7, ఫిబ్రవరి 2017, మంగళవారం

1.సరుకు యొక్క రెండు అంశాలు: ఉపయోగపు విలువా, విలువా

సరుకు యొక్క రెండు అంశాలు: ఉపయోగపు విలువా, మారకం విలువా

కార్ల్ మార్క్స్  ‘పెట్టుబడి’
రాజకీయ అర్ధశాస్త్ర విమర్శ
(A Critique of Political Economy)
మొదటి సంపుటం (వాల్యూం)
పెట్టుబడి ఉత్పత్తి ప్రక్రియ
భాగం (పార్ట్) 1- సరుకులూ - డబ్బూ
ఇందులో మొదటి అధ్యాయం (చాప్టర్)- 'సరుకులు '
రెండోది 'మారకం '. మూడోది 'డబ్బు, లేక సరుకుల చలామణీ '
*********
మొదటి అధ్యాయం (చాప్టర్)1- సరుకులు
ఈ 'సరుకులు ' అధ్యాయం లో 4 విభాగాలు (సెక్షన్లు) ఉన్నాయి. వాటి శీర్షికలు
1.సరుకు యొక్క రెండు అంశాలు: ఉపయోగపు విలువా, విలువా
(విలువ సారమూ, విలువ పరిమాణమూ)
2.సరుకులలో రూపొందిన శ్రమ యొక్క ద్వంద్వ స్వభావం
3.విలువ రూపం లేక మారకం విలువ
4.సరుకుల ఆరాధనా, దాని రహస్యమూ   
***********
విభాగం (సెక్షన్) 1- సరుకు యొక్క రెండు అంశాలు :
ఉపయోగపు విలువా - విలువా
(విలువ సారమూ- విలువ పరిమాణమూ)
సరుకుకున్న రెండు పార్శ్వాలు : ఒకటి ఉపయోగపు విలువ. రెండు మారకం విలువ. ఈవిభాగంలో ఈరెంటి గురించీ ఉంటుంది. విలువ సారమేదో తెలుస్తుంది. అలాగే విలువ పరిమాణం గురించీ తెలుస్తుంది
అసలు సరుకు అంటే ఏమిటి? ఇది అందరికీ తెలిసిందే.
కొన్ని వస్తువుల ప్రయోజనాల గురించి మనిషికి మొదటినించీ తెలుసు. ఏవీ తినకపోతే, నీరు తాగకపోతే మానవజాతి కొనసాగేది కాదు. మనిషి క్రమంగా ఎన్నో వస్తువుల ప్రయోజనాల్ని తెలుసుకున్నాడు.
తనది ఇతరులకిచ్చి, ఇతరులది తాను తీసుకోవడం మొదలు పెట్టాడు.అదే మారకం. మారకాలు జరుగుతున్నాక తాను చేసిన వస్తువుని తానే ఉపయోగించుకోవచ్చు; ఇతరులకిచ్చి మరొకరకం వస్తువుని పొందనూవచ్చు. ఈరెండు వుపయోగాలూ ఉన్నాయిని తెలియడం తేలికే. అరిస్టాటిల్ చెప్పాడు: "మనకున్న వస్తువులవల్ల రెండు ఉపయోగాలు ఉంటాయి... ఒకటి సరైనది, రెండోది సరికానిది లేక ద్వితీయ ప్రాధాన్యం గలది. ఉదాహరణకి చెప్పులు తొడుక్కొవడానికి పనికొస్తాయి, అలాగే మారకానికీ పనికొస్తాయి; రెండూ చెప్పుల ఉపయోగాలే.అవి కావాలనుకునే వాడికి అన్నానికో, డబ్బుకో మార్చుకునే వాడు నిజానికి చెప్పుల్ని చెప్పులుగానే వాడతాడు. అయితే అది వాటి సరియైన, ప్రధానమైన ప్రయోజనం కాదు. ఎందుకంటే, చెప్పులు వస్తుమార్పిడి కోసం తయారయినవి కాదు.మనవైన అన్ని (పొసెషన్స్)వస్తువులకీ ఇదే వర్తిస్తుంది..." -క్రిటిక్.27.ఫుట్ నోట్1  (A Contribution to the Critique of Political Economy, Progress Publishers, 1984 print)
స్మిత్ మొదటిదాన్ని ఉపయోగంలో విలువ అనీ, రెండోదాన్ని మారకంలో విలువ అనీ అన్నాడు. అయితే స్మిత్ రెండోది సరికానిదని అనలేదు.
మనం ఎన్నో వస్తువులు వాడతాం. తినడానికి తిండీ, కట్టుకోడానికి బట్టలూ కావాలి. ఉండటానికి ఇల్లు కావాలి. అన్నం కూరలూ వండుకుంటాం. వీటిని ఇంట్లో మనమే చేసుకుంటాం. కొనం. అమ్మం. అవి సరుకులు కావు. కాని వీటి తయారీకి కావలసిన వస్తువుల్ని- బియ్యం,కూరగాయలు,ఉప్పు, పప్పు వగయిరా ఎన్నిటినో –కొనుక్కుంటాం. అవి సరుకులే. వంటసామాగ్రినీ కొంటాం. అవన్నీ సరుకులే.  మార్కెట్లో కొనేవన్నీ సరుకులు, అమ్మేవన్నీ సరుకులు. మంచాలూ కుర్చీలూ టి.వీ లూ, సెల్ ఫోన్లు మార్కెట్ నించి తెచ్చుకుంటాం. అవన్నీ సరుకులే. అమ్మకానికి పెట్టిన వస్తువులేవైనా సరుకులే. సరుకుకి ఉపయోగపువిలువ ఉంటుంది,కనకనే కొంటారు.సరుకుకి మారకం విలువ వుంటుంది.అందుకోసమే సరుకుని అమ్ముతారు. సరుకులో ఉపయోగపువిలువా, మారకం విలువా పెనవేసుకొని ఉంటాయి.కొనేవాడు ఉపయోగపు విలువకోసం కొంటాడు. అమ్మేవాడు మారకం విలువకోసం అమ్ముతాడు. అంటే సరుక్కి ఊపయోగపువిలువా, మారకం విలువా రెండూ రెండు పార్శ్వాలు. సరుకు ద్వంద్వ స్వభావం కలది అంటే అర్ధం ఇదే.
మరి, సరుకులు ఆదినించీ ఉన్నాయా? అంటే, లేవు.  మానవ చరిత్రలో ఒకానొక దశలో ఏర్పడ్డాయి. సమాజంలో ఇప్పటికి మూడు ఆర్ధికవిధానాలు ముగిశాయి. అవి ఆదిమ, బానిస, భూస్వామ్య వ్యవస్థలు. తర్వాత పెట్టుబడిదారీవిధానం ఆవిర్భవించి అభివృద్ధి చెందుతున్నది. మొదటి మూడు సమాజాల్లో ఉత్పత్తి జరిగింది వాడకం కోసం, మారకం కోసంకాదు. దానర్ధం మారకాలు అసలే జరగలేదని కాదు. కాని ఉత్పత్తి వుద్దేశం మారకం కాదు .వాడకం. మిగులు  వుత్పత్తులే మారకం అయ్యేవి.
ఆదిమసమాజంలో అయితే మారకాలు లేవు.అది అంతరించే దశలో మారకాలు మొదలయ్యాయి.
ఆదిమ సమాజంలో ఒక తెగంతా ఒకే కుటుంబంగా ఉండేది. అందరూ కలిసి వేటాడే వాళ్ళు, దుంపలూ కాయలూ సేకరించేవారు. అందరూ తినేవారు. ఏవస్తువూ ఎవ్వరి సొంతమూ కాదు. అన్నీ అందరివీ. అమ్మడాలూ, కొనడాలూ తెలియదు. అందరూ చేసిన వస్తువుల్ని అందరూ వాడుకున్న సమాజమే ఆదిమ సమాజం.సరుకులు లేని సమాజం అది.
అలా చాలా కాలం సరుకులు తెలియకుండానే సమాజం సాగింది. క్రమంగా పశుపోషణా, వ్యవసాయమూ అభివృద్ధయ్యాయి. కొంతకాలానికి కొన్నితెగలు వ్యవసాయాన్ని ప్రధానంగా చేసుకుంటే, మరికొన్ని పశుపోషణను ఎంచుకున్నాయి. శ్రమ విభజన జరిగింది. దాంతో వ్యావసాయిక తెగలకు వ్యవసాయోత్పత్తులు మిగులుగా ఉండేవి. కాని పశుసంబంధమైన వస్తువులు తక్కువ అయ్యేవి. అలాగే  పశుపోషక తెగలకు పశు ఉత్పత్తులు మిగులుగా వున్నా, వ్యవసాయోత్పత్తులు తక్కువ అయ్యేవి . ఆపరిస్థితుల్లో ఆ తెగల వస్తువులు వారివి వీరూ, వీరివి వారూ ఇచ్చి పుచ్చుకునేవారు. అంటే ఆయా వస్తువులు మారకం అయ్యేవి. అలా వ్యవసాయ శ్రమ, పశుపోషణ శ్రమల విభజన వల్ల వారి ఉత్పత్తుల్లో మిగులు వస్తువులు సరుకులయ్యాయి. ఒకరి వస్తువులు మరొకరికి మారకం అయ్యాయి. కాలక్రమంలో చేతివృత్తులు విడివడ్డాయి.వీటిలో అధికభాగం మారకమయ్యేవి. మారకం అభివృద్ధి చెందింది. మారకంకోసం తయారయ్యే వస్తువుల రకాలూ, సంఖ్యా పెరిగుతూ వచ్చాయి. శ్రమవిభజనవల్ల మారకమూ, మారకంవల్ల శ్రమవిభజనా అభివృద్ధయ్యాయి. మారకాలు బాగా పెరిగినందువల్ల, డబ్బు ఏర్పడింది. బానిస, భూస్వామ్య వ్యవస్థల్లో మారకాలు పెరుగుతూ వచ్చాయి. అప్పటికీ ఎక్కువగా మిగులు వస్తువులే మారకంలోకి వచ్చేవి. మారకంకోసమే ఉత్పత్తయ్యే సరుకులు ఏర్పడ్డాయి కాని తక్కువగా ఉండేవి. అంటే అప్పటి ఉత్పత్తిలక్ష్యం ప్రధానంగా వినియోగం, మారకం కాదు. ఇందుకు భిన్నంగా పెట్టుబడిదారీ విధానంలో ఉత్పత్తి మారకం కోసమే సాగుతుంది. ఇదే పెట్టుబడిదారీ విధానపు విశిష్టలక్షణం.
ఇంతకుముందు కొన్ని వస్తువులు మాత్రమే మారకంలో వుండేవి. పెట్టుబడిదారీ విధానం వేళ్ళూనుకునే కొద్దీ, ప్రతిదీ సరుకవుతుంది. సరుకు ఉత్పత్తి సార్వత్రికం అవుతుంది. మార్క్స్ కాపిటల్ లో ముందుగా పరిశీలించింది సరుకునే.
అయితే, సరుకులు లేనప్పడు ఏవి ఉండేవో చూచి, తిరిగి సరుకు వద్దకు వద్దాం.
చరిత్రలో సరుకులు లేకుండా గడచిన కాలమే ఎంతోఎక్కువ. అంటే వస్తువుల మారకాలు లేకుండానే మానవులు దీర్ఘకాలం గడిపారు. ప్రకృతిలో దొరికిన వస్తువులతో వెళ్ళబుచ్చారు.
మనచుట్టూ వున్న వస్తువులు ఎలా ఏర్పడతాయి?
విశ్వం పదార్ధంతో నిండి ఉంటుంది. పదార్ధం(matter) వస్తువుల రూపాల్లో ఉంటుంది. మన చుట్టూ ఎన్నో వస్తువులున్నాయి.
“విశ్వంలోని దృగ్విషయాలు అన్నీ, మనిషి చేతితో తయారయినవైనా లేక భౌతికశాస్త్ర సార్వత్రిక సూత్రాల వల్ల తయారయినవైనా అన్నీ పదార్ధం యొక్క (రూపం)మార్పులే...” అన్న ఇటలీ ఆర్ధికవేత్త  లకస్టోడీ మాటల్ని కోట్ చేశాడు మార్క్స్ ఫుట్ నోట్ లో.     
అన్నీ పదార్ధ రూపాలే. కొండలూ, అడవులూ, పచ్చికబయళ్ళూ, మబ్బులూ, చుక్కలూ, నదులూ సముద్రాలూ, గనులూ, గ్రహాలూ, గాలీ, నీరూ మొదలైనవెన్నో వున్నాయి. ఇవన్నీ మనిషి అవతరించక ముందు నించే వున్నాయి.మనిషి శ్రమ కలవకుండా ప్రకృతి చర్యలవల్ల ఏర్పడ్డవి. ఇవి ప్రకృతి ఉత్పాదితాలు.
మరొక రకం వస్తువులున్నాయి.బట్టలూ, చెప్పులూ,కుర్చీలూ, సైకిళ్ళూ, కార్లూ,ఫాన్లూ, సెల్ ఫోన్లూ టి.వీలూ వగయిరా. ఇవి ప్రకృతి చర్యలవల్ల ఏర్పడ్డవి కావు. మనిషి శ్రమ వల్ల తయారయినవి. ఇవి మనిషి శ్రమ కలిసిన వస్తువులు. శ్రమ ఉత్పాదితాలు.
కనక వస్తువులు రెండు రకాలు.
1. మనిషి శ్రమ కలవనివి - ప్రకృతి ఉత్పాదితాలు.
2.మనిషి శ్రమ కలిసినవి - శ్రమ ఉత్పాదితాలు.
ప్రకృతి తన కదలికలద్వారా, చర్యలద్వారా పదార్ధపు రూపు మారుస్తుంది.పదార్ధం ఆదినుండీ ఉంది. అదికొత్తగా ఏర్పడదు. ఉన్నది నశించదు. అదెప్పుడూ ఏదో వస్తువు రూపంలో వుంతుంది. అణువూ వస్తువే, అందులో ఎంతోవేగంగా తిరుగుతున్న ఎలక్ట్రానూ వస్తువే. మేఘం వస్తువే. దాని రూపం మారి కురిసే వర్షపునీరూ వస్తువే. ప్రకృతిచర్యలవల్ల, చలనాలవల్ల పదార్ధపు రూపాలు మారుతూ వుంటాయి. అంటే అనేక వస్తువులు ఏర్పడుతుంటాయి.
ఒకనాడు సూర్యుడూ లేడు, భూమీ లేదు.ఏదోనాటికి అదీ ఉండదు ఇదీ ఉండదు.అంటే పదార్ధం నశిస్తుందని కాదు, మరొకరూపం పొంది, వేరొకవస్తువు ఏర్పడుతుందని. అంతే.అందువల్ల ప్రకృతి ఉత్పాదితాలు శూన్యంలో సృష్టికావు. పదార్ధం కావాలి. ప్రకృతి చర్యలవల్ల పదార్ధం ఏ వస్తురూపాల్లోకి మారుతుందో ఆవస్తువులు ప్రకృతి ఉత్పాదితాలు. మానవ శ్రమవల్ల ప్రకృతి ఉత్పాదితాలు ఏ వస్తురూపాల్లోకి మారతాయో ఆవస్తువులు శ్రమ ఉత్పాదితాలు.
ప్రకృతి ఉత్పాదితం లేకుండా మనిషి శ్రమ మొదలుకాదు.మట్టి లేనిదే కుండలు చేసేశ్రమ మొదలుకాదు. తేనెతుట్టె లేనిదే తేనెపిండే శ్రమ ఉండదు. ఏ శ్రమోత్పాదితానికైనా 'మూలాధారవస్తువు '(substratum)ప్రకృతి ఉత్పాదితమే.మనిషి శ్రమచేసేది అప్పటికే వున్న వస్తువు మీదే. ప్రకృతి చర్యల వల్ల మాత్రమే తయారైన వస్తువులమీదే.
మనిషి శ్రమ జరిగే వస్తువు, ప్రకృతి ఉత్పాదితం కావచ్చు.నదీ ప్రాంతాల్లో ఉన్న ఇసుక ప్రకృతి ఉత్పాదితం.దాన్ని చలగపారతో ఎత్తితే అది శ్రమ ఉత్పాదితం.దాన్న్ని మోసుకొస్తే మరోవిడత శ్రమ కలిసింది.సిమెంట్ కంకర్ లతో కలిపేటప్పుడు మరొక విడత కలుస్తుంది. ఒకసారి శ్రమ కలిసిందంటే అది శ్రమ ఉత్పాదితం. ఎన్నివిడతలు కలిసినా శ్రమ ఉత్పాదితమే.
***********
ప్రకృతి ఉత్పాదితం లేనిదే మనిషి శ్రమ మొదలుకాదు. వస్తువుల ఉత్పత్తిలో ప్రకృతీ పనిచేస్తుంది, మనిషీ పనిచేస్తాడు."పదార్ధపు రూపాన్ని మార్చడం ద్వారా మనిషి ప్రకృతి లాగే పనిచేస్తాడు."- కాపిటల్1.50
“కోటు, బట్ట వగయిరా ఉపయోగపువిలువలు- అంటే సరుకుల శరీరాలు -పదార్ధమూ, శ్రమా అనే రెండు అంశాల కలయిక. వాటికొరకు చేసిన ప్రయోజనకరశ్రమని తొలగిస్తే, పాదార్ధిక మూలం (substratum) మిగులుతుంది.అది మనిషి సహకారం లేకుండా ప్రకృతి సమకూర్చినది. ప్రకృతి పనిచేసినట్లే, మనిషి పనిచెయ్యగలడు-పదార్ధపు రూపాన్ని మార్చడంద్వారా.అంతేకాదు, ఈరూపాన్ని మార్చే చర్యలో మనిషి ప్రకృతిశక్తుల సహాయం ఎల్లప్పుడూ పొందుతాడు. అప్పుడు శ్రమఒక్కటే పాదార్ధిక సంపదకు, శ్రమ ఉత్పత్తి చేసిన ఉపయోగపువిలువలే వనరు కాదని గమనిస్తాము. విలియం పెట్టీ అన్నట్లు’ సంపదకు భూమి తల్లీ, శ్రమ తండ్రీ’."  కాపిటల్ 1.50
“భూమిని మినహాయిస్తే, శ్రమ ఒక్కటే సంపదకు మూలం."- గోథా ప్రోగ్రాం విమర్శ, Selected Works   single volume p315
"సకలసంపదకూ శ్రమ ఒక్కటే వనరు కాదు....శ్రమ...ఎంతవనరో...ప్రకృతికూడా అంతే వనరు."  అంతేకాదు మనిషి " పదార్ధపు రూపాన్ని మార్చే క్రియలో నిరంతరం ప్రకృతిశక్తుల సహకారం పొందుతాడు." వ్యవసాయంలో వాతావరణం -వాన, ఎండా, గాలీ తేమా- నుండి సహకారం లభిస్తుంది.విద్యుదుత్పత్తిలో సహజ జలపాతాలు తోడ్పడతాయి. తూర్పారకు గాలి, ధాన్యం ఆరడానికి, గడ్డి వగయిరా  ఎండడానికి, ఉప్పు తయారీకి ఎండ కావాలి.
తయారీ పరిశ్రమ లో " ప్రకృతి ఏమీ చెయ్యదు, అంతా మనిషే చేస్తాడు" అన్న స్మిత్ కి రికార్డో ఇలా జవాబిచ్చాడు: "మాన్యుఫాక్చర్లో ప్రకృతి మనకొరకేమీ చెయ్యదా? యంత్రాలను కదలించడంలోనూ, జలయానంలోనూ సహకరించే వాయుశక్తీ, జలశక్తీ ఏమీ చెయ్యవా? బ్రహ్మాండమైన ఇంజన్లను పనిచేయించే వాతావరణ పీడనమూ, నీటి ఆవిరి యొక్క స్థితిస్థాపకతా ప్రకృతి బహుకృతులుకావా? లోహాలను మెత్తబరచడంలోనూ, కరగించడంలోనూ ఉష్ణం ప్రభావాన్నీ, రంగువేసే ప్రక్రియలో, పులిసే ప్రక్రియలో వాతావరణం డికాంపొజిషన్ గురించీ చెప్పకపోవడం" ఏమిటి? "మనిషికి ప్రకృతి సహకారాన్ని  అందించని, అదికూడా ఊరకనే అందించని మాన్యుఫాక్చరంటూ ఏదీ లేదు." –Theories of Surplus Value.1.149
అందువల్లే "సంపదకు భూమి తల్లీ, శ్రమ తండ్రీ" అని విలియం పెట్టీ చెప్పిన విషయాన్ని మార్క్స్ తన పెట్టుబడిలో ప్రస్తావించాడు.- కాపిటల్ 1.50
సారాంశం ఏమంటే: వస్తువుల ఉత్పత్తిలో ప్రకృతీ పనిచేస్తుంది, మనిషి పనిచేస్తాడు.అయితే ప్రకృతి చేసిన వస్తువు లేనిదే మనిషి పని చెయ్యలేడు. మట్టి ఉంటేనే, కుండ చెయ్యగలడు.
దీన్నిబట్టి మనిషి ఉత్పత్తిచేసే వస్తువులు రెండు అంశాల సమ్మేళనాలు - ప్రకృతి ఇచ్చిన వస్తువూ, దాని రూపం మార్చే మనిషి శ్రమా.
ఉదాహరణకి బుట్ట తయారీకి ప్రకృతి ఇచ్చే వెదురు బొంగు, దాన్ని చీల్చి బుట్టరూపంలోకి మార్చే శ్రమా రెండూ కావాలి.బుట్ట అదే రూపంలో ప్రకృతిలో దొరకదు.దానికోసం ఒక ప్రయోజనకరమైన శ్రమ అవసరం. ఆశ్రమని తొలగిస్తే,మిగిలేది పాదార్ధిక మూలాధారవస్తువు- వెదురుబొంగు.అది మానవ సహాయం లేకుండా ప్రకృతి సరఫరా చేసేది.
"పదార్ధపు రూపాన్ని మార్చడం ద్వారా ప్రకృతి పనిచేస్తుంటేనే మనిషి పనిచెయ్యగలడు"-కాపిటల్.1.50
తేలింది ఏమంటే " సంపదకు ...శ్రమ ...ఎంత వనరో ప్రకృతి కూడా అంతే వనరు"-గోథా ప్రోగ్రాం విమర్శ, Selected Works   single volume p315
అప్పుడు శ్రమఒక్కటే పాదార్ధిక సంపదకు, శ్రమ ఉత్పత్తి చేసిన ఉపయోగపువిలువలే వనరు కాదని గమనిస్తాము.విలియం పెట్టీ అన్నట్లు’ సంపదకు భూమి తల్లీ, శ్రమ తండ్రీ’." కాపిటల్ 1.50 అంతేకాదు మనిషి " పదార్ధపు రూపు మార్చే చర్యలో నిరంతరం ప్రకృతిశక్తుల సహకారాన్ని పొందుతాడు."- కాపిటల్.1.50
ఒకేరకం వస్తువులు ప్రకృతి ఉత్పాదితాలు కావచ్చు, మనిషిశ్రమ కలిసినవి కావచ్చు. సహజ అడవుల్ని అనుకరిస్తూ సామాజిక అడవుల్ని పెంచుతాడు.ఇవిశ్రమ ఉత్పాదితాలు.అడవిలో  పెరిగే జంతువులు ప్రకృతి ఉత్పాదితాలు.అవి వాటికవే దొరికింది తిని బతుకుతాయి.కాని కోళ్లఫారాల్లో కోళ్ళూ, డయరీ ఫారాల్లో గేదెలూ మనుషులశ్రమతో పెరుగుతాయి.సర్కస్ లో జంతువుల్ని మనుషులు పెంచి పోషిస్తారు.నాగలి లాగే ఎడ్లూ, టాంగాలీడ్చే గుర్రాలూ మనిషి వల్ల తర్ఫీదు పొందినవే.పందాల్లో పాల్గొనే కోళ్ళూ, గుర్రాలూ తర్ఫీదు పొందినవే. మనిషి శ్రమతో నిమిత్తం లేకుండా ధాన్యాలూ, కూరగాయలూ, పండ్లు పండుతుంటాయి. అవి ప్రకృతి ఉత్పాదితాలు. పొలాల్లో వ్యవసాయం చేసి పండించేవన్నీ శ్రమ ఉత్పాదితాలు.
ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ చెరువుల్లో పిల్లలు ఈత కొడతారు. నగరాల్లో మనిషి నిర్మించిన ఈతకొలనులు ఉంటాయి.
ప్రకృతి ఉత్పాదితాలు
శ్రమ ఉత్పాదితాలు
శీతాకాలంలో ఏర్పడే మంచుగడ్డలు
కార్ఖానాల్లో తయారుచేసే ఐస్ గడ్డలు
గనుల్లో ఉప్పు
మనిషి చేసే ఉప్పు
చెట్లు రాసుకుని పుట్టే నిప్పు/ అగ్నిపర్వతాల నిప్పు
ఆగ్గిపుల్ల నిప్పు/ లైటర్ నిప్పు
సముద్రంలో రొయ్యలు
తవ్విన చెర్లో పండించే రొయ్యలు
మేఘాల రాపిడికి పుట్టే విద్యుత్తు
జనరేటర్ల వల్ల పుట్టే విద్యుత్తు
చందమామ లాంటి ఉపగ్రహాలు
కృత్రిమ ఉపగ్రహాలు
ప్రకృతి తయారుచెయ్యని చెయ్యలేని అనేక వస్తువుల్ని మనిషి చేశాడు.ఒక నట్టో బోల్టో ప్రకృతిలో కనబడదు. చెప్పులో, చొక్కాలో, రొట్టెలో ప్రకృతిలో దొరకవు.  అలాంటివి లక్షల సంఖ్యలో మనిషి తయారు చేసుకున్నాడు. రోజురోజుకీ వీటి సంఖ్య పెరుగుతున్నది.మానవుడు ఈనాడు ప్రకృతి ఉత్పాదితాలతో పాటు తన శ్రమ ఉత్పాదితాలనూ వాడుకుంటున్నాడు.
ప్రయోజనకర వస్తువులే సంపద. అయితే, పెట్టుబడిదారీ సమాజంలో ప్రయోజనకర వస్తువులు సరుకులవుతాయి. కనక సరుకుల కూడికే ఆధునిక సమాజంలో సంపద. విడిసరుకే దాని యూనిట్.
పెట్టుబడి పుస్తకం ఈవాక్యంతో మొదలవుతుంది:                                                                                                “పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ప్రబలంగా అమల్లోవున్న సమాజాల్లో, సంపద అపారమైన సరుకుల కూడికగా ఉంటుంది.”- ఆసంపద రకరకాల సరుకుల గుట్ట. ఆ సరుకుల గుట్ట ఎంత పెద్దదయితే సంపద అంత పెద్దది. ఆ సరుకులు ఏవైనా కావచ్చు. అయినా వాటిలో ప్రతిదీ సరుకే. కనక ఆసంపదకి ‘మూలప్రమాణం’ (unit) ఒక విడి సరుకే.” అంటాడు.
దాని తోటి వాక్యంలో, అందువల్ల, “మన పరిశోధన సరుకువిశ్లేషణతోనే మొదలు కావాలి” అంటూ తన పరిశోధన సరుకువిశ్లేషణతో ప్రారంభిస్తాడు.
ఆయన విశ్లేషణలో సరుకు గురించి తేలిన విషయాలు:
మొదటి విషయం.
1.సరుకు మనకు బయట ఉండే వస్తువు.
ఒక సరుకు అది స్టవ్ కావచ్చు, మందు బిళ్ల కావచ్చు, ఫానో, దోమల బాటో కావచ్చు. అది ఏదైనా మనకు బయట వుండే వస్తువే. కొట్లల్లో ఎన్నొ వస్తువులుంటాయి. అవన్నీ అమ్మడానికే. అరల్లో ఉంటాయి. అంటే మనకి బయట అన్నమాట.
2. ప్రతి సరుకూ ఏదో ఒక కోరికని, అవసరాన్ని తీరుస్తుంది. వంటకి స్టవ్ అవసరం.జ్వరం వస్తే మందు బిళ్ల వెయ్యాలి. గాలికోసం ఫాన్, దోమలు పీకుతుంటే బాట్ కావాలి. ఏవస్తువునైనా కొనడానికి కారణం ఏదో ఒక ప్రయోజనం ఉండడమే. ఏ కోరికనూ తీర్చలేని వస్తువుని ఎవ్వరూ కొనరు. అది సరుకు కాదు.
3. వస్తువులు తీర్చే కోర్కెలు పొట్టలో పుట్టినవైనా,  మనసులో ఏర్పడినవైనా తేడా ఉండదు. ఆకలైతే రొట్టో,పండో ఏదో ఒకటి తినాలి. పిల్లవాడికి ఆడుకోడానికి నచ్చిన బొమ్మ కావాలి. ఒకటి ఆకలితీర్చేది, మరొకటి మనసుకి కలిగిన కోరిక తీర్చేది. కోర్కెలు ఎలాటివైనా, వాటి స్వభావం ఏదైనా తేడా ఉండదు.
4.ఒక వస్తువు కోర్కెల్ని ఎలా తీర్చినా ఒకటే. దప్పిక తీర్చుకోడానికి నీరుకావాలి. నీటిని తోడటానికి తాడు బొక్కెన కావాలి. నీరు తాగుతాం.బొక్కెన లేనిదే నీరు చేదలేం. నీరు తోడే పరికరం. ఇలాంటివి ఎన్నో వస్తువులు అవసరమవుతాయి. ఆ బొక్కెన తయారుచేసే వాడికి రేకు, కడ్డీ, తాపడం చీలలూ కావాలి. కొలిమి సామాను, బొగ్గులూ, సుత్తీ , శానం వగయిరా ఉండాలి. బొక్కెన ఉత్పత్తికి ఇవన్ని అవసరం.వీటిని ఉత్పత్తిసాధనాలు అంటారు. ఇవన్నీ కొనేవానికి సరుకులే. ఒక వస్తువు ప్రత్యక్షంగా జీవితావసర వస్తువుగా( బొక్కెనగా ) కోరిక తీరుస్తుందా, లేక పరోక్షంగా (బొక్కెన)ఉత్పత్తికి అవసరమైన వస్తువుగా ఉపయోగపడుతున్నదా/ కోరిక తీరుస్తుందా అనే పట్టింపు ఉండదు. అలా తీర్చినా, ఇలా తీర్చినా తేడాలేదు. తీర్చగల సత్తా వుంటే సరి.
చెప్పులు కుట్టాలంటే,తోలూ,దారమూ,జిగురూ కావాలి.ఈవస్తువులమీద పనిచేస్తాడు.ఇవి శ్రమని గ్రహిస్తాయి కనక శ్రమగ్రహీతలు/శ్రమ పదార్ధాలు (subjects of labour) ఉత్త శ్రమతో చెప్పులు తయారు కావు. శ్రమగ్రహీతలతోనూ కావు. కుట్టడానికి కొన్ని పరికరాలు కావాలి. చాకూ, ఆరె, సుత్తి, ఇనప దిమ్మ వగయిరా. ఇవి శ్రమసాధనాలు. ఏవస్తువు తయారు కావాలన్నా తగిన శ్రమ పదార్ధాలూ, శ్రమ సాధనాలూ, తగిన శ్రమా కావాలి. మొదటి రెండూ కలిసి ఉత్పత్తిసాధనాలు. వీటికి శ్రమ తోడైతేనే ఉత్పత్తి జరుగుతుంది. చెప్పులు మనిషి అవసరాన్ని తీరుస్తాయి. ఉత్పత్తిసాధనాలు వాటిని తయారు చెయ్యడానికి అవసరమవుతాయి. ఏ అవసరం తీర్చినా ఒకటే. అది ప్రయోజనం కలవస్తువే.
గుణమూ-పరిమాణమూ
ప్రతివస్తువుకీ గుణం ఉంటుంది.
ఒక్కోక రకం వస్తువుకు ఒక్కొకరకం ధర్మాలుంటాయి.స్పూనూ,గిన్నే,పళ్ళెమూ స్టీల్ వే కావచ్చు. కాని వాటి ఆకారాల్లో తేడాల వల్ల ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. అంటే అవి గుణాత్మకంగా భిన్నమైన వస్తువులు. అలాగే ప్లాస్టిక్ తో తయారైన నవారూ, దారమూ, బిందే గుణాత్మకంగా భిన్నమైనవి. అలాగే బియ్యమూ, బియ్యపు రవ్వా,పిండీ కూడా. ఒకే ఆకారంలో ఉన్నా,బూరా, ఫుట్ బాలూ,ఒక ఇనపగుండూ ఒకటి కావు.తయారికి వాడిన మెటీరియల్ లో తేడావల్ల వాటి గట్టితనంలో తేడాలుంటాయి.గట్టితనం ఒక భౌతిక ధర్మం.ఒకేదారంతో నేసిన తువాలూ,దుప్పటీ ఆకారాల్లో తేడాలవల్ల గుణాత్మకంగా భిన్నమైనవి.నీరూ, ఆనీటితో తయారైన ఆవిరీ, ఐసూ గుణాత్మకంగా భిన్నమైనవి.వాటి ఉష్ణోగ్రతల్లో తేడాలవల్ల. ఉస్ణోగ్రత ఒక భౌతిక ధర్మం. ఒకేవస్తువు కొయ్యదీ, ప్లాస్టిక్ దీ, ఇనపదీ గుణాత్మకంగా భిన్నమైనవి. సుత్తెలు రబ్బరువి, కొయ్యవీ, ఇనపవీ ఉంటాయి. అవన్నీ గుణాత్మకంగా భిన్నమైనవి.  అరటి పండూ, జాంపండూ రెండూ తినేవే అయినా వాటు రుచులు వేరు, రంగూ రూపమూ వేరు. కనక గుణాత్మకంగా భిన్నమైనవి.
సముద్రపు ఒడ్డున దొరికే ఇసకలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఎడారి ఇసక చాలా సన్నంగా ఉంటుంది.కట్టుబడికి ఉప్పులేని,గంద్ర ఇసక వాడతారు. అలాంటి ఇసక్కే ఆ ఉపయోగపు విలువ ఉంటుంది. సముద్రపు ఇసక్కీ, ఎడారి ఇసక్కీ ఆ ఉపయోగపు విలువ ఉండదు. రెండూ గుణాత్మకంగా భిన్నమైనవి.
అంటే, ఏవస్తువుకైనా దాని గుణం దానికి ఉంటుంది.
అలాగే ప్రతి వస్తువుకీ పరిమాణం ఉంటుంది.
వస్తువన్నాక-అది ఏదైనా సరే- పరిమాణం ఉండి తీరుతుంది. పరిమాణం ఎంతో చెప్పటానికి ప్రమాణాలు ఉంటాయి. అరటి పళ్ళు డజన్లలో, కాగితాలు దస్తాల్లో, రీముల్లో చెబుతాం. సిరా ఔన్సుల్లో, బట్టలు గజాల్లో మీటర్లలో చెబుతాం. బరువుని గ్రాముల్లో చెబుతాం. అయితే అన్నిచోట్లా ఒకే కొలత ప్రమాణాలు ఉండవు.ఎన్నోదేశాలు కిలోమీటర్లలో దూరాన్ని చెబుతుంటే, అమెరికాలో మైళ్ళలో చెబుతారు. బరువుని పౌన్లలో చెబుతారు. చాలాదేశాల్లో కిలోగ్రాముల్లో చెబుతారు. ఉష్ణొగ్రతని సెంటిగ్రేడ్ లలో చెబుతుంటే, అమెరికన్లు ఫారన్ హీట్లలో చెబుతారు.
ఒకే చోటయినా అన్ని కాలాలలో ఒకే ప్రమాణాలు లేవు. పూర్వం దూరాన్ని అంగలతో చెప్పేవారు.  బారలూ మూరలూ వేసి పొడుగు కొలిచేవారు. ఆతర్వాత అడుగులూ గజాలూ వచ్చాయి. ప్రస్తుతం మీటర్లు అమల్లో ఉన్నాయి. బరువుని నేడు కిలోగ్రాముల్లో చెబుతున్నాం. ఒకప్పుడు సేర్లు, మణుగుల్లో చెప్పేవాళ్ళు.ఇంతెందుకు ఇంతకుముందు ధాన్యాన్ని మానికలతో కొలిచేవారు. మరి నేడు అదే ధాన్యాన్ని తూస్తున్నాం.
అందుకే మార్క్స్ అంటాడు: " ఈ కొలమానాల వైవిధ్యం కొంతవరకూ కొలవాల్సిన వస్తువుల స్వభావంలో వుండే వైవిధ్యం నుండీ, కొంతేమో అలవాటు (convention)నుండీ వస్తుంది"-కాపిటల్ 1.43
షాపులో 2 డజన్ల గడియారాలూ, 6 టి.వీ లూ, 3 ఫ్రిజ్ లూ ఉన్నాయంటాం. వీటి పరిమాణాన్ని కొలిచో తూచో చెప్పం. నాలుగు పావురాళ్ళు ఎగురుతున్నాయి అంటాం.అయితే వాటి మాంసాన్ని తూచి, కిలోల్లో చెబుతాం.
ప్రతిదానికీ ఒకే కొలత ఉండాలని లేదు. నూనె లాంటి కొన్ని ద్రవపదార్ధాల్ని కొలిచి లీటర్లలోనూ, తూచీ కిలోల్లో నూ చెప్పే అలవాటుంది. మార్కెట్లో  కాలీ ఫ్లవర్ ని తూచీ ఇస్తారు. ఒక్కోటి ఇంత అనీ అమ్ముతారు.ఆపిల్ పళ్ళని డజన్ల లెక్కనా కొంటాం, కిలోల లెక్కనా కొంటాం.
అంటే కొలత ప్రమాణాలూ, పద్ధతులూ ప్రాంతాల్ని బట్టీ, కాలాన్ని బట్టీ మారుతూ ఉంటాయి.
********
ఒకవస్తువు ప్రయోజనమే దాన్ని ఉపయోగపు విలువగా చేస్తుంది. ఒక వస్తువుకి దాని ప్రయోజనం ఎలా ఏర్పడుతుంది? ఒక వస్తువు ప్రయోజనం గాలిలో ఏర్పడేది కాదు. తన ధర్మాలవల్ల మనిషి కోర్కెల్ని తీరుస్తుంది. ధర్మాలు వేరయితే ప్రయోజనాలు వేరుగా వుంటాయి.పెన్సిల్ ప్రయోజనం వేరు, సైకిల్ ప్రయోజనం వేరు. కారణం వాటి ధర్మాలు భిన్నమైనవి గావడమే.
ప్రయోజనకరమైన ప్రతివస్తువూ ఎన్నో ధర్మాల సమ్మేళనం. అందువల్ల అది ఎన్నోవిధాలుగా ఉపయోగపడవచ్చు. నీరు దప్పిక తీరడానికీ, వంటకీ, ఐస్ తయారీకీ, మురికి కడగడానికీ, వ్యవసాయానికీ,ఆవిరి యంత్రం నడిపేందుకు, నిప్పుని ఆర్పడానికి ఉపయోగపడుతుంది. ఇంజన్లు చల్లబరచడానికీ, విద్యుదుత్పత్తికీ, గుంపుల్ని చెదరగొట్టడానికీ పనికొస్తుంది.ఇంకా ఎన్నో ప్రయోజనాలు. ఆవిరి ఇంజన్ కనుక్కోకముందు నీటిని అందుకు వాడలేదు. అయితే నీటికి ఆ ఉపయోగపు విలువ ఎప్పుడూ ఉంది.అద్దాలు లేక ముందు మనుషులు తమ ముఖాల్ని నీటిలో చూచుకునేవారు.ఇప్పుడెవరూ చూచుకోరు. అయినా దానికా ప్రయోజనం ఇప్పడూ ఉంది. ఎప్పటికీ ఉంటుంది. తాజ్ మహల్ చూడబోయినవారు దాని ప్రతిబింబాన్ని ఇప్పటికీ నీటిలో చూడడం ఒక పనిగా పెట్టుకుంటారు.ప్రకృతి అందాలు సరస్సుల్లో చూచి ఆనందిస్తారు.
కర్రలు రాపాడితే ఎప్పుడయినా నిప్పు పుడుతుంది. ఒకప్పుడు అలా చేశారు.ఇప్పుడెవ్వరూ ఆపని చెయ్యరు. చెకుముకి రాయితో నిప్పు చేసేవారు.అగ్గిపుల్లలొచ్చాక, లైటర్లొచ్చాక ఆరాయితో ఎవ్వరూ నిప్పు చెయ్యడం లేదు. అయితే దానికా ప్రయోజనం ఇప్పుడూ ఉంది. కారణం దాని ధర్మాలు అవే.
రాగి గురించి క్రీ.పూ.4000 సంవత్సరాలనాడే తెలుసు. నాగలి కర్లూ, గొడ్డళ్ళూ రాగితో చేసేవారు. రాగిరేకుల్ని ఇంటి కప్పుకి వాడారు. ఇప్పుడెవరు అలా వాడడంలేదు- రాగికా ప్రయోజనం చెక్కుచెదరుండా అలానే ఉన్నా. విద్యుత్ కనుగొన్నాక రాగితీగని మంచి వాహకంగా వాడుతున్నారు. మోటార్ కాయిల్స్ రాగివే. టెలిఫోన్ తీగలూ రాగివే.
అయస్కాంతం ఇనుముని ఆకర్షిస్తుంది. ఫ్రిజ్ తలుపులకి పెడతారు.స్టీరియో స్పీకర్లలో, ఇయర్ ఫోన్లలో,దిక్సూచి లో వాడతారు.
ఒక వస్తువుకి దానిధర్మాలవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి - మనకు తెలిసినా తెలియకపోయినా. మనకి తెలియకపోతే, అందుకు దాన్ని మనం ఉపయోగించం. తెలిశాకనే ఆవస్తువు ఉపయోగపు విలువ అవుతుంది. ఒక్కొక్క నూతన ఆవిష్కరణతో రాగికుండే ఒక్కొక్క ప్రయోజనం బయటపడింది. ముందు ముందు ఇంకాకొన్ని అవసరాలకు దాన్ని ఉపయోగించవచ్చు. అందుకే మార్క్స్ అంటాడు:
“వస్తువుల వివిధ ఉపయోగాల్ని కనుక్కోవడం చరిత్ర పని.”- మనిషి ఆలోచనలూ, అవసరాలూ పెరిగేకొద్దీ, కొత్తకొత్త అవిష్కరణలు వచ్చేకొద్దీ,  చరిత్ర నడిచే క్రమంలో  వస్తువుల వివిధ ప్రయోజనాలు తెలుస్తాయి.అందుబాటులోకి వస్తాయి.
"ఒక వస్తువు ప్రయోజనం ఆవస్తువునుండి విడిగా వుండజాలదు." కొయ్యడం అనే ప్రయోజనం బ్లేడుకో, చాకుకో ఉంటుంది. వాటితో సంబంధం లేకుండా ఉండదు.ఏవస్తువు ప్రయోజనాన్నైనా ఆవస్తువునించి విడదీయలేం."
“ఉపయోగించడం వల్లనో లేక వినియోగించడం వల్లనో మాత్రమే ఉపయోగపు విలువ యధార్ధమవుతుంది."- కాపిటల్.1.44
"ఉపయోగపు విలువలు సమస్తసంపద యొక్క సారాంశం అయివుంటాయి-ఆసంపదయొక్క సామాజిక రూపం ఏదయినా సరే."-కాపిటల్.1.44
"ఉ.వి సరుకుయొక్క భౌతిక పార్శ్వం"-గ్రుండ్రిస్-881
ప్రయోజనానికి సంబంధించిన  ఒక ముఖ్య విషయం:  ఒక వస్తువు ఉత్పత్తికి పట్టిన శ్రమ పరిమాణానికీ, దాని ప్రయోజనానికీ సంబంధం ఉండదు. అంటే, ఒకవస్తువు తయారీకి పట్టే కాలాన్ని బట్టి దాని ప్రయోజనం ఉండదు. ఎక్కువ బడితే దాని ప్రయోజనం పెరగదు. తక్కువ బడితే దాని ప్రయోజనం తగ్గదు.రెండుసందర్భాలలోను అంతే ఉంటుంది. అంటే తయారీకి ఎక్కువ సమయం పట్టినా తక్కువ సమయం పట్టినా దాని ప్రయోజనం ఏమాత్రం మారదు.ఇంటి పక్కనే వున్న చెర్లో నీళ్ళు 10 బుంగలు తెచ్చి తొట్టి నింపడానికి 30 నిముషాలు పడుతుంది. ఆ చెరువు ఎండితే కిలోమీటర్ దూరంలో వున్న ఏటి నీటిని తెచ్చి అదే తొట్టిని నింపడానికి 3 గంటలు పట్టచచ్చు. తగినంత వర్షం పడితే తేకుండానే నిండుతుంది. మూడు సందర్భాలలోనూ పట్టిన శ్రమ కాలాల్లో తేడా వుంది. అయినా 3 సందర్భాలలోనూ నీటి ప్రయోజనం మాత్రం ఒకటే.
" ఏదయినా కొత్త పరికరం కనిపెట్టినందువల్ల, దాని (రొట్టె)తయారీకి పట్టే శ్రమలో 95 శాతం తగ్గినా రొట్టె ప్రయోజనంలో మార్పు రాదు"-క్రిటిక్.36 అంటాడు.
ఎలెక్ట్రాలసిస్ వచ్చాక అల్యుమినియం ని శుద్ధిచెయ్యటానికి పట్టే కాలం అనూహ్యంగా తగ్గిపొయింది. అయితే దాని ఉపయోగపు విలువలో అణుమాత్రమయినా మార్పు రాలేదు.
వేరొకచోట గోధుమలు " అలాగే మంచులాగా ఆకాశం నుండి కురిసినా వాటి ఉపయోగపు విలువని ఏమాత్రం కోల్పోవు"- కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మార్క్స్ అండ్ ఎంగెల్స్. 29 వ సంపుటం. పేజీ 252 (సాఫ్ట్ కాపీ)
అంతే ముఖ్యమైన మరొక విషయం:
ఒక వస్తువు  ఏ సామాజిక సంబంధాలలో ఉత్పత్తయింది? అనే విషయం దాని ప్రయోజనానికి అనవసరం. ఈ సంబంధాలు ఆదిమ, బానిస, భూస్వామ్య, పెట్టుబడిదారీ సమాజాల్లో భిన్నమైనవిగా వుంటాయి. అయితే ఉపయోగపు విలువకు ఈతేడాలతో సంబంధం ఉండదు. మార్క్స్ మాటల్లో:
"గోధుమల్ని రుచిచూచి వాటిని పండించింది రష్యన్ భూదాసుడో,ఫ్రెంచ్ రైతో, ఇంగ్లిష్ పెట్టుబడిదారుడో చెప్పడం సాధ్యం కాదు."-క్రిటిక్.32
మరొకచోట: గోధుమల్ని పండించింది బానిసైనా, భూదాసుడైనా, స్వేచ్చాశ్రామికుడైనా ఒకే ఉపయోగపు విలువను కలిగి వుంటాయి.- కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మార్క్స్ అండ్ ఎంగెల్స్. 29 వ సంపుటం. పేజీ 252 (సాఫ్ట్ కాపీ)
దీన్ని బట్టి " ఉపయోగపువిలువ అత్యంత భిన్నమైన ఉత్పత్తి విధానలకూ ఉమ్మడి అంశం"- కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మార్క్స్ అండ్ ఎంగెల్స్. 29 వ సంపుటం. పేజీ 252 (సాఫ్ట్ కాపీ)
ఉపయోగపు విలువలు లేక ప్రయోజనకరవస్తువులు ఈవ్యవస్థలో మారకం విలువకు వాహకాలుగా కూడా ఉంటాయి.అంటే వస్తువులు పెట్టుబడిదారీ విధానంలో ఉపయోగపు విలువలే కాదు, మారకం విలువలు కూడా.
అందుకే సరుకనేది "ఉపయోగపు విలువా, మారకం విలువా - ఈరెండిటి సమ్మేళనం" అంటాడు.
సరుకు పెట్టుబడిదారీ విధానం యొక్క 'ఆర్ధిక కణం ' .తన చివరి ఆర్ధిక రచనలో ఇలా అంటాడు:సరుకును "ఒకపక్క దాని సహజ రూపంలో అదొక ప్రయోజనకర వస్తువు, ఉపయోగపు విలువగానూ, మరొకపక్క, మారకపు విలువకు వాహకంగానూ నేను గమనించాను"
ఉపయోగపు విలువను గురించి సరిపడా చర్చించాడు. ఇక మారకం విలువని విశ్లేషిస్తాడు.ఎలాగో చూద్దాం.
మొదటి అధ్యాయం మొదటి విభాగం సరుకులు. చివరి పేరాలో ఉపయోగపు విలువ గురించి చెబుతాడు.- కాపిటల్ 1.48
"ఒక వస్తువు విలువ లేకుండానే, ఉపయోగపు విలువగా ఉండగలదు. దాని ప్రయోజనం శ్రమ వల్ల ఏర్పడకపోతే పరిస్థితి అదే. గాలీ,దున్నని పొలమూ, సహజ పచ్చికబయళ్ళూ, నాటని అడవులూ మొదలైనవి ఈకోవకి చెందుతాయి."
ఇవన్నీ ఉపయోగపు విలువలే. కాని అవి మారకంలోకి రావు. వాటికి విలువ వుండదు. అయినా అవి ఉపయోగపు విలువలు.
"ఒక వస్తువు ప్రయోజనకరమైనదీ, శ్రమ ఉత్పాదితమూ అయివుండి కూడా, సరుకు కాకుండా ఉండగలదు.తనసొంతశ్రమతో తయారైన ఉత్పాదితంతో తన కోర్కెను తీర్చుకునే మనిషి ఉపయోగపువిలువల్ని ఉత్పత్తిచేస్తాడు, సరుకుల్ని కాదు."
ఉదాహరణకి ఒక నేతగాడు కుటుంబ సభ్యుల వాడకానికి నేసే బట్టలు సరుకులు కావు. ఉపయోగపు విలువలు మాత్రమే.కారణం అవి మారకంలోకి రావు.
ప్రతి సరుకూ శ్రమ ఉత్పాదితమే, కాని ప్రతిశ్రమ ఉత్పాదితమూ సరుకు కాదు. మారకం ద్వారా ఇతరుల వాడకం  బదిలీ అయ్యే శ్రమ ఉత్పాదితాలే సరుకులు.
"సరుకుల్ని ఉత్పత్తిచెయ్యడానికి, అతను ఉపయోగపువిలువల్ని తయారు చెయ్యడమే కాదు, ఆ ఉపయోగపు విలువల్ని ఇతరులకొరకు, అంటే,సామాజిక ఉపయోగపు విలువల్ని తయారుచెయ్యాలి.(ఇతరులకోసం చేస్తేనే చాలదు. మధ్య యుగాల రైతు, భూస్వామి కోసం అద్దె/కౌలు(quit rent) ధాన్యాన్నీ, మతాధికారికొసం 'టితీ'ధాన్యాన్ని పండించాడు.అయితే ఇతరులకోసం పండించినంత మాత్రాన అదీ ఇదీ సరుకులు కావు..సరుకు అవాలంటే మరొకరికి - ఎవరికైతే అది ఉపయోగపు విలువగా ఉంటుందో వారికి - మారక మాధ్యమం ద్వారా బదిలీ కావాలి)*"
*బ్రాకెట్లో ఉన్నది నాల్గవ జర్మన్ ప్రతికి ఎంగెల్స్ చేర్చిన నోట్:" బ్రాకెట్లో ఉన్న దాన్ని నేను చేర్చాను. కారణం ఇది లేకపొవడంవల్ల ఒక అపార్ధం తరచూ కలిగింది. ఉత్పత్తిదారుడు కాకుండా ఇతరులు ఎవరైనా వినియోగించే ప్రతి ఉత్పాదితాన్నీ మార్క్స్ సరుకుగా భావించాడని."
ఒక వడ్రంగి కొయ్యతో మూడు గాళ్ళ బండి తయారుచేసి నడక తొందరగా రావడానికి తన బిడ్డకిస్తే అది సరుకు కాదు. ఉత్త ఉపయోగపు విలువ. అదే బండిని మరొకరికి  ఉచితంగా ఇస్తే, అప్పుడూ అది సరుకు కాదు. దానికి బదులుగా మరొక వస్తువు తీసుకొని ఇస్తేనే -అంటే మారకం చేసుకుంటేనే - అది సరుకు అవుతుంది.
అంటే మారకం లేకుండా బదలాయించినవేవీ సరుకులు కాదు. మారకం కోసం ఉత్పత్తయినవే సరుకులవుతాయి.
పైన చెప్పినట్లు మధ్య యుగాల రైతు భూస్వామి కోసం అద్దె/కౌలు ధాన్యాన్ని పండించి ఇచ్చాడు.  మతాధికారికొసం 'టితీ'ధాన్యాన్ని పండించాడు. వాటిని తన శ్రమతో పండించింది తనకోసం కాదు, ఇతరులకొసం. అయినా అవి సరుకులు కావు." కారణం అవి మారకం లోకి రావు.
(టితీ అంటే పదోవంతు అని అర్ధం. ఆకాలంలో రైతు పండించిన ధాన్యంలో పదోవంతు చర్చికి పోతుంది. దానికి బదులు రైతుకి వచ్చే వస్తువేదీ ఉండదు. కనక ఆ ధాన్యం సరుకు కాదు)
"చివరగా, ప్రయోజనం లేని ఏ వస్తువూ విలువ కాజాలదు. ఆవస్తువు నిరుపయోగమయిందయితే, దానిలో ఇమిడివున్న శ్రమ కూడా అంతే నిరుపయోగమయింది; ఆశ్రమ శ్రమకింద  లెక్కకు రాదు. కనుక విలువను సృజించదు." కాపిటల్.1.48
ఇతరుల వాడకం కొరకు మారకంద్వారా బదిలీ అయ్యే శ్రమ  ఉత్పాదితవస్తువులు మాత్రమే సరుకులు. ప్రకృతి ఉత్పాదిత వస్తువులూ, సొంతవాడకానికి తయారుచేసుకున్న వస్తువులూ, ఇతరుల వాడకం కోసమే అయినా ఊరకే/ ఉచితంగా అంటే, మారకం లేకుండా ఇతరులకు బదిలీ అయ్యే వస్తువులూ సరుకులు కావు. సరుకులైన వస్తువులు కొన్ని. సరుకులు కాని వస్తువులు కొన్ని.

  ఇప్పటికి, ఏవి సరుకులో,  ఏవి కావో - అంటే ఏవి కేవలం ఉపయోగపువిలువలో -  చూచాం. సరుకుల ఉపయోగపు విలువ గురించిన విషయాలు తెలుసుకున్నాం. ఇక సరుకు మారకం విలువ గురించి తెలుసుకోవాలి.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి