21, ఫిబ్రవరి 2017, మంగళవారం

2.మారకం విలువా- విలువా

2.మారకం విలువా- విలువా
"మన పరిశోధన సరుకు విశ్లేషణతోనే మొదలుకావాలి" అంటూ మార్క్స్ సరుకుని నిశితంగా పరిశీలిస్తాడు. సరుకు ఉపయోగపువిలువా మారకం విలువా- ఈరెంటి సమ్మేళనం. కనక ముందుగా ఉపయోగపువిలువని గురించి వివరంగా చెబుతాడు. ఆతర్వాత మారకపు విలువని విశ్లేషిస్తాడు.తద్వారా మారకపు విలువ నించి విలువకు చేరుకుంటాడు. ఎలాగో చూద్దాం.
**************
బూర్జువా సమాజంలో సరుకు అనేది  ఆర్ధిక కణరూపం. సరుకు విశ్లేషణ ద్వారా తన అర్ధశాస్త్రానికి సంబంధించినముఖ్యమైన  అన్ని భావాభివర్గాల్ని(categories) క్రమంగా అభివృద్ది చేస్తాడు. మొదటగా సరుకు ఒక ప్రయోజనకర వస్తువు.ఉపయోగపువిలువ. మనం వాడుకునే వస్తువులన్నీ ఉపయోగపువిలువలే. కాని అన్నివస్తువులు సరుకులు కావు. అమ్మేవీ , కొనేవీ మాత్రమే  సరుకులు. అయితే, అమ్మడాలు కొనడాలు లేని కాలమే చరిత్రలో ఎంతో దీర్ఘమయినది. ఆకాలమంతా వస్తువులకు మారకపు విలువ(విలువరూపం) లేదు.సరుకులు తెలియవు. సరుకులు చరిత్రలో ఒకానొక కాలంలో ఏర్పడ్డాయి. ఉపయోగపు విలువలు సరుకులు లేనప్పుడు కూడా ఉన్నాయి.
కనక ఉపయోగపువిలువ సరుకురూపాన్ని వివరించడానికి ఎంతమాత్రమూ ఉపకరించదు. దీన్నిబట్టి సరుకుకి ఉపయోగపు విలువతో పాటు అదనంగా మరొకలక్షణం- సరుకురూపాన్ని వివరించగల విశిష్ట లక్షణం- ఉండాలి. ఆలక్షణాన్నిమార్క్స్   మారకం విలువ లేక విలువరూపం అంటాడు .అంటే సరుకుకి ఉపయోగపువిలువ రూపంతో పాటు విలువ రూపం కూడా ఉంటుంది. అలా మార్క్స్ మారకం విలువ లేక  విలువ రూపం  అనే  భావాభివర్గానికి చేరతాడు.
విలువ రూపం  
"ఈరూపాలు రెండూ ఉన్నమేరకే అవి సరుకులుగా వ్యక్తమవుతాయి"-కాపిటల్1.54.  అంటే సరుకు ద్వంద్వ రూపి. ఉపయోగపువిలువ రూపం అంటే సరుకు భౌతికరూపమే ,శరీర రూపమే.ఏవస్తువుకైనా భౌతిక రూపం ఉంటుంది.అది కేవలం ఉపయోగపువిలువే అయినా, సరుకయినా. అయితే, సరుకైన వస్తువుకి మాత్రం, భౌతిక రూపానికి తోడు విలువరూపం కూడా ఉంటుంది. కేవలం ఉపయోగపు విలువే అయిన వస్తువుకి ఈ విలువరూపం ఉండదు.
విలువరూపం అన్నా  మారకం విలువ అన్నా ఒకటే.
"సరుకు ఉపయోగపు విలువా...విలువా కూడా. అది ఈ ద్విముఖ వస్తువుగా ఎప్పుడు వ్యక్తం చేసుకుంటుందంటే, దానివిలువ స్వతంత్రరూపం తీసుకున్నప్పుడు. "విడిగా వున్నప్పుడు ఆరూపం తీసుకోదు. మరొకరకం సరుకుతో విలువ లేక మారక సంబంధంలో పెట్టినప్పుడు మాత్రమే ఈరూపం తీసుకుంటుంది."- కాపిటల్1.66
ఒక బస్తా సిమెంటు విడిగా ఉంటే దానికి విలువరూపం ఉండదు.దాని విలువ స్వతంత్ర రూపం తీసుకోదు. దాన్ని 10  ఇనప చువ్వలతో మారక సంబంధంలో పెట్టగానే, దాని విలువ స్వతంత్ర రూపం తీసుకుంటుంది.అప్పుడు సిమెంట్ బస్తా ద్విముఖవస్తువుగా, సరుకుగా వ్యక్తమవుతుంది.
అంటే, సరుకుకి సహజ, భౌతిక రూపంతో పాటు విలువ రూపం కూడా ఉంటుంది.
పెట్టుబడి తొలి చాప్టర్లో ఆయన వివరించదల్చుకున్నది దీన్నే. ఆయన మాటల్లోనే:" సరుకు యొక్క విలువరూపాన్ని, లేక శ్రమ ఉత్పాదితం యొక్క సరుకు రూపాన్ని."-ఎంగెల్స్ కి మార్క్స్ ఉత్తరం 27, జూన్ 1867
విలువ రూపం  విశ్లేషణ
1)"మొదట మారకం విలువ పరిమాణాత్మక సంబంధంగా, ఒకరకం సరుకులు మరొక రకం సరుకులతో మారే నిష్పత్తిగా, బయటపడుతుంది."- కాపిటల్1.44  మారకపు విలువ కేవలం పరిమాణాత్మక నిష్పత్తే అని ఎవరు అన్నారో ఫుట్ నోట్ లో చెబుతాడు:"ఒక వస్తువుకీ, మరొకవస్తువుకీ మధ్య ఒక వస్తువు ఫలానింత పరిమాణానికీ, మరొకవస్తువు ఫలానింత పరిమాణానికీ మారక నిష్పత్తే విలువ "-లె ట్రాస్నె. కాపిటల్1(పెంగ్విన్).127.
ఈనిష్పత్తినే లె ట్రాస్నె విలువ అన్నాడు.
20 గజాలబట్ట ఒక కోటుతో మారితే, మారక నిష్పత్తి 20:1
20 గజాలబట్ట = 1 కోటు  అనే సమీకరణ దీన్ని తెలుపుతుంది. బట్టా కోటూ ఏపరిమాణాల్లో సమానమవుతాయో తెలుపుతుంది. అంటే, మారకం విలువ పరిమాణాత్మక సంబంధంగా మొదట కనిపిస్తుంది.
ఒక సోఫా 5 కుర్చీలతో మారితే మారకనిష్పత్తి 1:5
1 సోఫా=5 కుర్చీలు   అనే సమీకరణ దీన్ని తెలుపుతుంది. సోఫా, కుర్చీలు ఏపరిమాణాల్లో సమానమవుతాయో తెలుపుతుంది. ఒకరకం సరుకులు మరొక రకం సరుకులతో మారే నిష్పత్తిగా, బయటపడుతుంది.
అయితే, మారకమయ్యే పాళ్ళు  స్థిరంగా  ఉండవు. స్థలాన్ని బట్టీ, కాలాన్ని బట్టీ మారుతుంటాయి.
ఒకప్పుడు ఒక అరేబియా తెగ, ఒక పౌను ఇముముకి 10 పౌన్ల బంగారం ఇచ్చినట్లు, ఒక పౌను వెండికి 2 పౌన్ల బంగారం ఇచ్చినట్లు శ్ట్రాబో చెప్పాడు"-క్రిటిక్ 156.                                                                                                                                                      పౌను ఇముము = 10 పౌన్ల బంగారం
పౌను వెండి = 2 పౌన్ల బంగారం
ఇండియాలో వైదిక కాలంలో సరికి సరి మారేవి-రుగ్వేదార్యులు
పౌను వెండి = పౌను బంగారం
1865 ప్రాంతంలో బంగారం,వెండి మారిన నిష్పత్తి 15:1; 1890 లో 22:1;ఇవ్వాళ 70:1 ఉంటుంది.
అల్యూమినియమైతే మరి ఆశ్చర్యం కలిగిస్తుంది.మూడో నెపోలియన్ కాలంలో  (1848-1870)అల్యూమినియం వెండి బంగారాలకన్నా విలువయింది. ఎంత విలువైందంటే: "ఆయన (నెపోలియన్)అత్యంత గౌరవనీయులైన అతిధులకు అల్యూమినియం స్పూన్లూ, ఫోర్కులూ ఇచ్చి, అంతకన్నా తక్కువ ముఖ్యులైనవారికి వెండివీ బంగారానివీ ఇచ్చేవాడు"-World book of encyclopaedia vol1.p340
మూడవ నెపోలియన్ రాజులకు ఇచ్చిన విందులో, పరివారానికి బంగారం వెండి పళ్ళాల్లో పెట్టి, రాజులకి అల్యుమినియం పళ్ళెంలో పెట్టెవాడు.అంటే అల్యూమినియం అంత అప్పట్లో విలువైనది.
మరి ఈనాడో ఒక కిలో వెండికి  320  కిలోల అల్యుమినియం వస్తుంది. బంగారానికైతే చెప్పేదేముంది. 22,000 కిలోలకు పైగా వస్తుంది.
1850 లలో పౌను అల్యూమినియం 550 డాలర్లుండేది. 50 ఏళ్ళతర్వాత 25 సెంట్లకు పడిపోయింది.
మామూలుగా కిలో పొటాటోలకి 4కిలోల టొమాటోలొస్తాయి. అదే ఎండాకాలంలో ఒక్కొక్కప్పుడు కిలో టోమాటోలకు 4 కీలోల పోటాటోలొస్తాయి.ఇది అందరికీ అనుభవమే.
వైరుధ్యం
సరుకులు మారకం విలువకు నిలయాలు. అంటే, సరుకులో అంతర్గతంగా మారకం విలువic v ఉన్నదని అర్ధం..
మారకం విలువ రెండు సరుకుల సంబంధంగా బయటపడుతుంది. కనక మారకం విలువని ఒకే  సరుకుకి ఆపాదించడం కుదరదు. మరొక అర్ధంలో కూడా ఇది సాపేక్షం. మారక పరిస్థితుల్ని బట్టి – స్థల కాలాలను బట్టి-మారే పాళ్ళుఎప్పటికప్పుడు,ఎక్కడికక్కడ  మారుతుంటాయి. ఈ వాస్తవం అందరికి తెలిసిందే. అంటే, intrinsic value సరుకులో అంతర్గతంగా మారకం విలువic ఉండదని.
మారకం విలువని సరుకులో లంగరై ఉన్నదిగా, ఉపయోగపు విలువతో పాటు సరుకులోవున్న రెండవ ధర్మంగా మొదట ప్రవేశ పెట్టడం మన అవగాహనకు సరిపోయేదే. అంటే intrinsic సరుకులో అంతర్గతంగా మారకం విలువic v ఉన్నదని ఒకచోట ఉన్నదనీ , మరొకచోట లేదనీ  చెప్పడం తార్కిక వైరుధ్యం కదా!
ఇక్కడ వైరుధ్యం ఏమిటంటే : మారకం విలువ ఒకవైపు సరుకుల్లో అంతర్గమైనదని పిస్తుంది, మరొకవైపు సాపేక్షమూ, యాదృచ్చికమూ అయినట్లు అనిపిస్తుంది.ఇవి రెండు అభిప్రాయాలూ ఒకదానికొకటి పొసగవు.అది తార్కిక  వైరుధ్యం. మారకం విలువ అంతర్గతం అని ఎందుకు అనిపిస్తుందంటే, మారకం విలువ ఆసరుకుల్లో ఉన్నదాని వ్యక్తీకరణ గనుక. అది సాపేక్షం ఎందుకంటే, ఆ వ్యక్తీకరణ భిన్న సరుకుల  మధ్య సంబంధం రూపాన్ని తీసుకుంటుంది కనక.
అది వైరుధ్యం కాదు  
కాని జాగ్రత్తగా పరిశీలించి మార్క్స్ ఈ  అభిప్రాయాన్ని తిరస్కరిస్తాడు.ఎందుకంటే  ఏ సరుకు మారకం విలువనైనా నిర్దిష్ట పరిమాణాల్లో  ఇతర అన్నిసరుకుల రీత్యా వ్యక్తం చెయ్యవచ్చు . కనక అవన్నీ ఒకదాని చోటులో మరొకటి చేరగలవు. అంటే, అవన్నీఒకదానికొకటి  సమానం అని.
ఒక రకం సరుకు అన్ని ఇతర సరుకులతో మారకం అవుతాయి. అయితే పరిమాణాలు వేరువేరుగా ఉంటాయి.నిష్పత్తులు తేడాగా ఉంటాయి.
10 కిలోల గోధుమలు = 6 లీటర్ల పాలు
                         =30 పెట్టెల గుండుసూదులు
                        = 7 సబ్బులు
                          =6 కిలోల చక్కెర ఇలా
10 కిలోల గోధుమలకు అన్ని ఇతర సరుకులతో  మారకం కుదురుతుంది- భిన్న పరిమాణాల్లో.అంటే 10 కిలోల గోధుమల మారకం విలువ చెక్కుచెదరకుండా (ఏమార్పూలేకుండా)ఉంది -అది  6  లీటర్ల పాలలో వ్యక్తమయినా 30 పెట్టెల గుండు సూదుల్లో వ్యక్తమయినా, 7 సబ్బుల్లో వ్యక్తమయినా, 6 కిలోల చక్కెరలో వ్యక్తమయినా అది మారదు. చూడగానే మారకంవిలువ ఇలాటి పరిమాణాత్మక నిష్పత్తిగా కనిపిస్తుంది.
మారకపు విలువ ఒక సరుకుకి చెందినది కాదు. అది రెండు సరుకుల సంబంధం.
మారకపువిలువ సాపేక్షమైనదిగా కనిపిస్తుంది.
కనక మారకం విలువ ఏదో యాదృచ్చికమైనదైనట్లూ,సాపేక్షమైనదైనట్లూ అగపడుతుంది.
అందువల్ల సరుకులో అంతర్గతంగా ఉండే మారకం విలువ స్వయం వైరుధ్యం అనిపిస్తుంది.
ఒకేసరుకున్నప్పుడు మారకం విలువ బయటపడదు.
సరుకు మారకంవిలువకి, ఆసరుకు ఉఫయోగపు విలువ వాహకం అని చెప్పినప్పటికీ, మారకం విలువ ఒకేసరుకున్నప్పుడు బయటపడదు. అది రెండు సరుకుల సంబంధం.
"రెండన్నా లేకుంటే, మారకం విలువ ఉనికిలో ఉండదు"-నోట్స్ ఆన్ వాగ్నర్- మార్క్స్ ఎంగెల్స్ కలెక్టెడ్ వర్క్స్ 24పేజీ533.
ఒకేసరుకు ఉన్నప్పుడుమారక నిష్పత్తికి అవకాశం ఉండదు.
ఒక రజాయీ విలువ 1500 రూపాయలు అని ముద్ర వుండవచ్చు. ఇక్కడ రజాయీ ఒక సరుకయితే డబ్బు రెండో సరుకు. అది అటుపోనిదే ఇది ఇటు రాదు. కనక ఒక రజాయీ = 15 స్టీలు డబ్బాలు అన్నప్పుడు ఎలాగయితే రెండు రకాల సరుకులు ఉన్నాయో, రజాయీ = 1500 రూపాయిలు అన్నప్పుడు కూడా రెండు సరుకులు ఉన్నట్లే. రజాయీ విలువ డబ్బాల్లో తెలిసినట్లే, ఇక్కడ డబ్బులో తెలుస్తున్నది. అంతే, అంతకు మించి మరేమీ లేదు. అంటే, ఒక సరుకు విలువ మరొకసరుకులో (ద్వారా)తెలుస్తుంది.సాపేక్షంగా అన్నమాట.
మారకం విలువ తొలిచూపుకి మరొక విధంగా కూడా సాపేక్షం. మారకమయ్యే పాళ్ళు  మారక పరిస్థితుల్ని బట్టి పోతుంటాయి. స్థలాన్ని బట్టీ, కాలాన్ని బట్టీ భిన్నమైన నిష్పత్తుల్లో మారకం అవుతుంటాయి. ఇది అందరికీ తెలిసినదే. మారకం విలువ సరుకుల ఉపయోగపు విలువకు జంటగా సరుకులో లంగరై ఉన్న రెండో లక్షణమనీ తెలిసిన విషయమే. ఆవిధంగా మొదట మారకం విలువని పరిచయం చేశాడు. “ఉపయోగపువిలువలు మారకం విలువయొక్క భౌతిక నిలయాలు కూడా" అన్న మాటల్ని ఇక్కడ గుర్తుచేసుకోవాలి. అసలు ఈసెక్షన్ శీర్షిక 'సరుకు యొక్క రెండు అంశాలు: ఉపయోగపువిలువా మారకం విలువా '. అంటే ఇవిరెండూ సరుకుకుండే రెండులక్షణాలుగా చెప్పాడు.మారకం విలువ సరుకులో అంతర్గతంగా ఉన్నదయితే, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పరిస్థితుల్ని బట్టి మారే, నిలకడలేని సరుకులమధ్య సంబంధంగా వ్యక్తం కాకూడదు. కాని వాస్తవంలో పరిస్తితుల్ని బట్టి మారే సంబంధంగా వ్యక్తం అవుతున్నది.
"అందువల్ల మారకం విలువ ఏదో యాదృచ్చికమైనదీ, కేవలం సాపేక్షమైనదీ అయినట్లు, తత్ఫలితంగా సరుకుల్లో అంతర్గంతంగా ఉండే విలువ(intrinsic value) అనేది స్వయం వైరుధ్యం/ అయినట్లు గా అగుపిస్తుంది"- కాపిటల్ 1.44.
అక్కడే,( పైన చుక్కలు పెట్టినచోట) అంతర్గతంగా వుండే విలువ అంటే ఏమిటో చెబుతాడు:intrinsic value"అంటే సరుకుల లోపలేవుండి, ఆసరుకులనుండి విడదీయరాని సంబంధంలో వుండే మారకం విలువ."
విషయాన్ని మరింతదగ్గరగా పరిశీలిద్దాం అంటాడు. పరస్పరవిరుద్ధమైన దాన్ని తార్కిక inference కి ఆధారం చేసుకోకూడదు. లోతుగా పరిశీలన చెయ్యాలి. ఇలాంటి ఆటంకాలు వచ్చినప్పుడల్లా మార్క్స్ లోతుగా పరిశీలించాలి అంటాడు.
ఇది వైరుధ్యం అనిపిస్తుంది. పైకలా కంపించినా,సూక్ష్మ పరిశీలనలో అసలు విషయం వేరుగా ఉంటుంది.జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ విషయాన్ని తిరస్కరించవలసి వస్తుంది. మారకం విలువ యాదృచ్చికంకాదనీ ఒకలెక్కప్రకారం ఉంటుందనీ తేలుతుంది. రెండుసరుకుల పోలికలో వచ్చేది కాదనీ, అందులో బయటపడుతుందనీ తేలుతుంది. ఆమారక నిష్పత్తిని నిర్ణయించే అంశం అందులోనూ ఇందులోనూ అంతర్గతంగా ఉందని తెలుస్తుంది”.-
లోతు పరిశీలనలో అందరికీ అనుభవం లోవున్న రెండు వాస్తవాలని చెబుతాడు. మొదటి వాస్తవం:ఒక క్వార్టర్ గోధుమ ఒక పౌను ఇనుముతోనే కాదు ఇతర సరుకులతోకూడా భిన్నపరిమాణాలలో మారుతుంది. అంటే, గోధుమలకి ఒకటికాదు, ఎన్నొ మారకం విలువలు ఉన్నాయి.ఆసరుకులలో ప్రతిదీ ఒక పావుటన్ను గోధుమల మారకం విలువకి ప్రతినిధిగా ఉన్నది. మారకంవిలువలుగా అవి ఒకదాని స్థానాన్ని మరొకటి ఆక్రమించగలవు . దానర్ధం అవి ఒకదానితో మరొకటి సమానం అని.
1 కిలో కాఫీ పొడి   = ౩ కిలోల నూనె
                   = 10  కిలోల బియ్యం
                   = 1 రీము తెల్లకాగితాలు
                    =20 బాల్  పెన్నులు   
ఇక్కడ కాఫిపోడికి ఉన్నది ఒక మారకం విలువ కాదు. నాలుగు. ఇంకా ఎన్నైనా ఉండ వచ్చు అంటే, నిష్పట్టులేవైనా కావచ్చు గాని, ఒకసరుక్కి అనేక మారకం విలువలు ఉంటాయి. అవన్నీ కాఫీపోడి మారకం విలువకి ప్రతినిధులుగా ఉంటాయి .   దీన్నిబట్టి ఒకదానికొకటి సమానమై తీరాలి.
దీన్నించి తన సిద్దాంతానికి అతి ముఖ్యమైన రెండు నిర్ధారణలు రాబడతాడు:
అందువల్ల,
1) మొదటి విషయం, ఒక సరుకు యొక్క చెల్లుబాటయ్యే మారకం విలువలు ’ఏదో’ సమానమైన దాన్ని వ్యక్తం చేస్తాయి.
2)రెండో విషయం, మారకం విలువ అనేది దానిలోనే వుండి, దానినుండి వేరైనదిగా గమనించదగ్గ ‘దాని’ వ్యక్తీకరణ పద్ధతి,దృగ్గోచర రూపం.
ఒక ప్రత్యేకసరుకు మారకం విలువలు ఏదో  సమానమైన దాన్ని వ్యక్తం చేస్తాయి.రెండు, మారకం విలువ అనేది దానినించి వేరైనదానిగా గమనించడానికి వీలున్న సారానికి కనబడే రూపం , వ్యక్తీకరించే పధ్ధతే తప్ప మరేమీ కాదు.
దీన్నిబట్టి తేలిందేమంటే ఏ రెండు సరుకుల మారకనిష్పత్తి అయినా స్థిరంగా ఉండదు. ఒకప్పుడున్నట్లు మరొకప్పుడు ఉండదు. ఒకచోట ఉన్నట్లు మరొకచోట ఉండదు. ఆవిధంగా మారకం విలువ ఏదో యాదృ చ్చికమైనదిగానూ, కేవలం సాపేక్షమైనదిగాను (రెండు సరుకుల పోలికలో వచ్చేదిగానూ) కన్పిస్తుంది. కాండి లాక్  అన్నట్లు అది “మనకోర్కేలతో సరుకుల యొక్క సంబంధంగా మాత్రమే  ఉండేదిగా ” కనిపిస్తుంది. అలా అయితే, ఆనిష్పత్తిని నిర్ణయించే అంశం ఆసరుకుల్లో ఉండ కూడదు. బార్బాన్ అన్నట్లు “దేనికి అంతర్గత విలువ ఉండదు ” అనాల్సివస్తుంది అంటే, సరుకులో విడదీయరాని  లంకెలో ఉండే మారకంవిలువ స్వయం వైరుధ్యం అనిపిస్తుంది . పైకి అలా కన్పించినా ,పరిశీలిస్తే విషయం వేరుగా ఉంటుంది. పై అభిప్రాయాన్ని తిరస్కరించాల్సి వస్తుంది మారకం విలువ యాదృచ్చికమైనది కాదనీ, ఒక లెక్కప్రకారం ఉంటుందనీ తేలుతుంది.రెండు సరుకుల పోలికలో వచ్చేది కాదనీ , పోలికలోబయటపడేదనీ తెలుస్తుంది. ఆమారక నిష్పత్తిని నిర్ణయించే అంశం నిష్పత్తిని నిర్ణయించే అంశం అందులోనూ ఇందులోనూ (పోల్చిన రెండు సరుకుల్లోనూ )ఉందని తేలుతుంది. ఇందుకు మార్క్స్ చేసిన వాదన.
ఈమారక నిష్పత్తులు తరచుగా మారుతూ ఉండడం వల్ల,మారకం విలువ  అమ్మేవాని,కొనేవాని ఇష్టాయిష్టాల(caprice) పైన ఆధారపడి ఉన్నట్లు అనిపిస్తుంది. ఫలితంగా, సరుకుల్లో అంతర్గతంగా ఇమిడి వున్న మారకం విలువ అసాధ్యం అనీ, అది వైరుధ్యం అనీ అనిపిస్తుంది.కాని శ్రద్ధగా పరిశీలిస్తే, ఈవాదన ఒప్పుకోదగింది కాదని తేలుతుంది.వైరుధ్యమేమీ లేదని తన తర్కంతో తెలుస్తాడు:
ఒకసరుకు మారకం విలువని మిగిలిన అన్నిసరుకుల భిన్న పరిమాణాల్లో చెప్పవచ్చు.కనక మిగిలిన  సరుకులు కూడా ఆయాపరిమాణాల్లో ఒకదానికొకటి సమానం.ఒకదానిస్థానంలో మరొకదాన్ని పెట్టవచ్చు.
దీన్నించి రెండు నిర్ధారణలు రాబడతాడు:
ఒకటి-అమలయ్యే (valid)ఒకప్రత్యేక (given) సరుకు మారకం విలువలు ’ఏదో’ సమానమైనదానిని వ్యక్తం చేస్తాయి.
రెండు- మారకం విలువ దానిలోనే వున్న, దానినుండి వేరుగా గమనించి దగిన ‘దాని’  వ్యక్తీకరణ పద్ధతి,దృగ్విషయ రూపం మాత్రమే.అలా దాని లోనే ఉండి, దానినుండి వేరుగా గమనించ దగ్గదాన్ని విలువ అంటాడు. ఆవిధంగా మారకపువిలువ వెనక ఉన్న విలువని పట్టుకుంటాడు. విలువ అనేది మరొక భావాభివర్గం.
దీన్నిబట్టి, మారకం విలువ వేరు, విలువ వేరు.
విలువ మారకపువిలువ ఒకటి  కాదు.
“  శ్రమ వుత్పాదితం  సామాజిక రూపంలో కనబడుతుందో ఆరూపంలో దాన్ని విశ్లేషించాను. ఒకవైపున అది తన సహజరూపంలో ఉపయోగకరమయిన వస్తువు. మరోవైపు, మారకపు విలువకు bearer.ఈదృష్ట్యా, దానికదే మారకపు విలువ. మారకపువిలువ గురించిన తదుపరి  విశ్లేషణలో మారకపు విలువ కేవలం 'అగపడే రూపం' , సరుకులోవున్న విలువని తెలిపే స్వతంత్ర మార్గం అని తేలింది.అప్పుడు నేను విలువవిశ్లేషణకు బయలుదేరాను.అందువల్ల నేను కాపిటల్ రెండోముద్రణ 36 పజీలో(ఇది 'ప్రోగ్రెస్ పబ్లిషర్శ్ కాపిటల్.1 లో 66వ పేజీలో ఉంటుంది.) బాహాటంగా ప్రకటించాను: ఈచాప్టర్ మొదట్లో వాడుక మాటల్లో( common parlance) సరుకు ఒక వుపయోగపు విలువా లేక ప్రయోజనకర వస్తువూ, ఒక మారకంవిలువా అన్నప్పుడు, నిక్కచ్చిగా చెప్పాల్సొస్తే మేము తప్పు. సరుకు ఒక వుపయోగపు విలువా లేక ప్రయోజనకర వస్తువూ, ఒక విలువా.దాని విలువ దాని సొంత రూపానికి భిన్నంగా స్వతంత్రమయిన అగపడే రూపాన్ని - మారకపు విలువ రూపాన్ని పొందుతుందో -అప్పుడది ద్వంద వస్తువుగా తన్నుతాను బయటపెట్టుకుంటుందీ వగయిరా”- మార్జినల్ నోట్స్ ఆన్ వాగ్నర్- మార్క్స్ ఎంగెల్స్ కలెక్టెడ్ వర్క్స్ 24పేజీ 544-545 "సరుకు ఒకవైపు వుపయోగపు విలువ, మరొకవైపు విలువ- మారకపువిలువ కాదు. ఎందుకంటే కనబడేరూపం దాని సొంత సారం కాదు గనక “-మార్జినల్ నోట్స్ ఆన్ వాగ్నర్స్ … - మార్క్స్ ఎంగెల్స్ కలెక్టెడ్ వర్క్స్ 24పేజీ 545
"నాదృష్టిలో, సరుకు విలువ దాని వుపయోగపు విలువాకాదు, మారకపు విలువా కాదు." మార్జినల్ నోట్స్ ఆన్ వాగ్న ర్స్….  మార్క్స్ ఎంగెల్స్ కలెక్టెడ్ వర్క్స్ 24పేజీ 545
"మారకం విలువ దానినుండి విడిగా గమనించదగ్గ సారం యొక్క వ్యక్తీకరణ పద్ధతి,అగపడే రూపం మినహా మరేమీకాదు"- కాపిటల్1 (పెంగ్విన్) .127
దేని ఆధారంగా సరుకులు వేర్వేరు పరిమాణాల్లో సమం చేయబడతాయో అదే విలువ.
ఆవిధంగా విలువనీ, మారకం విలువనీ భిన్నమైనవిగా స్పష్టపరుస్తాడు.
ఇవి మార్క్స్ విలువ సిద్ధాంతానికి అత్యంత ప్రధానమైనవి. విలువ పాయింట్ ఆఫ్ డిపార్చర్. స్టేట్ మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ థీరం. అంతకు ముందు ఆర్ధిక వేత్తలకు విలువకూ  విలువరూపానికీ తేడా తెలియదు. ఈతేడాని గ్రహించి మార్క్స్ ముందుకు పోతాడు.
రెండు సరుకులు ఎప్పుడు మారకం అవుతాయి? ఉపయోగపు విలువలు భిన్నమైనవైనప్పుడు. టార్చ్ లైట్ టార్చ్ లైట్ తో మారకం కాదు.బియ్యం బియ్యంతో మారవు.మరే ఇతర వస్తువులతోనయినా మారతాయి.అంటే మారకంలో ప్రవేశించే వస్తువులు భిన్నమైనవై ఉండాలన్నమాట. ఇది మొదటివిషయం.మారకం అయ్యే రెండు వస్తువులూ సమానం కావడం తప్పనిసరి. ఆరిస్టాటిల్ అన్నట్లు: "సమానత్వం లేనిదే మారకం జరగదు.ఒకే ప్రమాణంతో కొలవబడనిదే సమానత్వం సాధ్యం కాదు."
రెండుసరుకులు సమానమైనవని తేల్చాలంటే, వాటిని రెంటినీ ఒకే ప్రమాణంతో కొలవడం కుదరాలి.వాటి మారకపు విలువల్లో వ్యక్తమయ్యేది అదే.అలా కొలవడం కుదురుతుందని. మార్క్స్ మాటల్లో: "ఒకే యూనిట్ వ్యక్తీకరణలుగా మాత్రమే అవి ఒకే రకం అయినవి.అందుచేత ఒకే ప్రమాణంతో కొలవబడానికి వీలైనవై వుంటాయి." - కాపిటల్1.56
సరుకులన్నిటిలోనూ ఉండి ఒకే ప్రమాణంతో కొలవడానికి వీలయిన ఆసారం ఏమిటో తేల్చాలి. “సరుకులు మారకం అయినప్పుడల్లా, సరుకుల మారకం విలువలో బయటపడే ఆ ఉమ్మడిసారమే వాటి విలువ"-మార్జినల్ నోట్స్ .మారకంలో బయట పడుతుంది అంటే  మారకానికి ముందే సరుకులో విలువ ఉండాలి. ఉంటేనే గదా బయటబడేది?
“ముందుముందు మన పరిశోధన సరుకుల విలువ వ్యక్తమయ్యే ఏకైకరూపంగా మారకపువిలువను తెస్తుంది. ప్రస్తుతానికి విలువస్వభావాన్ని దానికి(విలువరూపానికి-నాది) స్వతంత్రంగా, అంటే,దాని రూపంతో సంబంధం లేకుండా పరిశీలించాల్సి ఉంది"- నోట్స్ ఆన్ వాగ్నర్- మార్క్స్ ఎంగెల్స్ కలెక్టెడ్ వర్క్స్ 24పేజీ 534
ఒకలీటర్ తేనే=2 కిలోల బియ్యం  అనేదొక మారకసంబంధం. ఈ  రెండు సరుకులు సమానమని అర్ధం.
అలా ఏ రెండు సరుకులయినా  సమానం కావాలంటే, అ రెండు  సరుకుల్లో ఏదో ‘ఉమ్మడి అంశం’ ఉండితీరాలి.  సరుకుల్లో అంతర్గతంగావుండి, వాటి మారకాన్ని పాలించే  ‘ఉమ్మడి అంశం’ ఏకైక సారం ఉంది.
ఆఉమ్మడి అంశాన్నే మార్క్స్ విలువ అన్నాడు.
ఆ విధంగా తన విశ్లేషణలో మారకంవిలువ వెనక దాగివున్న విలువని పట్టుకున్నాడు. ఇక విలువ సారం గురించీ, విలువ పరిమాణం గురించీ చెబుతాడు.
వచ్చే  పోస్ట్ లో                                                 
(కాపిటల్ 1 నించి ఇచ్చిన కోటేషన్లు ప్రోగ్రెస్ పబ్లిషర్స్ ప్రచురణ  1977 పునర్ముద్రణ నించి. పెంగ్విన్ ప్రచురణ నించి కోట్ చేస్తే పెంగ్విన్ పేజీ ఉంటుంది.)