9, మార్చి 2017, గురువారం

3.విలువ సారమూ - విలువ పరిమాణమూ

3.విలువ సారమూ - విలువ పరిమాణమూ  

ఇప్పటికి తెలిసిన విషయాలు:
మార్క్స్ కాపిటల్ లో  పరిశీలించింది పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని. ఇందులో  సంపద సరుకుల కూడికగా ఉంటుంది. కనుక  సంపదకి ‘మూలప్రమాణం’ (unit) ఒక విడి సరుకే. సరుకు అనేదే   ‘ఆర్ధిక కణరూపం’.
సరుకు విశ్లేషణలో తేలిన విషయాలు.
“సరుకు ఉపయోగపు విలువా...విలువా కూడా” కాపిటల్1.66
సరుకుకి ఉపయోగపు విలువ వుంటుంది. అది లేనిదే సరుకు కాలేదు.
ఒక వస్తువు ఉత్పత్తికి పట్టిన శ్రమ పరిమాణానికీ, దాని ప్రయోజనానికీ సంబంధం ఉండదు.
అలాగే, అది ఉత్పత్తయిన వ్యవస్థకీ, దాని ప్రయోజనానికీ సంబంధం ఉండదు.
ఉపయోగపువిలువ అత్యంత భిన్నమైన ఉత్పత్తి విధానలకూ ఉమ్మడి అంశం.
ప్రయోజనకరవస్తువులు పెట్టుబడిదారీ వ్యవస్థలో మారకం విలువకు వాహకాలుగా కూడా ఉంటాయి
అంటే సరుకైన వస్తువుకి  ఉపయోగపువిలువ రూపంతో పాటు విలువ రూపం కూడా ఉంటుంది.
విలువరూపం అన్నా  మారకం విలువ అన్నా ఒకటే.
అయితే, విలువా  మారకపువిలువా  ఒకటి  కాదు. మారకం విలువ వేరు, విలువ వేరు. విలువ అనేది ‘సారం’,  మారకం విలువ దాని  ‘రూపం‘
అందుకే మార్క్స్ స్పష్టంగా తేల్చి చెప్పాడు: "సరుకు ఒకవైపు వుపయోగపు విలువ, మరొకవైపు విలువ- మారకపువిలువ కాదు. ఎందుకంటే కనబడేరూపం దాని సొంత సారం కాదు గనక “-మార్జినల్ నోట్స్ ఆన్ వాగ్నర్స్ … - మార్క్స్ ఎంగెల్స్ కలెక్టెడ్ వర్క్స్ 24పేజీ 545
ఆవిధంగా, మారకం విలువ   అనేది  విలువ (యొక్క)  రూపం. ఆరూపం  వెనక దాగివున్న విలువని పట్టుకున్నాడు. ఇక విలువ సారం గురించీ, విలువ పరిమాణం గురించీ చెబుతాడు.
***********
విలువ సారం అయిన అంశం ఏమిటి?
ఆ అంశం సరుకు ఉపయోగపువిలువా? కాదు.
ప్రయోజనం లేని ఏ వస్తువూ మారకం కాదు. కనక సరుకు కాజాలదు. నిజమే. అలాగని, సరుకు విలువసారం సరుకు ప్రయోజనం ఎంత మాత్రమూ  కాదు. ఆ సారం అన్నీ సరుకుల్లో ఉండే అంశం అయివుండాలి. ఒకేరకమైనదై తీరాలి.అలాంటి అంశం మాత్రమే విలువ సారం కాగలుగుతుంది.
ఉపయోగపు విలువ అలాంటిదా? కాదు. అన్నిసరుకుల ఉపయోగపు విలువలు ఒకటికాదు.
ఏ వస్తువు ప్రయోజనం దానిదే.పలుగు ప్రయోజనం పలుగుదే, పార ప్రయోజనం పారదే. బల్లకట్టు కావలసిన చోట ఓడతో పనిజరగదు.  కనుక ఉపయోగపు విలువ  విలువ సారం    కాజాలదు.
ఇక పరిశీలన నించి ఉపయోగపు విలువని తప్పించి మిగిలిన దానిలో విలువ సారాన్ని వెదకాలి.అదే మార్క్స్ చేస్తాడు.
సరుకుల మారకం ఉపయోగపువిలువల్ని పూర్తిగా పక్కనబెట్టి, (ఎమాత్రం లెక్కలోకి తీసుకోని) చర్య.- cap1.45
ఒక మారక చర్యని చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.
1 కిలో రొయ్యలు= 1 బెల్టు
రొయ్యల ప్రయోజనం వేరు, బెల్టు ప్రయోజనం వేరు. కనకనే మారకం అవుతాయి.
విలువసారం ఉపయోగపు విలువ కాదు.
ఒకేరకం ఉపయోగపు విలువలు మారకం కావు.
రొయ్యలు రొయ్యలతో మారవు.బెల్టులు బెల్టులతో మారకం కావు. ఏదైనాయిచ్చి అలాంటి దాన్నే తిరిగి తీసుకంటే ఆలావాదేవీకి అర్ధం ఉండదు.రొయ్యలిచ్చి బెల్టులు తీసుకోవచ్చు.ఆ మారక చర్య అది అర్ధవంత మైనదే. దేని ప్రయోజనం దానిదే గనక.
ఎన్నిరొయ్యలకి ఎన్ని బెల్టులు వస్తాయి? కిలో రొయ్యలకి 1 బెల్టు అనుకుందాం. ఈ మారక నిష్పత్తి దేన్నిబట్టి నిర్ణయమవుతుంది? ఉపయోగపువిలువను బట్టా?
అలా అయినట్లయితే, ఎక్కువ ఉపయోగపు విలువ ఉన్న సరుకుకి ఎక్కువ విలువా, తక్కువ ఉపయోగపు విలువ ఉన్న సరుకుకి తక్కువ విలువా ఉండాలి. అయితే వాస్తవం అలాలేదు.
ఎంతో ఉపయోగపు విలువ వుండి విలువలేని వస్తువులు ఉన్నాయి. ఒకవేళ  ఉన్నా  అతికొద్ది విలువ మాత్రమే ఉన్న  వస్తువులు చాలా ఉన్నాయి. ఇందుకు భిన్నంగా ఉపయోగపువిలువ లేని, ఉన్న అతికొద్ది ఉపయోగపువిలువ మాత్రమే వుండి, ఎంతో  విలువ వున్న వస్తువులు కూడా ఉన్నాయి.
ఒకరోజు ఆహారం లేకపొతే మనిషి నీరసపడతాడు.చాలా ఉపయోగం గలది. స్మార్ట్ ఫోను అంతటి ప్రయోజనం ఉన్నది కాదు. అయినా దానికి బదులు కొన్ని నెలలకి సరిపడే ఆహారం వస్తుంది. ఏ సరుక్కి ఇంకో సరుకు ఎంత వస్తుందో దాన్ని నిర్ణయించేది ఉపయోగపు విలువ కాదు.
కనక ఉపయోగపు విలువ విలువ సారం కాదు. సరుకుల మారకం ఉపయోగపువిలువల్ని పూర్తిగా పక్కనబెట్టి, (ఎమాత్రం లెక్కలోకి తీసుకోని) చర్య.- cap1.45
******
అది అదీ ఇదీ కానిమూడోది
రెండుసరుకుల మారకం ఏనిష్పత్తిలో జరిగినా దాన్ని ఒక సమీకరణ వ్యక్తం చేస్తుంది.
ఉదాహరణకి, 1కిలో గోధుమలు = 2 కిలోల ఇనుం
ఈసమీకరణ మనకి ఏమి చెబుతుంది? అని ప్రశ్నిస్తాడు. తానే సమాధానం చెబుతాడు.
రెండు భిన్న వస్తువుల్లో -1కిలో గోధుమల్లోనూ  2 కిలోల ఇనుం లోనూ- ఒకే సారం ఉన్నదని. ఆసారం ఒకే పరిమాణంలో ఉన్నదని.
ఈ రెండు వస్తువుల్లో ఏదో అంశం (సారం) ఉంది.అది గోధుమా కాదు, ఇనుమూకాదు.మరొకటి. అందులోనూ ఉంది ఇందులోనూ ఉంది. కాని అదీ ఇదీ కానిమూడోది.ఈ రెండు వస్తువులూ ఆమూడో ఉమ్మడి అంశానికి సమానమై ఉండాలి.ఆ ఉమ్మడి అంశం గోధుమాకాదు, ఇనుమూ కాదు. ఆరెంటిలో అదీ, ఇదీ ,మారకపు విలువ అయినమేరకు ఆమూడో ఉమ్మడి అంశానికి దించడానికి కుదరాలి.
ఈ ఆలోచనని మార్క్స్ ఇలా రూపొందిస్తాడు.
" రెంటిలో ప్రతి ఒకటీ మూడోదానికి మార్చబడాలి" ఈరెండు వస్తువుల్లో ఒకే సారం వున్నది. అది వేర్వేరు వస్తువుల్లో వేర్వేరు పరిమాణాల్లో ఉంటుంది. అన్ని సరుకుల్లోనూ అంతే. కనక అన్ని సరుకులూ భిన్న పరిమాణాల్లో ఒకే సారాన్ని, ఒకే పరిమాణంలో కలిగి ఉంటాయి. కనక సమపరచవచ్చు.
10 కిలోల గోధుమలు = 6 లీటర్ల పాలు
                         =30 పెట్టెల గుండుసూదులు
                         = 7 సబ్బులు
                          =6 కిలోల చక్కెర
ఆసారం 10 కిలోల గోధుమల్లో ఎంత ఉందో 6 లీటర్ల పాలలో అంతే వుంది, 30పెట్టల గుండుసూదుల్లోనూ, 7 సబ్బుల్లోనూ, 6 కిలోల చక్కెరలోనూ అంతే ఉంది అని అర్ధం. ఒకేసారం, ఒకే పరిమాణంలో ఉన్నందువల్ల ఇవి 5 వస్తువులూ ఆసారం రీత్యా సమానం.
ఏసరుకునైనా మూడోదైన ఉమ్మడి సారానికి మార్చవచ్చు. సరుకుల మారకం విలువలు ఈసారం ద్వారా వ్యక్తం అవుతాయి.ఇదే సారం అన్ని సరుకుల్లో ఉంటుంది. పరిమాణాల్లో తేడాలు - ఎక్కువ తక్కువలు –ఉంటాయి.
మారక సంబంధాల్లో ఈసారం ఒక్కటే లెక్కకొస్తుంది. దాని పరిమాణమే సరుకులు మారే పాళ్ళని నిర్ణయిస్తుంది. మరే ఇతర అంశమూ లెక్కకి రాదు. కనక ఈసారం ఏదో కనిపెట్టడం తప్పనిసరి.
శ్రమ ఎన్నొ రకాలుగా ఉంటుంది. దేనికదే.మరి ఇన్నింటిలో ఏశ్రమని కొలమానంగా తీసుకోవాలి? దేనివైఖరి దానిదే కాబట్టి అన్నిటిలో ఉమ్మడిగా ఉన్నదేదో తేల్చాలి.అన్నిటిలోనూ వైఖరులను వదలివేస్తే,శరీరావయవాల కదలికలు అన్నిట్లోనూ ఉంటాయి.ఇదే అన్నిశ్రమల్లోనూ ఉమ్మడిగా ఉండే అంశం.
పంచదార పలుకుల్లాగా.ఒకే సారం తో ఏర్పడిన గుళికల్లాంటివి. మారకం విలువ మొదట ఒక పరిమాణాత్మక సంబంధంగా కనిపిస్తుంది. అంటే, ఉపయోగపువిలువలు ఏనిష్పత్తిలో మారతాయో ఆనిష్పత్తిగా. ఈ సంబంధంలో అవి సమానమైన పరిమాణాలు. మారకం కాగలవి. Propertius రాసిన  ఒక స్మృతిగీతాల పుస్తకం 8 ఔన్సుల నశ్యంతో మారకం కావచ్చు, అవి రెండూ భౌతికంగా పోలికలేని ఉపయోగపు విలువలు అయినప్పటికీ. మారకం విలువగా చూస్తే ఒకటి ఎంతో రెండోదీ అంతే, రెండూ తగిన పరిమాణాల్లో  ఉంటే.
ఉదాహరణకి పోస్ట్ కార్డూ, ఉత్తరం రాసే బాల్ పెన్నూ పోలిక లేనివి.కాని 10 కార్డులకి ఒక బాల్ పెన్ వస్తుంది.5 కార్డులకి రాదు.మారకానికి తగిన నిష్పత్తిలో పరిమాణాలు ఉండాలి.మారకానికి సరిపడే పరిమాణంలో వస్తువులు వుంటే చాలు, ఒకవస్తువు మరొకవస్తువు వంటిదే. ఒక రాజభవనం మారకం విలువని నిర్దిష్ట సంఖ్యలో ఉన్న(5కోట్ల)బూట్ పాలిష్ డబ్బాలలో వ్యక్తపరచవచ్చు.ఒక బంగారం వడ్డాణం విలువని 200 బస్తాల బియ్యంలో వ్యక్తంచెయ్యవచ్చు.
అందువల్ల, ఉపయోగపువిలువలుగా వాటి సహజ రూపంతోనూ, అవి ఉపయోగపు విలువలుగా అవి తీర్చే అవసరాలతోనూ నిమిత్తం లేకుండా ఆ సరుకులు నిర్దిష్ట పరిమాణాల్లో సమానమయినవి. మారకంలో ఒకదాని చోటుని వేరొకటి తీసుకోగలవు. మారక ప్రక్రియలో సమానమైనవిగా పరిగణించబడగలవు. భిన్నమైనవిగా కనబడినప్పటికీ,ఉమ్మడి విభాజకం కలిగి ఉంటాయి.
ఉపయోగపువిలువలు మనుగడ సాధనాలుగా నేరుగా ఉపయోగపడతాయి. మరొకపక్క, ఈసాధనాలు సమాజిక చర్య యొక్క ఉత్పాదితాలు, వ్యయమయిన మానవశ్రమ ఫలితాలు,పాదార్ధీకృత శ్రమ.వస్తువులలో చేరిన సామాజికశ్రమగా చూస్తే, అన్ని సరుకులూ ఒకే సారం యొక్క స్పటికాలు. ఈసారం, అంటే,మారకం విలువలో రూపొందిన శ్రమ యొక్క విశిష్ట స్వభావాన్ని ఇప్పుడు పరిశీలించాలి.
ఒక ఔన్స్ బంగారం, ఒక టన్ను ఇనుం,పావు గోధుమ,20 గజాల సిల్కు గుడ్డ- ఇవి ఒకేపరిమాణంగల మారకం విలువలు అనుకుందాం.మారకపువిలువలుగా - వేటిలో అయితే ఉపయోగపువిలువల  మధ్య ఉండే గుణాత్మక భేదాలు వదలివేయబడతాయో ఆమారకపు విలువలుగా- అవి ఒకే పరిమాణంలో ఉన్న ఒకే రకం శ్రమకు ప్రతినిధులు.
వాటిలో ఒకేరీతిలో పాదార్ధీకృతమైన శ్రమ ఒకేరకమైన సాదా శ్రమ అయితీరాలి.అది(అటువంటిశ్రమ) ఏవస్తువులో రూపొందినా -అది బంగారమైనా,ఇనుమైనా,గోధుమలైనా, సిల్కయినా .ఆక్సిజన్ తుప్పు ఇనుంలో ఉన్నా,వాతావరణంలో ఉన్నా,ద్రాక్ష రసంలో ఉన్నా, మనిషి రక్తంలో ఉన్న ఆక్సిజన్ ఒకటే అయినట్లు.
అయితే బంగారం తియ్యడం, ఇనుం వెలికి తియ్యడం, గోధుమలు పండించడం, సిల్క్ బట్ట నెయ్యడం- వేర్వేరు పనులు-గుణాత్మకంగా భిన్నమైనవి. వాస్తవానికి, ఏదయితే వస్తుగతంగా చూచినప్పుడు ఈ ఉపయోగపువిలువల భిన్నత్వంగా కనబడుతుందో,అదే డైనమికల్లీ చూస్తే వాటిని చేసిన చర్యల వైవిధ్యంగా కనబడుతుంది.  మారకం విలువని ఉత్పత్తిచేసే శ్రమకి ఆవస్తువుల  తయారీలో వాడే మెటీరియల్ తో నిమిత్తం ల్లేనట్లే,అది ఏప్రత్యేక రూపంలో ఉన్న శ్రమ అనేదానితో నిమిత్తం ఉండదు.సైగా భిన్న ఉపయోగపువిలువలు భిన్న వ్యక్తుల శ్రమ ఉత్పాదితాలు. అందువల్ల వ్యక్తులపరగా భిన్న రకాల శ్రమ ఫలితాలు.అయినా, మారకం విలువలుగా ఏకరీతి (homogeneous)శ్రమకి ప్రతినిధులుగా ఉంటాయి.. అంటే,అది స్రామికుల వైయక్తిక లక్షణాలు వదలివేసిన శ్రమ.ఆవిధంగా మారకం విలువని సృజించే శ్రమ సాధారణ అనిర్దిష్టశ్రమ (abstract general labour).-critique-20
ఉపయోగపువిలువని పరిశీలననించి తప్పించాలి. అంటే, వాటి భౌతికధర్మాల్నీ, పదార్థాన్నీ వదలివేయాలి. ఇవిపోగా సరుకు ‘ఏంగా’ మిగులుతుంది? ఒక మంచం రెండు రగ్గులతొ మారిందనుకుందాం.ఉపయోగపు విలువల్ని తప్పిస్తే, ఆరెండు వస్తువుల తయారీకి వాడిన కొయ్యనీ, ఉన్నినీ వదిలేసినట్లే. వాటి వేర్వేరు భౌతిక ధర్మాలను పక్కకు నేట్టినట్లే.
మరి మిగిలింది ఏమిటి? మంచాన్ని  చేసిన శ్రమా, రగ్గుని  చేసిన శ్రమా. అంటే ఆరెంటిలోనూ శ్రమ ఉన్నది.
శ్రమకు ప్రతినిధులుగా, అవి శ్రమ ఉత్పాదితాలుగా  మాత్రమే  మిగులుతాయి. “ శ్రమ ఉత్పాదితం అనేది ఒక వస్తువులో రూపొందిన శ్రమే. పదార్ధం రూపంలోకి మారిన శ్రమే. శ్రమ వస్తుత్వం చెందడమే” -collected works vol ౩.p 276 . కనక శ్రమే ఆఉమ్మడిసారం. అన్ని సరుకుల్లో ఉన్న అంశం.
శ్రమే విలువ సారం అనే విషయం మార్క్స్ కి ముందున్న ఆర్దికవేత్తలకు –పెట్టీ, స్మిత్, రికార్దోలకు- తెలుసు. వారదే చెప్పారు.
నీరు,వజ్రం-రెంటిని పోల్చాడు స్మిత్.   నీటి కంటే ఉపయోగకరమైనది ఏదీ  లేదు. అయినా అరుదుగా తప్ప అది దేన్నీ కొనలేదు. దానికి మారకంలో ఎప్పుడో  తప్ప ఏదీ రాదు. మరొకవైపు, వజ్రం. దీనికి పెద్ద ఉపయోగపు విలువ లేదు. కాని దానికి మారకంలో భారీగా వస్తువులు లభిస్తాయి. దీన్ని వాటర్ డైమండ్ పారడాక్స్ అంటారు. ఈవిరుద్ధమైన పరిస్థితిని గమనించి శ్రమే విలువ సారం అన్నాడు  స్మిత్ : “అన్నీ సరుకుల మారకపు విలువలకు నిజమైన  కొలత శ్రమే”
శ్రమ విలువ సారం అన్న విషయం కనుగొన్నది సాంప్రదాయ అర్ధ శాస్త్రజ్ఞులే. మార్క్స్ కాదు. మరి మార్క్స్ చేసింది ఏమిటి?
ఇక్కడ ఒక ఆటంకం ఉంది. ఏమంటే, భిన్న సరుకుల్లో రూపొందిన శ్రమల రూపాలు ఒకటి కావు. కుండలు చేసే శ్రమా ,గంపలల్లె శ్రమా ,గుడ్డలు కుట్టేశ్రమా ఒకేరకమైనవి కావు దేనికదే. భిన్నమైనవి. కనుక సరిపోల్చరానివి.
సమస్య ఏమంటే:ఎన్నో రకాల శ్రమలున్నాయి.
ఏరకం శ్రమ విలువని ఏర్పరుస్తుంది?
అప్పటికున్న అర్ధశాస్త్రం లో “ విలువని సృష్టించే  ప్రత్యేక రకం శ్రమ గురించి సరైన పరిశోధన లోపించినట్లు” మార్క్స్ గ్రహించాడు.
శ్రమ అనే మాటలో చాలా భిన్న రూపాలు దాగి ఉన్నాయి అని మనకు తెలుసు. అలాంటప్పుడు, కచ్చితంగా ఏరకం శ్రమ విలువ సారంగా ఉంటుంది?
బట్టలు ఇస్త్రీచేసే శ్రమ వేరు. గులాబీ దండలు గట్టే శ్రమ వేరు.తాడు పేనేశ్రమా,దారం వడికే శ్రమా ఒకటికావు.కాని ఏదైనా శ్రమే.శరీర చలనాలే. అయితే అవయవాలు కదిలే వైఖరులలో తేడాలున్నాయి.
అయితే, భిన్న సరుకుల్లో రూపొందిన శ్రమలేమో ఒకేరకం అయినవి కావు.ఒకేరమైనవి కానివాటిని ఒకే ప్రమాణంతో కొలవలేం. అలాకొలవనిదే సమానత్వం తేల్చడం సాధ్యం కాదు. సమానత్వంలేనిదే  మారకం కుదరదు.
ఇన్నిరకాల శ్రమల్లో ఏ తేడా లేని  ఆ ఉమ్మడి అంశం ఏమిటి?
ఆ అంశం  శ్రమే కాని వేరొకటి కాకూడదు.
కనుక విలువసారంగా ఉన్న ఆ అంశం  - అన్ని రకాల శ్రమల్లో ఒకే రకమైనది ఉండాలి. పైగా, అది శ్రమే  అయి ఉండాలి. స్మిత్ గానీ  రికార్డోగానీ  అలాంటి దాని జోలికి పోలేదు. దాని కోసమే మార్క్స్  దేవుళ్ళాట.
దీన్ని పట్టుకోవడానికి తన విశ్లేషణని మరికొంత లోతుకి తీసుకుపోతాడు. “ఉపయోగపువిలువని ఉపేక్షించటమంటే  దాన్ని ఉపయోగపువిలువగా చేసిన దాని పదార్ధాన్నీ, ఆకారాన్నీ కూడా అదేసమయంలో  ఉపేక్షించినట్లే ”-  cap 1. 45
ఉపయోగపు విలువకి సంబందించిన అన్ని అంశాలనీ పరిశిలననించి  తప్పించినట్లే. ఉదాహరణకి,  కుండ ప్రయోజనం మట్టి వల్లా, దాని ఆకారం వల్లా చేకూరుతుంది. అదే మట్టిని మరో  ఆకారంలో   మలిస్తే ముంతో, మూకుడో తయారవుతుంది. కనక మట్టీ, ఆకారం (రూపం) లేకుండా కుండా  ఉండదు, కుండ ప్రయోజనమూ  ఉండదు. దీన్నిబట్టి తేలిందేమంటే:
అసలాకుండని కుండగా చూడం.అది ఒక పాదార్ధిక వస్తువు అనే  విషయం మన దృష్టిలో ఉండదు. అసలు సంగతి ఇక్కడే ఉంది. ఎప్పుడైతే కుండని కుండగా చూడమో, దానిలోని శ్రమని కుమ్మరిశ్రమగా చూడం .అలాగే మంచంలోని శ్రమని వడ్రంగి శ్రమగా చూడం.
“శ్రమ ఉత్పాదితం యొక్క ప్రయోజనకర స్వభావం అదృశ్యం  కావడమంటే వాటిలో ఇమిడివున్న శ్రమ రకాల ప్రయోజనకర స్వభావం కూడా అదృశ్యం అవుతుంది.”-పెంగ్విన్.128 దాంతో శ్రమ యొక్క భిన్న నిర్దిష్ట రూపాలు అదృశ్యం అయినట్లే. అవి ఇక ఏమాత్రమూ భిన్నమైనవిగా ఉండవు.అన్ని ఒకే రకం శ్రమగా , అనిర్దిష్ట మానవ శ్రమగా  మదింపు అయినట్లే.
ఇతర ఆర్ధిక వేత్తలు పట్టుకోనిదీ, మార్క్స్ తన విశ్లేషణ ద్వారా కనిపెట్టింది దీన్నే, అనిర్దిష్ట శ్రమనే. “శ్రామికుల వైయక్తిక లక్షణాలు వదలివేసిన శ్రమ.ఆవిధంగా మారకం విలువని సృజించే శ్రమ సాధారణ అనిర్దిష్ట శ్రమ (abstract general labour)-క్రిటిక్ 20
ఇదే మార్క్స్ తనపరి శోధనలో తేల్చి చెప్పిన  విషయం.
ఇప్పుడిక ప్రశ్న:ఈమొత్తాల్ని కొలిచేదెలా?
చలనాన్ని కాలంతో కొలిచినట్లే శ్రమని శ్రమకాలంతో కొలవడమే. శ్రమకాలం మామూలు కాలాన్ని కొలిచే యూనిట్ల రీత్యానే(గంటలు, రోజులు,వారాలూ...) కొలవబడుతుంది. అది శ్రమ యొక్క పరిమాణాత్మక అంశం.ఒకేమొత్తం శ్రమకాలం ఇమిడి వుండే భిన్నమైన ఉపయోగపువిలువలు సమానకాలు (ఈక్వివలెంట్స్); మారకం విలువలుగా చూస్తే, అన్ని సరుకులూ నిర్దిష్ట మొత్తాల శ్రమకాలం మాత్రమే.- క్రిటిక్. ౩౦
ఒక బ్రష్ తయారికి 2 గంటలు పట్టి, కొడవలి తయారీకి  4 గంటలు పడితే 2 బ్రష్ లు ఒక కొడవలికి విలువరీత్యా సమానం.
ఇక్కడ మరొక చిక్కు. ఏమంటే అన్నిరకాల శ్రమలు ఒకే కాలంలో ఒకే విలువని ఏర్పరుస్తాయా?
ఒక గంట గుంట తీసే శ్రమా, మెదడు ఆపరేషన్ చేసే డాక్టర్ శ్రమా ఒకే విలువని ఏర్పరుస్తాయా?
గుంట తవ్వే శ్రమకి పెద్దగా శిక్షణ పనిలేదు. కాని డాక్టర్ కావడానికి కొన్ని సంవత్సరాల శిక్షణ అవసరం. చిన్నప్పటి నించే ఎవరైనా గుంటలు తవ్వగలరు. కాని మెదడు ఆపరేషన్ చేసే వైద్యుడికి కనీసం ౩౦ సంవత్సరాల వయసు దాటుతుంది. పైగా ప్రతివైద్యుడూ చెయ్యలేడు. అందుకు మరికొంత ప్రత్యెక శిక్షణ అవసరం. అతనిది నిపుణ శ్రమ. గుంట తీసే శ్రమ సాదా శ్రమ.
నిపుణ శ్రమ
నిపుణ శ్రమ పరిమాణం సాదాశ్రమపరిమాణానికి ఎన్నోకొన్ని రెట్లుంటంది.ఉదాహరణకి ఒక గంట కోటుకుట్టే శ్రమ, 3 గంటలు మట్టిమోసే శ్రమకు సమానం కావచ్చు. నెక్లెస్ లో వజ్రాలు పోదిగే శ్రమ కోటుకుట్టే శ్రమకి 5 రెట్లుండవచ్చు. గుండె ఆపరేషన్ చేసే శ్రమ వజ్రాలు పొదిగే శ్రమకి 10 రెట్లుండచ్చు. ఒకగంట సాదాశ్రమ మరిన్ని గంటల సాదాశ్రమకు సమానమవుతుంది.
ఇది సాదాశ్రమ. సగటు వ్యక్తి చెయ్యగల, శిక్షణ పొందగల శ్రమ. ఇసాడా శ్రమ కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. అయితే  ఏ  ప్రత్యెక సమాజంలో అయినా స్థిరంగా ఉన్నట్లు కన్పిస్తుంది. గణాంకాల ప్రకారం  బూర్జువా సమాజంలో జరిగే శ్రమలో ఎక్కువభాగం సాదా శ్రమే. ఒక వ్యక్తీ 6 గంటలు ఇనుం ఉత్పత్తిచేసి, మరో 6  గంటలు బట్ట ఉత్పత్తి చేస్తాడు. మరోకవ్యక్తి కూడా అలాగే పనిచేస్తాడు.అలాకాక ,ఒకరు 12గంటలు ఇనుం ఉత్పత్తిచేసి , మరొకరు 12 గంటలు బట్టని ఉత్పత్తిచేసినా ఒకే శ్రమ కాలాన్ని భిన్న రీతుల్లో వర్తింప చేయ్యడమే.- critique.31
ఒక వ్యవసాయ శ్రామికుడి శ్రమశక్తి సాదాశ్రమ కింద తీసుకుందాం.కుట్టుశ్రమ మరింత అభివృద్ధి చెందిన శ్రమ శక్తిగా అనుకుందాం. వ్యవసాయశ్రామికుడు రోజులో సృజించిన విలువ దర్జీ సృజించే విలువ ఎక్కువ.
ఇక్కడ ఒక సందేహానికి ఆస్కారం ఉంది. పనివాడు ఎంత సోమరి  అయితే, ఎంత తక్కువ నిపుణుడు అయితే , అంత ఎక్కువ శ్రమ పడుతుంది.అందువల్ల ఆసరుక్కి అంత ఎక్కువ విలువ ఉంటుందా అన్నదే ఆసందేహం.
ఒకేరకం బుట్ట అల్లడానికి ఒకడికి 2 గంటలు పడితే, ఒక సోమరికి  4 గంటలు పట్టిందనీ, సరిగా పనిరానివానికి 6 గంటలు పట్టిందనీ అనుకుందాం. అప్పుడు మొదటివాని బుట్టకు రెండవ వాని బుట్ట రెట్టింపు విలువ  ఉంటుందా? మూడవ వాని బుట్ట ౩ రెట్ల విలువ కలిగి ఉంటుందా?
ఉండదు.
సామాజికంగా అవసరమైన శ్రమ
విలువసారాన్ని రూపొందించే శ్రమ సమాన మానవశ్రమ, ఒకే రకమైన మానవశ్రమ శక్తి వ్యయం.సమాజపు మొత్తం శ్రమ శక్తి అన్నీ సరుకుల విలువల్లో ద్యోతకమవుతుంది. అది అసంఖ్యాక వ్యష్టి యూనిట్లతో  ఏర్పడ్డా, ఏ తేడా లేని శ్రమ శక్తి రాశిగా లేక్కకకొస్తుంది. ఈ యూనిట్లలో ప్రతిది మిగతా వాటి లాటిదే ........
సరుకు విలువ పరిమాణాన్ని నిర్ణయించేది ఆసరుకు ఉత్పత్తికి వాస్తవంగా పట్టిన శ్రమ కాలం కాదు. దాని ఉత్పత్తికి సామాజికంగా అవసరమైన శ్రమకాలం. అంటే, “ అమల్లో వున్న ఉత్పత్తి పరిస్థితుల్లో, ఆకాలంలో ప్రబలంగా వున్నా నైపుణ్య స్తాయితో, తీవ్రతతో ఒక వస్తువును  ఉత్పత్తి చెయ్యడానికి అవసరమైన శ్రమ కాలమే సామాజికంగా అవసరమైన శ్రమ కాలం.”-Cap1 .47
ఇంగ్లండ్ లో మరమగ్గాలు (పవర్-లూమ్స్) వచ్చాక, కొంత దారాన్ని బట్ట నెయ్యడానికి అంతకు ముందు పట్టే శ్రమ కాలం సగానికి తగ్గింది. అయితే, చేతి మగ్గాలమీద నేసే వాళ్ళకి మాత్రం అంతకు ముందెంత కాలం పట్టిందో, అంటే పట్టింది. అందువల్ల, వాళ్ళు గంట నేసిన బట్ట అరగంట సామాజిక శ్రమకి మాత్రమే ప్రతినిధిగా వుంది. ఫలితంగా దాని విలువ సగానికి పడిపోయింది. దీన్నిబట్టి చూస్తే, ఏ వస్తువు విలువ పరిమాణాన్నయినా నిర్ణయించేది సామాజికంగా అవసరమైన శ్రమ మొత్తమే.దాని ఉత్పత్తికి అవసరమైన శ్రమ కాలమే.ఈ  విషయాన్ని  ఒక అజ్ఞాత రచయిత చెప్పినట్లు మార్క్స్ ఫుట్ నోట్ లో చెప్పాడు.-cap1.47
తేలిందేమంటే, ఏ సరుకు విలువ పరిమాణాన్నయినా నిర్ణయించేది ఆవస్తువులో రూపొందిన సామాజికంగా అవసరమైన శ్రమ కాలమే. ఈ సందర్భంలో  ఒకే రకం సరుకుల్లో ప్రతిదానినీ (ప్రతి విడి సరుకునీ) ఆ తరగతి(ఆరకం అన్ని సరుకుల ) సగటు మాదిరిగా/ నమూనా గా పరిగణించ వలసి వుంటుంది.
అందువల్ల ఏ సరుకుల్లో అయితే సమాన మొత్తాల శ్రమ రూపొంది వుంటుందో, ఆ సరుకుల విలువలు సమానం. మరో మాటల్లో,ఒకే కాలంలో ఉత్పత్తయ్యే సరుకుల విలువలు సమానం.
వేతనం-ధర –లాభం అనే ప్రసంగా వ్యాసంలో వివరంగా ఉంటుంది:
“ ఇంగ్లండ్ లో మరమగ్గం చేతి మగ్గంతో పోటీ  పడినప్పుడు, ఒక నిర్ణిత మొత్తపు దారాన్ని ఒక గజం గుడ్డగా నేయ్యడానికి  అంతకు ముందు పట్టిన శ్రమ కాలంలో సగం మాత్రమే అవసరమయింది. ఇంతకు ముందు  రోజుకు తొమ్మిది పది గంటలు మాత్రమే పనిచేస్తూ వుండిన చేనేతకార్మికుడు పాపమిప్పుడు పదిహేడు పద్దెనిమిది గంటలు పనిచెయ్యాల్సి వచ్చింది. అయినాకూడా అతని 20  గంటల శ్రమ యొక్క ఉత్పాదితం యిప్పుడు, కేవలం 10సామాజిక శ్రమ గంటలను, లేక ఒక నిర్దిష్ట పరిమాణపు దారాన్ని జౌళి వస్తువులుగా మార్చడానికి సామాజికంగా అవసరమైన 10 గంటల శ్రమకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నది. అందుచేత అతనిప్పుడు 20 గంటల్లో చేసిన ఉత్పాదితానికి అంతకు ముందు 10 గంటల్లో చేసిన ఉత్పాదితానికి వున్నా విలువకన్నా ఎక్కువ వుండదు.”- మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు 2 .41
“ఒక సరుకు ఉత్పత్తికి అవసరమయ్యే శ్రమకాలానికి కి మరొక సరుక్కి అవసరమయ్యే  శ్రమకాలం ఎలాగో, ఒక సరుకు విలువ మరొక సరుకు విలువకి అలాగు.” –Capital 1.47
“విలువలుగా, అన్నీ సరుకులూ నిర్దిష్ట మొత్తాల్లో గడ్డకట్టిన శ్రమ కాలాలు మాత్రమే”- అంటాడు.
సరుకు విలువ పరిమాణం ఆ సరుకు ఉత్పత్తికి పట్టిన సామాజికంగా అవసరమయ్యే శ్రమ కాలమే – అని తేలింది. దీన్నిబట్టి , ఒకసరుకు ఉత్పత్తికి పట్టే సామాజికంగా అవసరమయ్యే శ్రమకాలం స్థిరంగా మారకుండా ఉంటే, దాని విలువ పరిమాణం కూడా స్థిరంగా వుంటుంది. నిజమే. కాని అది (ఒకసరుకు ఉత్పత్తికి పట్టే సామాజికంగా అవసరమయ్యే శ్రమకాలం) మారకుండా, స్థిరంగా వుండేది కాదు. ఉత్పత్తి పరిస్థితుల్లో మార్పు వచ్చినా, సగటు శ్రమ నైపుణ్యంలో, తీవ్రతలో మార్పులొచ్సినా అవసర శ్రమ కాలం మారుతుంది. ఈ  అంశాల్లో ఎందులో మార్పొచ్చినా  శ్రమ ఉత్పాదకత మారుతుంది.
“శ్రమ ఉత్పాదకత  కాలానికి ఆ కాలంలో ఉత్పత్తయిన వస్తువుల పరిమాణానికి సంబంధం ద్వారా వ్యక్తం అవుతుంది.”-పెంగ్విన్
ఒక విషయాన్ని గుర్తుచేసుకోవాలి: ఒకే కాల వ్యవధిలో  జరిగిన అదే శ్రమ ఎప్పుడూ ఒకే విలువ మొత్తాన్ని సృజిస్తుంది. కాని ఒకే మొత్తంలో ఉపయోగపువిలువలను సృజించాలని లేదు. ఉత్పత్తయ్యే వస్తువుల పరిమాణం పెరగావచ్చు, తరగా వచ్చు. పరిమాణం పెరిగితే, ఉత్పాదకత పెరిగినట్లు. పరిమాణం తగ్గితే, ఉత్పాదకత తగ్గినట్లు. ఉత్పాదకతలో వచ్చే  మార్పులు కొన్ని పరిస్థితుల ను బట్టి వుంటాయి.
ఉదాహరణకి, మామూలు తోపుడుతో ఒకడు గంటలో 2 దర్వాజాల కమ్ముల్ని తోపుడేస్తాడు
అదే గంటలో మరతోపుడుతో అయితే  10 దర్వాజా కమ్ముల్ని తోపుడు పడతాడు.
రెండో సందర్భంలో ఉత్పాదకత పెరిగింది. కాని మొదటి సందర్భంలో 2 కమ్ముల్లో ఎంత శ్రమకాలం ఉందో, రెండో సందర్భంలోని 10  కమ్ముల్లో అంటే శ్రమ కాలం ఉంది.
ఉత్పాదకత పెరిగితే ఎక్కువ ఉపయోగపు విలువలు వస్తాయి. కాని ఎక్కువ విలువ రాదు. అంతే విలువ వస్తుంది. అంటే, అప్పుడు రెండు కమ్ములు సాపు చేయడం వల్ల వాటికి ఎంత విలువ కలిసిందో, ఇప్పుడు పది  కమ్ములకీ అంటే విలువ కలుస్తుంది. “ఉత్పాదకతలో మార్పులు విలువకు ప్రతినిదిగావున్న శ్రమ  మీద ఏ మాత్రం ప్రభావం చూపదు.”-Capital (penguin)1 .138
కారణం, గంటలో ఒకే శ్రమ సృజించే విలువ పరిమాణం స్థిరమైనది. “దానికి ఉత్పాదకత హెచ్చు తగ్గులకూ సంబంధం ఉండదు.” పై ఉదాహరణలో ఉత్పాదకత 5 రెట్లయింది. కాని మనిషి చేసిన శ్రమ గంటే. తేడా లేదు.
కనుక అంతే  విలువ ఏర్పడుతుంది.
“ఒకే శ్రమ ఒకే కాలవ్యవధిలో భిన్న పరిమాణాల్లో ఉపయోగపువిలువల్ని ఉత్పత్తి చేస్తుంది. ఉత్పాదకతపెరిగితే ఎక్కువ పరిమాణంలో, తగ్గితే తక్కువ పరిమాణంలో.” కాని అంతే  విలువని ఏర్పరుస్తుంది.
శ్రమ ఉత్పాదకత కు దోహదపడే కొన్ని పరిస్థితులు:
1.పనివాళ్ళ సగటు నైపుణ్య స్థాయి.
2.సైన్స్ అభివృద్ధీ , దాని సాంకేతిక అన్వయింపూ
౩. ఉత్పత్తి ప్రక్రియ నిర్వహణ
4.ఉత్పత్తి సాధనాల విస్తృతీ, సామర్ధ్యమూ
5.ప్రకృతి పరిసరాల్లో ఉండే పరిస్థితులు. Capital (penguin)1 . 131
ఉదాహరణకి, అనుకూల వాతావరణంలో 8 బుషెల్స్ గోధుమల్లో వ్యక్తమయిన శ్రమ,అననుకూల వాతావరణంలో4 బుషెల్స్లో వ్యక్తం కావచ్చు.ఒకే పరిమాణమున్న శ్రమ మంచిగనుల్లో మామూలు గనుల్లో కంటేఎక్కువ లోహాల్ని తీస్తుంది.వజ్రాలు భూమ్మీద అరుదుగా దొరుకుతాయి. అందువల్ల వాటిని పట్టుకోడానికి సగటున  ఎంతో కాలం పడుతుంది.ఫలితంగా, అవి కొద్ది స్పేస్ లోఎంతో శ్రమకి ప్రాతినిధ్యం వహిస్తాయి-cap1.47
“శ్రమ యొక్క ఉత్పాదక శక్తులు ఎంతగా ఎక్కువైతే ఒక నిర్దిష్ట శ్రమ కాలంలో ఉత్పదితం అంత ఎక్కువగా తయారవుతుంది. శ్రమ యొక్క ఉత్పాదక శక్తులు తగ్గినకొద్దీ, అదే కాలంలో తయారయ్యే ఉత్పాదితం తగ్గుతుంది. ఉదాహరణకు, జనాభా పెరుగుదల కారణంగా తక్కువ సారవంతమైన భూములు సాగుచేయ్యడం అవసరమైనట్లయితే, అదే మొత్తపు పంట అధికతర శ్రమను వినియోగిమ్సినప్పుడు మాత్రమే లభ్యమవుతుంది. తత్పర్యవసానంగా వ్యావసాయిక పంటల విలువ పెరుగుతుంది. మరోవంక, ఒకనేత కార్మికుడు ఒక పనిదినంలో పూర్వం రాట్నంతో వడక గలిగిన పత్తికి, ఆధునిక ఉత్పత్తి సాధనాలతో యిప్పుడు కొన్ని వేల రెట్లు ఎక్కువ పత్తిని అదే ఒక్క పనిదినంలో నూలుగా మార్చగలుగుతున్నాడంటే, దీన్నిబట్టి ఒక్క విషయం స్పష్టపడుతున్నది: ప్రతి ఒక్క పౌను పత్తీ ఇప్పుడు ఇంతకుముందు కంటే  అనేక వేల రెట్లు తక్కువ వాడికే శ్రమను గ్రహిస్తోందన్న మాట, మరి తత్పర్యవసానంగా  ప్రతి ఒక్కపౌను పత్తికి జోడింపబడుతున్న విలువ యింతకు ముందు కన్నా అనేక వేల రెట్లు తగ్గుతుమ్దన్నమాట. నూలు విలువ తదనుగుణంగా పడి పోతుంది.  ” మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు 2 .42
కాపిటల్ నించి మరికొన్ని ఉదాహరణలు:
“1793 లో విట్నీ కాటన్ జిన్ కనుక్కున్నాడు. అంతకు ముందు ఒక పనివాడు రోజుకి ఒక పౌను పట్టి నించి విత్తనాలు వేరుచెయ్యగలిగే వాడు. జిన్ తో ఒక రోజుకి 100 పౌన్ల పత్తిని శుభ్రపరచ గలిగాడు.”Cap 1.369
“450 మూల్ కదుర్లతో పని చెయ్యడానికి ఇద్దరే పనివాళ్ళు సరిపోతారు. 366 పౌన్ల దూదిని దారంగా మార్చడానికి  150 పనిగంటలు పడుతుంది. అదే రాట్నంతో అయితే ఒక పనివాడికి 27000 గంటలు కావలసి వస్తుంది.” Cap 1.369
శ్రమ విభజనవల్ల పెరిగిన ఉత్పాదకత గమనించి స్మిత్ ముగ్ధుడయ్యాడు:
“ సుత్తి వాడే కమ్మరి అంతకుముందు చీలలు చెయ్యకపోయినా రోజుకి 200 లేక 300 చీలలు చేస్తాడు. చీలలు చేసే అలవాటున్నా అదే అతని ఏకైక వృత్తి కాని  కమ్మరి మహా అయితే రోజుకి  800 లేక 1000 చేస్తాడు. అయితే నేను 20 ఏళ్ల లోపు పిల్లల్ని చాలా మందిని చూచాను. కష్టపడితే, ఒక్కొక్కరూ రోజుకి 2300 చీలలకు పైగా చెయ్యగలరు.”
స్మిత్ దే బాగా తెలిసిన పిన్నుల ఉదాహరణ:
“ ఒక పనివాడు రోజంతా కష్టపడితే బహుశా ఒక పిన్ను చేస్తాడేమో! 20 పిన్నులు ఎలాగూ చెయ్య లేడు. ఇప్పుడు  ఈ పనిసాగే విధానం ....ఒక మనిషి తీగ తీస్తాడు. మరొకడు ఆతీగని సాపు చేస్తాడు. మూడోవాడు తెగ్గోడతాడు. ఇంకొకడు మొన తేలుస్తాడు. అయిదో వాడు  తలపైన నునుపు చేస్తాడు. తల తయారీలో రెండు,మూడు చర్యలు వుంటాయి. పిన్నుల్ని తెల్లగా చెయ్యడం వేరొక చర్య. వాటిని పేపర్లో పెట్టడం మరోకరిపని. ఈ విధంగా పిన్నుల తయారీ 18 చర్యలుగా విడి పోయింది. ....
నేనొక చిన్న పిన్నుల ఫాక్టరీ చూచాను. అక్కడ 10 మంది పనివాళ్ళున్నారు. కొందరు  రెండు,మూడు చర్యలు చేసేవారు...వాళ్ళు రోజుకి 48000 పిన్నుల చేస్తారు.అంటే, ఒక్కొక్కరూ 4800 పిన్నులు చేసినట్లు లెక్క.” –Wealth of Nations.7
విభిన్న చర్యల విభజన, కలయికల  వల్ల 20 పిన్నులు చెయ్యలేని వాళ్ళు 4800 పిన్నులు చేస్తున్నారంటే, ఉత్పాదకత 240 రెట్లకంటే ఎక్కువే పెరిగింది.
ఎవరైనా బొగ్గుని వజ్రాలుగా మార్చగలిగితే, వాటి విలువ ఇటుక విలువ కంటే  దిగువకి పడిపోతుంది.
సాధారణంగా:శ్రమ ఉత్పాదకశక్తి పెరిగితే, ఒకవస్తువు తయారీకి పట్టే శ్రమ తగ్గి,దాని విలువ తగ్గుతుంది.అందుకు భిన్నంగా శ్రమ ఉత్పాదకశక్తి తగ్గితే,ఒకవస్తువు తయారీకి పట్టే శ్రమ పెరిగి, ఆవస్తువు విలువ పెరుగుతుంది.
ఒకసరుకు విలువ పరిమాణం ఆసరుకులో ఇమిడివున్న శ్రమ మొత్తానికి అనులోమంగానూ, ఆశ్రమ ఉత్పాదకశక్తికి విలోమంగానూ మారుతుంది- cap1.48 అంటే శ్రమ ఎంత పెరిగితే విలువ అంత పెరుగుతుంది.  ఉత్పాదకత ఎంత పెరిగితే సరుకు విలువ అంత తగ్గుతుంది.
ఇప్పటికి సరుకుల రెండు అంశాలైన ఉపయోగపు విలువ,విలువ ల గురించీ, విలువ సారం, విలువ పరిమాణం గురించీ చెప్పాడు. అంటే, సరుకు ద్వంద్వ స్వభావాన్ని వివరించాడు. ఇక సరుకుల్లో రూపొందిన శ్రమ యొక్క  ద్వంద్వ స్వభావాన్నివిశదీకరిస్తాడు.
వచ్చే పోస్ట్ లో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి