18, డిసెంబర్ 2018, మంగళవారం

స్థిర పెట్టుబడి- అస్థిర పెట్టుబడి విభజన ఒక కీలకాంశం


స్థిర పెట్టుబడి- అస్థిర పెట్టుబడి విభజన  ఒక కీలకాంశం
 మార్క్స్ కి ముందు అర్ధశాస్త్రజ్ఞులు పెట్టుబడిని రెండు భాగాలుగా చూశారు:
1. నిశ్చల  పెట్టుబడి(fixed capital)
2. చలామణీ పెట్టుబడి (circulating capital).
ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే అంశాల విలువ తయారయ్యే కొత్త ఉత్పాదితాలలో చేరుతుంది. అయితే కొన్ని అంశాల విలువ పూర్తిగా చేరుతుంది. ఆ అంశాలు - శ్రమ శక్తీ, శ్రమ పదార్ధాలూ,ఇంధనాలూ. మరికొన్ని అంశాల విలువ ఒక్కసారిగా, పూర్తిగా ఉత్పాదితాలలో చేరదు. కొంచెంకొంచెంగా, క్రమక్రమంగా చెరుతుంది. ఆ అంశాలు- భవనాలూ, పరికరాలూ, యంత్రాలూ.మొదటి వాటి మీద పెట్టిన పెట్టుబడి భాగాన్ని చలామణీ పెట్టుబడి (circulating capital) అన్నారు. రెండో వాటి మీద పెట్టిన పెట్టుబడి భాగాన్ని నిశ్చల పెట్టుబడి (fixed capital) అన్నారు.  
చలామణీ పెట్టుబడి - శ్రమపదార్ధాలూ, ఇంధనాలూ, కార్మికుల వేతనాలూ.
నిశ్చల పెట్టుబడి - ఫాక్టరీ భవనాలూ, యంత్రాలూ, పరికరాలూ

మార్క్స్  కూడా పెట్టుబడిని మరోవిధంగా రెండు భాగాలుగానే చూశాడు:
1.స్థిర పెట్టుబడి (constant capital)- ఉత్పత్తి సాధనాలమీద పెట్టేది.
2. అస్థిర పెట్టుబడి (variable capital)- కార్మికుల వేతనాలకోసం వెచ్చించేది
ఉత్పత్తి ప్రక్రియలో కొన్ని అంశాల విలువ పరిమాణం ఏమాత్రం  మారదు. ప్రక్రియకి ముందు ఎంత ఉన్నదో,  సరిగ్గా అంతే   ఉత్పాదితానికి బదిలీ అవుతుంది.  అందువల్ల దాన్ని స్థిరపెట్టుబడి అన్నాడు. రెండోభాగం  విలువ పరిమాణం మార్పుచెందుతుంది; శ్రమ శక్తి దాని సొంత విలువని పునరుత్పత్తి చెయ్యడమే  కాకుండా, దానికి తోడు  అదనపు విలువని కూడా ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల  పెట్టుబడిలోని భాగాన్ని అస్థిర పెట్టుబడి అన్నాడు.
స్థిర పెట్టుబడి -ఫాక్టరీ భవనాలూ, యంత్రాలూ, పరికరాలూ,ముడి సరుకులూ ,ఇంధనాలూ.
అస్థిర పెట్టుబడి- కేవలం కార్మికుల వేతనాలు మాత్రమే.
“స్థిర పెట్టుబడి, అస్థిర పెట్టుబడి అనే భావాభివర్గాల్ని మొదట వాడిన వాడిని నేనే.”-అని చెప్పుకున్నాడు.
మార్క్స్ కి ఇది కీలకమైనది. ఆయన లక్ష్యం అదనపువిలువ రహస్యాన్ని బహిర్గతంచేయడం.
అదనపువిలువ పెట్టుబడిలోని ఏభాగం వల్ల వస్తుందో స్పష్టంగా తేల్చడం. అప్పుడు మాత్రమే అదనపు విలువ రేటు కచ్చితంగా తేలుతుంది.. దోపిడీ స్థాయి ఎంతో బయటపడుతుంది.
మార్క్స్ అస్థిర పెట్టుబడి మాత్రమే అదనపు విలువను సృష్టిస్తుందని రుజువు చేశాడు. అదనపు విలువ రేటు కట్టడానికి విభజన ఆధారం. అందువల్ల ఇది సింపుల్ గా కనబడినా మార్క్స్ అర్ధశాస్త్రంలో కీలకమైనవాటిలో ఒకటి.
తనకు ముందు వాళ్ళు వాడిన భావాభివర్గాల్నిగురించి కూడా  చెబుతాడు:
 ఆడం స్మిత్ నాటినుండీ రాజకీయ అర్ధశాస్త్రం కాటగరీల్లో ఉన్న తేడాల్ని కలగాపుగం చేసి గందరగోళం చేసింది. కేవలం చలామణీప్రక్రియలో తలెత్తే రూపంలో తేడాల్ని - అంటే నిశ్చల పెట్టుబడి (fixed capital), చలామణీ పెట్టుబడి (circulating capital)- మాత్రమే పరిగణలోకి తీసుకుంది.-కాపిటల్  1. 572 ఫుట్ నోట్ 3
వాళ్ళకీ మార్క్సుకీ ఉన్న తేడా
రెండు విభజనలకూ ఉన్న తేడా స్పష్టమే.మార్క్స్ వేతనాల్ని ఒక భాగంగా చూశాడు. ఇతర అంశంతోనూ కలపలేదు. అప్పటి అర్ధశాస్త్రజ్ఞులు వేతనాల్నీ, శ్రమ పదార్ధాల్నీ ఒకే భాగంగా భావించారు.ఇదీ తేడా.
మార్క్స్ విమర్శ
నిశ్చల భాగంగానూ చలామణీ అయ్యే భాగంగానూ పెట్టుబడిని విభజించడం వల్ల  ఉత్పత్తి సాధనాలకూ, శ్రమ శక్తికీ మధ్యగల ముఖ్యమైన తేడా మరుగవుతుంది. శ్రమశక్తి, ముడిపదార్ధాలు ఇంధనాలు  కలిసి ఉంటుంది. మిగిలిన ఉత్పత్తిసాధనాల వలెనే పరిగణించబడుతుంది. పెట్టుబడిలో ఏభాగం వల్ల అదనపు విలువ ఏర్పడుతుందో ఈవిభజనలో తేలదు.అదనపు విలువను ఉత్పత్తి చెయ్యడంలో శ్రమశక్తి ప్రత్యేక పాత్రను కప్పిపెడుతుంది. పెట్టుబడిదారీ దోపిడీని మరుగు పరుస్తుంది.
స్థిర అస్థిర విభజన అదనపు విలువకి అస్థిర పెట్టుబడి నిజమైన ఏకైక వనరు అని చూపిస్తుంది. నిశ్చల, చలామణీ పెట్టుబడి విభజన అదనపు విలువకి నిజమైన వనరు అయిన శ్రమని, కొత్త విలువని కలపని ఇతర అంశాలతో కలిపి గందరగోళపరుస్తుంది. ఆవిధంగా పెట్టుబడి దారులు అవలంబించే ఈవిభజన పెట్టుబడిదారీ దోపిడీ సారానికి ముసుగు వేస్తుంది.
దీనికి సంబంధించి కాపిటల్ రెండో సంపుటంలో ఇలా చెబుతాడు:
సరుకు ఉత్పత్తికి ఉపయోగించిన  సాధనాల విలువ సరుకు విలువలోకి  పాక్షికంగా మాత్రమే ప్రవేశిస్తుంది. కాబట్టి సరుకు అమ్మకం ద్వారా అది పాక్షికంగా మాత్రమే భర్తీ చేయబడుతుంది. కొంచెం కొంచెంగానూ, క్రమక్రమంగానూ మాత్రమే అది భర్తీ చెయ్యబడుతుంది. మరొకపక్క, సరుకు ఉత్పత్తికి ఉపయోగించిన శ్రమశక్తి విలువా, శ్రమ పదార్ధాల విలువా సరుకు విలువలోకి పూర్తిగా ప్రవేశిస్తాయి, అందువల్ల అమ్మకం ద్వారా అవి  పూర్తిగా  భర్తీ చేయబడతాయి. విషయంలో, చలామణీ ప్రక్రియకు సంబంధించిన మేరకు, పెట్టుబడిలో ఒక భాగం నిశ్చలమైనదిగానూ, ఇంకో భాగం చలనశీలమైనదిగానూ లేక చలామణీ అయ్యేదిగానూ అగపడతాయి. రెండు సందర్భాల్లోనూ జరుగుతున్నది ఏమంటే:, అడ్వాన్స్  చెయ్యబడిన నిర్ణీతమైన విలువలు ఉత్పాదితానికి బదిలీ అవడమూ, ఆవిలువలు సరుకు   అమ్మకం ద్వారా భర్తీ అవడమూ. ఇక తేడా అల్లా: విలువ బదిలీ, తత్పర్యవసానంగా విలువ భర్తీ కొంచెంకొంచెంగా జరుగుతున్నదా, లేక ఏకమొత్తంగా జరుగుతున్నదా అనేదే. దీన్ని బట్టి ప్రతి విషయాన్నీ నిర్ణయించే  స్థిర అస్థిర పెట్టుబడుల మధ్య తేడా తెలియకుండా పోతుంది.  దాంతో అదనపువిలువ ఉత్పత్తి రహస్యం అంతా తుడిచిపెట్టక పోతుంది........
అందుకే బూర్జువా అర్ధశాస్త్రం విభజనని సమర్ధించింది. స్థిర అస్థిర భావాభివర్గాల్ని నిశ్చల చలామణీ భావాభివర్గాలతో గందరగోళ పరిచిన స్మిత్ విభజనని అంటిపెట్టున్నది, విమర్శచేయ్యకుండా ఒక శతాబ్దంపాటు, తరాలతరబడి చిలకలా దాన్నేపదే పదే పలికింది. వేతనాలకి వెచ్చించిన  పెట్టుబడిని , ముడిపదార్ధాలకి పెట్టిన పెట్టుబడినించి వేరుపరచలేదు…. ఆవిధంగా పెట్టుబడిదారీ విధానపు వాస్తవ గమనాన్నీ,తద్వారా పెట్టుబడిదారీ దోపిడీని   గ్రహించడానికి గల ప్రాతిపదికనే పాతి  పెట్టింది. “   Cap 2. 222-223

అయితే మార్క్స్, పెట్టుబడిని స్థిర అస్థిర భాగాలుగా విభజించి, అదనపువిలువ అస్థిర వల్లనే వస్తుంది అని రుజువు పరిచాడు.
అందువల్ల  స్థిర అస్థిర విభజన మార్క్స్ సిద్దాంతంలో ఒక కీలకాంశం అయింది.
అదనపు విలువనుండి పెట్టుబడి ఉత్పత్తి
అదనపువిలువ పెట్టుబడి ద్వారా ఉత్పత్తి అవుతుంది; అయితే  అదనపు విలువనుండి తిరిగి పెట్టుబడి ఉత్పత్తవుతుంది.   ఇదెలాగంటే, తను గుంజిన అదనపు విలువలో కొంత సొంతానికి ఖర్చుచేసుకొని, కొంత పాత పెట్టుబడికి కలుపుతాడు. ఆవిధంగా అదనపువిలువ తిరిగి పెట్టుబడి అవుతుంది. కొత్త పెట్టుబడికి తగినట్లు అదనపు విలువ వస్తుంది.
ఉదాహరణకి,
తొలి పెట్టుబడి 200,000 పౌన్లు.
అందులో 80 శాతం ఉత్పత్తిసాధనాలకీ, 20 శాతం శ్రామికుల వేతనాలకీ..
అంటే 160,000 ఉత్పత్తిసాధనాలకీ, 40,000 శ్రామికుల వేతనాలకీ అనుకుందాం.
ఇక అదనపువిలువరేటు 100 శాతం అయితే,  అదనపు విలువ 40,000 పౌన్లవుతుంది. అదనపు విలువ మొత్తాన్నీ సొంత ఖర్చులకు వాడకుండా అందులో 20,000 పౌన్లు పెట్టుబడికి కలిపితే,
ఇప్పటి పెట్టుబడి 220,000 అయింది.మొదట్లో లాగే  80 శాతం స్థిరభాగం, 20 శాతం అస్థిర భాగం అనుకుంటే, 176,000 పౌన్లు ఉత్పత్తిసాధనాలకీ, 44,000 వేతనాలకీ.  అదనపువిలువరేటు 100 శాతం అయితే అదనపు విలువ 44,000 వస్తుంది. అందులో 20,000 సొంతానికి వాడుకొని, 24,000 పెట్టుబడికి చేరిస్తే ఈసారి పెట్టుబడి 244,000 అవుతుంది. ఇలా ప్రతిసారీ కొంత అదనపువిలువ కొత్త పెట్టుబడిగా మారుతూ, పాత పెట్టుబడికి కలుస్తున్నందువల్ల పెట్టుబడి అంతకంతకూ పోగుబడుతుంటుంది. సంచయనం సాగుతుంటుంది.
వచ్చే పోస్ట్: పెట్టుబడి సంచయనం కార్మికవర్గ స్థితిగతులమీద ఎటువంటి ప్రభావం చూపుతుంది?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి