30, జులై 2016, శనివారం

మళ్లీ అదే ప్రశ్న: పరిచయం చేసింది మార్క్సునేనా?

మళ్లీ అదే ప్రశ్న: పరిచయం  చేసింది మార్క్సునేనా?

వీక్షణం ఆగస్ట్ 2016 సంచికలో                                                                     ఎస్ బ్రహ్మచారి
``మార్క్సే నా గురువు” అని ప్రకటించే రంగనాయకమ్మ కీలకమైన విషయాల్లోనే మార్క్స్ తప్పులు చేశాడని అంటున్నారు. ఒకవైపు శ్రమ విలువా, శ్రమశక్తి విలువా, అదనపువిలువా, శ్రమదోపిడీ, శ్రామికవర్గం, దోపిడీ వర్గం, స్వతంత్ర ఉత్పత్తిదారుల సంబంధాలూ, యజమానీ శ్రామిక సంబంధాలూ - ఇలా ఈపేర్లూ, ఈవిషయాలూ అన్నిటిని, కొత్తగా చెప్పింది మార్క్సే. ఆయన వివరించి చెబితేనే, దోపిడీ రహస్యం, సమాజానికి తెలిసింది”- అని అంటూనే (వీక్షణం, 2013 జూన్, పేజి.54) మరొకవైపు, ఊహాత్మక సంభాషణలో మార్క్స్ శిష్యుడిని అని చెప్పుకునే కార్మికుడు, పెట్టుబడిదారుడితో 'నాశ్రమశక్తిని కొంటున్నానని విర్రవీగకు శ్రమశక్తి సరుకు కాదు అంటాడు. ‘మార్క్స్ చెప్పింది పొరపాటు’ అంటాడు. ‘మార్క్స్ చెప్పింది పెట్టుబడిదారుడికే అనుకూలంగా వున్నది’ అనే అభిప్రాయానికి  వచ్చి ఇలా అంటాడు:
శ్రమదోపిడీయే లేదని దోపిడీదారుడు విర్రవీగుతుంటే నోరెత్తలేని స్థితిలో శ్రామికుడు పడిపోయాడంటే, కారణం నాగురువు పొరపాటే.'
యజమానీ శ్రామిక సంబంధాన్ని, మార్క్స్ చెప్పినట్టుగా అమ్మే కొనే సంబంధంగా చెప్పకూడదనేది  రంగనాయకమ్మ అభిప్రాయం. మార్క్స్ పొరపాటు వల్ల ఫలితం ఏమిటో కూడా ఆమె చెప్పారు:
"పెట్టుబడిదారుడు శ్రమశక్తిని కొంటాడనీ, శ్రమశక్తి ఇచ్చే ఉపయోగపువిలువ అతనిదే - అని ఒకవేపు వాదిస్తూ; ఆ శ్రమశక్తి ద్వారా అదనపువిలువని తీసుకోవడం శ్రమదోపిడీ అవుతుందని ఇంకోవేపు వాదిస్తే - ఆరెంటికీ ఎలా పొసగుతుంది?" అని ప్రశ్నించారు.
ఆ ప్రశ్నకు  సమాధానం కాపిటల్ లో, మార్క్సిస్టు అర్థశాస్త్ర  పరిచయాల్లో ఎందులోనయినా దొరుకుతుంది. నా వ్యాసాల్లోను ఉంది. కాపిటల్ 1 లో The buying and selling of labour powerఅనే చాప్టర్ 6 చూస్తే  (పేజీలు 164-172) తెలుస్తుంది. ఇది కేవలం 9 పేజీలే. ఇంకొంచెం పరిశీలించాలనుకుంటే The transformation of money into capital (145-172) చదవవచ్చు.

పరిచయం ముందుమాటలోనే "ఇది ఒరిజినల్ నించి ఎక్కడా భిన్నమైనది కాదు"అని రంగనాయకమ్మ చెప్పుకున్నారు. కాని వాస్తవమేమంటే, మార్క్స్ సిద్ధాంతానికి కీలకాంశాలలో సైతం పరిచయం భిన్నంగా ఉంది:

మార్క్స్ చెప్పింది
రంగనాయకమ్మగారు చెప్పింది
పెట్టుబడికీ శ్రమశక్తికీ  సమాన మారకం
అసమాన మారకం
పెట్టుబడికీ శ్రమశక్తికీ  మారకం ఉంది
మారకం లేదు
శ్రమశక్తి సరుకు
శ్రమశక్తి సరుకు కాదు

మార్క్స్ ప్రకారం అమ్మేది శ్రమని కాదు, శ్రమశక్తిని. అప్పటికి అర్థశాస్త్రంలో లేని శ్రమశక్తి అనే భావనని ప్రవేశపెట్టాడు మార్క్స్. మారకంలో ఒకవైపు డబ్బుంటే, రెండోవైపున వున్నది శ్రమ శక్తి. శ్రమ అని అంతకు ముందువాళ్లు అనుకున్నారు. మార్క్స్ ప్రకారం శ్రమ సరుకు కాదు. ఇది తెలియకపోతే మార్క్స్ సిద్ధాంతం లోని అతి కీలకమైన విషయం తెలియనట్లే.
The profit that the capitalist makes, the surplus-value which he realises, springs precisely from the fact that the labourer has sold to him not labour realised in a commodity, but his labour-power itself as a commodity.- Theories of Surplus Value, vol. 1, p. 315

దీన్నిగురించి వీక్షణంలో వచ్చిన నా వ్యాసాల్లో మార్క్స్ మాటల్లోనే వివరంగా ఉంది. అలాగే సమాన మారకాలు జరుగుతూనే, అదనపువిలువ ఏర్పడి, పెట్టుబడిదారుడి పరమవుతుంది అనే విషయమూ ఉంది.
***********
నా వ్యాసం మీద వీక్షణం మే 2016 సంచికలో విమర్శ రాసిన ముగ్గురూ(వి.వెంకట్రావు, లెనిన్ బాబు, మంజరి లక్ష్మి) వీటిని పరిగణనలోకి తీసుకోలేదు. నేను రాసినవి ఎలాతప్పో నిరూపించడానికి ప్రయత్నించలేదు. ఏఒక్కరూ కాపిటల్ లో ఉన్నదే పరిచయంలో ఉందని  చూపలేదు.  మార్క్సు చెప్పినవాటికి వ్యతిరేకమైనవి పరిచయంలో ఉన్నాయి అని నేను చేసిన వాదనను ముట్టుకోలేదు. వెంకట్రావు, లెనిన్ బాబు లు రాసినవైతే నావిమర్శలకు జవాబివ్వడం మాని ఎక్కడెక్కడికో వెళ్ళాయి. వ్యాసం అర్థం కావట్లేదనీ, రంగనాయకమ్మగారి కొటేషన్లు మాత్రమే అర్థమవుతున్నాయి గాని వ్యాసంలోవి కావడంలేదనీ, ద్వేషం వల్ల రాశాననీ ఏవేవో చెప్పారు. మంజరిలక్ష్మి నాకు జవాబిస్తున్నట్లుగా  కనిపించినప్పటికీ, నేను రాసిన వాటిలో తప్పులు చూపలేదు.
 రంగనాయకమ్మ పరిచయం చేసింది మార్క్సునేనా?”అనే టైటిల్ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందో (తన గొప్పతనాన్ని చూపించుకోవటం కోసం కాకపోతే) నాకయితే అర్థం కావటం లేదుఅన్నారు.అర్థం కావాలంటే, మార్క్స్ కాపిటల్ నీ రంగనాయకమ్మ పరిచయాన్నీ పక్కపక్కనే పెట్టుకొని చదవాలి. రెంటినీ పోల్చిచూడాలి.
పోతే, విమర్శించేది గొప్పకోసమా? అలా అనుకుంటే, రం.నా. గారు ఎందరిని విమర్శించలేదు? మార్క్సులోనే తప్పులున్నాయన్నారుగదా. ఆవన్నీగొప్ప కోసమే చేశారా? ఊహించుకున్న సంకుచిత ఉద్దేశాల్ని అవతలివారికి అంటగట్టటం ఆరోగ్యకరమైన చర్చా సంప్రదాయం కాదు. ఇక, విమర్శలకు పెట్టే పేర్లు -అవి వ్యాసాలయినా, పుస్తకాలైనా - కొంత ఘాటుగానే  వుంటుంటాయి. ఉదాహరణలు అవసరం లేదనుకుంటాను.


*********
 “ఈ వ్యాసంలో ఇ.ఎస్. బ్రహ్మచారి గారు రాసిన ఉత్పాదక, అనుత్పాదక, స్వతంత్ర శ్రమల గురించి చెప్పినదాని వరకే నేను పరిమితమవుతున్నాను అని ముందుగానే చెప్పారు మంజరిలక్ష్మి గారు.
అనుత్పాదక శ్రమ విషయంలో మార్క్స్ కీ, రంగనాయకమ్మకీ తేడాలు ఇవి:

మార్క్స్ చెప్పింది
రంగనాయకమ్మగారు చెప్పింది
ఆదాయంతో మారే శ్రమ అనుత్పాదక శ్రమ
ఆదాయంతో మారడం చూచి అనుత్పాదకశ్రమ అనడం తప్పు
ఇంతకుమించి షరతులేవీ లేవు
ఒక ఇంటిలో గానీ, ఒక ఉత్పత్తి స్థలంలో గానీ, ఒక యజమాని కింద జీతానికి పని చేసే వేతన శ్రామికుడిగా ఉండాలి. అలాకానివ్యక్తి అనుత్పాదక శ్రామికుడు కాడు
స్వతంత్ర ఉత్పత్తిదారుడు సొంతశ్రమతో చేసిన సరుకులు అమ్ముతాడు. శ్రమని అమ్మడు
స్వతంత్ర ఉత్పత్తిదారుడు సరుకుల్నిగానీ, శ్రమని గానీఅమ్ముతాడు.
శ్రమని అమ్మేవాడు వేతన శ్రామికుడు, స్వతంత్ర ఉత్పత్తిదారుడు కాడు
శ్రమవిలువ అంతా పొందేవాడు స్వతంత్రవుత్పత్తిదారుడు
పియానో చేసిచ్చిన శ్రామికుడు అనుత్పాదక శ్రామికుడు
కాదు, స్వతంత్ర ఉత్పత్తిదారుడు
ఇంటికొచ్చి కోటు కుట్టిన జాబింగ్ టైలర్ అనుత్పాదక శ్రామికుడు
కాదు, స్వతంత్ర ఉత్పత్తిదారుడు
జాబింగ్ టైలర్  గృహ సేవకుడు ఒకే కోవకి చెందినవారు
ఒకే కోవకి చెందినవారు కారు

అనుత్పాదక శ్రామికుడా,స్వతంత్ర ఉత్పత్తిదారుడా -అనే విషయంలో ఇదేదో ఉదాహరణల వ్యవహారం అయినట్లూ, పెద్ద విషయం కానట్లూ చెబుతున్నారు. ఇది ఉదాహరణల వ్యవహారం కాదు నిర్వచనాలకు సంబంధించింది. పై పట్టికను పరిశీలిస్తే ఈ వాస్తవం బయటపడుతుంది.
పట్టికలో ఉన్న మొదటి నాలుగు అంశాలూ నిర్వచనానికి సంబంధించిన  తేడాలు. మిగిలినవి వాటిని ఉదాహరణలకి అన్వయిస్తే వచ్చే తేడాలు. కనక తేడా నిర్వచనాల్లోనే ఉంది.

కోటుకుట్టి ఇచ్చిన దర్జీ, పియానో చేసి ఇచ్చిన శ్రామికుడూ- అనుత్పాదకశ్రామికులు అన్నాడు మార్క్స్ స్పష్టంగా.  
కాదు, స్వతంత్ర ఉత్పత్తిదారులు అన్నారు రం.నా. గారు అంతే స్పష్టంగా.
ఎవరు రైటో తేల్చాలంటే, ముందు నిర్వచనాన్ని స్థిరీకరించాలి. మార్క్స్ నిర్వచనం : ఆదాయంతో మారే శ్రమ అనుత్పాదక శ్రమ. దాన్నిబట్టి చూస్తే  వాళ్లు అనుత్పాదకశ్రామికులే. పరిచయకర్త మార్క్స్ నిర్వచనాన్ని అన్వయించివుంటే వారూ అలాగే అనుత్పాదక శ్రామికులే అని నిర్ధారించక తప్పేది కాదు.
కాని మూలంలో ఉన్న నిర్వచనాన్ని మూలకు నెట్టి, పరిచయకర్త సొంత నిర్వచనాన్ని వర్తింపచేశారు:
 ‘ఒక ఇంటిలో గానీ, ఒక ఉత్పత్తి స్థలంలో గానీ, ఒక యజమాని కింద జీతానికి పని చేసే వేతన శ్రామికుడిగా ఉండాలి. అలాకానివ్యక్తి అనుత్పాదక శ్రామికుడు కాడు. ఇంకా దీని గురించి రంగనాయకమ్మగారు అన్నది చూడండి అంటూ ఈనిర్వచనమే సరైనదిగా భావిస్తున్నారు మంజరిలక్ష్మిగారు.
వేతన శ్రామికులు గంటకింతని తీసుకున్నా వేతన శ్రామికుడే. ఎక్కడ పనివుంటే అక్కడచేసేవాళ్లూ వేతనశ్రామికులే.ఎన్నిచోట్ల చేశారనేదానికీ, వేతనశ్రామికుడు అవడానికీ సంబంధం లేదు.కూలితీసుకొని పనిచేసేవాడు అని అర్ధం.అలాంటివాని శ్రమ మారకం జరిగింది పెట్టుబడితో అయితే ఉత్పాదక శ్రామికుడవుతాడు. ఆదాయంతో అయితే, అనుత్పాదక శ్రామికుడవుతాడు. శ్రమశక్తిని అమ్ముకోకుండా, సొంతశ్రమతో చేసిన సరుకుల్ని అమ్మేవాడు స్వతంత్రవుత్పత్తిదారుడు. ఇదీ మార్క్స్ చెప్పింది.

అయితే, అనుత్పాదకశ్రామికుణ్ణి స్వతంత్ర ఉత్పత్తిదారుడుగా చూపడానికి, సొంతనిర్వచనాలని అన్వయించి తాను కావాలనుకున్న ఫలితాల్ని రాబట్టారు రంగనాయకమ్మ అని నావ్యాసంలోరాశాను. రంగనాయకమ్మ అన్వయించింది మార్క్స్ నిర్వచనమే అనాలంటే, వారి నిర్వచనాన్ని మార్క్స్ రచనల్లో చూపించాలి - ఇప్పుడైనా , ఎప్పుడైనా. లేదా మార్క్స్ నిర్వచనం నుంచి ఈ అన్వయాన్ని రాబట్టాలి. మంజరిలక్ష్మి గారు ఆపని చెయ్యలేదు.

1) అనుత్పాదక శ్రామికుడు అదనపు శ్రమ చేస్తాడు అనిఒకచోటా, చెయ్యడు అని మరొకచోటా చెప్పాడనీ 2)కోటుకుట్టిన దర్జీని ఒకచోట అనుత్పాదకశ్రామికుడనీ మరొకచోట స్వతంత్ర ఉత్పత్తిదారుడనీ చెప్పాడనీ మార్క్స్ చెప్పిన విషయాల్లో వైరుధ్యాలు ఉన్నట్లు చెప్పారు రంగనాయకమ్మగారు.

అలా చెప్పినట్లు మార్క్స్ నుంచి ఆధారం చూపలేదు మంజరిలక్ష్మి గారు. పరిచయకర్త చెప్పినదానినే మరొకసారి చెప్పారు, అంతే. ఎన్నిసార్లు చెప్పినా అవి మార్క్స్  మాటలు అయిపోవు కదా!
******

 “పియానో చేసిన శ్రామికుడు వేతన శ్రామికుడు. చేయించుకున్నవాడు వినియోగదారుడు” అన్నాను. అందులో మంజరిలక్ష్మి కి వైరుధ్యం కనపడింది. ఏమంటే.
 “..వాక్యంలో ఉన్న వైరుధ్యం చూడండి. ఒకరు కనక వేతన శ్రామికుడైతే ఇంకొకరు ఏమవ్వాలి? యజమాని అవ్వాలి కదా! కానీ ఈయన అతన్ని వినియోగదారుడుగానే గుర్తించారు. అంటే వేతన శ్రామికుడు ఏమయి ఉండాలి? స్వతంత్ర ఉత్పత్తిదారుడే అయి ఉండాలి కదా!
వినియోగదారుడు అన్నాను కాబట్టి, చేసినవాడు స్వతంత్ర ఉత్పత్తిదారుడు అయితీరాలట. ఇదెక్కడి తర్కమో, ఏ గురువు నేర్పిందో!
 వేతన శ్రామికుడికి వినియోగదారుడికీ సంబంధం ఉండదు. వేతన శ్రామికుడికీ  స్వతంత్ర ఉత్పత్తిదారుడికీ సంబంధం ఉంటుంది - ఇదీ వారు చెప్పేది. చెప్పడమే కాని, అలా ఎక్కడవుందో ఆధారం చూపరు.
యజమాని అయినవాడు వినియోగదారుడు కాడు. ఒకచోట యజమాని అని, మరొకచోట వినియోగదారుడు అనడం వైరుధ్యం - అని వారి వాదన. నిజానికి ఆ పదాలు రెండూ పరస్పర వ్యతిరేకాలు కావు. ఎవరైనా ఒకవస్తువుని వినియోగించుకోవాలంటే, ముందుగా దాన్ని సొంతం చేసుకొవాలి. మంచం మార్కెట్లో రెడీగా దొరుకుతుంది. వాడుకోవాలంటే ముందు కొనాలి. అంటే, మొదట కొనుగోలుదారుడు, ఆతర్వాత వినియోగదారుడు.
రెడీమేడ్ మంచాన్ని కొనకుండా, మెటీరియల్ కొని పనివానితో చేయించుకొని వాడుకోవచ్చు. మొదటి సందర్భంలో నేరుగా మంచాన్నే కొన్నాడు. రెండో సందర్భంలో మెటీరియల్స్ కొని, శ్రామికునికి కూలి ఇచ్చి చేయించుకున్నాడు. కొన్నా,తయారు చేయించుకున్నా అతనికది పడుకోవడానికే, అమ్ముకోవడానికి కాదు. కనక అక్కడ ఖర్చయ్యేది డబ్బు మాత్రమే. ఆ డబ్బును పెట్టుబడి అనడానికి వీలు లేదు. చేసినవానికి ఇంతని కూలీ ఇవ్వాల్సి వుంటుంది.  వడ్రంగి శ్రమ కొన్నవాడి ఆదాయంతో మారకం అవుతుంది.కనక అది అనుత్పాదక శ్రమ.
కార్మికుడు కూడా అనుత్పాదక శ్రమ చేయించుకునే సందర్భాలు ఉంటాయి. అప్పుడతడు వినియోగదారుడు. ఆ శ్రమ చేయించుకునేటప్పుడు యజమాని. దాన్ని వాడుకునే వినియోగదారుడయినా, కూలిచ్చి పనిచేయించుకునే యజమాని-కొద్దికాలమే కావచ్చు, అయినా అతని పాత్ర అదే.
కావాలనుకున్న వస్తువుని షాపులో కొనీ వినియోగించుకోవచ్చు, తయారుచేయించుకొనీ వినియోగించుకోవచ్చు. తయారు చేసినవాళ్లు, తన పనివాళ్లు కావచ్చు.బయటవాళ్లు కావచ్చు.
“… he himself wears and consumes a coat made by his workmen”.- .వి.సి.1.295
ఇక్కడ ఆంటర్ ప్రెనర్ టైలర్ తనపనివాళ్లు కుట్టిన కోటుని వేసుకొని కన్ జ్యూం చేస్తాడు. అంటే వినియోగదారుడు అవుతాడు.
“The labourer allows the buyer to consume it before he receives payment of the price”-Cap.1. 170
పెట్టుబడిదారుడు కూడా ఒక వినియోగదారుడే. శ్రమశక్తి అనే ఒక విలక్షణమైన సరుకుని 'వినియోగించుకోవటం' ద్వారా అతడు అదనపు విలువ రాబడతాడని. మార్క్సు చెప్పిన అదనపు విలువ సిద్ధాంతం అదే. పెట్టుబడిదారుడికీ కార్మికునికీ మారకమే లేదన్న 'పరిచయం' ప్రభావంలో వున్నంతకాలం ఈవిషయం గుర్తించటం సాధ్యపడదు.
శ్రమని వినియోగించుకున్నది పెట్టుబడి అయితే, ఆశ్రమ ఉత్పాదక శ్రమ. ఆదాయం అయితే ఆ శ్రమ అనుత్పాదక శ్రమ.
అనుత్పాదకశ్రామికుణ్ణి స్వతంత్ర వుత్పత్తిదారుడుగా చూపడానికి, వారు ఇలాంటి వాదనలు వినిపించారు. వాటినిప్పుడు పరిశీలించాలి.
**************
ఉత్పత్తి సాధనాలు- శ్రమ పరికరాలూ, ముడి పదార్ధాలూ, - పెట్టుబడిదారులకు ఉన్నట్లే స్వతంత్ర ఉత్పత్తి దారులకు ఉంటాయి. పెట్టుబడిదారు వేతన శ్రామికుల చేత ఉత్పత్తి చేయిస్తాడు. స్వతంత్ర ఉత్పత్తిదారు తన శ్రమతో ఉత్పత్తి చేస్తాడు. ఇదీ తేడా. వేతన శ్రామికుడికి ఉత్పత్తి సాధనాలు ఉండవు. కనక శ్రమశక్తిని అమ్ముకొని వేతన శ్రామికుడిగా ఉంటాడు. పియానో చేసిన శ్రామికుడు వేతన శ్రామికుడు. చేయించుకున్నవాడు వినియోగదారుడు అని నేను రాసినదాని
మీద మంజరిలక్ష్మి గారు: శ్రమ పరికరాలు పియానో తయారు చేసే వ్యక్తి దగ్గరే ఉన్నాయి కదా మరి. దానికి కావలసిన ముడి పదార్థాలు మాత్రమే వినియోగదారుడు తెచ్చుకున్నాడు. అలా కాకుండా వినియోగదారుడు ఇతన్నే స్వతంత్రంగా పియానో ఇంటి దగ్గర తయారుచేసి తెమ్మన్నాడనుకోండి. అప్పుడైతే ,అతనైనా దానికి కావలసిన ముడి పదార్థాలను అప్పటికప్పుడు బయట కొని తేవలసిందే కదా. ఇతను కొనే బదులు వినియోగదారుడు కొన్నాడు”-అన్నారు.
ఆ డబ్బెవరిది? ఎవరి ఆదాయం? ఆ పియానో ఎవరికొరకు? చేసినవాడు ఆమ్ముకునేదానికా? చేయించుకునేవాడు వాడుకోవడానికా? చేయించుకునేవాడి డబ్బుతో కొనేవవి. అతను వాడుకుంటాడు, మరొకరికి అమ్మడు. పని మొదలయ్యేటప్పటికే ఆ పియానో అతనిది.
మెటీరియల్స్ ఎవరు తెచ్చినా పని మొదలయ్యేటప్పటికి, అవి చేయించుకునేవాని స్వాధీనమవుతాయి. చేసే శ్రమకూడా అంతే.
పరుపులు కుట్టేవాడిదగ్గర సూదీ, దారం, కత్తెరా ఉంటాయి. దూదీ గుడ్డా వినియోగదారుడివి. కుట్టినందుకు కూలీ మాట్లాడుకుంటాడు. అంతేగాని ఆపరుపుని అమ్మలేడు. అది అతనిది కాదు.
రవ్వల నెక్లెస్ చేసిచ్చినవాడు పరికరాలున్నంత మాత్రాన బంగారం ఇచ్చిన వాడికి చేసిపెడతాడేగాని, నెక్లెస్ అమ్మినట్లా? స్వతంత్ర ఉత్పత్తిదారుడవుతాడా?
ఉత్పత్తిసాధనాలు ఉండడం అంటే, పరికరాలూ, శ్రమ పదార్థాలూ మొత్తం ఉండడం. కొన్ని వుంటే, అతను సరుకులు ఉత్పత్తి చేసి అమ్మలేడు. సొంత శ్రమతో సరుకులు ఉత్పత్తిచేసి, అమ్ముకునేవాడు మాత్రమే స్వతంత్ర వుత్పత్తిదారుడు.

మంజరిలక్ష్మి గారు మరొక వాదన తెచ్చారు:
పియానోల్ని ఆ ఇంట్లో రోజూ ఒకటి చెయ్యడు. ఇది యజమానీ శ్రామిక సంబంధం కాదు. ఈ శ్రామికుడు స్వతంత్ర ఉత్పత్తిదారుడుగా లెక్కకు రావాలి.’ (పెట్టుబడి పరిచయం 2008 1.533) అని. ఒకటిచేశాడా, ఎక్కువ చేశాడా అనేదానికీ, చేయించుకున్నవాళ్లతో అతని సంబంధానికి ఏమిటి సంబంధం? చేయించుకున్నంతసేపూ యజమానీ, శ్రామిక సంబంధమే.
ఎన్నిచేసినా, తనకు అమ్ముకునే హక్కున్న  సరుకులుగా కాదు. ఇతరులకు, వాడకంకోసం, వారికి తగినట్లుగా చెప్పినట్లు చేసిపెట్టే వస్తువులు, ఉపయోగపు విలువలు. అతను చెప్పిన మెటీరియల్ తో కొలతలతో ఆకారంతో అతను చెప్పినట్లు చేస్తాడు. చెప్పినట్లు లేకపోతే సరిచెయ్యమంటాడు. ఇతను చేస్తాడు. అతను అనుత్పాదక శ్రామికుడు.
*********


ఆంటర్ ప్రెనర్ యజమాని
ఆంటర్ ప్రెనర్ అని కాపిటల్ లో ఉంటే, ఆమాటకి యజమాని అని అనువదించారు.ఇది తప్పు అన్నాను.దాన్ని లెక్కలోకి తీసుకోలేదు. ఆ అనువాదం సరైనదే అనలేదు. అనలేరు కూడా. 
ఆమాటకి అర్థం మార్క్సే చెప్పాడు.
 in the service of a capitalist (an entrepreneur) -అ.వి.సి.1.147
ఇక్కడ capitalist పక్కన బ్రాకెట్లోentrepreneur అని మార్క్సే రాశాడు.
Agricultural entrepreneurs are in the same position as these [industrial]
entrepreneurs. They must similarly get all their advances replaced, along with the profit as shown above.- అ.వి.సి.1.59
Agricultural entrepreneur అనీ, industrial entrepreneur అని రాశాడు. అతనికి లాభం వచ్చితీరాలి అని చెబుతాడు.

రోసీ (1787-1848) అనే 'ఆర్థకవేత్త ' ఆడం స్మిత్ ని తప్పుబడుతూ ఆసందర్భంలో ఆంటర్ ప్రెనర్ అనేమాట వాడాడు.
ఒక దర్జీనుంచి 'రెడీమేడ్ దుస్తులు' కొన్నా, మెటీరియల్ ఇచ్చి, వేతనం ఇచ్చి జాబింగ్ టైలర్ చేత కుట్టించుకున్నా ఫలితానికి సంబంధించినంత వరకూ రెండు చర్యలూ పూర్తిగా ఒక్కటే. కనక మొదటిది ఉత్పాదకశ్రమ అని, రెండోది అనుత్పాదక శ్రమ అని ఎవరూ అనరు. కాకపోతే, రెండో సందర్భంలో కోటు కావాలనుకున్న మనిషి తనే'entrepreneur ' గా ఉంటాడు అని రోసీ అంటాడు. జాబింగ్ టైలర్ ని రోసీ ఉత్పాదక శ్రామికుడన్నాడు.
ఇది తప్పు అని మార్క్స్ అన్నాడు:  “జాబింగ్ దర్జీతో వేసుకోడానికి కోటు కుట్టించుకున్నప్పుడు, అది నన్ను entrepreneur  చెయ్యదు- అ.వి.సి-296
వెంటనే ఎలాగో పోలిక చెబుతాడు:
When I have a coat made for me at home by a jobbing tailor, for me to wear, that no more makes me my own entrepreneur (in the sense of an economic category) than it makes the entrepreneur tailor an entrepreneur when he himself wears and consumes a coat made by his workmen.


గృహసేవకుడూ, జాబింగ్ దర్జీ
ఆంటర్ప్రెనర్ అన్నచోటే, రోసీ గృహ సేవకుడికీ, కోటుకుట్టి ఇచ్చిన జాబింగ్ దర్జీకీ తేడా ఏమీ లేదు అంటాడు.
Well, from the standpoint of productive forces what difference is there between the
jobbing tailor you have brought to your home and your domestic servant? None”


గృహసేవకుడూ, జాబింగ్ దర్జీ ఒకే నిర్ణాయక రూపం కలిగి ఉంటారు. ఇద్దరి శ్రమశక్తినీ కొనేది ఉపయోగపు విలువకోసమే. గృహ సేవకుడి యజమాని వ్యాపారి (entrepreneur ) కాడు. అలాగే అతను జాబింగ్ దర్జీని పిలిచి కోటు కుట్టించుకున్నప్పుడు కూడా వ్యాపారి (entrepreneur) కాడు.
ఆంటర్ ప్రెనర్ గా ఉండడని చెప్పాడు. యజమాని గా ఉండడని కాదు. ఆంటర్ ప్రెనర్ కాని యజమాని ఉంటాడు. కాని యజమాని కాని ఆంటర్ ప్రెనర్ ఉండడు.యజమాని అని అనువదిస్తే,ప్రతి యజమానీ ఆంటర్ప్రెనర్ అవుతాడు. ఆలెక్కన, గృహయజమానీ ఆంటర్ ప్రెనర్ అవుతాడు.

అమ్మి లాభం చేసుకునేందుకు పనివాళ్లతో కోట్లు కుట్టించేవాడు ఆంటర్ ప్రెనర్. తొడుక్కోడానికి కుట్టించుకునే వాడు ఆంటర్ప్రెనర్ కాడు. రోసీ అతన్ని ఆంటర్ప్రెనర్ అన్నాడు.అన్నందుకు రోసీని విషయంలేని వాగుడుగాయ (విండ్ బాగ్) అని గేలిచేశాడు మార్క్స్.
దర్జీకి యజమాని లేడనీ, అందువల్ల అతను అనుత్పాదక శ్రామికుడు కాడనీ వాదన. యజమాని లేడని ఎలా తేల్చారంటే, ఆంటర్ ప్రెనర్ అనే మార్క్స్ పదానికి యజమాని అని అనువదించి.
బ్రాడ్ హౌస్ గురించి ఎంగెల్స్ రాస్తూ, ఆ అనువాదకుడు మార్క్స్ చెప్పిందానికి వ్యతిరేకమైనదానిని మార్క్సే చెప్పినట్లు చేయగల చతురుడని చెప్పాడు. అలాంటిది పరిచయం పేరుతో కూడా చెయ్యవచ్చని రం.నా. గారు నిరూపించారు.

పూర్తి కొటేషన్ లేకపోతే, అర్థం మారిపోతుందా? అప్పుడు ఆంటర్ప్రెనర్ అనే మాటకి యజమాని అనే అర్థం వస్తుందా?
మొత్తం కొటేషన్ ఇస్తే తెలుస్తుందిఅని మంజరిలక్ష్మి గారు అన్నారు. ఒక మాటకి అర్థం తెలుసుకోటానికి మొత్తం కొటేషన్ కావాలా? ఆమాటకొస్తే, పరిచయంలో ఉన్న కొటేషన్లు ఒక్క తెలుగులోనే ఉన్నాయి. ఇంగ్లిష్ లో ఇచ్చి,తెలుగు చెయ్యలేదు.
ఎవరైనా తమ వాదనకి అవసరమైన భాగాన్ని మాత్రమే కోట్ చేస్తారు. అలా చెయ్యటం వలన మూలరచయిత భావానికి హాని జరిగిందంటే దానిని అలా అనుకునేవాళ్లు నిరూపించాలి. అంతేగానీ మొత్తం కొటేషన్ ని ఇంగ్లిష్ లో ఇచ్చి, దాని అనువాదం కూడా ఇవ్వు, అప్పుడు చూద్దాంఅనటం ఏమిటి?

ఇంకా దీని గురించి రంగనాయకమ్మగారు అన్నది చూడండి. ఒక పనివాడు అనుత్పాదక శ్రామికుడిగా లెక్కకు రావాలంటే అతను ఒక ఇంటిలో గానీ, ఒక ఉత్పత్తి స్థలంలో గానీ, ఒక యజమాని కింద జీతానికి పని చేసే వేతన శ్రామికుడిగా ఉండాలి. అలా కాని వ్యక్తి అనుత్పాదక శ్రామికుడు కాడు. ఈ షరతు రంగనాయకమ్మ విధించింది. మంజరిలక్ష్మి పరిశీలించకుండానే అంగీకరించారు. అసలు వారి ధోరణే అది. కాపిటల్ లో ఉన్నదే పరిచయంలో ఉన్నది అనుకుంటున్నారు. ఇది మార్క్సు నిర్వచనమా? సొంతదా?అని తేల్చకుండా అదే సరైనదన్నట్లు చెబుతున్నారు. ఇంతకీ మూలం పరిచయమా? కాపిటలా? దేన్నిబట్టి ఏది వుండాలి? పరిచయాన్ని బట్టి కాపిటల్ ఉండాలని మంజరిలక్ష్మి అనుకుంటున్నట్లున్నారు.
పియానో శ్రామికుడు ఒకపనిస్థలంలో ఒక యజమాని కింద పనిచేయడంలేదు. అలాగే కోటు కుట్టి ఇచ్చిన దర్జీ కూడా అంతే. కనక వీరు అనుత్పాదక శ్రామికులు కారు. సరే. అసలు యజమాని లేడు అని ఎలా తేల్చారు? ఆంటర్ప్రెనర్ అనేమాటని యజమాని అని తప్పుగా అనువదించి.
యజమాని ఉంటే అనుత్పాదక శ్రామికుడు. యజమానిలేకుంటే స్వతంత్ర ఉత్పత్తిదారుడు. ఇదీ వారు చెప్పేది. మార్క్స్ అన్నది యజమాని అని కాదు entrepreneur అని. లాభం కోసం పనిచేయించుకునేవాడు అని ఆమాటకి అర్థం. ఆమాటకి బ్రాకెట్లో కాపిటలిస్ట్ అనికూడా మార్క్స్ రాశాడు. కొందరు కుట్టు పనివాళ్లని పెట్టి లాభం పొందే వాడి డబ్బు పెరుగుతుంది. తనే తనపనివాళ్లు కుట్టిన కోటువాడుకుంటే, డబ్బు పెరగగకపోగా, ఖర్చవుతుంది. కనక ఆసందర్భంలో  entrepreneur కాడు.  తనకింద పనిచేసే వాళ్లకి యజమానిగానే ఉంటాడు. ఇదీ మార్క్స్ చెప్పింది. ఇక గృహ సేవకుడికి ఇంటిమనిషి యజమానే. కాని ఎప్పటికీ అతను (100 మంది సేవకుల్ని పెట్టుకున్నా) entrepreneur కాడు. ఆ హోదా అతనికి రాదు. అతని డబ్బు ఖర్చవుతుంది. అతను కేవలం యజమాని. అమ్మకానికి దుస్తులు కుట్టించేవాడు (నలుగురు వేతన కార్మికుల్ని పెట్టుకున్నా) ఆంటర్ ప్రెనర్ అవుతాడు.అతని డబ్బు పెరుగుతుంది.

 “సూత్రాన్ని అన్వయించేటప్పుడు రొండో వైపునుంచి కూడా చూడాలి కదా! పియానో తయారు చేసిన వ్యక్తిని స్వతంత్ర ఉత్పత్తిదారుడుగా నిర్ణయించే విషయంలో రంగనాయకమ్మ గారు చేసిన పని అదే” -అని ఒక సమర్ధింపు.
 ఉత్పాదక శ్రమా అనుత్పాదక శ్రమా అనేది శ్రామికుడి వైపునించి చూచి తేల్చేది కాదు అని మార్క్స్ చెప్పాడు. 
రంగనాయకమ్మ చెప్పిందీ అదే:"ఉత్పాదక అనుత్పాదక తేడాలు, ఆశ్రమల్ని ఉపయోగించుకునే యజమానికి సంబంధించినవేగానీ, ఆ శ్రమల్ని ఇచ్చే శ్రామికులకు సంబంధించినవి కావు"-రం.నా- 1-2010-పేజి535
రంగనాయకమ్మగారు పైన చెప్పిన యాజమాన్య సిద్ధాంతం కూడా మొదటి వైపు చూస్తే తెలిసేదే కానీ రెండోవైపు కాదు. కాబట్టి తెలిసేదేమిటంటే, రం.నా. గారి యాజమాన్య సిద్ధాంతానికీ లక్ష్మి గారి రెండుచూపుల సిద్ధాంతానికీ కూడా పొసగదని. ఏదో ఒకరకంగా రం.నా. ని సమర్థించాలనే ఆతృతలో లక్ష్మి గారు రం.నా. ఎంతోకొంత స్పష్టంగా చెప్పిన వాటినికూడా విస్మరిస్తున్నారు.

మార్క్స్ ఇంటికి వచ్చి కోటు కుట్టి ఇచ్చే శ్రామికుణ్ణి అనుత్పాదక శ్రామికుడిగా గాక, స్వతంత్ర శ్రామికుడిగానే చెపుతున్నాడు.”  చెప్పలేదు. టైలర్ ఉదాహరణ గురించి మూడు చోట్ల చెప్పాడు. ఎక్కడా స్వతంత్ర ఉత్పత్తి దారుడు అని అనలేదు. ప్రతిచోటా అనుత్పాదక శ్రామికుడనే అన్నాడు.
మంజరిలక్ష్మి మార్క్స్ రచనల్ని పరిశీలించకుండా విమర్శ మాత్రం చేశారు. వారు ఎందుకు దీన్ని రాశారో ముందే చెప్పారు. ఎందుకంటే ‘రం.నా. మీద ఇష్టం’ఋణపడి' వున్న భావాల గురించి ఆమె స్పష్టంగానే ప్రకటించారు. ఎవరి దగ్గరనుంచి నేర్చుకున్నామో వారిపట్ల ఇటువంటి భావాలు వుండటం మంచిదే.

కానీ, ఒక విషయం. "ప్లేటో ప్రేమ పాత్రుడే, కాని సత్యం మరింత ప్రేమపాత్రమైనది" అని ప్లేటో శిష్యుడైన అరిస్టాటిల్ అన్నాడని ప్రతీతి. అటువంటి దృక్పథం లేనట్లయితే సిద్ధాంత చర్చలలో సత్యాన్వేషణ జరగటం అసాధ్యం ఋణప్రకటనలు, మొక్కుబడి చెల్లించుకోవటాలు మాత్రమే మిగులుతాయి. లక్ష్మి గారికి సత్య నిబద్ధత వున్నట్లయితే  entrepreneur అంటే అర్థం తెలుసుకునే వారు. ఆ ఒక్క మాటకు అనువాదం సరిగా చెయ్యకపోవటం ఇక్కడ చాలా గందరగోళానికి కారణమైనా, కనీసం ఆ ఒక్క మాటకి అర్థం తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు! కాపిటల్ లో ఉన్నవే పరిచయంలో ఉన్నాయని పోల్చి చూపే పని పెట్టుకోలేదు. రంగనాయకమ్మ ఋణం మాత్రం చెల్లించుకున్నారు!


కనుక, మళ్ళీ అదే ప్రశ్న వెయ్యక తప్పడం లేదు:రంగనాయకమ్మ పరిచయం చేసింది మార్క్సునేనా?