19, మార్చి 2017, ఆదివారం

4.శ్రమ ద్వంద్వ స్వభావం

శ్రమ ద్వంద్వ స్వభావం
సరుకుకి  ద్వంద్వ స్వభావం ఉంటుంది - అది ఉపయోగపు విలువా, విలువా కూడా .అలాగే సరుకుని తయారుచేసిన శ్రమ కూడా  ద్వంద్వ స్వభావం కలదే – అది ఒకవైపు  నిర్దిష్టశ్రమా, మరొకవైపు అనిర్దిష్టశ్రమా. ఉపయోగపువిలువలో వ్యక్తమయినప్పుడు అది నిర్దిష్టశ్రమ.విలువలో వ్యక్తమయినప్పుడు అనిర్దిష్టశ్రమ.
శ్రమ ప్రక్రియ సరుకుకున్న  రెండు అంశాల్నీ ఏకకాలంలో ఏర్పరుస్తుంది .అది ఒకపక్క సరుకు ఉపయోగపు విలువని ఏర్పరుస్తుంది. మరొకపక్క విలువని ఏర్పరుస్తుంది.ఉపయోగపు విలువల్ని ఏర్పరిచే టప్పుడు శ్రమ కుండే  లక్షణాలు వేరు. విలువలో వ్యక్తమయ్యేటప్పుడు శ్రమ కుండే  లక్షణాలు వేరు. సరుకుల్లో ఇమిడివున్న శ్రమ ద్వంద్వ స్వభావం అంటే ఇదే.
“శ్రమ విలువలో వ్యక్తం కాగానే, ఉపయోగపు విలువల్ని ఉత్పత్తిచేసే శ్రమని వేరుపరిచే అన్ని లక్షణాలూ అదృశ్యం అవుతాయి”- అంటాడు ఫ్రెంచి కూర్పులో.

దీన్ని  గురించి “మొదట చెప్పిందీ, విమర్శనాత్మకంగా పరిశీలించిందీ నేనే”-అని చెప్పుకున్నాడు-cap.49              “ఈ పాయింట్  రాజకీయ అర్ధశాస్త్రం అర్ధం చేసుకోవడానికి ఇరుసు” అని దాని ప్రాధాన్యతని వెల్లడించాడు. అంత   కీలక మైనది “కనక వివరాల్లోకి వెళ్ళాలి.” అంటాడు. అంటే, లోతుగా పరిశీలించాలి అని.
*********
ఉపయోగపు విలువను ఏర్పరచే శ్రమ- నిర్దిష్టశ్రమ 
రెండు సరుకుల్ని తీసుకుందాం- ఒకకోటు, 10 గజాల బట్ట.
కోటు ఒక ప్రత్యేకమైన కోరికను తీరుస్తుంది. దాని తయారీకి ప్రత్యేక తరహా ఉత్పాదకచర్య అవసరం.ఈచర్యని  దాని లక్ష్యమూ , చేసే పద్ధతీ, కావలసిన వస్తువులూ  , వాడేసాధనాలూ, దాని ఫలితమూ  నిర్ణయిస్తాయి . లక్ష్యం కోటు తయారు చెయ్యడం.కావలసిన వస్తువులు బట్ట, గుండీలు, దారం వగయిరా, చేసేది  కుట్టుపని. సాధనాలు కుట్టుమిషన్, కత్తెర,  సూది. శ్రమ పదార్ధాలమీద, శ్రమ సాధనాలతో కుట్టుపనిచేస్తే కోటు తయారవుతుంది. అది ఒక ఉపయోగపు విలువ. దాన్ని తయారుచేసే కుట్టుపని ఒక (ప్రత్యేక) రకమైన శ్రమ, ప్రయోజనకర శ్రమ, నిర్దిష్టశ్రమ.
అలాగే దారంతో మగ్గం మీద నేతపనిచేస్తే బట్ట అవుతుంది. నేతపని మరొక రకమైన (ప్రత్యేక)  శ్రమ. వేరొక  ప్రయోజనకర శ్రమ, నిర్దిష్టశ్రమ. అలాగే ఒక నాగలి చెక్కే శ్రమా,గరిస చేసే శ్రమా,బాణం కట్టే శ్రమా వేర్వేరు  రకాల శ్రమలు.ఈ సందర్భంలో శ్రమ ప్రయోజనకర ప్రభావాన్ని మాత్రమే పరిగణిస్తాము.

కోటూ, బట్టా వేర్వేరు ఉపయోగపు విలువలు. గుణాత్మకంగా భిన్నమైనవి. వాటిని తయారు చేసిన శ్రమ రూపాలు కూడా భిన్నమైనవే. ఒకటి కుట్టు శ్రమ, రెండోది నేత శ్రమ. ఏ వస్తువు  తయారీ కయినా దానికి సంబంధించిన ప్రత్యేక శ్రమ ఉంటుంది. అంటే, ఎన్నిరకాల ఉపయోగపు విలువలుంటే వాటిని చెయ్యడానికి  శ్రమ అన్నిరూపాల్లో  ఉండాలి.
భిన్నరూపాల శ్రమ ఉత్పాదితాలు కాకపొతే అవి ఒకదానితో మరొకటి మారకానికి తలపడజాలవు. కోట్లు కోట్లతో మారవు. ఒక ఉపయోగపు విలువ అదే రకం ఉపయోగపు విలువతో మారకం కాదు.

కనుక, సరుకుల ఉత్పత్తికి శ్రమ విభజన తప్పనిసరి.

వ్యవసాయం – పశుపోషణ ముందుగా విడి వడ్డాయి. తర్వాత చేతి వృత్తులు. వాటిలో  తిరిగి వడ్రంగం, కమ్మరం, కుండలు చెయ్యడం, గుడ్డలు నెయ్యడం, బట్టలు కుట్టడం, గంపలల్లడం లాంటి ఎన్నో రకాల శ్రమలు దేనికది విడిపోయాయి. విభిన్న(heterogeneous) ప్రయోజనకర శ్రమలు జాతులుగా, ఉపజాతులుగా, శ్రేణులుగా, తరగతులుగా వర్గీకరించబడి ఉంటాయి. అదే సామాజిక శ్రమ విభజన. 
ఆపరిస్తితుల్లోసమాజంలోని వ్యక్తులు తమకు  కావలసిన వస్తువుల్లో కొన్నితామే చేసుకున్నా, చాలా వస్తువులు ఇతరులు తయారుచేసినవే అయి ఉంటాయి. పొతే, ఎవరుచేసినవి వారివే. కనక ఒకరు చేసినవి మరోకరికిచ్చి వారుచేసినవి తీసుకోని వాడుకోవడమే మార్గం. అదే మారకం. మారకం అయ్యే ఆ శ్రమ ఉత్పాదితాలే సరుకులు. తమకు  కావలసిన వస్తువులన్నీఎవరికివారే తయారుచేసుకో గలిగితే, మారకంతో పనివుండదు. కనక అవి శ్రమ ఉత్పాదితాలు అయినంత మాత్రాన  సరుకులు కాలేవు.
ఎందుకంటే,ఒకరి ఉత్పాదితం మరొకరి  ఉత్పాదితంతో మారకం అయితేనే అది  సరుకు.అది తనకు ఉపయోగపు విలువ అయితే, దాన్ని మారకం చేసుకోడు. మారకం చేసుకున్నాడంటేనే, అది తనకు అవసరం లేనట్లు. మరొకరి వస్తువు తీసుకోని దాన్నిస్తాడు. తనేదాన్నికూడా తయారుచేసుకుంటే మారకం పనిలేదు. కానీ దాన్నిఅతను తయారు  చెయ్యడం లేదు. ఇద్దరు వేర్వేరు రకాల శ్రమ చేస్తున్నారు. అందుకు కారణం శ్రమ విభజన. అదే లేకపోతే మారకం ఉండదు. సరుకుల ఉత్పత్తికి నేపధ్యం ఉండదు. సరుకుల ఉత్పత్తి ఉండదు. కనుకనే సరుకుల  ఉత్పత్తికి శ్రమ విభజన అవసరమైన షరతు.

అయితే, శ్రమ విభజన ఉన్నదంటేనే , సరుకుల ఉత్పత్తి ఉన్నట్లా?
అంటే, శ్రమ విభజన ఉన్న ప్రతి సందర్భంలోనూ ఉత్పాదితాలు సరుకులవుతాయా? 

కొన్ని సందర్భాలలో సరుకులు, మరికొన్ని సందర్భాల్లో సరుకులు కావు.  శ్రమ విభజన ఉండి, సరుకులు లేని సమాజాలు చరిత్రలో ఉన్నాయి. ఉదాహరణకి,
 “ప్రాచీన భారతసమాజంలో, సరుకుల ఉత్పత్తి లేకుండానే, సామాజిక శ్రమ విభజన ఉంది.”- cap1.49
అనాటి సమాజంలో సభ్యులు  తలా ఒక పనిచేసినా, తయారైన వస్తువులన్నీ అందరివీ . ఏఒక్క వ్యక్తి కోసం చేసినవి కావు. ఏ ఒక్కటీ ఏ ఒక్కరిదీ కాదు.ప్రతి ఒక్కటీ ప్రతి ఒక్కడిదీ. అందువల్ల ఒక వస్తువుని వాడుకోవాలంటే, మరొక వస్తువు ఇవ్వాల్సిన పని లేదు. మారకం అవసరం లేదు. కనక అటువంటి సమాజంలో శ్రమ విభజన ఉంటుంది కాని సరుకుల ఉత్పత్తి ఉండదు.
ఇంకా దగ్గరైన ఉదాహరణ: ప్రతి ఫాక్టరీ లోనూ  శ్రమ విభజన ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అయితే ఈ విభజన పనివాళ్ళు వాళ్ళ ఉత్పాదితాల్ని ఒకరితో ఒకరు మారకం వేసుకున్నందువల్ల ఏర్పడింది కాదు.
చొక్కాలు  కుట్టే ఫాక్టరీ చూద్దాం. అక్కడ  బట్టని ఒకరు కత్తిరిస్తారు. కాలర్ ఒకరు. చేతులు మరొకరు. బాడి మరొకరు. కాజాలు తీసేది మరొకరు, గుండీలు కుట్టేది వేరొకరు. ఒక్కక్క భాగాన్ని ఒక్కొక్కరు  చేస్తారు. అన్నిటినీ కలిపి కుట్టేవారు ఇంకొకరు. ఒకరినించి ఒకరికి మారతాయి. అయితే అది మారకం కాదు. వారి శ్రమ కలిసినవే కాని వారివి కావు. వేరేవారివి. కనక వాటిని వారు  మారకం చేసుకోలేరు. అవి వారికి సరుకులు కావు.
ఇలాగే మిగిలిన ప్రయోజనకర శ్రమలు కూడా.దేనికి దానికి పనివాడు వుంటాడు. స్మిత్ గుండు సూదుల  ఉదాహరణ ఉండనే ఉంది. “పిన్నుల తయారీ 18 చర్యలుగా విడి పోయింది” అని చెప్పాడు.ఒకచర్య చెయ్యగానే, వాటిని మరోక చర్యచేసే పనివాడికి ఇస్తాడు. మరొక చర్య చెయ్యడం కోసం.అంటే. ఇతను అతనికిస్తాడే కాని, అతను ఇతనికి ఏమీ  ఇవ్వడు. మారకం లేదు కనక  అది సరుకు కాదు.
అందుకే  అంటాడు: సరుకుల ఉత్పత్తికి శ్రమవిభజన అవసరం.కాని దానిననుసరించి..... శ్రమ విభజనకి సరుకుల ఉత్పత్తి అవసరం- అనేది రాదు. -cap 1.49

దీన్ని బట్టి సరుకుల ఉత్పత్తికి శ్రమ విభజన ఒక్కటే సరిపోదు.                               
సరుకుల ఉత్పత్తికి శ్రమ విభజన అవసరం.అది లేనిదే మారకానికి ఆధారం ఏర్పడదు. అయితే అదున్నంత మాత్రాన మారకాలు జరగాలని లేదు.
ఉదాహరణకి ఒక ఉమ్మడి కుటుంబంలో ఇల్లు చిమ్మడం వంట పనులు,  పొలం పనులు, పాలు  పిండడం ,బట్టలు ఉతకడం సభ్యులే చేస్తారు. తలా ఒకటి చేస్తారు. వాటిని ఆసభ్యులే  వాడుకుంటారు . వారిమధ్య మారకం ఉండదు.అవి సరుకులు కావు. ఇతరుల వాడకం కొరకు మారకంద్వారా బదిలీ అయ్యే శ్రమ ఉత్పాదితవస్తువులు మాత్రమే సరుకులు.
ఉమ్మడి కుటుంబంలో శ్రమ విభజన ఉంటుంది. కాని ఉత్పాదితాలు సరుకులు కావు.
వారిపోలంలో పండిన ధాన్యాన్ని ఎవరికన్నా యిచ్చి, కుండలో, బుట్టలో తీసుకుంటే అవి సరుకులు. ఇలా మారకం జరగాలంటే ఆయావస్తువులు వారివై  ఉండాలి. అప్పుడే మారకంలో అవి సరుకులవుతాయి.
శ్రమ ఉత్పాదితాలు ప్రైవేటు వ్యక్తులవై  ఉండాలి. అంటే వాటిని మారకంలో పెట్టే హక్కు ఉండాలి. ఈ పరిస్థితి లేనప్పుడు శ్రమ విభజన ఉన్నా సరుకుల ఉత్పత్తి లేనట్లే. 
సరుకుల ఉత్పత్తికి

1.శ్రమ విభజన ఉండాలి.
2. ఉత్పాదితాలు  ప్రైవేట్ వ్యక్తులకి చెందినవై ఉండాలి.అప్పుడే అవి మారకంలోకి రాగలుగుతాయి.
మార్క్స్ స్పష్టంగా చెబుతాడు:“ “ప్రైవేట్ వ్యక్తులకోసం, దేనికది స్వతంత్రంగా నిర్వహించబడే  భిన్న రకాల శ్రమ ఫలితంగా తయారయ్యే  ఉత్పాదితాలు మాత్రమే ఒకదానికొకటి సరుకులు కాగలవు.”-కాపిటల్ 1.49

************

ఇంతదాకా మార్క్స్  సరుకుని ఉపయోగపు విలువగా చూచాడు .ఇక మారకం విలువ గురించి పరిశీలిస్తాడు.
మన ఉదాహరణలో రెండు సరుకులు - ఒకకోటు, 10 గజాల బట్ట.
కోటు విలువ బట్ట విలువకి  రెట్టింపు అనుకుందాం. ఇది కేవలం విలువ పరిమాణంలో తేడా మాత్రమే. కోటు విలువ 10 గజాల బట్టకి రెండు రెట్లుంటే, 20 గజాల బట్ట ఒక కోటు విలువకి సమానం కావాలి. మారకం విలువలుగా అవి రెండూ ఒకే సారం ఉన్న వస్తువులు. ఏక రీతి (identical /homogeneous) శ్రమకు వస్తురూపాలు. అయితే, కుట్టుపనీ, నేతపనీ గుణాత్మకంగా వేరు వేరు రకాల శ్రమలు. వాటివాటి ప్రత్యే కతల్ని వదలివేస్తే, ఉత్పత్తి చర్య మానవ శ్రమ శక్తి వ్యయం మాత్రమే. కుట్టుపనీ, నేతపనీ భిన్న శ్రమలే అయినప్పటికీ  రెంటి లోనూ మనిషి మెదడూ, నరాలూ, కండరాలూ వ్యయమవుతాయి. అంటే, మానవశ్రమశక్తి  ఖర్చవుతుందన్న మాట. ఆరెండూ శ్రమ శ క్తి ఖర్చయ్యే రెండు వేర్వేరు వైఖరులు.అంతే.
ఒకేవ్యక్తి కుట్టుపనీ, నేత పనీ ఒకప్పుడదీ , మరొకప్పుడిదీ చేసిన సమాజాలు  ఉన్నాయి. ఆపరిస్తితుల్లో ఈ రెండు  రకాల శ్రమలూ ఒకేవ్యక్తి యొక్క శ్రమకి రెండు రూపాలే ,కాని ఇద్దరు వ్యక్తులు చేసే  ప్రత్యేకమైన, స్థిరమైన (special and fixed) చర్యలు కావు- ఎలాగంటే, ఒక దర్జీ ఒక రోజు కుట్టే కోటూ, మరొక రోజు కుట్టే లాగూ ఒకే వ్యక్తిచేసే శ్రమ లోని తేడాని మాత్రమే చూపినట్లు.
అదీగాక, పెట్టుబడి దారీ  సమాజంలో  మానవ శ్రమలో కొంత భాగం, గిరాకిలో వచ్చే మార్పులకి అనుగుణంగా,ఒకసారి కుట్టు శ్రమ రూపంలోనూ,మరోసారి నేత శ్రమలోనూ సరఫరా అవుతుంది.ఇది ఘర్షణతోనే జరిగినా, జరిగి తీరుతుంది.ఇది తెలిసిన విషయమే.
ఒకవ్యక్తి బేల్దారు/సుతారి పని చేస్తాడనుకుందాం. ఆపనికి డిమాండ్ తగ్గితే మరొక పనిలోకి మారతాడు. ఒకే పని ప్రతిరోజూ దొరకకపోతే దొరికిన పని చేస్తాడు. రోజంతా ఒకే పని లేకపోతే రెండుమూడు పనులు చేస్తాడు. ఉదయం ఒకరి పెరట్లో గుంట తీసి మొక్క నాటతాడు. అక్కడనించి మరొకచోట చెట్టు కొడతాడు. వేరేచోట ఇసక జల్లెడ పడతాడు. ఇంకొకచోట ఇంకోపని చేస్తాడు. ఒకపనినించి  మరోకపనికి మారడంలో చోటు మారుతుంది, పనిముట్లు మారతాయి. ఇన్ని రకాల పనులు చెయ్యడం లో ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది పడ్డా ఘర్షణ ఉన్నా,చెయ్యక తప్పని పరిస్థితి. కనక ఇది జరుగుతుంది.అమెరికాలో ఉద్యోగాలు పోయినప్పుడు, కొందరు రోజూ అయిదారు వేర్వేరు పనులు చేసినట్లు తెలుస్తుంది.

ఇక ప్రయోజనకర శ్రమ యొక్క ప్రత్యేక రూపాన్ని వదలివేస్తే, శ్రమ మానవ శ్రమ శక్తి వ్యయం తప్ప మరేమీ కాదు.
కుట్టడం, నెయ్యడం గుణాత్మకంగా భిన్నమైన ఉత్పాదక చర్యలే  అయినప్పటికీ, అదయినా ఇదయినా  మానవ మెదడు,నరాలు, కండరాలూ ఉత్పత్తిలో ఖర్చవడమే. ఈ అర్ధంలో అదీ  మానవ శ్రమే, ఇదీ మానవ శ్రమే. అయితే, అవి మానవ శ్రమ శక్తి ఖర్చయ్యే  వేర్వేరు వైఖరులు.

 అయితే ఈ మార్పులు అన్నింటిలోను  శ్రమ శక్తి అలాగే ఉంటుంది. అది బహు వైఖరుల్లో ఖర్చు కావాలంటే, అది ఒకస్థాయికి అభివృద్ధి అయి ఉండాలి.అయితే, సరుకు విలువ మనిషి అనిర్దిష్ట శ్రమలో ప్రాతినిధ్యం వహిస్తుంది. అది సాదా శ్రమ శక్తి వ్యయం. అంటే ప్రత్యేకమైన అభివృద్ధితో నిమిత్తం లేకుండా ప్రతి సాధారణ వ్యక్తి లోనూ  సగటున ఉండే శ్రమ శక్తి. సాదా, సగటు శ్రమ స్వభావం వేర్వేరు దేశాల్లో, వేర్వేరు కాలాల్లో తేడాగా ఉండేది వాస్తవమే.కాని ఒక ప్రత్యేక సమాజంలో,ఒక కాలంలో  ఇంచుమించు ఒకే స్థాయిలో ఉంటుంది.

నిపుణ శ్రమ
నైపుణ్యం గల శ్రమ ఎక్కువ సాదాశ్రమ కింద లేక్కకొస్తుంది. ఈ సర్దుబాటు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒక సరుకు గొప్ప నైపుణ్యం గల శ్రమ వల్ల తయారై ఉండవచ్చు. దాని విలువ సాదాశ్రమతో తయారైన వస్తువు విలువకు కొన్నిరెట్లుగా లెక్కకొస్తుంది. దీన్ని లెక్కించే పద్ధతులు సమాజంలో అలవాటు వల్ల స్థిరపడుతుంటాయి.అయితే మార్క్స్ తేలికగా ఉండడానికి ప్రతి శ్రమనీ  సాదా శ్రమగా భావిస్తాడు.”దీంతో మనకి సర్దుబాటు చేసే ఇబ్బంది తొలిగి పోతుంది” అంటాడు.ఇక శ్రమ  లెక్క కొచ్చేది కేవలం శ్రమ శక్తి వ్యయంగా మాత్రమే.
కోటునీ, బట్టనీ విలువలుగా చూస్తున్నప్పుడు, వాటి ఉపయోగపు విలువల్ని తప్పిస్తాం.వాటిని ఉత్పత్తిచేసిన శ్రమ  ప్రయోజనకర రూపాల్ని-కుట్టుపని ,నేతపని-  కూడా పక్కనబెడతాం.ఇక  విలువలుగా కోటూ బట్టా ఏ తేడా లేని శ్రమ కి వస్తు రూపాలు  మాత్రమే.
విలువ పరిమాణం
కోటూ, బట్టా కేవలం విలువలే కాదు. నిర్దిష్ట పరిమాణం వున్న  విలువలు. మన ఉదాహరణలో కోటు విలువ 10 గజాల బట్ట విలువకి రెట్టింపు. ఎందువల్ల వాటి విలువల్లో ఈ తేడా ఏర్పడింది? కోటులో ఉన్న శ్రమలో సగం మాత్రమే బట్టలో ఉన్నందువల్ల.
సరుకును ఉపయోగపు విలువగా చూచినప్పుడు  శ్రమ గుణాత్మకమైనదిగా పరిగణనలోకి వస్తుంది.  మారకం విలువగా చూచినప్పుడు పరిమాణాత్మకమైనదిగా పరిగణించబడుతుంది. అందువల్ల రెండో సందర్భంలో (మారకం విలువగా చూచినప్పుడు) శ్రమను సాదా శ్రమలోకి మార్చాలి.మొదటి సందర్భంలో వచ్చే ప్రశ్న: ఎలాంటి శ్రమ?ఏమి శ్ర్తమ? కుట్టు శ్రమ, నేత శ్రమ వగయిరా.
రెండో సందర్భంలో ఎంత మొత్తం శ్రమ?ఎంతకాలంపాటు  చేసిన శ్రమ?
సరుకు విలువ పరిమాణం ఆసరుకులో వున్న  శ్రమ పరిమాణాన్ని సూచిస్తుంది.కనుక అన్ని  సరుకులూ  ఏవో పాళ్ళలో సమానమై తీరాలి.
ఉత్పాదకత
(ఉత్పాదకత గురించి , ’విలువ సారమూ విలువ పరిమాణమూ’ అనే క్రితం పోస్ట్ లో కూడా ఉంది.)
కోటు ఉత్పత్తికి అవసరమైన  ప్రయోజనకర శ్రమల ఉత్పాదక శక్తి మారకుండా అలాగే వుంటే,  తయారయ్యే కోట్ల మొత్తం విలువ  వాటి సంఖ్యతో పాటే పెరుగుతుంది. ఒక కోటు ఒక రోజు శ్రమని సూచిస్తే, రెండు కోట్లు రెండు రోజుల శ్రమని సూచిస్తాయి. అలా ఎన్నైనా, ఏవైనా లెక్క ఇలాగే.
కోటు ఉత్పత్తికి పట్టే శ్రమ కాలం మారింది అనుకుందాం. అంటే, మునుపటికంటే పెరిగి రెట్టింపో , తగ్గి సగమో అయింది అనుకుందాం. మొదటిసందర్భంలో ఒక కోటు విలువ వెనకటి రెండు కోట్ల విలువంత  అవుతుంది.రెండో సందర్భంలో వెనకటి రెండు కోట్ల విలువ వెనకటి ఒక కోటు విలువ అవుతుంది. అయితే, రెండు సందర్భాలలోనూ కోటు అంతకుముందు ఎలా ఉపయోగపడిందో ఇప్పుడూ అలాగే ఉపయోగ పడుతుంది.ఎందుకంటే, కోటులో వున్నా ప్రయోజకర శ్రమ గుణం మారలేదు. కాని శ్రమ పరిమాణంలో మార్పువున్నది. కనక విలువ పరిమాణంలో మార్పు వస్తుంది.
“ 1852 లో అల్యూమినియం ఒక పౌను 545  డాలర్లు. 1859 లో డెవిలీ అల్యుమినియాన్ని విడదీసే విధానాన్ని లోపరహితం చేసాడు.దాని ఫలితంగా పౌను వెల 17 డాలర్లయింది. 1886 లో చార్లెస్ మార్టిన్ హాల్ ...ఎలె క్ట్రాలిసిస్ ద్వారా విడదిసాడు. ఇనాడు (1961 లో) అదే ప్రక్రియని మెరుగుపరచి విడదీస్తే పౌను 20 సెంట్ల కన్న తక్కువకి వస్తున్నది.”- Chemistry in Action .482 డబ్బులో దాని విలువ అంతగా తగ్గింది. డాలర్ విలువ స్థిరంగా వుండి అనుకుంటే, ఉత్పాదకత 2,725 రెట్లు అయినట్లు.
రేడియోలలో వాల్వులు ఉండేవి. అప్పుడు రేడియో కి బదులుగా  ఇనప బీరువా వచ్చేది.వాల్వుల స్తానంలో ట్రాన్సిస్టర్లు, ఆ తర్వాత ఐ.సీ లు వచ్చాయి. సాంకేతిక స్థాయి పెరిగింది. ఇప్పుడు ఒకపూట భోజనం మానుకుంటే  చాలు బుల్లి  రేడియో ఇంటికి వస్తుంది.
బాగా తెలిసిన ఉదాహరణ- సెల్ ఫోన్. 20 ఏళ్ల క్రితం అక్కడక్కడ మాత్రమే కన్పించేది. సాంకేతికతలో మార్పులొచ్చి ఉత్పాదకత పెరిగి విలువ పడిపోయింది.కనకనే సెల్ లేని చేతులు ఎక్కువగా కనిపించడం లేదు.  
ఉపయోగపు విలువల పరిమాణం పెరుగుదలే, వస్తుసంపద పెరుగుదల. ఒకకోటు ఒకరు వేసుకుంటే, రెండు కోట్లు ఇద్దరు తొడుక్కుంటారు. అయితే, వస్తుసంపద పెరిగినా, విలువ పరిమాణం తగ్గి పోవచ్చు. ఈవిరుద్ధమైన ఎదురుగమనం శ్రమ యొక్క ద్వంద్వ స్వభావం నుండి  ఏర్పడుతుంది.
ఉత్పాదక శక్తి అనేది కేవలం ఏదో ఒక ప్రయోజనకర, నిర్దిష్ట రూపంగల శ్రమకు సంబంధించింది. ఉత్పాదకతలో వచ్చే మార్పులు మారకపు విలువని సూచించే శ్రమ మీద ప్రభావం చూపవు. ఉత్పాదకత పెరిగితే ఎక్కువ వస్తువులు తయారవుతాయి. తగ్గితే, తక్కువ తయారవుతాయి. ప్రయోజనకర శ్రమ అనేది ఎక్కువో తక్కువో ఉత్పాదితాలకు వనరుగా వుంటుంది.
మరొకవైపు, ఈ  ఉత్పాదకతలో మార్పు విలువకు ప్రతినిధి అయిన అనిర్దిష్ట శ్రమ మీద ఎటువంటి ప్రభావమూ  చూపదు. ఉత్పాదక శక్తి  ఎంతగా మారినా, అదే శ్రమ సమాన కాలాల్లో ఎల్లప్పుడూ సమాన మొత్తాల విలువల్ని ఏర్పరుస్తుంది. కాని సమాన కాలాల్లో విభిన్న పరిమాణాల్లో ఉపయోగపు విలువల్ని ఉత్పత్తి చెయ్యవచ్చు. ఉత్పాదకశక్తి  పెరిగితే, ఎక్కువ మొత్తంలోనూ తగ్గితే తక్కువ మొత్తంలోనూ ఉపయోగపు విలువల్ని ఇస్తుంది. ఒకే కాలంలో ఎక్కువ వస్తువులు తయారయితే, ఒక్కొక వస్తువు విలువ తగ్గుతుంది. అలాకాక తక్కువ వస్తువులు తయారయితే, ఒక్కొక్క వస్తువు విలువ పెరుగుతుంది.తయారయ్యే  ఉపయోగపు విలువల పరిమాణం పెరగడం అంటే తయారయ్యే వస్తువుల పరిమాణం పెరగడమే . 
ఒక దర్వాజా తలుపులు తయారుచెయ్యడానికి మామూలు పరికరాలతో పనిచేస్తే ఇద్దరికీ ఒకరోజు పట్టిందనుకుందాం. యంత్రాలు ఉపయోగిస్తే, ఆ ఇద్దరే అయిదు చేస్తారనీ  అనుకుందాం. వస్తువులు పెరిగాయి .కాని చేరే విలువ అదే. అయిదింటికి  ఇంతకుముందు ఒకదానిలో ఎంతవిలువ చేరిందో  ఇప్పుడు అయిదింటికీ  అంతే  చేరుతుంది. ఫలితంగా, ఒక్కొక్క వస్తువు విలువ అయిదవవంతుకి తగ్గుతుంది. అయినా అయిదింటి మొత్తం విలువ మొదటి పద్ధతిలో తయారైన ఒకదాని విలువతో సమానంగానే ఉంటుంది.
ఒకే కాలంలో భిన్న పరిమాణాల్లో వస్తువులు తయారు కావచ్చు. అయినా విలువ పరిమాణం అన్ని  సందర్భాలలోనూ ఒకటే. ఏమాత్రం తేడా ఉండదు.
ఉత్పాదకకలో మార్పు  రెండో వైపు జరిగితే, అంటే ఉత్పాదకత తగ్గితే, ఉత్పత్తయిన ఉపయోగపు విలువలు తగ్గి, వాటి విలువ పెరుగుతుంది.
శ్రమ అంటే  శ్రమ శక్తి వ్యయమే. ఒకే రకమైన అనిర్దిష్ట మానవ శ్రమ. ఈ పాత్రలో అది సరుకుల విలువల్ని రూపొందిస్తుంది. మరొకపక్క, శ్రమ అనేది   ఏదో ప్రత్యేక మైన రూపం కలిగి , నిర్దిష్టమైన లక్ష్యంతో చేసే శ్రమ శక్తి వ్యయం. ఈ పాత్రలో  నిర్దిష్ట ప్రయోజనకర శ్రమ. ఉపయోగపు విలువల్ని సృజిస్తుంది.
ఒకడు పీట చేస్తున్నాడు. పక్కనే మరొకడు తాడు పేనుతున్నాడు. వేరొకడు చెప్పులు కుడుతున్నాడు. ఇవి వేర్వేరు పనులు. వారు తయారు చేసేవి భిన్నమైన వస్తువులు. వాడే ముడి పదార్ధాలు వేరు. పనిముట్లు వేరు.అవయవాల కదలికలు వేరు. ఒక్కో రకం శ్రమవల్ల ఒక్కో రకం వస్తువు తయారవుతున్నది. పద్ధతులు వేరైనా, శ్రమశక్తిని వ్యయం చేస్తున్నారు.అయితే ముగ్గురూ శ్రమ చేస్తున్నారు. ఒక అంశం (నిర్దిష్ట శ్రమ)ద్వారా  ఉపయోగపు విలువనీ, మరొక అంశం (అనిర్దిష్ట శ్రమ) ద్వారా విలువని ఏర్పరుస్తున్నారు.
“శ్రమ మారకం విలువని ఉత్పత్తిచేసేది కుట్టు శ్రమగా కాదు, అనిర్దిష్ట సార్వత్రిక శ్రమగా... ” క్రిటిక్ .36
నిర్దిష్ట శ్రమ ఉపయోగపు విలువనీ , అనిర్దిష్ట శ్రమ మారకం విలువనీ ఏర్పరుస్తాయని క్రిటిక్ (1859)లో కాపిటల్ లో కంటే ఎనిమిదేళ్ళ ముందు చెప్పాడు.

సరుకులో ఉండే శ్రమ ఒక్కటే. రెండు కావు.సరుకు విరుద్ధాంశాలు సరుకువైనట్లే, శ్రమ విరుద్ధాంశాలు శ్రమవే.ఒకే శ్రమ రెండు అంశాలు. అవి పరస్పర విరుద్ధాలు.
“ఒకే శ్రమ ఇక్కడ దానికదే విరుద్ధంగా ఉంటుంది.” అని  ఫ్రెంచ్ ఎడిషన్లో  స్పష్టంగా ఉంటుంది.
తొలి జర్మన్ ఎడిషన్లో  ఈ వైరుధ్యాన్ని గురించి: “...సరుకులో భిన్న రకాల శ్రమలు ఉంటాయి అనేది వాస్తవం కాదు. అయినప్పటికీ, ఒకే శ్రమ భిన్నమైన, పరస్పర వ్యతిరేకమైన నిర్ణాయకతల్ని(Determinations)కలిగి ఉంటుంది” – అంటాడు.
ఆవిధంగా సరుకులోని విరుద్ధాంశాలను ఉత్పత్తిచేసే శ్రమ లోని విరుద్ధాంశాలను విడగొట్టి చూపాడు. ఒకదానిలోని విరుద్ధాంశాలను విడగొట్టి చూడటమే గతితర్కం అన్నాడు లెనిన్.
కాపిటల్  అచ్చవుతుండగా  1867 ఆగస్ట్ 24 న ఎంగెల్స్ కి  దీని గురించి ఉత్తరంలో  రాశాడు: నా పుస్తకంలో మంచి పాయంట్లు 1) శ్రమ యొక్క ద్వంద్వ స్వభావం, అది ఉపయోగపు విలువలో వ్యక్తమయిందా లేక మారకపు విలువలో  వ్యక్తమయిందా అనే దాన్ని బట్టి.(వాస్తవాల్ని అర్ధంచేసుకోవటం అంతా దీనిమీద అధారపడివుంటుంది).వాస్తవాల అవగాహన దీని మీద ఆధారపడిఉంటుంది . 2) అదనపు విలువని దాని ప్రత్యేక రూపాలైన లాభంగా , వడ్డీగా  అద్దెగా  కాకుండా  స్వతంత్రంగా చూడడం  –Selected Correspondence (progress publishers)-180
అంటే దీనికి   అదనపువిలువకి ఇచ్చినంత ప్రాధాన్యతని ఇచ్చాడు.
మార్క్సుకి ముందున్న ఆర్ధికవేత్తలు దీన్ని గమనించ లేదు.
సరుకు ఉపయోగపు విలువా, మారకం విలువా ఉన్న వస్తువు అని వాళ్లకు తెలుసు.పెట్టీ నుంచీ రికార్డో వరకూ సమాన కాలాల్లో తయారయిన వాటి విలువలు సమానం అని తెలుసు.కాని రకరకాల శ్రమలు ఎలాసమానమవుతాయి? అనే ప్రశ్న వాళ్ళు వేసుకోలేదు. కాని ఉపయోగపు విలువని ఏర్పరచే టప్పుడు,విలువని ఏర్పరచే టప్పుడు శ్రమ స్వభావం ఒకటే కాదు, వేరు వేరు  అని వారికి తెలియదు.ఇవి సింపుల్  అయినవే అయినా తన ముందటి అర్ధశాస్త్రజ్ఞులకు తట్టలేదు అంటాడు మార్క్స్.
“అర్దికవేత్తలు అందరూ ఒక సింపుల్ పాయింట్  ని మిస్ అయ్యారు. అదేమిటంటే, సరుకుకి ద్వంద్వ స్వభావం -ఉపయోగపు విలువా మారకం విలువా- ఉన్నప్పుడు, ఆసరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రమ కూడా ద్వంద్వ స్వభావం కలిగి ఉండాలి”.  ‘కేవలం దానికదిగా శ్రమ (labour as such) విశ్లేషణ’ అడుగడుగునా వివరించరాని సమస్యలు తెచ్చిపెడుతుంది. స్మిత్, రికార్డో లకు ఆపరిస్తితే ఎదురయింది.కనుక శ్రమాశ్రయ విలువసిద్ధాంతం వివరణ అసమగ్రంగా వుండిపోయింది.
మార్క్స్  శ్రమలోని రెండు విరుద్ధాంశాల్ని విడగొట్టి, నిర్దిష్ట శ్రమ వుపయోగపు విలువనీ, అనిర్దిష్టశ్రమ విలువనీ కలిగిస్తాయని తేల్చాడు.నిర్దిష్ట శ్రమ, అనిర్దిష్ట శ్రమ అనే కాటగరీల్ని ప్రవేశ పెట్టింది మార్క్సే.
సరుకులోని విరుద్ధాంశాల్ని శ్రమలోని విరుద్ధాంశాలు వుత్పత్తిచేస్తాయని తేల్చి  శ్రమాశ్రయ విలువ సిద్ధాంతాన్ని సమగ్రం చేశాడు.లోపరహితం గావించాడు.
అందుకే మార్క్స్ ఎంగెల్స్ కి 1868 జనవరి 8 న రాసిన లేఖలో అన్నట్లు  శ్రమ ద్వంద్వ స్వభావమే “విమర్శ నాత్మక అవగాహన కి పూర్తికీలకం(the whole secret of the critical conception)” . -Selected Correspondence (progress publishers)-186.
ఇప్పటికి సరుకు అంశాలైన ఉపయోగపు విలువ గురించీ, విలువ గురించీ చెప్పాడు. వాటిని ఏర్పరచిన శ్రమ అంశాలైన   నిర్దిష్టశ్రమ గురించీ అనిర్దిష్ట శ్రమ గురించీ వివరించాడు.
ఇక విలువ రూపాన్ని ఎత్తుకుంటాడు.

వచ్చే పోస్ట్ లో  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి