగుబడడం అనేది అదనపువిలువ సొంత చర్య కాదు. .పె   .పె పలుమార్లు జరిగిన దాని ఫలితం. అదనపు విలువ పనేమిటంటే: ఒక పరిమాణాన్ని చేరుకునేదాకా, డబ్బుగా ఉండడమే, డబ్బు రూపానికి అంటిపెట్టుకొని పడి ఉండడమే. ఆ సమయంలో అది పెరుగుతున్ననిల్వగా ఉంటుంది. అది పెట్టుబడి చర్య చెయ్యదు. అదనపు విలువని సృజించేప్రక్రియలోపాల్గొనదు. కేవలం డబ్బు మాత్రమే ఉంటుంది. అయినా అది పెరుగుతూ ఉంటుంది. కారణం వచ్చిన దాన్ని వచ్చినట్లు గల్లాపెట్లో పడేయడమే. ఉన్నదానికి దాన్ని కలపడమే.

నిల్వ  ప్రక్రియ

 సరుకు ఉత్పత్తి అంతటా  మామూలుగా ఉండేదే. అభివృద్ధిచెందని, పెట్టుబడిదారీపూర్వ ఉత్పత్తిరూపాల్లో దానికదే పరమావధిగా ఉండేది. అయితే ప్రస్తుత సందర్భంలో, నిల్వ అనేది డబ్బు పెట్టుబడి రూపాల్లో ఒకటిగా అగపడుతుంది. నిల్వఏర్పడడం పెట్టుబడి సంచయనాన్ని తాత్కాలికంగా అనుసరించే ప్రక్రియగా కనిపిస్తుంది. ఎందుకంటే, ఇక్కడ  డబ్బు గుప్త పెట్టుబడిగా ఉంటుంది; నిల్వ ఏర్పడడం, అదనపు విలువ నిల్వ స్థితిలో ఉండడం నిజంగా పనిచేసే  పెట్టుబడిగా అవడంకోసం.   చర్య అంతా వలయం బయట జరుగుతుంది. నిర్వచనం ప్రకారం అది గుప్త డబ్బుపెట్టుబడి.

అది ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే ముందు ఎంత పరిమాణానికి  చేరాలి? అనేది ప్రతి సందర్భంలోనూ ఉత్పాదక పెట్టుబడి యొక్క విలువ అంతర్నర్మాణం చేత నిర్ణయమవుతుంది. అయితే నిల్వ స్థితిలో ఉన్నంత వరకూ, అది డబ్బు పెట్టుబడి చర్యలు చెయ్య జాలదు. అయినా  అది పనిచెయ్యని డబ్బు పెట్టుబడి. అంతేగాని ఇంతకు ముందులాగా అంతరాయం ఏర్పడ్డ డబ్బు పెట్టుబడి కాదు. పనిచేసేందుకు ఇంకా శక్తిలేని  డబ్బు పెట్టుబడి.

నిల్వ నిధి ఇతరరూపాలు

డబ్బుసంచయనాన్ని దాని మూల రూపంలో, వాస్తవ నిల్వ నిధి రూపంలో చర్చిస్తున్నాం. అయితే అది బాకీల రూపంలోనూ ఉండవచ్చు. ను అమ్మిన పెట్టుబడిదార్లకు కొన్నవాళ్ళు చెల్లించాల్సిన బాకీ రూపంలో అన్నమాట.

ఈ గుప్త పెట్టుబడి, ఈలోగా, డబ్బుని పుట్టించే డబ్బుగా, అంటే, వడ్డీని  తెచ్చే బాంక్ డిపాజిట్లుగా, ఎక్స్చేంజ్ బిల్లులుగా, రకరకాల సెక్యూరిటీలుగా ఉండవచ్చు. వీటితో ఇక్కడ నిమిత్తం లేదు.

ప్రత్యేక పెట్టుబడి చర్యలు

అలాంటి సందర్భాల్లో డబ్బు రూపం పొందిన అదనపు విలువ వలయం బయట ప్రత్యేక పెట్టుబడి చర్యలు చేస్తుంది:

1. మొదటివిషయం ఆ చర్యలకు పారిశ్రామికపెట్టుబడి ప్రారంభించిన వలయంతో ఏమాత్రం సంబంధం ఉండదు

2. రెండో విషయం: అయితే పారిశ్రామిక పెట్టుబడి చర్యలకు భిన్నమైన పెట్టుబడి చర్యల్ని ముందుగా ఊహిస్తుంది. వాటిని ఇప్పటికింకా ఇక్కడ అభివృద్ధి పరచలేదు.

వచ్చే పోస్ట్: రిజర్వ్ ఫండ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి