9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

అదనపు విలువ రేటూ, అదనపు విలువ మొత్తమూ


అధ్యాయం 11
అదనపు విలువ రేటూ, అదనపు విలువ మొత్తమూ

పెట్టుబడి రెండు భాగాలుగా ఉంటుంది. 1.ఉత్పత్తిసాధనాలమీద పెట్టేది. 2. శ్రమశక్తి కి వెచ్చించేది. మార్క్స్  మొదటి దానికి  స్థిరపెట్టుబడి అనీ, రెండోదానికి  అస్థిరపెట్టుబడి అనీ పేరుపెట్టాడు. రెంటిలో ఏది లేక పోయినా శ్రమప్రక్రియ సాగదు. సాగితేనే విలువా, అదనపువిలువా ఉత్పత్తవుతాయి. ‘అదనపు విలువ రేటు’ (అధ్యాయం 11)లో ఒక ఉదాహరణ ఇస్తాడు.
మొత్తం పెట్టుబడి £500. స్థిర పెట్టుబడి భాగం £410. అస్థిర పెట్టుబడి భాగం £90. శ్రమ ప్రక్రియలో ఉత్పత్తిసాధనాలకి అయిన £410 పౌన్లవిలువ  తయారయిన  సరుకుకి బదిలీ అవుతుంది. శ్రామికులకిచ్చిన 90 పౌన్ల విలువ పునరుత్పత్తి అవుతుంది. అప్పటికి పెట్టుబడిదారుడు పెట్టిన విలువ మాత్రమే వస్తుంది. అదే అయితే ఆటను ఉత్పత్తిజోలికి పోడు. అతనికి అదనపు విలువ కావాలి. మన ఉదాహరణలో అది 90 పౌన్లు.
శ్రమ ప్రక్రియ జరిగాక మొత్తం పెట్టుబడి 590 పౌన్లవుతుంది.అందులో ఈప్రక్రియలో ఉత్పత్తయింది 90+90=180 పౌన్లు మాత్రమే. స్థిర పెట్టుబడి లోని వస్తువులు –ఉత్పత్తిసాధనాలూ, శ్రమ పదార్ధాలూ, ఉపపదార్ధాలూ –ఈ ప్రక్రియలో ఉత్పత్తయినవి కావు. అంతకు ముందే జరిగిన ప్రక్రియల్లో ఉత్పత్తయినవి. అందువల్ల వాటి విలువ ఇప్పటి శ్రమ వల్ల ఏర్పదలేదన్నిది స్పష్టమే.
అదనపు విలువని ఉత్పత్తిచేసిన అస్థిర పెట్టుబడికీ, ఉత్పత్తయిన అదనపు విలువ మొత్తానికీ సంబంధం ఉంది. వీటి మధ్య- అదనపు విలువకీ, అస్థిర పట్టుబడికీ మధ్య-  నిష్పత్తే అదనపు విలువ రేటు. ఇది ఎంతో కీలకమయినది. ఎందుకంటే ఇది  దోపిడీ స్థాయి ఎంతో స్పష్టంగా ఉన్నదున్నట్లుగా  తెలుస్తుంది.
మరి అదనపు విలువకీ, మొత్తం పెట్టుబడికీ మధ్య నిష్పత్తి ముఖ్యం కాదా అంటే అది కూడా ముఖ్యమే. మార్క్స్ ఈనిష్పత్తిని మూడో సంపుటంలో చర్చిస్తానని చెప్పి(capital 1.207), అదనపువిలువ రేటు గురించి ముందుకు పోతాడు.
ఉత్పత్తి సాధనాలు (స్థిర పెట్టుబడి) శ్రమని తీసుకుంటాయి.విలువని ఉత్పత్తి చెయ్యవు. కనుక వాటి వలువ ఇక్కడ ఏమాత్రం ముఖ్యం కాదు. కనుక దాన్ని పక్కన పెట్టవచ్చు. కొత్తగా ఉత్పత్తయిన 180పౌన్ల విలువలో రెండు భాగాలున్నాయి. ఒకటి శ్రమశక్తుల విలువ (అస్థిర పెట్టుబడి) 90 పౌన్లు. రెండు అదనపు విలువ 90 పౌన్లు. అస్తిరపెట్టుబడి 90 పౌన్లు  180 పౌన్లయింది. 90 పౌన్లు పెరిగింది.
పెరిగిన  90 పౌన్లు ఉత్పత్తయిన అదనపు విలువ యొక్క  పరమ పరిమాణాన్ని (absolute quantity) వ్యక్తం చేస్తుంది. ఉత్పత్తయిన సాపేక్షవిలువ, అంటే అస్థిర పెట్టుబడి పెరిగిన శాతం అస్థిర పెట్టుబడితో అదనపు విలువకు ఉండే నిష్పత్తి నిర్ణయిస్తుంది. అది అదనపువిలువ/అస్థిర పెట్టుబడి గా వ్యక్తమవుతుంది. మన ఉదాహరణలో ఈ పెరుగుదల నిష్పత్తి 90/90. అంటే 100 శాతం. 
అస్థిర పెట్టుబడిలోవచ్చిన ఈ సాపేక్ష పెరుగుదలని  లేదా,అదనపు విలువ యొక్క సాపేక్షపరిమాణాన్ని-
నేను అదనపు విలువ రేటు అంటాను.-Capital1.207



అదనపు విలువరేటు తెలియాలంటే మొదట అదనపువిలువ మొత్తం ఎంతో తెలియాలి.

అదనపు విలువ మొత్తం లెక్కగట్టాలంటే తెలియాల్సిన అంశాలు:
1. పనిదినం పొడవు.
2. పనిదినం విభజన (అవసర శ్రమ కాలం+అదనపు శ్రమ కాలం)
3. గంటకి ఉత్పత్తయ్యే విలువ 
4. శ్రమశక్తుల విలువ (అస్థిర పెట్టుబడి)

రోజులో  ఎన్నో కొన్ని గంటలు పని జరుగుతుంది. పనిదినం పొడవు అంటే ఆ గంటల సంఖ్యే- 10 గంటలో 12 గంటలో 14 గంటలో.
పనిదినం ఎన్నిగంటలయినా అది రెండు భాగాలుగా ఉంటుంది :
1. అవసరశ్రమ కాలం. అంటే పెట్టుబడిదారుడు చెల్లించిన శ్రమశక్తి విలువని పునరుత్పత్తి చేసే కాలం
2. అదనపు శ్రమకాలం. అంటే పెట్టుబడిదారుడు చెల్లించని విలువని ఉత్పత్తి చేసే కాలం.
రెండూ కలిస్తే పనిదినం
పనిదినం = అవసరశ్రమ కాలం+ అదనపు శ్రమకాలం
మొదటిది 4 గంటలు రెండోది 6 గంటలు అయితే పనిదినం 10 గంటలు. మొదటిది 6 రెండోది 3 అయితే పనిదినం 9 గంటలు.
గంటకి ఉత్పత్తయ్యే విలువ. మొత్తం ఉత్పత్తయిన విలువని పని గంటల సంఖ్యతో భాగిస్తే గంటలో ఉత్పత్తయ్యిన విలువ వస్తుంది.
శ్రమశక్తుల విలువ. ఒక శ్రమశక్తి విలువ తెలిస్తే, దాన్ని వినియోగించిన శ్రమశక్తుల (కార్మికుల) సంఖ్యతో హెచ్చవేస్తే శ్రమశక్తుల విలువ (అస్తిరపెట్టుబడి) మొత్తం వస్తుంది.
శ్రమశక్తి విలువ- అదనపు విలువ
అవసరశ్రమ కాలంలో ఉత్పత్తయిన విలువ శ్రమశక్తి విలువ. అదనపు శ్రమ కాలంలో ఉత్పత్తయిన విలువ అదనపు విలువ. శ్రమశక్తి విలువ + అదనపు విలువ = ఉత్పత్తయిన/ శ్రమ సృజించిన విలువ. దీన్ని బట్టి
అదనపు విలువ = శ్రమ సృజించిన విలువ - శ్రమశక్తి విలువ
శ్రామికుడు అవసరశ్రమ కాలంలో తనకి చెల్లించబడిన (శ్రమశక్తి) విలువని పునరుత్పత్తి చేస్తాడు. అదనపు శ్రమకాలంలో చెల్లించబడని (అదనపు) విలువని ఉత్పత్తిచేస్తాడు. దీన్ని పెట్టుబడిదారుడు ఉచితంగా సొంతం చేసుకుంటాడు.

ఉదాహరణకి
పనిదినం పొడవు 12 గంటలు. అందులో అవసర శ్రమ కాలం 6 గంటలు, అదనపు శ్రమకాలం 6 గంటలు. గంటకి ఉత్పత్తయ్యే విలువ 50 షిల్లింగులు. శ్రమశక్తుల సంఖ్య 100. ఒక్కొక శ్రమశక్తి విలువ 3 షిల్లింగులు. మొత్తం  శ్రమ శక్తుల విలువ 100x3=300 షిల్లింగులు  ఈవివరాల ప్రకారంలెక్కచేద్దాం.
ఒక్కొక్కకార్మికుడుకి  3 షిల్లింగుల చొప్పున 100 మందికి 300 షిల్లింగులు ఇచ్చి  పనిచేయిస్తే రోజులో 600 షిల్లింగుల కొత్త విలువ ఉత్పత్తవుతుంది. పనిదినం 12 గంటలయితే, ఉత్పత్తయిన విలువ గంటకి 50 షిల్లింగులు అవుతుంది. పనిదినంలో అవసర శ్రమకాలం ఎన్ని గంటలో  తెలిస్తే అదనపు శ్రమకాలం  ఎన్ని గంటలో  తేలుతుంది. దాన్నిబట్టి అదనపు విలువమొత్తం తెలుస్తుంది. పై సందర్భంలో అవసర శ్రమకాలం 6 గంటలయితే అదనపు శ్రమకాలం 6 గంటలు. ఆ 6 గంటల్లో ఉత్పత్తయ్యే విలువ 50 x 6 = 300 షిల్లింగులు.
మొత్తం శ్రమశక్తుల విలువ (అంటే అస్థిర పెట్టుబడి) 300  షిల్లింగులు. ఆ మొత్తం 6 గంటలలో పునరుత్పత్తయింది. ఇంకా 6 గంటలు అదనపు శ్రమ జరిగింది. మరొక  300  షిల్లింగులు విలువ ఏర్పడింది. పెట్టిన 300  షిల్లింగులకు అదనంగా 300  షిల్లింగులు వచ్చాయి. ఈ వచ్చిన మొత్తమే అదనపు విలువ మొత్తం. అదనపు శ్రమకాలంలో ఉత్పత్తయిన విలువే అదనపు విలువ.మొత్తం ఉత్పత్తయిన విలువలోంచి శ్రమశక్తుల విలువని తీసివేస్తే మిగిలేదే అదనపు విలువ మొత్తం.
అదనపు విలువ మొత్తం = ఉత్పత్తయిన విలువ మొత్తం - శ్రమశక్తుల విలువ మొత్తం
ఉత్పత్తయిన విలువ 600 షిల్లింగులు. శ్రమశక్తుల విలువ 300 షిల్లింగులు. అదనపు విలువ మొత్తం = 600 – 300 = 300 షిల్లింగులు.
అదనపు విలువ రేటు
అదనపు విలువ మొత్తం ఒక అంశం. రేటు తెల్చాలంటే అది ఏ అంశం మీద ఆధారపడిందో ఆ అంశం తెలియాలి.
అ అంశం ఏది?
అది శ్రమశక్తుల విలువ, అస్థిర పెట్టుబడి. అస్థిర పెట్టుబడి అంటే: ఒక పెట్టుబడిదారుడు ఒకే కాలంలో నియోగించే శ్రమశక్తుల (శ్రామికుల)కిచ్చే విలువ మొత్తం.
శ్రమశక్తి విలువని, శ్రమ శక్తుల సంఖ్యపెట్టి హెచ్చవేస్తే అస్థిర పెట్టుబడి ఎంతో వస్తుంది. 
అస్థిర పెట్టుబడి = 1 శ్రమశక్తి విలువ × కొన్న శ్రమ శక్తుల సంఖ్య (n)
విలువని ఉత్పత్తిచేసేది శ్రమ. అదనపు విలువని ఉత్పత్తిచేసేది కూడా శ్రమే.  అదనపు విలువ మొత్తానికీ, శ్రమశక్తుల విలువ మొత్తానికీ (అంటే అస్థిర పెట్టుబడికీ) ఉండే నిష్పత్తే అదనపువిలువ రేటు.
ఇప్పుడు శ్రమశక్తుల విలువ మొత్తం ఎంతో తెలుసు. అలాగే ఉత్పత్తయిన విలువ మొత్తం ఎంతో తెలుసు.
ఇక అదనపు విలువ రేటు కట్టడం కష్టంకాదు.
అదనపు విలువ రేటు కట్టడం

అదనపువిలువ రేటు = అదనపు విలువ/ అస్థిర పెట్టుబడి
మన ఉదాహరణలో అస్థిర పెట్టుబడి 3x100= 300 షిల్లింగులు.
అదనపు విలువ రేటు. 300 షిల్లింగులకి 300 షిల్లింగుల అదనపు విలువ. అంటే 100శాతం.
అదనపు విలువ రేటు = (300/300)x100 =100   
ఒకవేళ అస్థిర పెట్టుబడి 600 షిల్లింగులు, అదనపు విలువ 300 షిల్లింగులు అయితే:
అదనపు విలువ రేటు = (300/600) x 100 = 50  
ఇందుకు భిన్నంగా అస్థిర పెట్టుబడి 300 షిల్లింగులు, అదనపు విలువ 600 షిల్లింగులు అయితే:

అదనపు విలువ రేటు = (600/300) x 100 =200   
అదనపు మొత్తం ఎలాతెల్చాలో, రేటు ఎలా కట్టాలో చూచాం. ఇవి ఏ ఏ అంశాలు లెక్కలోకి వస్తాయో తెలుసు కున్నాం.

ఒక అంశం తగ్గినా, మరొక అంశం పెరిగి  సరిపోవచ్చు
అదనపు విలువ మొత్తానికి సంబంధించిన అంశాల్లో ఒక అంశం పరిమాణం తగ్గితే, మరొక అంశం పరిమాణం పెరిగి సరికావచ్చు. అస్థిర పెట్టుబడి తగ్గినా, అదేనిష్పత్తిలో అదనపు విలువ పెరిగితే అదనపు విలువ రేటు మారకుండా అలానే ఉంటుంది.
మనం ఇంతకుముందు ఊహించిన విధంగా 100 మంది పనివాళ్ళకి 300 షిల్లింగులనే అనుకుందాం.కాని అదనపు విలువ రేటు 50 శాతానికి తగ్గితే,ఈ 300 షిల్లింగుల అస్థిర పెట్టుబడి 150 షిల్లింగుల అదనపు విలువని ఇస్తుంది. అలాకాకుండా, అదనపు విలువ రేటు రెండు రెట్లయితే, అంటే పనిదినం 6 నించి 9 గంటలకి పెరిగే బదులు, 6 నించి 12 కి పెరిగితే, అదే సమయంలో అస్థిర పెట్టుబడి సగానికి అంటే 150 షిల్లింగులకు తగ్గినా, అప్పుడు కూడా 150 షిల్లింగుల అదనపు విలువే వస్తుంది.
అస్థిర పెట్టుబడిలో తగ్గుదల అదే నిష్పత్తిలో శ్రమశక్తి దోపిడీ స్థాయి పెరిగితే సరి అవుతుంది; లేదా అదే నిష్పత్తిలో పనిదినాన్ని పొడిగించి, పనివాళ్ళ సంఖ్యని తగ్గించడం ద్వారా సరి అవుతుంది.

శ్రామికుల సంఖ్యతగ్గుదల వల్లా, అస్తిరపెట్టుబడి తగ్గుదలవల్లా అదనపు విలువ మొత్తం తగ్గుతుంది. ఈ లోటుని  పనిదినాన్ని పొడిగించడం ద్వారానో, అదనపు విలువ రేటు పెంచడం ద్వారానో భర్తీ చెయ్యవచ్చు. ఎంతయినా పూడ్చవచ్చా? అంటే కుదరదు.
దీనికి హద్దులున్నాయి. అవి అధిగామించరానివి.
పనిదినాన్ని 24 గంటలకన్నా పొడిగించడం సాధ్యమవదు కదా! అతను రోజులో ఏర్పరచే విలువ 24 గంటల లోపు ఉత్పత్తి చేసే విలువే. ఉదాహరణలో  500 మంది పనివాళ్ళకి పెట్టిన అస్థిర పెట్టుబడి 1500 షిల్లింగులు. పనిదినం 12 గంటలు. అందులో అవసర శ్రమకాలం 6 గంటలు. కనుక అదనపు విలువ రేటు 100 శాతం. దీని ప్రకారం రోజుకి 1500 షిల్లింగుల అదనపు విలువ వస్తుంది. 500 పని గంటలు.
300 షిల్లింగుల పెట్టుబడి 100 మంది శ్రామికులని పెట్టుకుంటుంది. అదనపు విలువ రేటు 200%. రోజు పనిగంటలు 18. (అంటే అవసర శ్రమ కాలం 6 గంటలు + అదనపు శ్రమకాలం 12). అదనపువిలువమొత్తం 600 షిల్లింగులు. లేక 12 × 100 పనిగంటలు; దాని ఉత్పాదితం విలువ – పెట్టిన అస్థిర పెట్టుబడి విలువ + అదనపు విలువ  - రాత్రీ పగలూ కలిపినా 1200 షిల్లింగులు ఎన్నడూ మించదు. 24x100 పనిగంటలు దాటదు. కార్మికుల సంఖ్యలో తగ్గుదలని దోపిడీ స్థాయిని పెంచడం ద్వారా భర్తీ చేయడానికి పరమ పరిమితి పెడుతుంది. శ్రామికుల సంఖ్య తగ్గినా, అదనపువిలువ రేటు పెంచడం ఈ పరిమితుల లోపలే సాధ్యమవుతుంది. పరిమితులు దాటితే సాధ్యం కాదు. ఈ విషయం తేలిగ్గా తెలిసేదే.
ఇక పెట్టుబడి దారుల ధోరణులు
1. వీలైనంత తక్కువమంది పనివాళ్ళని పెట్టాలి,
2.వీలైనంత ఎక్కువ అదనపు విలువ లాగాలి.
ఇవిరెండూ పరస్పరవిరుద్ధమైనవి.
ఎందుకంటే
అదనపువిలువ = శ్రమశక్తి విలువ x కార్మికుల సంఖ్య
అయినప్పుడు
ఎక్కువ అదనపువిలువ లాగాలంటే , ఎక్కువమందిని పెట్టాలి. అయితే అతనికి తక్కువ మందిని పెట్టుకోవాలని ఉంటుంది. ఈ రెండు పోకడలూ ఒకదానితో ఒకటి పొసగనివి అనేది స్పష్టమే.

మరొకపక్క, నియోగించిన శ్రమశక్తి మొత్తం, అంటే అస్థిర పెట్టుబడి పెరిగినా, ఆపెరుగుదల అదనపు విలువ రేటు తగ్గే నిష్పత్తిలో లేకపోతే, ఉత్పత్తయ్యే అదనపు విలువ మొత్తం తగ్గుతుంది.
ఉదాహరణకి, అస్థిర పెట్టుబడి 3x100=300. అదనపు విలువ రేటు 100 అయితే అదనపు విలువ మొత్తం= 300.
అస్థిర పెట్టుబడి సగానికి(150) తగ్గి, అదనపు విలువ రేటు రెట్టింపు (200%) అయితే, అంతే అదనపు విలువ (300) వస్తుంది. 
అస్థిర పెట్టుబడి సగానికి(150) తగ్గి, అదనపు విలువ రేటు 150% కి మాత్రమే పెరిగితే అదనపువిలువ మొత్తం 225 షిల్లింగులకి పడిపోతుంది.

అదనపువిలువ మొత్తం ఉత్పత్తిని  రెండు అంశాలు నిర్ణయిస్తాయి:
1. అదనపువిలువ రేటు
2.పెట్టిన అస్థిర పెట్టుబడి.
ఇలా నిర్ణయించబడడం నించీ మూడో సూత్రం వస్తుంది.
అస్థిరపెట్టుబడి ఎంత పెరిగితే అంత ఎక్కువ విలువా, అదనపువిలువా వస్తాయి. అవి పెట్టుబడిదారుడు పెట్టుకునే పనివాళ్ళ సంఖ్యని బట్టి ఉంటాయి. ఈ సంఖ్య అతను పెట్టే అస్థిర పెట్టుబడి మీద ఆధారపడి ఉంటుంది. 300 షిల్లింగుల అస్థిర పెట్టుబడి 100 మందికి వస్తుంది. 200మందిని పెట్టాలంటే 600 షిల్లింగులు కావాలి. ఉత్పత్తయ్యే అదనపువిలువ మొత్తాలు పెట్టిన అస్తిరపెట్టుబడి మొత్తాలకు అనుగుణంగా మారతాయి. అవి పెరిగితే ఇవి పెరుగుతాయి, తగ్గితే తగ్గుతాయి.
పెట్టుబడి రెండు భాగాలు
ఇప్పుడు మనకి ఒక విషయం తెలుసు. పెట్టుబడి దారుడు తన పెట్టుబడిని రెండు భాగాలు చేస్తాడు. ఒక దాన్ని ఉత్పత్తి సాధనాలకి వెచ్చిస్తాడు. ఇది స్థిర పెట్టుబడి భాగం. రెండో భాగాన్ని సజీవ శ్రమ మీద పెడతాడు. ఇది అస్థిర పెట్టుబడి భాగం. ఈ విభజన వేర్వేరు ఉత్పత్తి శాఖల్లో వేర్వేరుగా ఉంటుంది. ఒకే శాఖలో కూడా భిన్నంగా ఉంటుంది – సాంకేతిక పరిస్థితుల్లో తేడాలవల్లా, ఉత్పత్తి ప్రక్రియల సామాజిక కలయికల్లో మార్పుల వల్లా.
అయితే పెట్టుబడి విభజన నిష్పత్తి  -1:2, 1:10 1:x -ఏదైనా సరే, ఈ సూత్రం మీద దాని ప్రభావం ఏమాత్రం వుండదు. ఎందుకో  చెబుతాడు. ఎందుకంటే, స్థిర పెట్టుబడి విలువ ఉత్పాదితం విలువలో పునర్దర్శన మిస్తుంది, అంతే. కాని కొత్తగా ఏర్పడ్డ విలువలో చేరదు.
1,000 మంది వడికే వాళ్ళని నియమించడానికి, 100మందిని నియమించడానికి కావలసిన ముడిపదార్ధం, కదుళ్ళ కంటే ఎక్కువగా కావాలి. ఏమయినా, ఈ అదనపు ఉత్పత్తిసాధనాల విలువ పెరగావచ్చు, తగ్గావచ్చు, అలాగే ఉండావచ్చు. ఆ ఉత్పత్తి సాధనాల్ని చలనంలో పెట్టే, శ్రమశక్తుల ద్వారా ఏర్పడే అదనపు విలువని ఉత్పత్తిచేసే ప్రక్రియలో దాని ప్రభావం ఏమీ వుండదు.
అందువల్ల పైన వివరించిన సూత్రం ఈ రూపాన్ని తీసుకుంటుంది:
శ్రమశక్తి విలువా , దోపిడీ స్థాయీ మారకుండా ఉంటే అదనపు విలువ మొత్తాలు ఆయా అస్థిర భాగాలకు  అనుగుణంగా ఉంటాయి.


ప్రతి డబ్బు మొత్తం పెట్టుబడిలోకి మార్చబడజాలదు
ఇంతదాకా అదనపు విలువ ఉత్పత్తిని గురించి గమనించిన దాన్ని బట్టి, ప్రతి డబ్బు మొత్తం ఇష్టానుసారం పెట్టుబడిలోకి మార్చబడదని తెలుస్తుంది. డబ్బు పెట్టుబడిగా పరివర్తన చెందాలంటే, డబ్బుగానీ, సరుకులుగానీ ఉన్న వ్యక్తి చేతిలో కొంత కనీస మొత్తం డబ్బు ఉండాలి. అస్థిర పెట్టుబడి కనీస పరిమితి : అదనపు విలువ ఉత్పత్తికోసం  ఏడాదిపాటు రేబవళ్ళూ ఒక శ్రమ శక్తిని  నియమించడానికి కావలసిన శ్రమ శక్తి ధర. ఒకవేళ ఈ శ్రామికుడికి సొంత ఉత్పత్తి సాధనాలు ఉండి, ఒక శ్రామికుని లాగానే బతకితే చాలు అనుకుంటే, అతని జీవితావసర వస్తువుల పునరుత్పత్తికి పట్టే కాలాన్ని మించి పనిచెయ్యక్కరలేదు. అందుకు రోజులో 8 గంటలు పడితే, ఆ 8 గంటలు పనిచేస్తే సరిపోతుంది. అంటే కాదు. ఆ 8 గంటల పనికీ  కావలసిన ఉత్పత్తిసాధనాలు ఉంటే  చాలు.
మరొకవైపు, 8 గంటలకు తోడు, 4 గంటలు అదనపుపనిచేయించే పెట్టుబడిదారుడికి అదనంగా ఉత్పత్తి సాధనాలు కావాలి. వాటికి మరింత డబ్బు కావాలి. పైన అనుకున్న ప్రకారం అయితే, పెట్టుబడిదారుడు అదనపు విలువతో శ్రామికుని స్థాయిలో బతకడానికి ఇద్దరు పనివాళ్ళని పెట్టుకోవాలి. ఎందుకంటే కార్మికుడు బతకడానికి 8 గంటల పని అవసరం. పెట్టుబడి దారుడు అతని లాగే బతకడానికి 8 గంటల పని అవసరం. ఒక పనివాదు ఇచ్వ్చే అదనపు శ్రమ 4 గంటలు. కనుక అదనపు విలువతో బతకాలంటే అతని ఇద్దరిని పెట్టుకోవాలి. ఈ సందర్భంలో అతని లక్ష్యం తన పోషణ మాత్రమే, సంపదపెంచుకోవడం కాదు; అయితే పెట్టుబడిదారీ ఉత్పత్తి లక్ష్యం  సంపద పెంపే. అతను శ్రామికునికన్న రెండింతలు మెరుగ్గా బతకుతూ, వచ్చే అడనపువిలువలో సగం పెట్టుబడిలోకి చేర్చాలంటే, శ్రామికుల సంఖ్యతో పాటు కనీస పెట్టుబడిని 8 రెట్లు చెయ్యాల్సి ఉంటుంది.
తన పనివాడిలాగే, అతనుకూడా ఉత్పత్తిప్రక్రియలో నేరుగా పాల్గొనవచ్చు. అయితే అప్పుడతను పెట్టుబడిదారుడికీ కార్మికుడికీ మధ్య హైబ్రిడ్- అంటే చిన్న యజమాని- అవుతాడు. అతను తన పూర్తి సమయాన్నిపెట్టుబడి దారుడుగా ఖర్చు పెట్టాల్సిన దశ ఒకటి వస్తుంది.అప్పుడిక తన కార్మికుడిలాగా ఉత్పత్తిలో ఉండడు. కార్మికుల శ్రమని అడుపుచేసి ఉత్పాదితాన్ని సొంతం చేసుకోడానికీ, వాళ్ళ శ్రమని అదుపు పెట్టుకోడానికీ, ఉత్పాదితాల్ని అమ్ముకోడానికీ తన పూర్తి సమయాన్నికేటాయించాల్సి వస్తుంది.
అందువల్ల మధ్య యుగాల గిల్డులు (వృత్తిసంఘాలు) ఒక యజమాని తక్కువమంది శ్రామికులని మాత్రమే నియమించుకోగలిగేట్లు నియమం పెట్టాయి. తద్వారా  వృత్తియజమాని పెట్టుబదారుడిగా మారడాన్ని బలవంతంగా నిరోధించాయి. మధ్యయుగాల్లో పెట్టిన గరిష్టమొత్తం కంటే  చాలా ఎక్కువ పెట్టగలిగిన సందర్భాలలోనే, డబ్బున్నవాడు పెట్టుబడిదారుడిగా అవగలడు. ఇతను అడ్వాన్స్ చేసే కనిష్ట మొత్తం వృత్తియజమాని పెట్టే గరిష్టమొత్తం కంటే ఎంతో ఎక్కువ వుంటుంది. కేవలం పరిమాణాత్మక తేడాలు ఒకస్థాయి (point) దాటితే గుణాత్మక మార్పులు అవుతాయని హెగెల్ చెప్పిన నియమం ఇక్కడ రుజువైంది. –అంటాడు మార్క్స్.

పెట్టుబడి దారుడి దగ్గర ఉండాల్సిన కనీస విలువ
ఒక డబ్బు యజమాని పెట్టుబడిదారుగా పరివర్తన చెందడానికి, అతని దగ్గర ఉండాల్సిన కనీస విలువ పెట్టుబడిదారీ ఉత్పత్తి అభివృద్ధి యొక్క భిన్న దశలనుబట్టీ, వేర్వేరు ఉత్పత్తి రంగాలనుబట్టీ మారుతుంది. నిర్దిష్ట దశల్లో భిన్న ఉత్పత్తి రంగాలలో వాటివాటి ప్రత్యేక, సాంకేతిక పరిస్థితులకు తగినట్లుగా ‘కనీస విలువ’ వుంటుంది. కొన్నిఉత్పత్తి రంగాలకు  మొదట్లోనే ఒకే వ్యక్తి  దగ్గర అప్పటికి ఉండదు. అయినా ఒకరి వద్ద లేనంత అవసరం అవుతుంది.
ఇందుమూలంగా, ఒకమేరకు ప్రైవేట్ వ్యక్తులకు రాజ్యం సబ్సిడీలు తలెత్తాయి – ఫ్రాన్స్ లో క్లోబర్ కాలంలో లాగా , అనేక జర్మన్ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా సాగుతున్నట్లు; కొంత వరకూ కొన్ని పారిశ్రామిక వాణిజ్య  శాఖల్లో  చట్టబద్ధ గుత్తాధిపత్యంతో  కొన్ని సొసైటీలు ఏర్పడ్డాయి. ఇవి ఆధునిక జాయింట్ స్టాక్ కంపెనీలకు పూర్వ రూపాలు. ఈ రకం సంస్థల్ని కంపెనీ మొనోపోలియా అన్నాడు మార్టిన్ లూథర్.
పెట్టుబడి ఒక బలవంతపు సంబంధం
ఇప్పటిదాకా తెలుసుకున్న దాన్నిబట్టి, ఉత్పత్తి ప్రక్రియలో పెట్టుబడి శ్రమ మీద ఆధిపత్యం పొందింది. అంటే శ్రమశక్తి నిర్వహణమీద, లేదా స్వయంగా శ్రామికుని మీద ఆధిపత్యం సాధించింది. రూపుగొన్న పెట్టుబడి అయిన పెట్టుబడిదారుడు కార్మికుడు క్రమబద్ధంగా శ్రమ చేసేట్లు శ్రద్ధ పెడతాడు. తగినంత తీవ్రతతో పనిచేసేట్లు జాగ్రత్త వహిస్తాడు.     
పెట్టుబడి బలవంతపు సంబంధంగా అభివృద్ధి అయింది. ఆ సంబంధం కార్మిక వర్గాన్ని తన కొద్దిపాటి జీవితావసరాలకోసం చేసే పనిని మించి పని చేసేట్లు ఒత్తిడి పెడుతుంది. ఇతరుల చర్య యొక్క ఉత్పత్తిదారుగా, అదనపు విలువని తోడేదిగా, శ్రమశక్తిని దోచేదిగా ఆ సంబంధం ప్రత్యక్ష, నిర్బంధ శ్రమమీద ఆధారపడింది.   ఇది శక్తిలోనూ, హద్దులు మీరడంలోనూ, దేన్నీ లక్ష్యపెట్టక పోవడంలోనూ, నిర్దయలోనూ అంతకుముందు నిర్బంధశ్రమ మీద ఆధారపడిన గత వ్యవస్థలన్నిటినీ అధిగమించింది.
మొదట, చరిత్రలో అప్పటివరకూ శ్రమ కొనసాగించబడిన సాంకేతిక పరిస్తితులని బట్టి పెట్టుబడి శ్రమని లోబరుచుకుంటుంది. అందువల్ల అది ఉత్పత్తివిధానాన్నివెంటనే మార్చదు. ఇంతదాకా మనం పరిశీలించిన రూపంలో,  పనిదినాన్ని పొడిగించడం ద్వారా అదనపువిలువ ఉత్పత్తి,  ఉత్పత్తి విధానంలో మార్పులేకుండానే స్వతంత్రమైనదని రుజువయింది. అది ఆధునిక దూది ఫాక్టరీలలో కంటే  పాత తరహా బేకరీలలో తక్కువ సమర్దవంతమైనది కాదు.
సాదా శ్రమ ప్రక్రియ దృష్ట్యా చూస్తే
ఉత్పత్తి ప్రక్రియని  సాదా శ్రమ ప్రక్రియ అనుకొని /దృష్టితో చూస్తే, అప్పుడు శ్రమ సాధనాలతోనూ, శ్రమ పదార్దాలతోనూ శ్రామికుని సంబంధం పెట్టుబడితో సంబంధంగా ఉండదు; కేవలం తనసొంత ప్రయోజనకర  ఉత్పత్తి చర్య యొక్క సాధనాల తోనూ, పదార్దాల తోనూ  సంబంధంగా ఉంటుంది. ఉదాహరణకి తోళ్ళు బాగుచెయ్యడంలో తోళ్ళని కేవలం తన శ్రమ పదార్ధంగా చూస్తాడు. అతను బాగుచేసే తోలు పెట్టుబడిదారుడిది కాదు. తనదే. అలాగే శ్రమఫలమూ  అతనిదే
సొంత ఉత్పత్తి సాధనాలతో సొంత శ్రమతో జరిగే సరుకు ఉత్పత్తి అది.  ఉత్పత్తి సాధనాలు అతనివే, శ్రమఫలం అతనిదే. ఈ ఉత్పత్తిలో దోపిడీ అనేది ఉండదు.
అదనపు విలువని ఉత్పత్తిచేసే ప్రక్రియగా  చూస్తే
అయితే ఉత్పత్తి ప్రక్రియని అదనపు విలువని ఉత్పత్తిచేసే ప్రక్రియగా  చూస్తే, భిన్నంగా ఉంటుంది. ఉత్పత్తిసాధనాలు ఇతరుల శ్రమను పీల్చే సాధనాలుగా మారిపోతాయి. ఇక ఉత్పత్తి సాధనాలని వినియోగించేది కార్మికుడు కాదు, ఆఉత్పత్తిసాధనాలే శ్రామికుణ్ణి వినియోగిస్తాయి. తన ఉత్పత్తి చర్యలో పాదార్ధిక అంశాలుగా అతని చేత వాడబడే బదులు, వాటి సొంత జీవిత ప్రక్రియకు అవసరమైన ప్రేరకం (ferment)గా వాడుకోబడతాడు. పెట్టుబడి యొక్క జీవిత ప్రక్రియ అంటే దానికది నిరంతరం వృద్ధిచేందే విలువగా చలనంలో ఉండడమే. రాత్రుళ్ళు సజీవ శ్రమని పీల్చకుండా ఉండే కొలుములూ, పనిస్థలాలూ  పెట్టుబడి దారుడి దృష్టిలో- కేవలం నష్టం మాత్రమే. అందువల్లనే, కొలుములూ, పనిస్థలాలూ కార్మికుల రాత్రి శ్రమ కోసం చట్టబద్ధమైన హక్కులు కోరతాయి. డబ్బు ఉత్పత్తికి అవసరమైన  పాదార్ధిక అంశాల లోకి- ఉత్పత్తి సాధనాలలోకి – మారడం అనేది  ఆసాధనాల్నిఇతరుల శ్రమమీదా, అదనపు శ్రమమీదా హక్కులోకి (a title and a right) మారుస్తుంది.
ఆహక్కువల్ల పెట్టిన విలువకి  అదనపు విలువ కలుస్తూ ఉంటుంది. అంతకంతకూవిలువ  పెరుగుతూ ఉంటుంది. అలా  విస్తరించగల విలువే పెట్టుబడి. అడనపువిలువ ఎంత స్థాయిలో కలుస్తుంటే పెట్టుబడి అంతగా వృద్ధి అవుతుంది.
అదనపు విలువరేటు ఇంకా ఇంకా పెరగాలి
విలువ పెరిగే రేటు ఏస్థాయికి పెరిగినా  అది పెట్టుబడికి చాలదు. పెట్టుబడి దారుడిని తృప్తి పరచ లేదు. రేటు ఇంకాపెరగాలి. దానికి పరిమితంటూ ఎప్పటికీ లేదు.ఉండదు.
పనిదినాన్ని ఒక పరిమితిదాటి పొడిగించడం కుదరదు. పైగా తగ్గించమని శ్రామికవర్గం పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. ఫలితంగా తగ్గిస్తూ చట్టాలు వచ్చాయి. అందువల్ల పనిదినాన్ని పొడిగించడం ద్వారా- అంటే పనిగంటలు పెంచడం ద్వారా – అదనపు విలువని పెంచడం వీలుకాదు.
శ్రామికులని పెంచితే అదనపు విలువ పెరుగేది నిజమే. కాని పెట్టుబడిదారులు శ్రామికులని తగ్గించి, అదనపువిలువ పెంచుకోవాలనుకుంటారు. అనుకోవడమే కాదు సాధిస్తున్నారు కూడా. అంటే పై నియమానికి అనుభవం విరుద్ధంగా ఉంది.
ఈ వైరుధ్యానికి పరిష్కారం

అదనపు విలువ కోసం పెట్టుబడికి తోడేలు ఆకలి. కనుక అది పెరిగితీరాలి. పెరుగుతూనే ఉండాలి.
మామూలు పనిదినాన్ని చట్టం నిర్ణయించాక, పెంచడం సాధ్యం కాదు. శ్రమ తీవ్రత పెంచితే శ్రమ కాలాన్ని పెంచిన ఫలితమే వస్తుంది. శ్రమకాలన్ని వాడుకోవడం గురించీ, శ్రమని తీవ్రతరం చెయ్యడం గురించీ ఇప్పటికీ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అయినా లాభాలు పెరుగుతూనే ఉన్నాయి.

వాస్తవాన్ని బట్టి, శ్రామికుల సంఖ్యా, పనిదినం పొడవూ స్థిరంగా ఉన్నప్పటికీ అదనపు విలువ పెరిగే మార్గం ఉండి ఉండాలి. ఏదో కొత్త అంశం దీన్ని సాధ్యం చేస్తుందన్నమాట. ఆ అంశాన్ని ఇంతదాకా ఈమూడో భాగం ముగిసేదాకా మార్క్స్ పరిశీలించలేదు. అందుకే అంటాడు
దీన్ని బట్టి ఇప్పటిదాకా పనిదినం పొడవు స్థిరంగా వుంటే, శ్రామికుల సంఖ్య పెంచడం ద్వారా మాత్రమే అదనపు విలువమొత్తం పెరగగలదు – అనే సూత్రం ఇప్పటిదాకా పరిశీలించిన అదనపు విలువ రూపానికి మాత్రమే వర్తిస్తుంది. ఆ అంశాలు రెండూ స్థిరంగా ఉన్నా, అదనపు విలువ పెరగగలదు అని వచ్చే భాగంలో  తెలుస్తుంది. ఇప్పటికి
మూడో భాగం ముగిసింది.

అదనపు విలువ యొక్క ఆ రెండో రూపం అయిన సాపేక్ష అదనపు విలువ గురించి 4 వ భాగంలో ఉంటుంది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి