24, ఆగస్టు 2017, గురువారం

10 B'.సరుకు – డబ్బు'. మొదటి రూపాంతరం లేదా అమ్మకం

రుకు – డబ్బు. మొదటి రూపాంతరం లేదా అమ్మకం
C M. First metamorphosis, or sale


ఉత్పత్తయిన సరుకు అమ్ముడవాలి. బంగారంలోకి మారాలి.అంటే ఆ సరుకు ‘విలువ’ ఆ సరుకు శరీరం లోనుంచి బంగారం శరీరం లోకి దూకాలి. దూకితేనే అమ్మకం. ఉదాహరణకి, 50 పౌన్ల ఇనుం అమ్ముడవడం అంటే దాని విలువ 2 ఔన్సుల బంగారంలోకి దూకడమే. దూకకపోతే అమ్మకం జరగనట్లే. మార్క్స్ఈ దుముకుని తాను మరొకచోట  ‘salto mortale of the commodity  అని అన్నానంటాడు. ఆ మరొక చోటు ‘క్రిటిక్’ పేజి 88. అక్కడిలా అంటాడు:
ఈ పరివర్తన జరగకపోతే టన్నుఇనుమూ సరుకు అవకుండా పోతుంది, అంతేకాదు ఉత్పాదితం కూడా కాకుండా పోతుంది. కారణం: దాని ఓనర్ కి ఉపయోగపు విలువ కాకుండా ఉండి, ఇతరులకు ఉపయోగపు విలువ అయితేనే  అది సరుకు. అంటే, అతని శ్రమ ఇతరులకు ప్రయోజనకర శ్రమ అయితేనే అది నిజమైన శ్రమ. అది అనిర్దిష్ట సాధారణ శ్రమ అయితేనే ఓనర్ కి ప్రయోజనకరం. అందువల్ల ఇనుం ఓనర్ తన సరుకు బంగారాన్ని ఆకర్షించగల -అంటే బంగారంతో మారగల- చోటు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఈ సింపుల్ చలామణీ విశ్లేషణలో మనం  ఆశించినట్లు అమ్మకం జరిగితే, అవరోధాన్ని  (the salto mortale of the commodity)అధిగమించినట్లే.”
ఈ అన్యాక్రాంతం అవడం  – అంటే, ఉపయోగపు విలువ కాని వ్యక్తినుండి ఉపయోగపు విలువగా ఉండే వ్యక్తికి బదిలీ కావడం-ఫలితంగా ఇనుం వాస్తవంగా ఉపయోగపువిలువ అయినట్లు రుజువు చేసుకుంటుంది; అదే సమయంలో దాని ధర సిద్ధిస్తుంది, కేవలం ఉహాత్మక బంగారం నిజమైన బంగారం లోకి మారుతుంది.-క్రిటిక్

salto mortale (సాల్టో మోర్టాలే) ఇది ఇటాలియన్ మాట. salto అంటే ‘దుముకు’. mortale అంటే ప్రమాదకరమైన . రెండూ కలిపితే, ప్రమాదంతోకూడిన, సాహసోపేతమైన దుముకు అని అర్ధం. సర్కస్ లో తాడుమీద పరిటీలు కొట్టడం ఒక salto mortale. గ్లోబులో మోటార్ సైకిళ్ళు నడపడం అలాంటిదే.ఒక ఎత్తైన చోట నుంచి మరొక ఎత్తైన చోటుకి మోటార్ సైకిల్ ఎక్కి దూకడం ఒక ఫీట్. సరిగ్గా దూకాలి. ఏమాత్రం ఇవతల దూకినా ఎత్తునుంచి కింద పడడమే, ప్రమాదమే.
ఇక్కడ ఒక సరుకు లోంచి విలువ మరోకసరుకులోకి దూకే చర్య. సరుకు విలువ బంగారంలోకి సరిగ్గా దూకాలి. దూకలేకపోతే ప్రమాదం. అయితే ఆ ప్రమాదం సరుకుకి కాదు. కాని దాని ఓనర్ కి కచ్చితంగా ప్రమాదమే. ఎందుకంటే, అది అమ్మకంకోసం ఉత్పత్తయిన సరుకు. అమ్ముడవకపోతే, ఉన్నదలానే, అతని వద్దే ఉండిపోతుంది. మరల తయారు చెయ్యలేడు. అదే అతనికి పొంచివున్న ప్రమాదం.

సరుకు ఉత్పత్తిదారులు శ్రమవిభజన ఉన్న సమాజంలో జీవిస్తారు. తమ ఉత్పాదితాల్ని తామే వాడుకోలేరు. పైగా వాళ్లకి ఇతరుల ఉత్పాదితాలు ఎన్నో  అవసరమవుతాయి. వాళ్ళ ఉత్పాదితం వాళ్లకి కేవలం మారకంవిలువ మాత్రమే, అంటే రకరకాల ఇతరుల సరుకులకు మారకం వేసుకునేవే. సరుకుల ఉత్పత్తిదారులు వాటిని డబ్బులోకి మార్చుకొని తీరాలి.
ఆడబ్బు వేరేవారి జేబులో ఉంటుంది. ఆడబ్బుని బయటకు లాగాలంటే మనమిత్రుని సరుకు డబ్బు ఓనర్ కి ఉపయోగపు విలువ అయి ఉండడం ముఖ్యం. అందుకు దాని ఉత్పత్తికి వ్యయించిన శ్రమ సామాజికంగా ప్రయోజనకరమైన రకానికి చెందినదై, సామాజిక శ్రమ విభజనలో ఒక విభాగమై ఉండాలి.
అయితే శ్రమ విభజన ఉత్పత్తిదారుల ఎరుకలేకుండా ఎదిగిన ఉత్పత్తి వ్యవస్థ, ఎదుగుతున్న వ్యవస్థ. అయితే మార్కెట్ అనిశ్చితులు ఏర్పడడానికి కారణం  పద్ధతీ, ప్రణాళికా, సమన్వయమూ  లేకపోవడం.
 సరుకు అమ్ముడుపోని అంటే కొనేవాడు దొరకని పరిస్థితులు:
  • ·         మారకం కావాల్సిన సరుకు, కొత్తగా ఏర్పడ్డ అవసరాల్ని తీర్చేందుకంటూ వచ్చిన  కొత్తరకం  శ్రమ ఉత్పాదితం కావచ్చు. కొత్త అవసరాలను తానే కలిగించేదీ కావచ్చు. అయితే దాన్ని ప్రయోజనకర వస్తువుగా  వినియోగదారులు గుర్తించకపోవచ్చు. కరెంట్ నిరంతరాయంగా ఉన్న చోట్ల ఇన్ వర్టర్లు అవసరం ఉండదు. ఆపరిస్తితుల్లో కొనే వారు దొరకరు.
  • ·         నిన్నటిదాకా ఒక సరుకు ఉత్పత్తిలో ఉత్పత్తిదారుడు నిర్వహించిన అనేక క్రియల్లో ఒకటి  ఇవ్వాళ   వేరుపడవచ్చు. అంటే ఒక స్వతంత్ర శ్రమ విభాగంగా ఏర్పడవచ్చు. మొత్తంగా లేని   ఉత్పాదితాన్ని స్వతంత్రమైన సరుకుగా మార్కెట్లో కి దించవచ్చు.  అయితే అలా విడిపోవడానికి అప్పుడున్న పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చు. ఉండక పోనూవచ్చు.  ఉండకపోతే, అది అమ్ముడవదు. టీ.వీ బోర్డ్ లో చాలా భాగాలుంటాయి.  ఏది పనిచేయక పోతే దాన్ని మార్చాలి. అయితే మొత్తం బోర్డే మారుస్తున్న పరిస్తితులో, విడిభాగాలు అమ్ముడుపోవు.    
  • ·         ఇవ్వాళ ఒక సరుకు సామాజిక అవసరాన్ని తీర్చేదే కావచ్చు.రేపు అటువంటిదే మరొక సరుకు ప్రత్యామ్నాయంగా వచ్చి పాతదాన్ని పాక్షికంగానో, సంపూర్ణంగానో తొలగించవచ్చు. ఒకప్పుడు వీడియో కాసెట్స్ కి  ఎంత గిరాకీ ఉండేదో! వాటికి ప్రత్యామ్నాయంగా  సీ.డీ లొచ్చాయి. ఇప్పుడు హవా అంతా మెమరీ కార్డులడీ, పెన్ డ్రైవ్ లదీ. పాతకాలపు సరుకులు మార్కెట్లో కదలవు.
  • ·         మన నేతగాని శ్రమ సామాజిక శ్రమ విభజనలో గుర్తింపు ఉన్నదే. ఆగుర్తింపు అతని 20గజాల బట్ట ప్రయోజనానికి హామీగా సరిపోదు. కారణం: ఆసమాజానికి కావలసిన బట్ట పరిమాణానికి ఒక పరిమితి ఉంటుంది – అన్ని ఇతర వస్తువులకూ ఉన్నట్లే. పోటీ నేతగాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ బట్టతో నిండి మార్కెట్ అవసరం పూర్తిగా తీరిపోతే, మన మిత్రుని బట్టతో అవసరముండదు. ఫలితంగా అది నిరుపయోగమై పోతుంది.వృధా అవుతుంది. బహుమతిగా వచ్చిన గుర్రం వయసు తెలుసుకోవడానికి  దాని నోరు తెరిచి చూడరు. కాని మన మిత్రుడు మార్కెట్ కి తరచుగా పోయేది బహుమతులివ్వడానికి కాదు గదా! అతని ఉత్పాదితం నిజమైన  ఉపయోగపు విలువ అయిందనీ, డబ్బుని ఆకర్షించిందదనీ అనుకుందాం. ఇప్పుడు ఒక ప్రశ్నపడుతుంది-ఎంత డబ్బుని ఆకర్షిస్తుంది?అనేదే ఆ ప్రశ్న. ఇది పరిమాణానికి సంబంధించిన ప్రశ్న.(అది ఉపయోగపు విలువా కాదా అనేది గుణానికి సంబంధించిన ప్రశ్న). ఆసరుకు  విలువ పరిమాణం ముందుగానే ధరగా ఉహించ బడింది. ప్రతి సరుకుకీ ధర చీటీ ఉంటుంది. అయితే, ఉత్పత్తిదారుడు ఆశించిన ధరకీ  మార్కెట్లో వచ్చేదానికీ తేడా ఉండవచ్చు. అందుకు తగిన కారణాలు ఎన్నో ఉంటాయి.
  • ·         సరుకు ఉత్పత్తి దారుడు ధరని నిర్ణయించడంలో పొరపాటు పడితే, దాన్ని మార్కెట్ సవరిస్తుంది. అందుకని మార్క్స్ ఆవిషయాన్నివదిలేస్తాడు.
  • ·         సరుకు సగటు పరిస్తితుల్లో ఉత్పత్తి కాకపొతే, ఆ సరుకులో చేరిన శ్రమ మొత్తానికీ మార్కెట్ ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు. మార్క్స్ దీన్ని కూడా వదిలేస్తాడు- అతను సామాజికంగా అవసరమైన శ్రమనే తనసరుకు ఉత్పత్తిలో వినియోగించాడని అనుకుందాం అంటాడు. అప్పుడు ధర అనేది ఆసరుకులో వస్తుత్వం చెందిన సామాజికంగా అవసరమైన శ్రమ పరిమాణానికి డబ్బు పేరు,అంతే. అంటే, ఆధరని ఒప్పుకుంటుందనా? ఆమోదించని పరిస్థితులు రెండు చూపిస్తాడు:
  • ·         ఒక సరుకు సగటు పరిస్థితుల్లో తయారయినప్పటికీ, ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి పరిస్థితుల్లో మార్పులు రావచ్చు. అంటే అతను వ్యక్తిగతంగా  అంతా సవ్యంగానే చేసినా, అనిర్దిష్ట శ్రమ అనేది సామాజిక భావన అని ఉత్పత్తిదారునికి గుర్తు చేస్తుంది. నేత పనిలో నేతగానికి తెలియకుండా, అతని అనుమతి లేకుండా  పాత నేత విధానం మారవచ్చు. నిన్నఒక గజం బట్ట నేయ్యడానికి  సామాజికంగా అవసరమైన శ్రమ కాలం పరిమాణం ఇవ్వాళ అంతే కాకపోవచ్చు. మారవచ్చు. ఈ వాస్తవాన్ని డబ్బున్నవాడు మన మిత్రుని పోటీ నేతగాళ్ళు చెప్పే ధరలనుండి రుజువు చెయ్యడానికి తొందరపడతాడు. మన నేతగాని దురదృష్టం కొద్దీ, నేతగాళ్ళు తక్కువమంది కారు, చాలామంది ఉన్నారు.
  • ·         ఇకపోతే,ఎక్కువగా ఉత్పత్తయినప్పుడు అందరు ఉత్పత్తిదారులూ ధరలు తగ్గించుకోవాల్సిన పరిస్తితి తలెత్తుతుంది. మార్కెట్ లో ప్రతి బట్ట ముక్కలోనూ సామాజికంగా అవసరమైన శ్రమ కాలానికి మించి లేదనే అనుకుందాం. అలా అయినాగాని, అన్ని బట్టముక్కల్నీ కలిపి మొత్తంగా చూస్తే వాటికి వ్యయించిన స్రమకాలం అధికంగా ఉండవచ్చు. గజం 2షిల్లింగుల లెక్కన మొత్తం బట్టని మార్కెట్ ఇముడ్చుకోలేక పోవచ్చు. అప్పుడు సామాజిక శ్రమలో మితిమీరిన భాగం నేతరూపంలో వ్యయమయినట్లు రుజువవుతుంది. దీని ప్రభావం ప్రతి నేతగాడూ సామాజికంగా అవసరమైన శ్రమని మించి వ్యయించి నప్పుడు కలిగే  ప్రభావం వంటిదే. మనం ఇక్కడ జర్మన్ సామెతతో గొంతు కలపవచ్చు: ‘కలిసికట్టుగా పట్టుకోబడ్డారు, కలిసికట్టుగా ఉరితీయబడ్డారు’. మార్కెట్లో ఉన్న మొత్తం  బట్ట ఒకే వర్తక వస్తువుగా లెక్కకొస్తుంది. అందులో ప్రతి ముక్కా తగిన భాగం  అంతే. వాస్తవానికి ప్రతి గజం విలువా సామాజికంగా నిర్ణయమైన ఒకేరకమైన మానవశ్రమ పరిమాణం యొక్క వస్తు రూపం తప్ప వేరేమీ కాదు.

ఆవిధంగా సరుకుని అమ్ముకోవడంలో ఉన్న ఇబ్బందుల్ని చెప్పాక, వాటినించి ఈక్రింది నిర్ధారణకి వస్తాడు:
సరుకులు డబ్బుపట్ల ప్రేమలో ఉంటాయి. కాని నిజమైన వలపు తిన్నగా సాగదు. శ్రమ యొక్క గుణాత్మక విభజన లాగానే, పరిమాణాత్మక విభజన కూడా స్వయంజనిత, యాదృచ్చిక సరళిలో  సంభవిస్తుంది.
అందువల్ల, తమను స్వతంత్ర వ్యష్టి ఉత్పత్తిదారులుగా చేసిన శ్రమ విభజనే, సామాజిక ఉత్పత్తి ప్రక్రియనీ, ఆప్రక్రియ లోపల విడివిడి  ఉత్పత్తిదారుల పరస్పర సంబంధాల్నీ, ఆ యా ఉత్పత్తిదారుల  ఇష్టం మీద ఆధారపడి ఉండడం నుండి విముక్తి చేస్తుంది అనే విషయాన్ని ఉత్పత్తిదారులు తెలుసుకుంటారు. పైకి కనబడే వ్యక్తుల పరస్పర స్వేచ్ఛ తోపాటుగా  ఉత్పాదితాల ద్వారా సాధారణ పరస్పరం ఆధారపడడం అనే వ్యవస్థ అంటిపెట్టుకొని ఉంటుంది అనికూడా తెలుసుకుంటారు.
సరుకు డబ్బులోకి మారడం యాదృచ్చికం
శ్రమ విభజన శ్రమ ఉత్పాదితాన్ని సరుకులోకి మారుస్తుంది. తద్వారా ఆసరుకు ఆతర్వాత డబ్బులోకి మారడాన్ని అవసరపరుస్తుంది. అదేసమయంలో మారుతుందా లేదా అనేది యాదృచ్చికం. ఈవిషయాన్ని స్వచ్చమైన రూపంలో పరిశీలిస్తున్నాం. కనుక మనం అంతా మామూలుగానే జరుగుతున్నట్లు భావిస్తాం.అంతేకాక, రూపంతరీకరణ జరిగితే, అంటే సరుకు అమ్మకానికి పూర్తిగా అనర్హం కాకపొతే, ఈరూపాంతరీకరణ జరుగుతుంది – సిద్ధించిన ధర సరుకు విలువకంటే  అసాధారణంగా ఎక్కువో, తక్కువో అయినప్పటికీ.
సరుకు-డబ్బు అనేది డబ్బు-సరుకు కూడా
అమ్మినవానికి సరుకు బదులు డబ్బొస్తుంది. కొన్నవానికి డబ్బు పోయి సరుకొస్తుంది. ఇక్కడ ఒక విషయం కొట్టొచ్చినట్లు కానొస్తుంది. ఏమంటే, ఒక సరుకూ, డబ్బూ 20 గజాల బట్టా 2 పౌన్లూ చేతులు మారాయి. చోట్లు మారాయి. అంటే అవి మారకం అయ్యాయి. అయితే, సరుకు దేనితో మారింది? తనసొంతవిలువ ఏ రూపాన్ని తీసుకున్నదో దానితో, ఆ సార్వత్రిక సమానకంతో. మరి డబ్బు మారింది దేనితో? దాని సొంత ఉపయోగపు విలువయొక్క ఒకానొక ప్రత్యేక రూపంతో.(బంగారం ఉపయోగపువిలువకి  ప్రతిసరుకూ ప్రత్యేకరూపమే)
బట్టకు ఎదురుగా ఉన్నప్పుడు, బంగారం డబ్బు రూపాన్ని ఎందుకు తీసుకుంటుంది? ఎందుకంటే, బట్ట ధర 2 పౌన్లు. బట్ట ఇప్పటికే డబ్బుస్వభావంతో  ఉన్న  బంగారంతో సమానమైనదిగా పరిగణించబడింది.
ఒకసరుకు డబ్బులోకి మారడం అనేది అదే సమయంలో డబ్బు సరుకులోకి మారడం కూడా. పైకి ఒకేప్రక్రియగా ఉండేది, వాస్తవానికి ద్వంద్వ ప్రక్రియ. సరుకు సొంతదారుని వైపునించి చూస్తే అది అమ్మకం.అవతలవైపు నించి అంటే డబ్బువాని వైపునించి చూస్తే అది కొనుగోలు. అంటే అమ్మకం ఒక కొనుగోలు కూడా. సరుకు-డబ్బు అనేది డబ్బు-సరుకు కూడా.*

కొనేవాడికి డబ్బు ఎక్కడ నుండి వచ్చింది?

‘సరుకు-డబ్బు’  నించి ‘డబ్బు-సరుకు’ పరివర్తనని డబ్బు-సరుకు దృష్ట్యా కాకుండా ‘సరుకు ఓనర్’  ‘డబ్బు ఓనర్’ దృష్ట్యా చూస్తే, ఒక ప్రశ్నతలెత్తుతుంది: కొనేవాడికి డబ్బు ఎక్కడ నుండి వచ్చింది?
ఇంతదాకా మనుషుల్ని సరుకుల ఓనర్లుగా మాత్రమే పరిగణించాం. వాళ్ళుతమతమ శ్రమ ఉత్పాదితాల్ని పరాధీనం చేసి,  ఇతరుల శ్రమ ఉత్పాదితాల్నిస్వాయట్టం చేసుకోగలరు. అందువల్ల, ఒక సరుకు ఓనర్ మరొకసరుకు, డబ్బు  ఓనర్ ని కలుసుకోవడానికి, ఆరెండో(కొనే) వాని శ్రమ ఉత్పాదితం డబ్బు( అంటే బంగారం) అయి ఉండాలి. లేదా అతని ఉత్పాదితం అప్పటికే అసలు రూపం అయిన ప్రయోజనకర వస్తువు నుండి తొలగించబడి  అన్నా ఉండాలి. డబ్బుపాత్ర పోషించడానికి బంగారం ఏదో ఒక సమయంలో మార్కెట్లోకి ప్రవేశించి ఉండాలి.
ఆసమయం ఏది? బంగారం ఉత్పత్తయిన చోట, అది శ్రమ ఉత్పాదితంగా అంటే విలువ ఉన్న  మరొక ఉత్పాదితంతో   వస్తుమార్పిడి అయిన చోట. ఆక్షణం నుండీ ఒక సరుకు యొక్క సిద్ధించిన ధరకి ప్రతినిధిగా ఉంటుంది. ఉత్పత్తయిన చోట ఇతర సరుకులతో మారకం కావడానికి తోడు, బంగారం ఎవరి చేతుల్లో ఉన్నా, అది ఏదో సరుకు ఓనర్ పరాధీనం చేసిన సరుకు యొక్క మారిన రూపం. అది అమ్మకం మొదటి పరివర్తన అయిన ‘సరుకు- డబ్బు’ వచ్చింది. ఇంతకూ ముందే చూసినట్లు బంగారం ఉహాత్మక డబ్బులేక విలువల కొలమానం అయింది- అన్ని సరుకులూ తమ విలువల్ని బంగారం ద్వారా కొలవడం వల్ల, ఆవిధంగా ప్రయోజనకర వస్తువులుగా వాటి ఆకారం నుండి ఉహాత్మకంగా వేరుచేసుకోవడం వల్ల, వాటి విలువ రూపంగా చేసుకోడం వల్ల, అది ఉహాత్మక డబ్బు అయింది.
ఉహాత్మక డబ్బు నిజమైన డబ్బు ఎలా అయింది?
డబ్బు కాక మిగిలిన సరుకు ఏదయినా అమ్మేవానికి ఎలా వస్తుంది? ఆటను ఆసరుకుని ఉత్పత్తిచేసాడు కనుక. బంగారం విషయం వేరు.బంగారం ఉత్పత్తిదారుల మొదటి అమ్మకం మార్కెట్లో ఉండే బంగారంలో కొద్ది భాగమే. మార్కెట్లో పాల్గొనే ఎక్కువ మంది జేబుల్లో ఉండే డబ్బు వారివారి సొంత ఉత్పాదితాలను అమ్మి పొందినదే.
సరుకుల పరాదీనం ద్వారా, ప్రయోజనకర వస్తువులుగా వాటి సొంత రూపాలతో వాస్తవంగా చోట్లు మారడం ద్వారా. ఆవిధంగా నిజంగా వాటి విలువల ఆకారం అయింది. అలా బంగారం నిజమైన డబ్బు అయింది. ఎప్పుడయితే సరుకులు డబ్బు రూపం పొందుతాయో, అప్పుడు అవి వాటి ప్రాకృతిక ఉపయోగపు విలువ యొక్క ప్రతి జాడనూ, వాటిని ఉత్పత్తిచేసిన ప్రయోజనకర శ్రమ జాడనూ వదిలించుకుంటాయి- ఒకేరకమైన,సామాజికంగా గుర్తింపు పొందిన శ్రమగా అవడానికి.
కొంత డబ్బుని చూసినంత మాత్రాన  అది ఏసరుకుకు బదులుగా వచ్చిందో చెప్పలేం. అన్ని సరుకులూ వాటి డబ్బు రూపంలో ఒకేరూపంలో (alike)కనబడతాయి.
అంతకుముందే తన సరుకు అమ్మినందువల్లనే, సాధారణంగా కొనేవానిచేతికి డబ్బోచ్చింది.
మన నేతగాడు బట్టని అమ్మగా రెండు బంగారం ముక్కలు వచ్చాయి. బట్టకోన్నవానికి ఎక్కడనుమ్డి వచ్చాయి? అవి బహుశా అతను ఒక పావు గోధుమలు అమ్మగా  వచ్చి ఉండవచ్చు.
బట్ట అమ్మకం,(సరుకు- డబ్బు), అదే సమయంలో దాని కొనుగోలు (డబ్బు-సరుకు) కూడా. బట్ట అమ్మకంగా చూస్తే, ఈ ప్రక్రియ మొదలు పెట్టిన కదలిక దాని వ్యతిరేక లావాదేవీతో ముగుస్తుంది. అంటే బైబిల్ కొనుగోలుతో ముగుస్తుంది. మరొకపక్క బట్ట కొనుగోలు, దానికి వ్యతిరేకమైన గోధుమల అమ్మకంతో మొదలైన కదలికని  ముగిస్తుంది. స-డ-స (బట్ట-డబ్బు-బైబిల్) కదలికలో మొదటి దశ అయిన సరుకు- డబ్బు(బట్ట-డబ్బు) అనేది, మరొక కదలిక  స-డ-స (బట్ట-డబ్బు-బైబిల్) లో డ-స (డబ్బు-బట్ట)అనేది వేరొక కదలిక (గోధుమలు-డబ్బు- బట్ట) యొక్క చివరి దశ. అందువల్ల,  ఒక సరుకుయొక్క  మొదటి రూపాంతరం/రూప పరివర్తన అంటే సరుకు డబ్బుగా మారడం అనేది  తప్పకుండా మరొక సరుకు యొక్క రెండో రూపపరివర్తన కూడా. మరొక సరుకు పునః పరివర్తన అంటే డబ్బునుండి సరుకులోకి మారడం.
ఇంతకూ ముందే చెప్పినట్లు, బంగారం వెండి వాస్తవ ఉత్పత్తిదారుడు ఇందుకు మినహాయింపు. అతని ఉత్పాదితాన్ని మరొక సరుకుతో మారకం చేసుకుంటాడు –ముందుగా  దాన్ని అమ్మకుండానే.
‘డబ్బు-సరుకు’ రూపాంతరం గురించి  వచ్చేపోస్ట్  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి