6, జనవరి 2018, శనివారం

అదనపు శ్రమ కోసం అత్యాశ



పనిదినం- 2
అదనపు శ్రమ కోసం అత్యాశ- కార్ఖానా దారూ, జమీందారూ
అదనపు శ్రమ పెట్టుబడితో మొదలవలేదు.అంతకుముందే ఉంది. ఏసమాజంలో అయితే
ఉత్పత్తి సాధనాలు కొందరి హక్కుగా ఉంటాయో, అక్కడ తన సొంత పోషణకి తోడు ఉత్పత్తి
సాధనాల యజమానుల పోషణకు కూడా అదనపు శ్రమ చెయ్యాల్సి ఉంటుంది.ఆ  శ్రామికుడు,
స్వేచ్చాయుతుడయినా, కాకున్నా ఇది తప్పదు. ఆ యజమాని ఎథెన్స్ కి చెందిన ప్రభువర్గీ
యుడు కావచ్చు, ఎట్రుస్కన్ మతప్రభువు (theocrat) కావచ్చు. రోమ్ పౌరుడు కావచ్చు.అమెరికా
బానిస యజమాని కావచ్చు.వాలాషియన్ జమీందార్ కావచ్చు. ఆధునిక భూస్వామో, పెట్టుబడి
దారుడో కావచ్చు. అది ఏవ్యవస్థ అయినా కావచ్చు.వాళ్ళ ఉత్పత్తి సాధనాలతో పనిచెయ్యాలి
కనక వాళ్ళ పోషణ భారం శ్రామికులదే. అందుకు వాళ్ళు అదనపు శ్రమ చేయవలసిందే.


పరిమిత అదనపు శ్రమ- అపరిమిత  అదనపు శ్రమ
ఉపయోగపు విలువ ప్రధానమైన ఏసమాజంలో నయినా అదనపుశ్రమ పరిమితంగా ఉంటుంది.
ఎందుకంటే అది నిశ్చిత అవసరాలకు పరిమితమై ఉంటుంది. ఆ అవసరాలు ఎక్కువ కావచ్చు,
తక్కువ కావచ్చు. అక్కడ ఉత్పత్తి స్వభావం నుంచే  అదనపు శ్రమ కోసం అపరిమితమైన దాహం
కలగదు.  ప్రాచీన కాలంలో వెండి బంగారాలు ఉత్పత్తయ్యే చోట్ల మాత్రమే  భయంకరమైన అతి
శ్రమ ఉండేది. కారణం ఆలోహాలు మారకం విలువకి స్వతంత్ర రూపం అయిన డబ్బుగా ఉండడమే.
ఈజిప్ట్, ఇథియోపియా మధ్య ఉన్న గనుల్లో పనిచేసేవారి దైన్య స్థితి ని గురించి  డియోడరస్
సికులాస్ రాశాడు. అయనక్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దంలో జీవించిన  గ్రీకు చరిత్ర కారుడు.
అక్కడి శ్రామికులని బట్టలేసుకోడానికీ,నీళ్ళు పోసుకోడానికీ నోచుకోని దురదృష్టవంతులు
అన్నాడు.రోగుల పట్లా,ముసలివాళ్ళ పట్లా , స్త్రీలపట్లా అక్కడ జాలి లేదు. వారి వేదనల్నీ వెతల్నీ
చావు అంతం చేసే వరకూ దెబ్బలుతింటూ, బలవంతంగా పనిచెయ్యాల్సిందే.
మిగిలిన ఉత్పత్తి స్థలాల్లో అదనపు శ్రమ కోసం ఇంత ఆరాటం ఉండదు. కనుక పనివాళ్ళ పరిస్థితులు
ఇంతదారుణంగా ఉండవు.


బానిస శ్రమ, కార్వీ (ఊడిగం) శ్రమ వంటి నిమ్న రూపాలలో ఉత్పత్తి సాగించే ప్రజలు అంతర్జాతీయ
మార్కెట్ సుడిగుండం లోకి  లాగబడ్డారు. పెట్టుబడిదారీ ప్రభావంతో క్రమంగా  ఉత్పాదితాల ఎగుమతి
ముఖ్యం అయింది. ఇక అప్పుడు బానిస,అర్ధబానిసల అధిక శ్రమ యొక్క అనాగరికఘోరాల మీద,
నాగరిక అధిక శ్రమ యొక్క ఘోరాలు అంటుగట్ట బడ్డాయి.
రుజువుకి,అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో నీగ్రో శ్రమని చూపుతాడు.అక్కడ ఉత్పత్తి స్థానిక వినియోగానికే
అయినంతకాలం నీగ్రో శ్రమ పితృస్వామిక స్వభావాన్ని నిలబెట్టుకుంది.అయితే పత్తి ఎగుమతి
ప్రధానం అయ్యాక అమిత శ్రమ కి భూమిక  ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో 7 పని సంవత్సరాల్లోనే
శ్రామికుని పని అయిపోయేది.శక్తి ఉడిగిపోయేది.


పనిదినం పొడిగింపు- కుదింపు


అదనపు విలువ కోసం పేరాశతో పెట్టుబడిదారుడు పనిదినాన్ని వీలైనంత పొడిగించే ప్రయత్నంచేస్తాడు.
అతని అత్యాశకు ఇంగ్లిష్ ఫాక్టరీ చట్టాలు అడ్డుకట్ట వేసాయి.పనిదినాన్ని పరిమితపరిచాయి.
పెట్టుబడిదారుల రాజ్యం,,భూస్వాముల రాజ్యం శ్రమ దోపిడీని ఎందుకు పరిమితం చేసింది.?


ఇందుకు రెండు కారణాలున్నాయి:
1. రోజురోజుకీ పెరుగుతున్న  కార్మికవర్గ ఉద్యమం.
2., కార్మికుల జీవశక్తిని కొల్లగొట్టి ధ్వంసం చేయ్యనియ్యకుండా చట్టాలు అవసరమయ్యాయి.
పొలాలని కొల్లగోట్టినందువల్ల ఎరువులు చల్లల్సి వచ్చింది. శ్రమ శక్తిని కొల్లగొడుతున్న కారణంగా పని
గంటల్ని నిర్దేశిస్తూ శాసనాలు చేయాల్సి వచ్చింది.లేకుంటే, శ్రమశక్తి ధ్వంసం అయిపోతుంది.
ఐరోపా దేశాల్లో నిర్బంధ సైనిక సేవ అమల్లో వుంది. అందుకు కొంత ఎత్తు వుండాలి. ఆ దేశాల్లో  
అందుకు కావలసిన ఎత్తూ, దార్ద్యమూ వయోజనులలో తగ్గిపోయింది.
1789 విప్లవానికి పూర్వం సైనికుడు 165 సెం.మీ ఎత్తు ఉండాలి. 1818లో 157 సెం.మీ కి తగ్గించారు.
1836 లో 156 సెం.మీ తగ్గించారు. అంత ఎత్తు లేకనో,శరీర లోపాలవల్లనో  ఫ్రాన్స్ లో సగటున సగం
మంది తిరస్కరించబడ్డారు.
1862 లో బవేరియా గజెట్లో డాక్టర్ మేయర్ ప్రకటన బట్టి 9 ఏళ్ల సగటు ఫలితం ఏమంటే,1000 మందిలో
716 మంది అనర్హులు. వారిలో 317 మంది తగి న ఎత్తు లేరు.399 మందికి శరీర లోపాలున్నాయి.
1858 లో బెర్లిన్ సైనిక దళాన్ని ఏర్పరుచుకోలేక పోయింది.156 మంది తక్కువయ్యారు.
“ పెట్టుబడిదారుడు ..పనిదినాన్ని శారీరకంగా సాధ్యమైన గరిష్ట పరిమితికి పెంచేందుకు నిరంతరం
ప్రయత్నిస్తూ వుంటాడు, రెండవవైపు కార్మికుడు యిందుకు విరుద్ధదశలో నిరంతరం పోరాడుతూ
వుంటాడు.ఈ విషయం ప్రత్యర్ధుల బలాబలాల తారతమ్యయపు సమస్యగా పరిణమిస్తుంది.”
“అన్నిదేశాల్లో మాదిరిగానే, ఇంగ్లండ్ లో కూడా పనిదినాన్ని పరిమితం చేసే సమస్యకు సంబంధించి
నంత వరకు, చట్టపరమైన జోక్యం ద్వారా తప్ప అదెన్నడూ పరిష్కారం కాలేదు.బయట నుండి
కార్మికుల నిరంతరాయమైన ఒత్తిడి లేకుండా ఆజోక్యం ఎన్నడూ సంభవించియుండేది కాదు.ఏది
ఏమైనా, కార్మికులకూ పెట్టుబడిదార్లకూ మధ్య ప్రైవేటు ఒప్పందం ద్వారా ఈ ఫలితం ఎన్నడూ
సాధ్యం కాదు. సాధారణ రాజకీయ కార్యాచరణ యొక్క ఈ ఆవశ్యకతే, తన కేవల ఆర్ధిక శక్తి ప్రయోగంలో
పెట్టుబడిదే పైచేయి అన్న సంగతిని రుజువుచేస్తుంది.”-విలువ, ధర, లాభం-సం.ర. పే 68-69
ఆకారణాలవల్ల ప్రభుత్వం ఫాకరీ చట్టాలు తెచ్చింది.
1850 ఫ్యాక్టరీ చట్టం పనిదినాన్ని 10 గంటలకు పరిమితం చేసింది.దీని ప్రకారం వారంలో 5 రోజులు
ఉదయం 6 గంటలనుండి సాయంత్రం 6 గంటల దాకా.అంటే 12గంటలు.అందులో ఉదయం
భోజనానికి ½ గంట, మధ్యాహ్నం భోజనానికి  1 గంట పోగా 10½ గంటలు పని. మొత్తం 5 రోజుల
పని 52½ గంటలు.  6వ రోజు ఉదయం 6 గంటల నుండి  సాయంత్రం 2 గంటల వరకు. 8 గంటలు.
ఉదయం భోజన విరామం 1/2 గంట  పోగా 7 ½ గంటలు పని.
మొత్తం 6 రోజుల పని = 52½+7½ =60 గంటలు.


కాపిటల్ వచ్చిన 1867 లో అదే చట్టం కొనసాగింది.దీన్ని అమలు పరిచేందుకు ఇన్స్పెక్తర్లను
నియమించింది. వాళ్ళు నేరుగా హోమ్ సెక్రెటరీ ఆధ్వర్యంలో పనిచేస్టారు. వాళ్ళ నివేదికలు
ఆరునెల్లకొకసారి ప్రచురితమవుతాయి.వాటిలో  అదనపు శ్రమ కోసం పెట్టుబడిదారుల పేరాశ
గురించిన గణాంకాలు ఉంటాయి.
నివేదికల్లో ఇన్స్పెక్టర్లు ఏం చెప్పారు?
యజమానులు పని ఉదయం 15 నిమిషాలు ముందే మొదలెట్టేవారు.చివరలో 15 నిమిషాలు
ఆలస్యంగా ముగించేవారు. ఉదయం భోజన సమయం 10 నిమిషాలు, మధ్యాహ్నభోజన సమయం
20 నిమిషాలు  తగ్గించేవారు.మొదటి 5 రోజుల్లో రోజుకి 15+15+10+20=60 నిమిషాలు కాజేసేవారు.
6 వరోజు 15+10+15=40 నిమిషాలు లాకునేవారు. అంటే, మొత్తం వారానికి  340 నిమిషాలు,
5 గంటలా 40 నిమిషాలు. “ఏడాదికి లెక్కిస్తే ఇదిఇంచుమించు  27పనిదినాలతో సమానం.”
“రోజుకి గంట అదనంగా పనిచేయిస్తే అది సంవత్సరానికి ఇంచుమించు 13 నెలలకు సమానం.”
అంటే మోసకారులయిన మిల్లు యజమానులు  అంత ఎక్కువ పని చేయించేవారని వారు
నివేదికల్లో తేల్చారు.
సంక్షోభ కాలాల్లో ఎలా కాజేసే వారు?
సంక్షోభ సమయాల్లో ఉత్పత్తి అంతకుముందున్నంత ఉండదు.కనుక ఫ్యాక్టరీలు తక్కువ కాలం
అంటే వారంలో కొంత భాగం మాత్రమే పనిచేస్తాయి. ఆపరిస్థితి పనిదినాన్ని పెంచడాన్ని ఆప
జాలదు.పైగా తక్కువ వ్యాపారం జరిగితే, దానిమీదే మరింత లాభం చేసుకోవాలి. ఎంత తక్కువ
టైం పని జరిగితే, ఆ టైం అంత ఎక్కువఅదనపు విలువగా మార్చబడాలి.
1857-1858 సంక్షోభ కాలం గురించి ఇన్స్పెక్టర్ ఇలా రాశాడు:
.”వర్తకం మరీ బాగా లేనప్పుడు  అతిపని ఉండడం అసంగతం అనిపించవచ్చు. కాని ఆబాగాలేక
పోవడమే మనస్సాక్షి లేని మనుషులు అతిక్రమించేదానికి  దారి చూపుతుంది.వాళ్ళు అధిక
లాభాన్ని పొందుతారు…….   ”
గడచిన  6 నెలల్లో మా జిల్లాలో 122 మిల్లులు మూతబడగా, 143 పనిచేశాయి.అయినా చట్టబద్ధమైన
గంటల్ని దాటి అతిపని కొనసాగింది - అని లియోనార్డ్ హార్నర్ రాశాడు.
కార్మికుల విశ్రాంతికీ, భోజనానికీ యిచ్చిన సమయాల్లో కొంత కాజేయడం ఆగలేదు. 1861-1865
కాలంలో ఇదే మోసం తక్కువ స్థాయిలో జరిగింది.వాళ్లకి అతిగా పనిచేయించి లాభం లాగడం
అంటే ఎంత ఇష్టమో!  
ఇలా చేసినా పట్టుబడం అని వాళ్లకి నమ్మకం. ఒకవేళ పట్టుబడినా పడే జుల్మానా చిన్నదే , కనుక
అది పోయినా మిగిలే లాభమే ఎక్కువగా ఉంటుంది.అందువల్ల వాళ్ళు వెనక్కి తగ్గలేదు.


దోపిడీకి చట్టపరమైన హద్దులు లేని ఇంగ్లిష్ పారిశ్రామిక శాఖలు


లాభాలకోసం మిల్లు ఓనర్లు ఎంతటి క్రూర కృత్యాలకైనా  వెనకాడేవారు కారు.వీళ్ళ ఘోరాలు
 శ్పానియార్డులు బంగారం వేటలో  అమెరికాని జయించాక రెడ్ ఇండియన్లమీద సాగించిన
ఘోరాలు సైతం   మించవేమో! -John Wade,
చార్లీ చాప్లిన్ 1936 సినిమా ModernTimes ఒకచోట అసెంబ్లీ లైన్లో పనిచేసే వాని జీవితం
చిత్రిస్తాడు. అది ‘మహా సంక్షోభం’ సమయంలో కార్మికుల పరిస్థితిని చూపుతుంది. ఇలాంటి
వాటి గురించి సాహిత్యానికి కొరవ లేదు.’
ఇన్స్పెక్టర్ల నివేదికలు ఇప్పటికి (1867)కూడా ఫ్యాక్టరీ చట్టాలు ప్రవేశపెట్టబడని పరిశ్రమ శాఖల
గురించి చెప్పాయి. లేసులు, అగ్గి పెట్టెలు, వాల్ పేపర్, బట్టలు,  బేకింగ్ పరిశ్రమల గురించి
ఉన్నాయి. .
లేసు శాఖలో పనివాళ్ళు పడుతున్న బాధలు నాగరికప్రపంచంలో ఎక్కడా ఉండవు.9,10 ఏళ్ల
పిల్లల్ని రాత్రి 2, 3,4 గంటలప్పుడు పక్కల మీదనించి ఈడుస్తారు. రాత్రి 10,11,12 గంటలయ్యే
దాకా చాకిరీ చేయిస్తారు.కేవలం బతికి ఉండడానికి మాత్రమే సరిపడే కూలి   ఇస్తారు.ఈపద్దతి
రెవరెండ్ మాంటెగూ అన్నట్లు ఏమినహాయింపులూ లేని  పరమ బానిసత్వం (unmitigated
slavery)- సామాజికంగా, భౌతికంగా, నైతికంగా, ఆత్మికంగా.
పురుష కార్మికుల పనిగంటల్ని 18 గంటలకు తగ్గించాలని విజ్ఞప్తి చెయ్యడం కోసం బహిరంగ
సభ పెట్టే పట్టణం గురించి ఏమనుకోవాలి? వర్జీనియా, కరోలినా పత్తి పొలాల యజమానుల్ని
విమర్సిస్తాం. వాళ్ళ బ్లాక్ మార్కెట్టూ,  వాళ్ళ కొరడా ,  పెట్టుబడిదార్ల ప్రయోజనాలకోసం నెమ్మదిగా
జరిగే ఈ నరబలి కంటే ద్వేషించ దగినవా? అని 1860 జనవరి 17న టెలిగ్రాఫ్ పత్రిక రాసింది.
విలియం వుడ్ 7సంవత్సరాల 10 నెలలప్పుడు పోత వస్తువులు చేరవేసే పనిలో చేరాడు.అతను
చెప్పినప్పుడు 9 ఏళ్లవాడు. ఉదయం 6 గంటలనించీ రాత్రి 9 గంటల వరకూ పనిచెయ్యాలి.7 ఏళ్ల
బాలుడికి 15 గంటలపని!
కాల్చిన మట్టివస్తువులు (pottery) పరిశ్రమలున్న వోల్ స్టాన్ టన్ జిల్లాలో మనిషి బతికే కాలం
సగటు చాలా తక్కువ.అక్కడ అయిదింట రెండు వంతుల మరణాలకి కార్మికుల కొచ్చే శ్వాసకోశ
వ్యాధులే అని ఒక వైద్యుడు చెప్పాడు.
ముందు తరం వారికంటే తర్వాత తరంవారు  పొట్టి అవుతున్నారు,బలంతక్కువగా ఉంటున్నారు
అని మరొక వద్యుడు అన్నాడు. ఎదుగుదల లేకుండా,సరైన ఆకారం లేకుండా ఉంటారు.ముందు
గానే ముసలివాల్లవుతారు.అర్ధయుష్షుతో చనిపోతారు.,
రక్తహీనతా,అజీర్ణం,కాలేయం మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం,కీళ్ళ నొప్పులు వాళ్ళని
బాధిస్తాయి. ఎక్కువగా నిమోనియా,క్షయ,బ్రాంకైటిస్, ఉబ్బసం వేధిస్తాయి.
వీటికి కారణాలు చెప్పి  ఒక హౌస్ సర్జెన్ కమిషనర్ కి రాసిన లేఖలో  “ దీర్ఘమైన పనిగంటలు”
అని క్లుప్తంగా  పేరుపెట్టాడు.
లుసిఫర్ అగ్గిపుల్లలు తయారు  చెయ్యడం పుల్లలకి భాస్వరం పూసి అగ్గిపుల్ల చెయ్యడం 1833 లో
మొదలైంది. 1845 నించీ ఇంగ్లండ్ లో జనం ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో బాగా అభివృద్ధి
చెందింది. దాంతో పాటు ఈపరిశ్రమలో పనిచేసే వాళ్లకి ప్రత్యేకంగా వచ్చే’ధనుర్వాతం’ (lockjaw)
అనే వ్యాధి ప్రబలింది.ఈ పనిలో సగం మంది 13 ఏళ్లలోపువాళ్ళు, 18 ఏళ్లలోపు వాళ్ళు.ఆ
దుర్వాసనలో పని గనక, గతిలేని వాళ్ళు మాత్రమే పిల్లల్ని పంపేవారు. రోజూ 12 గంటలనించీ
 14, 15 గంటలపాటుపనిచెయ్యాలి.రాత్రి పని ఉంటుంది.అన్నం తినే వేళ అంటూ ఒకటుండదు
. అదీ గాక ఫాస్ఫరస్ తో నిండివున్నఆపని గదుల్లోనే తింటారు. డాంటే ఇక్కడ తన నరకం(Inferno)
లో వాటికన్నా భయంకరమైన దృశ్యాల్ని చూచి వుండే వాడు.
అలంకరణ కాగితాలు ( paper-hangings) తయారీ బిజీ గా ఉన్నప్పుడు ఉదయం 6 గంటల నించీ
రాత్రి 10 గంటలదాకా విరామం లేకుండా పనిచెయ్యాలి. ఒక్కొక్కపుడు ఆతర్వాతకూడా ఉంటుంది.
వారం లో 78½  గంటల పని.1862 లో అయితే మరీ  84 గంటల పని.


బ్రెడ్  తయారీలో పని సీజన్లో  రాత్రి 11 గంటలకు మొదలవుతుంది.మర్నాడు పొద్దున్న 8 గంటల
దాకా చెయ్యాలి.అప్పట్నించీ సాయంత్రం 4,5,6,7 దాకా బ్రెడ్ మోసుకెళ్ళాలి, ఒక్కొక్కప్పుడు బిస్కెట్లు
చేసే పనిలో సహకరించాలి. వాళ్లకి 5,6 గంటలు మాత్రమె నిద్రపోయే అవకాశం ఉంటుంది.శుక్ర
వారాలు రాత్రి పదింటికే పని మొదలౌతుంది. శనివారం రాత్రి 8 గంటలవరకూ ఉంటుంది.
అయినా ఆదివారం పొద్దున్న 5,6 గంటలు అయ్యేదాకా పనిలోనే ఉంటారు. మర్నాడు బ్రెడ్ తయారీ
కోసం ముందస్తు పనులకి ఆదివారం పగలు రెండు మూడు సార్లు పనికి రావాల్సి ఉంటుంది. కాల్చే
గదుల్లో 75-90 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది.
బేకరీ కార్మికులు అరుదుగా మాత్రమె 42 ఏళ్ళుదాటి బతుకుతారు అని కమిషన్ చెప్పింది.
పరిస్థితి అలాఉన్నా, ఈపని చెయ్యడానికి ఎందరో సిద్ధంగా  ఉన్నారు.


1858-60 కాలంలోఐర్లాండ్  బేకరీ పనివాళ్ళు రాత్రిపనినీ, ఆదివారం పనినీ వద్దని సభలు పెట్టారు.
ప్రజలు ఆప్యాయంగా పాల్గొన్నారు.ఫలితంగా కొన్నిచోట్ల పగటి పని స్థిరపడింది. కాని లిమరిక్ లో
మాస్టర్ బేకర్లు వ్యతిరేకించారు.పనిలోనిమ్చి తీసేస్తామని బెదిరించారు.ఉద్యమాన్ని ఓడించారు.
పనివాళ్ళ మెడలువంచి రాత్రి పనికీ, ఆదివారాల పనికీ ఒప్పించారు.


స్కాట్ లాండ్ లో వ్యవసాయ కార్మికులు 13,14 గంటలు పనిచెయ్యాలి.ఆదివారం 4 గంటలు
చెయ్యాలి.ఈ పని భారాన్ని  వాళ్ళు  వ్యతిరేకిస్తున్నారు. 1865 లో అక్కడ వ్యవసాయ కార్మికుల
సంఘం ఏర్పడింది.


రైలు ప్రమాదం


అప్పట్లో ఒక  రైలు ప్రమాదంలో వందలమంది చనిపోయారు. కారణం ఉద్యోగుల నిర్లక్ష్యం .
గార్డ్,డ్రైవర్, సిగ్నల్ మన్ ముగ్గురూ విచారించే జూరీ ముందు నిలబడ్డారు. ముగ్గురూ ముక్త
కంఠంతో ఒకటే చెప్పారు. 10,12 ఎల్లా కిందట రోజుకి 8 గంటలు  మాత్రమే పని ఉండేది.ఈ
అయిదారు ఏళ్లలో  14,18,20 గంటలకు చేరింది. సెలవు దినాల్లోనూ, విహారయాత్రల రైళ్ళు
నడిచే కాలంలోనూ విరామం లేకుండా 40,50 గంటలు పనిచేయ్యల్సివస్తుంది. వాళ్ళూ
మనుషులే..ఏదోసమయంలో శ్రమశక్తి విఫలం అయింది.బద్ధకం పట్టుకుంది. మెదడు పని
చెయ్యడం ఆగింది. కళ్ళు చూడం మానేశాయి. అని  వాళ్ళ నిర్లక్షానికి కారణమేమిటో చెప్పారు.
అంతావిని, ‘గౌరవనీయులైన' జూరీ వారు ‘మానవ హాత్య’( manslaughter) అనే నేరారోపణతో
పైకోర్టుకు పంపుతూ తీర్పు చెప్పింది. రైల్వే పెట్టుబడి దారులు ముందుముందు తగినంత
శ్రమ శక్తిని కొనేందుకు మరింత వ్యయించేవారుగా ఉండాలనీ  పవిత్రమైన ఆశాభావం వ్యక్తం
చేసింది.అంతే.
రేనాల్డ్స్ న్యూస్ పేపర్ వారం వారం రైలు  ప్రమాదాల జాబితా ఇస్తుంది. అందులో ఒక ఉద్యోగి
ఇలా అన్నాడు: ఇంజన్ డ్రైవర్, ఫైర్ మాన్ అనుక్షణం అప్రమత్తంగా ఉండకపోతే జరిగే దేమిటో
తెలిసిందే. అలాంటి అప్రమత్తతని 29, 30 గంటలువిరామం లేకుండా  పనిచేసే వాళ్ళనించి
ఎలా ఆశిస్తాం?”
పని భారాన్ని తెలుసుకోవడానికి ఏ నివేదికలూ చదవక్కర్లేదు.పనివాళ్ళని చూస్తే చాలు.


అధిక పనిభారం పనివాళ్ళ ముఖాల్లో కనబడుతుంది


పెట్టుబడి ముందు పనివాళ్ళంతా ఒకటే- స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలయినా. వాళ్ళలో ఇద్దర్ని-
దొరసానుల డ్రెస్సులు కుట్టే యువతినీ,ఒక కమ్మరినీ-.గురించి చెబుతాడు.


‘కేవలం పనిభారం మూలంగా మరణం’ (“Death from simple over-work.”)అనేసంచలనాత్మక
మైన శీర్షికతో 1863 లో లండన్ పత్రికలన్నీ  ఒక పేరా ప్రచురించాయి. అది మేరీ ఆన్ వాక్లీ
అనే 20 ఏళ్ల యువతి మరణ వార్త. ఆమె ఎల్సీ అనే లేడీ నడిపే ఎంతో గౌరవనీయమైన  డ్రస్సులు
తయారుచేసే సంస్థలో పనిచేస్తుంది. సగటున రోజుకి 16½ గంటలు పనిచేసేది.సీజన్లో అయితే
30 గంటలదాకా చేసేది, అదీ విరామం లేకుండా.వేల్స్ యువరాణీ గౌరవార్ధం జరగబోయే బాల్
డాన్స్ లో పాల్గొనే ప్రభువర్గపుస్త్రీల కోసం మెరిసే డ్రెస్సులు రెప్పపాటులో తయారు చెయ్యాల్సి
వచ్చింది. 26½ గంటలపాటు 60 మందితో కలిసి ఏకబిగిన పనిచేసింది.ఒక్కో రూములో 30 మంది.
అవసరమైన గాలిలో 3 వ వంతు మాత్రమే ఉండేది.పడక గది బోర్డులతో పార్టీషన్ చేసి ఉండేది.
ఊపిరాడని ఇరుకుచోట్లలో ఇద్దరిద్దరు కలిసి నిద్రించేవాళ్ళు. అయినప్పటికీ, ఇది మంచి సంస్థల్లో
ఒకటి.మేరీ శుక్రవారం సిక్ అయింది. ఆదివారం చనిపోయింది.
మరణ కారణాన్ని విచారించే జూరీ ముందు డాక్టర్ కీస్ ఇలా చెప్పాడు:
క్రిక్కిరిసిన గాలాడని చిన్న గదిలో ఎక్కువ గంటల పనివల్ల మరణించింది.
అయితే ఆ డాక్టర్ కి గుణపాఠం చెప్పాలని జురీ ఇలా తీర్పు చెప్పింది:
ఆమె 'మెదడులో రక్తస్రావం'(apoplexy) వల్ల చనిపోయింది .అయితే క్రిక్కిరిసిన గదిలో
పనిభారం వాళ్ళ ఆమె చావు వేగవంతం అయివుంటుందని అనుకునేందుకు కారణం ఉంది.,
స్వేచ్చా వ్యాపారుల పత్రిక, Morning Star ఇలా అంది: సమాధి చేరేవరకూ అతి తీవ్రంగా పనిచేసే
మన తెల్ల బానిసలు చాలావరకూ మౌనంగా బాధపడి, అనారోగ్యం పాలై చనిపోతారు.
తన నివేదికలో ఇలా రాసాడు:
చచ్చేటట్లు పనిచెయ్యడం అనేది ఒక డ్రస్ తయారీ గదుల్లోనే కాదు,వెయ్యి ఇతరచోట్ల కూడా
అదే పరిస్థితి ఉంది అంటూ డాక్టర్ రిచర్డ్ సన్, నమూనాగా కమ్మరిని తీసుకుంటాడు.కవులు
చేప్పేది నిజమయితే అతనంత హాయిగా ఉండేవాడు మరోకడు ఉండడు. ఎండ రాకముందే
పెందలాడి లేస్తాడు,పనిమొదలుబెడతాడు. ఇతరులందరికంటే బాగా తింటాడు, తాగుతాడు,
నిద్రపోతాడు.తగుమాత్రంగా పనిచేస్తూ మెరుగైన మానవ స్థాయిలో ఉంటాడు.


అయితే మనం అతనితో పడి నగరానికో, పట్టణానికో పోదాం. అక్కడ ఆబలవంతుని మీద
పడే పని భారాన్ని చూస్తాం. దేశ మరణ రేటులో అతని స్థాయి ఏమిటో చూస్తాం.మెల్ బోర్న్ లో
కమ్మరులు  ఏటా ప్రతి వెయ్యిమందిలో 31మంది చనిపోతారు. మొత్తం వయోజనుల మరణాల
కంటే 11 ఎక్కువ. ఈ మంచి వ్రుత్తి పనిభారం వల్ల మానవ నాశనకారిగా మారిపోయింది.
అతను రోజుకి  కొన్ని సమ్మెట దెబ్బలు కొట్టగలడు, కొన్ని అడుగులు వెయ్యగలదు.కొన్ని శ్వాసలు
తీసుకోగలడు.కొంత పనిచేయ్యగలడు  అలా  సగటున 50 ఏళ్లు బతుకుతాడు. అతన్ని మరికొన్ని
దెబ్బలు కొట్టేట్టు ,మరికొన్ని అడుగులు వేసేట్టూ , మరికొన్ని శ్వాసలు తీసుకునేట్టూ చేసి,
జీవితాన్ని మొత్తంగా 4 వ వంతు పెంచేట్లయితే, అతని జీవితం ముందుగా ముగుస్తుంది.అలా  
ఒక కమ్మరి నాలుగోవంతు ఎక్కువ పనిచేస్తే, 50వ ఏట చనిపోవాల్సిన్న వాడు 37 వ ఏట
చనిపోతాడు.
.గోర్కీ అమ్మ నవల తోలి చాప్టర్ చివరివాక్యం :అలాంటి బతుకు ఏ 50 ఏళ్ళో  బతికాక ఒక
శ్రామికుడు చనిపోతాడు. ఆబతుకు ఎలాంటిదో గోర్కీ రచనలో చదవాల్సిందే.


పగలూ రాత్రీ పని


పనిగంటలు పెరిగినా, పెట్టుబడిదారుల పేరాశ తీరలేదు. యంత్రాలు రాత్రుళ్ళు కాళీగా ఉంటు
న్నాయి. కనక సగం రోజు పెట్టుబడి పెరగనట్లే. మరింత స్థిర పెట్టుబడి ఉన్న పరిశ్రమల్లో నిరంత
రాయంగా పనిజరగాలి. లేకుంటే యంత్రాలు వృధాగా పడుంటాయి. పగలూ, రాత్రీ వాటిని
ఆడించాలని యజమానులకి సహజంగానే ఉంటుంది.  కాని మనుషులు 24 గంటలూ పని
చేయ్యలేరు.ఈ భౌతిక అవరోధాన్ని అధిగమించేందుకు రిలే పధ్ధతి కనిపెట్టారు. రెండు జతల
(sets) కార్మికుల్ని నియమించారు. ఒక జత పగలు 12 గంటలు, ఇంకో జత రాత్రి 12 గంటలు
పనిచెయ్యాలి. షిఫ్ట్ విధానం ప్రవేశపెట్టారు. 24 గంటలూ అవిరామంగా ఉత్పత్తి ప్రక్రియ
జరుగుతూ ఉంటుంది. కనుక మామూలు పనిదినం పరిమితుల్ని దాటడానికి అవకాశం
దొరుకుతుంది.


కార్మికులమీద దీని ప్రభావం గురించి వేరే చెప్పక్కర్లేదు. రాత్రంతా  నిద్రలేకపోతే, పగటి నిద్రతో
ఆనష్టం తీరదు.చికాకు,నిరుత్సాహం, శరీర బలహీనత- ఎంగెల్స్ -ఇంగ్లండ్ లో కార్మికవర్గ పరిస్థితి.
రాత్రుళ్ళు పిల్లలతో పనిచేయించే ఒక ఉక్కు పారిశ్రామికుడి మాటలివి: రాత్రి పనిచేసే బాలురు
నిద్రపోలేరు,పగలు సరిపడే విశ్రాంతి పొందలేరు".
శరీర రక్షణకీ పెరుగుదలకీ, సూర్యరశ్మిఎంత ముఖ్యమో ఒక డాక్టర్ చెప్పాడు: కాంతి శరీర
టిష్యూ లను గట్టిపరుస్తుంది, వాటి స్థితిస్తాపకతకి సపోర్ట్ ఇస్తుంది.  ఎండా తగలకపోతే
టిష్యూలు మెత్తబడతాయి.స్థితిస్థాపక శక్తిని కోల్పోతాయి….పిల్లలకు కొద్దిసేపైనా ఎండ తగలడం
అవసరం. మంచి రకతం కోసం, చూపు కోసం,మెదడు చర్యల వేగం కోసం కాంతి కావాలి.
ఈ అవకాశాలు రాత్రిపని చేసే వాళ్లకు ఉండవు.- పగలు నిద్రపోవాలి కనక.


“ రోలింగ్ మిల్లు లో పని ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5½ వరకు ఉండాలి. అయితే
ఒక మిల్లులో ఒక బాలుడు వారానికి 4 రోజులు రాత్రి 8 ½ దాకా చేశాడు. మరొక 10 ఏళ్ల పిల్లగాడు
ఉదయం 6 గంటలనించీ మర్నాడు 12 గంటలదాకా చేశాడు….మరొక 12 ఏళ్లవాడు 15 రోజుల
పాటు ఐరన్ ఫౌండ్రీలో6 గంటలనించీ అర్ధరాత్రి 12 గంటలవరకూ చేశాడు.
ఏ కారణం చేతైనా .కొందరు పనిలోకి రాకపోయారంటే, వచ్చిపనిచేస్తున్నవేరే షిఫ్ట్  వాళ్లకి శాపమే.
అప్పుడు వాళ్ళచేత చేయిస్తారు.  
అధికారిక పనిదినం పగలైనా, రాత్రయినా  12 గంటలు.దాటితే నివేదిక మాటల్లో అది 'నిజానికి
భయంకరం 'అయినది.
కనుకనే మామూలు పనిదినంకోసం కార్మికులు పోరాటాలు చేయక తప్పలేదు.
ఆ పోరాటాల గురించి వచ్చే పోస్ట్ లో


:


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి