13, జూన్ 2016, సోమవారం

అమెరికా నిరుద్యోగానికి రెండు రేట్లు మొదటిదానికి రెండోది రెండు రెట్లు

అమెరికా నిరుద్యోగానికి  రెండు రేట్లు
మొదటిదానికి రెండోది రెండు రెట్లు

అమెరికాలో మేలో వచ్చిన ఉద్యోగాలు 38 వేలు మాత్రమే. 2010 సెప్టెంబర్ తర్వాత ఏనెలలోనూ ఇన్ని తక్కువ ఉద్యోగాలు రాలేదు. అయినా నిరుద్యోగం 0.3 పర్సెంటేజ్ పాయంట్లు తగ్గింది. 2007 నవంబర్ తర్వాత ఇంత తక్కువ నిరుద్యోగం రేటు ఏనెల లోనూ లేదు. ఉద్యోగాలు మరీ తక్కువ వచ్చినా, అంతగా నిరుద్యోగం రేటు తగ్గడం ఏమిటనిపిస్తుంది. ఏప్రిల్ లో 160,000 వచ్చాయని మొదట చెప్పినప్పుడు నిరుద్యోగం 0.1 పర్సెంటేజ్ పాయంట్లు తగ్గినట్లు చెప్పారు. మరి 38 వేలే వస్తే 0.3 పర్సెంటేజ్ పాయంట్లు ఎలా తగ్గింది? ఇందులో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.
తగినన్ని ఉద్యోగాలు వచ్చి, నిరుద్యోగం రేటు తగ్గి ఉంటే హర్షించదగిందే. అయితే తగ్గింది తగినన్ని ఉద్యోగాలు వచ్చి కాదు. శ్రామిక జాబితాలో సంఖ్య తగ్గి. ఈలెక్క చేసేది ఎలాగో పరిశిలిస్తే విషయం తేటతెల్లమవుతుంది..

నిరుద్యోగం రేటు కట్టేదెలా?

బూరో ఆఫ్ లేబర్ శ్టాటిస్టిక్స్ సంస్త నిరుద్యోగం రేటెంతో నెలనెలా చెబుతుంది. అది ఎలా లెక్కిస్తుందో చూస్తేగాని ఇది తెలియదు.
నిరుద్యోగం రేటు ఫార్ములా:

నిరుద్యోగులసంఖ్య/శ్రామిక జాబితాలో ఉన్నవాళ్ళ సంఖ్య × 100

శ్రామిక జాబితాలో ఉన్న నిరుద్యోగుల శాతమే నిరుద్యోగం రేటు.
లెక్క చెయ్యాలంటే, రెండు అంశాలగురించి తెలియాలి.ఒకటి నిరుద్యోగులు ఎవరు? రెండు శ్రామిక జబితాలో ఎవరు ఉంటారు?ఇవిరెండూ తెలిస్తే లెక్క చెయ్యడం 6 వతరగతి విద్యార్ధి చెయ్యగలడు.(ఆతరగతిలో నిష్పత్తులూ, శాతాలూ ఉంటాయి).

నిరుద్యోగులు అంటే ఎవరు?

నిరుద్యోగి అంటే ఎవరు? ఉద్యోగం లేనివాడు అని అర్ధం. అయితే ప్రభుత్వ నిర్వచనం ప్రకారం ఉద్యోగంలేనంత మాత్రాన్నే నిరుద్యోగి కాడు. ఎందుకంటే ముందు అతను శ్రామికుడిగా నమోదుకావాలి. అందుకు ఉద్యోగం లేకపోవడం ఒక్కటే చాలదు. లెక్కతీసే నాటికి నాలుగు వారాలలో  ఉద్యోగంకొసం వెడుకుతుండాలి. అప్పుడు మాత్రమే నిరుద్యోగి. లేకుంటే నిరుద్యోగిగా లెక్కకి రాడు.
శ్రామిక జబితాలో ఎవరు ఉంటారు?

1.16 ఏళ్ళు ఆపై వయస్సుండాలి. అయితే,ఇన్ స్టిట్యూషన్స్ లోనూ,సైన్యంలో ఏక్టివ్ డ్యూటిలోనూ ఉండ కూడదు..
2. ఉద్యోగులుగానో, నిరుద్యోగులుగానో ఉండాలి.
3. ఉద్యోగం లేనంత మాత్రాన నిరుద్యోగిగా లెక్కలో పడడు. జాబితా తయారయ్యేటప్పటికి 4 వారాల్లోపు ఉద్యోగం కోసం ప్రయత్నించినవాడై ఉండాలి.

శ్రామిక జాబితా (లేబర్ ఫోర్స్)లో ఉద్యోగులూ, నిరుద్యోగులూ ఉంటారు. ఫుల్ టైం చేసినా పార్ట్ టైం చేసినా ఉద్యోగిగా లెక్కలోకొస్తాడు. కాని ఉద్యోగం లేనంత మాత్రాన నిరుద్యోగిగా లెక్కలో పడడు. నిరుద్యోగి అంటే ఉద్యోగం లేకుండా ఉండి, ఉద్యోగం కోసం వెదికేవాడై ఉండాలి. వెదకని వాడు నిరుద్యోగి కాడు. కనక జాబితాలో చేరడు. అదికూడా, జాబితా తయారయ్యేటప్పటికి 4 వారాల్లోపు ఉద్యోగం కోసం ప్రయత్నించినవాడై ఉండాలి.
వెదకడం అంటే ఉద్యోగాలిచ్చే వాళ్ళని సంప్రతించడం, ఇంటర్ వ్యూ లకి పోవడం, రెజ్యూంస్ పంపడం లాంటివి చే స్తుండడం.ఇలాంటి ప్రయత్నాలేవీ చెయ్యని వాళ్ళు ఉద్యోగం లేకపోయినా నిరుద్యోగులుగా లెక్కకి రారు. కనక జాబితాలో ఉండరు. నిరుద్యోగం రేటు కట్టేటప్పుడు లెక్కకి రారు.
ఇలాతేల్చే రేటుని యు-3 నిరుద్యోగం రేటు అంటారు. అధికారిక రేటు ఇదే. పాలకులు ప్రకటించేదీ, పట్టించుకొని ప్రచారం చేసేదీ దీన్నే.

యు-3 నిరుద్యోగం రేటు

ఒక ఉదాహరణ చూస్తే తెలుస్తుంది.
ఏప్రిల్ లో నిరుద్యోగులు - 7,920,000
శ్రామిక జాబితాలో ఉన్నవారు-158,924,000
లెక్కిస్తే నిరుద్యోగం రేటు ఏప్రిల్ లో -5(4.98) అప్పుడు 160,000 ఉద్యోగాలు వచ్చినా నిరుద్యోగం రేటు మారలేదు. మార్చ్ లో ఉన్న 5 శాతం ఏప్రిల్ లో కూడా ఉన్నచోటే ఉంది. మరిప్పుడు మేలో 38 వేలే వచ్చినా 0.3 పర్సెంటేజ్ పాయంట్లు ఎలా తగ్గింది?   మే నెల రేటులెక్కిస్తే ఇది తేటతెల్లమవుతుంది.
2016 మే లో నిరుద్యోగులు-7,436,000.
శ్రామిక జాబితాలోఉన్నవారు -158,466,000
లెక్కిస్తే నిరుద్యోగం రేటు-4.7
7,436,000/158,466,000×100=4.7

మేలో 38 వేలే వచ్చినా 0.3 పర్సెంటేజ్ పాయంట్లు తగ్గడానికి కారణం ఏప్రిల్ శ్రామిక జాబితాలో(158,924,000) కంటే, మే జాబితాలో(158,466,000) 458,000 మంది తగ్గడం.
తగ్గినవాళ్ళు =158,924,000 – 158,466,000= 458,000
వాళ్ళుకూడా ఉన్నట్లయితే నిరుద్యోగులు -7,436,000+458,000= 7,894,000 అయ్యేవారు.
శ్రామిక జాబితాలో 158,466,000+458,000= 158,924,000  ఉండేవారు.

అప్పుడు నిరుద్యోగం రేటు = 7,894,000/158,924,000×100=4.97 శాతానికి పెరిగి ఉండేది

ఇంచుమించు ఏప్రిల్ లో ఉన్నంతే (4.98). అంటే రేటు తగ్గడానికి కారణం కేవలం జాబితా తగ్గడమే. తగినన్ని ఉద్యోగాలొచ్చికాదు ని తేలుతుంది.
అంతమంది జాబితాలో ఉండి 4.7 శాతం నిరుద్యోగం రేటు ఉండాలంటే మరొక 35,000 ఎక్కువ మంది నిరుద్యోగులు ఉండాలి. యు-3 నిరుద్యోగం రేటు వాస్తవస్థితిని వివరించదు.

యు-6 నిరుద్యోగం రేటు

2016 మేలో యు-3 రేటు 4.7 శాతం అయితే, యు-6 రేటు 9.7 శాతం.
యు-6 రేటు యు-3 రేటుకి రెండింతలు ఉంది. ఈతేడా ఎలావచ్చింది? నిరుద్యోగుల సంఖ్య యూ3-లో ఉన్నంతే యు-6 లో ఉండదు. అలాగే శ్రామిక జాబితాకూడా.రెండూ ఎక్కువ వుంటాయి.ఎందుకంటే,
యు-3 లో ఉన్న నిరుద్యోగులకి యు-6 లో అంచునవున్న వాళ్ళు(ఉద్యోగం ఉండదు, ప్రయత్నించరు-.marginally attached workers) కలుస్తారు. అలాగే పార్ట్ టైం వాళ్ళూ కలుస్తారు. 2016 మే ని తీసుకుంటే, యూ3 నిరుద్యోగులు 7,436,000 మంది. అంచున ఉన్నవాళ్ళు 1,713,000. పార్ట్-టైం వాళ్ళు 6,430,000.కలిపితే 15,579,000.
రెండో అంశం శ్రామిక జాబితా. యు-3 జాబితా 158,466,000.యు-6 లో అంచునవున్న వాళ్ళు (1,713,000) కలుస్తారు.పార్ట్ టైం వాళ్ళు యూ3 జాబితాలో ఉంటారు కనక వాళ్ళని కలపాల్సిన పనిలేదు.కనక యు-6 జాబితాలో 160,179,000 మంది ఉంటారు. ఈఅంకెల్ని బట్టి లెక్కిస్తే 9.7 శాతం వస్తుంది.

                                              15579000/160179000×100= 9.7
యు-6 యు-3 కంటే వాస్తవపరిస్థితిని కొంత సరిగా చూపుతుంది. అందుకే దాన్ని వాస్తవ నిరుద్యోగ రేటు అంటారు.
కాని పాలకులు ఒక్క యు-3  నిరుద్యోగం రేటు గురించే మాట్లాడతారు. ఎందుకంటే, అది తక్కువ వుంటుంది గనక.
యు3 అయనా యు6 అయనా  నిరుద్యోగం రేటు కార్మికుల వాస్తవస్థితి గతుల్ని వివరించదు.

అన్ని వివరాలూ నివేదికలొ ఉంటాయి. కాని పాలకులు ఒక్క నిరుద్యోగం రేటు గురించే మాట్లాడతారు. ఒబామా నిరుద్యోగం రేటు మాంద్యం ముందు స్తాయికి దించానన్నాడు. అది యు-3 రేటు. నిజమే 5 నించీ 4.7 కి తగ్గింది.  మరి యు-6 సంగతి? మాంద్యం ముందు 8.8 శాతం,ఇప్పుడు 9.7 శాతం.దీన్ని చెప్పడు. సరే.
మాట్లాడవలసినవి చాలా ఉన్నాయి.
పోయే ఉద్యోగానికీ వచ్చే వుద్యోగానికీ మధ్య వ్యవధి ఎంతవుంటున్నది? అంటే, ఉద్యోగం పోయాక మళ్ళీ ఎంతకాలానికి ఏదో ఒక ఉద్యోగం వస్తున్నది?
వేతనాలు పోయిన ఉద్యోగానికి వచ్చినంత వస్తున్నదా, లేదా?
వస్తున్నవి ఫుల్ టైం వా, పార్ట్ టైం వా?
దీర్ఘకాలనిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు?
పని చేసే సామర్ధ్యం ఉన్న జనభాలో ఉద్యోగుల శాతం ఎంత?
వీటి గురించి మరొకసారి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి