11, జూన్ 2018, సోమవారం

శ్రామికుని మీద యంత్రవ్యవస్థ ప్రభావాలు


మార్క్స్ కాపిటల్ -  అధ్యాయం 15

యంత్రాలూ - ఆధునిక పరిశ్రమా
విభాగం- 3
శ్రామికుని మీద యంత్రవ్యవస్థ ప్రభావాలు

శ్రమ సాధనాల్లో విప్లవమే ఆధునిక పరిశ్రమకి నాంది, ఆరంభ బిందువు. యంత్రాన్ని నడిపే శక్తి ఆ యంత్రం లోనే ఇమిడి  ఉంటుంది. అందువల్ల మనిషి కండబలం మునుపటంత అవసరం ఉండదు. కొద్దిపాటి  శక్తి ఉన్న వాళ్ళు సరిపోతారు. స్త్రీలూ, పిల్లలూ  కూడా యంత్రాలవద్ద పని చెయ్యగలరు. కనుక బలం తక్కువ స్త్రీలను పెట్టుబడి నియమించింది. కుటుంబానికి కొంత ఆసరాగా, ఒకమేరకు ఇంటిదగ్గరే చేసే స్వతంత్ర శ్రమని కూడా ఆక్రమించింది. శరీరం పూర్తిగా పెరగని కారణంగా, పిల్లల అవయవాలు సులువుగా వంగుతాయి. కనుక కొన్నిచోట్ల పిల్లల్ని పనిలో పెట్టడం వీలయింది. పెట్టుబడి పిల్లల ఆటపాటల సమయాన్ని పెట్టుబడి లాగేసుకుంది. కార్మికుల కుటుంబ సభ్యుల్ని, లింగ వయో భేదం లేకుండా అందరినీ పనిలో పెట్టారు. అందువల్ల వేతన శ్రామికుల సంఖ్య వేగంగా పెరిగింది. ఆవిధంగా యంత్రాలు వేతన కార్మికుల సంఖ్యను పెంచే సాధనాలయ్యాయి.
యంత్రాలు రాక ముందు కుటుంబంలో వేతన శ్రమ చెయ్యని వారిని సైతం ఇప్పుడు పనిలో పెట్టుకుంటారు. పురుషుని శ్రమ శక్తి కుటుంబ సభ్యుల శ్రమ శక్తికి అంతటికీ పరచ బడుతుంది. అంటే, శ్రమశక్తి విలువ తగ్గుతుంది. ఒక కుటుంబం బతకడానికి, ఇంతకు ముందు ఒక్కరే పనిచేస్తే ఇప్పుడు నలుగురు చేస్తున్నారు. ఆనలుగురూ తమకోసం పనిచేయడమే కాకుండా, పెట్టుబడి కోసం అదనపు శ్రమ కూడా చేయాల్సి వుంటుంది .
యంత్రాల వల్ల శ్రామికుల మీద మూడు ప్రభావాలుంటాయి:
A.వేతనాల తగ్గింపు, దోపిడీ పెంపు
B.పనిదినం పొడిగింపు
C. శ్రమతీవ్రత పెంపు
ఈ విభాగంలో వీటి పరిశీలన ఉంటుంది.  
A. వేతనాల తగ్గింపు, దోపిడీ పెంపు
ఎందుకంటే, కుటుంబంలో ఎక్కువమంది సభ్యులు పనిచేస్తారు కనుక.
శ్రమ శక్తి విలువని నిర్ణయించేది ఆ కార్మికుని పోషణకి అవసరమైన శ్రమకాలం  ఒక్కటే కాదు, కుటుంబాన్ని నడపడానికి అవసరమైన శ్రమకాలం కూడా. యంత్రాలు కుటుంబ సభ్యుల నందరినీ శ్రమ మార్కెట్ కి లాగుతాయి. ఆవిధంగా యంత్రాలు పెద్దవాని శ్రమ శక్తి విలువని అందరు కుటుంబ సభ్యులకూ పరుస్తాయి/వ్యాప్తి చేస్తాయి. ఆవిధంగా  అతని శ్రమ శక్తి విలువని తగ్గిస్తాయి. నలుగురు కుటుంబ సభ్యుల శ్రమ శక్తిని కొనడానికి మునుపు కుటుంబ పెద్ద ఒక్కడి శ్రమశక్తిని కొనడానికంటే ఎక్కువ అవచ్చు. అయితే ఒక రోజు శ్రమకి  బదులుగా నాలుగు రోజుల శ్రమ వస్తుంది. ఒకరి అదనపు విలువ బదులు నలుగురి అదనపు వస్తుంది. ఆ నలుగురి ఎక్కువ అదనపు శ్రమ ఒకని అదనపు శ్రమను మించి ఉంటుంది.   అదే నిష్పత్తిలో వాళ్ళ ధర పడిపోతుంది. ఆకుటుంబం బతకడానికి నలుగురు శ్రమ చెయ్యాలి, అంతేకాదు పెట్టుబడి దారుడి కోసం అదనపు శ్రమ కూడా చెయ్యాలి. ఆవిధంగా, యంత్రాలు పెట్టుబడి దోపిడీ శక్తికి  ప్రధాన వస్తువు అయిన మానవ వనరును పెంచుతాయి.39 అంతే కాక దోపిడీ స్తాయిని కూడా హెచ్చు చేస్తాయి.
శ్రామికులకు ఖర్చు పెరుగుతుంది
పనులకు పోయినప్పటికీ, పిల్లల్ని చూసుకోవడం, పాలివ్వడం వంటి కొన్ని కుటుంబ విధుల్ని పూర్తిగా వదిలెయ్యడం సాధ్యం కాదు. కనక పెట్టుబడి అధీనంలోకి తీసుకున్న తల్లులు  వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందే. కుట్టడమూ, మరమ్మత్తులు చేయడమూ వంటి ఇంటి పనులు ఇక  కుదరవు. రెడీగా దొరికే వస్తువుల్ని కొనుక్కోవలసి వస్తుంది. ఇంటి పని చెయ్యడం తగ్గినందువల్ల, డబ్బు ఖర్చు పెరుగుతుంది. కుటుంబ నిర్వాహణ ఖర్చుహెచ్చుతుంది, వచ్చే ఎక్కువ ఆదాయానికి సరికి సరి అవుతుంది.  దీనికి తోడు జీవితావసరాల్ని  వాడుకోవడం లోనూ, సిద్ధం చెయ్యడం లోనూ   పొదుపూ, వివేకమూ సాధ్యం అవవు. ఈ వాస్తవాలకి సంబంధించిన సమాచారాన్ని అధికార అర్ధశాస్త్రం దాచి ఉంచింది. అయినప్పటికీ ఫాక్టరీ ఇన్స్ పెక్టర్ల నివేదికల్లో బోలెడు సమాచారం ఉంది.
కార్మికుడు బానిస వ్యాపారి అవుతాడు
మునుపు శ్రమ శక్తి అమ్మడమూ కొనడమూ ఇరువురు స్వతంత్ర వ్యక్తుల సంబంధం.  ఇద్దరి సంబంధాలూ వాళ్ళు చేసుకున్న  ఒడంబడిక ప్రకారం ఉండేవి. సరుకుల మారకం మన  ప్రాతిపదిక. మొదట్లో, పెట్టుబడిదారుడూ, కార్మికుడూ స్వేచ్ఛగల వ్యక్తులుగా, సరుకుల ఒనర్లుగా కలుసుకున్నారని  అనుకున్నాం. ఒకరు డబ్బూ, ఉత్పత్తి సాధనాల ఓనర్. మరొకరు శ్రమ శక్తి ఓనర్. అయితే ఇప్పుడు తక్కువ వయసున్న వాళ్ళని, పిల్లల్నీ,వయసురాని యువజనులనూ  పెట్టుబడిదారుడు కొంటున్నాడు. మునుపు కార్మికుడు తన సొంత శ్రమ శక్తినిమాత్రమే అమ్ముకునే వాడు. ఇప్పుడు దానికి తోడు అదే కార్మికుడు భార్యా బిడ్డల శ్రమ శక్తిని కూడా అమ్ముతున్నాడు. అతనిప్పుడు బానిస వ్యాపారి (slave-dealer) అయినాడు.
బాల శ్రామికులు కావాలని ప్రకటనలు 
పెట్టుబడిదారులు బాల శ్రామికుల కావాలని ప్రకటన లిచ్చేవారు.  ఒక ఫాక్టరీ ఇన్స్ పెక్టర్ చూపిన అలాటి  ఒక ప్రకటనని మార్క్స్ ఉదాహరణగా చూపాడు. అదేమంటే: 12-20 మంది కుర్రవాళ్ళు కావాలి. వేతనం వారానికి 4 షిల్లింగులు. దరఖాస్తు చెయ్యండి.
వాళ్ళు 13 ఏళ్ల కి తక్కువ వయసున్నట్లు కన్పించకూడదు.
ఈ ప్రకటన వెనకటి అమెరికా జర్నల్ లలో  నీగ్రో బానిసల కోసం వాకబు చేసినట్లే ఇంచుమించుగా ఉంది.
13 ఏళ్ల కంటే తక్కువ వయసున్నట్లు కన్పించకూడదు- అనేది ఎందుకంటే, ఫాక్టరీ చట్టం ప్రకారం  13 ఏళ్ల లోపు వాళ్ళు  6 గంటలు మాత్రమే పని చేయవచ్చు. వాళ్ళ వయస్సుని ఒక సర్జన్ అధికారి వాళ్ళ వయస్సెంతో ధృవపరచాలి. అందుకనే,13 ఏళ్ల వాళ్ళుగా కనపడాలి అని అడిగే వాళ్ళు.
ఈ చట్ట వ్యతిరేక వ్యాపారం సాగడానికి కారణాలు
పోయిన 20 ఏళ్లలో 13 ఏళ్ల లోపు పిల్లలు ఫాక్టరీల్లో గణనీయంగా తగ్గారు. ఇందుకు కారణం సర్జన్లు వాళ్ళ వయస్సు ఎక్కువ చూపడమే నని ఫాక్టరీ ఇన్స్ పెక్టర్ల నివేదికల్ని బట్టి తెలుస్తుంది. పెట్టుబడి దారుడి దోచుకునే దురాశా, తలిదండ్రుల అవసరాలూ ఈ చట్టవ్యతిరేక వ్యాపారానికి అనుకూలించాయి. ఇందుకు వైద్యాధికారులు సహకరించారు. ఉన్న వయస్సుకన్న ఎక్కువ వేశారు. దాన్ని బట్టి 13 ఏళ్ల కి లోపు వాళ్ళు కూడా ఫాక్టరీల్లో ఉన్నా, రికార్డు ప్రకారం వాళ్ళు 13 ఏళ్ల పైబడ్డ వాళ్లకిందే లెక్క. బెత్నాల్ గ్రీన్ జిల్లాలో సోమ, మంగళ వారాల్లో సంత జరిగేది. అక్కడ 9 ఏళ్ల నుండి అంతకు పైబడ్డ బాల బాలికల్ని  సిల్క్ ఉత్పత్తిదారులు నియమించేవారు. వారానికి 1 షిల్లింగు 8 పెన్నీలు (ఇది తల్లిదండ్రులకు) 2 పెన్నీలు చేసే వాళ్లకి టీ కోసం. ఇంగ్లండ్ లో కూడా స్త్రీలు శరణాలయాల(workhouses) నుండి తమ పిల్లల్ని తీసుకొచ్చి చిమ్నీలు తుడిచే పనికి పెట్టేవాళ్ళు. ఆపని చేయించకూడదని చట్టం నిషేధించింది. అయినా అదే పని చెయ్యడానికి వారానికి 2 షి. 6 పెన్నీలకు పనిలో పెట్టేవాళ్ళు. యంత్రాలున్నప్పటికీ, ఆపనికి బ్రిటన్ లో అమ్మిన పిల్లల సంఖ్య 2000 దాటింది.
 కార్మికుల పిల్లల శారీరక క్షీణత – మరణాలు
ఫాక్టరీల్లో పనిచేసే స్త్రీలూ, పిల్లలూ శారీరకంగా ఎలా క్షీణిస్తారో ఇదివరకే మార్క్స్ వివరించి వున్నాడు. ఇప్పుడు పనివాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత కొద్ది సంవత్సరాల కాలంలో కాలం చేసే వారనేందుకు గణాంకాలు ఇస్తాడు. ఇంగ్లండ్ లో 16 జిల్లాల్లో ఏడాది లోపు పిల్లల్లో బతికున్నవాళ్ళు లక్షమందకి సగటున 9 వేలమంది; 24 జిల్లాల్లో 10-11 వేలమధ్య; 39 జిల్లాల్లో 11-12 వేల మధ్య; 48 జిల్లాల్లో 12-13 వేల మధ్య; 22 జిల్లాల్లో 20 వేల పైన; 25 జిల్లాల్లో 21వేలపైన; 17 జిల్లాల్లో 22 వేల పైన; 11 జిల్లాల్లో 23 వేల పైన; 3 జిల్లాల్లో 24 వేల పైన; 3 జిల్లాల్లో 25 వేల పైన; విస్ బీచ్ లో 26 వేలు; మాంచెస్టర్ లో 26,125.
ఈ మరణాలకు స్థానిక కారణాలు వుంటాయి. వాటిని పక్కన పెడితే, తల్లుల ఇళ్ళకు దూరంగా పోయి పనిచెయ్యడం ముఖ్య కారణం. అయితే
అలా పనులకు పోయినందువల్ల పిల్లలకు ఆలనా పాలనా తగినంత ఉండదు:

  •          పక్కన తల్లి లేక పోవడం
  •        సరైన పోషకాహారం లేకపోవడం
  •          మంచిది కాని ఆహారం ఇవ్వడం
  •          నల్లమందు వేసి నిద్రబుచ్చడం
పనులకు పోవడం ఈ చావులకు  ప్రధాన కారణం  అని 1861 లో ఒక విచారణ సంఘం చెప్పింది. స్త్రీల నియామకం అతి తక్కువగా ఉండే వ్యావసాయిక జిల్లాల్లో ఈ మరణాల రేటు చాలా తక్కువ.  అయితే ఉత్తర సముద్ర తీరంలో కొన్ని వ్యావసాయిక జిల్లాల్లో ఈ మరణాల రేటు ఫాక్టరీ జిల్లాల్లో ఎంత ఉందో అంతే ఉంది. ఈ వాస్తవాన్ని వాళ్ళు ఊహించలేదు. అందువల్ల అక్కడిక్కడ ఆవిషయాన్ని తేల్చే పని  జూలియన్ హంటర్ కి  అప్పచెప్పారు. ఆయన దర్యాప్తుచేసి నివేదిక  సమర్పించాడు. అది ‘ప్రజారోగ్యం మీద ఆరవ నివేదిక’ లో చేర్చబడింది. అప్పటి దాకా పిల్లలు మలేరియా వల్లా, పల్లపు, చిత్తడి ప్రాంతాలలో వచ్చే జబ్బులవల్ల, చనిపోతున్నారని అనుకునేవారు. కానీ హంటర్ దర్యాప్తులో దీనికి వ్యతిరేకమైనది తేలింది. ఏమనంటే: ఏదైతే మలేరియాని పారదోలిందో, అదే పిల్లల అసాధారణ మరణ రేటుకి కారణమైంది. ఆ కారణ భూతమైనది ఏదంటే: శీతాకాలంలో చిత్తడి నేలనీ, ఎండాకాలంలో పలచని పచ్చిక బయలుగా ఉండే నేలనీ, ఎక్కువ ధాన్యం దిగుబడి నిచ్చేపొలాలుగా మార్చడం. అదే మలేరియా పోవడానికి కారణం, అదే పిల్లల మరణాలు పెరగడానికీ కారణం. హంటర్ విచారించిన 70 మంది వైద్యులదీ  ఒకే అభిప్రాయం.  
నిజానికి సాగు చేసే పద్ధతిలో మార్పు వచ్చింది. వ్యవసాయంలోకి  పారిశ్రామిక విధానాలు ప్రవేశించాయి. వ్యవసాయదారుడికి పనివాళ్ళని చూసి  పంపించే  ‘మేస్త్రీ’ (undertaker) దగ్గర పనివాళ్ళు- పెళ్ళైన స్త్రీలూ, బాలబాలికలూ- ముఠాగా ఉంటారు. వ్యవసాయ దారుడితో ముఠా తరఫున ఒప్పందం కుదుర్చుకునేది మేస్త్రీ యే.
ఈ ముఠాలు కొన్నిసార్లు వాళ్ళ ఊళ్ళనించి మైళ్ళకు మైళ్ళు పోతారు.వాళ్ళు రోజూ ఉదయం సాయంత్రం రోడ్లమీద కనబడతారు. స్త్రీలు కురచ లంగాలు (short petticoats), తగిన కోట్లూ, బూట్లూ ధరించి ఉంటారు. కొన్నిసార్లు ట్రౌజర్లేసుకుని బలంగా, ఆరోగ్యంగా కనబడతారు. అయితే వీళ్ళు ఒక అనైతికతకి అలవాటు పడ్డవాళ్ళు. తీరికలేని, స్వేచ్చా జీవితం మీద వాళ్ళ కి మోజు పడతారు. ఇళ్ళ దగ్గర  వాళ్ళకోసం దురదృష్టవంతులైన పిల్లలు బెంగ పెట్టుకుంటారనీ, ఫలితంగా ప్రాణాంతక ఫలితాలు ఉంటాయనీ పట్టించుకోరు. ఫాక్టరీ జిల్లాల్లో లాగే, ఇక్కడ కూడా అన్నిపరిణామాలూ ఇంకా పెద్ద స్థాయిలో జరుగుతున్నాయని తేలింది.
స్త్రీలు పనులకు పోతున్నందువల్ల పిల్లలు శారీరకంగా క్షీణిస్తారు. నిద్రపుచ్చడానికి మత్తు పదార్ధాలు ఇవ్వబడ్డ పిల్లలు  ‘చిన్న ముసలి వాళ్ళు’ (little old men) కుంచించుకు పోతారు, ‘చిన్న కోతులలాగా’ అయిపోతారు.వారి మరణాలు పెరుగుతాయి.
మేధోపరమైన శూన్యత ఏర్పడుతుంది
పెట్టుబడి ఎదిగీ ఎదగని పిల్లలను అదనపు విలువ సృష్టించే యంత్రాలుగా మారుస్తుంది. తద్వారా వాళ్ళ మనో వికాస సామర్ధ్యాన్ని నాశనం చెయ్యక పోయినా, మనస్సుని బీడు పెడుతుంది. ఈ వినాశం ఎంతగా ఎక్కువయిందంటే, పార్లమెంటే వాళ్ళ చదువు గురించి ఒక నిబంధన విధించింది. ఫాక్టరీ చట్టాలకు అనుగుణంగా విద్య ఉంటేనే 14ఏళ్ల లోపు వాళ్ళని నియమించా వచ్చు, లేకుంటే నియమించా రాదు అనేదే ఆ నిబంధన. అయితే అమలు జరిపే యంత్రాంగాన్ని పెట్టలేదు. కాబట్టి అమలు కాకుండా దీన్నించి తప్పించుకోడానికి ప్రయోగించని ఎత్తులూ  జిత్తులూ లేవు.
ఉపాధ్యాయుడు వారం వారం పిల్లలు చదువుకున్నారనే పత్రం ఇస్తే చాలు, వాళ్ళని పనిలో పెట్టుకోవచ్చు. ఆ ఉపాధ్యాయుల్లో కొందరికి సరిగా చదువు రాదు. అందువల్ల సర్టిఫికెట్ల మీద క్రాస్ గుర్తులతో సంతకం చేసిన ఉదంతాలు 1844చట్టానికి ముందు కొల్లలు కొల్లలుగా ఉండేవి. స్కూలు గదుల్లో ఎక్కువమంది ఉండేవారు. 15అడుగుల పొడవు, 10అడుగుల వెడల్పు ఉన్న గది 75 మంది పిల్లలతో క్రిక్కిరిసి ఉంది అని  ఒక నివేదిక చెప్పింది. చాలీ చాలని ఫర్నిచర్ , బోధనా సామాగ్రీ, పుస్తకాల కొరత . అన్ని వయసుల పిల్లలూ ఒకే చోట. కరమైనది. చదువు చెప్పే అర్హత లేని ఉపాధ్యాయులు. సంతకం రాక అడ్డగీతల్ పెట్టే కొందరు టీచర్లు. అసలు ఆ వాతావరణమే అనారోగ్యకరం. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకి చదువు రాదు. అయినా అక్షరాస్యులుగా పత్రాలైతే వస్తాయి. ఇదీ తతంగం.
పురుష కార్మికుల ప్రతి ఘటనకి అడ్డుకట్ట
కార్మిక శ్రేణుల్లోకి స్త్రీలూ, పిల్లలూ అధికాధికంగా చేర్చడం  వల్ల పురుష కార్మికుల ప్రతిఘటనకు అడ్డుకట్ట పడింది. కార్ఖానా ఉత్పత్తి దశలో పెట్టుబడిదారుల నిరంకుశ విధానాలను కార్ముకులు ప్రతిఘటించేవారు. యంత్రలోచ్చాక, స్త్రీలూ, పిల్లలూ యంత్రాలతో పనిచెయ్యడం మొదలయ్యాక పురుష కార్మికుల ప్రత్యేకత లేకుండా పోయింది. పనివాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. కార్మికుల కొరత లేదు. కనక ఎదురుతిరిగే నిరంకుశత్వాన్ని నిరోధించే శక్తికి ఆటంకం ఏర్పడ్డది.
B.పనిదినం పొడిగింపు
యంత్రాలూ – నిరంతరాయ చలనమూ
1.యంత్రాలలో శ్రమ పరికరాలు/సాధనాలు వాటికవే కదులుతుంటాయి, పనివానితో సంబంధం లేకుండా వాటంతటవే  పనిచేస్తాయి.అంటే అవి ఆటోమాటిక్ అవుతాయి. వాటికవి అంతరాయాలు కలిగించవు. అయితే వీటి దగ్గరుండే శ్రామికుల వల్ల కలగవచ్చు. వాళ్ళ దేహబహీనతలో, సంకల్పాలో ఆటంకాలు కలిగించవచ్చు. అలా కలిగించక పొతే, యంత్రాలు ఆగవు, శాశ్వత చలనంలో ఉంటాయి. కనుక మనిషి వల్ల కలిగే ఈ ఆటంకాల్ని, ఈ ప్రతిఘటనని  కనిష్ట స్థాయికి తగ్గించడానికి  పెట్టుబడి ప్రయత్నిస్తుంది. యంత్ర శ్రమ తేలిక అనిపించడం ఈ ప్రతిఘటనని తగ్గిస్తుంది. అలాగే అణకువ, విధేయత ఉన్న  స్త్రీల, పిల్లల నియామకం వల్ల మరికొంత ప్రతిఘటన తగ్గుతుంది. 
2.యంత్రాలకయిన పెట్టుబడి ఖర్చుత్వరగా తిరిగి రావాలి

యంత్రాల ఉత్పాదకత అవి ఉత్పాదితానికి బదిలీ చేసే విలువకి విలోమానుపాతంలో ఉంటుందని మనకి తెలుసు. ఎంత ఎక్కువ విలువని బదిలీ చేస్తే అంట తక్కువ ఉత్పాదకత ఉన్నట్లు; ఎంత తక్కువ విలువని బదిలీ చేస్తే అంత ఎక్కువ ఉత్పాదకత ఉన్నట్లు.
యంత్రం జీవితకాలం ఎంత ఎక్కువ ఉంటే, బదిలీ అయ్యే విలువ అంత ఎక్కువ ఉత్పాదితాలకు విస్తరిస్తుంది. అందువల్ల విడి సరుక్కి కలిసే విలువ తగ్గుతుంది. 
ఒక యంత్రం పనిచేసే జీవితకాలం = పనిదినంపోడవు* పనిసాగే రోజుల సంఖ్య.
3.మెరుగైన యంత్రాలు రావడం వల్ల అప్పటికున్న పాత యంత్రాలకు కాలం చెల్లుతుంది. అందువల్ల యంత్రాల్ని తక్కువకాలంలో ఎక్కువగా వాడతారు.
యంత్రం అరుగుదల  పనికాలానికి కచ్చితమైన అనుపాతంలో ఉండదు.ఒక వేళ ఉన్నా, రోజుకి 16 గంటల చొప్పున 7 ½ సంవత్సరాలు పనిచేసే  యంత్రం, రోజుకి 8 గంటల చొప్పున 15 సంవత్సరాలు పనిచేస్తే అంతే కాలం పనిచేసినట్లు. రెండు సందర్భాల్లోనూ ఒకే మొత్తంలో విలువని బదిలీ చేస్తుంది.ఏ ఒక్క సందర్భంలోనూ రెండో సందర్భంలోకన్న  ఎక్కువ విలువని బదిలీ చెయ్యదు. అయితే మొదటి సందర్భంలో యంత్రం విలువరెండో సందర్భంలో కంటే రెట్టింపు వేగంతో పునరుత్పత్తవుతుంది. కనుక పెట్టుబడిదారుడు ఈ యంత్రం వాడినందువల్ల 7 ½ సంవత్సరాలా కాలం లోనే రెండో సందర్భంలో 15 ఏళ్లలో పొందినంత అదనపు విలువని ఆర్జిస్తాడు. 
యంత్రం అరుగుదల రెండు రకాలు
ఒకటి వాడకం వల్ల, నాణేలు చలామణీ వల్ల అరిగినట్లు. రెండోది వాడక పోవడం వల్ల, ఒరలో ఉంచిన కత్తి తుప్పెక్కినట్లు. మొదటిది యంత్రం వాడకానికి అనులోమంగా ఉంటుంది. రెండోది కొంతవరకూ దాని వాడకానికి విలోమానుపాతంలో ఉంటుంది.

యంత్రం తన మారకం విలువను రెండు కారణాల వల్ల కోల్పోతుంది:
a)       అదే రకం యంత్రాలు చౌకగా తయారవడం వల్ల
b)      దానికన్నా మెరుగైన యంత్రం పోటీకి రావడం వల్ల
రెండు సందర్భాలలోనూ దాని విలువ అందులో వాస్తవంగా ఉన్న శ్రమ చేత నిర్ణయం అవదు. దాన్ని కానీ, మెరుగైన దాన్ని కానీ పునరుత్పత్తిచేయడానికి అవసరమయ్యే శ్రమ చేత నిర్ణయమవుతుంది. అందువల్ల దాని విలువ ఎంతో  కొంత పోతుంది. దాని మొత్తం విలువ పునరుత్పత్తికి ఎంత తక్కువ కాలం పడితే, ఈ నైతిక తరుగుదల అంత తక్కువ ఉంటుంది; పనిదినం ఎంత పొడవైనదైతే, ఆ పునరుత్పత్తికి పట్టే కాలం అంత తక్కువగా ఉంటుంది. ఒక పరిశ్రమలో  కొత్తగా యంత్రాన్ని పెట్టినప్పుడు, దాన్ని చౌకగా పునరుత్పత్తి చేసే పద్ధతులు ఒకదాని వెంట మరొకటి వస్తాయి; అలాగే మెరుగుదలలు కూడా వస్తాయి. ఆమెరుగుదలలు విడి భాగాలను ప్రభావితం చేస్తాయి; అంత మాత్రమే కాదు, మొత్తం యంత్ర నిర్మాణాన్నే ప్రభావితం చేస్తాయి. అందువల్ల యంత్రాలొచ్చిన  తొలిరోజుల్లో పనిదినం పొడిగించడాన్ని  ఇది బాగా ప్రోత్సహించింది.  
యంత్రాలు పూర్తిగా అరగక పోయినా, వాటికన్నా మంచి యంత్రాలు వస్తే పాతవి తొలిగించబడతాయి. మెరుగైన యంత్రాలు త్వరత్వరగా వస్తాయి. ఎంత త్వరగా అంటే ఒక్కోసారి అవి పూర్తిగా తయారయ్యే లోపే ఇంకా మెరుగైనవి వచ్చేవి. అందువల్ల చేస్తున్నవాటిని చేస్తున్న చోటే ఆపాల్సి వచ్చేది.
4.పనిదినం పొడవు తెలిసి, అన్ని ఇతర అంశాలూ అలాగే ఉంటే, రెట్టింపు పనివాళ్ళని దోపిడీ చెయ్యడానికి యంత్రాలలో పెట్టిన స్థిర పెట్టుబడి భాగాన్ని రెట్టింపు చెయ్యాలి; అంతేకాదు, ముడి పదార్ధాలకీ, అనుబంధ పదార్ధాలకీ పెట్టె భాగాన్ని కూడా రెండింతలు చెయ్యాలి. అయితే మరొకపక్క, పనిదినాన్ని పెంచినందువల్ల పెద్ద స్థాయిలో ఉత్పత్తి జరుగుతుంది. యంత్రాలకూ, భవనాలకూ పెట్టిని పెట్టుబడిని పెంచాల్సిన అవసరం ఉండదు. అందువల్ల అదనపు విలువ పెరుగుతుంది, కాని దాన్నిరాబట్టడానికి పెట్టే పెట్టుబడి తగ్గుతుంది. పనిదినం పెరిగినప్పుడల్లా జరిగేది ఇదే; అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్న విషయంలో/సందర్భంలో మార్పు ప్రస్పుటంగా ఉంటుంది. ఎందుకంటే, శ్రమ సాధనాలుగా ఉన్న పెట్టుబడి హెచ్చు మోతాదులో ఉన్నందువల్ల. 
ఫాక్టరీ వ్యవస్థ అభివృద్ధి చెందేకొద్దీ నిరంతరం పెరిగే పెట్టుబడిలోని ఒకభాగం ఏరూపం తీసుకుంటుందంటే: ఒక పక్క, దాని విలువ నిరంతర స్వయం విస్తరణ చెందుతుంది, మరొకవైపు సజీవ శ్రమ స్పర్శ లేనప్పుడల్లా తన ఉపయోగపు విలువనీ, మారకం విలువనీ కోల్పోతుంది. పత్తి వ్యాపారంలో అగ్రగణ్యుడైన ఆష్ వర్త్ ప్రొఫెసర్ సీనియర్ తో అన్న మాటలు: ఒక శ్రామికుడు పలుగుని కిందబడేసి  ఉంచినంత సేపూ 18పెన్నీల పెట్టుబడిని నిరుపయోగంగా ఉంచినట్లు. పనివాళ్ళలో ఒక్కడు మిల్లువదిలి వెళ్ళిపోతే, ఆటను లక్ష పౌన్ల పెట్టుబడిని నిరుపయోగ పరిచినట్లు.  ఊరకే ఊహించండి! లక్ష పౌండ్ల పెట్టుబడిని ఒక్క క్షణం ఊరకే ఉంచడం!
ఆష్ వర్త్ నుంచి పై ఉపదేశం పొందాక, సీనియర్ ఒకేమైన పనిదినం పెంపు కోరుకోదగినది అన్నాడు.
5.యంత్రాలు పనిదినాన్ని పెంచడానికి మరొక కారణం: తాత్కాలికంగా వచ్చే అధిక అదనపు విలువని సొంతం చేసుకోవడానికి పెట్టుబడిదారుడు త్వరపడాల్సి ఉంటుంది.
యంత్రాలు సాపేక్ష అదనపు విలువని ఉత్పత్తిచేస్తాయి.ఒకటి శ్రమ శక్తి విలువని తగ్గించడం ద్వారా, రెండు పరోక్షంగా శ్రమశక్తి పునరుత్పత్తిలో  చేరే సరుకుల్ని చౌక పరచడం ద్వారా. అంతే కాదు. ఒక పరిశ్రమలో అక్కడక్కడా  యంత్రాల్ని పెట్టినప్పుడు, ఆ యజమానులు ఉపయోగించుకునే శ్రమ మరింత ఫలవంతంగా ఉంటుంది. ఉత్పత్తయిన వస్తువు సామాజిక విలువని వ్యష్టి విలువ కన్నా పెంచడం ద్వారా. ఆవిధంగా ఒకరోజు శ్రమశక్తి విలువని ఒక రోజు ఉత్పాదితం విలువలో తక్కువ భాగంతో భర్తీ చేసేందుకు పెట్టుబడి దారుడికి అవకాసం ఇవ్వడం ద్వారా. యంత్రాల వినియోగం ఒకరకంగా మోనోపోలీ గా ఉన్న ఈ పరివర్తనా కాలంలో లాభాలు అసాధారణ స్థాయిలో ఉంటాయి. ఆకాలాన్ని పెట్టుబడిదారుడు సంపూర్ణంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకు పనిదినాన్ని ఎంత వీలైతే అంత పొడిగిస్తాడు. ఆ లాభ పరిమాణం మరింత లాభంకోసం తపనని పెంచుతుంది.
6. ఒక ప్రత్యేక పరిశ్రమలో యంత్రాల వినియోగం సర్వ సాధారణం అయినప్పుడు, ఉత్పాదితం సామాజిక విలువ దాని వ్యష్టి విలువకి పడిపోతుంది. ఉదాహరణకి కొద్దిమంది యంత్రాలతో ఉత్పత్తి చేస్తుండగా ఎక్కువమంది పనిముట్లతో చేస్తున్న పరిస్థితి ఇది. యంత్రంతో తయారయిన వస్తువు ధర తక్కువగానూ, పనిముట్టుతో తయారయిన వస్తువు ధర ఎక్కువగానూ ఉంటాయి. మొదటిది 8 రూపాయలుంటే, రెండోది 10 రూపాయలుండవచ్చు. పనిముట్లతో చేసిన వస్తువులే ఎక్కువ సంఖ్యలో ఉన్నంతకాలం ఆ ధరే  డబ్బులో సామాజిక విలువ (social value). యంత్రంతో తయారైనవి తక్కువ సంఖ్యలో వుంటాయి. అలా తయారయిన వస్తువు ధర 8 రూపాయలు. ఇది కొద్దిమంది పెట్టుబడిదారులకు పడే విలువ. ఇదే వ్యష్టి విలువ (individual value). ఈ ఉత్పత్తి దారులు కూడా సామాజిక విలువకే అమ్మగలరు. అప్పుడు వాళ్లకి పనిముట్ల ఉత్పత్తిదారులకంటే ఎక్కువ అదనపు విలువ వస్తుంది. అయితే ఆ పరిశ్రమలో అందరూ యంత్రాలు పెడితే, అప్పుడు సామాజిక ధర వ్యష్టి విలువకి పడిపోతుంది. రెండూ ఒకటే అవుతాయి. అంటే 8 రూపాయలకు దిగుతుంది.
అదనపు విలువ వచ్చేది యంత్రాలు తొలిగించిన శ్రమ శక్తి నుండి కాదు, యంత్రాలతో పనిచేసేటప్పుడు వాస్తవంగా ఖర్చు పెట్టిన శ్రమ శక్తి నుండి. అనే నియమం తిరుగు లేనిదని రుజువవుతుంది. అదనపు విలువ అస్థిర పెట్టుబడి నుండి మాత్రమే ఏర్పడుతుంది. అదనపు విలువ మొత్తం రెండు అంశాల మీద ఆధారపడుతుంది:
ఒకటి అదనపు విలువ రేటు. రెండు పనివాళ్ళ సంఖ్య.   అదనపు విలువ రేటు × పనివాళ్ళ సంఖ్య = అదనపు విలువ మొత్తం
పనిదినం నిడివి తెలిస్తే, ఒకరోజులో అదనపు శ్రమ కాలానికీ, అవసర శ్రమకాలానికీ ఉండే నిష్పత్తి అదనపు విలువ రేటుని నిర్ణయిస్తుంది. నియమితులయ్యే శ్రామికుల సంఖ్య స్థిర పెట్టుబడికీ అస్థిర పెట్టుబడికీ ఉండే నిష్పత్తిని బట్టి ఉంటుంది.
ఇప్పుడు యంత్రాల వాడకం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఫలితంగా అవసర శ్రమని తగ్గించి అదనపు శ్రమని పెంచవచ్చు. ఎంత పెంచినప్పటికీ, పెట్టుబడి నియమించే శ్రామికుల సంఖ్యని తగ్గించడం ద్వారా మాత్రమే ఈఫలితం వస్తుంది. మునుపు శ్రమ శక్తి కొనడానికి వాడిన అస్థిర పెట్టుబడిని, ఇప్పుడు యంత్రాల్లోకి, అంటే స్థిర పెట్టుబడిలోకి  మారుస్తుంది. స్థిర పెట్టుబడి అదనపు విలువని ఏర్పరచదు. ఉదాహరణకు 24 మంది కార్మికులనుండి పొందే అదనపు విలువని ఇద్దరి నుంచి లాగడం అయ్యేపనికాదు. పనిదినం 12 గంటలు. ఒక్కొక్కరు 1 గంట అదనపు శ్రమను ఇస్తే, ఈ 24 మంది కలిసి 24 గంటల అదనపు శ్రమను ఇస్తారు. ఈ 24 గంటల శ్రమ ఇద్దరి పూర్తి శ్రమ (12×2).
వైరుధ్యం
అదనపు విలువ ఉత్పత్తికి  యంత్రాలు పెట్టడంలో అంతర్గతమైన ఒక  వైరుధ్యం ఉంది.
పెట్టుబడి ఏర్పరిచే అదనపు విలువకు సంబంధించిన రెండు అంశాల్లో ఒక అంశం అదనపు విలువ రేటు. రెండోది పనివాళ్ళ సంఖ్య. ఒక అంశం అయిన అదనపు విలువ రేటు పెంచాలంటే, రెండో అంశం అయిన శ్రామికుల సంఖ్యని తగ్గించాల్సిందే.
ఈ వైరుధ్యం ఎప్పుడు బయట పడుతుంది?
ఒకానొక పరిశ్రమలో యంత్రంతో ఉత్పత్తయిన సరుకుల విలువ అదే రకం సరుకులన్నిటి విలువనీ క్రమబద్ధం చెయ్యగానే ఈ వైరుధ్యం బయట పడుతుంది; ఈ వాస్తవం తెలియకపోయినా, పెట్టుబడి దారుణ్ణి పనిదినాన్ని అంతకంతకూ పెంచేందుకు ప్రేరేపించేది ఈ వైరుధ్యమే. ఎందుకంటే దోచుకోబడే కార్మికుల సంఖ్య తగ్గుదలని, సాపేక్ష ఆడపు విలువని పెంచడం ద్వారామాత్రమే కాకుండా, పరమ అదనపు శ్రమని పెంచడం ద్వారా కూడా భర్తీ చేసుకోడానికి.
యంత్రాల వాడకం పెట్టుబడిదారులకు, ఒకవైపున పనిదినాన్ని అతిగా పెంచేందుకు బలమైన, కొత్తకొత్త ప్రేరణలను సమకూరుస్తుంది. ఈపోకడకి ఏర్పడే అన్ని వ్యతిరేకతల్నీ విచ్చిన్నం చేసే విధంగా శ్రమ పద్ధతుల్నీ, సామాజిక శ్రమ వ్యవస్థ స్వభావాన్నీ తీవ్రంగా మారుస్తుంది. మరొక వైపు మునుపు అందుబాటులో లేని వాళ్ళని (స్త్రీలనీ, పిల్లలనీ)శ్రామిక వర్గానికి చేర్చడం  ద్వారా కొంత, పనిలో నించి  తొలిగించి విడుదల చెయ్యడం ద్వారా కొంతా  అదనపు శ్రామిక జనాభాను సృష్టిస్తుంది. యంత్రాన్ని సరుకుల్ని ఉత్పత్తి సాధనంగానే కాకుండా, అక్కరలేని /మిగులు జనాభాని (redundant population) ఏర్పరచే సాధనంగా  కూడా  రికార్డో గమనించాడనీ, అది ఆయన ప్రతిభా విశేషాల్లో ఒకటనీ మార్క్స్ ఫుట్ నోట్ లో ప్రశంసించాడు. ఈ అదనపు జనాభా శ్రామికులని పెట్టుబడి ఆజ్ఞలకు తల ఒగ్గి  పడి ఉండేట్లు ఒత్తిడి పెడుతుంది. ఆవిధంగా ఆధునిక పరిశ్రమ చరిత్రలో చెప్పుకోతగ్గ విషయం అయిన యంత్రాలు పనిదినానికి సంబంధిన అన్ని  నైతిక, సహజ సిద్ధ ఆంక్షల్నీ తుడిచి వేస్తాయి.  అందువల్ల కూడా ఒక ఆర్ధిక వైపరీత్యం (economic paradox) ఏర్పడుతుంది. ఏమంటే, శ్రమ కాలాన్ని తగ్గించే అత్యంత శక్తివంతమైన సాధనమే, శ్రామికుని యొక్కా, అతని కుటుంబం యొక్కా కాలంలో ప్రతి క్షణాన్ని పెట్టుబడి దారుడు తన పెట్టుబడిని విస్తరించుకునేందుకు అతనికి తిరుగులేని సాధనం అవుతుంది.
C. శ్రమతీవ్రత పెంపు
పెట్టుబడి చేతిలో ఉండే యంత్రాలు పనిదినాన్ని మితిమీరి పెంచుతాయి. ఈ చర్యకి సమాజం నుంచి ప్రతిచర్య వస్తుంది. చట్టం జోక్యం అవసరమవుతుంది. పనిగంటల్ని చట్టం నిర్ణయిస్తుంది.
పనిగంటలు తగ్గాయి కాబట్టి, పెట్టుబడిదారులకు అదనపువిలువ మునుపటికంటే తగ్గుతుంది. ఆ నష్టాన్ని భర్తీ చెయ్యడానికి శ్రమని తీవ్రతరం చేస్తారు. అప్పటినుండీ శ్రమ తీవ్రత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. శ్రమ తీవ్రత స్థిరంగా ఉన్నప్పుడు, పని గంటలు పెరిగితే వచ్చేది పరమ అదనపు విలువ అని విశ్లేషణలో తేలింది.
ఇప్పుడిక ఎక్కువ కాలం చేసే శ్రమ స్థానంలో ఎక్కువ తీవ్రతతో చేసే శ్రమని గురించి, దాని స్థాయిని గురించీ  చూద్దాం.
యంత్రాలతో పనిచెయ్యడం అలవాటు అయ్యే కొద్దీ సహజంగానే శ్రమ వేగమూ, తీవ్రతా పెరుగుతాయి.ఆవిధంగా ఇంగ్లండ్ ఫాక్టరీల్లో 50 ఏళ్లపాటు పనిగంటలూ, పని తీవ్రతా చెట్టపట్టా లేసుకుని పెరిగాయి.ఒక స్థాయి దాటి రెండూ పెరగడం వీలవదు. అక్కడనుండీ, ఒకటి పెరగాలంటే, రెండోది తగ్గాల్సి ఉంటుంది. పనిగంటలు పెరగాలంటే, శ్రమ తీవ్రత తగ్గాల్సి ఉంటుంది. శ్రమ తీవ్రత పెరగాలంటే, పనిగంటలు తగ్గాల్సి ఉంటుంది.అంటే పనిదినం పోడిగింపూ పనితీవ్రత పెంపూ ఒకదానికొకటి విరుద్ధంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. రోజు రోజు పని కొనసాగే చోట ఈ పరిస్థితి అనివార్యంగా  వచ్చి తీరుతుంది. పని దినం పెంపుని వ్యతిరేకిస్తూ కార్మికులు చేసే తిరుగుబాటు కారణంగా తప్పని పరిస్థితుల్లో  పార్లమెంటు మామూలు పనిదినాన్ని నిర్ణయించింది. దాంతో పనిదినం పెంచి అదనపు విలువ పెంచుకునే పధ్ధతికి పూర్తిగా అడ్డుకట్ట పడింది.ఆక్షణం నుంచీ,పెట్టుబడి యంత్రాల్ని మరింత మెరుగు పరిచేందుకు వేగంగా అడుగులు వేసింది.సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తికి సర్వ శక్తులూ ఒడ్డింది.
సాపేక్ష అదనపు విలువకి మరో దారి
పనిగంటలు నిర్ణయమయ్యాక, సాపేక్ష అదనపు విలువ స్వభావంలో  మార్పు వచ్చింది. సాధారణంగా  పనివాని ఉత్పాదక శక్తి పెంపువల్ల మాత్రమే సాపేక్ష అదనపు విలువ వస్తుంది. ఉత్పాదక శక్తి పెరిగితే, అంతే శ్రమ ఎక్కువ మోతాదులో సరుకుల్ని ఉత్పత్తి చేస్తుంది. అంతే శ్రమ కాలం ఎక్కువ సరుకులకు వ్యాపిస్తుంది. ఒక్కొక్క సరుకులో మునుపటికన్నా తక్కువ శ్రమ ఉంటుంది. ఫలితంగా ఒక్కొక్క సరుకు విలువ పడిపోతుంది.
ఇప్పటిదాకా సాపేక్ష అదనపు విలువ ఏర్పడ్డ పధ్ధతి ఇది.
ఇప్పుడు పధ్ధతి మారుతుంది. ఉత్పాదక శక్తి పెంపుకు తోడు, పనితీవ్రత పెంపు కూడా సాపేక్ష అదనపు విలువను ఇస్తుంది.ఎలాగంటే, మునుపు శ్రామికులు కొంత సమయంలో ఎంత ఉత్పత్తి చేస్తారో, అంటే సమయంలో తీవ్రంగా పనిచేసి ఎక్కువ ఉత్పత్తి చేస్తారు.పని తీవ్రత వల్ల  అదనపు విలువ పెరుగుతుంది. మునుపు 12 గంటల్లో ఎంత శ్రమ జరిగేదో, ఇప్పుడు 10 గంటల్లో అంతే జరుగుతుంది.అంతే మొత్తంలో సరుకులు ఉత్పత్తవుతాయి. శ్రమ తీవ్రత మరింత పెరిగే కొద్దీ, అంతకు మించికూడా ఉత్పత్తవుతాయి.

గంట శ్రమ సాంద్రత 12 గంటల పనిదినంలో కంటే, 10 గంటల పనిదినంలో ఎక్కువ ఉంటుంది. సాంద్రత ఎక్కువ వున్న ఒక పని గంటలో ఉత్పత్తయ్యే విలువ సాంద్రత తక్కువ వున్న1 1/3  పనిగంటలలో  ఉత్పత్తయ్యే  విలువఎంతో అంతేగానీ , అంతకుమించి గానీ  ఉంటుంది.కనుక పనిగంటలు తగ్గినా, పని తీవ్రత పెరిగి అదనపు విలువ అంతే వస్తుంది. పని తీవ్రత స్థాయిని బట్టి ఎక్కువ కూడా రావచ్చు.
శ్రమ తీవ్రతని పెంచే మార్గాలు
శ్రమశక్తి సమర్ధత దాన్ని వెచ్చించే కాలానికి విలోమ నిష్పత్తిలో ఉంటుంది. అంటే ఎక్కువ సేపు పనిచేసేకొద్దీ, సామర్ధ్యం తగ్గుతుంటుంది అని. కొన్ని పరిమితుల్లో పనిచేసే కాలం తగ్గినందువల్ల కలిగే నష్టాన్ని శ్రమశక్తి బిగువుని పెంచి భర్తీ చెయ్యవచ్చు. పైగా జరిగిన పనిని బట్టి  చెల్లించే పధ్ధతి, పనివాడు నిజంగా ఎక్కువ శక్తిని వెచ్చించేట్లు చేస్తుంది.
యంత్రాలు వాడని, వాడినా అతి తక్కువగా వాడిన కుండలపరిశ్రమ వంటి వాటిలో పనిగంటల తగ్గింపు శ్రమయొక్క క్రమ బద్ధతనీ, ఎకరూపతనీ, నిరంతరాయతనీ, శక్తినీ బాగా పెంచింది. అయితే అసలైన ఫాక్టరీలలో పనిగంటల తగ్గింపు ఇదే ఫలతాన్నిచ్చిందా  అనేది సందేహం. ఎందుకంటే, అక్కడ శ్రామికుడు నిరంతరాయమైన, ఏకరూప చలనం ఉండే యంత్రాలతోనే పనిచేస్తాడు, అందువల్ల అతని పని కచ్చితమైన క్రమ శిక్షణని ఏర్పరచింది.  1844 లో పనిగంటలు 12 గంటలనుంచి తగ్గించడం గురించి చర్చ వచ్చింది. యజమానులు ఫాక్టరీలు బాగా నిర్వహించబడుతున్నాయనీ, కార్మికుల శ్రద్ధ పెరిగినందువల్ల ఎదో మంచి  ఫలితం వస్తుందని ఆశించడం అసంగతం అనీ   దాదాపు ఏకగ్రీవంగా ఉద్ఘాటించారు. అయితే వాళ్ళ మాటలు నిజం కాదని ప్రయోగాలవల్ల రుజువయింది. ఉదాహరణకి నేత విభాగంలో పని దినాన్ని 12 నుంచి 11 గంటలకు తగ్గించినప్పుడు, 12 గంటల్లోకన్నాఎక్కువ ఉత్పత్తయింది. ఈ పెంపుదల కార్మికులు శ్రద్ధగా పనిచేసి, కాలాన్ని పొదుపు చేసిన దాని ఫలితం. కార్మికులకి మునుపు వచ్చినంత జీతమే వచ్చింది. ఒక గంట కాళీ సమయం దొరికింది. యజమానులకు మునుపతత ఉత్పత్తి వచ్చింది. బొగ్గు, గాస్ వంటివి ఒక గంట ఖర్చు కాకుండా మిగిలాయి. పనివాళ్ళు చెప్పిన మాట :  మరింత ఉత్సాహంతో పనిచేస్తాము. రాత్రిపూట ఒక గంట ముందు ఇంటికి పోతామని మామనసులో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది.

మొదటి విషయం
అయితే ఆ ఉత్సాహం తాత్కాలికమే. అయితే ఆ తగ్గింపు తప్పని సరి అయిన వెంటనే, పెట్టుబడిదారుని చేతిలో యంత్రాలు మరింత శ్రమని పిండే సాధనాలవుతాయి. ఈ పిండడం రెండు విధాలుగా జరుగుతుంది:
1.      యంత్రాల వేగం పెంచడం
2.      ఒక్కొక  శ్రామికుడు పనిచెయ్యాల్సిన యంత్రాల సంఖ్య పెంచడం.
అందుకు యంత్రాల్లో మెరుగుదల అవసరం. ఎందుకంటే అవిలేకుండా పనివాదిమీద ఒత్తిడి పెంచడం సాధ్యం కాదు. పనిగంటలు తగ్గాయి కాబట్టి, ఉత్పత్తి ఖర్చు మీద నిఘాపెట్టాల్సి ఉండడం మరొక కారణం.
1.ఆవిరి యంత్రంలో వచ్చిన మెరుగుదలలు ముసలకం (piston) వేగాన్ని పెంచాయి. అంతే బొగ్గుతోనో, అంతకన్నా తక్కువతోనో అదే ఇంజన్ తో మరిన్ని యంత్రాలు నడిచాయి. అందించే యంత్రాంగంలో (transmitting mechanism) మెరుగుదలలు రాపిడిని/ఘర్షణని (friction) తగ్గించాయి. యంత్ర దండాలవ్యాసాన్నీ, బరువునీ తగ్గించాయి. పాత యంత్రాలకీ, కొత్తవాటికీ కొట్టొచ్చినట్లు కనబడే తేడా ఇది. యంత్రాల సైజు తగ్గిస్తూనే, వాటి సామర్ధ్యాన్నీ, వేగాన్నీ పెంచాయి. ఆధునిక మరమగ్గం ఇందుకు ఉదాహరణ.  అలాగే సైజుని పెంచుతూ, అందులోని పనిముట్ల సంఖ్యనీ, విస్తృతినీ పెంచాయి. పైకి కనిపించని, సూక్ష్మమైన మార్పులద్వారా ఆ భాగాల వేగాన్ని పెంచాయి. నూలు వడికే యంత్రాలు ఇందుకు ఉదాహరణ.
12 గంటల పనిదినం
ఇంగ్లండ్ లో 1832లో పనిదినం 12 గంటలకు తగ్గించబడింది. 1836 లో ఒక మాన్యుఫాక్చరర్ ఇలా అన్నాడు: 30,40 ఏళ్ళనాటితో  పోలిస్తే, ఇప్పుడు ఫాక్టరీలలో జరిగే శ్రమ ఎంతో ఎక్కువ. కారణం బాగా పెరిగిన యంత్రాల వేగం, మరింత శ్రద్ధా, చర్యా అవసరం కావడమే. 1844 లో లార్డ్ ఆష్లే హౌస్ ఆఫ్ కామన్స్ సభలో యంత్రాలు మనుషుల శ్రమన్ని అపారంగా పెంచాయి అన్నాడు. అందుకు రుజువులు చూపాడు:
·         40 నంబరు నూలు వడికే ఒక జత యంత్ర కదుళ్ళను చూచే పనివాడు  1825 లో 12 గంటల పనిదినంలో  8 మైళ్ళు నడవాల్సి వచ్చేది. అదే పనివాడు 1832 లో 20 మైళ్ళు నడవాల్సి వచ్చింది.
·         1815/1825 లో వడుకు పనివాడు ఒక్కొక్క యంత్రం మీదా 820 కండెల చొప్పున రెండు యంత్రాలమీద  1640 కండెలు(stretches) పెట్టేవాడు
1832  లో  ఒక్కొక్క యంత్రం మీదా 2200 కండెల చొప్పున రెండు యంత్రాలమీద  4400 కండెలు పెట్టేవాడు.
·         1838 లో వారంలో వడికే నూలు చిట్టెముల (hanks) సంఖ్య 18వేలు. 1843లో 21 వేలకు పెరిగింది.
·         1819 లో మరమగ్గాల నేతలో నిముషానికి 60 కండె విసుర్లు ఉండేవి. 1842 లోఅవి 140 కి పెరిగాయి.
·         నాసిరకం దూదిని కూడా వాడుతున్నారు. అందువల్ల శ్రమ ఎక్కువవుతుంది.
·         నూలు చిక్కుదీసే చోటకూడా పని పెరిగింది. మునుపు ఇద్దరు చేసిన పనిని ఇప్పుడు ఒకడే చేస్తున్నాడు.
ఇవన్నీ శ్రమ పెరుగుదలని సూచిస్తాయి. నడవాల్సిన దూరం ఎక్కువ కావడం వల్ల, ఉత్పత్తయ్యే వస్తువు బాగా పెరిగినందువల్ల, పనివాళ్ళ నిష్పత్తి మునుపటి కంటే తగ్గినందువల్ల పని పెరుగుతున్నది.
12 గంటల చట్టం ఫలితంగా  1844 కల్లా పని తీవ్రత అమితమయింది. అప్పుడు ఇంగ్లిష్ మాన్యుఫాక్చరర్లు ఇక శ్రమ తీవ్రతను పెంచడం సాధ్యం కాదన్నారు. కనుక ఇంతకన్నా పనిగంటలు తగ్గిస్తే ఉత్పత్తి తగ్గుతుందన్నారు. యజమానులమీద నిరంతరం నిఘా పెట్టె ఇన్స్పెక్టర్ హోమర్ సైతం వాళ్ళు చెప్పింది సరైనదే అనుకున్నాడు. కాబట్టి పనిగంటల్ని 12 కన్నా తగ్గిస్తే, ఉత్పత్తి పడిపోతుందని నిర్ధారించాడు.
అయితే వాళ్ళలా చెప్పినా,  1847 లో 10 గంటల పని చట్టం వచ్చింది.  శ్రమ తీవ్రతని ఇంకా పెంచడం సాధ్యమేనని తేలింది. అప్పుడు నూలు, ఉన్ని, పట్టు, నార మిల్లుల్లో పది గంటల పని అమల్లోకి వచ్చింది. త్రాసిల్ యంత్రం మీద కదుళ్ళ వేగం నిముషానికి 500 భ్రమణాలూ, 1000 భ్రమణాలూ పెరిగాయి.
1848-1852 నడుమ ఆవిరి యంత్రం మెరుగైంది. ఇప్పటి ఆవిరి యంత్రం నుంచి, మునుపటి యంత్రం నుంచి కంటే 50 శాతం ఎక్కువ పని జరుగుతున్నది. అని హోమర్ ఉత్తరానికి జవాబులో జేమ్స్ నాస్మిత్ అనే ఇంజనీర్ రాశాడు. అతనిలా అభిప్రాయపడ్డాడు:
ప్రతి రకం యంత్రాల్లోనూ గొప్ప మేరుగుదలలు వచ్చాయి. అవి ఉత్పాదక శక్తిని ఎంతగానో పెంచాయి. ఈ మెరుగుదలలకు ప్రేరేపించింది పనిగంటల తగ్గింపే. ఇందుకు సందేహం లేదు. పనివాని అధిక శ్రమా, యంత్రాల మేరుగుదలా కలిసి ఉత్పాదక శక్తిని పెంచాయి. 10 గంటల పనిదినంలోనే, మునుపు 12 గంటల్లో అయినంత ఉత్పత్తే అవుతున్నది.
అధిక శ్రమ తీవ్రత లాభాల్నీ, పారిశ్రామిక వృద్ధి రేటునీ పెంచింది. యజమానుల సంపద అతీతంగా పెరిగింది. 1838-1850 కాలంలో 32 శాతమూ, 1850-1856 కాలంలో 86 శాతమూ పెరిగింది. 1848-1856 కాలంలో 10 గంటల పని ప్రభావంవల్ల పరిశ్రమల అభివృద్ధి గొప్పగానే ఉంది. అయితే దాన్ని  1856-1862 కాలంలో జరిగిన అభివృద్ధి ఎంతగానో మించిపోయింది.
 సంవత్సరం
కదుళ్ళ సంఖ్య
మగ్గాల సంఖ్య
పనివాళ్ళు
1856
1,093,799
9,260
56,131
1862
1,388,544
10,709
52,428
ఈ అంకెలని బట్టి చూస్తే, కదుళ్ళూ, మగ్గాలూ పెరిగాయి. అయినా పనివాళ్ళు తగ్గారు.
ఉన్నిబట్టల మిల్లులు విషయం:
సంవత్సరం
మగ్గాల సంఖ్య
పనివాళ్ళు
14 ఏళ్ల లోపు పిల్లలు
1856
38,956
87, 794
11,228
1862
43,048
86,063
13,178
ఈ అంకెలని బట్టి చూస్తే,  మగ్గాలు పెరిగాయి. అయినా పనివాళ్ళు తగ్గారు. పిల్లలు పెరిగారు.
ఇందుకు పరోక్ష రుజువు పనివాళ్ళ నిరసనలే, ప్రతిఘటనలే.

 1863 ఏప్రిల్ 27న కామన్స్ సభలోమాట్లాడుతూ  ఫెర్రండ్  తాను16 జిల్లాల ప్రతినిధుల పక్షాన మాట్లాడుతున్నా నన్నాడు. యంత్రాల్లో వస్తున్న మెరుగుదలల మూలంగా ఫాక్టరీలలో పనిభారం పెరుగుతున్నదని తనతో చెప్పారన్నాడు. మునుపు ఇద్దరు సహాయకులతో ఒక పనివాడు రెండు మగ్గాలు నడిపే వాడు. ఇప్పుడు సహాయకులు లేకుండా, ఒక్కడే మూడు మగ్గాలు నడుపుతున్నాడు. నాలుగు మగ్గాలు నడపడం కూడా అరుదేమీ కాదు.
పై వాస్తవాలని బట్టి మునుపటి 12 గంటల పని ఇప్పటి 10 గంటల ఇమడ్చబడిందని, అంటే అప్పటి 12 గంటల పని ఇప్పుడు 10 గంటల్లోనే అయిపోతున్నదని.
ఈ ఉత్పాదకత పెరగడానికి కారణం శ్రమ తీవ్రత పెరుగుదలే. అయితే శ్రమ తీవ్రత పెరగడం అనేది  శ్రామికుని ఆరోగ్యానికీ, సరిగా పనిచెయ్యడానికీ  ఆటంకం కలిగిస్తుంది.
గత కొద్ది సంవత్సరాల కాలంలో, అనేక నూలు, సిల్కు, ఉన్ని మిల్లుల్లో యంత్రాల వేగం విపరీతంగా పెంచారు. వాటిని సరిగా  చూసేందుకు  పని వాళ్ళు అలసట పుట్టించే ఉద్విగ్న స్థితిలో ఉండడం అవసరం. ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోయే వారి సంఖ్య ఎక్కువవడానికి ఇదే కారణం ఇదే నని Dr.గ్రీన్ హౌస్ చెప్పింది సరైనదే.
ఇక తర్వాత అడుగు మరొకసారి పనిగంటలు తగ్గించడమే
పని గంటల పొడిగింపు ఇక లేకుండా నిషేధించాక, పెట్టుబడిదారుడు తనకు కలిగే నష్టాన్ని శ్రమ తీవ్రతని పధ్ధతి ప్రకారం పెంచడం ద్వారా పూడ్చుకోవాలనీ, యంత్రాలలో వచ్చే మెరుగుదలల్ని పని వాళ్ళ శక్తి సామర్ధ్యాల్ని పూర్తిగా వినియోగించుకునే సాధనాలుగా మార్చుకోవాలనీ అనుకుంటాడు. ఈ ధోరణి మళ్ళీ పనిగంటల తగ్గింపు తప్పని స్థితికి పరిస్థితుల్ని తోసుకుపోతుంది. ఇందుకు ఏమీ సందేహం లేదు. ఇందుకు రుజువుగా ఫుట్ నోట్ లో : ఇప్పుడు, అంటే 1867 లో లాంక్ షైర్ ఫాక్టరీల్లో  8 గంటల పనిదినం కోసం కార్మికుల ఆందోళన ఆరంభమైంది- అని చెబుతాడు.
మరొక పక్క, 10 గంటల పనిరోజు ప్రభావం వల్ల, 1848 నించీ ఇప్పటిదాకా (1867) ఇంగ్లండ్ పరిశ్రమలో ఊపుగా వచ్చిన పురోగతి, పనిరోజు 12 గంటలుగా ఉన్న  1837-1847 కాలంలో వచ్చిన పురోగతిని ఎంతో మించింది. ఎంతగా అంటే, అంతకు ముందు ఫాక్టరీలు ప్రవేశించిన అర్ధ శతాబ్దంలో- అంటే పనిరోజుకి అసలు పరిమితి లేని కాలంలో - వచ్చిన పురోగతికంటే  1837-1847 కాలంలో వచ్చిన పురోగతిని ఎంతగానో అధిగమించింది.
వచ్చే పోస్ట్ – ఫాక్టరీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి