25, మే 2017, గురువారం

6.విలువరూపం-2

విలువరూపం-2

సీతాకోకచిలుక క్రిమి రూపంతో  మొదలై   దశలవారీగా రూపొందుతుంది. అలాగే డబ్బుకూడా. ప్రాధమిక రూపంతో మొదలై దశలవారీగా  డబ్బురూపం పొంది జిగేల్ మంటుంది.పోయే కొద్దీ, ఉపయోపువిలువ నించి విలువ వేరుపడడం అంతకంతకూ స్పష్టమవుతుంది.ఈ మార్పు అంతర్గత వైరుధ్యాల వల్ల అనివార్యంగా జరిగేదే గాని యాదృచ్చికంగా ఏర్పడింది కాదు అనేది  మార్క్స్ గతితార్కిక తర్కం (dialectical logic)

I.ప్రాధమిక విలువ  రూపం


ప్రాధమిక రూపంలో ఒక సరుకు విలువ మరొక సరుకు ద్వారా మాత్రమే వ్యక్తం అవుతుంది. ఈ మరొక సరుకు ఏదయినా కావచ్చు- కోటో , ఇనుమో, గోధుమో మరొక సరుకో.
సమీకరణలో అటొకటి ఇటొకటి మాత్రమే ఉంటాయి- సాపేక్ష రూపంలో ఒకటీ, సమానక రూపంలో మరొకటీ.


ప్రాధమిక రూపం ఆచరణలో యాదృచ్చికంగా,ఎప్పుడో ఒకప్పుడు(అప్పుడప్పుడు/అరుదుగా)జరిగే మారకాలు శ్రమ ఉత్పత్తుల్ని సరుకులుగా మార్చేతొలి దశలో సంభవిస్తాయి.
ప్రత్యేక శ్రమ ఉత్పాదితాలు   అప్పుడప్పుడు, యాదృచ్చికంగా మారకం అయినప్పుడు ప్రాధమిక రూపం ఏర్పడింది. మొదట్లో మారకాలు తెగల మధ్య జరిగేవి.అదీ రెండు తెగలు ఒకే చోటకి వచ్చినప్పుడు; ఒకరి దగ్గర వున్న వస్తువులు మరోకరిదగ్గర లేనప్పుడు; సొంతదార్లదగ్గర అవి మిగులుగా వున్నప్పుడు; ఇరువురూ ఒకరి సరుకులు మరొకరు కావాలనుకున్నప్పుడు. ఆరెండు సరుకులూ నిర్దిష్ట పరిమాణాల్లో మారగలగడం కేవలం యాదృచ్చిక ఘటన కావచ్చు. ఇలాంటి ఘటనలు అన్ని సరుకులకూ జరిగే అవకాశాలున్నాయి.
వగయిరా మారక సంబంధాలు ఏర్పడవచ్చు. అయితే ఒకసారి జరిగాయని ప్రతిసారీ జరగాలని లేదు. ఆయ్యవస్తువులు వున్నవాళ్ళకు ఒకరివి ఒకరు మార్చుకోవాల్సిన అవసరం లేనప్పుడు మారకమే జరగదు. మారకం జరిగినా  అదే  పరిమాణంలో జరుగుతుందనీ లేదు.
ఉదాహరణకి, బానలు చేసే మనిషి ఒకబాన ఇచ్చి  2 చాటలు తీసుకున్నాడనుకుందాం. మరొకసారి చాటల మనిషి బానలకి చాటలు ఇవ్వడానికి సిద్ధమైనా, బానల మనిషికి చాటలు అవసరంలేకపోతే మారకం జరగదు.
మరొకరితో మారకం జరిగినా ఒక బానకి 2 చాటలు కాకపోవచ్చు. ౩ కావచ్చు. 2 బానలకి ౩ చాటలు కావచ్చు. నిష్పత్తి మారవచ్చు. అందుకే ప్రాధమిక రూపం  యాదృచ్చిక రూపం.
ఇక్కడ బట్ట విలువ ఒక్క కోటులో మాత్రమే తెలుస్తున్నది. ఇతర సరుకులలో తెలియదు.
అయితే మారకాలు పెరిగేకొద్దీ, ఇతరసరుకుల్లో కూడా బట్టవిలువ తెలుస్తుంది.
బట్టకి ఇక్కడ 4 విలువ వ్యక్తీకరణలున్నాయి. ఇంకా కొన్ని ఉండవచ్చు. కొన్నేమిటి, ఎన్నైనా ఉండవచ్చు.
ఆవిధంగా ఏ సరుకుకైనా ఎన్నో, ఎన్నెన్నో  ప్రాధమిక విలువ వ్యక్తీకరణలుంటాయి. అలాంటి వ్యక్తీకరణలు ఎన్ని ఉండే అవకాశం ఉంటుందంటే, ఆ సరుకు కాక ఎన్ని సరుకులు ఉంటాయో అన్ని. అందువల్ల, ఒక సరుకు విలువ వ్యక్తీకరణ అనంతగా విస్తరించగల వరుసలోకి, భిన్న ప్రాధమిక విలువల వరుసలోకి మార గలదు. అలాంటి పరిస్థితుల్లో 20  గజాల బట్టకు ఎన్నో ప్రాధమిక వ్యక్తీకరణలుంటాయి.ఆసరుకు(బట్ట) కాక ఎన్ని సరుకులు ఉంటాయో అన్ని.
సాపేక్ష విలువ స్థానంలో ఒక సరుకే ఉంటుంది.సమానకం స్థానంలో అనేకం ఉంటాయి.
మొత్తం 500 సరుకులు ఉంటే, 499 ప్రాధమిక విలువ రూపాలుంటాయి.సరుకులు ఎక్కువయ్యే కొద్దీ, ప్రాధమిక విలువ రూపాలు కూడా పెరుగుతాయి.దీన్నిబట్టి , ఒక సరుకు విలువను తెలిపే సమానకాల సంఖ్య పెరిగే వరుస కాగలదు. అంటే విస్తరించ గలదు. ఆ రూపమే

II. సంపూర్ణ విలువ రూపం/ విస్తృత విలువ రూపం

ఇలా ఉంటుంది :
20 గజాల బట్ట=1 కోటు
             =10 పౌన్ల టీ
            =40  పౌన్ల కాఫీ
             =పావు గోధుమల
             = 2 ఔన్సుల బంగారం
             =1 టన్ను ఇనుం ఇలా
బట్ట విలువ చాలా సరుకుల్లో వ్యక్తం అయింది.

అలాగే 1 కోటు విలువ ఈ రూపంలో ఇలా ఉంటుంది:
కోటు విలువ చాలా సరుకుల్లో వ్యక్తం అవుతుంది.
విస్తృత రూపం  ఒక ప్రత్యేక శ్రమ ఉత్పాదితం (ఉదాహరణకి పశువు) ఇతర అన్ని సరుకులతో, అరుదుగా కాక, అలవాటుగా మారేటప్పుడు మొదట  ఉనికిలోకి వస్తుంది. ఈ రూపం ఉపయోగపు విలువ నించి విలువని మరింత స్పష్టంగా వేరుచేస్తుంది.

§1 .విస్తృత సాపేక్ష విలువ రూపం

.ఇప్పుడు బట్ట విలువ  అన్ని ఇతర సరుకుల్లోనూ వ్యక్తమవుతుంది. ప్రతి ఇతర సరుకూ బట్ట విలువకు అద్దం  పడుతుంది/అవుతుంది. ఆవిధంగా ఇప్పుడు మాత్రమే  ఈ విలువ తేడాలేని మానవ శ్రమ జెల్లీ గా కనబడుతుంది. ఆశ్రమ కుట్టయినా, దున్నకం అయినా, గని తవ్వకం అయినా మరే దైనా ఒకటే అని అర్ధమవుతుంది. కోటులో,గోదుమల్లో, ఇనుంలో, బంగారంలో మరెందులో వస్తుత్వం చెందినా ఒకటే. కనుక దాని (విస్తృత )విలువ రూపం వల్ల  బట్ట ఇప్పుడు ఒక్క కోటుతోనే కాకుండా లోకం లోని అన్ని సరుకులతోటి సామాజిక సంబంధంలో నిలబడుతుంది. సరుకుగా అది ప్రపంచ పౌరుడు.

20 గజాల బట్ట=1 కోటు అనే మొదటి రూపంలో(ప్రాధమిక విలువ రూపంలో)  ఈ రెండు సరుకులూ నిర్దిష్ట  పరిమాణాల్లో మారతాయి అనేది కేవలం  యాదృచ్చిక ఘటన అయినా కావచ్చు.
“రెండో దాంట్లో (విస్తృత విలువ రూపంలో ) , ఇందుకు భిన్నంగా ఈ యాదృచ్చికతని  నిర్ణయించే నేపధ్యాన్ని తక్షణమే గమనిస్తాం.” బట్ట విలువ పరిమాణంలో మార్పురాదు-అది కోటులో వ్యక్తమయినా మరొకదానిలో వ్యక్తమయినా, అవి వేరు వేరు యజమానులకు చెందినవైనా. ఇద్దరు సరుకు సొంతదార్ల మధ్య యాదృచ్చిక సంబంధం అంతర్ధానం అవుతుంది. ఒక విషయం స్పష్టం అవుతుంది: “సరుకుల విలువల్ని నియంత్రించేది (regulate) సరుకుల మారకంకాదు, అందుకు భిన్నంగా సరుకుల విలువల పరిమాణాలే అవిమారే నిష్పత్తుల్ని నియంత్రిస్తాయి.”
§2. ప్రత్యేక సమానక రూపం.
కోటూ, టీ ,గోధుమలూ, ఇనుమూ వంటి ప్రతిసరుకూ  బట్ట విలువ వ్యక్తీకరణలో  సమానకంగా వ్యవహరి స్తుంది. కనుక విలువ కలిగివున్న భౌతిక వస్తువుగా , రూపుదాల్చిన విలువగా   లెక్కకొస్తుంది. ఈ సరుకుల్లో ప్రతిదాని శరీర రూపమూ ఇప్పుడు ఎన్నో ఇతర సమానకాలతో పాటు ఒక ప్రత్యేక సమానకం. అలాగే ఆయా సరుకులలో  ఇమిడి వున్న ప్రయోజనకర నిర్దిష్ట శ్రమలు ఏ తేడా లేని మానవ శ్రమ అగపడే ప్రత్యేక రూపాలుగా లెక్కకొస్తాయి.
మన ఉదాహరణలో బట్టకి సమానకాలుగా టీ,కాఫీ, గోధుమలు,బంగారం ,ఇనుం ఉన్నాయి. వీటిలో ప్రతిదీ ఒక ప్రత్యేక సమానకం.
§3. విస్తృత విలువ రూపంలో లోపాలు
ఈ రూపంలో 3 లోపాల్ని ప్రస్తావిస్తాడు.
A) సంపూర్ణత/ సమగ్రత  లేకపోవడం ఒక లోపం.బట్ట విలువ యొక్క సాపేక్ష వ్యక్తీకరణ అసంపూర్ణం. కారణం బట్టవిలువకి  ప్రతినిధిగా వుండే సరుకుల వరుస ఎన్నటికీ ముగియదు. అది ఒక గొలుసు. ఆగొలుసులో ప్రతి సరుకూ  ఒక లింకు. కొత్త సరుకు వస్తే అది మరొక లింకవుతుంది. వచ్చిన ప్రతికొత్త సరుకూ బట్ట విలువని తనలో వ్యక్తీకరిస్తూ వుంటుంది.గొలుసు పోడుగవుతూ పోతుంది.
ఒకప్పుడు లేని కర్రు, కొడవలి  వంటి ఇనప  వ్యవసాయ పరికరాలు ఇనుం కనుక్కున్నాకనే వచ్చాయి.  గడ్డ పారలూ కత్తులూ ఎన్నో వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే వున్నాయి.
బట్ట విలువ అలా వచ్చిన ప్రతిదానిలో కూడా వ్యక్తం కావాలి, ఇలా:
20 గజాల బట్ట=10 కర్రులు  
             =8 కొడవళ్ళు  
             = 3 గడ్డ పారలు
             =5 కత్తులు   
ఇక  ఈ  వరస పెరిగేదే కాని ముగిసేదికాదు. బట్ట విలువ రూపం పూర్తిగా వ్యక్తం కాదు.కొరవ ఉంటూనే ఉంటుంది.  కనుక బట్ట విలువ సాపేక్ష వ్యక్తీకరణ ఎన్నటికీ అసంపూర్ణమే,అసమగ్రమే.
B) సరళత్వం లేకపోవడం మరొక లోపం..
ఒకసరుకు విలువ వ్యక్తీకరణ ఎన్నో సరుకుల్లో వ్యక్తం అవుతుంది. ప్రతి సరుకు విలువా మిగిలిన అన్ని సరుకుల విలువల్లో తెలుస్తుంది.ఉదాహరణకి కోటు విలువ
అలాగే 50 కిలోల ఇనుం విలువ :
ఏసరుకు విలువైనా ఇలాగే అంతులేని వరస అవుతుంది.ఒక్కొక సరుకు విలువ అనేక సరుకుల్లో వ్యక్తం కావడం వల్ల సరళత లోపిస్తుంది.
విస్తృత విలువ రూపం విభిన్నమైన,  ఒకదానికొకటి సంబంధం లేని  స్వతంత్రమైన విలువ వ్యక్తీకరణలతో ఉండే రంగు రంగుల మొజాయిక్ అంటాడు.అంటే, ఒకే సరుకు యొక్క సమానకం ప్రతి చోటా, ప్రతికాలంలో ఒకటే కాదు అని.

C.ఏకరూపత లేకపోవడం. ఒకేరకంగా ఉండక పోవడం.

బట్ట విలువ కోటు  విలువకు గుణాత్మకంగా సమానం. అవి రెండూ అనిర్దిష్ట శ్రమ పేరుడు లే. కాగా, బట్ట విలువ సాపేక్ష రూపం మిగిలిన ప్రతి సరుకు విలువరూపం నుండీ భిన్నమైనదే. “ ప్రతి సరుకు సాపేక్షవిలువ
విస్తరించిన రూపంలో వ్యక్తమయితే, దాన్ననుసరించి ప్రతి సరుకు సాపేక్ష విలువ రూపం అనంతమైన విలువ వ్యక్తీకరణల వరస అవుతుంది. ఆరూపం ప్రతి ఇతర సరుకుయొక్క సాపేక్ష విలువ రూపానికీ భిన్నమైనదిగా ఉంటుంది.” భిన్న మైన అంటే, గుణాత్మకంగా భిన్నమైన అని.
ప్రతి విడి సరుకు శరీర రూపం ఎన్నోఇతర సమానక రూపాల్లో ఒక ప్రత్యేక సమానక రూపం.కనుక, (అప్పటికి) ఉనికిలో వున్న సమానక రూపాలు పరిమిత సమానక రూపాలు మాత్రమే. వాటిలో ప్రతిదీ ఇతరవాటిలో దేన్నో మినహాయిస్తుంది. చేస్తుంది.-మార్క్స్


అలాగే,ప్రతి ప్రత్యేక సరుకు సమానకంలో ఉన్న నిర్దిష్ట, ప్రయోజనకర శ్రమ మానవ శ్రమ అగపడే ఒక ప్రత్యేక రూపమే. సమగ్ర మానవ శ్రమ రూపం కాదు.
కోటు లో కుట్టు రూపంలో,ఇనుం లో గని శ్రమ రూపంలో, గోధుమల్లో వ్యవసాయ శ్రమ రూపంలో మానవ శ్రమ అగపడుతుంది. కాని సమగ్ర రూపంలో మానవ శ్రమ అగపడదు.


కోటులో ఉన్న శ్రమ మానవ శ్రమ అగపడే సమగ్ర రూపం కాదు. అది కోటులని ఉత్పత్తిచేసే మానవ శ్రమ రకం మాత్రమే.
ప్రతి సరుకు సాపేక్ష విలువ ఈ విస్తృత రూపంలో వ్యక్తమయితే, ప్రతి సరుకు సాపేక్ష విలువ రూపమూ ముగింపులేని విలువ వ్యక్తీకరణల పరంపరగా ఉంటుంది- ప్రతి ఇతర సరుకు యొక్క సాపేక్ష విలువ రూపానికీ భిన్నంగా ఉంటుంది.


విస్తారిత సాపేక్ష విలువ రూపంలోని ఈ కొరవలు దానికి అనుగుణమైన సమానక రూపంలో ప్రతిఫలిస్తాయి. విస్తృత సాపేక్ష విలువ రూపంలో లోపాలు చెప్పాక, సమానక రూపంలోని లోపాలను చెబుతాడు.ఎన్నో సమానకాలు ఉంటాయి. వీటిని ప్రత్యేక సమానకాలు అంటాడు మార్క్స్.
ఇక్కడ ప్రతి విడి సరుకు భౌతిక రూపమూ అనేక ఇతర ప్రత్యేక సమానక రూపాల పక్కన ఒక ప్రత్యేక సమానక రూపం. కనుక మొత్తంమీద సమానక రూపాలు  విడివిడిగా/దేనికదిగా(fragmentary) వుంటాయి. ప్రతిదీ మిగిలిన వాటిని మినహాయించుకుంటుంది .  
అదే విధంగా ప్రతి సరుకు సమానకంలో ఉన్న నిర్దిష్ట ప్రయోజనకర శ్రమ, మానవ శ్రమ అగపడే ప్రత్యేక రూపమే గాని, మానవశ్రమ అగపడే పరిపూర్ణ రూపం కాదు.ఈ పరిపూర్ణ రూపం అగపడే పూర్తి రూపాన్ని ఆ ప్రత్యేక రూపాలు అగపడడాన్నిపూర్తిస్థాయిలో కలిగి ఉంటుంది. కాని ఆవిధంగా అగపడే ఏకీకృత రూపాన్ని కలిగి వుండదు.
అదే విధంగా ప్రతి సరుకు సమానకంలో ఉన్న నిర్దిష్ట ప్రయోజనకర శ్రమ, ఒక ప్రత్యేక రకం శ్రమగా కనిపిస్తుంది. అందువల్ల సాధారణ మానవ శ్రమకి పూర్తి (exhaustive) ప్రతినిధిగా ప్రదర్శిటం కాదు. సాధారణ మానవ శ్రమ అనేక, ప్రత్యేక,నిర్దిష్ట రూపాల మొత్తానికి సరిపడే వ్యక్తీకరణ పొందుతుంది. అయితే ఆసందర్భంలో, అంతులేని వరుసలో దాని వ్యక్తీకరణ ఎప్పటికి అసంపూర్ణమే, ఏకత్వం లేనిదే.


విస్తారిత సాపేక్ష విలువ రూపంలోని ఈ కొరవలు, దానికి అనుగుణమైన సమానక రూపంలో ప్రతిఫలిస్తాయి.
అలాగే,ప్రతి ప్రత్యేక సరుకు సమానకంలో ఉన్న నిర్దిష్ట, ప్రయోజనకర శ్రమ మానవ శ్రమ అగపడే ఒక ప్రత్యేక రూపమే. సమగ్ర మానవ శ్రమ రూపం కాదు.
కోటు లో కుట్టు రూపంలో,ఇనుం లో గని శ్రమ రూపంలో, గోధుమల్లో వ్యవసాయ శ్రమ రూపంలో మానవ శ్రమ అగపడుతుంది.కాని సమగ్ర రూపంలో మానవ శ్రమ అగపడదు.


ఏదేమైనా, విస్తారిత సాపేక్ష విలువ రూపం ప్రాధమిక వ్యక్తీకరణల మొత్తం తప్ప మరేమీ కాదు.
20 గజాల బట్ట=1 కోటు
20 గజాల బట్ట =10 పౌన్ల టీ
20 గజాల బట్ట =40  పౌన్ల కాఫీ
20 గజాల బట్ట =పావు గోధుమలు
ఒక్కొక్కదాన్ని విడివిడిగా చూస్తే, ఇవన్నీ  ప్రాధమిక వ్యక్తీకరణలు.
వీటిని ఇలా రాయవచ్చు:
20 గజాల బట్ట=1 కోటు
                =10 పౌన్ల టీ
                =40  పౌన్ల కాఫీ
                =పావు గోధుమలు
ఇలా కలిపి  చూస్తే విస్తృత విలువ వ్యక్తీకరణ.
వీటిలో ప్రతిదానికీ అనుగుణమైన తిరగ బడిన  సమీకరణ ఉంటుంది:
1 కోటు=20 గజాల బట్ట
10 పౌన్ల టీ =20 గజాల బట్ట
40  పౌన్ల కాఫీ =20 గజాల బట్ట
పావు గోధుమలు =20 గజాల బట్ట


ఒక వ్యక్తి తన బట్టని అనేక ఇతర సరుకులతో మారకం చేసుకుంటే, దాని విలువని  ఆ ఇతర సరుకుల వరస లో వ్యక్తం చేస్తాడు.దీన్ని అనుసరించి, ఆ బట్టతో మారకం వేసిన యితర సరుకుల సొంతదార్లు వాళ్ళ సరుకుల విలువని ఒకే సరుకు లో వ్యక్తం చేస్తారు- అది బట్ట. మనం అలా ఆవరసని తిరగ దిప్పామంటే ఇదుగో ఈ సాధారణ విలువ రూపం ఏర్పడుతుంది.


III) .సాధారణ విలువ రూపం
                
§1. మారిన సాపేక్ష విలువ ఆకృతి(shape).

సాపేక్ష విలువ రూపం ఆకారం ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. అన్ని సరుకులు తమతమ  విలువని
(1)ఒకే ఒక్క సరుకులో వ్యక్తపరుచు కుంటాయి
(2) ఐక్యంగా /కలిసికట్టుగా అంటే, ఒకే ఇతర సరుకులో
వ్యక్తపరుచు కుంటాయి.
ఈ విలువ రూపం ప్రాధమిక మైనదీ,అన్నిటికీ ఒకటే అయినదీ, అందువల్ల సాధారణ రూపం.
“వాటి విలువరూపం ప్రాధమిక మైనదీ , ఉమ్మడి  అయినదీ అంటే, సాధారణం అయినది.” –appendix
ప్రాధమిక రూపం కంటే విస్తృత విలువ రూపం ఒక సరుకు విలువని దాని ఉపయోగపు విలువ నించి మరింతగా వేరు పరుస్తుంది – కారణం కోటు విలువ కోటు భౌతిక రూపానికి భిన్నంగా, అన్ని ఆకృతుల్లో నూ చూపించబడింది. అది బట్టకూ,ఇనుముకూ, తేయాకుకీ,ఒకటేమిటి మిగిలిన అన్ని ఇతర సరుకులకూ సమం చేయబడ్డది. అయితే తనకు తాను  తప్ప. అంటే కోటు కోటుకి తప్ప. ఎందుకంటే  కోటు=కోటు అనేది విలువ వ్యక్తికరణేకాదు  అని ముందే    చూశాం. వేరొక వైపు,అన్నిటికీ ఉమ్మడియైన విలువయొక్క ఏ సాధారణ వ్యక్తీకరణ అయినా  మినహాయించ బడింది.
ఎందుకంటే,ప్రతిసరుకు విలువ సమీకరణంలోనూ, అన్ని ఇతర సరుకులూ  ఇప్పుడు సమానకాలుగా మాత్రమే  కనబడతాయి. అయితే A విలువ ప్రతి ఇతర వస్తువుతోనూ సమానం చేయబడుతుంది, కాబట్టి అన్నిటికీ ఉమ్మడిదైన సాధారణ విలువ వ్యక్తీకరణ ఉండదు.


విలువ వ్యక్తీకరణ కోసం  వేరుపరచిన ఏకైక సరుకు బట్ట. దానికి  సమానమైనవిగా వాటి విలువలకి ప్రతినిధులుగా వుంటాయి. ఇప్పుడు ప్రతి సరుకు విలువా, బట్టతో సమపరచడం ద్వారా ,తన సొంత ఉపయోగపు విలువ నించి  వేరుపడడమే కాకుండా, అన్ని ఇతర ఉపయోగపువిలువల నించి భిన్నమవుతుంది. అందువల్ల ప్రతి సరుకు విలువా అన్ని సరుకులకూ ఉమ్మడి అయినదిగా వ్యక్తమవుతుంది. ఈ రూపంలో సరుకులు మొట్టమొదటిసారి విలువలుగా సంబంధంలోకి వస్తాయి, మారకం విలువలుగా అగపడతాయి.
ఇంతకుముందు రెండు రూపాలూ ఒక్కో సరుకు విలువని మరొక్క రకం సరుకులోనో  లేక అలాంటి సరుకుల వరసలోనో వ్యక్తం చేస్తుంది. ఈ రెండు సందర్భాలలోనూ ప్రతిసరుకు ప్రత్యేక కర్తవ్యం(special business) ఏమంటే,  తన విలువకి వ్యక్తీకరణ కనుక్కోవడమే, ఈపనిని అది ఇతర (సరుకుల) సహాయం లేకుండానే చేస్తుంది. ఈ ఇతర సరుకులు మొదటిదానికి సంబంధించి సమానకాల passive పాత్ర పోషిస్తాయి.
విలువ సాధారణ రూపం అన్ని సరుకుల సంయుక్త చర్య ఫలితంగా ఏర్పడుతుంది. దానినుండి మాత్రమె ఏర్పడుతుంది. ఒకసరుకు తన విలువ యొక్క సాధారణ రూపం ఎలా పొందుతుంది?అన్ని సరుకులూ, దానితోపాటు, వాటివిలువల్ని ఒకే సమానకంలో వ్యక్తం చెయ్యడం ద్వారా.  ప్రతి కొత్త సరుకూ ఇలాగే చేసితీరాలి. సరుకులు విలువలుగా వుండడం సామాజికం. కనుక ఈ సామాజిక మనుగడ వాటి సామాజిక సంబంధాల మొత్తం ద్వారా మాత్రమే వ్యక్తం కాగలవు. తత్ఫలితంగా  వాటి విలువ రూపం సమాజం ఆమోదించిన రూపమై ఉండాలి.


సాధారణ రూపం డబ్బురూపానికి బాట వేస్తుంది. అన్ని సరుకుల విలువలూ ఒకే సరుకు రీత్యా వ్యక్తమవుతాయి. సరుకులు మారకపు విలువలుగా తొలిసారి కనబడతాయి.
ఇప్పుడు బట్ట అన్ని ఇతర రకాల సరుకులకూ ఉమ్మడి,సాధారణ విలువ ఆకృతిగా లెక్కకొస్తుంది.”కనుక ఈ విలువ రూపంలో అది సామాజిక సాధారణ రూపం పొందుతుంది.”
“ఈ సాధారణ స్వభావం ద్వారానే విలువ రూపం విలువ భావనకి సరిపోతుంది (correspond)”. విలువ రూపం సరుకులు ఒకదానికొకటి ఏ తారతమ్యమూ లేని, ఏకరీతి మానవ శ్రమ యొక్క జెల్లీ గా కనబడే రూపంగా ఉండి  తీరాలి.
ఇది ఇప్పుడు సాధ్యమయింది. ఎందుకంటే, అవన్నీ ఇప్పుడు ఏకరూప శ్రమ(same) వ్యక్తీకరణలు. ఆవిధంగా అవన్నీవిలువలుగా  గుణాత్మకంగా సమానమైనవి.అంతేకాదు,విలువలుగా వాటి పరిమాణాలు పోల్చవచ్చు. వాటి విలువల పరిమాణాల్ని ఒకే దాంట్లో,బట్టలో వ్యక్తపరచడం ద్వారా, ఆ పరిమాణాల్ని ఒకదానితో మరొకదాన్నిసరి పోల్చవచ్చు.   
ఉదాహరణకి 10 పౌన్ల టీ =20 గజాల బట్ట ,
                                      =40 పౌన్ల కాఫీ
                                      =20 గజాల బట్ట.


కాబట్టి  10 పౌన్ల టీ =40 పౌన్ల కాఫీ


ఒక పౌను టీ లో ఉన్న విలువ సారంలో, శ్రమలో  నాలుగో వంతు మాత్రమే  ఒక పౌను కాఫీలో ఉంటుంది. విలువ సాధారణ రూపం అన్నిసరుకుల్నీ ఇముడ్చుకుంటుంది. సమానకం పాత్ర పోషించేందుకు మిగిలిన సరుకుల నుండి తప్పించిన సరుకుని-ఇక్కడ బట్ట-సార్వత్రిక సమానకంగా చేస్తుంది. –కాపిటల్ 1 .72
ఇప్పుడు బట్ట శరీర రూపం అన్ని సరుకులూ ఉమ్మడిగా పొందే రూపం. కాబట్టి బట్ట అన్నిసరుకులతోనూ నేరుగా మారగలిగేది అవుతుంది. బట్ట ప్రతీ  తరహా మానవ శ్రమా  అగపడే ఆకారం అవుతుంది. ఒక ప్రత్యెక వస్తువుని, బట్టను తయారుచేసే కొందరు ప్రైవేటు వ్యక్తుల నేతశ్రమ తత్ఫలితంగా సామాజిక స్వభావాన్ని, (అంటే)అన్ని ఇతర రకాల శ్రమలతో సమానం అనే లక్షణాన్ని సంతరించుకుంటుంది. సాధారణ విలువ రూపం శ్రమ ఉత్పాదితాలన్నీ ఏ తేడా లేని మానవ శ్రమ పేరుడు లు మాత్రమే అని చెబుతుంది.

§2.మారిన  సమానకం రూపం ఆకృతి.

ప్రత్యేక సమానక రూపం సాధారణ విలువ రూపంలో ఇంకొంత అభివృధ్ధయింది. సమానకం రూపంలో ఉన్న సరుకు ఇప్పుడు సాధారణ సమానకం అయింది. అన్ని ఇతర సరుకుల విలువ రూపంగా లెక్కకురావడం ద్వారా,బట్ట భౌతికరూపం అన్ని సరుకులతో మారగల  రూపం.అందువల్ల, బట్ట భౌతిక రూపం అదే సమయంలో దాని సాధారణ సామానక రూపం.                                                                                                                         ఇతర సరుకులు అత్యంత భిన్న రకాల శ్రమల ఉత్పాదితాలు అయినప్పటికీ, ఆసరుకులన్నిటికి బట్ట వాటిలో ఉన్న శ్రమలకు అగపడే రూపంగా ఉంటుంది. ఒకే రకమైన, ఏ తేడా లేని శ్రమ మూర్తిగా లెక్కకొస్తుంది. నిర్దిష్ట శ్రమ అయిన నేత అనిర్దిష్టశ్రమగా, అంటే మానవ శ్రమ శక్తి వ్యయంగా  లెక్కకొస్తుంది.
కచ్చితంగా ఇందువల్లే, బట్టలో వున్న ప్రైవేట్ శ్రమ సాధారణ  సామాజిక రూపంలో ఉన్న శ్రమగా, అన్ని ఇతర శ్రమలతో సమానమైన రూపంలో ఉన్న శ్రమగా   లెక్కకొస్తుంది.

§3. సాపేక్షవిలువ రూపం,సమానక రూపాల పరస్పరాధారిత అభివృద్ధి

సాపేక్ష విలువ రూపం అభివృద్ధి స్థాయికి అనుగుణంగా సమానకరూపం అభివృద్ధి స్థాయి ఉంటుంది. అయితే సమానకరూపం అభివృద్ధి కేవలం సాపేక్ష విలువ రూపం అభివృద్ధియొక్క వ్యక్తీకరణ, ఫలితం మాత్రమే. అని జాగ్రత్తగా గుర్తుబెట్టుకోవాలి. చొరవ సాపేక్ష విలువ రూపం వైపునించి వుంటుంది.
సరళ సాపేక్ష విలువ రూపం  ఒక సరుకు విలువని మరొక సరుకు, ఒకే ఒక సరుకు లో తెలుపుతుంది- ఆసరుకు ఏదయినా అవచ్చు. ఆవిధంగా సరుకు తన భౌతిక రూపానికి భిన్నమైన విలువ రూపాన్ని పొందుతుంది. దాని సమానకం కూడా ఏకైక సమానకం రూపాన్ని పొందుతుంది.
ఒక సరుకు విస్తృత సాపేక్ష విలువ రూపం   ఆసరుకు విలువని మిగిలిన అన్ని సరుకుల్లో చెబుతుంది. అందువల్ల, సమానక రూపం అనేక ప్రత్యేక సమానకాల రూపం లేక  ప్రత్యేక సమానక రూపం తీసుకుంటుంది.
అంతిమంగా,సమస్త సరుకులూ దానికీ ఏకీకృత, సాధారణ,సాపేక్ష విలువ రూపం ఇచ్చుకుంటాయి-తన నించి ఒకే ఒక రకం సరుకుని, ఇతర రకాల సరుకులన్నిటి  విలువని వ్యక్తపరిచే సరుకుని, వేరు పరచడం ద్వారా. అలా చెయ్యడంద్వారా,వేరుచేసిన సరుకు సాధారణ సమానకం అవుతుంది.లేక సమానక రూపం సాధారణ సమానక రూపం అవుతుంది.

§4. సాపేక్ష విలువ రూపం  సమానక రూపాల ద్రువత్వ అభివృద్ధి.
విలువ రూపం అభివృద్ధితో పాటే, ఈ రెండురూపాల మధ్య ఉన్న  ధ్రువ వ్యతిరేకత (Polar Antagonism) వృద్ధవుతుంది. xA =yB అన్నదాంట్లో, వ్యతిరేకత వున్నది, కాని ద్రవ స్థితిలో(చలించే ) వున్నది. ఈ  సమీకరణాన్ని yB = xA గా  తిరగ దిప్పవచ్చు.
xA = yB = zC=మొదలయిన్ వాటిలో ఒక్కొకసారి ఒకే ఒక్క సరుకు మాత్రమే  తన సాపేక్ష విలువను విస్తరించగలదు. ఈ  సమీకరణ ని సాధారణ విలువ రూపంలోకి రాకుండా తిరగ తిప్ప లేం. తిరగ తిప్పామా, అది ఇక విస్తృతరూపం కాకుండా పోతుంది. సాధారణ రూపం అవుతుంది.


సాధారణ సాపేక్ష విలువ రూపంలో,  A కి ఉన్న  అన్ని సరుకులతో నేరుగా మారగల స్వభావానికీ  , నేరుగా మార లేని మిగిలిన అన్ని సరుకుల స్వభావానికీ ధ్రువ వ్యతిరేకత వున్నది.
సార్వత్రిక సమానకం ఏ సరుకయినా కావచ్చు. ఏదైనా ఒక ప్రత్యేక సరుకు సార్వత్రిక సమానకంగా సమాజ గుర్తింపు  పొందినప్పుడు, ఆసరుకే డబ్బు. అంతిమంగా ఈ ఆమోదం బంగారానికి లభించింది.  
సాపేక్ష విలువ రూపం  సమానక రూపాల ద్రువత్వ వ్యతిరేకత, లేక విడదీయ రాని పరస్పర అంతస్సంబంధమూ  అదే సమయంలో వాటి నిరంతరాయ మినహాయింపు (exclusion)- ఈ  క్రింది విషయాల్ని చెబుతాయి:
1.మరొక సరుకు వ్యతిరేక రూపంలో లేనిదే, ఏ సరుకూ ఒక రూపంలో ఉండజాలదు.
2.ఒక సరుకు ఒక రూపంలో ఉంటే, అదే సమీకరణలో / విలువ వ్యక్తీకరణ లో అదే సమయంలో మరొక రూపంలో ఉండజాలదు.
విలువ రూపం అబివృద్దికి అనుగుణంగా విలువ వ్యక్తీకరణలోని  ఈ ధ్రువ విరుద్ధత  అభివృద్ధి చెందుతుంది, దృఢ  పడుతుంది.
మొదటి రూపంలో అవి ఒకదాన్నొకటి మినహాయించుకుంటాయి.  సమీకరణాన్ని ముందునించి చదువుతామా వెనకనించా అనే దాన్ని బట్టి, అంచులలో ఉన్న  బట్టా  కోటూ  లాంటి సరుకు ఇప్పుడు సాపేక్ష రూపంలోఉంటే , మరొకసారి సమానక రూపంలో ఉంటుంది.
20 గజాల బట్ట=1 కోటు – ఇక్కడ బట్ట సాపేక్ష రూపంలోనూ , కోటు సమానకం రూపంలోనూ ఉన్నాయి.
ఇ సమీకరణాన్ని వెనకనించి చూస్తే 1 కోటు=20 గజాల బట్ట అవుతుంది. ఇక్కడ సరుకుల స్థానాలు తారుమారవుతాయి. కోటు సాపేక్ష రూపం తీసుకుంటుంది. బట్ట సమానకం పాత్ర పోషిస్తుంది.
రెండో రూపంలో ఒక రకం సరుకు ఒకేసారి తన సాపేక్ష విలువని పూర్తిగా విస్తరించగలదు. అంటే, అది ఎందుకు విస్తృత సాపేక్ష విలువ రూపం కలిగి వున్నది?ఎందుకంటే,దానికి  సంబంధించి  మిగిలిన సరుకులన్నీ సమానక రూపంలో ఉన్నాయి గనక.
చివరగా మూడో రూపంలో సమస్త సరుకులూ సాధారణ సామాజిక సాపేక్ష విలువ రూపంలో ఉన్నాయి-దానికీ సంబంధించిన సరుకులన్నీ సమానక రూపా న్నించి తొలగించబడ్డ మేరకు. విపర్యయంగా,సాధారణ సమానకంరూపంలో  వున్న సరుకు సాధారణ సాపేక్ష రూపంలో వున్న సరుకుల నించి వేరవుతుంది. బట్ట- సాధారణ సమానక రూపం  లోవున్న ఏ వస్తువైనా అదే సమయంలో సాధారణ సాపేక్ష విలువ రూపంలో పాల్గొనాల్సి వస్తే, తనకు తానే సమానకంగా వుండాల్సి వస్తుంది. అప్పుడు  
20 గజాల బట్ట = 20 గజాల బట్ట అనేదోస్తుంది. ఇదొక పునరుక్తి మాత్రమే .ఇందులో విలువా వ్యక్తం కాదు, విలువ పరిమాణమూ వ్యక్తం కాదు. సాధారణ సమానకం యొక్క విలువ వ్యక్తం కావాలంటే, ఈ మూడో రూపాన్ని తిరగ దిప్పాలి. ఇది ఆతర సరుకులతో ఉమ్మడిగా సాపేక్ష రూపాన్ని కలిగి వుండదు; దాని విలువ సాపేక్షంగా ఇతర అనంతమైన సరుకుల భౌతిక రూపాల్లో వ్యక్తం చేసుకుంటుంది. ఆవిధంగా సరుకు  విస్తృత సాపేక్ష విలువ రూపం (రెండో రూపం)ఇప్పుడు సాధారణ సమానకం గా వ్యవహరించే సరుకుయొక్క విశిష్ట సాపేక్ష విలువ రూపంగా కనబడుతుంది.
సాధారణ సమానక రూపం  ఒక విలువ రూపం. అందువల్ల, అది ఏ సరుకుకైనా సంబంధించినదే. కాని ఎప్పుడయినా సరే, అన్ని ఇతర సరుకులనించి వైదొలగడం/వేరుపడడం  ద్వారానే.
ఒకటో రూపం నించి రెండో రూపానికీ,  రెండో దాన్నించి  మూడో రూపానికీ పరిణామంలో సారభూతమైన మార్పులు సంభవించాయి.ఇందుకు భిన్నంగా మూడో దాంట్లో సమానకం గా ఉన్న బట్ట స్థానంలో  నాలుగో  రూపంలో బంగారం రావడం మినహా మార్పేమీ లేదు. బట్ట స్థానంలో బంగారం సమానకంగా వుంటుంది. అంతే. అన్ని సరుకుల లాగే బంగారం కూడా సమానకంగా, ప్రత్యేక సమానకంగా వ్యవహరించినదే. క్రమక్రమంగా కొద్దిస్తాయిలోనో,పెద్దస్తాయిలోనో సాధారణ సమానకంగా ఉన్నదే. ఈ  స్థానాన్ని బంగారం ఒక్కటే సొంతం చేసుకోగానే అది డబ్బు సరుకు అవుతుంది. దాంతో సాధారణ విలువ రూపం డబ్బు రూపంలోకి మారుతుంది.

IV. డబ్బు రూపం.

ఒక సరుకు (బట్ట ) విలువ డబ్బు గా వున్న సరుకులో(బంగారం) వ్యక్తీకరణే ధర రూపం.
కాబట్టి బట్ట ధర రూపం :
20 గజాల బట్ట = 2 ఔన్సుల బంగారం
లేక రెండు ఔన్సుల బంగారానికి రెండు పౌండ్ స్టెర్లింగ్ లు కరెన్సీ పేరు అయితే
20 గజాల బట్ట = 2 పౌండ్ స్టెర్లింగ్ లు
రేఖా చిత్రంగా చూస్తే, సరుకు విలువ డబ్బురూపంలో:

ప్రాధమిక విలువ రూపమే డబ్బు రూపం యొక్క రహస్యం.
డబ్బు రూపం దానికదిగా ఏ చిక్కూ పెట్టదు.సాధారణ సమానక రూపం నించి చూస్తే, ఈ రూపం బంగారం వంటి ఏదో ఒకప్రత్యేక  సరుకుకి అంటి పెట్టుకుంటుందని గ్రహించడానికి జుట్టు పీక్కోవాల్సిన /బుర్రబద్దలు కొట్టు కోవాల్సిన పనేమీ లేదు. సాధారణ సమానక రూపం  దాని స్వభావ రీత్యానే, అన్ని ఇతర సరుకుల నుండీ ఒక సరుకు తొలగించ బడాలి. ఇక ఈ తొలగింపు  సామాజిక ఆమోదాన్నీ , స్తిరత్వాన్నీపొందడమే నని తేలికగా తెలుసుకోవచ్చు.
“డబ్బు రూపం భావనలో కష్టమంతా సాధారణ సమానకాన్ని (మూడో రూపాన్ని ) అర్ధం చేసుకోవడం లోనే వున్నది.”  ఏమయినా, మూడో రూపం రెండో రూపంగా దానికదే resolve అవుతుంది. ఆ రెండో రూపాన్ని ఏర్పరిచే ది  మొదటి రూపమే:
20 గజాల బట్ట = 1 కోటు
లేక  x  సరుకు A = Y సరుకు B
ఇక ఇప్పుడు, ఉపయోగపు విలువ అంటే ఏమిటో, మారకం విలువ అంటే ఏమిటో తెలిస్తే, ఈ మొదటి రూపం ఏ శ్రమ ఉత్పాదితానికైనా ప్రాతినిధ్యం వహించే సరళమైన, ఏమాత్రం  అభివృద్ధి చెందని సరళి అని మనకు తెలుస్తుంది. అదే సమయంలో 20 గజాల బట్ట = 1 కోటు అనే ఈ సరళ రూపం  20 గజాల బట్ట = 2 పౌండ్ స్టెర్లింగ్ లు అనే డబ్బు రూపానికి మారడంలో ఉన్న వరస క్రమాన్ని సులువుగా గ్రహిస్తాం.
సాధారణ రూపం నించీ డబ్బు రూపానికి పరిణామం.
ఇప్పుడు బంగారం డబ్బు. అంతకు ముందు అది మామూలు సరుకు అయి ఉన్నందువల్లనే అది డబ్బు అయింది. అది ప్రాధమిక విలువ రూపంలో అటో ఇటో  ఒక వైపు వుంది. అలాగే విస్తృత విలువ రూపంలో కూడా ఆవైపో ఈ వైపో అంటే సాపేక్ష విలువ రూపంలోనో, సమానకం రూపం లోనో వుంది. అలాగే సాధారణ రూపం లో కూడా ఉండేది. క్రమంగా అది సార్వత్రిక సమానకంగా విభిన్న పరిమితుల్లో ఉపకరించింది.  ఆస్థానాన్ని తానొక్కటే సొంతం చేసుకుంది.ఇప్పుడు సార్వత్రిక సమానకం రూపం స్థానం లో బంగారం మాత్రమే కనబడుతుంది.అన్ని సరుకుల విలువ డబ్బు రూపం అయిన బంగారంలోనే వ్యక్తమవుతుంది. ఒక సరుకు విలువ డబ్బులో చెబితే అదే ధర. 20 గజాల బట్ట=2 ఔన్సుల  బంగారం  అనేది బట్ట యొక్క ధర రూపం. ఆబంగారాన్ని నాణెం గా చేస్తే 20 గజాల బట్ట=£2 .అదయినా ఇదయినా బట్ట యొక్క ధర రూపమే.
చరిత్రలో స్థల  కాల భేదాల్ని బట్టి భిన్న సరుకులు సార్వత్రిక సమానకాలుగా వ్యవహరించాయి.అంతిమంగా వాటినన్నిటినీ పక్కకు నెట్టి సమాజం  బంగారాన్నిమాత్రమే సార్వత్రిక సమానకంగా ఆమోదించింది. కనుకనే  బంగారం డబ్బు కాగలిగింది.మార్క్స్ కాపిటల్ అంతటా బంగారమే డబ్బు అనుకుని (assumption)రాశాడు.


డబ్బురూపం భావన (concept) ఏర్పరచు కోవాలంటే ఉన్న  చిక్కంతా, సార్వత్రిక సమానకాన్ని స్పష్టంగా గ్రహించడంలో ఉంది. అలాగే ఈ రూపం సాధారణ రూపానికి అవసరమైన  విపర్యయం అని తెలుసుకోవడం లోనూ (ఆచిక్కు)  ఉంది. సాధారణ రూపం విస్తృత విలువ రూపం నించి వచ్చేదే (deducible). విస్తృత రూపాన్ని ఏర్పరచే భాగాలు ప్రాధమిక రూపంలోవే. 20 గజాల బట్ట= 1 కోటు  లేక x సరుకు A =y సరుకు B. అందువల్ల ప్రాధమిక విలువ రూపమే డబ్బు రూపానికి క్రిమిరూపం అని మార్క్స్   రుజువుచేశాడు. దాని అంతర్గత వైరుధ్యాల మూలంగా ఈ రూపం అత్యున్నతమైన డబ్బురూపం లోకి ఎలా పరివర్తన చెందిందో వివరించాడు.


మారక ప్రక్రియలో వేర్వేరు శ్రమ ఉత్పాదితాలు ఒకదానికొకటి సమపరచ బడతాయి. ఆవిధంగా ఆచరణద్వారా   సరుకులుగా మారతాయి. ఈ మారకాల ప్రక్రియలో అనివార్యంగా/ఆవశ్యకంగా డబ్బు రూపొందుతుంది. మారకాల చారిత్రిక అభివృద్ధీ, విస్తృతీ, సరుకుల్లో నిద్రాణంగా /స్తబ్దంగా ఉన్నఉపయోగపు విలువకూ , విలువకూ మధ్య వున్న వైరుధ్యాన్ని వృద్ధి పరుస్తుంది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ వైరుధ్యానికి బాహ్య వ్యక్తీకరణ అవసరమవుతుంది. ఆ  అవసరమే విలువకు  స్వతంత్ర రూపాన్ని  ఏర్పాటు చేసేందుకు  వత్తిడి పెడుతుంది. సరుకుల్ని సరుకులుగానూ, డబ్బుగానూ పూర్తిగా విడగోట్టేదాకా విశ్రాంతి చెందదు. ఉత్పాదితాలు సరుకులుగా మారడం ఎంతవేగంగా జరుగుతుందో, అంతే వేగంగా ఒక ప్రత్యేక సరుకు డబ్బుగా మారుతుంది.- మార్క్స్ కాపిటల్ 1.90

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి