11, మే 2018, శుక్రవారం

మార్క్స్ అదనపు విలువ సిద్ధాంతం


మార్క్స్ అదనపు విలువ సిద్ధాంతం 

2018  మే 'అరుణతార' లో వచ్చింది 
 ఆర్ధిక వేత్తలు అందరూ ఒక పొరపాటు చేశారు.  అదనపు విలువని దానికదిగా, దాని  స్వచ్చమైన రూపంలో పరిశీలించలేదు. దాని ప్రత్యేక రూపాలైన లాభంగా, అద్దెగా పరిశీలించారు.-అదనపు విలువ సిద్ధాంతాలు’ -సంపుటి 1.40 
అలా విడివిడిగా పరిశీలించినందువల్ల సిద్ధాంత పరంగా దోషాలు దొర్లాయంటాడు. అందుకే ఆయన ముందు అదనపు విలువని స్వచ్చమైన రూపంలో చూపుతాడు. 
పెట్టుబడి మొదటిభాగం ప్రచురించాక, మార్క్స్ ఎంగెల్స్ కి 1867 ఆగస్ట్ 24  ఉత్తరం రాశాడు. అందులో అదనపు విలువను దాని ప్రత్యేక రూపాలయిన లాభం, వడ్డీ, అద్దె వగైరాల నుంచి విడిగా, స్వతంత్రంగా చూడటం తన పుస్తకంలోని రెండు మంచి అంశాలలో ఒకటని అన్నాడు. 

అదనపు విలువ అంటే 
పెట్టుబడిదారుడు డబ్బుతో మార్కెట్ కోస్తాడు. పరికరాలు ముడిపదార్ధాలూ కొంటాడు. కూలికి పనివాళ్ళని పెట్టుకుంటాడు. అంటే తన డబ్బుని సరుకులుగా మారుస్తాడు. -  డబ్బు-సరుకు.  
కొయ్యని  మంచాలు చేయిస్తాడు. ఆమంచాల్ని అమ్ముతాడు. అంటే సరుకుల్ని డబ్బులోకి మారుస్తాడు- 
సరుకు-డబ్బు. 
రెండు చర్యల్నీ కలిపితే డబ్బు-సరుకు-డబ్బు.  
పెట్టినంత డబ్బే తిరిగొచ్చేదానికి ఎవ్వరూ కార్ఖానాలు తెరవరు.
మొదట పెట్టిన డబ్బుకంటే చివరలో తీసుకునే డబ్బు ఎక్కువగా ఉంటేనే డబ్బుపెట్టి పనులుచేయిస్తారు:  
డబ్బు-సరుకు-ఎక్కువ డబ్బు అతను డబ్బు పెట్టేది ఆ ఎక్కువ డబ్బు కోసమే. చివరిడబ్బు = పెట్టిన డబ్బు + పెరిగిన డబ్బు.  
అందువల్ల దీని కచ్చితమైన రూపం డ-స-డ’. ఇందులో డ’ =డ+ Δ డ. అంటే, మొదట పెట్టినది+ పెరుగుదల.
ఈ పెరుగుదలనే, అసలు విలువమీద ఎక్కువనే నేను అదనపువిలువ అంటున్నాను”- Capital 1.149 
అందువల్ల మొదట అడ్వాన్స్ చేసిన విలువ చలామణీలో చెక్కుచెదరకుండా ఉండడమే కాకుండా, తనకుతాను అదనపు విలువను కలుపుకుంటుంది, లేక తననుతాను వ్యాకోచింప చేసుకుంటుంది. దాన్ని పెట్టుబడిలోకి మార్చేది ఈచలనమే.
 చలామణీ రంగంలో పెట్టుబడి సాధారణ ఫార్ములా: డ-స-డ’ 
అదనపు విలువ ఎలా ఏర్పడుతుంది?
ఇక్కడ రెండు మారక చర్యలున్నాయి. డబ్బుతో ఇతరుల సరుకులు కొనడం ఒక చర్య. డబ్బుకి తన సరుకులు ఇతరులకి అమ్మడం మరొకచర్య. మొదటి మారక చర్య: డబ్బు-సరుకు. ఆసరుకుల విలువ ఎంతో అంత ఇస్తాడు. రెండో మారకచర్య: సరుకు-డబ్బు తన సరుకు విలువ ఎంతో అంతే పొందుతాడు. 
మరి అదనపు విలువ ఎలా ఏర్పడింది?
మారకంలో ఏర్పడుతుందా?
సరుకులు మారుతుండడం అందరికీ తెలిసిందే. ఒక చెప్పుల జత కుట్టడానికీ, రెండు  చేటలు అల్లడానికి ఒకే సమయం పడితే అవి రెండూ మారకం అవుతాయి. మారకం అవడానికి సరుకుల్లో  సమానమైన శ్రమ పరిమాణాలు ఉండాలి. అంటే అవి సమాన విలువలు కావాలి.ఇదే విలువ నియమం.
విలువని ఏర్పరచేది శ్రమే అని మార్క్స్ కి ముందున్న ఆర్ధిక వేత్తలు తేల్చారు.రెండు రకాల సరుకులు మారకం అయ్యేటప్పుడు  వాటి ఉత్పత్తికి అవసరమైన శ్రమకాలాలు లెక్కకొస్తాయి.
ఒకసరుకు ఉత్పత్తికి అవసరమైన శ్రమకాలం ఆసరుకు విలువని నిర్ణయిస్తుంది. అంతే పరిమాణంలో శ్రమ ఉన్న సరుకుతోనే 
అది మారుతుంది.ఉదాహరణకి ఒక బుట్ట అల్లడానికి 1 గంట శ్రమా, ఒక నిచ్చెన చెయ్యడానికి 3గంటల శ్రమ 
అవసరమనుకుందాం. అప్పుడు 
1 నిచ్చెన = 3 బుట్టలు  
ఆపరిమాణాల్లో అవి సమాన విలువలు. కనుక మారకం అవుతాయి. అంటే, సమాన విలువలు గల సరుకులే మారతాయి 
అనేదే ఆనియమం. దీన్ని మార్క్సుకి ముందున్న సాంప్రదాయ అర్ధశాస్త్రం నిర్ధారించింది. 
సరుకులు ఏపాళ్లలో సమానమవుతాయో తేల్చేది వాటి వాటి విలువ.
కాబట్టి సరుకు మారకంలోకి రాక ముందే విలువ నిర్ణయమవుతుంది. సరుకు విలువ అనేది చలామణీ ఫలితం కాదు, చలామణీ కి ముందు షరతు.
తేలిందేమంటే సమాన విలువలే మారతాయి, మారకంలో అదనపు విలువ రాదు - మరెక్కడనుండి వస్తుంది.
మార్క్స్ కి ముందు ఆర్ధిక వేత్తలకు ఇది అంతుపట్టలేదు.కారణం వాళ్ళు నిర్ధారించిన మారక నియమాన్ని బట్టి అదనపు విలువని వివరించడం అసాధ్యమయింది. పెట్టుబడిదారుడు కొన్న సరుకుల్లో శ్రమ శక్తి ఉంది. అది చర్య చేస్తేనే విలువ ఏర్పడుతుంది.పెట్టుబడికీ శ్రమశక్తికీ మారకం  జరుగుతుంది. ఈ మారకం కూడా మిగిలిన అన్ని సరుకుల మారకాల లాగే, సమానమారకం అయితీరాలి.ఇక్కడే ఇబ్బంది ఏర్పడింది.
రికార్డో పెట్టుబడికీ శ్రమకీ మారకం విషయంలో సమానత్వం గురించి ఆలోచించాడు. ఆయనకొక చిక్కు వచ్చింది. పెట్టుబడిదారుడు కార్మికుని శ్రమకు శ్రమవిలువ చెల్లించి చాకిరీ చేయించుకుంటున్నాడు. లాభం పొందుతున్నాడు. శ్రమవిలువ పూర్తిగా కార్మికుడికిస్తే మరి లాభం ఎక్కడనుంచి వస్తుందికార్మికునికి తక్కువ ఇస్తే సమాన విలువల మధ్య మారకం జరగలేదని అర్థం గదాశ్రమ విలువ సిద్ధాంతమే తప్పవుతుంది గదా? సమాన విలువలే మారకం కావాలి, లాభం రావాలి. శాస్త్రీయంగా దీన్ని రుజువు చెయ్యలేకపోయాడు రికార్డో. ఇదే ఆయన్ని వేధించిన సమస్య. వాస్తవానికీ సూత్రానికీ మధ్య పొంతన కుదర్చలేక పోయాడు. విలువ సిద్ధాంతాన్ని వదులుకోలేకావాస్తవంగా వస్తున్న లాభాన్ని భ్రమ అనలేకా సతమతమయ్యాడాయన. అక్కడే ఆగిపోయాడు.
రికార్డో శిష్యులు – అసమాన మారకం
సరుకుల్లో చేరిన విలువ మొత్తం కార్మికునిదే
రికార్డియన్ సోషలిష్టులు 1820, 1830 దశకాల్లో కృషి చేశారు. అదనపు విలువకి  అసమాన మారకాన్నే పునాది 
ఛేశారు. తయారైన సరుకుల్లో చేరిన విలువ మొత్తం కార్మికునికే రావాలి. అదంతా వాళ్లదే. కాని అలా రావడం లేదు. కొంత యజమానికి చేరుతున్నది. కనక అది అసమాన మారకం. ఇది రికార్డియన్ సోషలిష్టుల వాదం. రికార్డియన్ సోషలిష్టులు.  కార్మికుడు తన ఉత్పాదితం మొత్తానికీ హక్కుదారుడు అని వాదించారు. ఇది మారక నియమాన్ని తోసిపుచ్చే వాదన.
మార్క్స్ వచ్చేసరికి పరిస్థితి అది. సమాన మారకాల జరుగుతూ, అదనపు విలువ ఎలా వస్తుంది అనేది సమస్య గానే మిగిలి ఉంది.
మార్క్స్ పరిష్కారం-సమాన మారకమే
సరుకుల్లో చేరిన విలువ మొత్తం పెట్టుబడిదారుడిదే

శ్రామికుడికీ పెట్టుబడిదారుడికీ మధ్య మారకం మామూలు (సింపుల్) మారకమే; ఇద్దరిలో ప్రతి ఒక్కడూ సమానకాన్ని పొందుతాడు; ఒకరు డబ్బుపొందుతాడు, మరొకరు ఆడబ్బుకి సరిగ్గా సమానమయిన ధరగల సరుకు పొందుతాడు.- గ్రున్డ్రిస్ 
పెట్టుబడిదారుడు కొన్న సరుకుల విలువ కంటే, అమ్మిన సరుకుల విలువ ఎక్కువ. అమ్మిన సరుకు విలువ ఎవరిది?
ఉత్పాదితం ఎవరికి చెందుతుంది? కార్మికునికా,పెట్టుబడిదారునికా?
దీనికిచ్చే జవాబుని బట్టే జరిగిన మారకం సమాన మారకమో అసమాన మారకమో తేలుతుంది. 
కార్మికునిదైతే, అసమాన మారకం. ఎందుకంటే ఉత్పాదితం విలువలో కొంతభాగం పెట్టుబడిదారుడికి పోతున్నది. 
ఉత్పాదితం అతనిదే అయితే, దానివిలువంతా అతనికే రావాలి. రావడంలేదు కనక అసమాన మారకం. 
పెట్టుబడిదారునిదైతే, సమాన మారకం.మార్క్స్ ప్రకారం అది పెట్టుబడిదారునిదే. అని పలుచోట్ల చెప్పాడు. 
పెట్టుబడిదారీ స్వాయత్త విధానం సరుకు ఉత్పత్తి నియమాలను ఎంతగా తోసిపుచ్చినట్లు/ తిరస్కరిస్తున్నట్లు 
కనిపించినప్పటికీ, అది (ఆ స్వాయత్త విధానం) ఆనియమాల ఉల్లంఘన వల్లకాక, వాటి వర్తింపు వల్లనే తలెత్తింది 
అంటాడు. 

వేతనశ్రమా- పెట్టుబడీ లో: ఉత్పత్తయిన సరుకులోగానీ, దాని ధరలో గానీ అతనికి (కార్మికుడికి) ఏమీ భాగం లేదు మగ్గానికి లేనట్లే.”-సంకలిత రచనలు 1.పేజీ 95  
శ్రమ ఉత్పాదితం లేక దాని విలువ శ్రామికుడికి చెందదు.- TSV1.72 
ఉత్పాదితం పెట్టుబడిదారుడికి చెందుతుంది, శ్రామికుడికి కాదు. cap1.549 
శ్రామికులు మాత్రమే ఉత్పత్తిచేసిన అదనపు విలువ అనుచితంగా, అన్యాయంగా పెట్టుబడిదారుల వద్ద వుండి పోతుంది
అని మార్క్స్ అన్నట్లు వాగ్నర్ ఆరోపించాడు.  తాను చెప్పనిది తనకు ఆపాదించాడని  మార్జినల్ నోట్స్లో మార్క్స్ తప్పుబట్టాడు: నిజానికి, నేను దీనికి సరిగ్గా వ్యతిరేకమైనది చెప్పాను: ఏమనంటే, సరుకు ఉత్పత్తి ఒకానొక కాలంలో పెట్టుబడిదారీ సరుకు ఉత్పత్తిగా ఉంటుంది. ఈ పెట్టుబడిదారీ సరుకును నిర్దేశించే విలువ నియమం ప్రకారంఅదనపువిలువ తప్పనిసరిగా పెట్టుబడిదారునిదే అవుతుంది, కార్మికునిది కాదు.” (Marx & Engels Collected works volume 24 p.558) 

సరుకులో ఉన్న శ్రమ కార్మికునిది. అది అతనికి రాకపోతే సమాన మారకం ఎలావుతుంది?
దీన్ని రుజువు చెయ్యాల్సి ఉంది.
పెట్టుబడిదారుడు కొన్న సరుకుల విలువకన్నా అమ్మే సరుకుల విలువ ఎక్కువయితేనే గాని అదనపు విలువ సాధ్యంకాదు. సరే, కొన్నవాటి కన్నా అమ్మేవాటిలో ఎక్కువ విలువ ఎందుకుంటుంది? ఆ విలువ మారకంలో ఏర్పడదు గదా! అంటే  మారకానికి ముందే ఉండాలి. అంతకు ముందు ఏం జరిగిది? శ్రమ ప్రక్రియ జరిగింది. ముడి పదార్ధాలకి శ్రమ కలిసింది. ఉత్పత్తి జరిగింది.
చలామణీ రంగం నుంచి, ఉత్పత్తి రంగానికి 
పెట్టుబడి దారుడు కొన్న సరుకులలో, ఒక సరుకు  ఉపయోగపు విలువ, విలువని సృష్టించడం అయితేనే, అదికూడా తన విలువకన్నా ఎక్కువ విలువను సృష్టించడం అయితేనే అదనపు విలువ వస్తుంది-, సమాన విలువలే మారినా. 
అలాంటి సరుకు పెట్టుబడిదారుడికి దొరికినప్పుడే అతనికి అదనపు విలువ వస్తుంది. యీ చిక్కు సమస్య విడిపోతుంది.     మార్కెట్ లో అలాంటి సరుకు ఒకటి ఉంది. దాని ఉపయోగపు విలువ అంతా మారకపు విలువని ఉత్పత్తి చేయడమే. 

సరుకు శ్రమశక్తి, శ్రమ కాదు 

కార్మికుడు అమ్ముతున్నది శ్రమని కాదు, శ్రమశక్తిని అని మార్క్స్ నిర్ధారించాడు. శ్రమశక్తి సరుకు. శ్రమ కాదు. శ్రమ అనేది చలనంలో వున్న శ్రమశక్తి. కనుక శ్రమకి విలువ వుండదు. శ్రమశక్తి అనే మాట మార్క్సుకి ముందు వాడుకలో లేదు. శ్రమశక్తి విలువనే శ్రమవిలువ అనేవారు. మార్క్స్ ప్రకారం శ్రమకి విలువ వుండదు. ఎందుకంటే అది సరుకు కాదు. కనక శ్రమవిలువ అనేది అర్ధంలేని పదబంధం. శ్రమశక్తి ధర లేక విలువ పైకి శ్రమ ధరగా, విలువగా  కనిపిస్తుంది. 
శ్రమవిలువ దగ్గర బయలుదేరిన సాంప్రదాయ ఆర్థికవేత్తలకు యిబ్బంది ఎదురయింది. శ్రమశక్తి దగ్గర బయలుదేరితే  చిక్కు వీడిపోతుంది. శ్రమశక్తి ఒక సరుకు. అయితే అది విశిష్టమైన సరుకు. విలువను సృష్టించటం దాని ఉపయోగపు విలువ. 
పెట్టుబడిదారు కార్మికుల శ్రమను డబ్బుతో కొన్నట్లు కనబడుతుంది. వాళ్లు తమ శ్రమను డబ్బుకుగాను 
పెట్టుబడిదారుకు అమ్ముతారు. కాని యిది పైకి కనిపించేది మాత్రమే. నిజానికి వాళ్లు అమ్మేదీ, అతను కొనేదీ శ్రమశక్తిని. 
శ్రమవిలువ సిద్ధాంతం కేంద్రంగా రాజకీయ అర్థశాస్త్రాన్ని నిర్మించటానికి రికార్డో ప్రయత్నించాడు గాని కార్మికులు 
అమ్ముతున్నది శ్రమని కాదనీ శ్రమశక్తిననీ గ్రహించలేదు అంటాడు మార్క్స్. కార్మికుడు అమ్మేది సరుకులో 
ఇమిడివున్న శ్రమని కాదు, తన సొంత శ్రమ శక్తిని.”- అదనపువిలువ సిద్ధాంతాలు 1.313. 
 మార్క్స్ ప్రకారం: మారకం జరిగేది కార్మికుడి శ్రమశక్తికీ, పెట్టుబడిదారుడి డబ్బుకీ. అది సమాన విలువల మారకమే. 
శ్రమశక్తిని అమ్మాక దాని ఉపయోగపువిలువ కొన్నవాడిదే. ఎంత శ్రమజరిగినా అంతా పెట్టుబడిదారుడిదే. 
అసమాన మారకం (ఇచ్చేది తక్కువ పుచ్చుకునేది ఎక్కువ) వల్లనే పెట్టుబడిదారుడు అదనపు విలువ పొందుతాడు అని మార్క్స్ కి ముందు కొందరు భావించారు. ఆ వాదం శాస్త్రీయమైనది కాదనీ, సమాన మారకం జరుగుతూనే అదనపు విలువ ఏర్పడుతుందనీ మార్క్స్ చెప్పాడు. 
వాళ్లు అనుకున్నట్టుగా మారకం జరిగేది శ్రమకీ, పెట్టుబడికీ కాదనీ, శ్రమశక్తికీ పెట్టుబడికీ అనీ శ్రమశక్తి అనే కొత్త 
భావనను ప్రవేశపెట్టాడు. ఆ ఆధారం మీదనే అదనపు విలువని రుజువు చేశాడు.  
శ్రామికుడు అమ్మింది సరుకులో చేరిన శ్రమని కాదు, సరుకుగా శ్రమశక్తిని అనే వాస్తవం నుంచి పెట్టుబడిదారుడు 
చేసుకునే లాభం,అతను రాబట్టే అదనపువిలువ వస్తుంది. 
అప్పటికి అర్థశాస్త్రంలో లేని శ్రమశక్తి అనే భావనని ప్రవేశపెట్టాడు మార్క్స్. మారకంలో ఒకవైపు డబ్బుంటే, రెండోవైపున వున్నది శ్రమ శక్తి. శ్రమ అని అంతకు ముందువాళ్లు అనుకున్నారు. మార్క్స్ ప్రకారం శ్రమ సరుకు కాదు. ఇది తెలియకపోతే మార్క్స్ సిద్ధాంతం లోని అతి కీలకమైన విషయం తెలియనట్లే. 

శ్రమ శక్తి సరుకు, శ్రమ కాదు మార్క్స్ ఆవిష్కరణ 
          అదనపువిలువసిద్ధాంతానికి ఆధారపీఠం ఇదే 
ఉత్పత్తయిన సరుకు  విలువలో ఒకభాగం శ్రామికుడికి వస్తుంది. రెండో భాగం పెట్టుబడిదారుడికి పోతుంది. 
మార్క్స్ కి ముందు ఆర్దికవేత్తలకు ఈవిషయం తెలుసు. అప్పటికి శ్రమ సరుకనీ కార్మికుడు తన శ్రమని అమ్ముతున్నాడనీ, పెట్టుబడిదారుడు కొంటున్నాడనీ అనుకున్నారు.

శ్రమ సరుకు అని ఎందుకనుకున్నారు
శ్రమ సరుకు అయినట్లు కనిపిస్తుంది. అమ్మిన శ్రామికుడూ కొన్న పెట్టుబడిదారుడూ మారకం అయిన సరుకు శ్రమ అనుకుంటారు. ఎందుకో చూద్దాం. 1.పరిస్థితుల్ని బట్టి పనిదినం 8,10,12 గంటలుగా ఉంటుంది. 
పనిదినం ఇన్ని గంటలు అని కార్మికుడికి తెలుసు. కూలీ ఎంతో కూడా తెలుసు. దాన్నిబట్టి గంట శ్రమకి ఇంత అని 
లెక్కించుకుంటాడు. 10 గంటలు పనిచేస్తే రు.400 తీసుకునే వాడికి గంట శ్రమ విలువ రు.40 అనుకోవడం సహజమే. 
చేసిన శ్రమ పరిమాణాన్ని బట్టి అతని వేతనం ఉంటుంది. కనుక తను అమ్ముతున్నది శ్రమనిఅనుకుంటాడు. 
2. తను సరుకుని ఇచ్చే తీరుని బట్టికూడా అమ్ముతున్నది శ్రమని అనుకుంటాడు. శ్రమ చేశాకనే వేతనం వస్తుంది. అందువల్ల చేసిన శ్రమకి వేతనం వచ్చింది అనిపిస్తుంది.
ఆర్ధికవేత్తలు విషయాన్ని లోతుగా పరిశీలించకుండా అప్పటికి వాడుకలో ఉన్న శ్రమవిలువ అనేపదాన్ని అదే అర్ధంలో తీసుకున్నారు. ఆ ప్రకారం విశ్లేషణ కొనసాగించారు. వాళ్ళకి చిక్కేర్పడింది. 
శ్రమ సరుకయితే, శ్రమ విలువని నిర్ణయించాలి. వాళ్ళు ఈపనికి పూనుకోలేదు. పూనుకున్నా,ఇది నిర్ణయమయ్యేది కాదు. ఎందుకో చూద్దాం. 
శ్రమ  విలువ
పెట్టుబడికీ శ్రమకీ మారకంలో "శ్రమవిలువ దేనిచేత నిర్ణయించబడుతుంది? శ్రమచేతనే విలువ నిర్ణయించ బడుతుందనే నియమాన్ని శ్రమ అనే సరుకుకి అన్వయించినప్పుడు అర్థశాస్త్రవేత్తలు అంతర్వైరుధ్యంలో పడ్డారు. శ్రమ విలువ ఎలా నిర్ణయించబడుతుంది?  ఆ శ్రమలో వున్న అవసరశ్రమ చేత. ఒక గంట శ్రమవిలువ ఒక గంట శ్రమకు సమానం అనిమాత్రమే మనకు తెలిస్తే, దాన్నిగురించి బొత్తిగా మనకేమీ తెలియదన్నమాట. యిది మనల్ని వెంట్రుక వాసి కూడా 
గమ్యం దగ్గరకి తీసుకుపోదు; మనం ప్రదక్షిణం చేస్తూనే వుంటాం." (వేతన శ్రమ - పెట్టుబడికి ఎంగెల్స్ ప్రవేశిక
సంకలిత రచనలు-2,  పే 84-85).  
శ్రమ సృజించిన విలువనే వాళ్లు శ్రమవిలువ అనుకున్నారు. అందువల్లే, శ్రమవిలువని తేల్చే పని పెట్టుకున్నారు. అది తేలలేదు, తేలేదీ కాదు. 

ఏసరుకు విలువనైనా నిర్ణయించేది ఎలా? దానిలో ఉన్న అవసర శ్రమ చేత. అన్నివిలువలకూ కొలమానం శ్రమ. 
అయినప్పుడు శ్రమ విలువని కూడా శ్రమలోనే చెప్పాలి. దీని ప్రకారం అయితే 
1 గంట శ్రమ = 1 గంట శ్రమ అనాలి. 
ఒకగంట శ్రమ ఒక గంట శ్రమకి సమానం అని చెబితే అర్ధం ఉండదు. అది పునరుక్తి, పైగా అర్ధరహిత వ్యక్తీకరణ. 
ఎందుకంటే, వస్తువులకు విలువని ఏర్పరచేది స్వయంగా విలువని కలిగి ఉండదు.
ఎంగెల్స్ కాపిటల్ 2 ముందుమాటలో ఇలా చెబుతాడు: 
విలువ కలిగి ఉన్నది శ్రమ కాదు. విలువను సృజించే చర్యగా అది(శ్రమ) విలువని కలిగి ఉండజాలదు. గురుత్వాకర్షణ ప్రత్యేక బరువునూ, ఉష్ణం ప్రత్యేక ఉష్ణోగ్రతనీ, విద్యుత్తు ప్రత్యేక ప్రసరణ బలాన్నీఎలా  కలిగి ఉండవో అలాగే.”- కాపిటల్ 2. పే18-19 
దీన్నిబట్టి శ్రమకి విలువకట్టడం వీలుకాదు. విలువ లేనిదేదీ సరుకు కాజాలదు. కనుక శ్రమ సరుకు కాదు.
సరుకు కాని శ్రమని సరుకు అనుకున్నందువల్ల సమాన విలువల మారకం మీద అదనపు విలువని రుజువు చెయ్యడం వాళ్లకి సాధ్యపడలేదు. సోషలిస్టులు అసమాన మారకాన్ని ఆశ్రయించారు. ఇరువురూ శాస్త్ర పద్ధతిని పాటించలేదు. 
సరుకు శ్రమ కాదు, శ్రమశక్తి
సరుకు కాకపొతే శ్రమ ఏమిటి
పెట్టుబడిదారుడు శ్రమ చేయించుకోడానికి డబ్బిస్తున్నాడు. అంటే ఎదో సరుకుని కొంటున్నాడు. ఇప్పుడు శ్రమ సరుకు కాదని తేలింది. కనుక అతను కొంటున్న సరుకు శ్రమ కాదు. కాని అది కచ్చితంగా మరేదో సరుకు. మరయితే శ్రమ ఏమిటి? అతను కొనే సరుకు యొక్క ఉపయోగపు విలువ. శ్రమ అనే ఉపయోగపు విలువ కోసం ఎదో సరుకును కొంటున్నాడు. 
 పెట్టుబడిదారుడు కార్మికుని వద్ద కొంటున్న సరుకేమిటి
పరిశోధనలో ముందడుగు వేశాడు.  థామస్ హాబ్స్ తన లెవియాథాన్ పుస్తకం (1839-44) లో రాసిన మాటలు 
గమనించాడు: 
"ఒక మనిషి విలువ …. అన్ని యితర వస్తువుల విషయంలో లాగానే అతని ధర; అంటే, అతని శక్తిని 
వుపయోగించుకునేందుకు ఎంత ఇవ్వబడుతుందో అంతన్నమాట" (కాపిటల్ 1, పే. 167, ఫుట్ నోట్ 2) 
మనిషి శ్రమ ” (అంటే అతని శ్రమించేశక్తి) కూడా, మారకంఅయ్యే సరుకే ప్రతి ఇతర వస్తువులాగే.” (Theories of 
Surplus Value 1.353)  
ఆయన తర్వాతివారు ఈ ఆవిష్కరణని గమనించలేదుఅంటాడు మార్క్స్ (వేతనం,ధర, లాభం, మార్క్స్ ఎంగెల్స్ 
సంకలిత రచనలు, భాగం 2,  పే. 46). 
మార్క్స్ దాన్ని గమనించాడు. 
శ్రమ అనేది చలనంలో శ్రమశక్తి. శ్రమశక్తి అనే సరుకు ఉపయోగపు విలువ. 
రికార్డో శ్రామికుడు సరుకుగా అమ్మే..., శ్రమ సామర్ధ్యానికీ, ఈ సామర్ధ్యం యొక్క ఉపయోగం అయిన శ్రమకీ మధ్య 
వున్నా తేడాని చూడలేదు.అన్నాడు మార్క్స్ –Manuscripts of 1861-63.  
అయితే ఉపయోగపువిలువ  ఉన్నంత మాత్రాన ఏదీ సరుకు కాదు. విలువ కూడా ఉండాలి. సరుకు ఉపయోగపు విలువవిలువల సమ్మేళనం. శ్రమవిలువ నిర్ణయించబడదు. కనుక అది సరుకు కాదు అని తేలింది. 
మరి శ్రమశక్తి విలువ నిర్ణయమవుతుందా
అన్ని ఇతర సరుకులకు ఉన్నట్లే దానికీవిలువ వుంది.  అన్ని ఇతర సరుకుల విలువ నిర్ణయమైనట్లే, అంటే దాని 
ఉత్పత్తికి అవసరమైన శ్రమ కాలం చేత, నిర్ణయమవుతుంది. 
శ్రమశక్తి విలువలో చేరేవి: 
1. శ్రామికుని తిండీ, బట్టా మొదలైన జీవనాధార వస్తువుల విలువ. 
2. శ్రామికుని సాంస్కృతిక, సామాజిక అవసరాలను తీర్చే వస్తువుల విలువ. 
3. శ్రామికుని కుటుంబ సభ్యుల పోషణకు కావలసిన వస్తువుల విలువ. 
4. శ్రామికుని శిక్షణకీ, నైపుణ్య సాధనకీ అయ్యే ఖర్చు.  

 శ్రమశక్తి యొక్క విలువ శ్రమ శక్తిని సృష్టించడానికీ, అభివృద్ధి చెయ్యడానికీ, పోషించడానికీ, కొనసాగించడానికీ 
కావలసిన జీవితావసరాల విలువచేత నిర్ణయించ బడుతుంది”- ‘వేతనం, ధర, లాభం’, మార్క్స్ ఎంగెల్స్ సంకలిత 
రచనలు, భాగం 2,  పే.48 
ఆవిధంగానిర్వచించబడిన దాని విలువ ఆధారంగా జరిగే శ్రమశక్తి కొనుగోలూ, అమ్మకమూ విలువ నియమాన్ని 
వ్యతిరేకించదు.  ఎంగెల్స్ ముందుమాటకాపిటల్ 2. పే18-19 
సరుకుగా అమ్మేదీ, కొనేదీ శ్రమని కాదు, శ్రమశక్తిని  అని తేల్చాడు 
శ్రమ శక్తి అన్నా, శ్రమచేసే సామర్ధ్యం అన్నా మనిషిలో ఉన్న, ఏదయినా ఉపయోగపు విలువను ఉత్పత్తి చేసేటప్పుడు అతను వినియోగించే మానసిక శారీరక శక్తుల మొత్తం “ .....అని అర్ధం చేసుకోవాలి. అన్నాడు- cap1.167 
శ్రమశక్తి సరుకు అని ఎన్నోచోట్ల చెబుతాడు. 
వేతనశ్రమా- పెట్టుబడీ లో మార్క్స్ ఇలా అంటాడు: శ్రమశక్తి అనేది ఒక సరుకు చక్కెర ఎలాగో అలాగే.”- సంకలిత 
రచనలు 1.పేజీ94 
శ్రమశక్తి అనేది దాని సొంతదారుడైన వేతన కార్మికుడు పెట్టుబడికి అమ్మే సరుకు.సం. ర 1.పేజీ 95 
 శ్రమ కొనుగోలూ ..... ఈ పద్మవ్యూహం నుండి బయటకు దారి కనుక్కున్నవాడు కార్ల్ మార్క్స్ “- 
సరుకు శ్రమ కాదు శ్రమ శక్తి అని ఆవిష్కరించడం ద్వారా. కనుక మార్క్స్ అర్ధశాస్త్రానికి అదనపు విలువ సిద్ధాంతం 
ఆధారం. అదనపు విలువకి శ్రమశక్తి సరుకు అనేది అటువంటి ఆధారమే. కాబట్టి, శ్రమశక్తి సరుకు అనే అవగాహన 
మార్క్స్అర్ధశాస్త్రానికి ఆధారం. 
అత్యుత్తమ అర్ధశాస్త్రజ్ఞులు శ్రమ విలువ వద్ద బయలుదేరినంతకాలం ఏ యిబ్బంది మూలంగా దుఃఖ భాజనులయ్యారో 
అది మనం శ్రమశక్తి వద్ద బయలుదేరిన వెంటనే అదృశ్యమవుతుందిఎంగెల్స్ ముందుమాట వేతన శ్రమా పెట్టుబడీ’ 
సం.ర 1.పే.89 
శ్రమ శక్తి సరుకే, అయినా విశిష్టమైన సరుకు 
అన్ని ఇతర సరుకుల్లాగే శ్రమశక్తి ఒక సరుకు. కానీ విశిష్టమైన సరుకు. విలువని సృజించే సరుకు. సరిగా వాడుకుంటే తన విలువను మించిన విలువని సృజిస్తుంది.
శ్రమ శక్తి విశిష్ట స్వభావం దాని ఉపయోగపువిలువ వల్ల  ఏర్పడుతుంది.
సమాన విలువల మారకం జరుగుతూనే, అదనపువిలువ పెట్టుబడిదారుడికి వస్తుంది అనేదాన్ని రుజువు చేసే పని 
మార్క్స్ కి పడింది. పరిశోధన కొనసాగించాడు. శ్రమ సరుకు కాకపొతే, పెట్టుబడిదారుడు శ్రామికునికి డబ్బిచ్చి కొంటున్న సరుకేమిటి? కొన్న సరుకులలో ఒక సరుకు ఉపయోగపు విలువ విలువని ఉత్పత్తిచేసేది అయితేనే గాని సమస్య తీరదు.
పెట్టుబడిదారుడు మొదట  కొన్న సరుకుల విలువకి సమాన విలువగల డబ్బు చెల్లిస్తాడు. చివరలో  అతను అమ్మిన సరుకుకు సమాన విలువ గల డబ్బు తీసుకుంటాడు. అయితే ఈ తీసుకునే డబ్బు మొదట అతను పెట్టిన డబ్బు కంటే ఎక్కువ. ఈ ఎక్కువ మారకం వల్ల ఏర్పడింది కాదు. శ్రామికుని శ్రమ కలిసినందువల్ల. ఈ కలిసిన శ్రమ అతను చెల్లించిన శ్రమకన్నా ఎక్కువ. కలిసిన విలువలో శ్రమ శక్తి విలువకు తోడు అదనపు విలువ కూడా ఉంటుంది. అందువల్ల శ్రమశక్తి విలువ చెల్లించినా, చెల్లించకుండానే కొంత శ్రమ పెట్టుబడిదారుడికి చేరుతుంది. ఉన్నవిలువకే తన సరుకు అమ్ముతాడు. 
అందులో రెండు భాగాలుంటాయి: ఒకటి శ్రమశక్తి విలువ, రెండు అదనపు విలువ. వీటిలో  శ్రమ శక్తి విలువ శ్రామికునికి
అదనపు విలువ పెట్టుబడి దారునికి. 
ఆవిధంగా అదనపు విలువనీ, విలువనియమాన్ని(సమానకాల మారకాన్నీ)- సమన్వయపరిచాడు. 
ఈ ఫీట్ ని సాధ్యపరిచింది  శ్రమ శక్తి సరుకు అనే ఆవిష్కర. మార్క్స్ అదనపువిలువ సిద్దాంతానికి ఈ ఆవిష్కరణే 
ఆధార పీఠం. దీన్ని మనం పట్టుకోలేక పోతే అదనపువిలువ సిద్ధాంతం అర్ధం కానట్లే.  
*******
ఒకపెట్టుబడి దారుడు ప్రాజెక్టులు చేయించి అమ్మే కంపెనీ పెడతాడు. 50 మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని జీతానికి నియమిస్తాడు. ఆఫీస్ లో పనిచెయ్యడానికి అవసరమైన  కంప్యూటర్లూ, ప్రింటర్లూ,స్కానర్లూ  వగయిరా సాధనాలు సమకూరుస్తాడు. ఇంటర్నెట్ ఏర్పరుస్తాడు. ప్రాజెక్టులు తయారు చేయిస్తాడు. అమ్ముతాడు. తయారీ కయిన ఖర్చులు పోను మిగిలేదే అదనపువిలువ.అది ఎంతైనా పెట్టుబడి దారుడికే చెందుతుంది.
పనిచేసే వాళ్లకి వేతనం లక్షల్లో ఉండవచ్చు. అయినా వాళ్ళు వేతనానికి పనిచేసే వాళ్ళే. వాళ్ళకీ శ్రమ తీవ్రతుంటుంది. రాత్రి పని ఉంటుంది. నిరుద్యోగం ఉంటుంది. సంక్షోభాల్లో మామూలు కార్మికులకి పనులు పోయినట్లే వాళ్ళకీ పోతాయి.తక్కువ జీతాలకి పనిచేయ్యల్సివస్తుంది. 2001 లోవచ్చిన డాట్ కాం సంక్షోభంలొ ఎందఱో  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు పోయాయి. 2008 మహామాంద్యంలో అందరితో పాటు వాళ్ళ ఉద్యోగాలూ పోయాయి.
ఇంకో ఉదాహరణ: ఒకడు కోట్ల పెట్టుబడితో పెద్ద హాస్పిటల్ పెట్టవచ్చు. అవసరమైన సాధనాలు కొంటాడు. మంచి ఆపరేషన్ థియేటర్లు, సెంట్రల్ ఏ.సీ ఏర్పాటు చేస్తాడు.స్పెషలిస్టులైన డాక్టర్లతో వైద్యం, ఆపరేషన్లు చేయించవచ్చు. పేషంట్ల దగ్గర ఎంత వసూలు చేస్తారు అనే దానితో డాక్టర్లకు సంబంధం ఉండదు. వాళ్లకి వేతనం ఉంటుంది. అది లక్షల్లో ఉండవచ్చు. వాళ్ళ వేతనాలు పోను, సాధనాలవాటాపోను, ముడి పదార్ధాల వాటా పోను వచ్చేది అదనపు విలువ.అది పెట్టుబడి దారుడిదే.
కనక మార్క్స్ అదనపు విలువ సిద్ధాంతం ఇప్పటికీ సరయినదే. పెట్టుబడిదారీ విధానం కొనసాగినంతకాలమూ వర్తించేదే. 








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి