29, సెప్టెంబర్ 2011, గురువారం

ఉద్యోగుల ఆత్మహత్యలు- ఫ్రాన్స్ టెలికాం

మెరింగ్ నాచ్ (Merignac) లో ఫ్రాన్స్ టెలికాం ప్లాంట్ కార్మికుడు ఉదయం షిఫ్ట్ పనికి వచ్చాడు. ఆఫీస్ బయట కార్ పార్క్‌ లో నిప్పంటించుకొని చనిపోయాడు. ఈ దారుణ ఘటన 2011 ఏప్రిల్ చివరలో జరిగింది. కారణం అతను తరచుగా జాబ్స్ మారాల్సి రావటమే. వయస్సు 57 ఏళ్ళు. నలుగురు బిడ్డల తండ్రి. ఆకంపెనీలో 30 ఏళ్ళు పనిచేశాడు. ఇటీవల కంపెనీ అకౌంట్లకి సంబంధించిన కాల్ సెంటర్లో ఉన్నాడు.అతను తరచు పనులు మారవలసి వచ్చేది. ఎన్నిసార్లు మొరపెట్టుకుంటూ కంపెనీకి ఉత్తరాలు రాసినా జవాబు లేదు. ఫ్రాన్స్ టెలెకాం యూరప్‌లో పెద్దవాటిలో మూడోది. బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సేవల విషయంలో అదే అన్నిటికన్నా పెద్దది.

2010 లో 25మంది తమనుతాము చంపుకున్నారు. 2008లో,2009 లో కలిపి మరో 35 మంది. ప్రాణాలు తీసుకునేందుకు మరెందరో ప్రయత్నించారు. కొందరు వాళ్ళ మరణాలకి ఉద్యోగాల వల్లే నని సూసైడ్ నోట్లు రాశారు. ఆత్మహత్యలకు కారణాలు దారుణమైన పని పరిస్తితులు:విపరీతమైన పని ఒత్తిడి, హీనంగా చూడటం, ఆపనినించి ఈపనికీ అదికాదని మరోదానికి బదిలీ చేయటం. చెయ్యలేనంతపని పెట్టటం, భయంగొలిపే పర్యవేక్షణ. 51 ఏళ్ళ ఉద్యోగిన కాల్ సెంటర్ కి మారిస్తే భరించలేక బ్రిడ్జీ మీద నుంచి దూకి చనిపోయాడు.

2004 లో పునర్వ్యవస్తీకరణ పధకం పెట్టారనీ, దానిప్రకారం ఇప్పుడున్న లక్ష మంది పనివాళ్ళలో 22,000 మందిని తగ్గించి మిగిలిన వారితోనే మొత్తం పనిని చేయించాలి.ఇది వాళ్ళ మీద భారం పెంచుతోంది. తట్టుకోలేకే కొందరు ఆత్మహత్యలకు దిగుతున్నారని యూనియన్లు గగ్గొలు పెడుతున్నాయి. వినేదెవరు!

ఉద్యోగుల ఆత్మహత్యలు- ఫ్రాన్స్ టెలికాం

ఇ.యస్.బ్రహ్మాచారి

నేనీ కొత్త పునర్‌వ్యవస్తీకరణని తట్టుకోలేను. ఈరాత్రే చచ్చిపోతాను

- అని 32 ఏళ్ళ మహిళా ఉద్యోగి స్టెఫెనీ తండ్రికి ఈ-మెయిల్ పంపించింది. ఆయన దాన్ని చదివే అవకాశం ఇవ్వకుండానే, కొన్ని నిమిషాలకే తన ఆఫీస్ అయిదో అంతస్తు కిటికీ గుండా అమాంతం దూకి అన్నంత పనీ చేసింది. చూస్తూనేవున్న తోటివాళ్ళు నిర్ఘాంత పోయారు. ఈ ఘటన సెప్టంబర్ 11 న జరిగింది. పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నఫ్రాన్స్ టెలెకాం ఉద్యోగులు అప్పటికే 22 మందయ్యారు. ఈమె 23 వ ఉద్యోగి. మరో 13 మంది ప్రయత్నించి, చివరకి ఎలాగో బతికారు.

అంతకు రెండు రోజులు ముందు డెర్విన్ అనే 49 ఏళ్ళ ఇంజనీర్ ఆఫీస్‌లో మీటింగ్ జరుగుతుండగానే కత్తిదీసి పొట్టలో పొడుచుకున్నాడు. అయితే చావు తప్పింది. కావాలనే అలా చేశానన్నాడు. కంపెనీలో పనిపరిస్తితులు దారుణంగా వున్నాయనీ, నిరసన తెలపటమే తన ఉద్దేశమనీ చెప్పాడు. కంపెనీకి కావలసిన నైపుణ్యాలు తనకి లేవని మేనేజర్ దెప్పి పొడుస్తున్నా డన్నాడు. తక్కువ స్తాయి ఉద్యోగంలోకి మార్చి వేశారని బాధపడ్డాడు.

స్టెఫెనీ ఆత్మహత్య వార్త పొక్కగానే కార్మికసంఘాలు తీవ్ర నిరసన తెలిపాయి. ప్రభుత్వం కంపెనీ సి.ఇ.ఓ. డిడియర్ లాంబార్డ్ ని వివరణ కోరింది. ఆర్ధికమంత్రి ఆకంపెనీ Board of Directors సమావేశం ఏర్పాటు చేసింది.

కాని ఒరిగిందేమీలేదు. సెప్టెంబర్ 28 న మరొక ఉద్యోగి బ్రిడ్జీ మీదనుంచి దూకి రొడ్డుమిదపడి చనిపోయాడు. కార్లో భార్యకి రాసిన ఉత్తరం దొరికింది..తాను పనిచేస్తున్న కాల్‌సెంటర్‌లో పరిస్తితులు దారుణంగా వున్నాయనీ, ఇక ఎంత మాత్రమూ పనిచేయలేననీ అందులొ వాపొయాడు. అతనికి 51 ఏళ్ళు. ఇద్దరు బిడ్డల తండ్రి. ఇది 24 వ ఆత్మహత్య.

అతను చనిపోయాక ఉద్యోగులు గగ్గోలు పెట్టారు. అంత్యక్రియల సమయంలో కంపెనీనుంచి బయటికొచ్చారు. ఈ ఆత్మహత్యల గురించి టి.వి. ల్లో చర్చలు వచ్చాయి. పత్రికలన్నీ సంపాదకీయాలు రాశాయి. ప్రతిపక్షాలు లాంబార్డ్ రాజీనామా చెయ్యమన్నాయి. అయితే లాంబార్డ్ తో మాట్లాడాక, ఆర్ధిక మంత్రిణి క్రిటిన్ లగార్డ్ అతను సంక్షోభం నుంచి కంపెనీని గట్టెక్కిస్తాడనే నమ్మకం తనకుందని చెప్పింది. లాంబార్డ్ ఆత్మహత్యల్ని ఆపుతానని ప్రతిజ్ఞ చేశాడు.

సెప్టంబర్‌లో కొన్ని చర్యలు చేపట్టారు. వ్యక్తుల బదిలీలని నిలిపివేశారు. సైకాలజిస్టుల చేత కౌన్సిలింగ్ ఇప్పించారు.

జనరల్ మేనేజర్ వీన్స్ అక్టోబర్‌ 5 న రాజీనామా చేశాడు.ఈ మొత్తం ఆధునికీకరణకి రూపకల్పన చేసింది అతనేనన్నారు. 2011 కి 170 కోట్ల యూరోల ఖర్చు తగ్గించే పనిలో తలమునలై ఉన్నాడు. అతని స్తానంలో స్టీఫెన్ రిచర్డ్ కూర్చున్నాడు. పరిస్తితేమీ మారలేదు.

అక్టోబర్ 1548 ఏళ్ళ ఇంజనీర్ ఇంట్లోనే ఉరేసుకున్నాడు. ఇతనిది 25 వ ఆత్మహత్య. వెంటనే లాంబార్డ్ అతను పనిచేసే చోటికి వెళ్ళాడు. ఈ ఆత్మహత్యల పరంపరని ఆపాలని ఆదేశించాడు. అక్టోబర్ 20న వివాదాస్పద పునర్వ్యవస్తీకరణని కంపెనీ సస్పెండ్ చేసింది. యూనియన్లతో సంప్రతించి కొత్త విధానాన్ని 2009 డిసెంబర్ దాకా నిలిపినట్లు చెప్పింది. అప్పటికి సంప్రతింపులు పూర్తి కావాలి. ఒక అంగీకారానికి రావాలి. ఇప్పటికే కొన్ని వందల బదిలీలను ఆపినట్లు తెలిపింది.

కంపెనీలో 4 శాతం వాటావున్న ADEAS గ్రూప్ మానవీయ ముఖం కలిగిన పెట్టుబడిదారీ విధానాన్ని (capitalism with a human face) కోరింది. అంతకు ముందే, కార్మిక మంత్రి డార్కొస్ సి.ఇ.ఓ లాంబార్డ్ ని పిలిచి మరింత మానవీయంగా వ్యవహరించమని చెప్పాడు. అసలు విషయం ఇక్కడే వుంది. ఆకంపెనీలో ఇప్పటికీ ప్రభుత్వానికి 27 శాతం వాటవుంది. అదే పెద్ద భాగస్వామి. కనక ప్రభుత్వానికి తెలియకుండా ఏవిధానమూ అమలు కాదు. అయినా తనకేమీ తెలియనట్లూ, ఇందుకు తన బాధ్యత లేనట్లూ సి.ఇ.ఓ.ని చెప్పమంటోంది. ఒకరా, ఇద్దరా 23 మంది చనిపోయాక, కార్మికులు గగ్గోలు పెట్టాక కళ్ళు నులుముకుంటోంది. కలిసి చేసిన నిర్వాకాన్ని అవతలవాళ్ళమీదికి నెట్టే ప్రయత్నం చేస్తోంది.

ఉద్యోగులేమంటున్నారు?

ఫ్రాన్స్ టెలికాం ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్త. 1996 లో ప్రైవేట్ పెట్టుబడిని ప్రభుత్వం ఆహ్వానించింది. 2004 కల్లా ఎక్కువ భాగం ప్రైవేటు పరమయింది అప్పుడు 160,000 మంది సిబ్బంది ఉండేవాళ్ళు. ఇప్పుడు 1 లక్షమందున్నారు. 100 మందిలో 65 మంది ప్రభుత్వోగుల కిందనే లెక్క. ఉద్యోగుల్లో సగం మంది 50 ఏళ్ళు దాటినవాళ్ళే.

వాళ్ళని తీసెయ్యలేరు. అందుకనే పునర్‌వ్యవస్తీకరణ పేరిట ఉద్యోగుల్ని అటూ ఇటూ తిప్పితిప్పీ,ఆపనీ ఈపనీ మార్చి మార్చీ హోదాలు తగ్గించీ వాళ్ళంతట వాళ్ళే వెళ్ళేట్టు చిక్కులు కలిగిస్తున్నారు. చీకాకు పెడుతున్నారు. 2006-08 మధ్య 22 వేలమందిని ఇళ్ళకు పంపారు.

వివాదాస్పద పునర్‌వ్యవస్తీకరణ కార్యక్రమాలు ఈఆత్మహత్యలకి కారణమని యూనియన్లన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి.మరణించినవాళ్ళు రాసిన నోట్‌లు ఈఆరోపణలకి అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం ఎక్కువభాగస్వామ్యం కలిగి ఉన్నప్పటికీ ఆసంస్త లాభమే పరమావధిగా ఉత్పాదకతే ధ్యేయంగా పెట్టుకున్న యాజమాన్య వైఖరిని అవలంబిస్తున్నది అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మానవత్వానికి ఏమాత్రం తావు లేదనీ, వ్యాపారం పెరగటమే లెక్క అనీ అంటున్నాయి. కంపెనీ లాభ రంధిని దుయ్యబ బడుతున్నాయి.

ఇంటర్నెట్ మొబైల్ మార్కెట్ లో పెరుతున్నపోటీలో ముందుండాలనే తపనతో కంపెనీ భారీస్తాయి మార్పులకు పూనుకున్నది. ఇప్పటిదాకావున్న పనివిధానాన్ని మారుస్తున్నది. కార్మికులు కొత్తకొత్త పనులు చేయవలసి వస్తున్నది. తరచూ పనులు మారుస్తున్నది. పనిప్రదేశాల్నీ మారుస్తున్నది ఒకపనిలోంచి మరొకపనిలోకి నెడుతున్నది. ఈపరిస్తితులు ఉద్యోగులకి ఒత్తిడి కలిగిస్తున్నాయి.

కొత్త టెక్నాలజీ వల్ల కార్మికుల్ని తోటివాళ్ళనుంచి విడగొట్టి చూచే వీలు కలిగింది. ప్రతివాని పనినీ, చర్యల్నీ నియంత్రించవచ్చు. ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో గమనించవచ్చు. కంపెనీలు ఒక్కొక కార్మికుణ్ణి గుంపునుంచి విడదీసి చూస్తున్నాయి. ఎంత పని చేస్తున్నదీ పరిశీలిస్తున్నాయి. నైపుణ్యాన్నీ, సామర్ధ్యాన్నీ బట్టి స్తాయినీ, జీతాన్నీ నిర్ణయిస్తున్నాయి. అంటే కార్మికుల్లో ఒకరికొకరికి పోటీ పెడుతున్నాయి.

"అలా వాళ్ళని వ్యక్తులుగా విడగొడితే వాళ్ళని బలహీన పరచినట్లేనని Jean-Claude Delgenes అనే ఒక కన్సల్టెన్సీ అధిపతి చెప్పాడు. ఈ మార్పులు వాళ్ళని 'ఒంటరి వాళ్ళై పోయినట్లూ, విలువలేనివాళ్ళై పోయినట్లూ చేస్తున్నాయని అన్నాడు. ఈ అభిప్రాయంతో ఉద్యోగులు ఏకీభవిస్తున్నారు.

35 సంవత్సరాల అనుభవం ఉన్న సైకియాట్రిస్ట్ Marie- France Hirigoyen పనిస్తలాల్లో కార్మికులు బాధలు పడుతున్నారన్నారు. 35 ఏళ్ళనాడు తమ సొంత కష్టాల గురించి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగాలగురించి చెబుతున్నారు అన్నారు.

ఉద్యోగులు చేసే ఫొన్ కాల్స్ ని మానిటర్ చెయ్యద్దనీ, వ్యక్తి సామర్ధ్యాన్ని కొలవద్దనీ, శ్రామికుల్ని తగ్గించే టార్గెట్లు మేనేజర్లకు పెట్టద్దనీ యూనియన్లు కొరుతున్నాయి.

కంపెనీ ఏమంటోంది?

లక్షమందిలో ఇన్ని ఆత్మహత్యలు లెక్కలోది కాదు. 2000 లో కంపెనీలో ఇంతకన్నా ఎక్కువగా 28 మంది 2002 లో 29 మందీ, 2003 లో 22 మందీ చనిపోయారనీ ఈ 19 నెలల్లో 25 మంది. తక్కువేగదా అన్నది.వాళ్ళ చర్యకి కారణం కంపెనీ కానే కాదనీ, వాళ్ళ సొంత విషయాలేననీ చెప్పింది.

మేము గుంపు తొలగింపులు చేయలేదు. అన్నాడు బార్బరాట్. "ఎక్కువమంది వాళ్ళ నైపుణ్యల్ని పెంచుకుంటున్నారు. కొత్త పనుల్లోకి మారగలుతున్నారు. కొద్దైమంది మాత్రం ఇబ్బంది పడుతున్నారు." నన్నాడు.

డార్కోస్ ఒక ఇంటర్వ్యూలో ఈ పని ఒత్తిడి ఫ్రాన్స్‌ లోనే కాదు. అన్ని దేశాల్లోనూ ఉంది. ఉద్యోగం లేకుండా ఉండటం కంటే ఒత్తిడి పెట్టే ఉద్యోగమయినా మంచిదే. పూర్తి సంతోషాన్ని కలిగించనిదైనా, పార్ట్‌ టైం దయినా నయమేకదా అని చెప్పాడు

కంపెనీ మానవ వనరుల డైరెక్టర్ లీ మాండే పనికీ ఆత్మహత్యలకి ముడిబెట్టటం సరైంది కాదన్నాడు. ఆత్మహత్యలు ఒక కారణం వల్ల జరగవు, అనేక కారణాలుంటాయి అని నిపుణులు చెప్పారని అన్నాడు. ఒకర్నిచూచి ఒకరు ఇలాచేస్తున్నరనీ, ఇదొక అంటు అలవాటు అయిందనీ పనికి సంబంధించినవి కానేకావనీ కంపెని కొట్టిపారేస్తూ వచ్చింది. అయితే సెప్టెంబర్ 29 న లాంబార్డ్ తన ఉద్యోగులకి ఒత్తిది పెంచే పొరపాట్లు చేశానని ఒప్పుకున్నాడు.

కంపెనీలు ఎందుకిలా చేస్తున్నాయ్?

ఒక్కముక్కలో లాభాల కోసం. ఇబ్బడికిబ్బడి లాభాలు లాగాలని. పోటీ పడే కంపెనీలకంటే తక్కువ ధరలకి తనసరుకు అమ్మితే ఇతరులకన్నా ముందుగా వేగంగా అమ్ముకోవచ్చు. మరిన్ని సరుకులు తయారు చేసి వాటినీ అమ్మవచ్చు. చౌకగా అమ్మితే పోటీలో ఇతరులని వెనక్కి నెట్టగలుగుతుంది. పోటీ సక్రమంగా ఉంటే, సరుకుల ధరలు తగ్గించిన కంపెనీలే పోటీలో ముందుకు పోతాయి. చౌకగా అమ్మితే అమ్మకాలు పెరిగినా లాభంరేటు తగ్గుతుంది లాభం మొత్తం తగ్గేప్రమాదమూ ఉంది.లాభం రేటు తగ్గినా, లాభం మొత్తం పెరగాలనేది పెట్టుబడిదారుడి కోరిక. ఇతరులకంటే చౌకగా అమ్మి కూడా లాభం పెంచుకోవాలి. ఇందుకొకదారి ఉంది.సరుకుల్ని ఇంతకు ముందుకన్నా ఇతరులకన్నా చౌకగా తయారుచెయ్యాలి.. ఇందుకు కార్మికుల్ని కొందరిని తొలగించి,మిగిలిన వాళ్ళ చేత అన్నే సరుకులు తయారు చేయించాలి. అందరినీ ఉంచినా,వాళ్ళ వేతనాలు తగ్గించాలి.ఎవ్వరినీ తొలగించకపోయినా,జీతాలు తగ్గించకపోయినా,ఎక్కువగంటలు పనిచేయించాలి. ఇవేవీ మార్చకపోయినా,అదే కాలంలో మరిన్ని సరుకులన్నా తయారు చేయించాలి. యజమానులు ఇవన్ని ఒకేసారి చెయ్యకపోయినా ఒకదానితర్వాత ఒకటి వీలునిబట్టి చేస్తారు.

మరొకటి మెరుగైన యంత్రాలు పెట్టటం. సరికొత్త సాంకేతిక పద్ధతులు అవలంబించటం. వీటితో విధులూ పని విధానాలూ మారతాయి. చేస్తున్న పనినుంచి మరొకదానికి మారాలంటే ఒత్తిడి కలుగుతుంది. కొత్తగ్గా తర్ఫీదు కావాలి. వయసు పెరిగిన వాళ్ళకి చాలా కష్టమవుతుంది. కంపెనీలు లాభరంధితో ఇవన్నీ చేస్తాయి. కార్మికులకేమో శారీరక మానసిక ఒత్తిళ్ళు ఎక్కువవుతాయి. ఆదాయాలు తగ్గుతాయి. కనక పునర్వ్యవస్తీకరణ వద్దంటారు. కంపెనీలు వెనకడుగు వెయ్యవు.

లక్షమంది ఉద్యోగులతో నడుస్తున్న ఈ కంపెనీ 40 వేల ఉద్యోగాలు తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే చాలామందిని ఇతరపనులకు పంపించింది. టెక్నీషియన్లని కస్టమర్ సర్విస్ కి మార్చింది. అమ్మేవాళ్ళకి కాల్‌సెంటర్ పనులు పురమాయించింది. చాలామందికి ఈ కొత్తపనులు చేసేందుకు తగిన తర్ఫీదయినా లేదు.

కంపెనీలు నిరంతరమూ పునర్వ్యవస్తీకరిస్తున్నాయి.దంతో కార్మికుల విధులూ పని విధానాలూ తరచూ మారుతున్నాయి. అందుకు తగ్గట్లు ఎప్ప్టికప్పుడు మారలేక కార్మికులు శరీరకంగా మానసికంగా నలిగిపోతున్నారు. పని వేళలు మారుతున్నాయి. నిన్న వున్నట్లు ఇవ్వాళ , ఇప్పుడున్నట్లు రేపూ ఉండటం లేదు. ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తున్నది. కుటుంబంతో ఉండటానికి, పిల్లల ఆలనా పాలనా పట్టించు కోవ టానికీ,తగిన సమయం చిక్కటంలేదు.

ఇలా రోజు రోజుకీ ఒత్తిడీ, అసంతృప్తీ పెరుగు తున్నాయి. కొందరు సర్దుకోలేక ఆత్మహత్యలు చేసు కుంటున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు మితిమీరుతున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడవుతోంది. 1990 ల వరకూ ఆత్మహత్యలు వ్యవసాయరంగంలో మాత్రమే వుండేవనీ, ఇప్పుడు ఆస్పత్రులకీ, స్కూళ్ళ కీ, నిర్మాణరంగానికీ, ఎలెక్ట్రానిక్స్ పరిశ్రమకీ, బాంక్‌రంగానికీ కూడా పాకాయని Christophe Dejours పనిస్తలాల్లో ఆత్మహత్యలమీద రాసిన పుస్తకంలో రుజువుచేశాడు

ఒక్క ఫ్రాన్స్ లోనే కాదు. పనితో ముడిబడిన ఆత్మహత్యలు అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లొనూ పెరుగుతూనే ఉన్నాయి.

అమెరికాలో పెట్టుబడిదారీ విధానం ఫ్రాన్స్ కన్నా ముందుకు పోయింది. అమెరికాలో ఉద్యోగులు ఇలంటి కష్టనష్తాల్ని భరిచటాని అలవాటు పడ్డారు.రాత్రి పనులకీ వారాంతంలో పనిచెయ్యటానికీ, తొలగింపులకీ, రాంకులకీ, పనినిబట్టి జీతాలు పొందటానికీ అలవాటుపడ్డారు. ఇదంతా ఇష్టపడి వాళ్ళు చేస్తున్నారనికాదు.తప్పనిపరిస్తితుల్లో చెప్పుకుంటే వినే దిక్కులేక , ఎదుర్కోలేక కష్టమైనా నష్టమైనా సహించి రాజీ పడ్డారు. ఫ్రాన్స్ వాళ్ళు ఎదుర్కోగలిగితే సరే. లేకపోతే అమెరికాలో పరిస్తితే వాళ్ళకీ తప్పదు. ఇది స్వేచ్చా మార్కెట్ ఎకానమీ పోకడ. దాన్నిఒప్పుకుంటూనే అందులోనే వుంటూనే సరిచెయ్యటం కుదరదు.

ప్రభుత్వ యాజమాన్యంలో నడిచినా లాభాలు రావాల్సిందే. ప్రభుత్వరంగం ప్రైవేట్ రంగంతో పొటీ పడి లాభాలార్జించాలి. లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకి అమ్మెయ్యటమనే విధానాన్ని అన్నిదేశాలూ అమలుపరుస్తున్నాయి. నష్టాలొచ్చేట్టు చేసి వాటాలమ్మిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రైవేట్ యజమానులకి లాభం తప్ప మరే అంశమూ పట్టదు. ఉద్యోగులమీద ఎంత ఒత్తిడి నయినా కలిగించటానికి వెనకాడదు. ప్రభుత్వానికి ఎన్నికలొచ్చినప్పుడు ఓట్లు మరీముఖ్యం. అందుకే ఆకాసేపూ శ్రామికుల తరఫున ఉన్నట్లు నటించటం. కార్మికులకి ఇబ్బందులు కలుగుతున్నట్లు ఇప్పుడే తెలుసుకున్నట్లు కంపెనీని వివరణ కోరటం. ఇదేతంతు అన్ని దేశాల్లో, అన్ని సంస్తల్లో మామూలై పోయింది. ప్రభుత్వం మధ్యవర్తి పోజు పెడుతుంది. కంపెనీ ఎవరో పెద్ద ఉద్యోగి మీదకు నెడుతుంది. ఫ్రాన్స్ టెలికాం లొ జరుగుతున్నది సరిగ్గా ఇదే. పునర్‌వ్యవస్తీకరణ ఉద్యోగులకు వేదన కలిగిస్తున్న మాట నిజమే నని మానవ వనరుల డైరెక్టర్ ఒలీవియర్ బార్బరాట్ ఒప్పుకున్నాడు. తర్వాత లాంబార్డ్ యూనియన్లతో సంప్రతింపులు మొదలవుతాయనీ, ఉద్యోగుల సమస్యల్ని చూచేందుకు 100 మంది మానవవనరుల ఉద్యోగుల్ని నియమిస్తామనీ చెప్పాడు. అయితే అసలు సమస్య పరిష్కారం కాలేదు. ఒలీవియర్ బార్బరాట్ పునర్‌వ్యవస్తీకరణని ఆపటం ఊహించేవిషయం కాదు అని Journal de Dimanche అనే పత్రికకి రాసిన వ్యాసంలో తేల్చి చెప్పాడు.

అందుకే ఈఆత్మహత్యలు. ప్రభుత్వాలు సరిగా ధర్మంగా వ్యవహరిస్తాయి ఇవి ఆగుతాయి అని ఉద్యోగులు భావించే రోజోస్తుందా? నీళ్ళల్లో గోగు బెండ్లు మునగటం, ఇనపగుండ్లు తేలటం ఎలా జరిగేదికాదో ప్రపంచబాంక్ .ఎం.ఎఫ్. చెప్పిన ఆర్ధిక సంస్కరణలు అమలుపరిచే ఏప్రభుత్వమైనా పెట్టుబడిని పెంచుతుందే కాని శ్రామికుల బాధల్ని తగ్గించే బాధ్యత తీసుకోదు.

ఆపటానికి ఏంచెయ్యాలో నిర్ణయించుకోవలసింది ఉద్యోగులే.