17, జూన్ 2017, శనివారం

7.సరుకుల మార్మికతా, దాని రహస్యమూ

7. సరుకుల మార్మికతా, దాని రహస్యమూ

            సరుకుల సమాజంలో ఉత్పత్తిదారుల మధ్య ఉండే సంబంధాలు వాళ్ళ ఉత్పాదితాల మధ్య సంబంధాలుగా                           వాళ్లకు అగపడతాయి. ఇలా కనబడడమే సరుకుల  మార్మికత.

సమాజంలో ఎవరికివారు ఇతరులతో సంబంధం లేకుండా వేర్వేరు  వస్తువులు ఉత్పత్తి చేస్తారు. ఒకరు దారం తీస్తారు. మరొకరు బట్ట నేస్తారు. ఇంకొకరు కుండలు చేస్తారు. వేరొకరు నాగళ్ళు చెక్కుతారు. ఇలా శ్రమ విభజన వుంటుంది. ఒకరివి ఒకరికి అవసరం. కనుక ఆయా వ్యక్తులు సంబంధంలోకి వస్తారు. అయితే ఉత్పత్తి జరిగేటప్పుడు కాదు. వస్తువులు తయారయ్యాక మార్కెట్లో కలుస్తారు. మారకాలు జరుగుతాయి.
నాగలికీ, 5 కుండలకీ మారకం జరిగిందనుకుందాం.ఇది వ్యక్తులమధ్య సామాజిక సంబంధం.కాని ఉత్పత్తిదారులకి అది నాగలికీ,కుండలకీ మధ్య సంబంధంగా కనబడుతుంది.నాగలి చెయ్యడానికి పట్టిన స్రమకాలం, కుండ చెయ్యడానికి పట్టిన శ్రమ కాలానికి 5 రెట్లు. వాటిని చేసిన శ్రమలు భిన్నమైనప్పటికీ, అనిర్దిష్ట మానవశ్రమ గా వాటిలో ఉన్నది ఒకేరకమైనది.కనుక భిన్న పరిమాణాల్లో సమానమవుతాయి. మారతాయి.
అయితే అన్ని రకాల శ్రమలు అనిర్దిష్టమానవ శ్రమగా ఒకటే అనేవిషయం ఉత్పాదకులు నేరుగా గ్రహించలేరు. మారుతున్నది సరుకులు కనుక వాటి విలువలు సమానమైనట్లు భావిస్తారు. నాగలివిలువ  కుండవిలువకి 5 రెట్లు అనీ,వాటికి స్వతహాగా విలువ వున్నదనీ అనిపిస్తుంది. మారకం ఆ విలువల వల్ల  జరిగినట్లుంది. వ్యక్తుల సామాజిక సంబంధాలు వస్తువుల మధ్య సామాజిక సంబంధాలుగా వాళ్లకి అగపడతాయి. ఇలా కనబడడమే సరుకుల  మార్మికత.  
************

జర్మన్ భాషలో Fetischcharakter అనేమాట ఉపయోగించాడు మార్క్స్. ఇంగ్లిష్ అనువాదకులు  fetishism అనీ, fetishistic character తర్జుమా చేశారు. తెలుగులో సంకేతారాధన అనీ, భూతశక్తి అనీ, సరుకుల పూజ అనీ, మాయ అనీ అన్నారు. పేరు ఏదయినా ఇదొక భావన (concept). దీనికి నిఘంటువులో వుండే అర్ధం సరిపోదు.పారిభాషిక పదం కనుక ఇక్కడ  ప్రత్యేకార్ధం వుంటుంది.
ఫెటిషిజం  అంటే నిఘంటువు అర్ధం:
ఒక వస్తువుకి అతీత శక్తులు ఉన్నాయనుకొనో , ఆవస్తువుని ఏదో మానవాతీత శక్తి ఆవహించిందనుకొనో దాన్ని పూజించడం. తాయెత్తులు, జ్వరం తాళ్ళు , వశీకరణ ఉంగరాలు మొదలయినవి..చెట్టుకి ముడుపుగాడితే  కోరికలు తీరతాయి అనుకోవడం  . ఇలాంటివి.
మార్క్స్ వాడిన అర్ధం:
“సరుకులో మానవ శ్రమ యొక్క సామాజిక స్వభావం వాళ్లకి వాళ్ళ  ఉత్పాదితాల  మీద ముద్రించిన వస్తుగత స్వభావంగా కనిపిస్తుంది.అంటే,ఉత్పాదితాల కున్న వస్తుగత ధర్మంగా కనిపిస్తుంది;మొత్తం శ్రమతో వాళ్ళ సంబంధం  వాళ్ళ వాళ్ళ మధ్య సంబంధంగా కాకుండా, వాళ్ళ శ్రమ ఉత్పాదితాల మధ్య సామాజిక సంబంధంగా కనబడుతుంది.”-
“మనుషుల మధ్య సామాజిక సంబంధం వాళ్ళ దృష్టిలో వస్తువుల మధ్య సంబంధం రూపం తీసుకుంటుంది .”
“దీన్నే నేను Fetishism అంటాను.” –అన్నాడు.
***************

ఇదేదో పైపై విషయం కాదు. మార్క్స్ సిద్ధాంతపునాదికి ఒక  కీలకమైన విషయం. ఆయన ఆర్ధక సంక్షోభ భావనతో నేరుగా ముడివడి వున్నఅంశం.సందర్భం వచ్చినప్పుడు ఆవిషయం లోతుగా పరిశీలించవచ్చు.
ఈ భావన కాపిటల్ ౩ సంపుటాల్లోనూ,అదనపు విలువ సిద్ధాంతాలలోనూ  ఉంటుంది.
మార్మికత అనేది భ్రమ కాదు. ఉనికిలో వున్నవిషయం  కనుకనే మార్మికత అనేది  చైతన్యంలో చేరుతుంది.ఈ ‘సామాజిక ఉనికి’ సరుకు ఉత్పత్తి, సరుకు ఉత్పత్తి మాత్రమే. ”అవి నిజంగా ఎలాగో అలాగే,   (as what they really are)అంటే  మనుషుల మధ్య పాదార్ధిక సంబందాలుగానూ, వస్తువుల మధ్య సామాజిక సంబందాలుగానూ కనబడతాయి.”-78
నిజానికి ఏవస్తువుకీ స్వతస్సిద్ధంగా విలువ ఉండదు. కాని సరుకులకి స్వయం సిద్ధంగా  విలువ ఉన్నట్లు కనబడుతుంది. ఇదే  మార్మికత.
సరుకులుగా ఉత్పత్తి అయ్యీఅవగానే శ్రమ ఉత్పాదితాలకు ఇది అంటుకుంటుంది.
సరుకుల ఉత్పత్తి అభివృద్ధితోపాటు ఇదీ వృద్ధవుతుంది. 
డబ్బు అమల్లోకి రాగానే  సరకుల మార్మికత, డబ్బు మార్మికత రూపం తీసుకుంటుంది.బంగారంతో ఎవస్తువునైనా కొనవచ్చు. ప్రజల దృష్టికి ఇది బంగారానికున్న సహజ లక్షణంగా అగపడుతుంది. కాని నిజానికది సామాజిక సంబంధాల వాళ్ళ ఏర్పడింది. సామాజిక లక్షణం.
సరుకుల ఉత్పత్తి కొనసాగినంతకాలమూ సరుకుల మార్మికత సాగుతుంది. సరుకుల ఉత్పత్తి అంతరిస్తేనే మార్మికత అంతర్ధానం  అవుతుంది.

**************
సరుకుల  ఉత్పత్తి
సరుకు ఉపయోగపువిలువ, విలువల సమ్మేళనం. రైతు ధాన్యం పండించి వాడు కోవచ్చు, మరొకడు పీటలు చేసి ఉపయోగించు కోవచ్చు అలా ఎవరు చేసినవి వారో,కుటుంబ సభ్యులో ఉపయోగించుకుంటే అవి ఉపయోగపు విలువలు. విలువలు కావు. ఇతరులకు మారకం లేకుండా వాడుకోడానికి చేసి ఇచ్చిన వస్తువులు కూడా విలువలు కావు. కనుక అవేవీ  సరుకులు కావు.
స్వీయ ఉపయోగార్ధం ఉత్పత్తిచేసిన వస్తువులు కేవలం ఉపయోగపు విలువలు.
ఇతరులకోసం  అంటే సమాజంకోసం తయారుచేసి వాటిని  వస్తువులతోనో, డబ్బుతోనో మారకం చేస్తే అవి విలువలు. ఉపయోగపు విలువా విలువా కలసినవి.కనుక  అవి సరుకులు.
స్వీయ ఉపయోగార్ధం కాకుండా, మారకం కోసం ఉత్పత్తి చెయ్యడమే సరుకుల ఉత్పత్తి.
తాను  చేసుకున్న వస్తువులను మాత్రమే వాడుకున్న కాలం ఉన్నమాట నిజమే. కాని అదిపోయి దీర్ఘకాలం  గడిచింది. పైగాఅలాంటి పరిస్థితుల్లో, ఒకరు చేసినవి మరోకరు వాడుకోక తప్పదు. అంటే, ఒకరి శ్రమని  ఒకరు ఉపయోగించుకుంటారు. వ్యష్టి శ్రమ సామాజికం అవుతుంది. ప్రతి మనిషి శ్రమా సామాజిక శ్రమ మొత్తంలో చిన్న  భాగం అవుతుంది.  ఎవరి శ్రమ ఉత్పాదితాలు వారివే. కనక మరోకరి శ్రమ ఉత్పాదితంతో మారకం చేసుకుంటారు.  ఇది వ్యక్తులమధ్య సామాజిక సంబంధం. అయినా వాళ్లకి  అది వస్తువుల మధ్య సామాజిక సంబంధంగా కనబడుతుంది. ఇలా కనబడదాన్నే మార్క్స్ మార్మికత అంటాడు.
ఒకతను మంచాలు  చేస్తాడు. మరొకతను నులక పేనుతాడు. మంచం చేసిన వానికి నులక కావాలి. నులక పేనిన వానికి మంచం కావాలి. మార్కెట్ కొచ్చి నప్పుడు మారకం చేసుకుంటారు. దర్జీ చొక్కాలు కుడతాడు. నేతగాడు శాలువాలు నేస్తాడు. నేతగాడికి చొక్కా కావాలి. దర్జీకి  శాలువా అవసరంలేదు. కనుక నేతగాడు సలువాలు వేరేవారికి అమ్మి ఆడబబ్బులోనించి  కొంతిచ్చి చొక్కా కొనుక్కుంటాడు. మిగిలిన డబ్బుతో కావలసినవి కొంటాడు. అలాగే దర్జీ చొక్కాలు అమ్మి వచ్చిన డబ్బు బెట్టి అవసరమైనవి కొనుక్కుంటాడు.
కనుక వాళ్లకి వాళ్ళ మధ్య సంబంధాలుగా కాకుండా, సరుకులకీ సరుకులకీ  మధ్య సంబంధంగా, వస్తువుల మధ్య సంబంధంగా కనబడుతుంది. ఇదే శ్రమ ఉత్పాదితం సరుకు రూపం ఎత్తగానే దానికి అంటుకునే మార్మికత.
అందువల్లమార్మికత సరుకుల ఉత్పత్తి నించి విడదీయ జాలనిది.
సరుకు ఉత్పత్తితోనే మార్మికత తలెత్తిందని స్పష్టం చేశాడు.
***************
సరుకు కాగానే మార్మికత ఎక్కడనించి  వస్తుంది? 
పైకి సరుకు తేలికగా తెలిసేదే అనిపిస్తుంది. తీరా విశ్లేషిస్తే, అదేదో మార్మికమైనదిగా, నిగూఢమైనదిగా తేలుతుంది. సరుకు ఉపయోగపు విలువా, విలువా అని తెలుసు. సరుకు మార్మిక స్వభావం ఎందులో ఉంది?
A. ఉపయోగపు విలువలో ఉన్నదా?
సరుకు ఉపయోగపు విలువ అయినమేరకు
1.అది తన ధర్మాల ద్వారా మనిషి అవసరాలను తీరుస్తుంది.
2.ఆ ధర్మాలు మానవ శ్రమ వల్ల ఏర్పడినవి .
ఉదాహరణ:అడ్డం కట్టుకోవాలంటే, తడిక అవసరం. నీళ్ళు చేదాలంటే చేంతాడు కావాలి. అవి రెండూ రెండు వేర్వేరు  అవసరాలను తీరుస్తాయి. రెండూ మానవ శ్రమ వల్ల తయారైనవే.
ప్రకృతిలో లభించిన వెదురు బొంగులు చీల్చి తడిక అల్లుతారు. నారతో చేంతాడు పేనుతారు.అంటే, ప్రకృతి ఉత్పాదితాలకు(బొంగులు,నార) మనిషి తన శ్రమను జోడించి వాటి రూపాలను మారుస్తాడు.ఇది స్పష్టమే. మనిషి ప్రకృతి లో దొరికే వస్తువుని తన శ్రమతో ఉపయోగపడే  వస్తువుగా మారుస్తాడు. ఈ విషయం తలియడంలో చిక్కేమీ లేదు.
“ప్రకృతి కొయ్యని సమకూరుస్తుంది. మనిషి తన శ్రమతో దాన్ని ముక్కలుగా కోసి తనకు ఉపయోగపడే టేబుల్ చేస్తాడు . టేబుల్ గా చెయ్యడం వల్ల కొయ్య రూపం మారింది. అయినా, అది కొయ్యగానే ఉంటుంది.”
అందువల్ల సరుకు ఉపయోగపు విలువకు సంబంధించి గ్రహించలేనిది ఏదీ లేదు. ఇందులో నిగూఢత లేనే లేదు. ప్రతిదీ స్పష్టంఅయినదే, ఇంద్రియగ్రాహ్యమైనదే. కనుక సరుకు మార్మికత ఉపయోగపు విలువలో లేదు.
B.పోనీ  విలువని నిర్ణయించే అంశాల్లో ఉన్నదా? అంటే లేదంటాడు.
ఎందు కంటే, మొదటిది, ప్రయోజనకర శ్రమలు భిన్నమైనవే,అయినప్పటికీ అవన్నీ మనిషి భౌతిక చర్యలే, అలాంటి  ప్రతి చర్యా ,దాని రూపం ఎదయినకావచ్చు,సారంశం లో  మనిషి మెదడూ, నరాలూ కండరాలూ వగయిరాల వ్యయమే.
రెండు, విలువ పరిమాణాన్ని నిర్ణయించేది ఆశ్రమ వ్యయ వ్యవధి లేక శ్రమ పరిమాణం. దీనికి సంబంధించి గుణానికీ, పరిమాణానికీ తేడా ఉన్నదనేది స్పష్టమే. అన్ని సమాజాల్లోనూ జీవనాధార సాధనాలని ఉత్పత్తి చేసేందుకు పట్టే శ్రమ కాలం పట్ల మనుషులకు ఆసక్తి ఉంది. అయితే అన్ని అభివృద్ధి దశల్లో ఒకే స్థాయిలో కాదు కాక పోయినా.
చివరగా, మనుషులు ఒకరికోరకొకరు పనిచేస్తుంటే, వాళ్ళ శ్రమ సామాజికరూపం తీసుకుంటుంది.
ఇవన్నీ స్పష్టంగా బోధపడేవే. అన్ని సమాజాల్లోనూ ఉన్నవే.
“విలువ నిర్ణాయకాల సారం నించి కూడా మార్మికత ఉత్పన్నం కాదు” అంటాడు. సరుకుల మార్మిక స్వభావం వాటి ఉపయోగపు విలువనుండి  పుట్టలేదు, విలువను నిర్ణయించే అంశాల నుండీ పుట్టలేదు.
C. కావలసినవన్నీ తయారుచేసుకుని తామే  వాడుకున్న కాలం ఉంది, గాని అది ఏనాడో పోయింది. ఒకరుచేసినవి ఒకరు ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకరి శ్రమను మరొకరు పరస్పరం వాడుకోవడం అవసరమయింది. శ్రమ సామాజికం అయింది. ఉత్పత్తిదారుల మధ్య సంబందాలు ఉండి  తీరాలి.
ఇందులోనూ మార్మికత లేదు.
మార్మికత శ్రమ విభజననుండి తలెత్తిందా?అంటే అదీ కాదు. సరుకుల ఉత్పత్తి లేకముందు  కూడా శ్రమవిభజన ఉంది. దీన్నిబట్టి, మార్మికత శ్రమ విభజననుండి తలెత్తలేదని స్పష్టమవుతుంది.
***************
మరి ఈ మార్మికత ఎక్కడ నించి పుట్టింది ?
”శ్రమ ఉత్పాదితం సరుకు రూపం తీసుకోగానే దానికి మార్మిక స్వభావం ఎక్కడ నించి వస్తుంది? ” అని ప్రశ్నించి ,
“స్పష్టంగా సరుకు రూపం నించే” అంటాడు.
“అయితే ఆ టేబుల్ సరుకుగా వచ్చిందా, అదేదో ఇంద్రియాతీతమైన వస్తువుగా అయిపోతుంది. కాళ్ళ మీద  నిలబడడమేకాదు,ఇతర సరుకులతో సంబంధంలో తలమీదా  నిలబడుతుంది “అంటాడు.
విశ్లేషణ లో తేలిన విషయాలు సరుకు ఉత్పత్తిదారులకు వేరేవిధంగా కనబడతాయి.
అన్ని రకాల మానవ శ్రమలూ సమానమే,అనే విషయం విశ్లేషణలో తేలింది. అయితే అది  వస్తుగతంగా ఆశ్రమల ఉత్పాదితాలన్నీ విలువలు కావడం గా వ్యక్తం అవుతుంది. సరుకులుగా మార్కెట్ కి వచ్చాక అవన్నీ విలువలు. కనుక గుణాత్మకంగా సమానమైనవి. విశ్లేషణలో అన్నిరకాల శ్రమలూ సమానమే అని తేలిన విషయం మార్కెట్లో అన్ని సరుకులూ విలువలుగా సమానం అని వ్యక్తమవుతుంది. సరుకు ఉత్పత్తి దారులకు అలాగే తెలుస్తుంది.
శ్రమ శక్తి వ్యయానికి కొలబద్ద శ్రమ శక్తి వ్యవధి.అంటే, ఎంత సేపు ఆ శ్రమ జరిగింది?అనేది. అయితే అది వస్తుగతంగా శ్రమ ఉత్పాదితాల విలువ  పరిమాణం రూపం తీసుకుంటుంది. ఉదాహరణకి,టేబుల్ తయారీకి 4 గంటల శ్రమ పడితే, దాని విలువ పరిమాణం  200 రూపాయలుగా వ్యక్తం అవుతుంది.
ఒకరికొరకొకరు శ్రమ చెయ్యడంలో  శ్రమ సామాజిక స్వభావం ఉంటుంది. అయితే ఇక్కడ ఉత్పత్తిదారుల సామాజిక  సంబంధాలు వాళ్ళ ఉత్పాదితాల మధ్య సంబంధాల రూపం తీసుకుంటాయి.
సరుకు అందువల్ల నిగూఢమైన వస్తువు: సరుకులో మానవ శ్రమ యొక్క సామాజిక స్వభావం వాళ్లకి వాళ్ళ  ఉత్పాదితాల  మీద ముద్రించిన వస్తుగత స్వభావంగా కనిపిస్తుంది.అంటే,ఉత్పాదితాల కున్న వస్తుగత ధర్మంగా కనిపిస్తుంది;మొత్తం శ్రమతో వాళ్ళ సంబంధం  వాళ్ళ వాళ్ళ మధ్య సంబంధంగా కాకుండా, వాళ్ళ శ్రమ ఉత్పాదితాల మధ్య సామాజిక సంబంధంగా కనబడుతుంది.” శ్రమ ఉత్పాదితాలు సరుకులయ్యేది ఈ కారణంగానే.” సరుకులు సామాజిక వస్తువులు, వేటి  లక్షణాలయితే ఏక కాలంలో గోచరంగానూ అ గోచరంగానూ ఉంటాయో ఆ సామాజిక వస్తువులు, సరుకులు.
అదే విధంగా ఒక వస్తువునుంచి  వచ్చే కాంతి మన కంటి నరంయొక్క ఉద్రిక్తత గా మనకి తట్టదు ; కంటి బయట వున్న దేనిదో వస్తుగత రూపంగా తడుతుంది.
అయితే చూడడంలో ప్రతి సందర్భంలోనూ కాంతి ఒక వస్తువు నించి  మరొక వస్తువుకు అంటే, బయటవున్న వస్తువు నించి కంటికి ప్రసరిస్తుంది. ఇక్కడ భౌతిక వస్తువుల మధ్య భౌతిక సంబంధం వున్నది. అయితే సరుకుల విషయం వేరు. సరుకులుగా వస్తువుల మనుగడా, వాటిపై సరుకులముద్రవేసే శ్రమ ఉత్పాదితాల విలువ సంబంధమూ, వాటి భౌతిక ధర్మాలకు సంబంధించినవి కానే కావు. మానవుల మధ్య నిర్దిష్టమైన సామాజిక సంబంధం ఉంది. వాళ్ళ దృష్టికి వస్తువులమధ్య సంబంధం రూపాన్ని(విచిత్రమైన రూపాన్ని) తీసుకునే సామాజిక సంబంధం అది.
దీనికి పోలిక కావాలంటే మత  ప్రపంచంలోకి పోవాల్సిందే. అందులో మనిషి మెదడు సృష్టించిన వాళ్ళు ప్రాణం వున్న స్వతంత్ర వ్యక్తులుగా కనబడతారు.ఒకరితో ఒకరు సంబంధంలోకి వస్తారు. అంతే కాదు, మానవ జాతితో కూడా సంబంధంలోకొస్తారు.
అలాగే సరుకుల ప్రపంచంలో మనిషి చేతులతో చేసిన సరుకులు కూడా. సరుకులుగా ఉత్పత్తి అయ్యీ కాగానే శ్రమ ఉత్పాదితాలకు ఈ మార్మికత  అంటుకుంటుంది. అందువల్ల అది సరుకుల ఉత్పత్తి నించి విడివడదు. మార్మికతకీ సరుకుల ఉత్పత్తికీ విడగొట్టలేని సంబంధం ఉంది.

సరుకుల మార్మికతకి  మూలం సరుకుల్ని ఉత్పత్తి చేసిన శ్రమ యొక్క ప్రత్యేక సామాజిక స్వభావంలో ఉంది-అని ఇప్పటికే మన విశ్లేషణ తేల్చింది.కాపిటల్.1.77
ఒకరితో ఒకరు సంబంధం లేకుండా విడివిడిగా ఉత్పత్తిచేసే ప్రైవేటు వ్యక్తుల,లేక బృందాల శ్రమ ఉత్పాదితాలు అయినందువల్లే ప్రయోజనకర వస్తువులు సరుకులవుతాయి. అందరు  ప్రైవేటు వ్యక్తుల శ్రమ మొత్తం కలిసి  సమాజపు శ్రమ అవుతుంది. ఉత్పత్తిదారులు వాళ్ళ వాళ్ళ ఉత్పాదితాల్ని మారకం చేసుకునేదాకా ఒకరితో ఒకరు సంబంధంలోకి రారు. ఆకారణంగా ప్రతి ఉత్పత్తిదారుని శ్రమ యొక్కవిశిష్ట  సామాజిక స్వభావం మారకంలో తప్ప బయట పడదు. వ్యక్తి శ్రమ సమాజ శ్రమలో భాగంగా ఎప్పుడు తెలుస్తుందంటే, మారకచర్య ప్రత్యక్షంగా ఉత్పాదితాల మధ్యా, పరోక్షంగా వాటిద్వారా ఉత్పాదకుల మధ్యా  ఏర్పరచే సంబంధాల ద్వారా మాత్రమే నిర్ధారణవుతుంది. అందువల్ల ఆవుత్పాదకులకి ఒకరి శ్రమని మిగతా వారి శ్రమతో కలిపే సంబంధాలు, వ్యక్తుల మధ్య ప్రత్యక్ష  సామాజిక సంబంధాలుగా కనబడవు. అవి నిజంగా ఎలాగో అలాగే, అంటే  మనుషుల మధ్య పాదార్ధిక సంబందాలుగానూ, వస్తువుల మధ్య సామాజిక సంబందాలుగానూ కనబడతాయి. మారకం అయినందువల్లనే, ప్రయోజనకర వస్తువులుగా వాటి వివిధ రూపాలకు భిన్నంగా , శ్రమ ఉత్పాదితాలు విలువలుగా ఒకేరకమైన సామాజిక హోదా ని పొందుతాయి. ఉపయోగపు విలువగానూ,విలువగానూ ఒక ఉత్పాదితం విభజన ఎప్పుడు ముఖ్యం అవుతుందంటే, ప్రయోజనకర వస్తువులు మారకం కోసమే ఉత్పత్తయ్యే స్తాయికి మారకం విస్తరించినప్పుడు, విలువలుగా వాటి స్వభావాన్ని ముందుగా ఉత్పత్తిలోనే లెక్కలోకి తీసుతీసుకోవలసి వచ్చినప్పుడు.ఆక్షణం నించీ వ్యక్తి ఉత్పత్తిదారునిశ్రమ సామాజికంగా ద్వంద్వ స్వభావాన్ని సంతరించుకుంటుంది.ఒకవైపు, నిర్దిష్టమైన ప్రయోజనకర శ్రమ గా అది ఒక నిర్దిష్ట సామాజికఅవసరాన్ని తీర్చాలి. ఉదాహరణకి కుండలు చేసే శ్రమ ఒక నిర్దిష్ట ప్రయోజనకర శ్రమ. సమాజానికి కుండలు అవసరం. ఆ అవసరాన్ని ఆశ్రమ తీరుస్తుంది. సామాజిక శ్రమ విభజనలో ఒక శాఖగా తన స్థానాన్ని పొందుతుంది.
మరొకపక్క , అది ఆశ్రమ చేసే వాని వివిధ కోర్కెలనూ తీర్చగలదు. అంటే కుండలకు మారుగా తనకు కావలసిన వస్తువులు తీసుకోగలదు. మిగతా అందరి శ్రమ తోనూ సమాన హోదా సాధిస్తుంది.సమాజ శ్రమలో భాగం అయినట్లు రుజువవుతుంది. భిన్న రకాల శ్రమల సమానత్వం వాటి అసమానత్వాల నించి అనిర్దిష్టీ కరించిన ఫలితం. లేక వాటి ఉమ్మడి విభాజకం  అంటే మానవ శ్రమ శక్తి వ్యయం  లేక అనిర్దిష్ట మానవ శ్రమకి దించడం ద్వారా మాత్రమే  సాధ్యం.  వ్యక్తి  శ్రమ యొక్క సామాజిక ద్వంద్వ స్వభావం అతని మనస్సులో ప్రతిఫలించినప్పుడు అతనికి  ఎలా కనబడుతుంది? రోజువారి అనుభవంలో ఉత్పత్తుల మారకం ద్వారా ఆశ్రమ మీద ముద్రపడిన రూపాలలో మాత్రమే. ఈ విధంగా తన సొంత శ్రమ సమాజానికి ఉపయోగ పడే స్వభావం కలిగివున్నది అనేది ఒక షరతు రూపం తీసుకుంటుంది. ఏమంటే ఉత్పాదితం కేవలం ప్రయోజనకరం అయినది కావడమే కాదు. ఇతరులకు ఉపయోగపడేదై ఉండాలి. అతని ప్రత్యేక శ్రమ అన్ని ఇతర రకాల శ్రమలతో సమానమైనది అనే సామాజిక స్వభావం ఏరూపం తీసుకుంటుందంటే: భౌతికంగా  భిన్నమైన అన్ని శ్రమ ఉత్పాదితాలకూ ఒక ఉమ్మడి లక్షణం ఉంది.అదే విలువ కలిగి వుండడం  కాపిటల్ 1.77-78
మన శ్రమ ఉత్పాదితాల్ని విలువలుగా సంబంధంలో కి తెచ్చామంటే, వాటిలో  ఒకేరకమైన మానవ శ్రమ ఉన్నదని తెలిసి కాదు. అందుకు భిన్నంగా మారకం ద్వారా మన ఉత్పాదితాల్ని సమపరుచు కున్నప్పుడల్లా, ఆచర్యలో వాటికోసం చేసిన భిన్న రకాల శ్రమల్నీ మానవ శ్రమగా సమపరుస్తున్నాం.ఇలా చేస్తున్నామని మనకు తెలియదు, అయినా చేస్తాం.గాలియానీ,  విలువ ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం అన్నాడు. వస్తువుల మధ్య సంబంధంగా వ్యక్తమయ్యే సంబంధం అనేమాటలు కలిపి ఉండాల్సింది అన్నాడు మార్క్స్- కాపిటల్ 1 .79 .
అందువల్ల, విలువ తనేమిటో వర్ణించే చీటీ మొహానికి అంటించుకొని తిరగదు. పైగా విలువే ప్రతి ఉత్పాదితాన్నీ  సామాజిక చిత్రలిపిగా (social hieroglyphic)  మారుస్తుంది. ఆతర్వాత మనసొంత సామాజిక ఉత్పాదితాల వెనక వున్నరహస్యాన్ని గ్రహించడానికి,  దాన్నిచదివే  ప్రయత్నం చేస్తాం.డీకోడ్ (decode) చేస్తాం.
*************.
విలువ అనేది పైకి తలిసేది కాదు,కనుక విలువ శాస్త్రీయ విశ్లేషణకు వస్తువయింది.
ఆర్ధికవేత్తలు శ్రమ నించి విలువ వస్తుంది అని కనుక్కున్నారు.ఇదొక గొప్ప ఆవిష్కరణ. అయితే అంతకు ముందు లాగానేఈ ఆవిష్కరణ తర్వాత కూడా శ్రమ సామాజిక స్వభావం శ్రమ ఉత్పాదితాల వస్తుగత స్వభావంగానే కనిపించడం ఆగలేదు.అలా  కనిపించేట్లు చేసే మంచుపొరని ఈ ఆవిష్కరణ తొలగించలేక పోయింది.
ఎందువల్ల?
సరుకుల ఉత్పత్తి అనే ప్రత్యేక రూపాన్ని పరిశీలిస్తున్నాం.ఎవరికీ వారు స్వతంత్రంగా ఉత్పత్తిచేస్తారు.ఈ ప్రైవేట్ శ్రమ యొక్క సామాజిక స్వభావం ప్రతిశ్రమా మానవ శ్రమగా సమానమే అనేదాంట్లో  ఉంటుంది. అయితే ఇది ఉత్పాదితంలో విలువ రూపం తీసుకుంటుంది. ఈ వాస్తవం  ఉత్పత్తిదారులకు నిత్యమైనట్లూ, సత్యమైనట్లూ కనబడుతుంది- ఈ ఆవిష్కరణ తర్వాతకూడా. ఈ ఆవిష్కరణమార్మికత పట్టుని  సడలించలేక పోయింది.ఎలాగంటే, “గాలి(air)లో  భాగాలైన  చాలా వాయువులని (gases)సైన్స్ కనుగొన్నాక  కూడా, దానికదిగా వాతావరణం మారకుండా ఉన్నట్లే.”
మారకం చేసుకునేటప్పుడు ఉత్పత్తిదారుల ఆలోచనంతా తమ సరుకుకి ఇతర సరుకులు ఎంత పరిమాణంలో వస్తాయనేదానిమీద ఉంటుంది. ఏ నిష్పత్తిలో ఆ ఉత్పదితాలు మారగలగుతాయి?
ఈ మారక నిష్పత్తులు అలవాటువల్ల ఒకింత స్తిరత్వంపొందుతాయి. అప్పుడు ఆనిష్పత్తులు ఉత్పాదితాల స్వభావం నించే వచ్చినట్లు కనబడతాయి. ఉదాహరణకి ఒక టన్ను ఇనుమూ రెండు ఔన్సుల బంగారమూ ప్రకృతి సిద్ధంగానే సమాన విలువ గలవిగా కనిపిస్తాయి. ఇది ఎంత సహజంగా కనిపిస్తుందంటే: బంగారమూ, ఇనుమూ  వేర్వేరు భౌతిక, రసాయన ధర్మాలు కలిగి ఉన్నప్పటికీ, ఒక పౌను బంగారమూ, ఒక పౌను ఇనుమూ సమాన బరువుని కలిగివున్నంత సహజంగా . విలువ ఉండడం అనే స్వభావం ఒకసారి సరుకులమీద పడితే, ఆస్వభావం విలువ పరిమాణాలుగా చర్యలు ప్రతి చర్యలు జరగడం మూలంగా స్థిరపడుతుంది . ఈ పరిమాణాలు మారుతుంటాయి. ఉత్పాదకుల సంకల్పంతోగానీ,ముందు చూపుతో గానీ, చర్యతోగానీ ఎటువంటి సంబంధమూ లేకుండానే మారుతుంటాయి. వాళ్లకి వాళ్ళ సామాజిక చర్య వస్తువుల చర్య రూపం తీసుకుంటుంది. ఉత్పత్తిదారుల చేత పాలించ బడే బదులు, ఆసరుకులే వాళ్ళని పాలిస్తున్నట్లుంటుంది.
మార్కెట్లో సరుకులు యజమాని చెప్పినట్లుండవు. యధేచ్చగా వ్యవహరిస్తాయి. ఒకరోజు ఒక కలం 5 పెన్సిళ్ళతో మారవచ్చు. ఇంకోరోజు 8 రావచ్చు. మరో రోజు 3 రావచ్చు. ఒకసారి అసలు మారక పోవచ్చు.మార్కెట్లో నడిచే ఈ యాదృచ్చికమైన పరిస్థితి మూలంగా  సరుకుకి స్వయంసిద్ధంగా  విలువ వున్నదనిపిస్తుంది. ఉత్పత్తి యొక్క సామాజిక సంబంధాలను ఉత్పాదకులు గ్రహించరు.వస్తువులమధ్య సంబంధాలను మాత్రమే  గమనిస్తారు. వస్తువుల మధ్య సంబంధాల మాటున వ్యక్తుల సామాజిక సంబంధాలు మరుగున పడిపోతాయి.
************
ఒకరితో ఒకరు సంబంధం లేకుండా,స్వతంత్రంగా,అయినా అభివృద్ధిచెందిన సామాజిక శ్రమ విభజన శాఖలుగా, నిర్వహించబడే అన్ని రకాల ప్రైవేటు శ్రమలూ సమాజానికి కావలసినట్లుగా పరిమాణాత్మక నిష్పత్తులుగా దిగుతాయి. ఎందుకు? అన్ని యాదృచ్చికమైన,ఒడిదుడుకులున్న  సరుకుల మారక సంబంధాల నడుమ వాటి ఉత్పత్తికి పట్టిన సామాజికంగా అవసరమైన శ్రమ కాలం శాసించగల ప్రకృతి నియమం లాగా బలవంతంగా నిర్ధారణ అవుతుంది. అదే విధంగా ఒక ఇల్లు మన కళ్ళెదుట  కూలినప్పుడు భూమ్యాకర్షణ నియమం నిరూపితమవుతుంది. అందువల్ల శ్రమ కాలం ద్వారా శ్రమ పరిమాణం నిర్ణయం అనేది ఒక రహస్యం.సరుకుల సాపేక్ష విలువలలో పైకి కనపడే నిర్ణయం వెనక దాగిన రహస్యం.  దాని ఆవిష్కరణ ఉత్పాదితాల విలువ పరిమాణ నిర్ణయం  కేవలం యాదృచ్చికమైనదిగా కనబడదాన్ని పూర్తిగా పోగొట్టినప్పటికీ, ఆనిర్ణయం జరిగే విధానాన్ని ఏ విధంగానూ మార్చలేదు.
సమాజ జీవిత రూపాల గురించిన మనిషి ఆలోచనలూ, తత్ఫలితంగా ఆరూపాలగురించిన మనిషి  శాస్త్రీయ విశ్లేషణా వాస్తవ చారిత్రిక అభివృద్ధికి నేరుగా వ్యతిరేక దిశలో సాగుతాయి. అతనిముందు సిద్ధంగావున్న అభివృద్ధి ప్రక్రియ యొక్క ఫలితాలతో అతను మొదలుబెడతాడు.
 ఉత్పాదితాలను సరుకులుగా ముద్రవేసే లక్షణాల స్థిరీకరణ సరుకుల చలామణీ కి ముందుగా వుండి తీరాలి. ఆలక్షణాలు సహజమైన,స్వయం స్పష్టమైన సమాజ జీవిత రూపాలయొక్క స్థిరత్వాన్ని అప్పటికే పొందాయి.మనిషి వాటి చారిత్రక స్వభావాన్నిగ్రహించే ప్రయత్నం చెయ్యకుండా, వాటి అర్ధాన్ని తెలుసుకునే యత్నం చేశాడు. ఎందుకంటే,అతని దృష్టిలో ఆలక్షణాలు మారేవి కావు. కనుకనే వాటి అర్ధం వైపు దృష్టి పెట్టాడు. ఫలితంగా  సరుకుల ధరల విశ్లేషణ ఒక్కటే విలువ పరిమాణం యొక్క నిర్ధారణకు లీడ్ చేసింది.అన్ని సరుకులూ డబ్బులో ఉమ్మడిగా వ్యక్తం కావడం విలువలుగా వాటి లక్షణాల  నిర్ధారణకు లీడ్ చేసింది. ప్రైవేట్ శ్రమ యొక్క సామాజిక స్వభావాన్నీ,వ్యష్టి ఉత్పత్తిదారుల మధ్య సామాజిక సంబందాల్నీ  బయటపెట్టే బదులు, దాచి పెట్టింది , సరుకుల అంతిమ రూపమైన డబ్బు రూపమే.  కోట్లో బూట్లో బట్టతో, అది అనిర్దిష్ట మానవ శ్రమ అవతారం అయినందువల్ల,  సంబంధంలో ఉన్నాయని అన్నప్పుడు అసంబద్ధత  స్వయంస్పష్టమే . అయినాగాని,బూట్ల, కోట్ల ఉత్పత్తిదారులు వాళ్ళ వస్తువుల్ని సార్వత్రిక సమానకంగా బట్టతో పో ల్చినప్పుడు,లేక  బంగారంతోనో, వెండితోనో పోల్చినప్పుడు, అవి వారి సొంత ప్రైవేట్ శ్రమకీ,సమాజం యొక్క శ్రమకీ ఉన్న సంబంధాన్ని అదే అసంబద్ధ రూపంలో వ్యక్తం చేస్తాయి
బూర్జువా ఎకానమీ యొక్క భావాభివర్గాలు అటువంటి(అసంబద్ధ) రూపాలతో ఉంటాయి. అవి సమాజ అంగీకారంతోచారిత్రకంగా నిర్దిష్ట మైన ఒక ఉత్పత్తి అంటే సరుకుల ఉత్పత్తి  విధానం యొక్క పరిస్థితుల్నీ,సంబందాల్నీవ్యక్త పరుస్తాయి. శ్రమ ఉత్పాదితాలు సరుకులు గా ఉన్నంతకాలం వాటిని  ఆవహించి ఉండే సరుకుల మొత్తం నిగూఢతా, ఇంద్రజాలం ఇతర ఉత్పత్తి విధానాలను చేరగానే అదృశ్యం అవుతాయి.
***********
మార్మికత లేని ఉత్పత్తి గురించి చెప్పడానికి మార్క్స్ రాబిన్సన్ క్రూసో ని ఉదాహరిస్తాడు.
1.రాబిన్సన్ ఉత్పత్తి.ఒక దీవిలో ఒక్కడే చిక్కుకుంటాడు.ఇంకెవ్వరూ ఉండరు. అతనికి ఎక్కువ కోర్కెలు కాపోయినా, కొన్నైనా తీర్చుకోవాలి. ఒంటరివాడు గనక తన అవసరాలు తీర్చే వస్తువుల్ని తనే ఏర్పరచుకోక తప్పదు.కనక రకరకాల పనులు చేశాడు. ఇల్లు కట్టాడు. చుట్టూ కంచె  వేశాడు. పనిముట్లు,ఫర్నిచర్ చేసుకున్నాడు. జంతువుల్ని వేటాడేవాడు.బార్లీ పండించేవాడు.కుండలు చెయ్యడానికీ,మేకలు పెంచడానికీ అలవాటు పడ్డాడు. బుట్టలల్లాడు.చిన్న పడవ చేసుకున్నాడు.చేపలు పట్టడం అలవరచుకున్నాడు. “ అతని పనిలో ఎంత వైవిధ్యం ఉన్నా,ఆశ్రమ రూపం ఏదయినా అంతా తన ఒక్కడి శ్రమే అని, దాని భిన్న రూపాలేననీ  అతనికి తెలుసు. అవసరాన్ని బట్టి తన కాలాన్నివివిధ పనులకు కేటాయించేవాడు.
ఆతను తన stock-book లో తనవైన  ప్రయోజనకర వస్తువుల జాబితా రాశాడు.వాటి తయారీకి అవసరపడే చర్యల గురించి రాశాడు. నిర్దిష్ట  పరిమాణాల్లో ఆవస్తువుళ తయారీకి సగటున ఎంత సమయం పడుతుందో రాశాడు. రాబిన్సన్ కీ, ఆస్తిఅయిన అతని శ్రమతో తయారుచేసుకున్న  వస్తువులకీ ఉన్న అన్ని సంబంధాలూ చాలా సరళ మైనవి, స్పష్టమైనవి. అయినా ఆసంబంధాలలో విలువ నిర్ణయానికి కావలసిన వన్నీఉన్నాయి
2.అర్ధబానిసల ఉత్పత్తి . రాబిన్సన్ నించి మధ్యయుగాల ఐరోపాకి మరలుతాడు. అక్కడ ఉన్నది స్వతంత్రుడైన వ్యక్తికాడు. అందరూ ఆధారపడినవారే.- అర్ధబానిసలూ-ప్రభువులూ (serfs and lords),సామంతులూ-సామ్రాట్లూ,( vassals and suzerains)సామాన్యుడూ-మతాధికారీ (laymen and clergy). శ్రమా, శ్రమ ఉత్పాదితాలూ వాస్తవ రూపానికి భిన్నమైన రూపాల్ని  తీసుకోవాల్సిన అవసరం లేదు. సామాజిక లావాదేవీల్లో  అవి పనిరూపంలో సేవలు, పనిరూపంలో చెల్లింపులు. సరుకులు  ఉత్పత్తి ఆధారంగా ఉన్న సమాజంలో లాగా కాకుండా, ఇక్కడ శ్రమ యొక్క ప్రత్యేక ప్రాకృతిక రూపం శ్రమ యొక్క తక్షణ సామాజిక రూపం. బలవంతపు శ్రమ సరుకులుత్పత్తి చేసే శ్రమ లాగే కాలం చేత కొలవబడుతుంది; అయితే, తన యజమాని సేవలో వ్యయిస్తున్న శ్రమ నిర్దిష్ట పరిమాణంగల తనసొంత శ్రమ శక్తి  అని ప్రతి అర్ధబానిసకీ తెలుసు.
కార్వే పద్ధతిలో రైతు వారంలో కొంతకాలం(మాటవరసకి) తనపోలంలో పనిచేసుకుంటాడు. మిగిలిన రోజులు యజమాని పొలంలో తన పరికరాలతోనే పనిచేస్తాడు. ఇదంతా స్పష్టంగానే వుంటుంది. మార్మికతేమీ ఉండదు.

“మతాదిపతికి చెల్లించాల్సిన  టితీ ఆయన దీవెనలకన్నా వాస్తవమైనవి” అలాంటప్పుడు ఆ సమాజంలో  భిన్న వర్గాల ప్రజలు పోషించే పాత్రల గురించి మనం ఏమనుకున్నా, శ్రమచెయ్యడంలో వ్యక్తులమధ్య సామాజిక సంబంధాలు ప్రతి సందర్భం లోనూ  వాళ్ళ పరస్పర వ్యక్తిగత సంబంధాలు గానే కనబడతాయి. శ్రమ ఉత్పాదితాల మధ్య సామాజిక సంబంధాల ఆకృతి కింద దాగి ఉండవు.
౩.  పితృస్వామిక రైతు కుటుంబం ఉత్పత్తి .ఇది  ఉమ్మడి శ్రమ కి ఉదాహరణ. ఆ కుటుంబం ఉమ్మడిగా ధాన్యం పండిస్తుంది. పశువులు పోషిస్తుంది. దారం వడుకుతుంది. బట్టలు నేస్తుంది. దుస్తులు కుడుతుంది. ఆ ఉత్పత్తులు ఆకుటుంబం వాడుకుంటుంది. ఆభిన్నమైన వస్తువులన్నీ ఆకుటుంబం శ్రమ ఉత్పత్తులే. కాని కుటుంబ సభ్యులమధ్య అవి సరుకులు కావు. వాటిలో రూపొందిన భిన్న రకాల శ్రమలు –దున్నకం,పశు పెంపకం,వడకడం, నేయ్యడం,కుట్టడం- నేరుగా సామాజిక చర్యలే. ఎందుకంటే, అవి కుటుంబం చర్యలు.సరుకుల ఉత్పత్తి మీద ఆధారపడిన సమాజం లాగా కుటుంబంలో సద్యోజనితంగా వృద్ధయిన శ్రమ విభజన ఉంది. కుటుంబంలో పని పంపిణీ , సభ్యుల యొక్క శ్రమ కాలమూ లింగ, వయో భేదాల్ని బట్టీ ,ఋతువుల తేడాలని బట్టీ ఉంటుంది.ప్రతి సభ్యుని శ్రమ శక్తీ, మొత్తం కుటుంబ శ్రమ శక్తిలో నిర్దిష్ట భాగంగా మాత్రమేఉంటుంది. అందువల్ల,వ్యక్తి  శ్రమ శక్తి వ్యయం దాని వ్యవధి ద్వారా కొలత స్వభావ సిద్ధంగానే శ్రమ యొక్క సామాజిక స్వభావంగా కనబడుతుంది.
4.ఉమ్మడి ఉత్పత్తిసాధనాలున్న సమాజం ఉత్పత్తి. ఇక్కడ  అందరి వ్యక్తుల   శ్రమ శక్తీ సమాజపు శ్రమ శక్తి అనే  చైతన్యంతో అన్వయించ  బడుతుంది. రాబిన్సన్ శ్రమ కున్న లక్షణాలన్నీ ఇక్కడ పునరావృతమవుతాయి.అయితే ఒకొక తేడా ఉంది. అది వ్యక్తిగతం ,ఇది సామాజికం.రాబిన్సన్ ఉత్పత్తి చేసినదంతా పూర్తిగా అతని శ్రమ ఫలితమే,అతని వాడకం కోసమే. మన సమాజపు ఉత్పత్తిఉత్పత్తి అంతా సమాజపు ఉత్పత్తి. అందులో ఒక భాగం కొత్త ఉత్పత్తి సాధనాల కోసం, కనుక అది సామాజికం. అయితే మరొక భాగం సభ్యులు జీవనాదారసాధనాలుగా  వినియోగించు కుంటారు. కనుక ఈ భాగం పంపిణీ అవసరం.
పంపిణీ పధ్ధతి సమాజపు ఉత్పత్తి వ్యవస్థని బట్టీ, ఆ ఉత్పాదకుల చరిత్రకాభివ్రుద్ధి స్థాయిని బట్టీ మారుతుంటుంది.
జీవితావసర వస్తువుల్లో ప్రతి వాని వాటా  అతని శ్రమ కాలాన్ని బట్టి నిర్ణయమవుతుందని అనుకుందాం. అప్పుడు శ్రమకాలం ద్వంద్వ పాత్ర పోషిస్తుంది.జరగవలసిన భిన్న రకాల శ్రమల మధ్య  నిష్పత్తిని సమాజపు వివిధ అవసరాల నిష్పత్తి నీ  ఒక పద్ధతిప్రకారం జరిగే దాని విభజన నిర్వహిస్తుంది.
మరొకవైపు, ఉమ్మడి శ్రమలో ప్రతి వ్యక్తీ చేసిన భాగాన్ని కొలిచేందుకూ, వ్యక్తుల  వినియోగానికి కేటాయించిన ఉత్పాదితం మొత్తంలో అతని వాటా ఎంతో నిర్ణయించేందుకూ  ఉపకరిస్తుంది. వ్యష్టి ఉత్పత్తిదారుల శ్రమతోనూ, ఆ శ్రమ ఉత్పాదితాలతోనూ  వాళ్ళకున్న సామాజిక సంబంధాలు పూర్తిగా సరళ మైనవీ, తేలికగా తెలిసేవీ. ఉత్పత్తికి సంధించే కాదు, పంపిణీకి సంబంధించి కూడా.
మత  ప్రపంచం నిజ ప్రపంచానికి ప్రతిబింబం మాత్రమే.సరుకుల ఉత్పత్తి మీద ఆధారపడ్డ సమాజానికి –ఎందులో అయితే ఉత్పత్తిదారులు తమ ఉత్పాదితాలను సరుకులుగా, విలువలుగా చూడడం ద్వారా, ఒకరితో ఒకరు సంబందాల్లోకి వస్తారో ఆసమాజానికి, అంటే వాళ్ళ ప్రైవేట్ శ్రమని తేడాలేని మానవ శ్రమకి కుదిస్తారో అటువంటి సమాజానికి క్రైస్తవమతం, మరీ ప్రత్యేకించి దాని బూర్జువారూపాలైన  ప్రొటేస్టాంటిజం డీ యిజం మొదలైనవి- సరిగ్గా  సరిపోతాయి. ప్రాచీన ఆసియాటిక్  లాంటి పురాతన ఉత్పత్తి విధానాలలో ఉత్పాదితాలు సరుకులుగా మారడం అందుమూలంగా మనుషులు సరుకుల ఉత్పాదకులు గా మారడం ద్వితీయ స్థానంలో ఉండేది. ప్రాచీన గుంపు సమాజాలు  రద్దుకు చేరువవుతున్నకొద్దీ సరుకుల ఉత్పాదకులు గామారడం పెరిగింది. ప్రాచీన ప్రపంచంలో వ్యాపార జాతులు-ఇంటర్ మున్డియా లో ఉండే ఎపిక్యురస్ యొక్క దైవాల లాగానో, లేక పోలిష్ సమాజంలో మారుమూలల్లో  ఉండే యూదుల  లాగానో- అక్కడక్కడా అరుదుగా మాత్రమే ఉండేవి. ఆప్రాచీన సామాజిక ఉత్పత్తి వ్యవస్థలు ఎంతో  సరళమైనవి, పారదర్శకమైనవి. సులభంగా గ్రహించదానికి వీలైనవి. అవి ఆదిమగణ సమాజంలో మనిషి తన తోటివాళ్ళతో కలిపి ఉంచే  బొడ్డుతాడు కూడా ఊడిపోనప్పుడు, వ్యక్తిగతంగా అభివృద్ధి  పరిపక్వం చెందనప్పుడు  ఏర్పడ్డాయి. లేకపోతే, ప్రత్యక్ష బానిస సంబంధాల్లో ఏర్పడ్డాయి. శ్రమ ఉత్పాదకత తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, ఆకారణంగా,అందుకు తగినట్లుగా   మనిషికీ మనిషికీ మధ్య, మనిషికీ ప్రకృతికీ మధ్య సామాజిక సంబంధాలు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే  అవి ఏర్పడగలవు, మనుగడ సాగించ గలవు. ప్రాచీన కాలంలో ప్రకృతిని పూజించడంలోనూ, ప్రజల మతాలకు సంబంధించిన  ఇతర అంశాలలోనూ  ఈ సంకుచితత్వం ప్రతిబింబిస్తుంది.
నిజ ప్రపంచం యొక్క  మతప్రతిబింబం అదృశ్యం అవగలిగేది ఎప్పుడంటే, దైనందిన జీవితంలో ప్రకృతితోనూ, తోటి మనుషులతోనూ ఉండే ఆచరణాత్మక సంబంధాలు పూర్తిగా అర్ధం అయ్యేట్లుగానూ, తర్కబద్ధంగానూ ఉన్నప్పుడు మాత్రమే ఈమత ప్రతిబింబం అదృశ్యం అవుతుంది.
స్వేచ్చగా కలసిన మనుషులు చేసే ఉత్పత్తిగానూ, ఒక ప్లాన్  ప్రకారం వాళ్ళచే క్రమబద్ధం చెయ్యబడే వరకూ పాదార్ధిక ఉత్పత్తి ప్రక్రియమీద ఆధారపడ్డ సమాజపు జీవన ప్రక్రియ, దాని మార్మిక ముసుగుని తొలగించదు.
రాజకీయ అర్ధశాస్త్రం, అసంపూర్ణంగానే అయినప్పటికీ, విలువనీ, విలువ పరిమాణాన్నీ విశ్లేషించి ఆరూపాల వెనక దాగి ఉన్న దాన్ని కనుక్కున్నది. కాని సాంప్రదాయ అర్ధశాస్త్రం విలువలోకనబడే శ్రమకీ, ఉపయోగపు విలువలోకనబడే శ్రమకీ ఉన్న తేడాని పూర్తి  స్పృహతో, స్పష్టతతో  వ్యక్తం చెయ్యలేదు. అది దాని బలహీనతల్లో ఒకటి. అయితే ఆచరణలో తేడా చూచింది.ఎందుకంటే, శ్రమని ఒకసారి పరిమాణాత్మక అంశం గానూ, మరొకసారి గుణాత్మక అంశం గానూ చూసింది. అయితే వివిధ రకాల శ్రమల్నీకేవలం పరిమాణాత్మకంగా చూసేటప్పుడు, ఆశ్రమల ఏకత్వం ,లేక సమానత ఉంటుంది. ఆకారణంగా ఆశ్రమల్ని అనిర్దిష్ట మానవ శ్రమగా దింపడం అనే అర్ధం ఇమిడి ఉంది. అయితే ఆ అర్ధశాస్త్రానికి ఈ గ్రహింపు ఇసుమంతయినా లేదు.-కాపిటల్ 1.84 ఫుట్ నోట్.

శ్రమ ద్వంద్వ స్వభావం భావన వాళ్లకు లేదు.

రాజకీయ అర్ధశాస్త్రం శ్రమ  దాని ఉత్పాదితపు విలువ చేత ఎందుకు ప్రాతినిధ్యం వహించ బడుతుంది? శ్రమ కాలం  ఆవిలువ పరిమాణం చేత ఎందుకు ప్రాతినిధ్యం వహించ బడుతుంది? అనే ప్రశ్నలు సంధించు కోలేదు.
సరుకుల విశ్లేషణ ద్వారా,ప్రత్యేకించి సరుకుల విలువ విశ్లేషణ ద్వారా సంప్రదాయ అర్ధశాస్త్రం విలువ ఏ  రూపంలో మారకం విలువ అవుతుందో ఆరూపాన్ని కనుక్కోలేక పోయింది. ఆ శాఖకు అత్యుత్తం ప్రతినిధులైన స్మిత్ రికార్డోలు సైతం విలువ రూపాన్ని అప్రధాన విషయంగా, సరుకుల స్వతస్సిద్ధ స్వభావంతో సంబంధం లేని విషయంగా చూశారు.ఇందుకు కారణం  వారు విలువ పరిమాణం మీదనే ధ్యాసపెట్టడం ఒక్కటే కాదు. ఇంకా లోతయినది. శ్రమ ఉత్పాదితపు సరుకురూపం అత్యంత అనిర్దిష్ట మైనది. అంతేకాదు,బూర్జువా సమాజంలో ఉత్పాదితం   తీసుకునే సార్వత్రిక రూపం కూడా. విలువ రూపం ఆవుత్పత్తిని  ప్రత్యేక సామాజిక ఉత్పత్తి గా ముద్ర వేస్తుంది. ఆవిధంగా ఆవుత్పత్తికి దాని ప్రత్యేక చారిత్రిక స్వభావాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు ప్రతి సమాజానికి ఇదే ఉత్పత్తి విధానం శాశ్వతమైనది, ప్రకృతి సిద్ధమైనది అనుకున్నామంటే, విలువరూపపు విశిష్ట లక్షణాన్ని  (differentia specifica) పట్టించుకోము. తత్ఫలితంగా, సరుకు రూపపు విశిష్ట లక్షణాన్నీ పట్టించుకోము. సరుకు రూపపు పరిణామాలైన డబ్బు రూపం, పెట్టుబడి రూపం వగయిరాల విశిష్ట లక్షణాల్ని  పట్టించుకోము. ఆకారణంగా విలువ పరిమాణం కొలతకి శ్రమకాలాన్నిఅంగీకరించిన ఆర్దికవేత్తలే సాధారణ సమానకం యొక్క పరిపూర్ణ రూపం అయిన డబ్బు విషయంలో వింతైన, విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.  
సాంప్రదాయ అర్ధశాస్త్రం అంటే: విలియం పెట్టీ కాలం నించీ బూర్జువా సమాజంలో వాస్తవ ఉత్పత్తి సంబంధాల్ని పరిశోధించిన అర్ధశాస్త్రం. ఇది పైపైన కనబడే అంశాల్ని మాత్రమే చూసే అపభ్రంశ అర్ధ శాస్త్రానికి భిన్నమైనది.శాస్త్రీయ పరిశోధనలో తేలిన విషయాల్ని వదిలిపెట్టి, బూర్జువాల ఉపయోగార్ధం వివరణలు సమకూరుస్తుంది. బూర్జువాల అభిప్రాయాల్ని క్రమబద్ధం చేసి,శాశ్వత సత్యాలుగా ప్రకటిస్తుంది. ఈ పధ్ధతి సాంప్రదాయ అర్ధశాస్త్రం అవలంబించే పద్ధతికి వ్యతిరేకమైనది.     -కాపిటల్ 1.85 ఫుట్ నోట్  

ఈ సూత్రీకరణలు ఒక సామాజిక వ్యవస్థ కి చెందుతాయి. ఏవ్యవస్తలో అయితే ఉత్పత్తి ప్రక్రియ మనిషి అదుపులో ఉండే బదులు  మనిషి మీద తనే పెత్తనం చేస్తుందో ఆ వ్యవస్థకి చెందుతాయి. ఈ సూత్రీకరణలు స్వయం స్పష్ట మైన ప్రకృతి విధించిన ఆవశ్యకత లాగా బూర్జువా మనస్సుకి కనబడుతుంది. అందువల్ల చర్చి ఫాదర్లు క్రైస్తవ మతానికి ముందున్న మతాల్నిఎలా చూశారో  అలాగే  బూర్జువా రూపానికి ముందటి సామాజిక ఉత్పత్తి రూపాల్ని బూర్జువాలు చూశారు.
ఈ ఆర్దికవేత్తలకి ఒకే ఒక పధ్ధతి ఉంది. వారికి రెండురకాల సంస్థలు ఉన్నాయి- సహజమైనవి, కృత్రిమమైనవి.భూస్వామ్యం సంస్తలు కృత్రిమమైనవి, బూర్జువా సంస్తలు సహజమైనవి. ఈ విషయంలో వీళ్ళు మతతత్వవేత్తల వంటి వారే. వాళ్లకి రెండు రకాల మతాలు ఉంటాయి. వాళ్ళది కాని మతం మనుషులు సృష్టించింది, వాళ్ళ మతం ఒక్కటే దైవ సృష్టి.-.-కాపిటల్ 1.85ఫుట్ నోట్2
************
సరుకుల్లో అంతర్గతంగా ఉన్న మార్మికత ఆర్ధిక వేత్తల్ని తప్పుదోవ పట్టించింది. వాళ్ళ మధ్య విసుగు పుట్టించేటంతగా వాదోపవాదాలు నడిచాయి.మారకం విలువ  ఒక వస్తువు మీద జరిగిన శ్రమ పరిమాణాన్ని వ్యక్తంచేసే నిర్దిష్ట సామాజిక సరళి మాత్రమే. ప్రకృతికి దానితో ప్రమేయం లేదు-మారకం నడకని (course ) నిర్ధారించే  విషయంలో లేనట్లే. సరుకుల్ని  నేరుగా మారకం కోసమే ఉత్పత్తిచేసే విధానం బూర్జువా ఉత్పత్తి యొక్క అత్యంత సాధారణ మైన రూపం,పిండ రూపం. అందువల్ల అది చరిత్ర తొలి కాలంలోనే కనబడుతుంది – ఈ రోజుల్లో వున్నంత ప్రబలమైన లక్షణాలతో లేనప్పటికీ. కనుక సరుకు మార్మిక స్వభావాన్ని గమనించడం ఇప్పటికంటే తేలిక.కాని, నిర్దిష్ట రూపాలకి వచ్చేసరికి ఈ సరళంగా కనబడడం కూడా పోతుంది.
డబ్బు వ్యవస్థకి సంబంధించిన భ్రమలు( illusions) ఎక్కడనుండి ఏర్పాడ్డాయి?డబ్బుగా వ్యవరించేటప్పుడు వెండి,బంగారాలు దానికి(డబ్బు వ్యవస్థకి) ఉత్పాదకుల మధ్య సామాజిక సంబంధాలకు ప్రాతినిధ్యం వహించవు, వింత సామాజిక ధర్మాలు కలిగిన ప్రాకృతిక  వస్తువులు మాత్రమే. ఆధునిక అర్ధశాస్త్రం డబ్బు వ్యవస్థని చిన్నచూపు చూస్తుంది. ఏవగించుకుంటుంది. అది పెట్టుబడిని చూసేటప్పుడు దాని మూఢ విశ్వాసం పట్ట పగల్లా,బట్టబయలు కావడంలేదా? కౌలు సమాజం నుంచి కాకుండా, నేల నించి వస్తుంది అనుకున్న ఫిజియోక్రాట్ల భ్రమని అర్ధశాస్త్రం వదిలించుకొని ఎంతకాలం అయింది?

ముందు జరగబోయే దాన్ని ఊహించకుండానే, సరుకు రూపానికి సంబంధించిన మరొక ఉదాహరణతో తృప్తి పడదాం. సరుకులే మాట్లాడ గలిగితే అవి ఇలా చెబుతాయి: మా ఉపయోగపు విలువ మనుషులకి ఆసక్తి కలిగిస్తే కలిగించవచ్చు.వస్తువులుగా అది మాలో భాగం కాదు.వస్తువులుగా మాకు సంబంధించింది మా  విలువే.సరుకులుగా మా మధ్య జరిగే చర్య దీన్ని ధృవపరుస్తుంది. మాలో ఒకదాని దృష్టికి మరొకటి మారకం విలువ తప్ప మరేమీ కాదు.
ఇప్పుడు సరుకులు ఆర్ధికవేత్త నోటితో ఏమి చెబుతాయో విందాం:
విలువ- (అంటే మారకం విలువ) వస్తువుల ధర్మం.
సంపద (riches అంటే ఉపయోగపు విలువ) మనిషి లక్షణం
విలువకి మారకాలతో సంబంధం ఉంటుంది. సంపదకి మారకాలతో సంబంధం ఉండదు.

ఒక మనిషి సంపన్నుడు,, ఒక సమాజం సంపన్నమైనది. ఒక ముత్యం ముత్యంగా విలువైనది. ఒక వజ్రం వజ్రంగా విలువైనది..అన్న  బెయిలీమాటలు ఉటంకించి మార్క్స్ ఇలా అంటాడు:
ఇప్పటిదాకా, ఏ రసాయనవేత్తా ముత్యంలోగానీ, వజ్రంలోగానీ మారకం విలువని  కనుక్కున్నది లేదు. ఈ రసాయన అంశాన్ని కనుక్కున్నామని  విమర్శనాత్మక పరిశోధనలో నిష్ణాతులుగా ప్రత్యేకించి చెప్పుకునే  ఆవిష్కర్తలు వస్తువుల ఉపయోగపు విలువ వాటి భౌతిక ధర్మాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వాటికి ఉంటుందని కనుక్కున్నారు.: వా టి విలువ వస్తువులుగా వాటిలో భాగంగా  ఉంటుందని కనిపెట్టారు. వాళ్ళకున్న ఈ అభిప్రాయాన్ని ధృవపరిచే ఒక ప్రత్యేక పరిస్థితి  ఏదంటే, సరుకుల ఉపయోగపు విలువ మారకం లేకుండానే సఫలీకృతం అవుతుంది-వస్తువుకీ, మనిషికీ నేరు సంబంధం ద్వారా.
వాటి విలువ మారకంలో మాత్రమే, అంటే సామాజిక ప్రక్రియ ద్వారా మాత్రమే సాఫల్యం సాధిస్తుంది.
ఇక్కడ డాగ్ బెర్రీ తన పొరుగువాడయిన సీకోల్ కి చెప్పినదాన్ని గుర్తుచేసుకోకుండా ఎవరుండగలరు?
అతను అన్నది ఇది:నలుగురికీ ప్రేమాస్పదుడు కావడం అదృష్టం, చదవ గలగడం, రాయగలగడం స్వాభావికంగా వస్తుంది”.-అంటూ మార్క్స్ ముగిస్తాడు.

ఆవిధంగా మార్క్స్ సరుకుల మార్మికత ఏమిటో, దాని మూలాలేవో లోతుగా పరిశీలించి వివరిస్తాడు. శాస్త్రీయంగా పరిశోధన చేసిన సాంప్రదాయ ఆర్ధికవేత్తలు సైతం దీని నుండి  ఎందుకు తప్పించుకోలేక పోయారో తేల్చి చెప్పాడు.ఇక పెట్టుబడి దారీ విధానానికి సమర్ధనలు చేకూర్చడమే పనిగా పెట్టుకున్నబూర్జువా ఆర్ధికవేత్తలు మార్మికతకి ఎంతగా   అంటుకుపోయారో వివరంగా చెప్పాడు.
కుగల్ మన్ కి 1871 జులై 11న రాసిన ఉత్తరంలో ఇలా రాశాడు:
“మారకచర్య ప్రత్యక్షంగా ఉత్పాదితాల మధ్యా, పరోక్షంగా ఉత్పత్తిదారుల మధ్యా ఏర్పరచే సంబంధాల ద్వారా వ్యక్తి శ్రమ సామాజిక శ్రమలో భాగంగా నిర్ధారణ అవుతుంది.” సమాజం మొత్తం  శ్రమలో, కొంత  భాగం చేసే వ్యష్టి సరుకు ఉత్పాదకులు స్వతంత్రంగానూ, విడివిడిగానూ పనిచేస్తారు.అందువల్ల “ సామాజిక శ్రమ యొక్క పరస్పర సంబంధం వ్యష్టి శ్రమ ఉత్పాదితాల ప్రైవేటు మారకంలో వ్యక్తం అవుతుంది.”-
మారకం గురించి వచ్చే పోస్ట్ లో





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి