20, ఆగస్టు 2017, ఆదివారం

10. A. సరుకుల రూపపరివర్తన (The Metamorphosis of Commodities)

భాగం 3. డబ్బు లేదా  సరుకుల చలామణీ
 (Money, or the Circulation of Commodities)
విభాగం 2  చలామణీ మాధ్యమం                                                          (The Medium of Circulation)
A. సరుకుల రూపపరివర్తన (The Metamorphosis of Commodities)
సరుకుల సమాజంలో సరుకుల  మారకాలు స్తంభించడమే  సంక్షోభం. మారకాలు సజావుగా సాగించ గలిగినంత కాలం సంక్షోభం ఉండదు. కొన్ని ఆటంకాలు కలిగినా, వాటిని దాటే రూపం మార్పు రావచ్చు.
సంక్షోభాన్ని కలిగించే స్థాయికి చేరకుండా వైరుధ్యాలు పక్కపక్కనే కొనసాగ గలిగే మార్గాలు దొరికితే అవి అంత వరకూ తమ్ముతాము సమన్వయ పరుచుకుంటాయి. సర్దుబాటు చేసుకుంటాయి. వైరుధ్యం తననుతాను వాస్తవం చేసుకోడానికి కావలసిన రూపం: అన్ని విరుద్ధ అంశాలూ తమతమ  ఉనికిని చాటుకోవాలి. దీన్నిబట్టి, అడుగున వుండే వైరుధ్యం అంటిపెట్టుకునే ఉంటుందన్నమాట. కనుక  ఈ వాస్తవీకరణ వైరుధ్యాన్ని తోసిసివేయదు. ఒకరూపంలో విరుద్ధ అంశాలూ చలనంలో ఉండలేకపోతే మెరుగ్గా చలనంలో ఉంచగలిగే రూపం రావాలి. ఉదాహరణకి వస్తుమార్పిడి అమ్మకం-కొనుగోలు అనే రెండు చర్యలుగా విడిపోయింది. ఈ కొత్తరూపం వస్తుమార్పిడిలో ఉన్న రెండు విరుద్ధాంశాల్నీ కొనసాగనిచ్చే రూపమే. అయితే, అమ్మకానికీ, కొనుగోలుకీ విభజన సంక్షోభానికి అవకాశం ఉంచుతుంది, అంటే అది వైరుధ్యాన్ని వైరుధ్యంగా తొలగించదు.
నిజమైన వైరుధ్యాలు పరిష్కారం అయ్యే పధ్ధతి
సరుకుల మారకంలో విరుద్ధమైనవీ, పరస్పరం ఒకదాన్నొకటి బహిష్కరించుకునేవీ అయిన పరిస్థితులు ఉంటాయి- అనే విషయాన్ని  ఇంతకుముందు ఒక అధ్యాయంలో  తెలుసుకున్నాం. సరుకు తదుపరి అభివృద్ధి ఈ వైరుధ్యాల్ని రద్దు పరచలేదు. సరుకులు మామూలు సరుకులుగానూ,డబ్బు గానూ విడిపోయినప్పటికీ, ఆ  పొసగని అంశాలు రద్దవలేదు. కాని వాటి  చలనాన్ని అడ్డగించే చిక్కులు తొలగిపోయాయి. ఆ అంశాలు సహనంతో సామరస్యంగా పక్కపక్కనే  ఉండడడానికి తగిన రూపం (modus vivandi) అభివృద్ధి అయింది. వస్తుమార్పిడి కొనుగోలూ, అమ్మకంగా వేరవడం వీలయింది. ఇలా వేరవడం వస్తుమార్పిడిలో ఉన్న  విరుద్ధాంశాల చలనానికి అవకాశం కలిగించింది.సాధారణంగా నిజమైన వైరుధ్యాలు సమన్వయం  (reconcile) చెయ్యబడే పధ్ధతి ఇదే.”
ఉదాహరణకి, ఒకవస్తువు వేరొకవస్తువు వైపు వస్తుందనీ, అదేసమయమయంలో దాని నుంచి దూరంగా
వెళ్లి పోతున్నదనీ వర్ణించడం ఒక వైరుధ్యమే. అయితే దీర్ఘ వృత్తం అనేది ఈ వైరుధ్యం సాధ్యమయ్యే, అలాగే సమన్వయమయ్యే  చలనరూపం. అంటే, అది ఈ వైరుధ్యం కొనసాగడాన్ని అనుమతిస్తూనే, అదేసమయంలో వైరుధ్యాన్ని సమన్వయపరుస్తుంది.  దీర్ఘవృత్తం కక్ష్య గురుత్వాకర్షణకీ, జడత్వానికీ  ఉన్న వైరుధ్యాల్ని ఎలా నడవ నిస్తుందో అలాగే.
నిజమైన వైరుధ్యాలు రద్దయి పోవు. ఎందుకంటే, అంతర్లీనంగా వున్నవైరుధ్యం అంటిపెట్టుకునే వుంటుంది. ఉదాహరణకి  ప్రత్యక్ష బార్టర్ అమ్మకంగానూ, కొనుగోలుగానూ  విడివడడం సంక్షోభాలను సాధ్యం చేసే రూపం – అది బార్టర్ లోని విరుద్దాంశాల్ని అనుమతిస్తుంది. అంతేగాని  అది వైరుధ్యాన్ని వైరుధ్యంగా తొలగించదు. సంక్షోభం కలిగే అవకాశాన్ని నిర్మూలించదు..
మరైతే, విడివడడంవల్ల ఒరిగిందేమిటి?

బార్టర్ లో ఇబ్బందుల్ని తొలగించేందుకు. మారకాలు సజావుగా సాగడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. వాటిని అధిగమించడానికి, మామూలు సరుకులుగానూ, డబ్బుగానూ సరుకులు విడివడిపోయాయి. బార్టర్లోని ఆటంకాలు పటాపంచలయ్యాయి.
డబ్బు తొలగించిన చిక్కులేమిటి?
బార్టర్ లో ఒకరు తనవస్తువు ఇచ్చి , మరొకరి వస్తువు తీసుకుంటాడు. ఇవ్వడానికీ పుచ్చుకోడానికీ ఐక్యత ఉంటుంది. ఒక చర్య ఒకేచోట జరగాలి. ఒకేకాలంలో జరగాలి. అదే వ్యక్తులమధ్య జరగాలి. అంటే వస్తుమార్పిడిలో ప్రదేశానికీ, కాలానికీ, వ్యక్తులకీ సంబంధించి పరిమితులుంటాయి. సరుకులు కొద్దిగా వున్న కాలంలో వస్తుమార్పిడి సమాజ జీవన క్రియకి సరిపోయింది. అయితే ప్రతి కొత్త శ్రమ విభజనతోనూ సరుకులజాబితా పెరిగింది. సంఖ్యా పెరిగింది. వస్తుమార్పిడి మారక అవసరాలకు సరిపోలేదు. ఇబ్బందులు తలెత్తాయి. అవేవంటే:
1. వస్తుమార్పిడి జరగాలంటే, అవతల మనిషి దగ్గర మనకు కావాల్సిన వస్తువు ఉంటేనే చాలదు. మన వస్తువు అతనికి కావలసినదై ఉండాలి. అది అతనికి ఉపయోగపు విలువ అయి ఉండాలి.
మనదగ్గర పాలున్నాయి. బదులుగా మనకి బియ్యం కావాలి. బియ్యం వున్నా ప్రతివానితోనూ మనకు మారకం కుదరదు.ఎందుకంటే పాలు వాళ్లకి అవసరం లేకపోవచ్చు. అప్పుడు మనం బియ్యం ఉంది పాలు కావాల్సిన మనిషిని వెదికి పట్టుకోవాలి. ఇదొక ఇబ్బంది.
దీనికి సంబంధించి ఒక ఉదంతం ఉంది:
ఒక అన్వేషకుడు ఆఫ్రికాలో ఒక నదిలో తిరగడానికి పడవకోనాలనుకున్నాడు. పడవ అమ్మేవాడిని పట్టుకున్నాడు. అయితే అతను పడవని దంతంతో తప్ప మార్చుకోడు.మనవాడి దగ్గర దంతం లేదు. కొంత వైరు మాత్రం ఉంది. దంతం ఉన్నవాడేమో బట్ట కావాలన్నాడు. ఇతని దగ్గర అదీ లేదు. మూడోవాడిని చూశాడు. అతను బట్టని అమ్ముతాడు, కాని వైరుకి మాత్రమే. మనవాడి దగ్గర కొంత వైరుంది. దాన్ని బట్టతో మార్చి,ఆబట్టనిచ్చి  దంతంతీసుకుని, ఆదంతం ఇచ్చి పడవ పట్టుకుపోయాడు.
ఇలా తిరగటం అసౌకర్యం కలిగిస్తుంది. టైం వేస్ట్ కూడా. మనవాడిదగ్గర వైరు ఉంది కాబట్టి పనయింది. ఒకవేళ వైరు లేకపోతే నువ్వా నువ్వా అంటూ తిరగవలసి వచ్చేది.

2. సరుకుల విలువ పరిమాణాల్లో తేడా వస్తుమార్పిడికి ఆటంకం అవుతుంది. ఒకని వద్ద మేక ఉంది. అతనికి 2 కుండలు కావాలి. కుండవానికి మేక అవసరమే. 1మేక = 100 కుండలు. రెండు కుండలతో మేక మారాలంటే, మేకని 50 ముక్కలు  చెయ్యాలి. కుండలవానికి మేక అవసరం మాంసం కాదు. పాలు. ఒకవేళ మాంసమే అయినా, ఒక ముక్కకే రెండు కుండలు వస్తాయి. మిగలిన ముక్కల్ని మారకం చేసుకోలేకపోతే అవి చెడతాయి.
కొన్ని వస్తువుల్ని విభజించగలిగినా, అవి విలువని కోల్పోతాయి. ఒక ముత్యం ఉన్న వాడికి అన్నం కావాలి. ఒకసారి తినే అన్నం కంటే ముత్యం ఎన్నో రెట్లు విలువైంది. ముక్కలు చేస్తే పాడవుతుంది, విలువ కోల్పోతుంది. పోనీ మొత్తానికీ అన్నం తీసుకుంటే అది ఎంతోసేపు నిల్వ ఉండదు.
ఇవి వస్తుమార్పిడిలో ఇబ్బందులు. డబ్బు రాగానే  ఈ ఇబ్బందులు పోయాయి.
డబ్బు ఈ ఇబ్బందుల్ని ఎలా పోగొట్టింది?
సరుక్కీ సరుక్కీ మధ్య  డబ్బు ఉంటుంది.ఇప్పుడు మారక రూపం:  సరుకు-డబ్బు-సరుకు. ఏసరుకైనా మొదట డబ్బులోకి మారుతుంది. ఆడబ్బు మరోకసరుకులోకి మారుతుంది.
సరుక్కీ సరుక్కీ మధ్యలో ప్రతిసారీ డబ్బు ఉంటుంది. డబ్బు మధ్యవర్తి పాత్ర పోషిస్తుంది.
మొదటి ఉదాహరణలో తన వైరుని రెండోవానికి అమ్మి ఆడబ్బుతో నేరుగా పడవ కొంటాడు.
         వైరు - డబ్బు- పడవ
మన ఉదాహరణ బార్టర్ లో అయితే:
వైరు – బట్ట ; బట్ట – దంతం ; దంతం - పడవ
కనక బార్టర్ లో కలిగే ఈ ఇబ్బందిని డబ్బు అధిగమిస్తుంది.

ముత్యం –ఆహారం మారకంవిషయం: ముత్యాన్ని ముక్కలు చేస్తే చెడుతుంది. ముత్యాన్ని అమ్మి ఆడబ్బుని  భాగాలు చేసినా విలువ తగ్గదు.కొంత డబ్బుతో ఆహారం కొని, మిగిలిన డబ్బుతో కావలసిన ఇతర సరుకులు కొనుక్కోవచ్చు.
కాలానికి సంబంధించిన ఇబ్బంది: ఒకరి వస్తువు మరొకరికి పరస్పరం కావలసినా, ఇద్దరి అవసరాలూ ఒకే సమయంలో ఉండక పోవచ్చు. రొట్టె వానికి బట్ట కావాలి. బట్టవానికీ రొట్టె కావాలి. కాని అప్పటికప్పుడు కాదు. కనుక బట్టవాడు మారకానికి ఒప్పుకోడు. కారణం: రొట్టె మర్నాడు తినేందుకు పనికిరాదు.

వస్తు మార్పిడి
( సరుకు-సరుకు)
డబ్బు మధ్యవర్తిగా మారకం
(సరుకు- డబ్బు- సరుకు)
1.ఎవరికిస్తామో వానివద్దే తీసుకోవాలి
ఎవరి వద్దయినా తీసుకోవచ్చు
2.ఏప్పుడిస్తామో అప్పుడే తీసుకోవాలి
ఎప్పుడయినా తీసుకోవచ్చు
3. ఎక్కడిస్తామో అక్కడే తీసుకోవాలి.
ఎక్కడయినా తీసుకోవచ్చు

వస్తు మార్పిడిలో ఉన్న స్థల కాల వ్యక్తి పరిమితులు డబ్బు మధ్యవర్తిగా ఉన్న మారకాల్లో ఉండవు.
మార్క్స్ మాటల్లో: “వస్తు మార్పిడిలో ఒకరి వస్తువు ఇవ్వడం, ఇంకొకరి వస్తువు పొందడం- అనే నేరు ఐక్యతని అమ్మకం కొనుగోలుల  వ్యతిరేకతలోకి విడగొట్టడం ద్వారా ప్రదేసనికీ, కాలానికీ, వ్యక్తులకీ సంబంధించి వస్తుమార్పిడి విధించిన పరిమితుల్ని చలామణీ అధిగమించింది.” కాపిటల్ 1.115
మరొకచోట: “వస్తు మార్పిడికుండే స్థానిక,వైయక్తిక హద్దుల్ని అధిగమించి మారకం సరుకుల చలామణీని అభివృద్ధి పరిచింది.”- కాపిటల్ 1.11

మారక రంగం నుండి వాడక రంగంలోకి
సరుకులు ఎవరికి ఉపయోగపు విలువలుగా ఉండవో వారి చేతుల్లోనుంచి ఎవరికి ఉపయోగపు విలువలో  వారిచేతుల్లోకి పోయే ప్రక్రియే మారకం. ఒకరకం శ్రమ ఉత్పాదితం మరొక శ్రమ ఉత్పాదితం స్థానంలోకి చేరుతుంది. ఇది సామాజిక జీవనక్రియ. ఉపయోగపు విలువగా ఉండే చోటుకి చేరాక, సరుకు మారకరంగం నుంచి నిష్క్రమించి, వాడకరంగంలో ప్రవేశిస్తుంది. వల కొన్నవాడు దాంతో నదిలో చేపలుపడతాడు. అంటే వల మారక రంగం వీడి వాడక రంగంలోకి పోయింది.
అయితే ప్రస్తుతానికి  మనద్యాసంతా మారక రంగం మీదే.
మారకాన్ని  రూపం వైపు నించి పరిశీలించాలి

శ్రమ విభజన ఉన్న ఏ సమాజంలోనైనా వస్తువులు ఉత్పత్తయ్యాక చేతులు మారితీరాలి. ప్రతి వ్యక్తీ తన శ్రమ ఉత్పాదితాల్ని వదులుకొని, ఇతరుల ఉత్పాదితాల్ని తీసుకోవాల్సిందే. ఇదొక సామాజిక జీవన క్రియ  (social metabolism).” ఉపయోగపు విలువలుగా వుండని వారి చేతుల్లోంచి, ఉపయోగపు విలువలుగా ఉండే వారిచేతుల్లోకి బదిలీ చేసే ప్రక్రియగా  ఉన్న మేరకు, మారక ప్రక్రియ సామాజిక జీవన క్రియ యొక్క ప్రక్రియ.”
ప్రతి సమాజంలోనూ ఈప్రక్రియ ఉత్పాదితాల మారకం ద్వారా జరరిగిందని కాదు. ఇక్కడ పరిశీలిస్తున్నది సరుకులు ఉత్పత్తిచేసే సమాజాన్ని. మార్క్స్ లక్ష్యం ఈ సమాజంలో ఈబదిలీ జరిగే సామాజిక రూపాన్ని పరిశీలించడమే ఈప్రక్రియ యొక్క సారం గురించి ఇక్కడ  ఆసక్తి లేదనీ, కుతూహలం అంతా దాని రూపం గురించే ననీ స్పష్టం చేస్తాడు. “మనం ఈ సామాజిక జీవన క్రియలో మాధ్యమంగా పనిచేసే సరకుల రూప పరివర్తన-లేక సరుకుల రూపాంతరాన్ని  గురించి పరిశోధించాలి.  కనుక మొత్తం మారక ప్రక్రియని దాని రూపం అంశంలో చూడాలి. అంటే, సామాజిక జీవనక్రియని జరిపించే సరుకుల రూపం మార్పుని /  రూప పరివర్తనని పరిశోధించాలి.

మార్కెట్ లావాదేవీల్ని  రూపం వైపు నించి చూసేటప్పుడు, ఒక పొరపాటు చెయ్యకూడదు. రెండు మామూలు సరుకుల మధ్య జరిగే  వస్తుమార్పిడి కి కొనుగోలు లేక అమ్మకం భిన్నస్వభావం కలవి. పాల్గొనే వ్యక్తుల ఆలోచనలూ, నిర్ణయించుకునే ప్రమాణాలూ (criteria)రెండు సందర్భాలలోనూ  భిన్నంగా ఉంటాయి.
ఈ చలనం యొక్క రూపం అంశం గ్రహించడం కొంచెం కష్టం. ఎందువల్లనంటే,ఒక సరుకు యొక్క ప్రతి రూపం మార్పూ రెండు సరుకుల మారకం ద్వారా వస్తుంది. వాటిలో  ఒకటి సాదా సరుకు,రెండోది  డబ్బుసరుకు. అలాంటి రూపం మార్పుకి ఉదాహరణ: ఒకసరుకు తన ఉపయోగపు విలువను వదలివేసి, డబ్బు రూపాన్ని తీసుకోవడం. ఇదెలా జరుగుతుంది?బంగారంతో దాని మారకం ద్వారా. ఒక  వాస్తవంగా చూస్తే  అది రెండు సరుకుల మారకం. అయితే మరింత దగ్గరగా చూడాల్సిన అవసరం ఉంది.
డబ్బు చలామణీ ప్రక్రియలో అనివార్యంగా  ఏర్పడ్డది.
ఒక సరుకు బంగారంతో మారింది అనే విషయాన్ని మాత్రమే మనస్సులో పెట్టుకుంటే, కచ్చితంగా గమనించాల్సిన విషయాన్ని వదిలేస్తాము. అదేమంటే, సరుకు రూపానికి ఏమి జరిగిందో దాన్ని పట్టించుకోము.
1) ఉత్త సరుకుగా ఉన్నప్పుడు బంగారం డబ్బు కాదు అనే విషయాన్ని గమనించం.
2)ఇతర సరుకులు తమ ధరల్ని బంగారంలో చెప్పినప్పుడు బంగారం ఆసరుకుల డబ్బు రూపమే-అనే విషయాన్ని పట్టించుకోము.
ఉదాహరణకి, ఒక పడవ = 2 గ్రాముల బంగారం
రెండు సరుకులూ రెండు భిన్న శ్రమల ఉత్పాదితాలని తెలిసిందే. మారకం జరిగితే, అవి చేతులు మారతాయి. పడవ ఉపయోగపు విలువగా లేని ఉత్పత్తిదారు నించి వినియోగదారుకి చేరుతుంది. అంటే అది మారక రంగాన్ని వదలి వాడకరంగంలోకి అడుగిడుతుంది. పడవ బంగారంతో మారింది అనే విషయాన్ని మాత్రమే గమనిస్తే ఆసరుకుల రూపంలో వచ్చిన మార్పుని గమనించం. అయితే ఇదే అసలు గమనించాల్సిన విషయం. బంగారం కూడా మామూలు సరుకే, పడవలాంటి సరుకే. అలా మామూలు సరుకుగా ఉన్నప్పుడు, బంగారం డబ్బుకాదు. అన్ని సరుకులూ బంగారంలో తమ ధరలు చెప్పినప్పుడు అది విశిష్టమైన సరుకు - డబ్బు సరుకు – అవుతుంది; ఇతర సరుకుల యొక్క డబ్బురూపం అవుతుంది.రూపాన్ని డబ్బులో వ్యక్తం చేస్తాయి.అలా ఇతర సరుకుల ధరల్ని వ్యక్తం చేసే మాధ్యమమే(medium) బంగారం. మిగిలిన ఏ సరుకూ అలాంటి మాధ్యమంగా ఉండజాలదు.

నాలుగో పేరా
సరుకులు మారక ప్రక్రియలోకి వచ్చేటప్పుడు అవి ఎలావున్నాయో అలానే ఉంటాయి అసలు ఆకారంలో వస్తాయి. మారకప్రక్రియ సరుకుని రెండు మూలకాలుగా సరుకుగా, డబ్బుగా - వేరుచేస్తుంది.ఆవిధంగా  సరుకులో ఉపయోగపు విలువ, విలువలమధ్య అంతర్గతంగా ఉండే విరుద్ధత (opposition) ఇప్పుడు దానికి అనుగుణమైన  సరుకు, డబ్బుల మధ్య  బాహ్య విరుద్ధతని కలిగిస్తుంది. ఈ విరుద్ధతలో సరుకులు ఉపయోగపు విలువలుగా డబ్బుని మారకం విలువగా ఎదుర్కుంటాయి. మరొకపక్క, ఈ విరుద్ధతకి రెండువైపులా ఉన్నవి సరుకులే, అయినందువల్ల ఉపయోగపు విలువ, విలువల ఐక్యతలే. అయితే ఈ విరుద్ధతల ఐక్యత రెండు వ్యతిరేక ధృవాల వద్ద వ్యక్తమవుతుంది. .ధ్రువాలు అయినందువల్ల అవి సంబంధంలో ఉన్నట్లే, వ్యతిరేకంగానూ ఉంటాయి. సమీకరణానికి ఒకవైపున మామూలు సరుకు, నిజానికి ఒక ఉపయోగపు విలువ ఉంటుంది. దాని విలువ దాని ధరలో ఉహాత్మకంగా వ్యక్తమవుతుంది. ధరద్వారా సరుకు (అవతలవైపునున్న) వ్యతిరేకి అయిన బంగారంతో సమపరచబడుతుంది. మరొకపక్క లోహమైన బంగారం విలువ అవతారంగా , డబ్బు హోదా పొందుతుంది. బంగారం బంగారంగా మారకం విలువే .
దాని ఉపయోగపు విలువ  ఉహాత్మకంగా మాత్రమే కనబడుతుంది. సరుకులవైన ఈ  విరుద్ధ రూపాలు వాటి మారకం జరిగే  ప్రక్రియ యొక్క నిజమైన చలన రూపాలు.

సరుకుల వ్యతిరేక రూపాలు మారక ప్రక్రియ యొక్క వాస్తవ చలన రూపాలు.

సరుకులు ఉపయోగపువిలువలుగా డబ్బుని ఎదుర్కుంటాయి. ఇరువైపులా ఉన్నది సరుకులే. అంటే ఉపయోగపు విలువ, విలువల ఐక్యతలే. అయితే ఈ వ్యత్యాసాల ఐక్యత ఆధ్రువం వద్దా, ఈద్రువం వద్దా వ్యతిరేక మార్గంలో ప్రాతినిధ్యం వహిస్తుంది. అందువల్ల అదే సమయంలో వాటి పరస్పర అంతఃసంబందానికి ప్రతినిధి అవుతుంది/ ప్రాతినిధ్యం వహిస్తుంది.
వేరేరకంగా చెబితే, పిప్పిపళ్ళలో కూరే బంగారం ఉపయోగపు విలువ ఉపేక్షించబడుతుంది. ఫ్రెంచ్ కూర్పులో సరుకుకీ డబ్బుకీ ఉండే సంబంధం ఏవిధంగా రెండు మామూలు సరుకులకి  ఉండే సంబంధానికి భిన్నమైనదో చక్కగా వివరిస్తాడు. 
ఒకధ్రువంలో బంగారం ఉంటుంది.అన్ని ఉపయోగకర వస్తువులూ ఇంకో ధ్రువాన్ని చేరతాయి. రెండు వైపులా ఉన్నవి సరుకులే. అటూ సరుకే ఇటూ సరుకే. రెండూ ఉపయోగపు విలువ, విలువల సమ్మేళనాలే. అయితే ఈరెండు చివరలా ఉన్న వ్యతిరేకాంశాల ఐక్యత రెంటిలో ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆరెండూ ఒకదానికొకటి విలోమంగా ఉంటాయి. సరుకు ప్రయోజనకరరూపం దాని వాస్తవ రూపమే. దాని మారకం విలువ దాని ధర ద్వారా  ఉహాత్మక బంగారంలో వ్యక్తమవుతుంది. ఇందుకు విరుద్ధంగా బంగారం యొక్క ప్రాకృతిక, లోహ రూపం దాని సాధారణ రూపం, అంటే విలువ రూపం. దాని ఉపయోగపు విలువ దానికి సమానకాలుగా ఉన్న సరుకుల పరంపర(series)లో ఉహాత్మకంగా వ్యక్తమవుతుంది.ఆ కారణంగా ఒక సరుకు బంగారంతో మారినప్పుడు, తన ప్రయోజనకర  రూపాన్నిఅదేసమయంలో తన విలువ రూపంలోకి మార్చుకుంటుంది. బంగారం ఒక సరుకుతో మారినప్పుడు, తన విలువ రూపాన్ని ప్రయోజనకర రూపంలోకి మార్చుకుంటుంది.
ఈ సరుకు-డబ్బు బహిర్గత వ్యతిరేకత మారక ప్రక్రియలో ఏర్పడ్డది. ఈ సరుకు-డబ్బు బహిర్గత వ్యతిరేకత ప్రతి సరుకులోనూ ఉన్న ఉపయోగపు విలువ-విలువల అంతర్గత వ్యరేకతకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సరుకుల వ్యతిరేక రూపాలు మారక ప్రక్రియ యొక్క వాస్తవ చలన రూపాలు.
ఉద్దేశ్యపూర్వకంగా ప్రవేశపెట్టబడిన సాధనం కాదు
అమ్మకంగానూ, కొనుగోలుగానూ బార్టర్ విడివడడం అనేది ప్రత్యక్ష వస్తుమార్పిడిలో తలెత్తిన ఇబ్బందుల్ని తొలగించడానికి మార్కెట్లో పాల్గొనే వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా ప్రవేశపెట్టబడిన సాధనం కాదు. డబ్బు ఎకానమీ కేంద్రం(core)లో ఉత్పత్తిసంబందాల ఉపరితల వ్యక్తీకరణగా ప్రవేశపెట్టబడింది. డబ్బు రాకతో ప్రతి సరుకులోనూ ఉపయోగపు విలువకూ, విలువకూ అంతర్గతంగా ఉన్న వైరుధ్యం, సరుకులు మామూలు సరుకులుగానూ, డబ్బుగానూ విడివడడంలో బహిర్గతమయింది.
సరుకు మారకప్రక్రియలో నడచేటప్పుడు, సరుకు ఈరెండు వ్యతిరేక సరుకు రూపాలగుండా పోతుంది.
డబ్బు-మామూలు సరుకు  గురించి చర్చించాక, అసలు ప్రక్రియని చర్చిస్తాడు:
అసలు ప్రక్రియ- కొనడం కోసం అమ్మడం

నేతగాడు తాను నేసిన 20గజాల బట్టతొ  మార్కెట్ కి పోతాడు. ఆ బట్టకి నిర్దిష్టమైన ధర-రెండు పౌన్లు- ఉంటుంది. అంతకే దాన్ని అమ్మి, అంతే ధర ఉన్న బైబిల్ కొంటాడు. బట్ట అతని దృష్టిలో విలువ నిక్షేపం మాత్రమే. దాన్ని బంగారంతో మారకంలో పరాధీనం చేస్తాడు. బంగారం బట్ట యొక్క విలువ రూపం. ఈ రూపాన్ని మరొక సరుకు అయిన బైబిల్ కోసం వదులుకుంటాడు. బైబిల్ కుటుంబానికి ఉపయోగపువిలువగా అతని ఇల్లు  చేరుతుంది.
అప్పటికి మారకం వాస్తవంగా పూర్తవుతుంది. మారకం వాస్తవం అవడం  రెండు రూపాంతరాల (metamorphoses) ద్వారా సాధ్యం అవుతుంది. ఈరెండు రూపాంతరాలూ ఒకదానికొకటి విరుద్ధమైనవి. అయినా పరస్పరం అనుబంధ స్వభావం కలవి.   మొదటి రూపాంతరం , సరుకు డబ్బులోకి మారడం- 20గజాల బట్ట 2 పౌన్ల లోకి మారడం. రెండో రూపాంతరం ,ఆ రెండు పౌన్ల డబ్బు తిరిగి  బైబిల్ అనే మరొక సరుకులోకి మారడం. ఈరూపంతరం లోని రెండు దశలూ నేతగాడు జరిపిన రెండు భిన్న లావాదేవీలు.తొలి దశ అమ్మడం-తన సరుకుని డబ్బుకి మారకం చెయ్యడం. మలి దశ కొనడం-తన డబ్బుని సరుకుతో మారకం చెయ్యడం. రెంటినీ కలిపితే ‘కొనడం కోసం అమ్మడం’.

నేతగాని లావాదేవీ ఫలితం ఏమిటి? అతని వద్ద బట్ట బదులు బైబిల్ ఉంది.తన అసలు సరుకు పోయి, అంతే  విలువగల, భిన్నమైన ఉపయోగపు విలువ ఉన్న మరొక సరుకు అతనిదయింది. ఇదే పద్ధతిలో అతను జీవితావసర వస్తువుల్నీ, ఉత్పత్తి సాధనాలనీ సమకూర్చుకుంటాడు. ఈ దృష్టితో చూస్తే, ఈ మొత్తం ప్రక్రియ ఫలితం ఏమిటి? అతని శ్రమ ఉత్పాదితం వేరొకరి శ్రమ ఉత్పాదితంతో మారకం కావడమే. ఉత్పాదితాల మారకం మినహా  మరేమీ కాదు. అందువల్ల సరుకుల మారకం వాటి రూపంలో ఈక్రింది మార్పుల్ని తెస్తుంది:
సరుకు – డబ్బు – సరుకు  
స – డ – స 
ఆవస్తువులకి సంబంధించినంత వరకూ మొత్తం ప్రక్రియ ఫలితం, స – స. ఒకసరుకుకి మరొక సరుకుతో మారకం. వస్తు రూపం పొందిన సామాజిక శ్రమ యొక్క చలామణీ. ఈ ఫలితం వచ్చీ రాగానే ప్రక్రియ ముగుస్తుంది.
సరుకు రూప పరివర్తనలో రెండు దశలుంటాయి :
మొదటి దశ రుకు-బ్బు. సరుకు డబ్బుగా మారడం.
రెండో దశ బ్బు-రుకు ఆడబ్బు మరొక సరుకుగా మారడం.
మొదటి దశ గురించి వచ్చే పోస్ట్ లో





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి