30, డిసెంబర్ 2015, బుధవారం

వాగ్నర్ నుంచి రంగనాయకమ్మ వరకు కాపిటల్ వక్రీకరణలు

వాగ్నర్ నుంచి రంగనాయకమ్మ వరకు కాపిటల్ వక్రీకరణలు

                                                                                2016 జనవరి 'వీక్షణం' లో వచ్చింది

మార్క్స్ చెప్పినవి చెప్పలేదని ప్రచారం చేసీ, చెప్పకపోవడం తప్పు అనీ విమర్శించినవారు కొందరు, అలాగే, మార్క్స్ చెప్పనివి ఆయనకు ఆపాదించి దాని ఆధారంగా  తప్పుపట్టేవారు కొందరు చాలమంది ఉన్నారు. ఇలాంటి వాళ్లలో ప్రథముడు సోషలిస్ట్ ప్రొఫెసర్ అడాల్ఫ్ వాగ్నర్ (1835-1917). మార్క్స్ తన విశ్లేషణ నుంచి ఉపయోగపు విలువని పూర్తిగా తొలగించాడని వాగ్నర్ ఆరోపించాడు. ఇదేదో చిన్న విషయం మీద విమర్శ అనిపించవచ్చు. కాని మార్క్సుకి అదే ఎంతో ముఖ్యమయినది. అందుకే Marginal Notes on A. Wagner (1879) లో మార్క్స్ దాన్నితీవ్రంగా ఖండించాడు.

ముందుగా మార్క్స్ కాపిటల్ లో ఏం చెప్పాడో  చూడాలి:
సరుకు ఉపయోగపు విలువ, మారకం విలువల సమ్మేళనం. ఉపయోగం లేనిదేదీ సరుకు కాదు. ఉపయోగపు విలువ ... మారకం విలువ యొక్క వ్యక్తీకరణ రూపం, దృగ్గోచర రూపం అవుతుంది.
ఒక సరుకు విలువ మరొక సరుకు ఉపయోగపు విలువలో, అంటే మరొక సరుకు సహజ రూపంలో దర్శనమిస్తుంది.
అన్నిటినీ మించి, అదనపువిలువ శ్రమశక్తి యొక్క విశిష్ట మైన, దానికి మాత్రమే ప్రత్యేకంగా ఉన్నఉపయోగపు విలువ నుంచి లాగబడింది.
వీటినిబట్టి చూస్తే ఉపయోగపు విలువ మార్క్సుకి పై పై విషయంకాదు. కీలకమైనది. ఇదంతా కాపిటల్ లో సుస్పష్టంగా ఉన్నదే. దాన్ని చదివి కూడా మార్క్స్ అర్థశాస్త్రంలో ఉపయోగపు విలువకి స్థానం లేదు అన్నాడు వాగ్నర్.
అందుకే కావాలనే అస్పష్టంగా వుండేవాడు, కాపిటల్ లో ఒక్క ముక్క కూడా అర్ధం కాని వాడు మాత్రమే మార్క్స్ రచనలో ఉపయోగపు విలువకి ఏపాత్రా లేదు అనగలడు అన్నాడు మార్క్స్ ఘాటుగా. (Marx & Engels Collected works -volume 24 p.545)
 ఇప్పటి దాకా ఉన్న అర్ధశాస్త్రంలో కంటే, నా అర్ధశాస్త్రంలో ఉపయోగపు విలువ చాలా ఎక్కువ పాత్ర పోషిస్తుంది అన్నాడు మార్క్స్. 
ఇది మార్క్స్ చెప్పినా చెప్పలేదు అని విమర్శించిన విషయం.
****
చెప్పకపోయినా చెప్పాడు అన్నది అదనపు విలువకి సంబంధించినది.
శ్రామికులు మాత్రమే ఉత్పత్తిచేసిన అదనపు విలువ అనుచితంగా, అన్యాయంగా పెట్టుబడిదారుల వద్ద వుండి పోతుంది' అని మార్క్స్ అన్నట్లు వాగ్నర్ ఆరోపించాడు. అనుచితంగా, అన్యాయంగా అని మార్క్స్ అనలేదు. వాగ్నర్ అదనపువిలువ గురించి తాను చెప్పనిది తనకు ఆపాదించాడని మార్జినల్ నోట్స్ లో మార్క్స్ తప్పుబట్టాడు: నిజానికి, నేను దీనికి సరిగ్గా వ్యతిరేకమైనది చెప్పాను: ఏమనంటే, సరుకు ఉత్పత్తి ఒకానొక కాలంలో పెట్టుబడిదారీ సరుకు ఉత్పత్తిగా ఉంటుంది. ఈ పెట్టుబడిదారీ సరుకును నిర్దేశించే విలువ నియమం ప్రకారం, అదనపువిలువ తప్పనిసరిగా పెట్టుబడిదారునిదే అవుతుంది, కార్మికునిది కాదు. (Marx & Engels Collected works volume 24 p.558)
మార్క్స్ ప్రకారం ఉత్పత్తి విధానాన్ని బట్టి న్యాయం ఉంటుంది. బానిస వ్యవస్థలో న్యాయమయింది, పెట్టుబడిదారీ వ్యవస్థలో అన్యాయం కావచ్చు. సోషలిస్టు సమాజంలో అన్యాయం కావచ్చు. అందువల్ల ఒక వ్యవస్థను పరిశీలించేటప్పుడు మరొక వ్యవస్థ న్యాయాన్ని కొలబద్ద చెయ్యకూడదు.
'అర్థశాస్త్ర విమర్శకు చేర్పు ' ఉపోద్ఘాతంలో మార్క్స్ ఇలా అన్నాడు:   
పరిశోధనద్వారా నేను సాధించిన సాధారణ ఫలితాన్ని - ఏదైతే సాధింపబడిన తర్వాత నా అధ్యయనానికి మార్గదర్శక సూత్రంగా పనిచేసిందో ఆఫలితాన్ని - క్లుప్తంగా యిలా సూత్రీకరించవచ్చు: తమజీవితానికి సంబంధించిన సామాజికోత్పత్తిలో, మానవులు నిర్దిష్టమూ,అవశ్యకమూ, తమ యిచ్చకు అతీతమూ అయిన సంబంధాలను, తమ భౌతిక ఉత్పాదకశక్తుల అభివృద్ధిలో ఒకానొక నిర్దిష్ట దశకు అనురూపమైన సంబంధాలను పెట్టుకుంటారు. ఈ  ఉత్పత్తి సంబంధాల వెరశి మొత్తమే సమాజపు ఆర్ధిక నిర్మాణ చట్రం, దాని నిజమైన పునాది. ఆపునాది మీదనే చట్టబద్ధ, రాజకీయ ఉపరినిర్మాణం లేస్తుంది, సామాజిక చైతన్యానికి సంబంధించిన నిర్దిష్టరూపాలు దానికి అనురూపంగానే ఉంటాయి. భౌతిక జీవితానికి సంబంధించిన ఉత్పత్తి విధానమే మొత్తం మీద సామాజిక, రాజకియ, బౌద్ధిక జీవిత క్రమాన్ని నిర్దేశిస్తుంది. మానవుల అస్తిత్వాన్ని నిర్దేశించేది వారి చైతన్యం కాదు, తద్భిన్నంగా, వారి సామాజిక అస్థిత్వమే వారి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. వాటి అభివృద్ధికి సంబంధించిన ఒకానొక దశవద్ద, సామాజపు భౌతిక ఉత్పాదకశక్తులు అప్పటికి అస్థిత్వంలో ఉన్న ఉత్పత్తి సంబంధాలతో, లేక - దానికే చట్టబద్ధమైన పదబంధం అయిన ఆస్థి సంబంధాలతో - అవి యింతవరకూ వేటిలోనైతే పనిచేస్తున్నాయో ఆ ఆస్థి సంబంధాలతో ఘర్షణలోకి వస్తాయి. ఉత్పాదక శక్తుల అభివృద్ధి రూపాలుగా వున్న యీ సంబంధాలు  వాటికి శృంఖలాలుగా మారుతాయి. అప్పుడొక సామాజిక విప్లవ శకం ఆరంభమవుతుంది. ఆర్ధికపునాది మార్పుతో బ్రహ్మాండమైన యావత్తూ ఉపరినిర్మాణమూ కొద్దోగొప్పో వేగంగా రూపాంతరం చెందుతుంది."- మార్క్స్ ఎంగెల్స్ సంకలితరచనలు-భాగం2-పే.11
దీన్నిబట్టి వర్తమాన ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికే చట్టాలూ, నీతినియమాలూ ఏర్పడతాయి. ఉత్పత్తివిధానం మారితే, అవీ మారతాయి. అన్ని వ్యవస్థలకూ వర్తించే ఏకైక న్యాయం అంటూ ఏదీ ఉండదు. ఇదీ ఆయన అభిప్రాయం. ఈ చారిత్రక దృక్కోణం నుంచి ఆయన క్షణమైనా వైదొలగడు. దీనికి భిన్నంగా ఆయన వాదన ఉండదు. మార్క్స్ ని చదివేవారెవరైనా దీన్ని వదిలిపెట్టకూడదు. ప్రతి దాన్నీ చారిత్రకదృష్టితో పరిశీలించాలి. సోషలిష్టు సమాజాన్ని వూహించి దానికనుగుణమైన నియమాలు పెట్టుబడిదారీ వ్యవస్థకు వర్తింపచెయ్యాలంటే కుదరదు. సమాన విలువల మారకం అనేది ఈవ్యవస్థలో విలువ నియమం. దీని మీద ఆధారపడి,మార్క్స్ అదనపువిలువని నిరూపించాడు. ఈ నియమం ఏ సరుకుల మారకానికైనా వర్తించి తీరుతుంది. ఇది ఎట్టి పరిస్థితులలోనూ భంగపడరాదు. మార్క్స్ పాటించిన నియమం ఇది.
****
బోం బావర్క్ (1851-1914) ఆస్ట్రియా ఆర్ధిక వేత్త. ఆర్ధిక మంత్రిగా పనిచేశాడు. పెట్టుబడిదారులు కార్మికులను దోపిడి చెయ్యటం లేదని వాదించాడు.  వాగ్నర్ బాటలోనే  ఇతడు కూడా మార్క్స్ అర్ధశాస్త్రంలో ఉపయోగపువిలువకి చోటే లేదు అన్నాడు. అతను అప్పుడే తలెత్తుతున్న మార్జినలిస్ట్ స్కూల్ కి ప్రతినిధి. అది విలువ నిర్ణయంలో ఉపయోగపువిలువకి పెద్దపీట వేస్తుంది. అందుకే అంత ముఖ్యమైన అంశాన్ని వదిలివేశాడని మార్క్స్ ను విమర్శించాడు.

ఫెర్డినాండ్ లాసాల్ (1825-64) జర్మన్ సోషలిస్టు. 1848 నుంచీ మార్క్స్ శిష్యుడు. జర్మన్ కార్మిక ఉద్యమ నిర్మాతల్లో ఒకడు. ఆ కాలంలో మార్క్సు, ఎంగెల్స్ లతో సంబంధంలో ఉండేవాడు. జర్మన్ సోషల్-డెమొక్రటిక్ పార్టీ మార్క్సిస్టు పునాది మీద నిర్మాణమవుతున్నదని చెప్పేవాడు. అయితే  ఏఒక్కరూ తనకు తాను సాధించుకోలేని దాన్ని రాజ్యం సాధిస్తుంది అని అతను కార్మికులకి చెప్పాడు. మార్క్స్ చెప్పింది ఇందుకు సరిగ్గా వ్యతిరేకం: కార్మికవర్గం తన విముక్తి తాను సాధించుకొని, ప్రస్తుత రాజ్యాన్ని రద్దుచెయ్యాలి.  లాసాల్ రాజ్యం ఉండాలంటాడు. దానిని పటిష్టపరచాలంటాడు. ఇది మార్క్సుకి వ్యతిరేకమైనది.

లాసాల్ కఠిన వేతన నియమాన్ని సమర్థించాడు. మాల్థూస్ జనాభాసిద్ధాంతం ప్రకారం ఎప్పుడూ కావలసినదానికన్న ఎక్కువమంది శ్రామికులుంటారు గనక శ్రామికుడు సగటున కనీసవేతనం మాత్రమే పొందుతాడు. మార్క్స్ వేతనాల్ని నిర్ణయించే నియమాలు ఏ అర్ధంలోనూ కఠినమైనవి కాదనీ, సాగగలవనీ (ఎలాస్టిక్) చెప్పాడు. పెట్టుబడి సమీకరణ అనే అధ్యాయంలో మాల్థూస్ వాదనని తిప్పికొట్టాడు. వేతనాలను నియంత్రించే నియమాలు చాలా సంక్లిష్టమైనవనీ, పరిస్థితులను బట్టి ఒకప్పుడు ఒక నియమమూ, మరొకప్పుడు మరొక నియమమూ ప్రాబల్యం వహిస్తుందనీ, మరి అందుచేత అవి ఏవిధంగానూ కఠిన నియమాలు కావనీ చెప్పాడు. లాసాల్ భావించినట్లు ఈవిషయాన్ని ఏవో రెండుమాటల్లో పరిష్కరించడం సాధ్యం కాదని సవివరంగా రుజువుచేశాడు.

మాన్యుస్క్రిప్ట్స్ లో మొదటిది ఈమాటలతో మొదలవుతుంది: పెట్టుబడిదారుడికీ, కార్మికుడికీ మధ్య  పోరాటం ద్వారా వేతనాలు నిర్ణయమవుతాయి.

జూల్స్ గెస్డె (1845-1922) ఫ్రెంచ్ సొషలిస్టు. కాపిటల్ చదివాడు. 1875 జూన్ లో లండన్ లో లాఫార్జ్ ను, మార్క్స్, ఎంగెల్స్ లను కలిశాడు. మార్క్సిస్టునయ్యానని చెప్పాడు. అయితే లాసాల్ చెప్పిన వేతన దృఢత్వ సిద్ధాంతాన్ని - పెట్టుబడిదారీ విధానంలో వేతనాలు బాగా పెరగవు అని నొక్కివక్కాణించే సిద్ధాంతాన్ని - మార్క్సుకి అంటగట్టాడు. లాఫార్జ్, గెస్డె ఇద్దరూ తాము మార్క్సిజానికి ప్రతినిధులమని చెప్పుకున్నారు. 1880 లో జూల్స్ గెస్డె, పాల్ లాఫార్జ్ లు Parti Ouvrier Français (POF, or French Workers' Party) పేరుతో సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. పెట్టుబడిదారీ వ్యవస్థని రద్దుచేసి సోషలిస్టు సమాజాన్ని స్థాపించడం దాని లక్ష్యం. పెట్టుబడిదారీ చట్రంలోనే సాధించగల డిమాండ్ల కోసం ఆందోళనకి ఆచరణాత్మక సాధనంగా కనీస కార్యక్రమాన్ని మార్క్స్ చూశాడు. కాని గెస్డె దాన్ని పోరాట కార్యక్రమంగా చూడలేదు. రాడికలిజం నించి కార్మికుల్ని బయటకు పంపించేదిగా పరిగణించాడు.

మార్క్స్ 1883లో చనిపోయే ముందు వాళ్లకి రాసిన లేఖలో సంస్కరణ పోరాటాల్ని తిరస్కరించినందుకు వాళ్లను విప్లవపదారాధకులు అన్నాడు.

కార్మిక సంఘాల పాత్రను ఫ్రెంచ్ సోషలిస్టులు వ్యతిరేకించారు. అదే మార్క్సిజమయితే నాకు తెలిసిందల్లా నేను మార్క్సిస్టును కాననే అని లాఫార్జ్ తో మార్క్స్ చెప్పాడు. అంతగా ఆయన సిద్ధాంతాన్ని వక్రీకరించారన్నమాట.
వీళ్లందరూ మార్క్సు సమకాలికులు. వీళ్లలో వాగ్నర్, బాం బావర్క్ ఇద్దరూ మార్క్సుకి వ్యతిరేకులు. మిగిలిన వాళ్లు మార్క్సిస్టులమని చెప్పుకున్న వాళ్లు.

**********
మార్క్స్ వ్యతిరేకి వాగ్నర్ ఉపయోగపు విలువని తప్పించాడని మార్క్స్ ను విమర్శిస్తే, మార్క్సిస్టులైన  మీక్, డాబ్స్వీజీ ప్రభృతులు, మార్క్స్ అలా చేశాడనుకుని, అలా చెయ్యడం సరయిందేనన్నారు. ఇది మార్క్సుమీద విమర్శ కాదు, సరయినదే అనుకున్నారు.
 ఉపయోగపు విలువ ..సహజ వస్తువుగా ప్రకృతి శాస్త్రానికి చెందిన వస్తువు; సామాజిక వస్తువుగా...రాజకీయ అర్ధశాస్త్రానికి చెందిన వస్తువు.... సరుకు ప్రాకృతిక అంశం. దాని ఉపయోగపు విలువ, రాజకీయ అర్ధశాస్త్రం బయటనే ఉంటుంది అన్నాడు హిల్ఫర్డింగ్. అది కొంతకాలం చలామణీ అయింది. అయితే ఆ అవగాహన తప్పు.
 1859 లో వెలువడిన మార్క్స్ క్రిటిక్  లో ఉన్నది ఇలా: ఉపయోగపు విలువగా ఉండడం సరుక్కి ముందుషరతు, కాని అది సరుకా కాదా అనేది ఉపయోగపు విలువకి నిమిత్తం లేదు. దానికదిగా ఉపయోగపు విలువ, నిర్ణాయక ఆర్ధిక రూపానికి స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి, అది రాజకీయ అర్థశాస్త్ర పరిశోధనకి ఆవల ఉంటుంది. దానికదే నిర్ణాయక రూపం అయినప్పుడు ఈ పరిధిలోకి వస్తుంది.
ఇందులో చివరి వాక్యాన్ని పట్టించుకోకపోవడమే గందరగోళానికి కారణం.
అదనపువిలువ ఉత్పత్తిలో శ్రమశక్తి ఉపయోగపు విలువది నిర్ణాయక రూపం. కనక అది అర్థశాస్త్ర పరిధిలోకి వస్తుంది.
వాగ్నర్ మీద రాసిన నోట్స్ బయటకొచ్చాక మార్క్సిస్టులు ఉపయోగపు విలువకున్న ప్రాధాన్యతని తెలుసుకున్నారు. మార్క్సే స్వయంగా చెప్పాడని తెలిశాక పాత ఆలోచనలు ఉన్నవాళ్లు గాడిన పడ్డారు.
అయితే మార్క్సిస్టులందరూ ఆయన అదనపు విలువ సిద్ధాంతాన్ని యథాతథంగా అంగీకరించారు. అదనపువిలువని రాబట్టిన తీరుని తలదాల్చారు. మార్క్సిస్టులు ఎవ్వరూ దీనితో విభేదించలేదు. రంగనాయకమ్మగారు ఒక్కరే మినహాయింపు.
*********
1867 లో కాపిటల్ అచ్చయ్యాక, పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు ఆయన సిద్ధాంతం వివరణల్లో వైరుధ్యాలేమైనా దొరుకుతాయేమోనని ఆయన రచనల్ని ఉత్తరాలతో సహా గాలించారు. దొరకలేదు. మార్క్సిస్టునని చెప్పుకునే రంగనాయకమ్మ గారు మాత్రం సులువుగా ఇది వైరుధ్యం కాదా అని ప్రశ్నించారు.
కార్మికుడు పెట్టుబడిదారుడికి ఎక్కువ విలువ ఇస్తే పెట్టుబడిదారుడు కార్మికుడికి తక్కువ విలువ ఇస్తాడు కదా? వాళ్ళమధ్య మారకం ఎప్పుడూ ఇలా అసమానంగానే జరుగుతూ ఉంటుంది కదా? 'మారకం అనేది సమాన విలువల మధ్యనే జరుగుతుంది 'అనే విలువసూత్రం ప్రకారం, ఇది వైరుధ్యం కాదా? అని ప్రశ్నించి అవును, ఇది తప్పనిసరిగా వైరుధ్యమే అన్నారు. (కొత్త పరిచయం-1-పే.226)
మార్క్స్ ప్రకారం: మారకం జరిగేది కార్మికుడి శ్రమశక్తికీ, పెట్టుబడిదారుడి డబ్బుకీ. అది సమాన విలువల మారకమే. శ్రమశక్తిని అమ్మాక దాని ఉపయోగపువిలువ కొన్నవాడిదే. ఎంత శ్రమజరిగినా అంతా పెట్టుబడిదారుడిదే.
అయితే తయారైన సరుకుల్లో చేరిన విలువ మొత్తం కార్మికునికే రావాలి అనే వాదన వుంది. అదంతా వాళ్లదే. కాని అలా రావడం లేదు. కొంత యజమానికి చేరుతున్నది. కనక అది అసమాన మారకం. ఇది రికార్డియన్ సోషలిష్టుల వాదం. రికార్డియన్ సోషలిష్టులు కార్మికుడు తన ఉత్పాదితం మొత్తానికీ హక్కుదారుడు అని వాదించారు. జాన్ ఫ్రాన్సిస్ బ్రే అసమాన మారకాల మోస విధానం చట్టబద్ధ బందిపోటు అని దుయ్య బట్టాడు. చార్లెస్ హాల్స్ శ్రమ ఉత్పత్తి మొత్తం మీద హక్కు సహజ మానవ హక్కు అనీ, భగవంతుని ఆజ్ఞ అనీ చెప్పాడు. జాన్ గ్రే ఈ విధానపు పునాది అన్యాయం అని నిరసించాడు.
రికార్డియన్ సోషలిష్టులు 1820, 1830 దశకాల్లో కృషి చేశారు. దోపిడీ సిద్ధాంతానికి అసమాన మారకాన్నే పునాది ఛేశారు. ఇది పెట్టుబడిదారీ విధానం పరిధిలోనే దోపిడీని నిర్మూలించే అవకాశం ఉంది అనే అభిప్రాయానికి అవకాశమిస్తుంది. మార్క్సు దీన్ని తీవ్రంగా ఖండించాడు. మార్క్స్ తన అర్థశాస్త్రానికి ఎప్పుడూ నైతిక విషయాల్ని ఆధారం చేసుకోలేదు.
రికార్డియన్ సోషలిస్టులు సామాజిక సామరస్యం నెలకొనడానికి సరసమైన, సమానమైన మారకం సరిపోతుంది అని నమ్మారు. ఇది బూర్జువా భ్రాంతి/భ్రమ అన్నాడు మార్క్స్. మార్క్స్ ఖండించిన దాన్ని సరైనదని రంగనాయకమ్మ గారు భావిస్తున్నారు. ఇది వైరుధ్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది అంతకుముందే రికార్డియన్ సోషలిష్టులు చెప్పిందే.
రంగనాయకమ్మ గారు అంతటితో ఆగలేదు. మరికొంత ముందుకుపోయి పెట్టుబడిదారుడికీ కార్మికుడికీ అసలు మారకమే లేదు అన్నారు. 
కార్మికుడు పెట్టుబడిదారుడికి ఇచ్చేది తన శ్రమని. దానికి బదులుగా పెట్టుబడిదారుడు కార్మికుడికి ఇచ్చే సరుకు ఏదీ వుండదు. కార్మికుడు ఇచ్చే శ్రమలోనించే కొంతభాగాన్ని తీసి, దానికి జీతం అనే పేరుబెట్టి, దాన్ని కార్మికునికి ఇస్తాడు. మిగిలిన శ్రమనంతా పెట్టుబడిదారుడు తీసుకుంటాడు. పెట్టుబడిదారుడు జీతం పేరుతో ఇచ్చేది, పెట్టుబడిదారుడి శ్రమకాదు. వాడు కార్మికుడి నించి తీసుకోవడమే గాని కార్మికుడికి ఇచ్చేదేమీ లేదు. అంటే, పెట్టుబడిదారుడు కార్మికుడి శ్రమని దోచడమే గాని ఆ ఇద్దరి మధ్యా మారకం అనేది వుండదు. (కొత్తపరిచయం, పే. 248)
ఇద్దరి మధ్యా అసలు మారకమే ఉండదు. జరిగేది కార్మికుడి శ్రమలో కొంతభాగాన్ని పెట్టుబడిదారుడు లాగడమే.
సరే. మిగతాభాగం ఏమవుతుంది? కార్మికునికి పోతుందికదా! అది మారకమే. సొంత డబ్బుల్లోనించి ఇచ్చాడా లేక ఆ తర్వాత తన సరుకులు అమ్మగా వచ్చిన డబ్బుతో ఇచ్చాడా అన్నది మారకానికి సంబంధంలేని విషయం. మారకం జరిగినట్లే అని మార్క్స్ చెప్పాడు.
పెట్టుబడిదారుడు యీవేతనం చెల్లించేది అతనికి బట్టనుండి వచ్చే డబ్బుతో కాదు, అతనివద్ద అప్పటికే వుండిన డబ్బుతో. నేతకార్మికునికి అతని యజమాని సరఫరా చేసిన మగ్గమూ, నూలూ యెలా ఆ కార్మికునివి కాదో, అలాగే శ్రమశక్తి అనే తనసరుకుకు సాటాగా ఆ కార్మికుడు పొందే సరుకులు కూడా అతని ఉత్పాదితం కాదు. యజమానికి తన బట్టకు కొనుగోలుదారుడే దొరికివుండక పోవచ్చు. దాని అమ్మకం ద్వారా అతనికి వేతనం డబ్బులు కూడా వచ్చివుండక పోవచ్చు. నేతకార్మికుని వేతనంతో పోలిస్తే అతను దానిని చాలా లాభదాయకంగా అమ్ముకోవచ్చు. అవన్నీ నేతకార్మికునికి సంబంధం లేదు. పెట్టుబడిదారుడు తనదగ్గరున్న ధనంలో - తన పెట్టుబడిలో – కొంత భాగంతో నేత కార్మికుని శ్రమశక్తిని కొంటాడు. (వేతనశ్రమా, పెట్టుబడీ- సం.ర.-1 పే 95)
పెట్టుబడికీ, శ్రమకీ మొదటి మారకం పద్ధతి ప్రకారం జరిగే ప్రక్రియ. ఇక్కడ డబ్బు పెట్టుబడిగానూ, శ్రమశక్తి సరుకుగానూ ఉంటాయి... చట్టరీత్యా శ్రమశక్తి అమ్మకం ఈ మొదటి ప్రక్రియలో జరుగుతుంది - శ్రమ జరిగిన తర్వాతే రోజు చివరో, వారం చివరో మరొకప్పుడో చెల్లించినప్పటికీ. ఇది శ్రమశక్తి అమ్మబడిన లావాదేవీని ఏవిధంగానూ మార్చదు. (అదనపు విలువ సిద్ధాంతాలు- భాగం1- పే.397) 
ఏమయినప్పటికీ డబ్బు కొనుగోలు సాధనంగా వ్యవహరిస్తుందా, చెల్లింపు సాధనంగా వ్యవహరిస్తుందా అన్నది సరుకుల మార్పిడి స్వభావాన్ని మార్చదు. ఒప్పందంలో శ్రమశక్తి ధర నిర్ణయమవుతుంది. అయితే ఇంటి అద్దె లాగానే, అది కొంతకాలం తర్వాతనే చేతికి వస్తుంది. శ్రమశక్తి విక్రయం జరిగింది. అయితే కొంత కాలం తర్వాత మాత్రమే అది చెల్లించబడుతుంది. విషయం స్పష్టంగా అర్థం గావడానికి గాను ప్రతి అమ్మకంలోనూ శ్రమశక్తి కలవాడు దానికి నిర్ణయించిన ధరను వెంటనే పుచ్చుకోగలుగుతున్నాడని కాసేపు భావిద్దాం. (Cap1-p 171)
సార్వత్రిక సమానకం అయిన డబ్బు ఇస్తాడు. అయితే రంగనాయకమ్మ గారు ఆడబ్బు అతనికెలా వచ్చింది, అదికూడా కార్మికులదే కాబట్టి మారకమే లేదు అంటున్నారు. అయితే ఆడబ్బు అతనికి ఎక్కడిది అనే దానితో మారకానికి సంబంధం ఉండనే ఉండదు.
2013 జూలై వీక్షణంలో రంగనాయకమ్మ గారు పెట్టుబడిదారుడికీ, కార్మిక నాయకుడికీ ఒక ఊహా సంభాషణ సృష్టించారు. శ్రమశక్తిని డబ్బు పెట్టి కొంటున్నానని పెట్టుబడిదారుడు అన్నప్పుడు, "నీడబ్బుపెట్టా? డబ్బు నీదా? ఏ శ్రమచేసి డబ్బు సంపాదిస్తున్నావు? నా శ్రమను అమ్మి, నాడబ్బులోనించి ఒక్క పైసా నాకు పడేస్తావు. మిగతా డబ్బు రాశి నీ పరం" అంటాడు కార్మికుడు. పరిచయంలో "ఆ డబ్బు కార్మికులదే, పెట్టుబడిదారుడిది కాదు" అంటాడు కార్మికుడు. "జీతం కార్మికుడి శ్రమలోది తీసి కార్మికుడికి ఇచ్చేదే"
ఈ వాదనను మార్క్స్ ఒప్పుకోలేదు. పెట్టుబడిదారు తన దగ్గరున్న డబ్బునుంచి ఇస్తాడని అన్నాడు. ఆ డబ్బు అతనికి ఎక్కడిది, కార్మికుల శ్రమ నించి వచ్చిందే కదా అని రంగనాయకమ్మ గారి ప్రశ్న. అయితే పెట్టుబడిదారీ విధానం కొనసాగినంతకాలం అదనపు విలువ పెట్టుబడిదారుడిదే. కనక ఆ డబ్బు చట్టరీత్యా కూడ అతనిదే. ఇది నైతిక వ్యవహారం కాదు.
డబ్బూ సరుకూ చేతులు మారాయంటే అది మారకమే. ఆ డబ్బు ఎలా వచ్చిందీ, ఆ సరుకు ఎవరు చేసిందీ అనే విషయాలతో మారకచర్యకి సంబంధం ఉండదు. మారకంలో పాల్గొన్నవాళ్లు సమానులా కాదా అనేదానితో నిమిత్తం ఉండదు. మారినవి రెండు సరుకులయినా ఒకటే, డబ్బూ సరుకూ అయినా ఒకటే.
శ్రమశక్తి విలువని నేను చెల్లించేస్తున్నాను కదా, ఇంకా తప్పేమిటి? అంటున్నాడే పెట్టుబడిదారుడు? ఆ శ్రమశక్తి విలువ ఎవరు నిర్ణయించింది? వాడు నిర్ణయించిందే!...దోపిడీదారుడి నియమం ప్రకారం మనిషి (శ్రమచేసే మనిషి) అర్ధాకలితో మాడాలి. శ్రామికుడి అవసరాల్ని ఇంత కనీస స్థాయిలో నిర్ణయించి, కనీస విలువనే యిచ్చి శ్రమశక్తి విలువని ఇచ్చేస్తున్నానే! అంటున్నాడు పెట్టుబడిదారుడు. (పాత పరిచయం-2- 266-67)
శ్రమశక్తి విలువని నిర్ణయించేది పెట్టుబడిదారుడొక్కడే కాదు. కార్మికుడు కూడా. అది ఒప్పందం. ఇరువురూ ఒప్పుకుంటేనే కుదురుతుంది. సంప్రతింపులుంటాయి. వేతనాల మార్పుకి బాగా అవకాశం వుందని మార్క్స్ విశ్వసించాడు. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవటం కార్మికసంఘాల  బాధ్యతగా భావించాడు. వాస్తవానికి వేతనం సరఫరా, గిరాకీలను బట్టీ, కార్మికులు వేతనపెంపు కోసం చేసే పోరాటాల పటిమను బట్టీ వుంటుంది. అంతేగాని పెట్టుబడిదారుడొక్కడే తన యిష్టానుసారం  కనీసావసరాల విలువే శ్రమశక్తి విలువ అంటే సాగదు.

వీక్షణం వ్యాసంలో కొత్త విషయం ఏమంటే: శ్రమ శక్తి సరుకు కాదు అనేది.
శ్రమశక్తి సరుకు అనీ, దాన్ని శ్రామికుడు అమ్ముతాడనీ, పెట్టుబడిదారుడు కొంటాడనీ ఈరకంగా చెప్పడం వల్ల, శ్రమదోపిడీ జరుగుతోందనే వాదం బలహీనపడిపోదా? అని ప్రశ్నించారు రంగనాయకమ్మ గారు.
శ్రమ దోపిడిని నిజమైన విషయంగా చూపించాలంటే శ్రమశక్తిని పెట్టుబడిదారుడు కొంటాడు అనే వాదం తప్పనీ, దాన్ని వదులుకోవాలనీ నావాదం అంటూ సరిపుచ్చారు.
దోపిడీ రుజువు కావాలంటే, పెట్టుబడికీ, శ్రమశక్తికి మారకం లేదని చెప్పాలి. అంతకు ముందూ చెప్పారు. అయితే కారణం ఆ డబ్బు అతనిది కాదు. అతని శ్రమతో వచ్చింది కాదు. కార్మికులది. వాళ్లదే వాళ్లకి ఇస్తున్నాడు కనక మారకమే లేదు. ఇది నాటి వాదన. నేటి వాదన ప్రకారం శ్రమశక్తి సరుకు కాదు. సరుకు కానిది మారకం కాజాలదు. అందువల్ల మారకం లేదు.
శ్రామికుడికీ పెట్టుబడిదారుడికీ మధ్య నిజంగా జరిగే విషయాలు అమ్మడాలూ - కొనడాలూ కాదు అని తేల్చారు.
అయితే మార్క్స్ చెప్పింది ఇది: ఈ మొదటి మారకం లేకపోతే పెట్టుబడిదారీ ఉత్పత్తి ఉండదు. శ్రమ సరుకు కావడంతోనే, పెట్టుబడిదారీ విధానం మొదలయింది.
పెట్టుబడిదారుడికి దక్కే అదనపువిలువ, సరిగ్గా శ్రామికుడు తన శ్రమశక్తిని సరుకుగా అతనికి అమ్మాడు అనే వాస్తవం నించి ఏర్పడుతుంది (అదనపు విలువ సిద్ధాంతాలు-1-పే 315)
శ్రమశక్తి సరుకు కాదనీ, మారకం లేదనీ అంటే, మార్క్స్ వివరణని బట్టి అసలు పెట్టుబడిదారీ విధానం రానట్లే, లేనట్లే.
పెట్టుబడిదారుడు శ్రమశక్తిని కొంటాడనీ, శ్రమశక్తి ఇచ్చే ఉపయోగపువిలువ అతనిదే అనీ, ఒకవేపు వాదిస్తూ; ఆ శ్రమశక్తి ద్వారా అదనపువిలువని తీసుకోవడం శ్రమదోపిడీ అవుతోందని ఇంకోవేపు వాదిస్తే ఆ రెంటికీ ఎలా పొసుగుతుంది?అని రంగనాయకమ్మ గారు ప్రశ్నించారు. (వీక్షణం జూన్2013 పే. 56)
ఎలా పొసుగుతుందో మార్క్స్ పెట్టుబడి లో వివరించాడు. అయితే ఆ వాదన తప్పంటున్నారు వీరు.
పెట్టుబడిదారుడు దోచడమే నిజం కాబట్టి, ఆవాదాన్నే సరైనదిగా భావించి దాన్నే నిలబెట్టాలి. 'శ్రమశక్తి ఇచ్చే ఉపయోగపు విలువ, పెట్టుబడిదారుడిదే' అనే వాదానికి దారితీసే శ్రమశక్తిని అమ్మడం-కొనడం అనే భావాల్ని మాత్రం వదలి వెయ్యాలి. అప్పుడే సమస్య తీరుతుంది. (వీక్షణం జూన్2013 పే. 57)
కాని, శ్రమశక్తి ఎలాంటిదంటే, అది తన విలువ కన్నా ఎక్కువ విలువగల పని చెయ్యగలదు" అని అదే వ్యాసంలో అనడంలో రంగనాయకమ్మ గారు కూడ శ్రమశక్తిని  సరుకుగా చూస్తున్నారు. దానికి విలువా, ఉపయోగపు విలువా వున్నాయంటున్నారు. నేను అమ్మేదీ, నువ్వుకొనేదీ, నా శ్రమశక్తి వరకే. నేను నా మొత్తం శ్రమనంతా నీకు అమ్మడం లేదు" అనడంలోనూ శ్రమశక్తిని అమ్మేది అది సరుకైనప్పుడే గదా.
శ్రమ శక్తి అనేది సరుకు కాదు అని రంగనాయకమ్మ గారి కార్మిక నాయకుడు ఒప్పుకుంటాడు. అంతేగాదు మార్క్స్ పొరపాటు పెట్టుబడిదారుడి వాదనకి ఉపయోగపడిందని చెబుతాడు.
నీ వల్ల జరిగేది శ్రమదోపిడీ కాదని నువ్వు వాదించడానికి నా పొరపాటు నీకు ఎంత సాయపడిందో, నీకు ఎంత ధైర్యం ఇచ్చిందో నాకు ఇప్పుడు తెలుస్తున్నది. శ్రమదోపిడేయే లేదని దోపిడీదారుడు విర్రవీగుతుంటే, నోరెత్తలేని స్థితిలో శ్రామికుడు పడిపోయాడంటే కారణం నా గురువు పొరపాటే అంటాడు. ఇది చిన్నపొరపాటు అని సర్దుబాటు చేస్తాడు. తప్పకుండా మార్చుకుంటాడని హామీ ఇస్తాడు. ఆ పొరపాటు వల్ల మార్క్స్ దోపిడీని నిరూపించలేకపోయాడు. అనుకున్నదానికి సరిగ్గా వ్యతిరేకమైన దాన్ని రుజువు చేశాడు. అందుకు కారణం శ్రమశక్తిని సరుకు అనడమూ, శ్రామికుడికీ పెట్టుబడిదారుడికీ మారకం ఉందనడమూ అని రంగనాయకమ్మ గారి వాదం.
కాని మార్క్స్ సమాన విలువల మారక నియమానికి అనుగుణంగా దోపిడీని నిరూపించగలిగింది శ్రమశక్తిని సరుకు అనడం ద్వారానే. శ్రమ సరుకు కాదు అని చెప్పడం ద్వారానే. కనక ఇది చిన్న పొరపాటు కాదు. మార్క్స్ చేసింది కాదు. ఈ కార్మికనాయకుడే మార్క్సిజం తప్పు అని నిరూపించే కీలక దోషానికి పాల్పడుతున్నాడు. దోపిడీ లేదని పెట్టుబడి వాదించినప్పుడు కార్మికుడు నోరెత్తలేని పరిస్థితిలో పడడానికి కారణం శ్రమశక్తి సరుకు అనడమట!
ఒక సైన్సుని నేర్చుకునేచోట చిన్నపొరపాటు అయినా పొరపాటే అని రంగనాయకమ్మ గారే హెచ్చరించారు. (పాత పరిచయం-1 పే. 14)

దోపిడీని గ్రహించడానికీ, దోపిడీని నిర్మూలించే నూతన సమాజాన్ని నిర్మించడానికీ, మార్క్స్ ఇచ్చిన సిద్ధాంతమే మార్క్సిజం (పాత పరిచయం-1 పే. 4) సరిగా అక్కడే మార్క్స్ పొరపాటు చేశాడంటూ, దోపిడీని గ్రహించడానికి ఆయనే సిద్ధాంతాన్ని సమకూర్చాడనడాన్ని ఏమనాలి?

మొత్తం మీద మార్క్స్ అదనపు విలువని వివరించడానికి తీసుకున్న అధారమే తప్పని తేల్చారు. మార్క్స్ సిద్ధాంతానికి పునాది తప్పని మార్క్స్ శిష్యుడైన కార్మికుని చేతనే అనిపించారు. మరి ఆధారం తప్పయితే, మార్క్స్ నిర్ధారణ తప్పన్నట్లే. అదనపు విలువ సిద్ధాంతం తప్పు అన్నట్లే.
శ్రమ సృజించిన విలువ అంతా పెట్టుబడిదారీ విధానం నియమాల ప్రకారం శ్రామికులకు రాదు. అంతేకాదు నూతన సమాజంలో కూడ కార్మికులు పూర్తి శ్రమ విలువని పొందుతారనే వాదనను  మార్క్స్ తిరస్కరించాడు. మొత్తం శ్రమ వుత్పాదితంలో చాలా మినహాయింపులుంటాయి అని స్పష్టంగా గోథా కార్యక్రమ విమర్శలో కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు. ఆదిమ సమాజంలోకూడా సమాజ వుత్పత్తిని వుమ్మడిగా వాడుకున్నారే తప్ప ఎవరు చేసినవి వాళ్లవి కావు.
మార్క్స్ పొరపాటు బయటపెట్టడమే లక్ష్యంగా వ్యాసమంతా రాసి, చివరలో సంబంధంలేకుండా ఒక వాక్యం! మార్క్సు మూలసూత్రాన్ని మూలకునెట్టి, మార్క్సుని తప్పుబట్టి, మార్క్స్ శిష్యులు గురువునించి ఏమి నేర్చుకుని ఉంటారో ఊహించలేక నన్ను పిలిచావు. నీ ఎత్తుగడలు ఎక్కడయినా చేసుకో, మార్క్స్ శిష్యుల మీద కాదు. అక్కడ సాగవు  అనడం. వారే తప్పుబట్టి మార్క్సునించి అంతా నేర్చామనడం. ఒకపక్క తప్పంటూనే, మరొక పక్క శిష్యులం అనడం.  గురువుని మించిన  శిష్యులా, ముంచిన శిష్యులా?

ఆయన వివరించి చెబితేనే శ్రమదోపీడీ రహస్యం, సమాజానికి తెలిసింది అన్నారు. మళ్ళీమార్క్సు చెప్పింది తప్పని తేల్చారు. శ్రమశక్తి సరుకు కాదు. పెట్టుబడికీ శ్రమకీ మారకం లేదు. అదీ మిధ్య ఇదీ మిధ్య అయితే, మధ్యలో దోపీడి ఏమిటి? పెట్టుబడికీ శ్రమశక్తికీ మారకం జరిగితేనే ఉత్పత్తి మొదలవుతుంది. అప్పుడు అదనపు ఉత్పాదితం పెట్టుబడిదారుడికి చిక్కుతుంది. ఈ మారకం మిధ్య అయితే అదనపు ఉత్పత్తీ మిధ్యే, అదనపు విలువా మిధ్యే. అయితే దోపిడీ శాస్త్రపరంగా ఎలా వివరించాలో వారికే ఎరుక!  వారు ఏమి చెప్పినా అది మార్క్సుది కాదు. మరొకరిది. మార్క్సిజం కాదు, మరొకరిజం.
కాపిటల్ పరిచయం ముందుమాటలో ఇది ఒరిజినల్ నించి ఎక్కడా భిన్నమైనది కాదు అని చెప్పుకున్నారు. మార్క్స్ రాసిన దానికి భిన్నమైనవి చెప్పటమే కాక, మూలాధారమైన అదనపు విలువ వివరణనే తప్పుపట్టారు. వారన్నట్లు మార్క్స్ ఇచ్చిన సిద్ధాంతమే మార్క్సిజం అయితే  రంగనాయకమ్మగారిది మార్క్సిజం కాదు. మరొకరిజం.  అదే మార్క్సిజం అయితే నాకు తెలిసిందల్లా నేను మార్క్సిస్టును కాను అన్న మార్క్స్ మాటల్ని గుర్తుచేసుకోవలసి వస్తుంది.

1 కామెంట్‌:

  1. రంగనాయకమ్మ గారి విషయంలొ మీరన్న దాంట్లొ ఒక విషయంలొ ఏకీభావం లేదు రంగనాయకమ్మ గారనట్టు పెట్టుబడిదారుడికీ కార్మికుడికీ మారకం లేదనేది సార్వత్రికంగా సరైనదే ఆవిషయంలొ మార్క్స్ కుడా విశాలాంద్ర వారి అనువాదంలొ పెట్టుబడి విస్తరణ చాప్టరులొ వివరించాడు "అసలు వాస్తవాన్ని అమ్మడాలూ కొనడాలూ మరుగుపరుస్తాయని చెప్తాడు. అక్కడ వున్నవాటిని యదాతధంగా ఇవ్వలేకపొతున్నాను వీలైతే మీరు చుడండి .ఇక మార్క్స్ శ్రమశక్తి గురించి తప్పుచెప్పాడంట్టూ ఆమె చెప్తున్న దాంతొ నాకూ విభేదం వుంది.

    రిప్లయితొలగించండి